తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట అల్లప్పటి శాలివాహనుల రాజధాని ధాన్యకటకం. ఉత్తరాన స్థూపాల్ని, ఆ దిబ్బల్నీ, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డాణంగా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది… అమరావతి వర్ణణలో కృష్ణమ్మకు కవి సత్యం శంకరమంచి వేసిన అక్షరమాల ఇది.
అమరావతి గొప్పదనాన్ని, కృష్ణమ్మ ఆత్మను అందరికీ అర్ధమయ్యేలా సులభ పదాలతో కథల రూపంలో వివరించిన పుస్తకం అమరావతి కథలు. సత్యం శంకరమంచి దీని రచయిత. ఇందులో వంద కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సవంత్సరాలు (1975 – 77 మధ్యన) ప్రచురితం అయ్యాయి. ఈ పుస్తకానికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. సినీ దర్శకుడు శ్యాంబెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. వీటిని అమరావతిలోనే దృశ్యీకరించడం విశేషం.
అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా, ఆలకించమని హరిహరులను వేడుకుందునా, అని రచయిత తన తొలిపలుకుల్లో వినయంగా విన్నవించారు. గోరుముద్దలు తినిపిస్తూ, చందమామను చూపిస్తూ అమ్మ చెప్పే కథలంత అధ్భుతంగా ఉంటాయి ఇవన్నీ. శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతిలోనే. ఇక్కడి కృష్ణానదిపై, దానితో పెనవేసుకున్న జనజీవితాలపై ఆయనకు ఎనలేని మమకారం కనిపిస్తుంది ఇందులో. మూడొంతుల కథల్లో కృష్ణమ్మ గలగలలు శ్రావ్యంగా వినిపిస్తాయి. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ, కావలసిన చుట్టం ఊరి నుంచి వస్తున్నట్టుంటుంది.. అంటూ రచయిత కృష్ణమ్మను ఆత్మీయ బంధువుగా భావించారు. అందుకే దానిని కిష్ట అని చాలా ముద్దుగా పిలుస్తారు.
ఈ కథల్లో భోజన చక్రవర్తి అప్పంబొట్లు, సుబ్బయ్య మాస్టారు, చీకటంత నల్లగా ఉండే యోసేబు, పూల్ మల్లెపూల్ అంటూ వీధుల్లో కేకేసే సాయిబు, దర్జీ జోగారావు, అతని వద్ద పనిచేసే పోలిగాడు, వాడిని ఇష్టపడే పోలి.. ఇలా వందలాది పాత్రలన్నీ కృష్ణమ్మతోనే పెనవేసుకుని నడుస్తుంటాయి. సమూహంలోని ప్రతి వ్యక్తిని లోతును పరిశీలించడం ఒక ఎత్తయితే, ఆయా పాత్రల వ్యక్తిత్వాన్ని కృష్ణమ్మతో ముడిపెట్టి తీర్చిదిద్దడం బహుశా ఈ కవికే సాధ్యమైంది.
కార్తీక మాసంలో కృష్ణమ్మను వర్ణిస్తూ.. కృష్ణ నిండా దీపాలు, పాట పాడుతున్నట్లు అటూ ఇటూ ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి. కొన్ని వందల ఆవునేతి దీపాలు, కృష్ణమ్మ ముత్యాల హారం ధరించినట్లు, ఆకాశం నక్షత్రాలను వర్షించినట్లు కృష్ణలో దివ్వెల బారులు.. అంటూ తన అక్షరాలతో కృష్ణవేణిపై వెలుగులు పూయించారు. శంకరమంచి కథా గమనం కృష్ణమ్మ ప్రవాహంలా సాగుతుంది. నీటి గలగలల్లా కోలాహలంగా వినిపిస్తుంది. ఒక్కో చోట నిర్మలంగా .. గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. కొండకచో సుడిగుండంలా తిప్పి పడేస్తుంది.
నది నాన్న కథలో కాళ్లు కాల్తాయని బడి నుంచి భుజంపైకి ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చిన నాన్న, నదిలో ఈతలు నేర్పిన నాన్న, దూరమైతే తన బాధను అదే కృష్ణమ్మకు చెప్పుకుని పొగిలి పొగిలి ఏడ్చిన సీతయ్య పాత్రను ఆర్థ్రంగా చిత్రీకరించాడు కవి. నాన్న కథే కాదు.. అమ్మ కథా ఇందులో ఉంది. తల్లి కడుపు చల్లగా కథలో కృష్ణ లోపల వెచ్చగా ఉంది. అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది.. అందుకే తనకు అమ్మంటే ఇష్టం.. కృష్ణ అంటే ఇష్టం అని రంగడు చెబుతాడు.
పెద్ద ముత్తయిదువు నర్సమ్మ అంతే.. బాల్య వివాహం అయి చిన్నపుడే భర్త దూరం కాగా అతడి జాడ గురించి కృష్ణమ్మనే వేడుకుంటుంది. తల్లీ ఈ నేలంతా పరుచుకున్నావు కదా.. నా సామి ఏ తానున్నాడో.. ఆ కబురు చెప్పరాదా.. అని ఆ నీళ్లతోనే తన బాధను విన్నవించుకుంటుంది. ఇందులో రెండు గంగలు కథ చదివిన వారికి బాల్యం గుర్తుకు రావల్సిందే. మనవళ్లకు శాస్త్రిగారు కృష్ణ ఒడ్డున వాన గురించి వర్ణిస్తారీ కథలో.. అలా అలా చెబుతుంటే కథ చివరిలో వాన ఆగిందని చెప్పొద్దు తాతా.. అంటూ పిల్లలు అనడం అనిర్వచనీయం. ఆ సన్నివేశం చదివే మనల్ని కూడా తడిపి ముద్ద చేస్తుంది.
ఇలా ఎన్నో కథలు.. అందులో కృష్ణమ్మపై అద్భుత వర్ణణలు.. ఒక్కో కథ ఒకలా… నిశబ్ద చీకటిలో భూమాత కాటుక కన్నులా, సర్వతా జాగృతమైన ఆత్మలా, వరదొచ్చినపుడు ప్రళయ మూర్తిలా, వాన చినుకులు పడుతున్న వేళ పెద్దక్క ప్రేమలా, చవితి వెన్నెల నాడు పిల్లల అల్లరిలా.. సాహిత్య ప్రియులు ఎన్నిమార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే కథల పుస్తం ఇది. ఆయా కథా విశేషాలతో బాపు గీసిన బొమ్మలు అద్భుతం. అవి నలుపు తెలుపు రేఖా మాత్రమే.. అయినా ఎన్నెన్నో భావాల సమాహారం.
ఆ నీళ్లన్నీ ముందుకు వెళ్లిపోతున్నాయి. రేపు కొత్త నీళ్లొస్తాయి. మళ్లీ అవి కథలు విని వెళ్లిపోతాయి. ఏ కబురూ, ఏ కథా నిలవ ఉండదు. రుచే మిగులుతుంది. అని రచయిత నీరు నిలవదు అనే కథలో చెప్పినట్లు ఆ కథల రుచి మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటుంది. నేటి తరానికి ఆ రుచి చూపించాలి. ఆ కథలను చదివించాలి. వినిపించాలి.
Best of luck swathi 🍫💐