మనసును కదిలించే ‘అపురూప’ కథలు

సమాజంలో అట్టడుగు వర్గం నుంచి ఉన్నత కులస్తునితో సహజీవనంలోకి వెళ్తే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయోనని కలవరపడిన ఉద్యమ నేపథ్యం గల యువతి అంతరంగాల కథ. పోరాటంలోని తోబుట్టువు పిలుపునందుకుని వృద్ధులైన తల్లిదండ్రులను, కన్న పసిబిడ్డను వదిలి అడవి చేరిన ఓ చెల్లె విషాదాశ్రువుల స్ఫూర్తి. అసమ సమాజంలో ఒకరు ప్రాణ త్యాగానికి సిద్ధపడితే, మరొకరు విలువైన ప్రాణాలు మింగడానికి ఎందుకు సిద్దపడుతున్నారు ఓ తల్లి పదునైన ప్రశ్నల తాత్వికత. తామెంచుకున్న దారిలో అమరులైన కన్నపేగు స్మృతుల్ని, వాళ్ల ఆశయాలు నెరవేర్చడం కోసం తల్లులు పడుతున్న తపనే ఈ కథలు. చీకటి సమాజంలో కాంతులు నింపే పున్నమి కోసం వెన్నెల దారుల్లో తుదకంటూ సాగిన ఓ యువతి జీవిత కథ ఉంది. పోరులో ప్రాణమిచ్చిన వీరులు అనాథలు కాదు. వారి చరిత్రను ఎత్తిపడుతూ బంధుమిత్రుల కృషిని తెలిపే అపూర్వమైన హృదయ గాధలు. ప్రతీ కథ కన్నులు తడవకుండా పేజీ తిరిగేయలేనివి. బాధా సారుప్యత కలిగిన కథలు పాఠకులను సైతం తమ వెంటే తీసుకువెళ్లే ప్రభావం కలవి. సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో నడుస్తున్న కార్యకర్తలు, పాఠకులు చదవడం ద్వారా నూతన ఉత్తేజం అందిస్తాయి.

అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు పద్మకుమారి ఏడేళ్లలో మే, 2013 నుంచి డిసెంబర్, 2019 వరకు రాసిన పదకొండు కథల సమాహరమే ‘అపురూప కథలు’ ఈ పుస్తకంలో ముద్రించిన పదకొండు కథలు ఒక ప్రత్యేకమైన దృక్పథంతో రాశారు. కథల్లో విభిన్న సంఘర్షణలను ఎత్తిపట్టినట్లు మనకు కనిపిస్తుంది. ప్రజా ఉద్యమాల్లో అమరులైన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వివిధ సంధర్భాల్లో పడిన మానసిక సంఘర్షణను రచయిత్రి చక్కగా చిత్రిక పట్టారు. ఈ కథలన్నింటికీ వాస్తవికతే నేపథ్యంగా వస్తువు ఉండటం పాఠకులను బాగా ఆకట్టుకుని ఆలోచనల్లో పడేస్తుంది. తెలంగాణ పల్లెలో ఎన్కౌంటర్లయితే పోరులోకి వెళ్లిన తమ బిడ్డల కోసం ప్రతీ తల్లిదండ్రులు ఎంత తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తారనే కథలు తెలియజెబుతాయి. ఒక్క ఎదురుకాల్పుల ఘటన ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే, వందలాది ఉద్యమకారుల తల్లులు, పిల్లలు, భార్యల ముఖంలో దిగులు మేఘాలు ఎలా అల్లుకుంటాయో హృద్యంగా చెప్పారు. అపురూపంగా తమ చేతుల్లో పెరిగిన బిడ్డల ఆనవాళ్లే గుర్తింపు దారులు. ఎన్కౌంటర్ మృతదేహాలను గుర్తించడానికి చిత్రమైన వారి ముఖాలను చూస్తూ గుండెలవిసిపోయాలా పోయే వర్షిస్తాయి

ఎన్కౌంటర్ మృతదేహాలను ప్రీజ్ బాక్స్ ల్లో భద్రపరచకుండా నిర్లక్ష్యంగా రాజ్యం వ్యవహరించిన తీరును కలచివేస్తుది. చివరకు డెడ్ బాడీస్ పురుగులు పడి, కుళ్ళి కంపు వాసన వెదజల్లుతున్న శవాలను ముట్టకుండా రాజ్యం చేస్తున్న కనపడని హింసను పద్మకుమారి చక్కని కథనంలో చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగితేనే గజగజ వణికిపోయే గ్రామాలు, అమరుల తల్లిదండ్రులకు మృతదేహాల స్వాధీనం కోసం “బంధుమిత్రుల సంఘం’ కృషిని ప్రజలు స్ఫూర్తిగా తీసుకుంటారు. విలువైన సామాజిక స్వప్నం కోసం ప్రజాపోరాటాల్లో అమరత్వం పొందిన వీరుల మరణవార్తలను, వారి కుటుంబాల శోకసముద్రంలో తాను భాగమై బాధాసారుష్యంతో రాసిన కథలు కావడం వల్ల ప్రతీ కథ కన్నీటి చుక్కలు రాల్చకుండా ముందుకు కదలనీయదు. దుఃఖపూరిత మరణ సమయ ఇతివృత్తాలకు చెందిన కథలు కావడం వల్ల చదువుతున్న క్రమంలో పఠిత మనసులు బరువెక్కుతాయి. కదుపు కోతకు గురైన తల్లుల వేదినాభరితమైన పరిస్థితులను పాఠకుల కళ్ల ముందు దృశ్యమానం చేయడంలో రచయిత్రి చక్కని శైలీ నిపుణతను పాటించారు. ప్రతీ కథ వాస్తవికత నేపథ్యం కలిగిన అమూల్యమైన గాథ. ఇలాంటి కథలను సాధారణ రచయితలకు రాయడం సాధ్యం కాదు. ఒక సామాజిక దృక్పథం, భావసారూప్యం కలిగిన రచయిత్రి కావడంవల్లనే ఎంచుకున్న వస్తువును శిల్పాన్ని సమన్వయం చేయడంలో సఫలమయ్యారనడంలో అతిశయోక్తి లేదు. రాజ్యం చేస్తున్న హింసలో మహిళలు తమ ప్రమేయం లేకుండానే ఎంతటి తీవ్రమైన మానసిక ఘర్షణకు గురవుతున్నారనేది కథల్లో గమనించవచ్చు. 144 పుటల్లో ఆకట్టుకునే అందమైన ముఖచిత్రంతో జనవరి, 2020 లో ముద్రించారు. కథలకు ముందుమాటలుగా ‘చూపు’ కాత్యాయనీ, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ ‘అపురూప’ కథలు నేపథ్యంగా నిలిచిన చారిత్రక, సాహిత్య ప్రత్యేకతలను వివరించడం ప్రారంభ మెరుపు.

ప్రజా రాజకీయాల నేపథ్యంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన సరోజ అగ్రవర్ణానికి చెందిన మధుతో సహజీవనానికి ముందు కుటుంబంతో తన నేపథ్యం చెబుతుంది. మధు వాళ్ల అక్క సరోజ కులం తెలిసి అవాక్కవుతుంది. మధు తండ్రి గంభీర మౌనంగా ఉంటాడు.

మధు కుటుంబంలో సరోజ బాధ్యతలకు, ఆమె చూపే ఆప్యాయతకు ఫిదా అవుతాడు.సరోజ, మధు కులాంతర వివాహం చేసుకున్న వీళ్లను తాను పుట్టి పెరిగిన ఊల్లో సరోజను పరిచయం చేయాలని ఆమె మామయ్య కోరిక తీరకుండానే చనిపోవడం సరోజ, మధును తీవ్రంగా వారిలో కలిచివేస్తుంది. నిమ్న కులాల నుంచి వచ్చి తాను అగ్రకుల సహచరుని ఇంటిలో ఎలా ఉంటానోనని అనుకున్న సరోజ, మామయ్య పట్ల చూపే ఆదరణ ఆ కుటుంబంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో ఓటమిపాలై స్వతంత్ర ఆలోచనలతో సమాజంలో తాను ‘ఉండాల్సిన తీరును తెలుసుకున్న ధనలక్ష్మీ జీవితం, పెళ్ళైన ఏడాది జీవితంలో ఓ కొడుక్కు జన్మనిచ్చిన ధనలక్ష్మికి తన భర్త వైఖరితో జీవితం పొసగక తల్లిగారింటికి చేరుతుంది. భర్త ఆస్తిలో వాటా కోసం కోర్టుకు వెళ్లాలనుకుంటుంది. ‘వాడినే కాదనుకున్నంక వాడి ఆస్తి మనకెందుకు’ ధనలక్ష్మికి తన సోదరుడు రమేష్ సలహా ఇస్తాడు. ఉన్నతంగా చదువుకొని టీచర్ గా పనిచేస్తూనే అజ్ఞాత పోరులో ఉన్న తన అన్న రమష్ లోపలకు రమ్మని పిలుపునిస్తాడు. తన పసి కొడుకు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు అడ్డువస్తాయి. చివరకు సమాజం కోసం అర్థవంతమైన జీవితమే గొప్పదిగా భావించి అడవి దారి పడుతుంది. ఉద్యమంలో బీమల్ దాదాగా పనిచేస్తున్న రమేష్ ఓ ఎదురుకాల్పుల ఘటనల్లో తీవ్రంగా గాయపడి ధనలక్ష్మీని చూసి సన్నని చిరునవ్వుతో అతని కన్నుల్లో వెలుగు అవుతుంది. ఉద్యమ కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్లు ఉండవలసిన తీరును చెబుతుందీ కథ. గుక్కు తిప్పకుండా పాఠకుల చేత చదివిస్తుంది.

మెట్రోపాలిటన్ నగరం నుంచి ఉద్యమంలోకి వెళ్లి అమరత్వం పొందిన ప్రజాగాయకుడు ప్రభాకర్ కుటుంబ సభ్యుల కన్నీటి జ్ఞాపకాల్లో ‘పయనిసంస్కారాల పరామర్శ సందర్భాలను కథలోకి అర్ద్రంగా చిత్రించిన కథనం. పోరాటంలో వాళ్ల అడుగుజాడలను, ఆదర్శాలను, రచయిత నేర్పుగా చెప్పడంలో పద్మకుమారికే సాధ్యం. అమరుల తల్లిదండ్రులు, సహచరుల వేదనాభరిత సమయాల్లో తాను బాధ్యురాలుగా ఆవేదనను అనుభవించక తప్పదు. దుఃఖభరిత సమయాలను అంతే తడి, స్ఫూర్తివంతమైన కథనంగా తీర్చిదిద్దడం అనితర సాధ్యం. తమ కొడుకులు ఆడి పాడిన జాగలు గుర్తుకొస్తాయి. తల్లీకొడుకు జాడలతో తాదాత్మీకరణం చెందుతారు. ఆ మనోవేదనలు ఒక్క తల్లివి కాదు దేశవ్యాప్తంగా కడుపుకోతకు గురవుతున్న అమ్మల గాథ ‘పయనించిన పాట’లో ఆవిస్కృతమయింది. భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ చేసి, విప్లవోద్యమంలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఓ అమరుని తల్లి పడిన మానసిక సంఘర్షణాత్మక కథనమే ‘వెలితి’. విప్లవంలోకి వెళ్లిన శరత్ తల్లికి ఉత్తరం రాస్తాడు. “మీరెవరు నన్ను అపార్థం చేసుకోరని నమ్ముతున్నాను. నేను ఇక్కడ మీలాంటి మనుషుల మధ్యనే ఉన్నాను. కాకపోతే నేను మీతో లేననే ‘వెలితి’ ఇరువురిని బాధిస్తుందంటాడు శరత్. సమాజం గర్వించే పనిలో ఉన్నానని అనుకోవడం ద్వారా తానులేని లోటును అధిగమించమని తల్లిని కోరుతాడు. శరత్ మరణంతో రాధమ్మ మనిషికాకుండా పోతుంది. ఏనాటికైనా తన కొడుకు కల నిజమవుతుందని కన్నీరు పెడతుంది. కథలో సమాజంలో ప్రశ్నించలేని అభద్రమైన ఆక్రోషం కనిపిస్తుంది. కన్నబిడ్డలు భౌతికంగా దూరమైనప్పటికీ బిడ్డల ప్రేమాస్పదమైన జ్ఞాపకాలు తల్లులను వెంటాడుతున్న దుఃఖాన్ని చిత్రించారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన సాంబిరెడ్డి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు, అమరుల బంధు మిత్రులు బెల్లంపల్లి నుంచి బీజాపూర్ కి చేరుకోవడానికి పడిన కష్టాలు ‘ప్రయాణం’లో గుగుర్పాటుకు గురవుతాం. విప్లవోద్యమంలో పనిచేసి పొరుగు రాష్ట్రాల్లో చనిపోయిన అమరుల రక్తసంబంధీకులు పోలీసుల భయోత్పాతం వల్ల శవస్వాధీనానికి ముందుకురారు. ఇక్కడ బంధుమిత్రుల సంఘం చొరవ, కృషితో అమరుల శవాలు స్వాధీనం చేసుకొని అమరుల స్ఫూర్తిని ఎత్తిపట్టడానికి వారు చేస్తున్న ‘ప్రయాణం’లోని సాహసాలు, భయాలను పద్మకుమారి కళ్ల ముందుంచారు. ప్రతీ మనిషి జీవితంలో కన్నీళ్లు మంచులా గడ్డకట్టి దుఃఖ సమయాల్లో జ్ఞాపకాల నదులై ప్రవహించే గాథ పాఠకుడిని ఉత్కంఠకు గురిచేస్తుంది. ఇరవై ఐదేళ్ల సాంబిరెడ్డి ఉద్యమ జీవితాన్ని ప్రజలు ఎట్లా మననం చేసుకుంటారో కళ్లకు కడతారు. చత్తీస్ ఘడ్ లో సల్వాజుడుం మూకల దాడులు ఎంత దారుణంగా ఉంటాయో అనుభంలోంచి చిత్రించిన కథనం కన్నీళ్లు పెట్టిస్తుంది.

తల్లి అంటే అమోఘమైన ప్రేమ ఉన్నప్పటికీ, తండ్రి బాటలో నడవటంలోనే జీవిత సత్యముందని, విప్లవంలోకి వెళ్లిన పదేళ్లకు అమరుడైన మున్నా కోసం తల్లి ‘నిరీక్షణ’. ఈ కథలో బెజ్జంగి అమరుడు మున్నా తల్లి కడుపుకోత ఇతివృత్తం. ‘నాకు అవన్నీ తెలుసమ్మా, దొరికితే చిత్రహింసలతో చనిపోతానని, కానీ నలుగురి కోసం పోరాడుతూ చనిపోవడంలో విలువ ఉంది కూడా అనేవాడు. అలా బతికితే ఒక్క రోజైనా చాలు అనేవారని తల్లి కన్నీరుమున్నీరవుతున్న, మున్నా సమాధి పక్కనే మరో రెండు ఎర్రరంగులో సమాధులు ఉంటాయి. ఓ తండ్రి సమాధుల పక్కనే పూల మొక్కలు నాటి రోజు నీళ్లుపోస్తాడు. పూలంటే ఇష్టమైన పిల్లల కన్నీటి జ్ఞాపకాల్లో తల్లిదండ్రులు ఎట్లా జీవిస్తారో చెబుతుంది. వరంగల్ లో ఎన్ కౌంటర్ అయిన విద్యాసాగర్ తల్లి లతమ్మ, తండ్రి సుధాకర్ రెడ్డి వేధనా భరిత ఇతివృత్తమే ‘కడుపుకోత’. పోరాటంలో అమరత్వం పొందిన బిడ్డల కృషిని, స్ఫూర్తిని సభలు, సమావేశాల్లో తల్లిదండ్రులు విన్నపుడు తల్లిదండ్రులకు ఆత్మసైర్యం పెరుగుతుంది. విద్యాసాగర్

పుట్టుక అగ్రకులమైనా బతుకు కడుదారిద్రమే కావడం విశేషం. అమరుల బంధుమిత్రుల సభకు హైదరాబాద్ వచ్చిన లతమ్మ దంపతులు కొడుకులు కోల్పోయిన తల్లుల దుఃఖభరిత కథలు అందరికీ ఉన్నాయని తెలుసుకుంటుంది. పిల్లలను అన్యాయంగా చంపుతున్నా అడిగే నాధుడే లేదని ప్రశ్నిస్తోంది.

ఉద్యమాల్లో కొడుకులను కోల్పోయిన తల్లి చివరి గడియల్లో కూడా చనిపోయిన కొడుకు వస్తాడని కలువరిస్తున్న మాటలు ఏ మనిషినైనా కదిలిస్తుంది. ఇరవై ఏళ్ల రాజవ్వ కొడుకు వేణు విప్లవోద్యమంలో ముప్పై ఏళ్ల క్రితం అమరుడవుతాడు. ఉన్నంతలో పదిమందికి తలలో నాలుకలా బతికింది రాజవ్వ. అదేవాడకు చెందిన దేవక్క మంచి సోపతి, దేవక్క కొడుకు సూర్యం ఉద్యమంలో అమరుడైనాడు.

విప్లవోద్యమానికి కొడుకులు అందించిన తల్లుల భావసారూప్యతకు వాళ్లను దగ్గర చేసింది. ఉద్యమ కుటుంబాలు అంతిమ సంస్కారాలను ఎర్రజెండా కప్పి సాగనంపే నూతన విలువలను తమ జీవితాల్లో ప్రజలు భాగం చేసుకుంటున్న సంస్కృతిని చక్కగా వెల్లడించారు. ఒంటరి తల్లుల దుఃఖసమయం ఎంత ధీనంగా వుంటుందో పద్మకుమారి ఒడుపుగా ‘తల్లి కోరిక’ను చిత్రించారు. జీవితంలోని వాస్తవిక విషాదాలను కరుణ రసభరితంగా చిత్రించడం వెనక రచయితకు బాధాసారుప్యం నుంచి ఎంచుకున్న వస్తువే శిల్పం నిర్మించుకునేలా చేశారు. పోరాటంలో అమరత్వం చెందిన రవికి ఇద్దరు తల్లులు. అయితే పోలీసులకు భయపడి ఆయన శవాన్ని తీసుకోవడానికి ఆయన సోదరులు ఎవరూ ముందుకు రారు, చివరాఖరికి అంత్యక్రియల కోసం వసంత, రవి డెడ్ బాడీని పోలీసుల అనుమతితో స్వాధీనం చేసుకుంటుంది. రజితతోపాటు పైడిపల్లిలో రవి మృతదేహం ఖననం కోసం ఊరేగింపు వెళ్తుంది. ఇరవై ఏళ్లుగా ఎన్నడు చూడని కొడుకు కడచూపు కోసం తల్లులు పైడిపల్లికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనే కథనమే ‘ముగ్గురు తల్లులు’.

విప్లవోద్యమంలో ఉన్న పున్నం, కాంతం పార్టీ అనుమతి దళంలో పెళ్లి చేసుకుంటారు. పున్నం చేసుకున్న వెసెక్టీ ఫెయిల్ కావడంతో కాంతం గర్భందాలుస్తుంది. పార్టీ నియమావళికి లోబడి అబార్షన్ చేయించుకోవడం? బిడ్డను కనడం? అనేది నీవే తేల్చుకోమని పున్నం సూచిస్తాడు. చివరకు అబార్షన్ కోసం బయటకుపోతుంది. అబార్షన్ కుదరకపోవడంతో ఓ టీచర్ సాయంతో బిడ్డకు జన్మనిస్తుంది కాంతం. మళ్లీ విప్లవోద్యమంలోకి వెళ్లాలని కాంతం పుట్టిన బిడ్డను తీసుకొని అడవిలో దళాన్ని కలుస్తుంది. మాతృత్వానికి విప్లవోద్యమంలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా అనుభవించి బిడ్డను బంధువులకు ఇవ్వడానికి బయటకు వస్తుంది. దగ్గరి వాళ్లు ఎవరూ తీసుకోకవపోడంతో తానే బిడ్డను సాకాల్సి వస్తుంది. సకాలంలో పార్టీ అపాయింట్ మెంట్ దొరక్క కాంతం బయటే ఉండిపోతుంది. కాలక్రమంలో పున్నం ఎన్కౌంటర్ చనిపోతాడు. కాంతం ఒంటవుతుంది. డిసిఎం సభ్యుడు రవి కూడా ఎదురు కాల్పులలో చనిపోతాడు. రవి సంస్మరణ సభ వరంగల్ లో జరుగుతున్నట్లు తెలియడంతో సంఘం వాళ్ల సభకు బిడ్డ వెన్నలతో కలిసి పున్నం హాజరవుతుంది. ఈ కథలో మాతృత్వం ఉద్యమ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించడానికి ఆ బంధాలకు దూరంగా ఉండాలని ‘కాంతం పున్నం వెన్నెల’ కథ చెబుతుంది.

ఈ కథల పుస్తకానికి శీర్షికగా నిలిచిన కథ ‘అపురూపం’గా వుంటుంది. సింగరేణి కొలువు చేస్తున్న నారాయణ, దుర్గమ్మ దంపతుల కొడుకు సుధాకర్ ఒక్కడే. యవ్వనంలోనే పోరుదారిలోకి వెళ్లి విప్లవం లో పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్లకు కొడుకు రమ్మంటే వెళ్తారు. అడవికి వెళ్లి కొడుకు కోడలును చూసి సంబరపడిపోతారు. కొన్నాళ్లకు కొడుకు, కోడలు ఎదురుకాల్పుల్లో చనిపోతారు. తల కొరివి పెట్టాల్సిన కొడుక్కు తానే కొరివి పెట్టాల్సి రావడం పట్ల నారాయణ కన్నీరు పెడతాడు. అయితే అంత్యక్రియలకు తన మనుమరాలు ఒకరు హాజరైందని తెలుస్తుంది. తమను మందలించకుండా మనవరాలు వెళ్ళి పోవడం పట్ల ఒంటరి తనానికి దిగులు పడతారు. మనవరాలును కలవాలని ఆశపడుతున్న తరుణంలోనే జంట వృద్ధదంపతులను తీసుకొని ‘అపురూప’ తన తాత నారాయణ ఇంటికి వస్తుంది. దీంతో వృద్ధుల్లో కొత్త సంతోషం కలుగుతుంది. ఉ ద్యమకారులు అజ్ఞాతంలో పిల్లలు కలిగితే రహస్యంగా అవసరాల రిత్యా పెంచడం తప్పదు. అమరత్వం తర్వాత వాళ్ల రక్తసంబంధీకులను కలవడం, పెంచినవాళ్లను కూడా మరవకుండా ఉమ్మడిగా కలిసి జీవించడం గొప్ప సామాజిక ఐక్యత మార్పును కథ ద్వారా రచయిత బోధించారు.

సామాజిక ఉద్యమాల్లో ఉన్న కార్యకర్తలు తప్పకుండా చదవాల్సిన కథలు. అమరులైన తమ పిల్లల స్వప్నాలు, వారి ఆలోచనా విలువలను తల్లిదండ్రులు ఎంతగా గౌరవిస్తారో తెలుసుకోవడానికి ఈ కథలను చదవితేనే తెలుస్తుంది. ఈ కథలను పూర్తిగా చదివితే మీలో మానవీయ విలువలు ఏమేరకు జీవించి ఉన్నాయో తెలుసుకోవడానికి అపురూప కొలమానం ఈ కథల పుస్తకం.

ప్రతులకు:
డివి రామకృష్ణారావు
ఎం.ఐ.జి. 14, APIC Colony,
కార్బైడ్ కంపెనీ ఎదురుగా, మౌలాలి.
హైదరాబాదు-500 040
Cell: 9989189250.
₹.150/-

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

7 thoughts on “మనసును కదిలించే ‘అపురూప’ కథలు

  1. సమీక్ష బాగుంది.

  2. సమీక్ష బాగుంది. కథల ఇతివృత్తాలు గొప్పవి. మహిళా రచయితలు అరుదు. అందులోనూ ఉద్యమ నేపథ్య రచనలు చేసేవారు బహు అరుదు. పద్మకుమారి గారికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు.

  3. కోడం కుమారస్వామిగారుా! అపురూప కథలపై మీ సమీక్ష చాలాబాగుంది. పద్మకుమారక్క విప్లవ కారుల వారికుటుంబాల త్యాగమయ జీవితాలను హృద్యంగా పాఠకుల ముందుంచింది. వారి జీవితాలు మనకు .పురోగామి దిక్సూచికలు.

  4. మనసును కదిలించే ‘అపురూప’ కథలు పద్మ కుమారి గారు రాసిన కథల పై కుమారస్వామి కోడం రాసిన సమీక్ష ఆలోచింపజేస్తుంది. చదివిస్తుంది.కథలోని వాస్తవిక ఇతివృత్తం శైలి వస్తు రూప నిర్మాణం మార్క్సిస్టు సౌందర్యానికి చాలా దగ్గరగా ఉంది. అపురూప కథలు లో ఉద్యమ రూపాలతో పాటు అమరుల త్యాగాల తో వారి తల్లిదండ్రుల ఆవేదన తో పాటు అమరుల ఆశయ సాధన తో సమ్మిళితమైన కథలు. ఇంతవరకు మనము రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ ,బీనాదేవి, తదితరులు రచనలే చదివే వాళ్ళం, నేటి ఆధునిక విప్లవ కాలంలో ఈ రచయిత్రులు పద్మ కుమారి, నల్లూరి రుక్మిణి, సాధన, అనురాధ, తాయమ్మ కరుణ,
    డాక్టర్ గీతాంజలి, పి.వరలక్ష్మి మొదలగువారు తెలుగు సాహిత్యంలో తమ సృజనాత్మకతతో తమదైన నూతన శైలి నిర్మాణంతో రచిస్తు ఒక అడుగు ముందుకు వెళ్తున్న వీరందరికీ ఉద్యమాభి వందనాలు.
    పద్మ కుమారి రచించిన అపురూప కథల్లో రెండు వర్గాల మధ్య నిరంతర పోరాటం, అంతర్లీనంగా రాజీపడని పోరాట దృక్పథం కనిపిస్తుంది.

Leave a Reply