కరదీపాలు

భూమి పొరలతో స్నేహం చేసి
మట్టిని అన్నం ముద్దలు చేసి
అందరి నోటికి అందించి
పచ్చని పంటగ నిలబడలేక
మృత్యు ఆకలిని తీర్చిన అమరుడా
ఓ పామరుడా

జెండాలు జెండాలుగా
జనం చీల్చబడి
మెట్టు మెట్టుగా కిందకు తొక్కుతున్న
దోపిడి దొంతరల దొరలను కూల్చేందుకు
ఆయుధమై మొలిచి
అహింస రాజముద్ర మాటున
రాజహింసకు ఛిద్రమైన అమరుడా
ఓ ప్రపంచ సోదరుడా

పుట్టుకతో అమ్మలై
అయ్యల దాష్టికాల
నుసి నుసిగా నలిగి రాలుతూ
తెల్లటి రక్తాన్ని పంచి
లోహగుండెలకు అస్సంతు మాతలై
నిస్సహాయ నిస్వార్థ దేహాలతో
ఋణగ్రస్త సమాజానికి బలైన అమరులారా
ఓ అనాథ తల్లిదండ్రులారా

భవిష్యత్తు స్వప్నాల తేలి ఆడి
ఉద్యమ పాఠాల పౌరుషం తో ఊగి
త్యాగాల పూదోటల తేనెటీగలై ముసురుకొని
అధికార అగ్నికీలల బలైన శలభాల్లారా
కాదు అమర వీరులు మీరు

శ్రామికులై రైతులై తల్లులయి విద్యార్థులై
జీవిత జెండాలెగెరేసి
తూటాలను ఉరితాళ్ళను కౌగిలించుకొని
మరణాన్ని గెలిచిన అమరులారా
పుట్టు గుడ్డి ప్రాణులకు
కంటి చూపు కరదీపాలు మీరు

జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.

One thought on “కరదీపాలు

  1. ఇంటెన్సిటీ ఉంది వాక్యం లో. కంగ్రాట్స్ అండీ

Leave a Reply