ఓల్గా – ‘స్వేచ్ఛ’

”స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం” అంటారు రచయిత్రి. ఓల్గాగారు 1987 లో రాసిన నవల ఇది.


కథలోని అరుణ చిన్నతనం నుంచి అణచివేతకు గురవటంవల్ల స్వేచ్ఛగా జీవించాలన్నది ఆమె అమితమైన కోరిక. ఆ అణచివేతనుండి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆప్రయత్నాలు ఒకసారి ఆమెను మళ్ళీ అణచివేత చట్రంలోకే తీసుకొచ్చి పడేశాయి. అరుణ తండ్రికి పెళ్ళి చేసే ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల ఎమ్ ఎ వరకు చదువుకోగలుగుతుంది.

అరుణ తండ్రి, మేనత్త ఆంక్షలు లేకపోతే, తనకు ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే తన జీవితం హాయిగా సాగుతుందని అనుకుంటుంది. ఆ రెండు సాధించి ప్రకాశాన్ని పెళ్ళి చేసుకోవటం వల్ల స్వేచ్ఛ లభిస్తుందనుకుంటుంది. అది రెన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలన్న దోరణి ప్రకాశంది. ఇప్పుడే పిల్లలు వద్దంటే లేదు, కావాలి అనే ప్రకాశం అధికారం అరుణను కలవరపెడుతుంది. ఆర్థిక నిర్ణయాలు, సమాజ సేవ లాంటివి ప్రకాశంకు నచ్చవు.

“ఎంత సమర్థవంతంగా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని చూసుకుంటున్నా.. అరుణ అభ్యుదయ భావాలతో సమాజంలో తిరగడం, ఒక పత్రిక కోసం పని చేయటం, ఇంటర్వ్యూలు, మీటింగ్ లంటూ తిరగడం ప్రకాశంకు నచ్చేది కాదు. భార్యంటే పూర్తిగా కుటుంబానికి పరిమితం కావాలంటాడు. సమాజంతో మనకు అవసరం లేదంటాడు. ప్రకాశంలోని మార్పును, అతని మాటలను సహించలేక పోతుంది అరుణ. అందువల్ల ఇద్దరిమధ్య గొడవలు. అతనికి నచ్చేలా వుండలేదు అరుణ. అలా వుండమంటే స్వేచ్ఛకి అర్థం లేదంటుంది అరుణ. చివరికి సంసారం కావాలో, సమాజం కావాలో తేల్చుకోమంటాడు ప్రకాశం.

బంధనాల స్వభావం తెలిసేకొద్ది అరుణకు స్వేచ్ఛ స్వరూపం అర్థమౌతుంది. సమదృష్టి లేనప్పుడు, భార్యాభర్తలు ఒకరికి ఒకరు అభిప్రాయాలను గౌరవించుకోలేనప్పుడు ఆ సంసారం సుఖంగా సాగదు. “సమాజానికి తనవంతు సాయం అందాలనుకుంటుంది. ”మొత్తం సమాజాన్ని మార్చను నాకు చేతకాదని ౼ నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చేయకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ?నా బతుకు నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నా పని. నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి” అని అనుకొని చివరకు బంధాలనుండి విముక్తి కావాలనుకుంటుంది అరుణ.

**

“మన జీవిత పరిస్థితుల గురించిన సరైన జ్ఞానం నుంచే మనం జీవించే శక్తినీ మన జీవన సరళికి హేతువులను సంపాదించుకోవాలి. అట్లాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకునే స్త్రీలకు తమ జీవిత పరిస్థితులను అర్థం చేసుకోవటంలో ఏ కొంచెం సహాయపడినా ఈ నవల ప్రయోజనం నెరవేరినట్లే.

ఈ నవల అరుణకు గానీ అటువంటి స్త్రీలకు గానీ ఏ పరిష్కారాన్ని అందించిందా అనేది చాలా మంది అడిగే ప్రశ్న. అసలు రచయితలను సమస్యలకు పరిష్కారాలు, అందులోనూ సరైన, కరెక్టయిన, ఏ పొరపాటూ లేని ఫర్ ఫెక్ట్ పరిష్కారాలు అడగటం, వాటికోసం రచనల్లో వెతకటం చాలా తెలివి తక్కువతనం. అట్లా వెతకొద్దని “కొడవటిగంటి కుటుంబరావు గారు” ఎన్నడో చెప్పారు తన ‘సాహిత్య ప్రయోజనం’ వ్యాసాలలో.. ఒక వ్యక్తి తన సమస్యను చాలా సమర్థతతోనో, తెలివిగానో పరిష్కరించుకున్నట్లు రాసినంత మాత్రాన అది నిజమైన పరిష్కారం, అందరికీ వర్తించే మార్గం అవదు. స్త్రీ స్వేచ్చ గురించీ, లైంగిక పునరుత్పత్తి హక్కుల్ని గురించీ, రాసే రచయిత చేయగలిగిందేమిటంటే యింతవరకూ వ్యక్తి గతమైన విషయాలు నిరూపించి సాంఘిక పరిష్కారాల కోసం వెదకమని సూచించటం. ఆ సమర్థవంతంగా చేయటంలోనే నేటి స్త్రీవాద రచయితల విజయం, బలం కనిపిస్తాయి. స్వేచ్ఛ నవల అలాంటి ప్రయత్నమే అంటారు రచయిత్రి ఓల్గా గారు.

నివాస ప్రాంతం కర్నూలు. కవయిత్రి, కథా రచయిత. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు ప్రచురితమయ్యాయి. రచనలు: 'రెప్పచాటు రాగం'(మొదటి కవితా సంపుటి).

7 thoughts on “ఓల్గా – ‘స్వేచ్ఛ’

  1. చాలా బాగా వ్రాశారు. అభినందనలు

  2. ఇప్పుడే బుక్ చదివాను excellent గా ఉంది…మహిళలు స్వేచ్ఛను ఎలా పొందలో, మగవాళ్ళు మారాలి అని ఆలోచన కల్గించే బుక్.మహిళల పట్ల ఇంకొంచం గౌరవం పెరిగింది.ప్రతి మగాడు తనను తాను ప్రకాశంలో చూసుకొని మారడానికి try చేయాలి. నన్ను నేను చూసుకున్నాను.మా సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంది బుక్ రచయితగా గారికి ధన్యవాదాలు….జైభారత్..ఖదిజ్ఞాసి వంశీ

  3. ఇంకా మన సమాజం లో ప్రకాశం లే ఎక్కువగా ఉన్నారు.. 1987 కి ఇప్పటికి చాలా మార్పులు జరిగిన ,ప్రకాశం భావజాలం ఎక్కువగా గానే ఉన్నాయి
    మీ సమీక్ష బాగుంది.. అభినందలు

  4. లక్ష్మి గారూ! ఓల్గా గారి ‘ స్వేచ్ఛ ‘ నవలపై మీ సంక్షిప్తంగా, సమగ్రంగా ఉంది, చాలా బాగుంది. అభినందనలు.
    ముద్దు వెంకటలక్ష్మి,బెంగుళూరు.

Leave a Reply