కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల భాగస్వామ్య చరిత్ర (1934 -1952)

2023 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భం అందించిన అంతర్జాతీయ నినాదం “సమూహంగా సమానత్వాన్ని కౌగలించుకొందాం.” నినాదం బాగుంది. కానీ ఏ నినాదమైనా వాస్తవాచరణతో నిమిత్తం లేకుండా దానంతట అది ఫలితాన్ని ఇయ్యగలదా? కుల మత అసమానతలు, స్త్రీపురుష అసమానతలు, వర్గ అసమానతలు ఇలా నిలువుగా చీల్చబడిన మనుషులు అసమానతల అగడ్తలు దాటటానికి చరిత్రపొడుగునా చేసిన యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. అవి అనేక తలాలలో, అనేక రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి స్త్రీలు సమానత్వం ఒక ఆకాంక్షగా, జండర్ సమానత్వ ప్రపంచాన్ని ఊహిస్తూ – ఇంకా చెప్పాలంటే కలగంటూ పోరాటాలలో సగం అవుతున్నారు. అలాంటి స్త్రీల పోరాట అనుభవాలు తెలిసే కొద్దీ సమూహంగా సమానత్వాన్ని కౌగలించుకొనటానికి అన్వేషించవలసిన కొత్త మార్గాల, ఆచరణల గురించిన ప్రేరణ కలుగుతుంది. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. 1934 నుండి 1952 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడిచిన ఉద్యమంలో భాగస్వాములైన మహిళల అనుభవాల అధ్యయనం అందుకు ఉపకరిస్తుంది.

ఇందుకు కమ్యూనిస్టు ఉద్యమ సిద్దాంతం, అవగాహన, ఆచరణ, అనుభవాలు ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలైన నాయకుల రచనలు ఉపయోగపడే మాట నిజమే. కానీ అంతకన్నా సాధికారంగా ఆ చరిత్రను చెప్పగలిగేవి ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీల అనుభవ కథనాలు. ఆ ఉద్యమాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ స్త్రీలు చేసిన రచనలు. తెలుగులో అలా వచ్చిన రచనలు ఆధారంగా కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల ఆకాంక్షలను క్రియాశీల చైతన్యాన్ని అంచనా వేయటం మహిళల కోణం నుండి కమ్యూనిస్టు ఉద్యమ అనుశీలనకు, అంచనాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలభాగస్వామ్య చరిత్ర నిర్మాణానికి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న స్త్రీల సాహిత్యం- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల అనుభవ కథనాల సంకలనం “‘మనకు తెలియని మనచరిత్ర” ఒకటి. దానితో పాటు ఇద్దరు మహిళల జీవిత చరిత్రలు, అయిదుగురు మహిళల స్వీయ చరిత్రలు ఉన్నాయి.

1.

కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో అభివృద్ధిపరచుకొన్న రాజకీయ అవగహన, ప్రపంచవ్యాపిత స్త్రీవాద ఉద్యమాల అధ్యయనం నుండి పొందిన ప్రేరణ కలిసి స్వతంత్ర ప్రతిపత్తి మహిళాసంఘాల ఏర్పాటుకు, మహిళా ఉద్యమాల నిర్మాణానికి భూమిక సిద్ధమైన కాలం 1970 వ దశకం. ఆ సందర్భంలో ఏర్పడిన స్త్రీశక్తి సంఘటన నుండి ఏడుగురు సభ్యులు – కె. లలిత, వసంత కన్నబిరాన్, రమా మేల్కొటే, ఉమామహేశ్వరి, సుసీతారు, వీణాశత్రుఘ్న, ఎమ్. రత్నమాల – స్త్రీ సమస్యను అర్ధం చేసుకొనటానికి రెండు దశబ్దాల క్రితపు తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకొనాలన్నా ఆసక్తితో చేసిన క్షేత్రపర్యటనలు, ముఖాముఖీ సంభాషణల ఫలితంగా 1986లో వచ్చిన పుస్తకం ‘మనకుతెలియని మనచరిత్ర’. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల అనుభవాలు, అభిప్రాయలు, ఊహలు, ఉద్వేగాలు, ఆకాంక్షలు, ఆదర్శాలు, అసంతృప్తులు ఇందులో నమోదు చేయబడ్డాయి. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటకాలంలో నాయకత్వస్థాయి నుండి సాధారణ కార్యకర్తలవరకు రకరకాల విధులు నిర్వర్తించిన 22 మంది స్త్రీల అనుభవాలను వాళ్ళ మాటలలోనే వినిపించింది ఈ పుస్తకం.

ఈ పుస్తకంలో మొదటి కథనం ఐలమ్మది. పాలకుర్తి, చాకలి విశేషణాలుగా తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలకమైన మలుపుకు కారణమైన ఘటనకు కేంద్రం ఆమె. ఐలమ్మ కుటుంబం సాగు చేసుకొంటున్న భూమినుండి వాళ్ళను బేదఖలు చేయించటానికి విసునూరి దొర రామచంద్రారెడ్డి మనుషులు చేసిన ప్రయత్నాలలో భర్త కొడుకులు ఊరువదిలి పోయినా జైళ్ల పాలయినా సంఘం మద్దతుతో ఆ భూమిని నిలబెట్టుకొనటానికి, పంటను దక్కించుకొనటానికి అసాధారణ పోరాటం చేసిన సాధారణ మహిళ ఐలమ్మ.

కమలమ్మ మానుకోట తాలూకా మైనాం గ్రామానికి చెందినది. దొరల ఇళ్లల్లో కట్టుబానిసల కుటుంబం నుండి వచ్చింది. బ్రాహ్మణ దొరల కట్టుబానిస తానైతే భర్త రెడ్డి దొరల కట్టుబానిస. స్త్రీలమీద అత్యాచారాలు, ప్రశ్నిస్తే హింస. అన్న, భర్త కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. కమ్యూనిస్టుల కోసం ఊళ్ళమీద పడి పోలీసులు చేసే అరాచకాలు, అకృత్యాలు, అత్యచారాలు చూస్తూ పద్దెనిమిదేళ్ల వయసులో ఉద్యమంలోకి పోవటమే మేలనుకొన్నది. కొడుకును వదిలి వెళ్ళింది. శాంతమ్మ, అచ్చమాంబ, స్వరాజ్యం వంటి వాళ్ళతో కలిసి దళాలలో పనిచేసింది. కోయ స్త్రీల సమీకరణ బాధ్యతలు నిర్వహించింది. ప్రధానంగా ఆమె కార్యరంగం విద్యా సాంస్కృతిక రంగం. కమ్యూనిస్టుపార్టీ వైజ్ఞానిక దళంలో పనిచేసింది. నాలుగవతరగతి చదువుతో ఏరియా కమిటీ లలో సర్క్యులర్లు వ్రాసేది. కథలు చెప్పటం, పాటలు పాడటం ఆమె నిర్వహించిన విధులు. దళంలో తిరిగింది కానీ తుపాకీ పట్టలేదు. దళంలో ఉన్న కాలంలో పుట్టిన రెండవ పిల్లవాణ్ణి పార్టీ నిర్ణయం మేరకు ఎవరికో తెలియనివారికి ఇచ్చెయ్యవలసి వచ్చింది. త్యాగంగా దానిని కీర్తిస్తారు కానీ ఆ పిల్లవాడు ఎలా ఎక్కడ పెరుగుతున్నాడో తెలియక తాను పడే బాధ ‘కడుపుతీపి ఎక్కడకు పోతుంది’ అన్న మాటలో వ్యక్తం చేసింది.

అక్కిరాజుపల్లి చుట్టుపక్కల గ్రామాలనుండి కమ్యూనిస్టు పార్టీలోకి, దళాలలోకి వెళ్లిన వాళ్ళ కోసం గాలిస్తూ ఆ ఊళ్ళ మీద పోలీసులు తరచు దాడులు చేసేవారు. బట్టలిడిపించటం, అత్యాచా రాలు చేయటం, తుపాకులతో కాల్చటం సర్వసాధారణమైన ఆ దాడులను తప్పించుకొనటానికి స్త్రీలుసమూహంగా తిరగటం,పోలీసుల రాక తెలిసి చేస్తున్న వంటలు వదిలేసి అడవుల్లోకి పోవటం, ఒక్కొక్కసారి ఆ వంటలను, వంటగిన్నెలనే ఆయుధాలుగా చేసి ప్రతిఘటించటం, వాళ్ళ జీవితం. కొండమ్మ, వజ్రమ్మ, గజ్జెల బాలమ్మ, సైదమ్మ, గొల్ల మల్లమ్మ, గొల్ల బుచ్చమ్మ అనుభవాలు అవే.

ప్రియంవద సవతి అన్న రాజిరెడ్డితో పాటు ఉద్యమంలోకి వెళ్ళింది. కొలనుపాకలో టీచర్ గా పని చేస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ సమావేశాలు పెడుతూ స్త్రీలను చైతన్య పరుస్తూ ఉద్యమంలోకి సమీకరించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1943 జనవరిలో మహిళలకోసం విజయవాడలో నెల రోజుల పాటు పార్టీ నిర్వహించిన రాజకీయ శిక్షణా శిబిరానికి హాజరైంది. నిర్బంధం వలన అజ్ఞాతంలో గడుపుతునే ఆయా ఊళ్ళల్లో వ్యవసాయకూలీల పనిగంటలు, కూలీరేట్లు మొదలైన విషయాల మీద చొరవతో పనిచేసింది. తల్లిదండ్రులను చూడటానికి వూరికి పోయింది కనిపెట్టి పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జైళ్లకు తిప్పారు. ఔరంగాబాద్ జైలునుండి విడుదలై ఎన్నికలలో పాల్గొన్నది. ఏ వూరికి వెళ్లినా కూలీనాలీ జనం మరీ ముఖ్యంగా ఊరూరికీ కనీసం ఐదారుగురు ఆడవాళ్లు పార్టీతో రావటానికి ఉత్సాహం చూపిస్తుంటే మిమ్మల్ని చేర్చుకొని ఏమి చెయ్యాలి, మీరేం చేస్తారు అంటూ పార్టీ వాళ్ళ ఆసక్తులను ఆచరణగా మలచటంలో విఫలమైంది అన్నది ఆమె ఆరోపణ.

సుగుణమ్మ భూస్వామ్య కుటుంబం నుండి వచ్చింది. కమ్యూనిస్టు రాజకీయాలలో ఉన్న అక్క, అన్న ఆమెకు స్ఫూర్తి. 9ఏళ్ల వయసులో అక్కతో పాటులో విజయవాడలో (1943) జరిగిన రాజకీయ శిక్షణా శిబిరానికి వెళ్తానని మంకు పట్టు పట్టిన పిల్ల. 14 ఏళ్ల నుండి సంఘం పనులు చేయటం మొదలుపెట్టింది. భువనగిరి సభలకు హాజరైంది. నిర్బంధకాలంలో పార్టీ అజ్ఞాతంలోకి వెళితే హైదరాబాద్ డెన్ ల మధ్య ఉత్తరాలు చేరవేసే పని చేసింది. వార్తలు వ్రాయటం, స్టెన్సిల్స్ తీయటం వంటి పనులు చేస్తూ దాదాపు నాలుగేళ్లు డెన్ లలో గడిపింది.

ప్రమీలా తాయి బొంబాయి నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి కమ్యూనిస్టు పార్టీలో చేరి నగరంలో స్త్రీలను పార్టీ లోకి సమీకరించటానికి రకరకాలుగా ప్రయత్నించింది. నవజీవనమండలి అనే స్త్రీల సంఘంలో పని చేస్తూ పార్టీ సాహిత్యం, కరపత్రాలు పంచింది. పార్టీ పై నిషేధం ఉన్నకాలంలో రహస్యంగా పనిచేసింది. నగరంలో పార్టీ మనుషులు ఉండటానికి ఇళ్ళు చూడటం, కొరియర్లను ఏర్పాటుచేయడం, బయటి రాష్ట్రాల బాధ్యులు వచ్చినప్పుడు అనువాదాలు చేయటం, ఆయుధాలు సేకరించి చేరవేయటం వంటి పనులు చేసింది.

కొండపల్లి కోటేశ్వరమ్మ కాంగ్రెస్ ప్రభావాల నుండి కమ్యూనిస్టు రాజకీయాలలోకి వచ్చింది. రావటం భర్త కొండపల్లి సీతారామయ్య ప్రోద్బలం వల్లనే అయినా కొద్దికాలంలోనే తానుగా ఆ రాజకీయాలలో మమేకం అయింది. సాంస్కృతిక రంగంలో పనిచేసింది. పార్టీ బంధుత్వాలే బంధుత్వాలు అనుకొనే స్థాయికి ఎదిగింది. మహిళాసంఘంలో క్రియాశీలక భాగస్వామి అయింది. నిర్బంధంలో రహస్య జీవితం గడుపుతూ పార్టీకి అవసరమైన పనులు చేసింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆశ్రయం ఇయ్యటం, వాళ్లకు అవసరమైన బహిరంగ లావాదేవీలను నిర్వహించుకురావటం, పార్టీ రహస్య పత్రికలకు కార్బన్ కాపీలు తీయటం, సైక్లో స్టైల్ తీయటం వంటి పనులు ఎన్నో స్త్రీలు ఎలా చేశారో కోటేశ్వరమ్మ చెప్పింది. విజయవాడలో కమ్యూన్ లో వాళ్లకు వంట చేసిపెడుతూ కన్న తల్లిలా అందరినీ ఆదరించిన బుల్లమాంబను, పార్టీ స్త్రీలకు పురుళ్ళు పోసుకొనటానికి పుట్టిల్లు వంటి వైద్యశాలను నడిపించి ఆదరించిన డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబను ఆమె పరిచయం చేసింది. కోటేశ్వరమ్మ స్వీయ చరిత్ర నిర్జన వారధి కమ్యూనిస్టు ఉద్యమంలో ఆమె భాగస్వామ్యాన్ని గురించి మరింత సమాచారాన్ని ఇస్తుంది.

కమ్యూనిస్టులకు అన్నం బెట్టిందని, వాళ్ళ జాడ చెప్పమని పోలీసులు పెట్టిన హింసలు పడిన దూడల సాలమ్మ పేరెటూ వచ్చింది ఇక సంగంలోకి పోతే ఏందని దళంలో కలిసి తిరిగిన వ్యక్తి.

మానికొండ సూర్యావతి పెత్తల్లి ఇంట్లో ఉంటూ ఆమె పెనిమిటి కడియాల గోపాలరావు ప్రోత్సాహంతో కమ్యూనిస్టు రాజకీయాలలోకి వచ్చింది. 1936-37లో కాటూరులో స్త్రీలకు ప్రత్యేకంగా నిర్వహించిన తరగతులకు హాజరైంది. కాంగ్రెస్ ఉద్యమంలో జైలుకు వెళ్లి, ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చి గోర్కీ అమ్మగా పేరు తెచ్చుకొన్న బుల్లెమ్మ సూర్యావతికి అత్తగారు. కోటేశ్వరమ్మ ప్రస్తావించిన బుల్లెమాంబ ఈవిడే. కృష్ణా జిల్లా మహిళా సంఘంలో చేరిన సూర్యావతి 1941 లో దానికి కార్యదర్శి అయింది. ఆలోపే అంటే 1939 లో ఆమెకు పార్టీ సభ్యత్వం లభించింది. పూర్తికాలపు కార్యకర్తగా ఊరూరూ తిరిగి మహిళలకు సభలు పెట్టటం, సంఘ సభ్యులుగా చేర్చటం స్త్రీల హక్కుల గురించి ప్రచారం చేయటం ఆమె నిర్వహించిన విధులు. 1947లో గుంటూరులో రాష్ట్ర మహిళాసంఘం సభలు జరిగాయి. రెండవ సభ విజయవాడలో పెట్టాలని ప్రయత్నిస్తుండగా మహిళాసంఘం పత్రిక ఆంధ్రవనిత పత్రికపై నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఊరేగింపు గురించి అందులో అరెస్టయి జైళ్లలో నిర్బంధించబడిన అచ్చమాంబ, ద్రోణవల్లి అనసూయ, బుల్లెమ్మ మొదలైన స్త్రీల అనుభవాలగురించి కూడా సూర్యావతి ప్రస్తావించింది. ఆమె స్వీయ చరిత్ర వ్రాసినట్లు తెలుస్తున్నది. అది లభిస్తే మరిన్ని వివరాలు లభించవచ్చు.

వరంగల్ కు చెందిన అచ్చమ్మకు పదేళ్లకు పెళ్లయింది. భర్తతో కలిసి పార్టీ లోకివచ్చింది. అతను పట్టుబడిన తరువాత ఒంటరి అయిన ఆమెకు పార్టీ అండ అయింది. దళాలలో తిప్పుతూ తుపాకీ పట్టటం నేర్పింది. వైద్యంలో శిక్షణ పొందింది. గాయాలు శుభ్రం చేయటం, కట్టు కట్టటం, ఇంజక్షన్ లు ఇయ్యటం వంటి బాధ్యతలు ఆమెకు అప్పగించబడ్డాయి. పోరాటకాలంలో సెంట్రల్ కమిటీతో ఉంటూ మందుల సంచులు భుజాన వేసుకొని దళాలకు దళాలకు తిరుగుతూ వైద్యసేవలు అందించింది. కోయలకు సాధారణంగా ఉండే పుండ్లకు వైద్యం చేసేది. కాన్పులు చేసింది. డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ పేరు ఆమెకు పెట్టి పిలిచింది పార్టీ. ఆమె వైద్యసేవలు పొందిన కోయలు ఎర్రక్క అని ప్రేమగా పిలుచుకొన్నారామెను.

అందరూ మగవాళ్లే ఉన్న దళంలో కలివిడిగా ఉంటూ ఎవరి అవసరాలను కనిపెట్టి వాళ్ళకా రకంగా వండిపెడుతూ ఒకతనితో సంబంధం ఉన్నదన్న అపవాదు మీద – అది అబద్ధమని ఆమె ఎంత చెప్తున్నా వినక పార్టీ బహిష్కరించింది. చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య చొరవతో వైద్యసేవలు అందించే అచ్చమాంబను వదులుకొనటం పార్టీకి నష్టకరం అని మళ్ళీ ఆమెను పార్టీలోకి తీసుకొన్నారు. ఎవరినైనా ఒకరిని పెళ్లిచేసుకొంటే ఎవరెవరితోనో సంబంధాలు అంటగట్టే ప్రమాదం తప్పుతుందని పెద్దలు కొందరు చేసిన సూచనలతో ఆమె దళ నాయకుడు మోహనరావును పెళ్లిచేసుకొన్నది. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికోద్యమాన్ని నిర్మిస్తూ అజ్ఞాతంలో ఉన్న శేషగిరితో ఆమెకు పరిచయం వుంది. ఆయన పంపగా పెద్దమొత్తం డబ్బు నోట్లు నడుముకు కట్టుకొని పైనుండి చీర బిగించికట్టి విజయవాడలో రావి నారాయణరెడ్డికి అందించివచ్చిన కార్యశీలత ఆమెది.

బాజీ, రజియా అక్కాచెల్లెళ్లు. ఉదారవాద, హేతువాద భావాలతో పెరిగి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సాహిత్య సంస్థ అభ్యుదయ రచయితల సంఘ సభలకు హాజరవుతూ పార్టీ సంబంధంలోకి వచ్చారు. అజ్ఞాతవాసంలో ఉన్న నాయకులకు, వాళ్ళ నివాసాలను ఆవాసాలుగా చేశారు.

మోటూరు ఉదయం కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు మోటూరు హనుమంతరావు భార్య. అభ్యుదయ భావాలున్న తండ్రి ఆమెను డాక్టర్ చెయ్యాలని ఆశించాడు. ఫోర్త్ ఫారం చదువుతుండగా పెళ్లి అయింది. నిర్బంధ పరిస్థితులలో మగవాళ్ళు అరెస్టులై జైళ్లలో ఉన్నప్పుడు స్త్రీలను సమీకరించుకొని వాళ్ళను చూడటానికి వెళ్లినట్లే వెళ్లి పార్టీ రహస్య డాక్యుమెంట్లు వాళ్లకు అంద చేయటంలో అజ్ఞాతంలో ఉన్న నాయకుల అవసరాలు చూడటంలో, నిర్బంధ పరిస్థితులలో మిలటరీ కాంపులను తప్పించుకొని గ్రామాలలోకి వెళ్లి పార్టీకార్యక్రమాలు నిర్వహించటంలో ఉదయం గొప్ప చొరవతో పనిచేసింది. తెలంగాణ నుండి ఉద్యమావసారాలపై వచ్చి ఉండే నాయకులకు, జైళ్ళనుండి విడుదలై వచ్చే వాళ్ళ అవసరాలకోసం, మొత్తంగా పార్టీ పనులకోసం ఆర్ధిక వనరులను సమకూర్చే పనిలోనూ, వసతి సౌకర్యాల ఏర్పాటులోనూ ఆమెది ప్రధానపాత్ర. మహిళా సంఘ నిర్మాణంలో ఆమె కృషి ఉంది. ఆంధ్రవనిత పత్రిక సంపాదకవర్గ సభ్యురాలు. దానిని నిషేధించినప్పుడు మహిళలు తీసిన ఊరేగింపులో ఉదయం కూడా ఉంది. జైలు జీవితాన్ని అనుభవించింది. అచ్చమాంబ ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ప్రచారం చేసేక్రమంలో అచ్చమాంబపై కాంగ్రెస్ చేస్తున్న లైంగిక దుష్ప్రచారాలు వింటూ లైంగిక సంబంధాల నైతికతకు సంబంధించిన సంఘర్షణకు లోనై అవగాహనను అభివృద్ధి పరచుకొన్నది. పోరాటంతో కానీ, పార్టీతో కానీ డైరెక్ట్ సంబంధం లేకుండానే తానీ పనులన్నీ చేసానంటుంది ఉదయం. ఉదయం స్వీయచరిత్ర సేకరించవలసే ఉంది.

బ్రిజ్ రాణి ఏ రాజకీయ వాసనలు లేని కుటుంబం నుండి వచ్చింది. సరోజినీ నాయుడు గురించి వింటూ ప్రభావితం అయింది. అత్తవారింటి ఆరళ్లకు విసిగిపోయి బయటకు వచ్చింది. ఒక మహిళా మండలి అండతో సామాజిక కార్యకర్తగా మారి క్రమంగా కమ్యూనిస్టుపార్టీకి దగ్గరైంది. హిందీ టీచరుగా పనిచేస్తూ పార్టీలో పనిచేసింది. దొరలు చేసిన దాడులలో గాయపడి వచ్చిన పార్టీ మనుషులకు సేవ చేయటం, ఇల్లిల్లూ తిరిగి పార్టీ పత్రిక అమ్మటం, బయటి ప్రాంతాలనుండి వచ్చే పార్టీ బాధ్యులకు కావలసినవి సమకూర్చటం, రజాకార్లకు వ్యతిరేకంగా యువతీయువకులను పోగుచేయటం, నిరసన కార్యక్రమాలు చేపట్టటం మొదలైన పనులు చేసింది. అరెస్టయింది. పోలీసు హింసకు గురైంది. ఆరునెలలు జైలుజీవితం గడిపి విడుదలైనాక అజ్ఞాతంలోకి వెళ్ళింది. సాయుధ పోరాటం ముగిసినతరువాత బయటకు వచ్చింది.

లలితమ్మ ఐదుసంవత్సరాల వయసులో పెళ్లయి 12 వ ఏట కాపురానికి వెళ్ళింది. భర్త తిరుమలరావు. మేనత్త కొడుకు దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రభావంతో తిరుమలరావు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావాలలోకి వెళ్ళాడు. అతనితో పాటే లలితమ్మ. బడి చదువు లేకపోయినా దేవులపల్లి సహకారంతో భర్తతో పాటు ఆమెకు కూడా చదవటం అలవాటు అయింది. రహస్యంగా వచ్చే పార్టీ పత్రికలు చదువుతూ జ్ఞానాన్ని పెంచుకొన్నది. హిందీపై ఇష్టం పెంచుకొన్నది. ఆంధ్రమహాసభకు అనుబంధంగా జరిగే మహిళాసభలలో పాల్గొనేది. వెంకటేశ్వర రావుగారి భార్య రంగమ్మ గారితో పరిచయం పెరిగింది. ఆమె అలా సభలకు వెళ్ళటాన్ని తల్లిదండ్రులు అభ్యంతర పెడుతున్నా భర్త అభిరుచులను బట్టి తాను అలా వెళ్ళటం సరైందన్న నమ్మకంతో వెళ్ళింది. మహిళలను సమావేశపరచి పత్రికలు చదివించటం వీరేశలింగం వంటి సంస్కర్తలగురించి తెలపటం, రష్యన్ సాహిత్యాన్ని ప్రచారం చేయటం ఆమె చేసిన పనులు. 1943 నాటి విజయవాడ రాజకీయశిక్షణాతరగతులకు హాజరైంది. తరువాత రెండు నెలలు అక్కడేఉన్న సమయంలో హిందీనేర్చుకొన్నది. ఈత నేర్చుకొన్నది. మహిళల సమీకరణ, సమావేశాలు కొనసాగాయి. స్త్రీల హక్కుల కోసం పనిచేసింది.

లలితమ్మ కార్యాచరణ, అన్ని కులాలతో కలిసి తినటం నచ్చని పుట్టింటివారి కులబహిష్కరణను కూడా ఎదుర్కొన్నది. భర్త జైల్లో ఉండి, పుట్టింటికి పోక తప్పని పరిస్థితులలో కులంలో కలుపుకొనటానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసినదే అని తెచ్చిన ఒత్తిడికి లొంగవలసి వచ్చింది. అయినా పెళ్లిళ్లు మొదలైన కార్యాలలో ఆమెను, ఆమె భర్తను పంక్తి బాహ్యులుగానే చూసారు. భర్తతో పాటు ఉద్యమ ప్రాంతానికి వెళ్ళటానికి పసిబిడ్డతో నిర్బంధాల మధ్య ఆమె చేసిన ప్రయాణం సాహసోపేతమైనది. ఖమ్మంలో ఒక రైతు కుటుంబంతో ఉండగా పోలీసులు అరెస్టు చేసి భర్త ఆచూకీ చెప్పమని బాగా వేధించారు. నిబ్బరంగా నిలబడింది. ఆత్మగౌరవంతో ధిక్కారం ప్రకటించింది. వరంగల్ జైల్లో ఉండగా జైలు తిండి సరిగాలేదని సరుకులిచ్చి వండుకు తినటానికి అవకాశం కావాలని మహిళా రాజకీయ ఖైదీలు చేసిన సమ్మెలో చురుకుగా పాల్గొంది. నాందేడు జైలుకు తరలిస్తే అక్కడ కూడా ఇదే తరహా సమ్మె నిర్వహణ. చదుకొని పరీక్షలకు కట్టటానికి అవకాశం ఇయ్యాలని, గ్రంధాలయాలు ఏర్పరచాలని ఆందోళనలకు దిగింది. అక్కడనుండి ఔరంగాబాద్ జైలుకు తరలించారు. చివరకు హైద్రాబాదు. సమ్మెలు నిరసన దీక్షలు మొదలైన వాటితో బిపి పెరిగింది. పోలీస్ ఏక్షన్ తరువాత 1948 నవంబర్ లో అరెస్టయిన లలితమ్మ 1951 ఎన్నికలకు ముందు విడుదలైంది.

అడ్డగూడూరుకు చెందిన పెసర సత్తెమ్మ తండ్రి భార్య పుట్టినిల్లు ఇరసానిగూడెంలో పడావు పడి ఉన్న ప్రభుత్వ భూమిని భూమిలేనివాళ్ళందరూ కలిసి సాగుచేసుకోవాలని ఉద్యమం నడిపిన కమ్యూనిస్టు. పేరు పర్కాల మల్లారెడ్డి. యూనియన్ సైన్యాలు ఆయనను వెంటాడి వెంటాడి సోమిరెడ్డి రామిరెడ్డి అనే స్నేహితుడితో సహా పట్టుకొని చెట్టుకు కట్టి కాల్చి చంపారు. ఆయన ను చంపినా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయింది బిడ్డ పెసర సత్తెమ్మ. పొలాల దగ్గర అజ్ఞాత కమ్యూనిస్టులకు ఆశ్రయం ఇయ్యటం, అన్నం కూర వండి పట్టుకుపోయి పెట్టటం, ఊళ్ళ మీద పోలీసు దాడులను ఎదుర్కొనటానికి కారంతో సిద్ధంగా ఉండటం, పోలీసుల రాక కాస్త ముందే తెలిస్తే అడవుల్లోకి పోయి వాళ్ళు వెళ్ళిపోయాక రావటం ఆమె జీవితానుభవం.

మల్లు స్వరాజ్యం భూస్వామ్య కుటుంబం నుండి వచ్చింది. ఆమె అన్న భీంరెడ్డి నరసింహారెడ్డి. జాతీయోద్యమంతో ప్రభావితుడై తెలంగాణ విముక్తికి అట్లాంటి ఒక ఉద్యమం గురించి కలలు కన్నవాడు. అందుకే ఆంధ్రమహాసభలో పనిచేస్తూ కమ్యూనిస్టు అయ్యాడు. చెల్లెలిని ఆ మార్గాన నడిపింది అతనే. పదకొండేళ్ల వయసులో స్వరాజ్యాన్ని విజయవాడలో మహిళలకు జరిగిన రాజకీయ శిక్షణా శిబిరానికి పంపాడు. అక్కడనుండి ఆమెదిక ఆగని ప్రయాణం. గ్రామంలో కూలిరేట్ల పెంపుదల సమ్మెల సంబాళింపు దగ్గరనుండి మహిళల కోసం పనిచేస్తూ నైజాం వ్యతిరేక సాయుధరైతాంగ పోరాటానికి ప్రజల మద్దతు కూడగట్టటానికి, నిధుల సేకరణకు ఉపన్యాసాలు ఇస్తూ పాటలు పాడుతూ తిరిగింది. రజాకార్లను తరిమికొట్టి గ్రామరాజ్య కమిటీలు ఏర్పరుస్తున్న సమయంలో గ్రామరాజ్యాల నిర్వహణ బృందంలో ఉండి చురుకుగా పనిచేసింది. గెరిల్లా దళాల నిర్వహణ బాధ్యతలో కూడా ఉంది. దళాలలోకి చేర్చుకొనటం, ముఖ్యంగా స్త్రీలను అందుకు సంసిద్ధం చేయటం వంటి బాధ్యతలు నిర్వహించింది. మాట , పాట తూటాలుగా ఆయుధం పట్టి ఉద్యమాన్ని నడిపి ఏరియా కమాండర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి స్వరాజ్యం. ఆమె ఆత్మకథ నా మాటే తుపాకి తూటా.

2.

ఆరుట్ల కమలాదేవి నిజానికి తెలంగాణ లో కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన తొలిమహిళ. కానీ ఎందువల్లనో ‘మనకుతెలియని మనచరిత్ర’ లో ఆమె అనుభవ కథనం భాగం కాలేదు. ఆమె కమ్యూనిస్టు జీవితాచరణను తెలుసుకొనటానికి అందుబాటులో ఉన్న పుస్తకాలు రెండు. ఒకటి యస్వీ సత్యనారాయణ, కె. భారతి సంపాదకులుగా వచ్చిన తెలంగాణ వీరనారి ఆరుట్ల కమలా దేవి(2002). కమలాదేవి మరణించిన సంవత్సరానికి వచ్చిన సంస్మరణ సంచిక వంటి జ్ఞాపకాల అనుబంధాల సంకలనం ఇది.రెండవది విరువంటి గోపాలకృష్ణ వ్రాసిన ‘తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల దంపతులు’(2005).

కమలాదేవి నల్లగొండజిల్లా ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో 1920 లో పుట్టింది. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి పల్లా వెంకట్రామరెడ్డి. వాళ్ళు పెట్టిన పేరు రుక్మిణి. పదకొండు సంవత్సరాల వయస్సులో – అంటే 1931 కావచ్చు- మేనమామకోడుకు ఆరుట్ల రామ చంద్రారెడ్డితో పెళ్లయింది. ఇంటి పేరేకాక తనపేరు కూడా మారిపోయింది. ఆరుట్ల కమల అయింది. రామచంద్రారెడ్డి అప్పటికి హైదరాబాద్ లో చదువుకొంటూ జాతీయోద్యమ ఆదర్శాలతో ప్రభావితుడైనాడు. ఆర్యసమాజ పద్దతిలో పెళ్లి, పెళ్లి తరువాత భార్యను చదివించుకొనటం అన్న రెండు షరతులు పెట్టి రామచంద్రారెడ్డి ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. అన్నట్లుగానే ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో చేర్చాడు. రాజబహద్దూర్ వెంకట్రా మారెడ్డిని ఒప్పించి రెడ్డి హాస్టల్ కు అనుబంధంగా బాలికల హాస్టల్ ఒకటి ఏర్పాటు చేయించి కమల ను అందులో ప్రవేశపెట్టాడు.

1934 లో ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్రమహాసభకు రెడ్డి హాస్టల్ విద్యార్థులు వెళ్లారు( ఎ. గురువారెడ్డి – తెలంగాణాలో చైతన్యం రగిలించిన నిజాంరాష్ట్రాంధ్ర మహాసభలు , మొదటిభాగం, 2007). ఆరుట్ల రామచంద్రారెడ్డి తాను వెళుతూ భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆరకంగా కమలాదేవికి 1934 నాటికి ఆంధ్రమహాసభలతో సంబంధాలు మొదలయ్యాయి. మెట్రికులేషన్ పూర్తి చేసుకొని కొలనుపాకకు వచ్చిన కమలాదేవి అప్పుడే నిర్మాణమయిన గ్రంథాలయ భవనంలో బాలికలకు 1941లో ఒక పాఠశాలను ప్రారంభించింది. కొలనుపాక జాగీరు అధికారులు కొద్దీ కాలంలోనే ఆ పాఠశాలను మూసివేసి బడి వస్తువులను జప్తుచేసారు. దానిని తెరిపించటానికి ముప్ఫయి మంది బాలికల తల్లులను తీసుకొనిపోయి హైదరాబాద్ లో చేసిన ప్రయత్నాలు కూడా ఫలించని సందర్భంలో కొలనుపాక జైనమందిరంలో పాఠశాల నడుపుకోవచ్చని జైనమందిరం వారు ఆమెను ఆహ్వానించారు. వందమంది బాలికలతో బడి నడుపుతూ కమలమ్మ విద్యార్థులకు పాటలు నేర్పించి మద్యపానవ్యతిరేక ప్రచారంలో వాళ్ళను భాగస్వాములను చేసింది. ధరిపల్లి రాములమ్మ, గోపాలమ్మ సునంద, గోపరాజు విమల, వెంకట రామనర్సమ్మ మొదలైన వాళ్ళను ఉపన్యాసకులు గా తీర్చి దిద్దింది.ఆడపిల్లలకు సైకిల్ తొక్కటం, ఈతకొట్టటం, కర్రసాము మొదలైనవాటిలో శిక్షణ ఇచ్చింది.

నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభలోను మల్కాపురంలో జరిగిన సప్తమాంధ్ర సభ (1940)లోను, ధర్మారంలో జరిగిన తొమ్మిదవ ఆంధ్ర మహాసభ (1942)లోను కమలాదేవి పాల్గొన్నది. అప్పటికే ఆమె ఆంధ్రమహాసభ సభ్యత్వాలను పెంచటానికి భర్తతో కలిసి భువనగిరి తాలూకా గ్రామాలలో పర్యటించి ప్రచారం చేసింది. తొమ్మిదవ ఆంధ్ర మహాసభలకు తమ పాఠశాల విద్యార్థులను వాలంటీర్లుగా తీసుకువెళ్ళింది. ఈ సభలో ఆమె కల్వకుంట్ల సరస్వతీదేవి, సుబ్బాయమ్మ, సీతాకుమారి కలిసి మహిళాభ్యుదయానికి అభివృద్ధి కార్యక్రమాలలోకి గ్రామీణ మహిళలను ముందుకు తీసుకొని పోవటం, పరిశ్రమలు పెట్టి ప్రోత్సహించటం, మహిళల స్వయం సమృద్ధి లక్ష్యంగా పనులు చేపట్టటం, స్త్రీలకు గ్రామాలలో ప్రత్యేకంగా పఠనాలయాలు ఏర్పాటు చేయటం అవసరం అని సూచనలు ప్రవేశ పెట్టింది. 1943 మే లో హైదరాబాద్ లో జరిగిన పదవ ఆంధ్ర మహాసభలో మహిళాసభకు ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించింది. కమలాదేవి ఆహ్వాన కమిటీ కార్యదర్శిగా పనిచేసింది. బాలికలకు మాతృభాషలో నిర్బంధ ప్రాధమిక విద్య, ఖాన్గి పాఠశాలలపై నిర్బంధం తొలగించి ఆర్ధికంగా తోడ్పటం గురించి ఆమె ఈ సభలో డిమాండ్ పెట్టింది. అన్న భీంరెడ్డి నరసింహారెడ్డితో ఆ సభలకు పోయిన స్వరాజ్యం కమలాదేవి ధనిక, భూస్వామ్య, మధ్యతరగతి మహిళల కోణం నుండి కాక ఫ్యూడల్ వ్యవస్థ పీడనలో నలిగిపోతున్న మహిళలస్థిగతులను వివరిస్తూ వాళ్ళ విముక్తికై కార్యక్రమాన్ని చేపట్టాలని చేసిన ఉపన్యాసం తనను ఎంతో ప్రభావితం చేసిందని అంటుంది. ఆ సభలలో కొత్త సంవత్సరానికి స్టాండింగ్ కౌన్సిల్ సెక్రటరీగా కమలాదేవి ఎన్నికయింది. తరువాత ఆమె ఇతరకార్యవర్గ సభ్యులతో కలిసి అనేక గ్రామాలు తిరిగి మహిళాసభ ప్రాముఖ్యతను ప్రచారం చేసింది. అప్పటికే కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలైన కమలాదేవి ఆత్మరక్షణ లో శిక్షణ పొందటానికి విజయవాడ రాజకీయ తరగతులకు హాజరైంది. భువనగిరిలో పదకొండవ ఆంధ్రమహాసభ 1944 మే 27, 28 తేదీలలో జరపటానికి ఏర్పడిన ఆహ్వాన సంఘంలో ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షుడుగా ఎన్నుకోబడితే ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావులతో పాటు కమల కూడా కార్యదర్శి గా నియమించబడింది. ఈ వేదిక మీద ఆమె అధ్యక్షతనే నల్లగొండజిల్లా మహిళాసభ జరిగింది.

భువనగిరి చుట్టుపక్కల గ్రామాలలో విస్తృతంగా పర్యటించి సమకాలీన రాజకీయ పరిస్థితులపై ప్రసంగిస్తూ స్త్రీలలో పోరాట దృక్పథాన్ని పెంచటానికి కృషిచేసింది. గ్రామాలలో స్థానిక వాలంటీర్ దళాలనిర్మాణం కోసం పనిచేసింది. నిర్బంధపరిస్థితులలో ప్రచ్ఛన్నంగా ఉండి పని చేసింది. సాయుధపోరాటంలో పాల్గొన్నది. 1949 జనవరిలో అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు పంపారు. కమ్యూనిస్టులన్న కారణంగానో, వాళ్ళ బంధువులు అయిన కారణంగానో, కమ్యూనిస్టులకు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి సహకరించారనో మూడు నాలుగువందలమంది మహిళలు ఆమెతో పాటు ఆ జైలులో ఉన్నారు. అక్కడ కూడా ఖైదీల ప్రాధమిక అవసరాలకోసం పోరాటాలు నడిపింది. జైలు నుండి విడుదలై 1952 ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటు రాజకీయాలలో కొనసాగింది. 2001 జనవరి 1 న మరణించింది.

వేటపాలెం వెంకాయమ్మ గురించి తెలిపే ఒకే ఒక మూలవనరు ‘ఆమె చిరునామా ఎర్రజెండానే…!’ (సంపాదకత్వం నల్లూరి కాంతి 2019). వేటపాలెం వెంకాయమ్మ ను కాంతి చేసిన ఇంటర్వ్యూ ఉత్తమపురుషలో సాగిన వెంకాయమ్మ అనుభవ కథనమే. కాంతి నుండి అనేకమంది వామపక్ష ఉద్యమాలతో ఉన్న పరిచయం వల్ల ఆమెతో ఏర్పడిన అనుబంధాన్ని, అనుభవాలను గురించి చేసిన కథనాలు మిగిలినవి. ఈ అన్ని కలిసి వెంకాయమ్మ చరిత్రను, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి.

వెంకాయమ్మ చీరాల పేరాల ఉద్యమ కాలంలో (1921-22) పుట్టి దాని గురించి వింటూ పెరిగింది. తండ్రి వేటపాలెం రామస్వామి తాను వెళ్లే సభలకు ఆ చిన్నపిల్లను వెంటపెట్టుకొని వెళ్ళేవాడు. గాంధీ మీద పాటలు పాడుతూ తిరిగేది. ఉప్పుసత్యాగ్రహ ఉధృతి ఆమె కంటితో చూసింది. వెంకాయమ్మను, అలాంటి ఇంకా కొంతమంది పిల్లలను చేరదీసి సోడిమ రంగయ్య అనే ఆయన పాటలు నేర్పించాడు. భగత్సింగ్ ఆజాద్ ల గురించి ఆయన వల్లనే తెలుసుకున్నది. కమ్యూనిస్టు ఉద్యమబాటలోకి ఆయనే నడిపించాడు. తనకు పదమూడేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. కుటుంబపోషణకోసం పోలం పనులు, కూలీనాలీ పనులు చేస్తూనే మీటింగులకు వెళ్తుండేది. తండ్రి చనిపోయిన ఏడాదిలోపే మేనమామలు పూనుకొని పెళ్లి చేశారు. మొగుడి తిట్లు, దెబ్బలు, బయటకు పోవద్దని చేసే అదుపు దుర్భరమై ఆరునెలలకే కాపురం కాదనుకొని పుట్టిల్లు చేరింది. అక్కడనుండి కుటుంబ పోషణకు పనులు చేయటం రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనటం ఇదే ఆమె జీవితం అయింది.

కొల్లావెంకయ్యతో కొత్తపట్నం రాజకీయ తరగతులకు (1937) వెళ్లి పాఠశాల వంటపనిలో వాలంటీరుగా పనిచేయటం దగ్గర మొదలై వెనువెంటనే ఏర్పడిన గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీతో కలిసి విరామం లేని ప్రయాణం చేసింది వెంకాయమ్మ. బాపట్ల తాలూకా పార్టీ బాధ్యుడు కస్తూరి కుటుంబరావు నాయకత్వంలో సోడిమ రంగయ్య, పృద్వీ గరటయ్య, పత్తిపాటి ఆదినారాయణ, మేడిశెట్టి నాగయ్యలతో కల్సి చేనేతకార్మికులను కూడగట్టి సమయస్యలపై పోరాటానికి సన్నద్ధం చేయటంలో, చిన్నరైతులనుండి సాగు భూములను లాక్కొని జాతీయోద్యమ కారులకు ఇచ్చే పద్ధతి కి వ్యతిరేకంగా బంజరు సత్యాగ్రహ నిర్వహణలో చురుకైన పాత్రవహించి అరెస్టయింది. రాయవెల్లూరు జైలులో ఏడాది ఉంది. ఆ కాలంలో రాజకీయ ఖైదీల హక్కులకోసం పోరాడింది. అధికారుల అవినీతికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తోటి స్త్రీలను కూడగట్టింది. జైలు నుండి విడుదల అయ్యాక రెండవప్రపంచ యుద్ధ (1939-45) వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నది. బంజరు సత్యా గ్రహాన్ని తిరిగి మొదలు పెట్టటానికి చొరవచూపింది. తెలంగాణాలో రైతాంగ సాయుధపోరాటం మొదలయ్యాక కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించేసరికి నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వెంకాయమ్మ కొరియర్ గా పనిచేసింది. ఒకసారి ఉత్తరాలు చేరవేస్తూ పోలీసులుకు చిక్కకుండా తప్పించుకొని వాళ్లకు దొరకకుండా ఉండాలని తానూ అజ్ఞాతంలోకి వెళ్ళింది. అజ్ఞాతంలో ఉన్న నాయకులను వేటాడి కాల్చివేయటం వంటి చర్యలతో కాలం అట్టుడికి పోయింది. తెలంగాణ సాయుధరైతాంగ పోరాట విరమణ తరువాతకాని ఆమె మళ్ళీ ఇల్లు చేరలేదు. 1952 ఎన్నికలతరువాత బలమైన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలు పెట్టి రకరకాల సమస్యల మీద సమ్మెలు నడిపించింది. తెలంగాణ రైతాంగ పోరాటంలోనూ నిషేధ కాలంలోనూ అమరులైన కామ్రేడ్లకు స్థూపాలు కట్టి, ఆవిష్కరణ సభలు, సంస్మరణ సభలు నిర్వహించింది. వేటపాలెం చుట్టుపక్కల పల్లెల్లో పాలేర్లమీద, కూలీల మీద జరిగే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడగట్టి సంఘాలు పెట్టించటంలో వెంకాయమ్మ పని చేసింది. 1955 ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థులకోసం ప్రచారకార్యక్రమంలో విస్తృతంగా పనిచేసింది.

అయితే 1950 కి పూర్వపు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న ఇతర స్త్రీల వలే అయితే ఎన్నికల రాజకీయాల మాయలో పడిపోవటమో , కాకపోతే ఆచరణ కార్యక్రమం ఏదీ లేదని నిస్పృహతో మౌనంలోకి వెళ్లిపోవటమో కాక పోరాటమార్గాన్ని విడువక పోవటం వెంకాయమ్మ ప్రత్యేకత. శ్రీకాకుళ సాయుధ పోరాటంవైపే తాను ఉంటానని ప్రకటించి ఆ తరువాత నక్సల్బరి రాజకీయాలను కౌగలించుకొని చరిత్రనుండి వర్తమానానికి ప్రవహించిన వ్యక్తిత్వం ఆమెది. వేటపాలెం కామ్రేడ్లతో కలిసి కమిటీగా ఏర్పడి నక్సలైట్ రాజకీయాలను ప్రచారం చేసింది. పార్టీ సమావేశాలకు, రాజకీయ తరగతులకు ఆమె ఇల్లే చిరునామా. వచ్చినవాళ్ళకు వండి వడ్డించేది. ఎక్కడ ఏ పెద్ద సమావేశం జరిగినా వంటశాలలో పనికి చొరబడేది. పార్టీ ప్రజాసంఘాల పనులన్నిటిలోనూ తాను భాగం అయింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి ఆ తరం కమ్యూనిస్టు నాయకుల నుండి ఎంత గౌరవాన్ని పొందిందో నక్సలైట్ నాయకత్వం నుండి కూడా అంత గౌరవాన్ని పొందగలిగేంతగా క్రియాశీల చైతన్యాన్ని సజీవంగా నిలుపుకొన్న వ్యక్తి వేటపాలెం వెంకాయమ్మ. జగమంత కుటుంబంగా, జనానికి మంచి చేయాలనుకొనే వాళ్లంతా తనపిల్లలుగానే బ్రతికిన వెంకాయమ్మ 2010 లో (జులై 29) న మరణించినా ‘పార్టీకీ , యావత్తు విప్లవోద్యమానికే అమ్మ’ గా చిరంజీవి.

  1. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన మహిళలు వ్రాసిన అయిదు స్వీయ చరిత్రలలో మొదటిది 1998 లో వచ్చిన ‘జననీ జన్మభూమిశ్చ’. రచయిత్రి గోపరాజు సీతాదేవి.

గోపరాజు సీతాదేవికి పదకొండవ ఏట పెళ్లి అయింది. ఇరవైఏళ్ళు వచ్చేసరికి ఇద్దరు పిల్లల తల్లి. ఇరవై మూడేళ్ళకు భర్తను కోల్పోయి పుట్టింటికి చేరింది. ఆ సమయంలో ఆమె శక్తిని, ఆలోచనను స్త్రీల సంఘనిర్మాణం వైపుకు తిప్పినవాడు ఆమె పెద్ద తమ్ముడు పరకాల పట్టాభి రామారావు. కాకినాడలో కాలేజీ చదువుల కాలంలో విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ జాతీయోద్యమంతో ప్రభావితుడై క్రమంగా సోషలిజం వైపు ఆకర్షితుడైన ఆయన తన ఉత్తరాల ద్వారా స్త్రీలు దేశ స్వాతంత్య్రం కోసం, తమ స్వాతంత్య్రం కోసం కూడా పోరాడాలన్న అవగాహనను సీతాదేవిలో అభివృద్ధి పరిచాడు. ఆ రకంగా ఆమె 1940 నుండి 1947 వరకు స్వాతంత్రోద్యమానికి అనుబంధంగా ప్రారంభించి క్రమంగా కమ్యూనిస్టు ఉద్యమ చైతన్యంతో గోదావరి జిల్లాలలో మహిళా ఉద్యమానికి పనిచేసింది.

1938 జనవరి 30, 31 తేదీలలో నర్సాపురం తాలూకా లంకల కోడేరు గ్రామంలో కాంగ్రెస్ సభలో భాగంగా జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా మహిళాసభ చేసిన తీర్మానం ప్రకారం మహిళా సంఘ నిర్మాణానికై సామాజిక కార్యాచరణలోకి దిగిన సీతాదేవి, ప్రజానాట్యమండలి రాష్ట్ర దళంలో కూడా చేరింది. మా భూమి నాటకంలో కమల పాత్ర వేస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ, కాంగ్రెస్ చర్యలను విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించ గలిగింది. జాతీయ కాంగ్రెసుకు అనుబంధంగా మహిళా సంఘం వున్నా అది పట్టణాలకు పరిమితమై ఉద్యోగస్తుల భార్యల, ఉన్నత వర్గాల మహిళల కూటమిగా మాత్రమే పనిచేస్తున్న తీరును ఆమె గుర్తించింది. ఈ మహిళా సంఘంలో సభ్యత్వ రుసుము మూడు రూపాయలు. గ్రామీణ రైతాంగానికి, శ్రామిక వర్గానికి చెందిన వేలమంది స్త్రీలను అందులో చేర్చటానికి వీలుగా సభ్యత్వ రుసుము నాలుగు అణాలకు తగ్గించాలని ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్ మహిళా సభ దానిని తోసిపుచ్చిన విషయాన్ని ప్రస్తావించి గోపరాజు సీతాదేవి కాంగ్రెసు మహిళలు కమ్యూనిస్టు మహిళలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేకపోవటాన్ని వ్యాఖ్యానించింది.

ఆంధ్రదేశంలో విశాల మహిళా ఉద్యమానికి పునాది వేసింది, అందుకవసరమైన నాయకత్వాన్ని తయారుచేసిందీ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీయే అన్న దృఢాభిప్రాయం గోపరాజు సీతా దేవిది. అయినా జాతీయస్థాయిలో దేశాన్ని నడిపించగల సంస్థ కాంగ్రెసే నన్నది ఆమె విశ్వాసం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరింపచేయాలన్న కమ్యూనిస్టులలోని ఒక వర్గపు అభిప్రాయంతో ఆమె ఏకీభవించలేకపోయింది. దేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని, స్వాతంత్య్రానంతర పరిస్థితులను వారు సరిగా అంచనా వేయలేక పోయారని ఆమె అభిప్రాయపడింది. నెహ్రూ ప్రభుత్వం మీద కత్తి కట్టటంగా వ్యక్తమైన కమ్యూనిస్టుల పోరాట పంథాయే కమ్యూనిస్టు ఉద్యమంపై అణచివేతకు కారణమైందని ఆమె నమ్మింది. అలాగని కమ్యూనిస్టుల పట్ల కాంగ్రెస్ అణచివేత విధానాన్ని ఆమె ఆమోదించలేదు. 1952 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ విజయం వాళ్ళు చేసిన పోరాటాల, త్యాగాల ఫలితమేనని కూడా ఆమె భావించింది.

గోపరాజు సీతాదేవి ఎంచుకొన్న కార్యరంగమే మహిళా ఉద్యమం కావటం వల్ల పనిక్రమంలోనే జండర్ రాజకీయాల గురించిన ఆమె అవగాహన పదునెక్కింది. జెండర్ రాజకీయాలు కుటుంబం నుండి ప్రారంభమై రాజ్యం వరకు విస్తరించటాన్ని ఆమె గుర్తించింది. రజస్వల పూర్వవివాహాలు ఒక సంప్రదాయంగా స్థిరపడి వుండటం వలన ఆడపిల్లలకు బాల్యంలోనే చదువులు మాన్పించెయ్యటం సర్వసాధారణం అయిపోయిందని పేర్కొన్నది. ఆడపిల్లలకు చదువుకొనే అవకాశాలు తక్కువగా వున్నాయంటే అగ్రవర్ణాల ఆడపిల్లల కంటే తదితర వర్గాల ఆడపిల్లలకు ఆ అవకాశాలు మరీ తగ్గి పోతాయని కూడా సీతాదేవి గుర్తించింది. తనతో చదువుకొన్న వాళ్ళలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కులస్తుల బాలికలకన్నా శెట్టి బలిజ కులాల బాలికలు తక్కువగా వుండేవారని, అంటరాని వారుగా చూడబడే మాల మాదిగలు అసలే లేరని ఆమె పేర్కొన్నది. ఉద్యోగాల విషయంలో కూడా ఈ ధోరణి వుండటాన్ని సీతాదేవి గమనించింది. మంత్రసాని పని ఎరుకలు, క్రైస్తవులు చేసే పనిగా స్థిరపడి వున్న సంస్కృతిలో బ్రాహ్మణ స్త్రీలు ఈ వృత్తిలోకి ప్రవేశిస్తే సంప్రదాయ సమాజం నుండి ఎంత వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చిందో తన చెల్లెలి విషయంలో ఎదురైన అనుభవంగా చెప్పింది. ఆ విధంగా జండర్ కు కులానికి వున్న సంబంధాన్ని సీతాదేవి గుర్తించగలిగిందని చెప్పవచ్చు.

గోదావరి, కృష్ణా జిల్లాలలో మహిళా ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో అందులో స్త్రీల క్రియాశీలపాత్రను, చురుకైన భాగస్వామ్యాన్ని సహించలేక అయ్యదేవర కాళేశ్వరరావు, ఎన్.జి. రంగా వంటి కాంగ్రెస్ ప్రముఖులు మహిళా సంఘంలో పనిచేస్తున్న మహిళా కార్యకర్తలను ‘సీతాకోక చిలుకల’ని నీచంగా మాట్లాడటాన్ని అచ్చమాంబ ఖండిస్తూ చెప్పిన విషయాన్ని సీతాదేవి తన స్వీయచరిత్రలో ప్రస్తావించింది. పితృస్వామిక దురహంకార అధికార రాజకీయాల స్వభావాన్ని సీతాదేవి గుర్తించిందనటానికి ఈ ప్రస్తావనే నిదర్శనం. స్వాతంత్య్రానంతర స్వదేశీ పాలనలోనూ ఆమెకు ఎదురైన అనుభవాలు ఇందుకు భిన్నంగా లేవు.

మహిళా ఉద్యమంలో భాగస్వాములయ్యే కొద్దీ స్త్రీలు సంప్రదాయభావాల నుండి, పద్ధతుల నుండి బయట పడటం అనివార్యమని ఆమె తన అనుభవం నుండి గ్రహించింది. కాంగ్రెస్ వాదులు తమ స్త్రీలకు స్వాతంత్య్రం ఇయ్యటంలేదని సమకాలంలోనే స్త్రీల నుండి వచ్చిన తీవ్రమైన విమర్శను కూడా ఈ స్వీయచరిత్ర నమోదు చేసింది. స్త్రీ జాతి విముక్తికి పురుషులు, సంఘ సంస్కర్తలు ఉద్యమించే దశ నుండి తమ విముక్తికి మహిళలు తామే నడుం బిగించి పోరాటరంగంలోకి వచ్చే నూతన దశకు సామాజిక రాజకీయ పరివర్తన జరిగిందని ప్రత్యక్షసాక్షిగా ఆమె చెప్పగలిగింది.

గోపరాజు సీతాదేవి ఉద్యమం అవసరాల రీత్యా తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో విస్తృతంగా తిరిగింది. ఆ జిల్లాల మహిళా ఉద్యమం గురించి సాధికార సమగ్ర సమాచారాన్నివ్వ గలిగింది. ఆయా సందర్భాలనుబట్టి మహిళా ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలను, వాళ్ళ పనిని, చైతన్య స్థాయిని, పరిమితులను, త్యాగాలను ప్రస్తావించింది. అలా ప్రస్తావించబడిన స్త్రీలు 52మంది. వీళ్ళందరి జీవితాలను, ఉద్యమంలో వారు నిర్వహించిన పాత్రను తెలుసు కొనాలన్న ఆసక్తిని, ఉత్సాహాన్ని ఈ స్వీయచరిత్ర కలిగిస్తుంది. వీరిలో ఒక్కొక్కరి జీవితం, చైతన్యం, ఉద్యమంలో భాగస్వామ్యస్థాయి, తద్వారా పొందిన అనుభవ చరిత్ర తెలిసే కొద్దీ మహిళా ఉద్యమ చరిత్ర సుసంపన్నమవుతుంది.

గోపరాజు సీతాదేవి స్వీయ చరిత్ర వచ్చిన ఏడాదికే (1999) శ్రీరంగమ్మ స్వీయ చరిత్ర ‘నా జీవితం – జ్ఞాపకాలు’ వచ్చింది. శ్రీరంగమ్మ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వామి కాదుగానీ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు భార్యగా ఉద్యమ గమనానికి ఆమె ప్రత్యక్ష సాక్షి. ఉద్యమపు అంచులలో నడుస్తూ కొన్ని సందర్భాలను స్పృశిస్తూ సాగింది ఆమె జీవితం. దేవులపల్లి వెంకటేశ్వరరావు 1940 నుండి 1957 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వస్థానంలో వున్నాడు. 1957 ఎన్నికలలో ఎం.పి. కావటంతో ఆయన కార్యస్థానం ఢిల్లీకి మారింది. 1962 నుండి 64 వరకు డివి జైలు జీవితం, ఆ తరువాత పార్టీ కార్యకలాపాలపై బయటతిరగటం, 1969లో అరెస్టయి 1972 వరకు జైల్లోనే. 1975లో ఎమర్జెన్సీ వరకు హైదరాబాదులో పిల్లలతో కలిసి వున్నారు. 1975 తరువాత ఇక అలాంటి అవకాశమే లభించలేదు. మొత్తం మీద 49 సంవత్సరాల వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరూ కలిసివున్నది కొద్దికాలమే. ఎడబాటు సృష్టించిన శూన్యంవల్ల అరుదుగా కలుసుకొనటానికి అవకాశాలు లభించినా వాళ్ళమధ్య మాటలే కరువైనాయి. పార్టీ పనిలో నిమగ్నమైన డివికి అది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఆయన తప్ప మరొక జీవితం లేని రంగమ్మకు అది పెద్ద సమస్యే. అతని దర్శనానికే ఆమె ముఖం వాచిపోయింది, “అదేమిటో కానీ శ్రీవారిని చూడాలని ఎప్పుడూ మనస్సులో కోరిక వుంటుంది. దగ్గరలేనప్పుడు ఆయన ఆకారం, ముఖ్యంగా ముఖం నా కళ్ళల్లో కనిపిస్తుంటుంది. నేను సంతృప్తిగా చూడగలిగేది వారు పగలు నిద్రిస్తున్న సమయంలోనే ఎందుకు ఇంతగా వారు నా కళ్ళముందుండాలి? అదే పనిగా చూడాలని కోరికెందుకు వుండాలి?” అని ఆమె తన స్వీయచరిత్రను ప్రారంభించటం దీనినే సూచిస్తుంది.

పెళ్ళి 1939లో అయితే 1941లో చిలుకూరులో జరిగిన 8వ ఆంధ్రమహా సభకు శ్రీరంగమ్మను రమ్మన్నాడు డివి. అత్తగారితో సహా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆమె ఆ సభకు వెళ్ళింది. మహాసభతో పాటు జరిగిన మహిళా సభలో ప్రతినిధిగా పాల్గొంది. ఘోషా పద్ధతి, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం అనే అంశాలపై మాట్లాడమని కాగితం మీద భర్త వ్రాసిచ్చిన సమాచారాన్ని ఆ సభలో చదివి వినిపించింది. కానీ 1942 జనవరిలో విజయవాడలో జరిగే రాజకీయ శిక్షణా శిబిరానికి వెళ్ళాలని చెప్పినప్పుడు ముందు నిరాకరించింది. తల్లి ఏమంటుందోనన్న భయం ఒక వైపు, చంటి బిడ్డతో తానొక్కతే ఇబ్బంది పడుతుంటే డివి పార్టీ పనులమీద ఇల్లు పట్టకుండా తిరగటం వల్ల కలిగిన కోపం మరొకవైపు అందుకు కారణాలని ఆమె చెప్పింది. కానీ తరువాత భర్త మాటకు ఎదురాడకూడదన్న ఆలోచనతోనో ఏమో వెళ్ళింది.

బెజవాడ సభ చారిత్రాత్మకమైంది. ఆ సభలో స్త్రీలు మహిళాసంఘాలలో ఏ విధంగా పనిచేయాలో చెప్పారు. స్త్రీ స్వాతంత్య్రం తదితర స్త్రీల సమస్యల మీద పాఠాలు చెప్పారు. కానీ శ్రీరంగమ్మ ఆ విషయాలను వేటి గురించి తరువాతి కాలంలో ఆలోచించినట్లు కనబడదు. భర్తలు పార్టీ కార్యకర్తలుగా వున్నప్పుడు వారితో సహకరించాలని, ఇంటికి కార్యకర్తలు పనిమీద వచ్చినప్పుడు ఆదరించాలని చెప్పిన విషయాలు మాత్రమే ఆమెకు గుర్తుండిపోయాయి. జీవిత పర్యంతం వాటిని ఆచరణలో పెట్టింది. బెజవాడ క్లాసులు పూర్తి అయిన తరువాత తిరుగు ప్రయాణంలో తనతో పాటు వున్న మరో ఇద్దరు స్త్రీలు అనుకొన్న మాటలను ఆమె ఇందులో ప్రస్తావించింది. వారిలో ఒకామె ‘వీళ్ళు మనకు స్వాతంత్య్రము వుండాలని చెప్పినారు కదా, దాని ప్రకారమే మనం సంఘాల్లో పని చేయటానికి నిరాకరించవచ్చును కదా, వారితో సహకరించకుండా వుండవచ్చును కదా, అలా చేస్తే తప్పే మిటి ?’ అని అన్నది. ఆ మాటలకు మేమంతా నవ్వుకొన్నాము. అని ముక్తాయింపు నిచ్చింది శ్రీరంగమ్మ. పార్టీ కార్యకర్తల భార్యలమీద వాళ్ళ చైతన్యస్థాయితో పని లేకుండా పడుతున్న ఒత్తిడికి ఒక విధమైన నిరసనతో కూడిన వ్యక్తీకరణగా ఇది కనిపిస్తుంది.

శ్రీరంగమ్మ 1943లో హైదరాబాదులో జరిగిన పదవ ఆంధ్రమహాసభలో దానితో పాటు జరిగిన మహిళా సభలోనూ పాల్గొన్నది. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ వూరేగింపులో పాల్గొన్నది. ఆ సభలో చర్చించిన అంశాలను అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించింది. ఈ సభలకు సమావేశాలకు వెళ్ళటం వలన ఆమెకు ఆరుట్ల కమలాదేవి వంటి మహిళా కార్యకర్తలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ క్రమంలో పార్టీ కార్యకర్తలను, పని విధానాన్ని, పార్టీ బాధ్యుల కుటుంబాలను ఆమె సన్నిహితంగా చూడగలిగింది. ఆయా సందర్భాలలో ఆమె పరిశీలనలు ఆసక్తికరమైనవి. 1. ఆసక్తి వుండి, పని చేయటానికి తగిన శక్తి సామర్థ్యాలు వుండి తామేం చేయాలో తెలియని మహిళలకు తగిన శిక్షణ నిచ్చి పార్టీ వాళ్ళకు తగిన బాధ్యతలను అప్పగించటం వలన ఆ స్త్రీలు ఒక సంతృప్తిని సార్థకతను పొందగలుగుతున్నారని ఆమె గుర్తించి చెప్పింది. 2. డివి వంటి వాళ్ళు రక్త సంబంధాల కన్నా, బంధుత్వ సంబంధాలకన్నా వర్గ సంబంధాలకు, పార్టీ విధానాలకు ప్రాధాన్యత నిచ్చి పనిచేయటం ఆమె గుర్తించింది. అదే సమయంలో పార్టీల్లో పనిచేసే మనుషుల స్వార్థం, స్వప్రయోజనం మొదలైన బలహీనతలను ఆమె కనిపెట్టింది. 3. నాయకుల భార్యలు తాము స్వయంగా ప్రజలలో పని చేయకున్నా తమభర్తల పేరు ప్రతిష్టలను కాపాడగలిగిన సంస్కారమన్నా అలవరచుకొనాలన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది.

డివి పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా అంకితమైపోగా కుటుంబ నిర్వహణ మొత్తం శ్రీరంగమ్మదే అయింది. అయితే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు మొదలైన ప్రధాన విషయాలలో రంగమ్మ భర్త నిర్ణయాలపైననే ఆధారపడింది. ఆమెకు సంప్రదాయ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేయాలని వున్నా ఆయన నిర్ణయం మేరకు రిజిస్టర్ పెళ్ళిళ్ళే జరిపించింది. పెళ్ళికి ఆయన తన రాజకీయ దృక్పథాన్ని అనుసరించి ఎవరిని పిలవమన్నాడో, ఎవరిని వద్దన్నాడో వాటిని యధాతథంగా ఆచరించింది. పార్టీ నాయకుల భార్యలు ఎలా నడుచుకోవాలో అందుకు తనను తానే ఒక నమూనాగా రూపొందించుకొన్నదా అనిపిస్తుంది రంగమ్మ జీవితక్రమం చూస్తే. మొత్తం మీద ఆమె ఒక సంప్రదాయ కుటుంబ స్త్రీ నమూనాగానే మిగిలిపోయింది.

అయితే భర్త ద్వారా కమ్యూనిస్టు ఉద్యమంతో అనివార్యంగా ఏర్పడిన సంబంధం వల్ల జెండర్ రాజకీయాల గురించి అవగాహన అంతకు ముందుకన్నా మెరుగైందని చెప్పకతప్పదు. మహిళాసభలకు ప్రతినిధులుగా చాలామంది మహిళలు వచ్చినా మాట్లాడిన వాళ్ళు కొద్దిమందేనని, వాళ్ళలో కూడా హైదరాబాదు వాళ్ళు ఎక్కువ అని నల్లగొండ మొదలైన జిల్లాల నుండి వచ్చిన వాళ్ళలో ఆ మాత్రం చొరవకూడా కనిపించదు అని, పైతరగతి స్త్రీలలో కూడా చదువు కొన్నవారి సంఖ్య తక్కువ కావటం అందుకు కారణం అని శ్రీరంగమ్మ గుర్తించ గలిగింది. అంతా స్త్రీలే కావటంవల్ల మహిళా సభలలో జంకు గొంకులు లేకుండా స్త్రీలు మాట్లాడటానికి వీలుచిక్కింది అని సంతోష పడింది కూడా. పార్టీ కార్యకర్త భార్యగా ఆ సభలో పాల్గొనటం తన ధర్మం అనుకొన్నది తప్ప శ్రీరంగమ్మ జండర్ చైతన్యాన్ని పొందటానికి కలిసి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొనేందుకు సంసిద్ధురాలు కాలేక పోయింది.

కొండపల్లి కోటేశ్వరమ్మ స్వీయ చరిత్ర నిర్జనవారధి 2012లో వచ్చింది. 1920 లో పుట్టిన కోటేశ్వరమ్మ బాల వితంతువు. అయినా బడికి పంపారు. ఇంటివద్ద సంగీతం నేర్పించారు. ఐహిక వాంఛల మీదకు మనసుపోకుండా ఉండేందుకు ఆధ్యాత్మిక భావాలను పెంచుకొనమని త్యాగరాజ కీర్తనలతో పాటు రామాయణ భారత భాగవతాలు చదివించాడు తండ్రి. రామకోటి కూడా రాయించాడు. కానీ ఇంట్లో రాట్నం మీద నూలు వడికే తల్లి, జాతీయోద్యమంలో పనిచేస్తూ ఇంటికి వచ్చిపోయే బంధువులు, సంస్కరణాభిలాషులైన ఇరుగు పొరుగు ఆమెకు దేశభక్తిని దైవభక్తికి ప్రత్యామ్నాయంగా అందించారు. ఆమె సంగీత జ్ఞానం శ్రావ్యమైన ఆ కంఠం ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమయ్యాయి. తల్లి ప్రోద్బలం, తండ్రి ప్రేమ కారణంగా కోటేశ్వరమ్మకు కొండపల్లి సీతారామయ్యతో పునర్వివాహం జరగటంతో అందుకు అవకాశం కలిసి వచ్చింది. అలాగని అతని ప్రమేయం వల్లనే ఆమె కమ్యూనిస్టు రాజకీయాలలోకి వచ్చిందనుకొంటే పొరపాటే. అత్తింటి కొత్తకాపురంలో ఇంటికి రహస్యంగా వచ్చే కమ్యూనిస్టు పత్రిక ‘స్వతంత్ర భారతి’ని జిల్లా అంతటా పంచటానికి రాత్రిపూట సైక్లోస్టైల్ తీసేవాళ్లకు టీలు చేసిపెట్టటమైనా, పంపకానికి రహస్యంగా పంపే ఏర్పాట్లు చేయటమైనా, మేడే సభలకని, అక్టోబర్ విప్లవదినోత్సవ సభలకని గుడివాడ వెళ్లి వూరేగింపులలో, సభలలో పాల్గొనటం వేదికల మీద విప్లవ గీతాలు పాడటం అన్నీ ఆమె తన ఇష్టప్రకారం చేసింది. ఇష్టపూర్తిగా పార్టీ సభ్యురాలైంది.భర్త ఆస్తులమ్మి పార్టీకి ఇచ్చినా, అతని పార్టీ కార్యకలాపాలు, నిర్బంధం వల్ల అజ్ఞాతవాసం కారణంగా ఒంటరిగా సంసారం సాగించవలసి వచ్చిన కష్ట కాలంలో కూడామొక్కవోని ధైర్యంతోనే నిలబడింది.

1942-43 నుండి నాలుగైదేళ్ల పాటు ఆమె రాజకీయజీవితంలో ఒక ఉజ్వల ఘట్టం. పార్టీసభ్యత్వం, సెల్ సమావేశాలు, మహిళాసంఘ నిర్మాణానికి తాపీ రాజమ్మ వంటి స్త్రీలతో కలిసి ఊళ్ళు తిరగటం, పార్టీ పత్రికను బజార్ల లో పోటీపడి అమ్మటం ,మార్క్సిస్టు రాజకీయాల గురించిన అవగాహన పంచుకొనే దిశగా రాజకీయ పాఠశాలలకు హాజరు కావటం,జానపద కళారూపాల ప్రదర్శనలు ఇయ్యటం, బుర్రకథ దళాన్ని తయారుచేసి ప్రచారానికి ఊరూరు తిరగటం,నాటకాలలో నటించటం..వీటితో అత్యంత ఉద్విగ్నభరితంగా జీవించిన కాలం అది.ప్రజానాట్యమండలి ఏర్పాటుకు రంగం సిద్ధం చేయటంలో కోటేశ్వరమ్మ పాత్ర చెప్పుకోతగినది.

1947 నుండి మళ్ళీ పార్టీపై నిషేధం… సీతారామయ్య అజ్ఞాతవాసం, పార్టీ అవసరాల రీత్యా కోటేశ్వరమ్మ కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. భర్తకు, పిల్లలకు దూరంగా. అవసరాన్ని బట్టి స్థావరాలు మారుస్తూ బందరు నుండి ఏలూరు,విశాఖపట్నం, పూనా, నాగపూర్, రాయపూర్, గోందియా మొదలైన చోట్లకు తిరుగుతూ పార్టీ పనులలో భాగమైనవాళ్ళే కుటుంబంగా జీవించింది. రక్త సంబంధాలకన్నా బంధుత్వ సంబంధాలకన్నా వర్గ సంబంధం ,ఉద్యమ సంబంధం ఎంత గాఢమైనదో ఎంతగా మనుషులను కట్టి పడేసే బంధమో ఆమె అజ్ఞాతవాసం జీవితానుభవాలు చెప్తాయి. నా క్షేమం, నా కుటుంబ క్షేమం అనే స్వార్ధ విలువలు రద్దయి పార్టీ ప్రయోజనాలు ప్రధానంగా అందరూ పనిచేసే స్థాయికి ఉన్నతీకరింపబడిన విలువలు ఆ కాలాన్ని దీప్తిమంతం చేశాయి.

నిషేధం ఎత్తివేయడంతో అయిదేళ్ల తరువాత బయటకు వచ్చిన కోటేశ్వరమ్మ అదే స్ఫూర్తి తో 1952 ఎన్నికలలో పార్టీ ప్రచారకార్యక్రమాలలో పాల్గొన్నది. అజ్ఞాతవాసకాలంలో నిర్బంధంలో హింసలు పెట్టబడి కాల్చి చంపబడ్డ ఏ కామ్రేడ్స్ కోసమైతే సామూహిక దుఃఖాన్ని అనుభవించారో వారిని తలచుకొంటూ పాటకట్టి ఆ ఎన్నికల ప్రచార సభలో పాడింది కోటేశ్వరమ్మ. అంతకు పూర్వం పాటలు పాడటమే తెలిసిన కోటేశ్వరమ్మ ను కత్తులతో కోలాటమాడిన ఆ కాలం చేసిన గాయం గేయ రచన చేయించింది. గుండె కోతను గానం చేయించింది. ఆ విధంగా కోటేశ్వరమ్మ 1940 ల నాటి ఆంధ్రా తెలంగాణ లను ఏకం చేసిన ఉజ్వల కమ్యూనిస్టు ఉద్యమం నుండి ప్రభవించిన కవయిత్రి. తరువాతి కాలంలో కథారచయిత్రి కూడా అయింది.

కోటేశ్వరమ్మ వ్యక్తిగత జీవితానికి, కమ్యూనిస్టు రాజకీయ జీవితానికి మధ్య ఉన్న విభజన రేఖ చాలా సన్నటిది. ఎంత సన్నటిది అంటే కమ్యూనిస్టు పార్టీలో చిలీకకు వ్యక్తిగా కుమిలి కుమిలి దుఃఖించేంత సన్నటిది. భర్త తన నుండి విడిపోవటం కలిగించిన బాధ వలెనె మనసును మెలిపెట్టిన బాధ ఆ చీలిక. సీతారామయ్యకు, తనకు దగ్గరుండి పెళ్లి జరిపిచినవాడు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, ఉద్యమ గమనంలో స్ఫూర్తి దాత అయిన చండ్ర రాజేశ్వర రావు, గురు తుల్యుడు, పార్టీ నాయకుడు అందరి క్షేమం గురించి, ముఖ్యంగా స్త్రీల గురించి ఆలోచించే పుచ్చలపల్లి సుందరయ్య – ఇద్దరూ ఆమెకు కావలసిన వాళ్ళే. పార్టీ చీలికలో ఇద్దరు చెరొక వైపు అవుతుంటే ఎవరినైనా ఎలా ఒదులుకొనటం అని వేదన పడిన మనిషి ఆమె.

కోటేశ్వరమ్మ గారి తల్లి అంజమ్మ గారికి కూడా కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం అభిమతం కాదు. 1962 నాటికి పూర్తయిన ఈ పరిణామాలపై పాతికేళ్ల తరువాత మరణ శయ్యపై కూడా అదే అభిప్రాయాన్ని చెప్పిందంటే దానిని ఎంత సీరియస్ గా తీసుకొన్నదో అర్ధం చేసుకోవచ్చు. సిద్ధాంత విభేదాలు కారణమనవచ్చు కానీ తాము ఏ పార్టీని ,సిద్ధాంతాలను నమ్మి ఆ వట వృక్ష ఛాయలో ఇంత భద్రత ,బతుకు కు భరోసా పొందటానికి వచ్చారో, అది చీలికలవుతుంటే వ్రేళ్లనుండి పెళ్ల గింపబడిన ఒక వేదనను స్త్రీలు అనుభవించారన్నది వాస్తవం. కలిసి పనిచేసి స్నేహ సాన్నిహిత్యాలు పెంచుకొన్న మనుషులతో ఒక మాట మాట్లాడటమైనా మానటమైనా,కరచాలనం చెయ్యటమైనా మొహం తిప్పుకొని పోవటమైనా పార్టీ అధినాయకత్వం నిర్ణయాలను బట్టే చెయ్యాల్సి రావటం కూడా స్త్రీలకు చాలా దుర్భరమైన విషయం అని డాక్టర్ అచ్చమాంబ గారిపట్ల తాము చేసిన అలాంటి అపచారం గురించి బాధతో తలుచుకొనటం ద్వారా సూచించింది కోటేశ్వరమ్మ. దీనినే పార్టీవ్రత్యం అన్నాడు కాళోజి. పాతివ్రత్యపు బరువును మోయాల్సిన స్థితిలో ఉన్న స్త్రీలకు పార్టీవ్రత్యం అసహన కారణం కావటం సహజమే మరి.

కమ్యూనిస్టు ఉద్యమ భాగస్వామ్య అనుభవాలతో ‘వెలుగుదారులలో’ (2017) అనే స్వీయచరిత్ర వ్రాసిన మరొక మహిళ నంబూరి పరిపూర్ణ. 1931 జులై 1 నాడు పుట్టింది. తండ్రి లక్ష్మయ్య. తల్లి లక్ష్మమ్మ. పరిపూర్ణ కు ఊహ తెలిసే వయసుకే పెద్దన్నకమ్యూనిస్టు రాజకీయాలలో చిన్నన్న స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. ఆ ప్రభావాలతో ఎదిగిన జ్ఞాన చైతన్యాలు ఆమెవి. పరిపూర్ణకు పదమూడేళ్ల వయసుకే కమ్యూనిస్టు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. రాజమండ్రి జైలులో ఉన్న అన్నగారిని కలవటానికి తల్లితో పాటు రాజమండ్రి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో వున్నప్పుడు రంగ స్థల భయం లేక చక్కగా చొరవతో పాడగల పరిపూర్ణ సంగతి తెలిసి ఆమె చేత జన సమూహాలను సమీకరించిన చోటల్లా పాటలు పాడించటం మొదలు పెట్టారు.పార్టీ వారి కోరికపైన తల్లి తిరిగి వూరికి వెళ్ళిపోయినా ఆమె రాజమండ్రిలోనే ఉండిపోయింది. ఆ క్రమంలోనే పార్టీ ఆమె చదువు బాధ్యత స్వీకరించింది.

1943లో పన్నెండు పదమూడేళ్ల పరిపూర్ణ తన చదువు కోసం గుర్తింపు చిహ్నంగా పార్టీ జండాను పట్టుకొని ఒంటరిగా మూడవ తరగతి రైలు పెట్టెలో ప్రయాణించి మద్రాస్ చేరటమే ఒక అద్భుతం అనుకొంటే ఆనాటికే ఆమెకు వంటబట్టిన కమ్యూనిస్టు జ్ఞాన చైతన్యాలు కూడా ఆశర్యకరంగానే అనిపిస్తాయి. ఆంధ్రా వీక్ ఉత్సవాల సందర్భంలో ఆమె పాడిన పాటలు విని, గాన మాధుర్యానికి ముగ్ధుడై నేషనల్ వార్ ఫ్రంట్ రీజనల్ డైరక్టర్ గా పని చేస్తున్నగుర్రం జాషువా పిలిచి వేసవి సెలవలు రెండు నెలలు యుద్ధానుకూల ప్రచారకార్యక్రమంలో పాటలు పాడటానికి ఆహ్వానిస్తే ‘ప్రపంచాధిపత్యం కోసం జతకట్టిన సామ్రాజ్య వాద దేశాలు సాగిస్తున్న యుద్ధాన్ని మన దేశ ప్రజలు ఎందుకు బలపర్చాలి?’ అని ప్రశ్నించి, తిరస్కరించ గలిగిన విలువలు పన్నెండు పదమూడేళ్ళ వయసుకే ఆమె అభివృద్ధి చేసుకోగలిగింది.

పార్టీ అనుబంధ మహిళా సంఘం పనులు చేసింది. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో భాగమైంది. ఇంటర్మీడియట్ చదువుతూ కాకినాడ జిల్లా విద్యార్థి ఫెడరేషన్ లో చురుకుగా పనిచేస్తూ వచ్చింది. 1949 డిసెంబర్ లో రాష్ట్ర మహాసభల కోసం పనిచేసింది. ఆ సందర్భంగానే దాసరి నాగభూషణరావుతో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయమే పెళ్ళికి దారి తీసింది. అప్పటికి ఆమెకు పద్ధెనిమిదేళ్ళు. అయిదేళ్లుగా విప్లవ విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న పరిపూర్ణకు ఉద్యమం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి నుండి పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు అది తన ఆదర్శాలకు, ఆచరణకు బలం చేకూర్చేదిగా అనిపించటం సహజం.

పార్టీ పై ఉన్న నిషేధాల కారణంగా కాపురం అజ్ఞాతవాసంలోనే సాగింది. 1951 మే నెలలో కూతురు శిరీష పుట్టింది. ఇక అక్కడి నుండి కుటుంబ బాధ్యత ను పరిపూర్ణ ఒంటరిగానే మోయవలసి వచ్చింది. ఒక బిడ్డతో మద్రాసులో ప్రవాస జీవితం,ఏలూరు లో రెండవ బిడ్డ అమరేంద్ర పుట్టాక బతుకు తెరువు వెతుకులాటలో ఉపాధ్యాయ శిక్షణ పొందటం ఆదిపూర్తయ్యేసరికి మూడవ సంతానం శైలేంద్ర కలగటం – వాళ్ళ పోషణ కోసం ఉద్యోగాల వెతుకులాట – ఈ క్రమంలో కమ్యూనిస్టు కార్యరంగం నుండి పరిపూర్ణ నిష్క్రమణ అనివార్యం అయింది.

1952 ఎన్నికల సందర్భంలో కూడా మద్రాసు ప్రజానాట్యమండలి చేపట్టిన ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలిచ్చిన పరిపూర్ణను ఒక దశాబ్ది కాలం పార్టీ పనులకు ఒక సాంస్కృతిక కార్యకర్తగా, ఒక విద్యార్థిగా, ఒక మహిళగా తన సమయాన్ని,గొంతును, హృదయాన్ని, బుద్ధిని సమర్పించి పనిచేసిన ఆమెను నీ మానాన నీవు జీవించు అని పార్టీ వదిలేసిందనుకోవాలా? దాసరి అఖిల భారత విద్యార్థి నాయకుడిగా, ఆ తరువాత పార్టీ పూర్తి కాలపు కార్యకర్తగా, నాయకుడిగా ఎదుగుతూ ముందుకు సాగుతుంటే పరిపూర్ణ అదే వేగంతో వెనక్కి, ఇంట్లోకి నెట్టబడింది. మగవాళ్ల జీవితానికి ,ఎదుగుదలకు ఏ రకంగానూ అవరోధం కాని పెళ్లి, పిల్లలు ఆడవాళ్ళ ‘సహజ బాధ్యత’ అయి జీవితాన్ని కుంచింప చేయటంలో పనిచేస్తున్న శక్తి పితృస్వామిక అసమ సాంఘికన్యాయం తప్ప మరొకటి కాదు. దాసరి ఏ కమ్యూనిస్టు క్రియాశీల సౌందర్యాన్ని పరిపూర్ణలో చూచి ఇష్టపడి పెళ్లాడాడో ఆ క్రియాశీలతను ఆమెలో సదా నిలిపి ఉంచటం గురించిన చింతన ఇంతైనా ఆ తరువాత కనబరచ లేకపోయాడంటే అది కమ్యూనిస్టులు కూడా గుర్తించలేకపోయిన లేదా గుర్తించ నిరాకరించిన ఆ పితృస్వామిక దురహంకార లక్షణం వల్లనే అనుకోవాలి.

మల్లు స్వరాజ్యం ఆత్మకథ ‘నా మాటే తుపాకి తూటా’(2019) పూర్తిగా స్వీయ చరిత్ర కాదు. ఆమె జీవన యానం గురించి వచ్చిన వ్యాసాలూ, వివిధ సందర్భాలలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లు ఒక దగ్గర చేర్చేపని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చేపడితే విమల, కాత్యాయని కలిసి దానిని ఆద్యంతాలు ఉత్తమపురుష కథనంతో పుస్తకంగా వ్రాసారు. అందువల్ల దీనికి స్వీయచరిత్ర స్వరూపం వచ్చింది. ప్రధమ పురుషలో వ్రాసివుంటే జీవితచరిత్ర అయ్యేది.

నల్లగొండజిల్లా తుంగతుర్తి మండలంలో కొత్తగూడెం అనే చిన్న వూళ్ళో 1930- 1931 లో పుట్టింది స్వరాజ్యం. తల్లి చొక్కమ్మ, తండ్రి రామిరెడ్డి. భూస్వామ్య కుటుంబం కావటం వలన ఇంటిదగ్గర చదువు దానితో పాటు ఈత, గుర్రపుస్వారీ, వ్యాయామం మొదలైనవాటిని నేర్చు కొనటానికి ఆమెకు అవకాశం లభించింది. అన్నయ్య భీంరెడ్డి నరసింహారెడ్డి, అక్క శశిరేఖ ఆంధ్రమహాసభ కార్యకలాపాలలో ఉంటూ కమ్యూనిస్టు ఉద్యమ పక్షం వహించటం, మేనమామ కొడుకులు కూడా సాయుధపోరాటంలోకి రావటం ఇవన్నీ చిన్నతనంలోనే స్వరాజ్యాన్ని ప్రభావితం చేశాయి. ఊరిలో జరిగిన కూలీల సమ్మె తరువాత పెట్టుకొన్న బాలలసంఘం ద్వారా బలవంతపు కాపురాలకు స్త్రీల మీద తెచ్చే వత్తిడిని, భర్తలు కొట్టటాన్ని తప్పని చెప్పి అడ్డుకొనటానికి చొరవ చూపింది. కమ్యూనిస్టు సాహిత్యం చదివింది. 12 ఏళ్ల వయసులోనే 1942 లో విజయవాడలో జరిగిన రాజకీయ పాఠశాలకు హాజరై వీరుల్ని తయారుచేసేటువంటి ఆ శిక్షణ తనకు నచ్చింది అని చెప్పింది. అందులో దాదాపు 120 మంది స్త్రీలు పాల్గొన్నారని చెప్పింది. 1943 లో అన్నగారి వెంటబడి హైద్రాబాదులో జరిగిన పదవ ఆంధ్రమహాసభకు హాజరైంది. దేశ స్వాతంత్య్రం, చదువు, హక్కులు, మైనర్ లహక్కులు అక్కడ చర్చించబడటం ఆమె గుర్తు పెట్టుకొంది. ఆరుట్ల కమలాదేవితో అక్కడే పరిచయం అయింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు భార్య రంగమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి ఆసభలకు వచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు పనికి తమ వూరు, తమ ఇల్లే కేంద్రంగా ఉండేవని స్వరాజ్యం చెప్పింది.

సంఘ కార్యక్రమాలు మొదలైన రోజుల్లో సంస్కరణ భావాల ప్రచారం జరిగింది. సమాజంలో కుటుంబంలో ఆడవాళ్ళ పరిస్థితి దారుణం. అందువల్ల సంఘం వాళ్ళ సమస్యలమీద పనిచేసింది. కుటుంబంలో,సంఘంలో కట్టుబాట్లు, నిర్బంధాలనుండి స్త్రీలను బయటకు తీసుకొనిరావటానికి పార్టీ పెట్టిన శ్రద్ధ వల్లనే సమానహక్కులు పొందాలంటే ఉద్యమంలో పాల్గొనవలసినదే అన్న అభిప్రాయం స్త్రీలలో బలపడిందని అంటుంది స్వరాజ్యం. సంఘప్రభావంలోకి కుటుంబం వచ్చిందంటే దాని పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొనటానికి తప్పనిసరిగా ఆ ఇంటి స్త్రీలు కూడా తగిన చైతన్యాన్ని, పోరాటపటిమను అభివృద్ధిచేసుకోవలసి ఉంటుంది కనుక పార్టీ స్త్రీలకు రాజకీయ విషయాలలో , ఆత్మరక్షణ పద్ధతులలో శిక్షణ ఇయ్యటం ఒక కార్యక్రమంగా తీసుకొన్నదని చెప్పింది.ఉన్నత మధ్యతరగతి స్త్రీలు కుటుంబకట్టుబాట్లు, బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధ కాపురాలు వంటి సమస్యలనుండి ఉద్యమంలోకి సంఘటితం అయితే శ్రామిక వర్గ మహిళలు వీటికి అదనంగా భూస్వాముల దోపిడీ దౌర్జన్యాల నుండి విముక్తికి ఉద్యమాల బాట పట్టరాని స్వరాజ్యం చెప్పింది. పార్టీ పక్షాన గ్రామాల్లో ఏర్పడిన కమిటీలు మిగిలిన సమస్యలతో పాటు స్త్రీ సమస్యను కూడా చర్చించి పరిష్కరించేదని, స్త్రీల ఆరోగ్య సమస్యల పై శ్రద్ధ పెట్టి తనలాంటి కొందరు పార్టీ వ్యక్తులను విజయవాడకు తీసుకుపోయి కొమర్రాజు అచ్చమాంబ దగ్గర శిక్షణ ఇప్పించారని స్వరాజ్యం చెప్పింది. గ్రామాలలో ఉన్నా అడవిలో ఉన్నా స్త్రీల ఆరోగ్యం, ప్రసవాలు చేయించటం తమ బాధ్యతగా ఉంటూనే వచ్చింది అని చెప్పింది.

1944 లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యం బలపడి నాయకత్వం వాళ్ళ చేతుల్లోకి మారింది. గ్రామపర్యటనలు, రైతాంగజీవిత అధ్యయనం పెరిగాయి. భూస్వామ్య దోపిడీకి అక్రమవసూళ్లకు, వెట్టికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య వంతం చేయటం జరిగింది. ఊరూరా సంఘాలు ఎర్రజెండా నాయకత్వంలో ఏర్పడుతున్నాయి. ఈ దశలో పాలకుర్తిలో చిట్యాల ఐలమ్మ భూపోరాటం మొదలైంది. చాకలివృత్తికి మాన్యంగా వచ్చిన భూమి అయిదుగురు కొడుకులకు చేతినిండా పని కల్పించేది కాకపోవటంవల్ల 40 ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు మొదలు పెట్టింది ఐలమ్మ కుటుంబం. సంఘంలో సభ్యులై వూళ్ళో పటేల్ అధికారాన్ని తిరస్కరించి స్వతంత్రంగా నిలబడటానికి ప్రయత్నించారు. అది కన్నెర్ర అయి పటేల్ విసునూరి రామచంద్రారెడ్డిని వాళ్ళమీదకు పురికొల్పాడు. వాళ్ళను ఆ భూమినుండి బేదఖల్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలకు ఎదురొడ్డి నిలబడటానికి కుటుంబమంతా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఐలమ్మ భర్త, కొడుకులు దొరచేతిలో హింసకు గురయ్యారు. జైలుపాలయ్యారు. అయినా పార్టీ మద్దతుతో ఐలమ్మ పోరాటం కొనసాగించింది. ఆ సందర్భంలో పార్టీ పాలకుర్తిలో, చుట్టుపక్కల అనేక సభలు జరిపి జనశక్తిని సమీకరించింది. ఆ సభలకు అన్న భీం రెడ్డి నరసింహారెడ్డితో పాటు స్వరాజ్యం వెళ్ళింది. మీటింగులలో పాటలు పాడింది. ప్రజలభాషలో, బాణీలో పాటలు కట్టింది. పాటలు పాడుతూ ముప్ఫయ్ కి పైగా ఊళ్ళు తిరిగింది. ఉపన్యాసాలు ఇయ్యటంలో ఆరితేరింది. స్థానిక సమస్యలపై జనాన్ని చైతన్యవంతం చేయటం, పోరాటానికి సహాయంగా జనాన్ని సమీకరించటం, చందాలు సేకరించటం వంటి పనులు ఆమె చేసింది. గ్రామాలలో భూస్వాములకు, పటేల్ పట్వారీలకు, రెవిన్యూ అధికారులకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమయ్యేకొద్దీ హింస నిర్బంధం పెరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితిలో గ్రామరక్షణకు గుత్పల సంఘాలు ఏర్పాటు చేయటంలో స్వరాజ్యం పనిచేసింది. ఆ సంఘాలలోకి స్త్రీలు చొరవగా రావటం, పనిచేయటం, తుపాకీ పట్టి గెరిల్లా పోరాటాలలో పాల్గొనటానికి చూపిన ఉత్సాహాన్ని ఆమె నమోదు చేసింది. దళాలకు రక్షణగా కాపుకాయటం, అన్నాలు మోయటం స్త్రీలు చేసారని అవి పోరాటానికి ఎంతో ముఖ్యమైనవని అభిప్రాయపడింది.

1946లో కడివెండిలో గొర్లను మేకలను మేపుకొనటానికి కట్టవలసిన పన్నుకు వ్యతిరేకంగా జరిగిన వూరేగింపుపై విసునూరి రామచంద్రారెడ్డి దాడి చేయించిన ఘటనలో దొడ్డికొమురయ్య తూటదెబ్బకు నేలకొరిగిన అనుభవం నుండి సాయుధ పోరాట అవసరం ముందుకు వచ్చింది. గుత్పలతో వడిశెలతో సరిపోదని ఆయుధశిక్షణ ఇచ్చింది పార్టీ. పిండిప్రోలు అడవుల్లో ఆ రకంగా గెరిల్లా శిక్షణ తీసుకొన్న స్త్రీలలో స్వరాజ్యం ఉంది. ఏరియా కమిటీ ఆర్గనైజర్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహించింది. ఆడవాళ్ళతో పనిచేయటానికి, చేయించటానికి సంసిద్ధంగా లేని ఏరియా ఆర్గనైజర్లను సవాల్ చేస్తూ పనిచేసింది. కాసర్లపాడులో రాజక్క, చిల్పకుంట్లలో లక్ష్మి మొదలైన కార్యకర్తలు దళాలను కాపాడి ఊరుదాటించటంలో చూపిన చొరవను, వివేకాన్ని అభిమానంతో ప్రస్తావించింది. సాధారణ ప్రజలు కూడా దళాల పట్ల బాధ్యతగా ప్రవర్తించిన ఘటనలను ఆమె నమోదు చేసింది.

కమ్యూనిస్టు ఉద్యమంలో రహస్య జీవితం శ్రామిక వర్గం నుండి వచ్చిన ఆడవాళ్లకు సులభం అన్నది ఆమె పరిశీలన. వాళ్ళు ఎక్కడైనా కలిసిపోయి కనిపెట్టరాకుండా ఉంటారు. కానీ పై కులాలనుండి, వర్గాల నుండి వచ్చే స్త్రీల రంగు రూపు భాష వాళ్లకు అవరోధం అవుతుందని కరణాల కుటుంబం నుండి వచ్చిన లలితమ్మ ను ఉదహరిస్తూ చెప్పింది. ఈ లలితమ్మ దేవులపల్లి వెంకటేశ్వరరావు మేనమామ కోడుకు తిరుమలరావు భార్య అయివుంటుంది. (మనకు తెలియని మనచరిత్ర).

4.

మనకుతెలియని మనచరిత్ర లో 22 మంది స్త్రీలు, ఆరుట్ల కమలాదేవి, వేటపాలెం వెంకాయమ్మ కలిసి 24 మంది. స్వీయ చరిత్రలు ఐదైనా కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం మనకుతెలియని మనచరిత్రలోని 22 మంది స్త్రీలలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు గోపరాజు సీతాదేవి, శ్రీ రంగమ్మ, నంబూరి పరిపూర్ణ. వాళ్ళతో కలిసి మొత్తం 27 మంది. ఈ స్త్రీలు కమ్యూనిస్టు ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు? స్త్రీపురుష సమానత్వ ఆకాంక్ష వాళ్ళను ఆ వైపు నడిపించిందా ? ఆ ఆకాంక్షా పరిపూర్తికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో, కార్యక్రమంలో అవకాశం ఉందని వాళ్లకు ఎలా తెలిసింది? అలాంటి అవగాహన ఏమీ లేకుండానే ఉద్యమంలోకి వచ్చేసారా? వచ్చాక వాళ్ళ అవగాహన మారిందా? అన్న ప్రశ్నలతో వీళ్ళ అనుభవాలను పరిశీలించవలసి ఉంది.

ఈ ఇరవై ఏడుమందిలో 11 మంది శ్రామిక వర్గాల నుండి వచ్చిన మహిళలు. భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ఐలమ్మ నుండి వ్యసాయం పనులతో పాటు కూలీనాలీ పనులు చేసుకొనే వేటపాలెం వెంకాయమ్మ మొదలైనవాళ్లు అనివార్యమైన జీవితావసరాల నుండి సహజన్యాయ ఆకాంక్షలనుండి భూస్వామ్య దోపిడీ నుండి విముక్తి కి పోరాడే పార్టీ కనుక కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. స్త్రీపురుష వివక్ష గురించిన అవగాహన కానీ, కమ్యూనిస్టు పార్టీ దానికి ఇచ్చే పరిష్కారం గురించి కానీ వాళ్లకు తెలుసు అనుకోలేము. వీళ్లల్లో వెంకాయమ్మకు తప్ప మిగిలినవాళ్లకు అవసరమూ అనివార్యమూ అయిన తక్షణ ఆచరణ తప్ప పార్టీని నడిపించే సిద్ధాంతాన్ని గురించిన పరిజ్ఞానం ఉన్నట్లు కనబడదు.

మిగిలిన పదహారుమందిలో ఇద్దరు ముస్లిములు. వాళ్లిద్దరూ పన్నెండు పదమూడు ఏళ్లకే తండ్రి ఉదరభావాలు, స్వదేశీ ఉద్యమప్రభావాలు కారణంగా సరైన పాఠశాల చదువు లేకపోయినా పత్రికలు, పుస్తకాలు చదివే అలవాటు చేసుకొన్నారు. బాజీ పెళ్లి వల్ల హైదరాబాద్ కు రావటం రజియాకు కూడా కొత్తప్రపంచాన్ని తెలుసుకొనటానికి కారణమైంది. ప్రమీలా తాయి అనాధ కావటం వల్ల కుటుంబ ప్రభావాలేమీ లేవు. సమాజాన్ని చూస్తూ స్వతంత్రంగా తానీ ఉద్యమం వైపు వచ్చింది. బ్రిజ్ రాణి హైద్రాబాదులో ఒక వెనకబడ్డ కుటుంబం నుండి వచ్చినా సరోజినీనాయుడి గురించి వింటూ ఆమెను ఆదర్శంగా పెట్టుకొని పెరిగింది. చిన్నతనంలోనే అయిన పెళ్లి వల్ల అత్తింటి హింస తట్టుకోలేక బయటకు వచ్చి సామాజిక కార్యకర్తగా ఎదుగుతూ, చదువుకొంటూ తనంతట తానుగానే కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చింది.

ఈ నలుగురు పోగా మిగిలిన పన్నెండు మందిలో నంబూరి పరిపూర్ణ తప్ప మిగిలిన వాళ్లంతా భూస్వామ్య వర్గంనుండి, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ మొదలైన సంపన్న అగ్రవర్ణాల నుండి వచ్చినవాళ్లు. అందరూ చదువుకొన్నవాళ్ళు. వాళ్ళ కుటుంబాలలో అప్పటికే రాజకీయాలలో పనిచేస్తున్న వాళ్లున్నారు. వాళ్ళ ప్రభావంతో వీళ్ళు కూడా కమ్యూనిస్టు రాజకీయాలను అభిమానించారు. ప్రియంవద, సుగుణ, మల్లు స్వరాజ్యం, గోపరాజు సీతాదేవి, నంబూరి పరిపూర్ణ ఇంట్లో అన్నల రాజకీయాకార్యచరణ చూస్తూ ప్రభావితమై తామూ ఆ వైపే నడిచారు. స్త్రీ పురుష వివక్ష కూడనిది అనే చైతన్యంతొ అక్కచెల్లెళ్ల అభివృద్ధికి, సామాజిక జీవితంలోకి చొరవగా ప్రవేశించటానికి వాళ్ళిచ్చిన నైతిక ధైర్యం అందుకు ఉపయోగపడింది. మానికొండ సూర్యవతి వంటి వాళ్ళను (పెసర సత్తెమ్మ, వేటపాలెం వెంకాయమ్మ) తండ్రుల రాజకీయ చైతన్యం వేలుపట్టి నడిపించింది. కొండపల్లి కోటేశ్వరమ్మ, అచ్చమాంబ, మోటూరి ఉదయం, లలితమ్మ, ఆరుట్ల కమలాదేవి, శ్రీరంగమ్మ భర్తల ప్రభావంతో ఉద్యమంలోకి వచ్చారు. ఎవరినిచూస్తూ ప్రేరణ పొందినా, ఎవరి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో వచ్చినా అతికొద్దికాలంలోనే వాళ్లంతా ఆ ఉద్యమానికి హృదయమిచ్చి పనిచేసే స్ఫూర్తిని పొందారు. ఒక్క శ్రీరంగమ్మ మాత్రమే భర్తను అనుసరించి నడుచుకునే సంప్రదాయ స్త్రీ నమూనాలో భర్త రాజకీయాలను ఆమోదించింది, సహకరించింది కానీ వ్యక్తిగా తాను ఆ కమ్యూనిస్టు రాజకీయాల పట్ల అభిమానం పెంచుకోలేక పోయింది.

5.

జీవితాలు అనుభవాలు ఈ 27 మందివే అయినా వాళ్ళు ప్రముఖంగా ప్రస్తావించిన బుల్లెమాంబ, అంజమ్మ, కొమర్రాజు అచ్చమాంబ, ద్రోణవల్లి అనసూయ, రాములమ్మ, నాగమ్మ రాజక్క, లక్ష్మి మొదలైన స్త్రీల అనుభవాలు కూడా వాటితో కలగలిసి కనిపిస్తాయి.

‘నిర్జనవారిధి’లో కోటేశ్వరమ్మ ప్రస్తావించిన అనేకమంది తోటి మహిళా ఉద్యమ కార్యకర్తలలో అంజమ్మ ఒకరు. ఆమె కోటేశ్వరమ్మకు తల్లి. బిడ్డకు పునర్వివాహం జరిపించి ఆమె సుఖం చూసుకోవాలన్న సాధారణ ఆకాంక్షా స్థాయి నుండి అంజమ్మ నిర్బంధకాలంలో కమ్యూనిస్టు పార్టీ డెన్ ల నిర్వహణ బాధ్యతలు చూసుకోగలిగిన స్థాయికి ఎదగటం ఆశ్చర్యం కలిగించక మానదు.కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం కారణంగా సీతారామయ్య ఇంటిదగ్గర వుండే పరిస్థితులు లేనప్పుడు కూతురు ఒంటరిగా పడుతున్న ఇబ్బందులు చూసి తోడుగా ఉండాలని వచ్చిందామె. చాలా సహజంగా కూతురితో పాటు పార్టీ పనులలో భాగస్తురాలైంది. 1944 అఖిల భారత రైతు సభలు జరిగినప్పుడు ఎన్నోరకాల పచ్చళ్ళు పెట్టి సభల భోజనాలకు అందించటమేకాదు కూతురితో పాటు ఆమె కూడా వాలంటీర్ గా పని చేసింది. కమ్యూనిస్టు మహిళలను అల్లరిపెట్టే రౌడీ మూకలను ఎదుర్కొనటంలో చొరవ గా పని చేసింది. కూతురు కూడా రహస్య జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆమె పిల్లలను చూసుకొనటంతోపాటు పార్టీకి అవసరమైన సేవలు అందిస్తూనే ఉంది. రహస్య స్థావరాలలో కార్యకర్తలకు వండిపెట్టటమే కాదు, కొందరికి తల్లిగా వ్యవహరిస్తూ .. డెన్ ను ఒక ఇంటివలే తలపింపచేసేది. ఒక దశలో రహస్య కార్యకలాపాల నిర్వహణలో అంజమ్మగారికి ఉన్న చొరవ, చాతుర్యం మరే మహిళకు లేదని పార్టీ నాయకులే అభిప్రాయ పడటం చూస్తాం. పార్టీ అవసరాల కోసం కోటేశ్వరమ్మ సరే… అంజమ్మ కూడా ఉన్న బంగారమంతా ఇచ్చేసింది. ఇటువంటి అనేకమంది తనకాలపు మహిళల సమున్నత ఆచరణ గురించి కోటేశ్వరమ్మ గర్వపడింది.

కోటేశ్వరమ్మ, మానికొండ సూర్యావతీ కూడా ప్రస్తావించిన మరొక మహిళ బుల్లెమాంబ (బుల్లెమ్మ) ఆమె మానికొండ సూర్యవతికి అత్తగారు. కాంగ్రెస్ రాజకీయాలలో జైలుకు వెళ్లివచ్చింది. కొడుకు కోడలు కమ్యూనిస్టు రాజకీయాలలో ఉండటం వల్లనో లేక తనకున్న రాజకీయచైతన్యం వల్లనో ఆమె కూడా కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చింది. విజయవాడలో కమ్యూన్ నడిపింది. పార్టీ పనులమీద వచ్చిపోయేవాళ్లకు, చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారకార్యక్రమాలు నిర్వహించి ఏ రాత్రికో వచ్చే కార్యకర్తలకు అది భోజన వసతి గృహం. బుల్లెమ్మ ఆ గృహ నిర్వాహకురాలు వచ్చిపోయేవాళ్ల సంఖ్యను బట్టి, ఏపూట ఎందరు ఉంటారో చూసుకొంటూ వంటలు చేయటం చేయించటం, కొసరి కొసరి పెట్టటం, ఏ రాత్రి వచ్చినా తలుపులు తీసి పండో , మజ్జిగో ఇచ్చి ఆదరించటం ఆమె చేసినపనులు. పార్టీ మీద నిర్బంధం పెరిగి మహిళాసంఘం పత్రిక ఆంధ్రవనిత నిషేధానికి గురైనప్పుడు నిరసనగా మహిళలు చేసిన ఊరేగింపులో ముందుభాగం ఉండి జైలుకు కూడా వెళ్ళింది బుల్లెమ్మ. అంజమ్మ, బుల్లెమ్మ ఇద్దరూ తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో మాక్సిం గోర్కీ అమ్మగా పేరుపొందారు.

కోటేశ్వరమ్మ, సూర్యవతీ ఇద్దరూ ప్రస్తావించిన మరొక వ్యక్తి కొమర్రాజు అచ్చమాంబ. ఆమె కొమర్రాజు లక్ష్మణరావు కూతురు. భండారు అచ్చమాంబకు మేనకోడలు. కాంగ్రెస్ జాతీయోద్యమ రాజకీయాల ప్రభావాలనుండి కమ్యూనిస్టు సిద్దాంతాన్ని అభిమానించి పార్టీలోకి వచ్చిన విద్యావంతురాలు, వైద్యురాలు కొమర్రాజు అచ్చమాంబ. ఆంధ్రప్రాంతలో పార్టీ విస్తరణకు విజయవాడ లో ప్రాక్టీస్ ప్రారంభించింది. మహిళా ఉద్యమ నిర్మాణంలో స్త్రీల ఆరోగ్యం విషయంలో ఆమె శ్రద్ధపెట్టి పనిచేసింది. ఉద్యమంలోకి వచ్చిన యువతులు పుట్టిళ్లకు వెళ్లి పురుళ్ళు పోసుకొనటానికి గానీ కన్నవాళ్ళే పురుడుపోయటానికి రావటానికి గానీ అవకాశం లేని ఆ పరిస్థితులలో మీ అమ్మ లేకపోతే నేను లేనా అని తన ఇంటినే వాళ్లకు పుట్టిల్లు చేసింది అచ్చమాంబ. పురుళ్ళుపోసి మందులిచ్చి పంపేది. కొండపల్లి కోటేశ్వరమ్మ వంటివాళ్ళు అంతా పురుళ్ళు పోసుకొని బిడ్డలను ఎత్తుకొన్నది అక్కడే. మహిళా కార్యకర్తల శిక్షణాశిబిరాలలో స్త్రీ ఆరోగ్యం, ప్రసూతి శిశుపోషణ గురించి శిక్షణ ఇచ్చింది. ఉద్యమ అవసరాల కోసం ఎంతోమంది స్త్రీలకు నర్సు ట్రైనింగ్ ఇచ్చింది. మహిళాసంఘం పత్రిక నిషేధానికి గురైనప్పుడు జరిగిన నిరసన ఊరేగింపులో ఆమె కూడా ఉంది. అరెస్టయింది. జైలులో కూడా ఆమె స్త్రీల, పిల్లల ఆరోగ్యం పట్ల పట్టింపుతో జైలు అధికారులతో గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో, మహిళా సంఘాలలో పనిచేస్తున్న స్త్రీలను తక్కువచేసి అవమానకరంగా మాట్లాడే రాజకీయ పక్షాలకు వ్యక్తులకు దీటైన సమాధానాలు ఇచ్చిందని గోపరాజు సీతాదేవి స్వీయ చరిత్ర చెప్తుంది. కొమర్రాజు అచ్చమాంబ జీవితాచరణ, దృక్పథం ఇతివృత్తంగా ఓల్గా ‘గమనమే గమ్యం’అనే నవల వ్రాసింది(2016).

సూర్యావతి ప్రస్తావించిన మరొక ఉద్యమకారిణి ద్రోణవల్లి అనసూయ. నిర్బంధ కాలంలో మహిళాసంఘం పత్రిక నిషేధానికి గురైనప్పుడు జరిగిన నిరసన ఊరేగింపులో ఆమె ఉందని సూర్యావతి పేర్కొన్నది. అనసూయ అప్పుడు పదహారు రోజుల బాలింత. ఎవరో మామిడి పళ్ళు తీసుకొని చూడటానికి వస్తే వాళ్లకు కొడుకుని ఇచ్చి ఆమె ఊరేగింపులో పాల్గొన్నది. మిగిలిన వాళ్ళతో పాటు ఆమెనూ అరెస్టు చేసి నందిగామ జైల్లో పెట్టారు. తాగే పిల్లవాడు దగ్గర లేక రొమ్ములలో పాలు గడ్డకట్టి జ్వరపడింది. మూడోరోజు విడుదల ఐనవాళ్లలో ఆమె ఉంది కానీ మళ్ళీ ఆ తరువాత కొన్ని నెలలు అరెస్టు చేసి ఏలూరు జైల్లో పెట్టారు. పిల్లలు తనతోపాటు ఉండాలని లేకపోతే వదిలేయాలని పెట్టిన ఒత్తిడి ఫలితంగా రెండు సంవత్సరాల పాపను, ఆరునెలల బాబును ఆమె దగ్గరకు చేర్చారు. జైలులో పిల్లలకు రేషన్ సరిగా దొరకక పిల్లవాడు జబ్బు పడటం కూడా జరిగింది. ఎవరీ అనసూయ? ఊహ తెలిసినప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంతో నడుస్తూ, ఒక కమ్యూనిస్టును స్వీయ నిర్ణయంతో పెళ్ళాడి, ప్రేమించి ఇద్దరు బిడ్డల తల్లి అయి అతని మార్గంలో తానూ ఉద్యమకారిణయి, పాతికేళ్ళ వయసులో భర్తను కోల్పోయిన స్త్రీ. కమ్యూనిస్టు పార్టీ తనను డెన్ కీపర్ గా పంపాలని చూసినప్పుడు ఆడపని, మగపని అనే పితృస్వామిక లైంగిక పని విభజన పద్ధతిని నిరాకరిస్తూ తాను దళాల్లోకి వస్తానని పట్టుబట్టిన వ్యక్తి. అన్నాలు వండి డెన్ చూసుకొనటం, కొరియర్లుగా ఉత్తరాలు అందించటం ఎంత పార్టీ పనులే అయినా అవి స్త్రీల చైతన్యాన్ని పెంచేవి కావని ఆమె నమ్మకం. అవకాశాలలో సమానత్వం ఆమె ఆకాంక్ష

ఉద్యమ బాధ్యతలలో భర్త అమరుడైనా, నాలుగేళ్ళ తరువాత కలిసిన పిల్లలతో తనదైన కుటుంబం నిర్మించుకోవాలని అనిపించకపోవటం, కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించకపోయినా గ్రామాలలో తిరుగుతూ ప్రజల సమస్యలకు సమాధానాలు వెతికే పని చేసింది.పార్టీ పక్షాన ఎన్నికలలో పోటీ చేసింది. ఇల్లూవాకిలి పట్టక, సరైన తిండి లేక నాలుగేళ్లపాటు పార్టీ పనిలో తిరుగుతూ ఆరోగ్యం కోల్పోయి ఒంటరితనపు నిస్పృహ లోకి జారిపోయినా మళ్ళీ 1982లో కృష్ణలంక భూపోరాటాలలో క్రియాశీల భాగస్వామి అయి రైతుకూలీసంఘ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టటం ద్వారా 1940ల నాటి కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వాన్ని వేటపాలెం వెంకాయమ్మ వలెనె పీపుల్స్ వార్ తరానికి అందించింది. ఆమె ఉద్యమజీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పడుగూపేకలవలె అల్లి నల్లూరి రుక్మిణి ‘మేరువు’ నవల వ్రాసింది(2019).

మల్లు స్వరాజ్యం చెప్పిన రాములమ్మ 1946లో భర్తతో పాటు పార్టీలోకి వచ్చింది. రెండేళ్ల తరువాత భర్త పార్టీని విడిచిపెట్టినా ఆమె విడిచిపెట్టలేదు. మిలటరీ శిక్షణ తీసుకొని దళంలో పనిచేసింది. నాగమ్మ తుపాకీ ఎత్తంత కూడా ఉండదుకానీ, రైఫిల్ పట్టాల్సిందే అని పట్టుబట్టి శిక్షణ తీసుకున్నది. తుపాకీ పేల్చడంలో నైపుణ్యం సంపాదించింది. పోలీసుల నుండి తుపాకులు సంపాదించేందుకు చేసిన దాడిలో ఆమె చూపిన చొరవవల్లనే అది విజయవంతం అయింది. కాసర్లపాడు రాజక్క సూర్యాపేట తాలూకా కాసర్లపాడు గ్రామంలో సంగంలో పనిచేస్తున్నది. ఒకసారి గ్రామాలలో కమిటీల ఏర్పాటు భూముల పంపకం పని అదీ చూసి స్వరాజ్యం మరో ఇద్దరితో కలిసి కాసర్లపాడు రాజక్క ఇంట్లో పడుకున్నది. పోలీసులు వచ్చి ఊరును చుట్టుముడితే ఆ ఊళ్ళోనే ఒక వాళ్ళ ఇంట్లో షెల్టర్ లో ఉన్న లలితమ్మను రక్షించటానికి ఆ ఇంట్లో ముసలాయనను చనిపోయినట్లు కింద గడ్డి పరిచి పడుకోమని చెప్పి ఆడవాళ్లను చుట్టూ కూర్చుని ఏడవమని చెప్పి పోలీసులు అక్కడ ఇల్లు చొరకుండా ఉపాయం చేసింది. స్వరాజ్యాన్ని పిడకల గూట్లో దాచింది. ఆ ఊరివాడే అయిన దళ కమాండర్ దొరికిపోతే పట్వారీ వచ్చి గుర్తుపట్టి చెప్తే ప్రమాదమని ‘ఆవులన్నీ ఈడ్చుకొనిపోయి జొన్న చేలో పడితే ఎం చేస్తున్నావ్’ అని తిడుతూ, మీదబడి కొడుతూ కట్లు విప్పేసి అతన్ని తరిమివేసి కాపాడింది. కొట్టవచ్చిన పోలీసును తన్ని తప్పించుకొని పోయిన ఉపాయశాలి, ధైర్యశాలి.

మల్లు స్వరాజ్యమే చిల్పకుంట్లలోని గౌండ్ల లక్ష్మి గురించి చెప్పింది. ఊళ్ళో నాయకత్వమంతా అరెస్ట్ అయినాక సంఘం నాయకురాలు ఆమే అయింది. ఆమె వితంతువు. ఒకసారి స్వరాజ్యం రాత్రి ఆమె ఇంట్లో పడుకున్నది. తెల్లవారేసరికి పోలీసులు ఊరిని చుట్టుముట్టినవార్త. అప్పుడా లక్ష్మిస్వరాజ్యం చేతికి ఉన్న గాజు గాజులు తీసేసి తనచేతికి ఉన్న వితంతువులు మాత్రమే వేసుకొనే వెండి కడియాలు ( ముండకడియాలు అని స్థానికంగా అంటారు) ఆమె చేతులకు తొడిగి కల్లు ముంత చేతికిచ్చి ఎవరు ? ఎటు పోతున్నారు? అని ఆరా తీసే వాళ్లకు పోలీసులకు కల్లు గావాలె అంటే తీసుక పోతున్నాము అని చెప్తూ స్వరాజ్యాన్ని వూరు దాటించింది.

వీళ్ళను కలుపుకొంటే కమ్యూనిస్టు ఉద్యమాన్ని తమభాగస్వామ్య కృషితో ఉన్నతంగా నిలబెట్టినవాళ్లు 35 మంది (27+8). వీళ్ళెవరూ ప్రస్తావించకపోయినా వీళ్ళతో కలిపి చెప్పుకోవలసిన మరొక స్త్రీ వట్టికొండ విశాలాక్షి. ఆమెతోకలిసి వాళ్ళు 36 మంది.

వట్టికొండ విశాలాక్షికమ్యూనిస్టు పార్టీ సిద్దాంతం పట్ల నిబద్ధతతో, ఆ పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో జరిగిన అరసం ప్రథమ మహా సభలో ప్రకటించబడిన కార్యవర్గంలో ఆమె కూడా ఉన్నది. నిబద్ధకవి, నవలా రచయిత. ఆమె వ్రాసిన నవల ఖైదీ కాంగ్రెస్ పత్రికలో(1952) ప్రచురించబడింది. ఈ నవలలో కథాకాలం స్థూలంగా 1940 వదశకం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కమ్యూనిస్టుపార్టీ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఏర్పరుస్తూ ప్రజాపునాదిని బలపరుచుకొంటూ చురుకుగా పనిచేస్తూ, నిషేధానికి, నిర్బంధానికి గురిఅవుతూ,అజ్ఞాత వాసం చేస్తూ, రాజ్యహింసకు గురవుతూ, కార్యకర్తలను కోల్పోతూ చరిత్ర సృష్టించిన కాలం. 1948 నుండి 1951వరకు ఆంధ్రదేశంలో పోలీసురాజ్యం నడిచిన కాలం. అయితే ఆ కాలపు చరిత్ర కన్నాఆ చరిత్ర నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల అంతరిక సంఘర్షణలు, సంబంధాలు ఇందులో ప్రధానం. ఒక ఆడ రాజకీయ ఖైదీ, ఒక జైలు ఆసుపత్రి డాక్టర్ వీళ్లిద్దరి స్నేహం, సంభాషణలు, సంబంధం,ఒకరి గురించి ఒకరి మనసు లో చెలరేగే అంతః సంఘర్షణలు ఈ నవల కు ఇతివృత్తం సమకూర్చాయి.

ఖైదీ, డాక్టర్ – ఈ ఇద్దరి ముఖంగా జైలు జీవిత చిత్రం రేఖామాత్రంగా పరిచయం అవుతుంది ఈ నవలలో. జైలు వార్డెన్ల అధికారం నిర్ణయించబడిన జైలు భృతిలో కొంత కాజెయ్యటం మహిళా ఖైదీకి అనుభవ విషయాలు. జైలులో డెటెన్యూలను సి క్లాసు ఖైదీలకన్నా కన్నా కష్టం గా చూసే తీరు డాక్టర్ ప్రత్యక్షంగా చూసింది. నేరగాళ్లు, నిందితులు, శిక్షలు అనుభవిస్తున్నవాళ్ళు మానవులే కనుక సర్వ మానవ హక్కులు వాళ్లకు కూడా వర్తిస్తాయి. ఆ ఎరుకతో వాళ్ళు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. ఇదేమని ప్రశ్నించినందుకు బలప్రయోగం చేసే జైలువ్యవస్థ గురించి, ఆత్మరక్షణకు పూనుకొంటే తిరుగుబాటు అని అంతకుముందున్నకొద్దిపాటి సౌకర్యాలు కూడా రద్దుచేసిఇబ్బంది పెట్టటం గురించి ఖైదీ నిరసన స్వరంతో ప్రస్తావిస్తుంది. ఖైదీలకు ఇంటిదగ్గరనుండి వచ్చే ఉత్తరాలు ఇయ్యక సతాయించటం, ఇళ్లకు ఉత్తరాలు రాసుకోనియ్యకుండా నిషేధం పెట్టటం గురించి ఆమె ఆందోళన పడుతుంది. లోపలివాళ్ళకు ఏమి జరుగుతున్నదో బయటివాళ్లకు, బయటవాళ్ళకు ఏమి జరుగుతున్నదో లోపలివాళ్ళకు తెలియక కలిగే ఆందోళన సంగతి ప్రస్తావిస్తుంది.

ఖైదీలు తమనెందుకు హీనంగా వివక్షాపూరితంగా చూస్తున్నారని ప్రశ్నించినందుకు అధికారులు వాళ్లపై కాల్పులు జరపటం ప్రత్యక్షంగా చూసినవాడు డాక్టర్. కొందరు మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను చూసి కదిలి పోయిన సున్నిత హృదయుడు డాక్టర్. జైలు ఆసుపత్రిలో రోగులకు కావలసిన మందులు ఉండకపోవటం కూడా గమనించినవాడతను. ఇలాగైతే ఎలాగని పైవాళ్లను అడిగితే ఎదో ఒకటి ఉన్నవే సర్ది వాడమని ఆజ్ఞలు పంపే తీరును గర్హించినవాడతను.

రాజకీయ ఖైదీలకు విముక్తి ఎప్పుడు? అన్న విచికత్సలో డాక్టర్ మాటకు సమాధానంగా ‘ప్రపంచంలో ప్రజలకు బాధలనేవి ఉన్నంతవరకు మా సంకెళ్లు సడలవు. ప్రపంచంలోని ప్రజలంతా తమ కష్టాలకు కారణాలు తెలుసుకొని వాటి నివారణకు పూనుకున్నప్పుడే .. వారి సుఖాలకు ఆటంకంగా ఉన్న కటకటాలతో పాటు మా కటకటాలు కూడా పెకిలించబడతాయి.’ అని ఖైదీ చెప్పిన సమాధానం సోషలిస్టు ఆచరణకు సంబంధించినది.

ఈ ఆచరణ ఆదర్శం అయినప్పుడు వ్యక్తిగత సుఖాలు, సంతోషాలు దాని ముందర అల్పమైనవి, వదులుకోవలసినవి అవుతాయి. అయితే అది అంత సులభమా? ఈ ఆదర్శంతో ప్రారంభమైన వ్యక్తులలో కోరికలు చెలరేగ కుండా ఆపగలమా? ఆదర్శాలకు, కోరికలకు మధ్య ఘర్షణలో మనుషులు ఎంత నలిగిడి పడతారో ఈ నవల చూపించింది.

ఆలాగే ఆమె నిష్కామయోగి నవల(1956) ఇతివృత్తంలో భర్త ప్రోత్సాహంతో కమ్యూనిస్టు పార్టీ రాజకీయ పాఠశాలకు హాజరై పార్టీ మహిళా సంఘం కోసం పనిచేస్తూ అనుబంధ రచయితల సంఘంలోనూ చేరిన స్త్రీ ఆ భర్తకు సంస్థలో ఒకరితో వచ్చిన విభేదం కారణంగా అతనితోపాటు తానూ రచయితల సంఘం నుండి వైదొలగాలన్న ఒత్తిడికి లోనైనప్పుడు పడిన ఘర్షణ కూడా భాగం అయింది. అది ఆమె స్వీయ జీవితానుభవం.

మల్లు స్వరాజ్యం ఆత్మకథ ఒక లంబాడి స్త్రీని, ఒక కోయ స్త్రీని ప్రస్తావించింది. పొయ్యి దగ్గర రొట్టెలు చేసుకొంటున్న లంబాడీ స్త్రీ పోలీసులను తప్పించుకొంటూ వచ్చిన స్వరాజ్యాన్ని అక్కడ కూర్చో బెట్టి చేసిన రొట్టెలు వాళ్ళో వేసుకొని ఇంటి గడపదాటి పోలీసులకు ఎదురుబోయి తనబిడ్డ బాలింత అని చలికి పొయ్యిదగ్గర కూర్చుని రొట్టెలు చేస్తున్నదని కావాల్నంటె ఈ రొట్టెలు తినండి అంటూ తన వొళ్ళో రొట్టెలన్నీ వాళ్ళకిచ్చి ఆపద గట్టెక్కించింది.

కోయస్త్రీ పసిబిడ్డ తల్లి. స్వరాజ్యం ఒక సారి ఆమె గుడిసెలో షెల్టర్ తీసుకొన్నది. పోలీసులు గుడిసెను చుట్టేసిన సమయంలో వాళ్ళను ఆపటానికి కోయస్త్రీ బయటకు పోతే ఉయ్యాల్లో ఉన్న ఆమె బిడ్డను ఎత్తుకొని జనం మధ్య నుండి బయటపడింది స్వరాజ్యం. కోయ స్త్రీనే స్వరాజ్యం అని అనుకొని పోలీసులు పట్టుకొని బాగాకొట్టారు. నేను కాదు అని ఆమె మొత్తుకొంటే స్వరాజ్యం జాడ చెప్పమని వేధించారు. అయినా ఆమె నోరు విప్పలేదు. జైల్లో కూడా ఉంచారు కొంతకాలం. స్వరాజ్యం తీసుకుపోయిన ఆమె చంటిబిడ్డ చనిపోయింది. స్వరాజ్యం తనవల్ల ఆమెకు కలిగిన కష్టానికి, నష్టానికి దుఃఖిస్తుంటే ‘నిన్ను మీ అమ్మ ప్రజల కోసం వదిలిపెట్టలేదా?’ అని ఎదురు తానే స్వరాజ్యాన్ని ఓదార్చిన అసాధారణ మహిళ ఆ కోయ స్త్రీ.

ఇట్లా పేరులేని మరొక మూడు నాలుగువందలమంది గురించి ఆరుట్ల కమలాదేవి, ప్రియంవద, లలితమ్మ ప్రస్తావించారు. వారు వరంగల్ జైలులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజకీయ ఖైదీలు వాళ్ళు. కమ్యూనిస్టులకు అన్నాలు పెట్టారని, సద్దులు మోసారని, దాచారని అనుమానంతో తీసుకొచ్చిన స్త్రీలు వాళ్ళు. పార్టీలో ఉన్న బంధువుల ఆచూకీ కోసం ఎనభైఏళ్ల వృద్ధమహిళను కూడా బాగా హింసించారని, అయినా ఆమె ఏమీ చెప్పలేదని వాళ్ళు పేర్కొన్నారు. ఇలాంటి పేరు లేని స్త్రీలు అనేకులు ‘నేను సైతం’ అంటూ ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు చేసిన పని కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కీలకమైనది.

6.

కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ విధమైన స్త్రీల క్రియాశీలభాగస్వామ్యం నాలుగు కార్యక్షేత్రాలకు విస్తరించి కనిపిస్తుంది. 1. మైదాన ప్రాంతంలో పార్టీ నిర్మాణ నిర్వహణ రంగం. 2. మహిళాసంఘ నిర్మాణ నిర్వహణ రంగం. 3. సాంస్కృతిక వైజ్ఞానిక రంగం. 4. సాయుధ పోరాట రంగం. అయితే ఒకరు ఒకరంగానికే పరిమితమై పనిచేయటం తక్కువ. అవసరాన్ని, సందర్భాన్ని, సామర్ధ్యాన్ని బట్టి ఒకరే అన్ని కార్యక్షేత్రాలకు విస్తరించటం కూడా చూడవచ్చు.

పైన పేర్కొన్న 36 మందిలో లలితమ్మ, శ్రీరంగమ్మ మాత్రం మీటింగులకు హాజరుకావడంతో, భర్తలను అనుసరించటంతో సరిపుచ్చుకొన్నారు. ప్రత్యేక కార్యరంగం ఏదీ ఎంచుకొని పనిచేయలేదు. మిగిలిన 34 మందిలో సగానికి పైగా పార్టీ నిర్మాణ నిర్వహణ విధులలో భాగం అయ్యారు. గ్రామాలకు తిరగటం, స్థానిక ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ సంఘటితం అయ్యేట్లు చూడటం, ఆయా సందర్భాలలో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయటం, ప్రజల విశ్వాసాన్నిసంపాదించి ఆయాగ్రామాలలో పట్టు సాధించటం పార్టీ కార్యకలాపాలకు వేదిక సిద్ధం చేయటం దగ్గర నుండి, స్థానిక పార్టీ బాధ్యుల మధ్య వార్తలు, ఉత్తరాలు చేరవేసే కొరియర్లుగా పనిచేయటం, పార్టీ పనులమీద వచ్చిపోయే వివిధ ప్రాంతాల కార్యకర్తల కోసం కమ్యూన్ లు నిర్వహించటం, అజ్ఞాత నాయకులను, కార్యకర్తలను ఇళ్ళల్లోనో, పొలాలనో దాచి కాపలా కాయటం, అన్నం కూరలు వండి చేరవేయటం, వాళ్లకు అవసరమైన వస్తువులు, డబ్బు, ఆయుధాలు సమీకరించి అందించటం, కొరియర్లను ఏర్పాటు చేయటం, రహస్య జీవితంలో డెన్ లను నిర్వహించటం ఇవన్నీ పార్టీ నిర్మాణ నిర్వహణలో భాగమైన అనేకానేక పనులు.

ఐలమ్మ, వేటపాలెం వెంకాయమ్మ భూపోరాటాన్ని, కార్మికవర్గ పోరాటాన్ని నిర్మించటంలో భాగమై పార్టీ లక్ష్యాన్ని ఆచరణవాస్తవంగా మార్చారు.ప్రియంవద సుగుణమ్మ, ప్రమీలా తాయి, కొండపల్లి కోటేశ్వరమ్మ, మోటూరి ఉదయం, బ్రిజ్ రాణి, పెసర సత్తెమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, రాజక్క మొదలైన స్త్రీలందరూ ఈ విధమైన పనులలో నిమగ్నమైనవాళ్ళే. అంజమ్మ, బుల్లెమ్మ కమ్యూన్లను, డెన్ లను నడిపి మాక్సిం గోర్కీ అమ్మ వలే అందరి మన్ననను పొందారు.

కొండపల్లి కోటేశ్వరమ్మ, ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం వంటివాళ్ళు మహిళలను సమీకరించి చైతన్య పరిచే పనిలోనూ ఉన్నారు. మహిళా సంఘాల కోసమూ పనిచేశారు. కొండపల్లి కోటేశ్వరమ్మ తాపీ రాజమ్మ మొదలైన వాళ్ళతో కలిసి ఆ పని మీద ఊరూరూ తిరిగింది. అయినా మానికొండ సూర్యావతి, గోవిందరాజు సీతాదేవి, నంబూరి పరిపూర్ణ మొదలైన వాళ్ళు మహిళా సంఘాలకోసం ప్రత్యేకం పనిచేశారు. మహిళా సంఘాలు పెట్టటం, సభ్యులను చేర్చటం, స్త్రీల గౌరవకరమైన జీవితానికి పురోగమనానికి అవరోధంగా ఉన్న సామాజిక సమస్యల మీద స్త్రీలను చైతన్య పరచటం, వాటి నుండి విముక్తిని కోరే స్త్రీలకు అండగా నిలబడటం, మహిళా సంఘానికి ప్రత్యేక పత్రికను నిర్వహించటం మొదలైన పనులు వాళ్ళు చేశారు నంబూరి పరిపూర్ణ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో క్రియాశీల పాత్ర వహించింది.

సాంస్కృతిక వైజ్ఞానిక రంగం లో పనిచేయటం అంటే పార్టీ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణమైన సామాజిక రాజకీయ భావజాలానికి పాట, నాటకం, బుర్రకథ, సాహిత్య రచన మొదలైన సాంస్కృతిక కళారూపాలతో ప్రచారం కల్పించటం. పార్టీ మనుషులకు, ప్రజలకు కూడా విద్యా వైద్య సేవలుఅందించటం.

సభలలో అయినా, గ్రామాలలో ప్రజలను సమీకరించటానికైనా పాట తొలి పిలుపు ఆవుతుంది. మల్లు స్వరాజ్యం పాటలు కట్టింది. పాడింది. కోటేశ్వరమ్మ, నంబూరి పరిపూర్ణ మొదలైన వాళ్లంతా పాటను ఆయుధంగా చేసుకొన్నవాళ్ళే. పార్టీ సాంస్కృతిక అవసరాల కోసం స్త్రీలు సామాజిక మూస చట్రాలనుండి బయటపడి నాటకాలలో స్త్రీపాత్రలు ధరించటానికి ముందుకు రావాలని మద్దుకూరి చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు కోటేశ్వరమ్మ సందేహాలన్నీ వదిలి ముందుకు వచ్చింది.కన్యాశుల్కంలో మీనాక్షి పాత్ర ధరించి మెప్పించింది.ఇక వెనుకడుగు లేదు. ముందడుగు నాటకంలో నాయిక పాత్ర ధరించింది. కరువుకాలం వస్తువుగా వున్నఇదీలోకం నాటకంలో ఆమె ధరించిన పాత్ర గరికపాటి రాజారావు మన్ననలు పొందటమే కాదు, ఎన్నో బహుమానాలు పొందింది. జోశ్యభట్ల సుబ్బమ్మ, కొమర్రాజు పద్మావతి మొదలైన స్త్రీలు ఆమెతో పాటు నాటకాలలో నటించారు.

బాజీ రజియా వంటి స్త్రీలు అభ్యుదయ రచయితల సంఘం వేదికగా పార్టీ పనులను చేస్తే వట్టికొండ విశాలాక్షి 1943 లోనే సంస్థ ఆశయాలను ప్రతిబించే అభ్యుదయగీతాలు ప్రచురించింది. “కోట్లకొలదిగ నొక్కడు కూడ బెట్టి / కులుకుచుండగ నెందరో కూలిజనులు/పవలు రేయును కష్టించి పని యొనర్చి / కుదువ కూడైన లేమిచే కుములుచుండ” భావకవిత్వం, ప్రణయకవిత్వం వ్రాయటం భావ్యం కాదంటూ కొత్త కవిత్వానికి దారులు తీసింది. సామ్రాజ్యవాదమును చంపి వేయాలి / ఫాసిస్టు శత్రువును పాతిపెట్టాలి” అని రెండవ ప్రపంచయుద్ధ సందర్భం నుండి పిలుపు ఇచ్చిన కవి ఆమె.

కాస్త చదవటం, వ్రాయటం వచ్చిన స్త్రీలు డెన్ లలో పార్టీ రహస్య సర్క్యులర్లు కాపీలు తీస్తూ ఉండేవాళ్ళు కోటేశ్వరమ్మ, సుగుణమ్మ మొదలైనవాళ్లు అలా చేసినవాళ్ళే. కమలమ్మ, అచ్చమ్మ, స్వరాజ్యం మొదలైనవాళ్లు వైద్యశిక్షణపొంది దళాలకు దళాలకు తిరిగి వైద్యం చేసినవాళ్ళే. వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చిన డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ విజయవాడ కేంద్రంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ విస్తరణలలో కీలకపాత్ర వహించింది. ఆరకంగా స్త్రీలు సాంస్కృతిక వైజ్ఞానిక దళాలుగా 40వ దశకంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మేధోసృజనాత్మక శక్తులను సమకూర్చారు.

కొమర్రాజు అచ్చమాంబ ఆనాడు కమ్యూనిస్టు పార్టీకి సైద్దాంతిక వైజ్ఞానిక వెన్నుబలమైతే మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ద్రోణవల్లి అనసూయ, రాములమ్మ, నాగమ్మ మొదలైనవాళ్లు సాయుధపోరాటంలో భాగమై పార్టీ ఆశయాన్ని ఆచరణగా పరివర్తింప చేయటానికి ముందుపడ్డారు. స్వరాజ్యం దళాలను, గ్రామ పరిపాలనను నిర్వహించే ఏరియా కమిటీ బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరింది. పార్టీనిర్మాణం, మహిళాసంఘాల నిర్మాణం, సాంస్కృతికవైజ్ఞానిక, సాయుధ పోరాట రంగాలను – తమ భాగస్వామ్య చరిత్రతో సముజ్వలం చేసిన స్త్రీలు స్త్రీలు కావటం వల్ల ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యలు లేకపోలేదు.

బహిష్టు సమయపు సమస్యల దగ్గర నుండి గర్భస్రావాలతో బాధలు పడేవాళ్లుగా గర్భవతులుగా, పిల్లలతల్లులుగా, పార్టీ కోసం పిల్లలను వదిలేసుకొనే వాళ్ళుగా, డెన్ లలో రహస్య జీవితంలో వేరువేరు వ్యక్తులతో కలిసి ఉండే సందర్భాలలో లైంగిక అత్యాచారాల ప్రమాదాలను ఎదుర్కొనవలసిన వాళ్ళుగా, లైంగిక అవినీతి ఆరోపణలను ఎదుర్కొనవలసినవాళ్లుగా, అలాంటి ఇబ్బందులకు పరిహారంగా పార్టీలో ఎవరినో ఒకరిని పెళ్లిచేసుకోమని వచ్చే పెద్దల సలహాలు పాటించవలసిన వాళ్ళుగా, ఆజ్ఞలు తలదాల్చవలసినవాళ్లుగా ఏదో ఒక స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. కొమర్రాజు అచ్చమాంబ దగ్గరనుండి, వరంగల్ అచ్చమ్మ వరకు ఎవరూ దీనికి మినహాయింపు కాదు.

“సమానత్వం అన్న భావన మాకు పార్టీయే కలిగించింది. స్త్రీలు, పురుషులు ,దళితులు అందరూ ఒకటేనని హెచ్చు తగ్గులుండకూడదని చెప్పింది” అని కమ్యూనిస్టు పార్టీ పై గొప్ప గౌరవంతో చెప్పిన కొండపల్లి కోటేశ్వరమ్మ అదే సమయంలో పార్టీ ఆదర్శాల మేరకు ఆచరణ వాస్తవంలో లోపలి మనుషులు ఎంత ఎదగగలిగారు అన్న విమర్శనాత్మక ప్రశ్న కూడా వేసింది. స్త్రీ పురుష సమానత్వాన్ని సైద్ధాంతికంగా అంగీకరించినా స్త్రీలు ఎక్కడైనా ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం వారిలో పురుషాధిక్య భావం కనిపించేదని ఆమె గుర్తించి చెప్పింది. స్త్రీల మీద ప్రత్యేకమైన ద్వేషం గానీ, వారిని అణచిపెట్టాలనే ఉద్దేశంగానీ లేకపోయినా ఈ సమాజం కల్పించిన ఆభిజాత్య భావం వెంటనే పోదుకదా … అని దానిని వదిలించుకొనటానికి చేయవల్సిన దీర్ఘకాలిక సాంస్కృతిక పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది. ఏది ఏమైనా మామూలు పురుషులకంటే వారు మెరుగే నని సమాధానపడుతుంది. అయితే కమ్యూనిస్టు అయిన ప్రతివాడు ఆ సమానత్వ సూత్రాన్ని గట్టిగా నమ్మి ఆచరణలో పెట్టాలని ఆమె వాంఛిస్తుంది. ఆ దిశగా సాగాల్సిన గమనమే కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నఆనాటి స్త్రీల ఆకాంక్ష. ఆ వారసత్వాన్ని సమున్నతంగా వర్తమానంలో కొనసాగిస్తున్న విప్లవోద్యమ మహిళల ఆచరణ.

(2022 సెప్టెంబర్ 19 నాడు విశాఖపట్నంలో చేసిన కొండపల్లి కోటేశ్వరమ్మ స్మారక ఉపన్యాసం)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల భాగస్వామ్య చరిత్ర (1934 -1952)

  1. ఈ వ్యాసంలో చాలామందిని ప్రస్తావించారు. కాని, ఇందులో “అమరజీవి” అనభేరి ప్రభాకర్ రావు గారి భార్య సరళాదేవి గారి గురించిన ప్రస్తావన అసలే లేకపోవడం ఆశ్చర్యకరం మరియు విచారకరం.

    ఆమె కరీంనగర్ లో పార్టీకి, ఉద్యమానికి చేసిన సేవయేగాక, ప్రభాకర్ రావు గారి మరణానంతరం ఆయనపై వ్రాసిన చందమామ పాట (150 పైగా చరణాలు) కందము, సీసములేగాక వృత్తపద్యాలు వంటి విభిన్న పద్యాలను రాసిన కవయిత్రిగానైనా సరళాదేవి గారి పేరును ప్రస్తావించక పోవడం శోచనీయం.
    – డా. వెల్ముల కృష్ణారావు, ఇంటిపేర్ల పరిశోధకుడు, నిఘంటుకారుడు 20+ సాహిత్య ప్రక్రియలు మరియు విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనరు 7780733021 vkrao57gst@gmail.com

Leave a Reply