ఓ అమర కళావేత్త అందుకో మా జోహార్…

మే 5 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అరుణోదయ రామారావు హార్ట్ ఫెయిల్ అయి చనిపోయాడని తెలియగానే నేను, కరుణ ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్‌కు వెళ్లాం. అక్కడ అరుణోదయ కళాకారులు, సి.పి.ఐ-ఎమ్.ఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు, ఇతర మిత్రులు ముఖ్యంగా రామారావు జీవిత సహచరి అరుణ, రాహుల్, చైతన్యల రోదనలు గుండెను కలిచివేశాయి. చేతివేళ్ళను ఇంకా లయబద్దంగా ఆడిస్తున్నాడా అన్నట్లున్న వేళ్ళు, ప్రశాంతంగా నిద్రపోతూ ఏమాత్రం తేజస్సు తగ్గని ఆయన భౌతిక కాయం మా కంటపడింది. అంతకు రెండు రోజులముందు మే డే కార్యక్రమం కొరకు 50 డిగ్రీల కొలిమిలా వున్న రామగుండానికి బస్సులో పోయొచ్చి, స‌న్ స్ట్రోక్‌తో జ్వరంవచ్చి, కిడ్నీ పనిచేయడం తగ్గి, గుండె పోటు దానికి తోడయ్యి అమరుడయ్యాడని విన్న వెంటనే “నా చివరి శ్వాసవరకు జీవితాన్ని ప్రజాకళలకు, ప్రజలకు అంకితం చేస్తూ పోరాటంలో కొనసాగుతానన్న ఆయన ఆశయం స్ఫురించింది.

అరుణోదయ రామారావు గోదావరీ లోయ ప్రతిఘటనా పోరాటం తీర్చిదిద్దిన విప్లవ సాంస్కృతిక యోధుడు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో కళలకు పుట్టినిల్లయిన దళిత కుటుంబంలో 1955 జులై 1న జన్మించాడు. విద్యార్థి దశలోనే శాస్త్రీయ సంగీత మెళకువలు, పౌరాణిక పద్యాలు, డప్పు, డోలక్, తబలా, హార్మోనియం లాంటి వాయిద్యాల నైపుణ్యాలు వంట బట్టించుకున్నాడు. వాళ్ళ ఊరిలో రెడ్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో రామారావు ముఖ్యపాత్ర వహించాడు. రాయలసీమ ప్రాంతంలో అట్టడగు జీవితాలపై అణచివేతలు, దోపిడీ దౌర్జన్యాలు, ఆ ప్రాంత కరువు ఇలా అన్నింటిని అనుభవించి, పరిశీలించి ఆలోచిస్తున్న క్రమంలో దేశంలో ముఖ్యంగా రాయలసీమలో పెల్లుబికిన విప్లవోద్యమం, కా. చండ్రపుల్లారెడ్డి, కా. నీలం రామచంద్రయ్యల దార్శనీయత ఆయనను కమ్యూనిస్టు రాజకీయాలవైపు మరల్చింది. రామారావు గాన ప్రతిభ తెల్సి సినీ రంగానికి ఘంటసాల గారే ఆహ్వానించి పుహళేందిని కలిపించినా, తన అభివృద్ధి కంటే ప్రజల అభివృద్ధి ముఖ్యమని విప్లవ సాధన దిశలో ప్రజల్లో భావ విప్లవ పునాదుల్ని వేసే బాధ్యత సాంస్కృతిక రంగానిదే అని నమ్మి ‘సత్యం’ రామారావుగా మారాడు. అప్పటికే దాదాపు 50 ఏండ్ల‌ పోరాట చరిత్ర కల్గిన బొల్లవరంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించి, పశువుల కాపరిగా ఉంటూ ఉ ద్యమంలోకి వచ్చి కళారంగంలో విశేష కృషి చేస్తున్న కా. సుంకులన్నకు యువరక్తం, ఉత్తేజం ఉప్పొంగే రామారావు తోడయ్యాడు. నాంది నాటకం కష్టజీవి, ‘అల్లూరి సీతారామరాజు’ బుర్రకథలు నేర్చుకొని ప్రదర్శించడం, రాజకీయ క్లాసులు, సాంస్కృతిక ట్రెయినింగ్‌లు నిర్వహిస్తూ, కన్న తండ్రిని, సొంత ఊరిని అన్నీ మరిచి బొల్లప్రాంతంలోనే పూర్తికాలం పనిచేస్తూ ఉన్నాడు.

హైదరాబాద్లో కా. జార్జ్ రెడ్డి బాటలో కా. జంపాల చంద్రశేఖర ప్రసాద్ నాయకత్వంలో విద్యార్థి ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న క్రమంలో, ఆనాటి విద్యార్థి నాయకులే, ఉపన్యాసాలు, రాజకీయ శిక్షణలు, పాటలు, నాటకాల ప్రదర్శనలు ఇలా అవసరాన్ని బట్టి అన్ని రంగాల్లో కృషి సల్పుతున్న తరుణంలో విద్యార్ధి నాయకులు చలపతిరావు, లలిత, రాజా, గీత అందరూ జంపాల సూచనలతో ఒక సాంస్కృతిక సంస్థ “అరుణోదయ”ను స్థాపించారు. వీళ్ళే కాకుండా తివిక్రం, అనురాధ, సూధన్, శాండిల్య ఝాన్సీ లాంటి కళాకారులందరు కల్సి ఎర్రమట్టి నాటకం, కుట్ర కూచిపూడి భాగవతం, కొన్ని నృత్యరూపకాలతో 1974 జనవరిలో కర్నూల్ లో జరిగిన విరసం ‘మహాసభలకు వెళ్ళారు. అక్కడే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలిస్తే బాగుంటుందని నిర్ణయించుకొని అందరూ హైద్రాబాద్ కు వచ్చారు. కా. రామారావు వీరితో పాటు హైదరాబాద్ చేరుకొని “అయ్యలారా ఆలకించడయ్య అమ్మలారా ఆలకించడమ్మా”, ఓ కళావేత్తలారా, ఓ చెల్లి చెంద్రమ్మా నృత్యరూపకం నాంది నాటికలో ‘సాముదాయక ఫండు” తన పద్యాలతో ప్రస్థానం ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ కొత్త కొత్త కళారూపాలు పెంచుకుంటూ కొత్త కళాకారులకు శిక్షణిస్తూ, ఆనాటి రాజకీయాలపై వ్యంగ్యాస్త్రరలతో కుట్ర కూచిపూడి భాగవతం, ఎర్రమట్టి నాటకం, చెల్లి చెంద్రమ్మ నృత్యరూపకం లాంటి ప్రదర్శనలు తయారుచేసుకొని కాశీపతి, జంపాల ల ఉపన్యాసాలతో రాష్ట్రమంతటా పర్యటించారు.

ఈ క్రమంలో సామర్లకోటలో ప్రదర్శిస్తున్నప్పుడు ఎమ‌ర్జెన్సీ ప్రకటన వెలువడింది. అక్కడి నుండే అందరూ అజ్ఞాత జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ ఎమర్జెన్సీ రక్కసి జంపాల, నీలం రాంచంద్రయ్య, రామనర్సయ్య, శ్రీపాద శ్రీహరి లాంటి ఎందరో “విప్లవ సింహాలను” పొట్టన పెట్టుకుంది. ఎమర్జెన్సీ తరువాత రాజకీయ విబేధాల పేరుతో కొందరు, భయంతో ఇంకొందరు ఇలా దాదాపు పాత కళాకారులందరూ వెళ్ళిపోయి రామారావు, కానూరి, సుంకులు లాంటి కొందరే మిగిలారు. ఉద్యమాలను తిరిగి సంఘటిత పరిచే క్రమలో మధుసూద‌న్ రాజ్ యాదవ్ ఇంకా ఇతర నాయకుల సూచనలతో రామారావు రాష్ట్రమంతటా తిరిగి, “ఉయ్యాలో – జంపాల’, ‘అన్న అమరుడురా’ లాంటి పాటలతో విప్లవసింహం (రామనర్సయ్య జీవిత చరిత్ర) కానూరి, సుంకులు వంతలుగా రామారావు కథ‌కుడిగా రాష్ట్రమంతటా ప్రదర్శినలిస్తూ అందరిలో స్ఫూర్తి నింపారు. విశాఖలో సాధు, రాజు ఖమ్మంలో నాగయ్య, వరంగల్ లో చంద్రమౌళి, నిజమాబాద్ లో నారాయణ, హైదరాబాద్లో అప్పటివరకు ప్రేక్షక పాత్రకే పరిమితమైన నన్ను క్రియాశీలక కళాకారుడిగా మార్చాడు రామారావు. నన్ను మాధవరావు, అంబిక, విమల, కానూరి, సుంకులు ఇంకో ఇద్దరు (ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యకర్తలు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా “అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య”ను పునర్ నిర్మించడం జరిగింది.

వీధి భాగవతానికి ఎమర్జెన్సీ రాజకీయాలను జోడించి “ఇందిరా జాలం”గా మార్చి రామారావు, కానూరి సూత్రధారులుగా కూచిపూడి నృత్యరూపకం, భూస్వామి భాగోతాలు, యక్షగానం, గొల్లసుద్దులు, పిట్టల దొర లాంటి కళారూపాలు, జజ్జనకరి జనారె, హేనగరే నగానగారే, ఓ చిన్నదాన, మా కంపెనీ జీతాలు పెరిగినయి, అత్తవండిన సోషలిజం లాంటి నృత్యాలు ఇలా యెన్నెన్నో ప్రదర్శనలు దాదాపు అన్ని జిల్లాల్లో ట్రెయినింగ్ క్యాంప్స్ పెట్టి సాంస్కృతిక దళాలు తయారు చేయడం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడం మా జీవనయానంగా కొనసాగింది. కా. బాదల్ సర్కార్ (బెంగాల్ కళాకారుడు) దగ్గర ట్రయినింగ్ తీసుకొని “సీట్ ప్లే ప్రదర్శించడంలో ప్రజ్ఞా నైపుణ్యాలు సాధించి ప్రదర్శనలతో రాష్ట్రమంతటటా జేజేలు పలికించుకున్నాం. రాష్ట్రంలోనే గాక, బొంబాయి, భీవండి, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో పర్యటించి “స్మితా పాటిల్”, “షబానా ఆజ్మి” లాంటి వాళ్ళ ప్రశంసలను పొందడం జరిగింది. పి.డి.యస్.యు, ఐ. ఎఫ్.టి.యు, రైతుకూలీ సంఘం, పి.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యూ, ఏ.పి.సి.ఎల్.సి, విరసం సంఘాల ప్రతి సభల్లో, సమావేశాల్లో, ఊరేగింపుల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభల్లో అరుణోదయ రామారావు నాయకత్వంలో క్రియాశీలకంగా, జన రంజకంగా అరుణోదయ కళాకారులు పాల్గొనేది. సమ్మర్లో జరిగే విలేజ్ క్యాంపెన్స్‌లో, ఎన్నికల్లో అరుణోదయ పాత్ర కీలకంగా ఉండేది. బృందాల పార్టిసిపేషన్ శ్లాఘనీయం ప్రధానంగా సత్యనారాయణ సింగ్, ఫణి బాగ్చీ, రాంచంద్రం, కేడీ సేథీ లాంటి నాయకులు, వక్తలుగా ఉండే సభలలో రామారావు కథకుడుగా, కానూరి, కా. నాగయ్య వంతలుగా 40, 50 రోజుల పాటు రోజూ బుర్రకథ ప్రదర్శనలు కొనసాగేవి. ఆనాటి మహత్తర ఉద్యమం ఎందరో కళాకారుల్ని తయారుచేసుకొంది. బహుజన కాన్సెప్ట్ మార్క్సిస్టు – లెనినిస్టు రాజకీయాలను మేళవించి కొత్త ఆలోచనా పధానికి నాంది వేసిన వీరన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ స్థాపకుడు, ఈనాటి బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న మల్లేపల్లి లక్ష్మయ్య, జయ, కరుణ, సృజన, సుగుణ, చైతన్య, గీత, రాములు ఇంకా ఎందరెందరో అరుణోదయ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి కళాకారులుగా వెలుగొందినవాళ్ళే. తిరుమలాయపాలెం మండలంలోని పాపాయిగూడెం నుండి ఆ ప్రాంత ఉద్యమాలతో ప్రభావితమై రాజకీయాల్లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్న అరుణతో రామారావు పెళ్ళిని పార్టీ సూచించింది. వాళ్ళిద్దరు చర్చించుకొని ఒక అంగీకారానికి వచ్చారు. అరుణ హైదరాబాద్ చేరింది. నేను, కానూరి పెళ్ళి పెద్దలుగా 1981 సెప్టెంబర్ 16వ తేదీన, ఎస్.పి.హాల్ లో రామారావు – అరుణల పెళ్ళి జరిపించాం. ఆ తర్వాత అరుణ హైదరాబాద్ పార్టీలోనూ కార్మికరంగంలో ముఖ్యంగా బీడీ కార్మికుల్లో పనిచేసి సంఘాన్ని నిర్మించి ఈనాటికి రాష్ట్రస్థాయి నాయకురాలుగా ఎదిగింది. రామారావు, అరుణల ఇద్దరు కొడుకులు చైతన్య, రాహుల్ ఉన్నత చదువులు చదువుకొని, ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. చైతన్యకు పెళ్ళయింది. అతనికి ఒక కొడుకు, అభిప్. మనువడంటే రామారావుకు ప్రాణం. వాడికి తాళ జ్జానం ఉంది. గాత్రం ఉంది. మనవడికి సంగీతం, పాటలు, వాయిద్యాలు నేర్పాలని రామారావు అనుకునేవాడు.

రామారావు ప్రస్థానం రాష్ట్రవ్యాపితంగానే కాక పంజాబ్, మహారాష్ట్ర కలకత్తా, ఢిల్లీ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లోను సాగింది. ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ కళాబృందాలను ఏర్పర్చి, అప్పటికే ఉంటే సమన్వయ పరుస్తూ, ఉత్తేజపరుస్తూ అఖిల భారత సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి ఎనలేని కృషిచేసిన సాంస్కృతిక కృషీవలుడు కా. రామారావు. మార్క్సిస్ట్, లెనినిస్టు పార్టీ రాజకీయ ఉద్యమాలే కాకుండా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న గోరేటివెంకన్న, అంజన్న, యశ్పా ల్, సాయిచంద్, విమలక్క, కృష్ణ, పుష్ప లాంటి వాళ్ళు అరుణోదయ సంస్థ ద్వారా ‘రంగప్రవేశం’ చేసిన వాళ్ళే. కా. రామారావు సహచరులు, శిష్యులే. రామారావు నాయకత్వంలో అరుణోదయ కళాకారులు తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తూ, ఉద్యమంలోనికి ఆకర్షిస్తూ, ఆంధ్రప్రాంత ప్రజలకు తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ సంఘీభావ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధన దిశగా నడిపించారు. తెలంగాణ సాధించిన తర్వాత ప్రజల బాధ్యతను, మళ్ళీ విప్లవ రాజకీయాల ఆవశ్యకతను, పోరాట పంథాలను ప్రచారం చేస్తూ అలుపెరగని అన్న కా. రామారావు. 05-05-2019న గుండెపోటు రూపంలో మృత్యువు రామారావును కబళించింది. ఆ మరునాడు “అగ్గి వచ్చి ఆ వీర కళాకారున్ని హత్తుకొని ఏడ్చి” అరుణోదయంలోనే విలీనం చేసింది. కా. రామారావు అరుణోదయ సాంస్కృతిక సేనాని, అఖిల భారత విప్లవ సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్, సి.పి.ఐ – ఎమ్. ఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్రకమిటీ సభ్యుడు. అన్నింటిని మించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రజాకళాకారుడు, పాటగాడు, ఆటగాడు, వాయిద్యకారుడు, నటుడు, కథ‌కుడు, రాగాల రాశి, హాస్య ప్రియుడు, మంచి మిత్రుడు. కొన్ని వేల కుటుంబాలు ఆయన్ను తమ కుటుంబ సభ్యునిగానే భావించాయి. కా. రామారావు అస్తమయం ఆయన కుటుంబానికే కాదు, మా కుటుంబాలకు, ఎన్నో కుటుంబాలకు తీరని, తీర్చలేని లోటు. పార్టీలు, అరుణోదయలు ఎన్ని ముక్కలయినా అందరూ ఆయన్ను ఆప్తుడుగానే చూసేవారు. ఆయనా అందరినీ ఆప్తులగానే చూసేవాడు. చీలికల వల్ల సహచరులు బలైనప్పుడు, కా. బాబన్న లాంటి తోటి కళాకారుడు. అన్న అమరుడురా పాట రాసిన అంగడి చెన్నయ్య హత్య గావించబడ్డప్పుడు ఎంతో కుమిలిపోయిన సున్నిత మనస్కుడు. అయినా వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ నిర్ణయాలే శిరోధార్యమని నమ్మి హృదయాన్ని గట్టి పరచుకొని పనిచేస్తూ పోయేవాడు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం, అంబేడ్కరిజం తోడుగా ప్రజా పోరాటాలు సాగాలని అన్ని విప్లవ గ్రూపులు కలిసి అన్ని అరుణోదయలు కూడా ఒక్కటయి నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన బాటలో విజయం సాధించి, బహుజన రాజ్యం సాధించినప్పుడే కా. రామారావు త్యాగానికి నిజమైన విలువ, సార్ధకత.

రామారావు ఎప్పుడూ పాడే స్మృతి గీతాన్ని గుర్తు చేసుకుంటూ…

“హృదయమున నీ చరిత్ర పదిలమాయె
మరతుమన్నన్ గత స్మృతుల్ మరపురావు
నీ విధానము చారిత్రక అవసరము
విప్లవ పథాన అది సదా వెలుగు జ్యోతి
అంజలి ఘటించి పాడెద నీ అమర గీతి
ఓ వీరుడా ! ఓ అమర వీరుడా ! కామ్రేడా !
అందుకో నా భాష్పాంజలి, నా అరుణాంజలి
ఓ అమర కళావేత్త అందుకో జోహార్…

రిటైర్డ్ ప్రొఫెసర్ జె.ఎన్.టి.యు. అరుణోదయ రామారావుతో కలిసిపనిచేసిన ఒకప్పటి సాంస్కృతిక సహచరుడు.

2 thoughts on “ఓ అమర కళావేత్త అందుకో మా జోహార్…

  1. అన్నా! వ్యాసం బావుంది. రామారావు అన్న మరణాన్ని మనసు ఇంకా అంగీకరించటం లేదు!

  2. చాల బాగుంది వినయ్, మళ్లీ ఒకసారి కంట తడి పెట్టించావు. రామారావు నేడు లేడూ? చూడు, జనంలో, జన హృదయంలో ఉన్నాడు….

Leave a Reply