‘కథ’ నేపథ్యం

23, ఫిబ్రవరి 1982 నాడు మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు మాదిగవాడ గుడిసెలో ఉన్నదేవేందర్ రెడ్డిని ఒక ఇన్‌ఫార్మర్ యిచ్చిన సమాచారంతో చుట్టుముట్టిన పోలీసులు కాల్చేశారు. అతను శద్దర్ కప్పుకొని నిరాయుధంగా ఉన్నాడు. కొనపానంతో కొట్టుకుంటూ ఉన్న అతన్ని జీబులేసి తీసుకపోతుంటే ఖిలా వనపర్తి ప్రజలే కాక చుట్టుపక్కల ఊళ్లల్ల ప్రజలు తల్లడిల్లారు. వలపోశారు. ప్రజలనెవరిని దగ్గరికి రానీయకుండా చుట్టుముట్టి రాణాపురంలో పోలీసులు దేవేందర్ రెడ్డి శవదహనం చేశారు. దేవేందర్ రెడ్డిని చంపిన ఎప్ఐ ప్రకాశ్ రెడ్డికి భూస్వాములు నోట్ల దండలు వేశారు. బయ్యపు దేవేందర్ రెడ్డి మంథని హైస్కూలులోను, ఇంటర్ దాకా మా తమ్ములు అల్లం వీరయ్య, నారాయణ, వెంకటరెడ్డిలతో ఒకే రూంలో కలిసి ఉండేవారు. ఎండాకాలం గాని, ఒక్కరోజు సెలవొచ్చినా మా వూరికి అందరు పోయేవారు. దాదాపు మా కుటుంబ సభ్యుడు. తర్వాత జమ్మికుంట కాలేజీలో మా వీరన్నతో పాటే చేరి డిగ్రీ చేశాడు. డిగ్రీ తరువాత విప్లవోద్యమంలోకి వెళ్లి గోదావరి తీరప్రాంతం, రామగుండం, పెద్దపెల్లి రైల్వేలైను, తూర్పున ఉత్తరాన గోదావరి, పడమర లక్షెట్టిపేట, ధర్మారం మీదుగా కరీంనగర్ వెళ్లే రోడ్డు లోపల దాదాపు వంద గ్రామాలల్లో పేద ప్రజలల్లో అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించాడు. ధర్మారం ఆవలి సైడు మద్దునూరులో నల్లా ఆదిరెడ్డి అయితే రోడ్డుకీవలి వైపు అయ్యపు దేవేందర్ రెడ్డి రైతాంగ పోరాటాలు ఏకకాలంలో నిర్మించారు. ఎమర్జెన్సీ అంతా కుక్కల గూడూరు, ఇసంపేట, పాలెం, బసంత్ నగర్, బొట్ల వనపర్తి, ఖిలా వనపర్తి, బసంత్ నగర్ లాంటి అనేక గ్రామాల్లో తిరిగి ఎమర్జెన్సీ ఎత్తేయగానే దాదాపు అన్ని గ్రామాలల్లో రైతుకూలీ సంఘాలు ప్రజలతో కలిసి ఏర్పాటు చేశారు. కూలిరేట్ల పోరాటం, పాలేర్ల జీతాల పెంపు, వెట్లిచాకిరి రద్దు, ఆశ్రిత కులాల పెట్టుబడుల పెంపు, దున్నేవారికి భూమి ప్రాతిపదికగా వందలాది ఎకరాల భూమి రైతాంగం దున్నుకున్నారు. మహిళల పట్ల, దళితుల పట్ల వివక్షను నిలదీశారు. ప్రజా పంచాయితీలల్లో దొరలను నిలదీశారు. దండుగలు వాపసు తీసుకున్నారు. ఈ గ్రామాలల్లో జరిగిన అనేక పోరాటాల మీద ఎముకలు, పశువులు లాంటి అనేక కథలు రాశాను. మొత్తంగా దోపిడి దౌర్జన్యాలకు, హింసకు నిలయాలైన చీకటి గ్రామాల ప్రజలు సంఘటితమయ్యారు.

స్కూలు నిర్మాణానికి సంబంధించిన డబ్బు మింగేసిన ఒక దొర తిరిగి డబ్బు వాపసు ఇవ్వనందుకు, పోలీసులతో దాడులు చేయించినందుకు, రైతాంగ కార్యకర్తలు దేవేందర్ నాయకత్వంలో ఆయన్ను గుట్టమీదికి తీసుకెళ్లి మూడు రోజులు రైతులు, కూలీలు చేసే పనులు చేయించారు. కర్రలు నరికించారు. కంకులు కాల్పించారు. గుట్టను దాదాపు 300 మంది పోలీసులు చుట్టు ముట్టారు. చర్చలు జరిపి మూడోనాడు వొదిలిపెట్టారు. ఈ వార్త దేశ వ్యాపితంగా సంచలనమైంది. బిబిసిలో ప్రసారమయ్యింది. భూస్వాములు, పోలీసులు కలిసి దేవేందర్ హత్యకు పథకం వేశారు.

దేవేందర్ రెడ్డి మితభాషి. ఆజానుబాహుడు, సునిశితమైన చూపు, ఎలాంటి సమస్యనైనా అధ్యయనం చేసి ఎదుర్కొనే సాహసం, ప్రజల పట్ల ప్రేమ. కల్లోలిత ప్రాంతాల చట్టాలతో జగిత్యాల సిరిసిల్లలో పోలీసులతో నింపేసి రైతాంగ కార్యకర్తలను వేటాడుతూ ఉంటే అలాంటి చట్టమేది లేకుండానే పెద్దపల్లి ప్రాంతంలో అనేకచోట్ల పోలీసు క్యాంపులు, పికెటింగులు పెట్టి రాత్రిపూట గ్రామాలలో పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు. పల్లెల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. సీఐడీలు రైతుల లాగా, బిక్షగాళ్లుగా, దేశదిమ్మరులుగా, చిన్నచిన్న వ్యాపారుల్లాగా గ్రామాలలో తిరుగుతుండేవారు. ప్రజలది పైచేయి అయి అనేక సంఘాల నిర్మాణం జరిగి గ్రామాల్లో నుండి పెద్ద, మధ్య తరగతి దొరలు పట్నాలకు పారిపోయిన నేపథ్యంలో అట్లా వీలుకాని నక్కజిత్తుల అగ్రకులాల వాళ్లు సంఘంతో ఉన్నట్టే ఉండి ప్రజల్లో చీలికలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇన్‌ఫార్మర్ వ్యవస్థకు రూపకల్పన చేశారు.

పోలీసులు గ్రామాల మీద దాడులు చేస్తూ పశువులను పంటల మీదికి ఒదలడం, బావుల దగ్గరి ఇంజన్లు ఎత్తుకపోవడం, అనేక మంది అరెస్టులు, వారాల తరబడి లాకప్లో బంధించడం, కేసులు పెట్టడం చేస్తుండేవారు. వేలాది రూపాయల లంచాలు గుంజేవారు. ఇలాంటి నిర్బంధ వాతావరణంలో కూడా దేవేందర్ ప్రజలల్లోనే రహస్యంగా తిరిగేవాడు. గ్రామాల నుండి అనేక మంది కార్యకర్తలు ఎదిగి అటు సింగరేణి, ఇటు అటవీ ఉద్యమాలకు వెళ్లిపోయారు.

దేవేందర్ రెడ్డి గురించి ఇప్పటికీ అనేక పాటలు, వందలాది కథలు ప్రజలు ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు. దేవేందర్ రెడ్డి నిర్బంధంలో గ్రామాలల్లో విప్లవోద్యమాలను ఏ విధంగా నిర్మించాలని తపన పడేవాడు. ప్రతిఘటనా పోరాటాలను విప్లవోద్యమ పోరాటాలుగా, రాజకీయంగా ఎలా తీర్చిదిద్దాలని ఆరాట పడేవారు. రహస్య నిర్మాణాల గురించి ఆరాట పడేవాడు. తెలంగాణ విప్లవోద్యమాలకు ముఖ్యంగా ఇతర జిల్లాలకు మిగతా ప్రాంతాలల్లో విస్తరణకు దేవేందర్ రెడ్డి ప్రాంతాలల్లో జరిగిన రైతాంగ పోరాటాల నిర్మాణం స్ఫూర్తిదాయకం అయ్యాయి. ఊరూరికి ఉండే అనేక సమస్యలు సంఘాలు పరిష్కరించాయి.

బీడి, చుట్ట లాంటి ఏ అలవాట్లు ఉండేవికావు. రైతుకూలీగా, రైతుగా, రకరకాల మారు వేషాలతో నిత్యం గ్రామాలు తిరుగుతుండేవాడు. ఎక్కువగా మాల, మాదిగల గుడిసెల్లోనే ఉండేవాడు.

దేవేందర్ రెడ్డి ఎన్‌కౌంటర్ ను ప్రజలు తట్టుకోలేకపోయారు. చాలా మంది ఎవరికివారు తమ కుటుంబ సభ్యుడు చనిపోయినట్లు దినవారాలు చేశారు. దినాలు చేశారు.

మా కుటుంబాన్ని కూడ ఈ విషాదం అతలాకుతలం చేసింది. మృత్యవును నిర్బంధంలో అనుభవించడం ఎంత యాతనో ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అనేక కథలు రాసిన నాకు తెలిసిన ఆ గ్రామాలల్లోని చాలా మంది ప్రజలు వెతుక్కుంటూ వచ్చి కలిసేవారు. ఏదో చెప్పేవారు. ఆఖరుకు ఎట్లా అనుకుంటనే వెళ్లిపోయేవారు. చిన్నపిల్లలు, వృద్దులు, మహిళలు తల్లడిల్లిపోయారు. దాదాపు మీటింగులు పెట్టే పరిస్థితి లేదు. దేవేందర్ రెడ్డి కథ ఊరూర అందరి మదిలో మెదులుతున్నది. అనేక పాటలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుండో మీటింగులల్లో పాడే పాటలు కాకుండా ప్రజలు నాట్లేస్తూ, కోతలు కోస్తూ తీరిక సమయాల్లో ప్రజా కళాకారులు, ఆశ్రిత జానపద కళాకారులు పాడే విధంగా పాటలు, కథలు రాస్తే బావుంటుందనిపించింది. అందరం అనుకున్నాం. ప్రజా కళారూపాలతో మమేకం కావాలనుకున్నాం.

దమ్ము సారిదమ్మన్న పాట సతీ సహగమనం చేసిన ఒక మహిళ విషాద గాథ. దాదాపు తెలంగాణ గ్రామాలల్లో విషాదంగా గంటల తరబడి పాడుకుంటారు. ఆ బాణీలో దేవేందర్ రెడ్డి కథ పాటల రూపంలో రాసినాను. అయినా ఆ పాట మందిలకు పోవాలి, పాడుకోవాలి.

మౌఖికంగా ప్రచారమైన కథలు, పాటలు సేకరిస్తేనే ఒక పుస్తకమవుతుంది. ఆ రోజుల్లోని ఒక పాట ప్రజలు పాడుకున్న పాట…

ఓయిగుమ్మ నాయిగుమ్మ దేవన్ననే నిలిపిపాడు

నీళ్ళమీద నీళ్ళు పేరే ఓయిగుమ్మ నాయిగుమ్మ
నీటి మీద నాచు పేరే ఓయిగుమ్మ నాయిగుమ్మ
మేటి వీరుడు దేవన్న ఓయిగుమ్మ నాయిగుమ్మ
నేటి నుండి ఇంకలేడు ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥నీళ్ళ॥

పాలమీద పాలు బేరే ఓయిగుమ్మ నాయిగుమ్మ
పాలమీద మీగడ పేరే ఓయిగుమ్మ నాయిగుమ్మ
వెన్నపూస అన్నమనసు ఓయిగుమ్మ నాయిగుమ్మ
తల్లులారా లేనే లేడు ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాల॥
నాగలెంట నాగలి గట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ
నూటనొక్క నాగలిగట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ
నలుగదున్ని రేగళ్ళు ఓయిగుమ్మ నాయిగుమ్మ
భూమిపల్లి మొక్కలెల్లి ఓయిగుమ్మ నాయిగుమ్మ
రతనాల రాసులెల్లు ఓయిగుమ్మ నాయిగుమ్మ
రాఘనేడు, కనగరి, ఓయిగుమ్మ నాయిగుమ్మ
రామగుండం, రాణాపురం ఓయిగుమ్మ నాయిగుమ్మ
కుక్కలాది గూడూరు ఓయిగుమ్మ నాయిగుమ్మ
తక్కళ్ళ పెల్లిన సూడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
బక్క రైతు బాధలివి ఓయిగుమ్మ నాయిగుమ్మ
కూలీనాలి గోడు జూసి ఓయిగుమ్మ నాయిగుమ్మ
దేవన్న కదలినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పల్లె పల్లె దిరిగినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాలు॥
ఈడజూడు ఆడసూడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఎక్కడైన గిదేనమ్మా ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఊరూ ఊరు, పేరూ పేరు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఊరు దొరదే పెద్ద పేరు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పరంపోగు, బంజేరు ఓయిగుమ్మ నాయిగుమ్మ
దండుగలు పండుగలు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఎట్టిముట్టి ఇంకెన్నో ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఒక్క నాటి కతగాదు ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాలు॥
సంఘం బెట్టి దేవన్న ఓయిగుమ్మ నాయిగుమ్మ
సానమందిని కలిపిండు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పారిటిబెట్టి దేవన్న ఓయిగుమ్మ నాయిగుమ్మ
పల్లెపల్లె గలిపినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఒక్కొక్క దొరగాన్ని ఓయిగుమ్మ నాయిగుమ్మ
బొక్కలిరగ దన్నినారు ఓయిగుమ్మ నాయిగుమ్మ

ఎట్టిముట్టి ఎగబెట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ
దొరలపనులు బందుబెట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ
వాళ్ళుతిన్న దండుగళ్ళ ఓయిగుమ్మ నాయిగుమ్మ
గోళ్లు, గొర్లు, కొబ్బర్లు ఓయిగుమ్మ నాయిగుమ్మ
వేలకొద్ది రూపాయలు ఓయిగుమ్మ నాయిగుమ్మ
భూములు జాగలన్నీ ఓయిగుమ్మ నాయిగుమ్మ
కక్కేదాక దొక్కినారు ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాలు॥
పోలీసు కొడుకువాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పొట్ట గంజి జీతగాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పోరాటం గిట్టనోడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
జనులబాగు ఓర్వనోడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఉన్నోడి పక్కజేరి ఓయిగుమ్మ నాయిగుమ్మ
అన్న మీద కత్తిగట్టె ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాల॥
సంఘం పనిమీద నమ్మ ఓయిగుమ్మ నాయిగుమ్మ
అన్నగాడు తిరుగంగ ఓయిగుమ్మ నాయిగుమ్మ
బొట్ల వనపర్తికాడ ఓయిగుమ్మ నాయిగుమ్మ
అన్నగాడు ఆగినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పసులింటికి రానేలేదు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పిట్టలు గూళ్ళ జేరలేదు ఓయిగుమ్మ నాయిగుమ్మ
సూరుడింకా జారలేదు ఓయిగుమ్మ నాయిగుమ్మ
మాపటేల గానే లేదు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పనులమీద బోయనోళ్ళు ఓయిగుమ్మ నాయిగుమ్మ
పల్లెనింకా జేరలేదు ఓయిగుమ్మ నాయిగుమ్మ
గుడిసెనేమొ చుట్టుముట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ
తుపాకు లెక్కు బెట్టి ఓయిగుమ్మ నాయిగుమ్మ

తూటమీద తూటగొట్ట ఓయిగుమ్మ నాయిగుమ్మ
తూలినాడే దేవన్న ఓయిగుమ్మ నాయిగుమ్మ
మాటమీద మాటబేలి ఓయిగుమ్మ నాయిగుమ్మ
మనిషి క్రింద బడ్డడమ్మా ఓయిగుమ్మ నాయిగుమ్మ ॥పాల॥
చెయెత్తు అన్నగాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
చెట్టోలె గూలినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
గుండెలున్న మనిషి అన్న ఓయిగుమ్మ నాయిగుమ్మ
గుట్టోలే గూలినాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ఆడసూడు ఈడసూడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
గుండె గుండె కదిపిసూడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
మాటలల్ల పాటలల్ల ఓయిగుమ్మ నాయిగుమ్మ
అన్నగాన్ని నిలిపిపాడు ఓయిగుమ్మ నాయిగుమ్మ
ముందు ముందు మనముందు ఓయిగుమ్మ నాయిగుమ్మ
దేవన్న బాటే ఉంది ఓయిగుమ్మ నాయిగుమ్మ

(జన నాట్యమండలి పాటలు)

మార్చి మొదటి వారం 1982 ప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావుగారు కల్లోలిత ప్రాంతాలైన జగిత్యాల, సిరిసిల్లా చూడటానికి వచ్చారు. నాకప్పటికే వారు పరిచయం. మాస్టారు కథలు యజ్ఞం, కుట్ర, చావు, నో రూమ్, వీరుడు లాంటి కథలు నేను చదవడమే కాదు చాలామందికి చెప్పేవాడిని.

అప్పటికే విప్లవోద్యమాలు ముఖ్యంగా రాడికల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం సెలవుల్లో గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై ప్రతి ఊరుకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, భౌగోళిక విషయాలు సేకరించారు. ముఖ్యంగా భూమి యాజమాన్య స్థితి, పంటలు, నీటివనరులు, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు, కులాలు ఇట్లా అనేకం సేకరించారు. మచ్చుకు ‘మాణిక్యాపూర్’ ఊరి వివరాలు పుస్తకంగా వచ్చాయి. అంటే గ్రామాలల్లోని ఉత్పత్తి వనరులు, శక్తుల సంబంధాల పూర్తి సమాచారమన్నమాట. ఆశ్చర్యకరంగా పట్టా భూములే కాకుండా, సరాసరిగా నలభై శాతం నుండి యాభై శాతంగా ఉన్న ప్రభుత్వ భూములు బంజరు శిఖం, అటవీ, దేవాలయ, ఇనాం భూములుండేవి. అవి దొరల స్వాధీనంలో ఉండేవి. మొదటి పోరాటం ‘దున్నేవారికి భూమి’ అంటే ఇలాంటి భూముల గురించి జరిగింది.

జూన్ 14,15, 1981 నెల్లూరులో జరిగిన ప్రథమ రైతుకూలీ సభలు, భూయాజమాన్య స్థితి గురించి, ‘ వ్యవసాయ విప్లవం’ కొండపల్లి సీతారామయ్య రాసిన పుస్తకంలోని అంశాలు, గ్రామాలల్లో నుండి ప్రత్యక్షంగా సేకరించిన సమాచారం రైతాంగం చర్చించింది. ముఖ్యంగా చైనాలోని యేనాన్ రిపోర్టు ఆధారంగా భూస్వాములు, ధనిక రైతులు, పేద రైతులు, మధ్య తరగతి రైతులు, రైతుకూలీల వర్గీకరణ చేశారు. అయితే 1947 తరువాత భారతదేశంలో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు, అన్ని పథకాలు మొత్తంగా ప్రణాళికబద్ధంగా గ్రామీణ ప్రాంతంలోని కింది కులాల రైతుల దగ్గరనుండి భూమిని భూస్వాములు కొల్లగొట్టారు. ధనిక రైతుల నుండి పేద రైతాంగం దాకా భూములు ఎట్లా కోల్పోయి రైతు కూలీలుగా, పాలేర్లుగా మారారో యజ్ఞం కథలో మస్టారు చిత్రించారు. అలాంటి పరిణామ క్రమం గ్రామాలల్లో చాపకింది నీరులాగా పాకి ఎలాంటి అమానవీయ హింసాకాండగా మారిందో అహింస జపిస్తూ లోలోపల ఈ పరిణామ క్రమం ఎంత హింసాత్మకమో యజ్ఞం కథ రూపుకట్టింది.

ఒక మాల రైతు అప్పలరాముడు తన భూమి స్వాతంత్ర్యానంతరం వ్యాపార పంటలు, గిట్టబాటు ధరలు లేక అప్పుల పాలు కావడం, ఆఖరికి భూమి కూడా అప్పుకింద కోల్పోయే స్థితిలో మాల అప్పలరాముడి కొడుకు సీతారాముడు తన కొడుకు ‘పాలేరు’ కాకూడదని తల నరుక్కొచ్చి పంచాయితి పెద్దల ముందుంచడం కథ. ఈ కథ ఇప్పటికి నన్ను వెంటాడే కథ. అట్లాగే పారిశ్రామిక రంగంలో పబ్లిక్, ప్రైవేటు, మిక్సుడు ఎకానమీ పేర్లు పెట్టి దేశ సంపద పెట్టుబడి దారులు దోచిన వైనం ‘కుట్ర’ కథలో చిత్రించారు. అప్పటికి విరసంలో కార్యదర్శిగా వారిని చూశాను. చాలాసార్లు సభల్లో కలిశాను. వారి ఉపన్యాసాలు విన్నాను. అంతకన్నా వారు రాసిన ప్రతి అక్షరం చదివి ఉన్నాను. దున్నేవానికే భూమి కేంద్రంగా ఆరంభమైన కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలకు ఒక తాత్విక పునాది- అంతకు మందు నడిచిన శ్రీకాకుళ గిరిజన పోరాటం నుండి ఈ కథలు ఏర్పరిచాయి. అలాంటి వారు కల్లోలిత ప్రాంతాలకు రావడం జరిగింది. వారు హైద్రాబాదు నుండి ఉప్పల నర్సింహం (కథకులు) ను తోడుతీసుకోని జగిత్యాలకు వచ్చారు. జగిత్యాలలో అప్పడు జినాం వెంకటేశం (సాహితీవేత్త, కవి), గంగారెడ్డి గార్లు ఎలక్ట్రికల్ అసిస్టెంటు ఇంజెనీర్లుగా పనిచేస్తున్నారు. వారు మాకందరికి ఆప్తుడు.

అప్పుడు పోను సౌకర్యం అంతగా లేదు. నన్ను తీసుకపోవడానికి జూకంటి జగన్నాథం (కవి, రచయిత) గారు మంచిర్యాలకు వచ్చారు. జగన్నాథం, నేను రగులుతున్న జగిత్యాల పల్లెల మీదుగా జగిత్యాల చేరుకున్నాం. వెంకన్నతో పాటు గంగారెడ్డి, మాస్టారు, నేను, జగన్నాథం, నర్సింహం అందరం కలిసి జగిత్యాల, సిరిసిల్లా ప్రాంతాలు తిరుగాలనుకున్నాం. ఎక్కువ మంది ప్రజలను చూడాలంటే దేవాలయాలు, క్షేత్రాలు ఎంచుకున్నాం. మొదట ధర్మపురితో మా ప్రయాణం మొదలయ్యింది. ధర్మపురి లక్ష్మి నర్సింహ ఆలయం – గోదావరి తీరం – అనేక పోరాటాలకు నిలయమైంది. ‘‘గుడుల కేంద్రంగా మనం తిరుగ గల్గితే మనకు ఈ గొడవల్లో ఉన్న అన్ని పక్షాలు – ముఖ్యంగా ప్రజలు బాగా తెలుస్తారు’’ అన్నారు మాస్టారు నా ప్రశ్నార్థకపు ముఖం చూసి. అప్పటికి మేమంతా వీర నాస్తికులం…

ఆయన ‘శివ శివ’ అని రాసున్న షాలువా కప్పుకున్నారు. అప్పటికి చలి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ధర్మపురి నుండి మొదలుకొని అనేక చోట్ల పోలీసు క్యాంపులు కొన్ని చోట్ల బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, రిజర్వ్ పోలీసు పికెటింగులు, పగలు పోలీసులు, రాత్రిపూట అన్నలు గ్రామాలు యుద్ధంలో ఉన్న సమయమిది. నాలోపల అనేక దు:ఖాలు ఘనీభవించిన స్థితి, అల్లకల్లోల స్థితి, ప్రతిచోట దేవేందర్ రెడ్డి గుర్తుకు వచ్చేవాడు.

అట్లా మేం మళ్లీ జగిత్యాల వచ్చి అనేక చర్చలు. వెంకన్న సహచరి మాధవిగారు మాకు చాలా వండి పెట్టారు. అక్కడి నుండి కొండగట్టు వెళ్లాము. కొండగట్టులో నూటాయాభై మంది పోలీసులు క్యాంపున్నది. మాకు ఆ గ్రామాలల్లో జరిగే అనేక పోరాటాల గురించి లైన్ మన్ రాములు గుడికావల గుట్టమీద వివరిస్తున్నారు. మాకు కొద్దిదూరంలో పోలీసు క్యాంపు. గుడి నిండా ధీర్ఘకాలంగా ఉంటున్న పిచ్చివాళ్లు. యుద్ధ రంగం మోహరించి ఉన్నట్లే ఉన్నది.

‘‘మీరు రాసిన కథలు అతి తీవ్రమైనవి. అట్లా రాయవచ్చునా. రాస్తే పర్యవసానం’’ నేనడిగాను.

(మిగతాది వచ్చే సంచికలో…)

(‘కథ’ ను ఈ లింక్ లో చదవండి https://kolimi.org/?p=2642)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply