ఓయి గణాధిప నీకు మొక్కెదన్!

వినాయక చవితి వెళ్ళిపోయింది!

ఒక్క వినాయకుడ్నీ వూళ్ళో వుండనివ్వకుండా తీసుకెళ్ళి నీట్లో ముంచేసి నిమజ్జనం చేసేశారు!

మళ్ళీ యేటికి గాని మా యింటికి వినాయకుడు రాడనుకున్నారు తలపోస్తూ కొందరు భక్తులు!

అదుగో అలాంటి వొక సమయ సందర్భాన…

రద్దీగా వుంది కూరగాయల పూర్ణా మార్కెట్!

ఒకానొక గృహిణి వొంద గ్రాముల అల్లం పదిరూపాయలు పెట్టి కొనబోతూ అందుకోకముందే అవాక్కయింది! వణుకుతున్న రెండు చేతులతో సున్నితంగా అల్లాన్ని తాకి కళ్ళకద్దుకొని కళ్ళుమూసుకొని నమస్కరించింది! అల్లం మీది మట్టి తీసి తన నుదురుకీ కంఠానికి బొట్టుగా పెట్టుకుంది! పక్కనున్న పెనిమిటికి యేమీ అర్థం కాలేదు! రాత్రీ పగలు పూజలు చేసి దీనికి పిచ్చి ముదిరిపోయిందని అనుకొని అంతలోనే చెంపల మీద లెంపలు వేసుకున్నాడు! తేరిపార చూశాడు!

అల్లం అల్లంకాదు! అమూర్తమూ కాదు! మూర్తమే! మూర్తే! సాక్షాత్తూ ఆ ఆది గణపతి మూర్తే!

ఒకరూ వొకరూ చేరారు! చూసిన వాళ్ళంతా ముక్కున్న వేల్లేసుకున్నారు! గుండెకు అరచేతుల్ని అద్దుకున్నారు! కళ్ళు మూసి తెరిచారు! ఎవరో వొక భక్తుడు ముందుకు దూకి ఆ అల్లానికి పసుపూ కుంకుమా పెట్టాడు! మరెవరో భక్తురాలు పూలు చల్లి దండ వేసింది! ఇంకెవరో దంపతులు టెంకాయ కొట్టి అరటిపళ్ళు పెట్టారు!

అప్పటికప్పుడు జనం గుమికూడి పోయారు!

ఒకరు ప్రమిద తెచ్చారు! మరొకరు నూనె పోసారు! ఇంకొకరు దూదితో వొత్తి చేశారు! ఒకే దీపం నలుగురు వెలిగించారు! అగరుబత్తీలు కట్టలకొద్దీ అంటించారు! కర్పూర హారతి ముట్టించారు! సాంబ్రాణి పొగ ధూపం వేశారు! అక్షింతలు అల్లం నెత్తిన చల్లారు! తమ నెత్తినా చల్లుకున్నారు!

ఒకవైపు ‘శుక్లాం బరదరం విష్టుం శశి వర్ణం చతుర్భుజం…’ అప్పజెప్పినట్టు వృద్ధ భక్తులు వల్లెవేస్తున్నారు! మరొకవైపు ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు అందుకొని కుర్ర భక్తులు తెగ గంతులేస్తున్నారు!

అప్పటికప్పుడు తన అంగడి అంగడిలా కాకుండా ఆలయంలా తయారుకావడంతో అమ్మినవాడు తుళ్ళిపడ్డాడు! అమ్మడం ఆపి గల్లాపెట్టె వొదిలి వొక్క వుదుటన అంగడి మీంచి కిందికి దూకాడు! అల్లం ముక్కని యిచ్చిన చేత్తోనే విసురుగా వెనక్కి తీసేసుకున్నాడు!

‘ఆ అల్లం నాది’ అంది గృహిణి! ‘కాదు, నాది’ అన్నాడు అమ్మినవాడు! ‘నీ దగ్గర పదిరూపాయలు నేనింకా తీసుకోలేదు’ అన్నాడు! ‘అయినా యీ అల్లం నాది, నేను యెవరికీ అమ్మను’ అని కూడా అన్నాడు!

‘ఏమిటయ్యా నీ పొగరు? ఆ? ఇందాకటి నుంచి చూస్తున్నాను… భగవంతుణ్ణి పట్టుకొని అల్లం గిల్లం అని వాగుతున్నావ్? కళ్ళు పేలిపోగలవ్’ అని ఆవేశపడ్డాడో వీరభక్తుడు! అతని ఆవేశానికి మరో నలుగురు ఆకర్షణకు లోనై జతకలిశారు! కాదంటే కళ్ళూ పల్లూ వొళ్ళూ యే వొక్కటీ మిగలవని అంగడివాడు ఆంతర్యం గ్రహించి వూరుకున్నాడు!

అదే అదునుగా భావించిన పురప్రజలు త్రినాధ స్వామి మేళా కథలో పేద బ్రహ్మడు గడ్డిలో ఆశగా వెతికినట్టు అల్లం బుట్టలో యింకా వినాయక మూర్తులు యేమైనా దొరుకుతాయేమోనని వెతికారు! మూర్తులు మాట దేవుడెరుగు! అల్లం మాత్రం మాయమైంది!  

అంగడివాడు బేలగా చూశాడు!

‘అల్లం దేవునికి అర్పితమనుకో’ పెద్దాయనొకడు సుద్దు చెప్పాడు!

పోయిన చోటే వెతుక్కోవాలని అంగడివాడికి తెలుసు! అందుకే ‘యీ అల్లం…’ అని నాలుక్కరుచుకొని ఆగి ‘యీ అల్లం వినాయకుడుని అసలైన భక్తులకు అప్పజెప్పాలని అనుకుంటున్నాను’ అన్నాడు!

అంతే-

ఎవరికీ వాళ్ళే మేమే అసలైన భక్తులమని నమ్మిన పురప్రజలు- మాక్కావాలి అంటే మాక్కావాలి- అని ముందుకు వచ్చారు! పోటీపడ్డారు! పోటెత్తారు! పోట్లాడుకున్నారు!

టీవీ మీడియా వాళ్ళు లైవ్ యిచ్చేయడం మొదలు పెట్టారు! యాంకర్లు జీన్సూ టీ షర్టులూ మార్చేసి చీరలు కట్టేసి గాజులూ పూలూ నెత్తిన సింధూరంతో రెండు చెంపలకూ గంధం పూసుకొని పరమ భక్త శిఖామణుల్లా నోటికొచ్చింది ఆపకుండా చెప్పడం మొదలు పెట్టారు!

‘అందుగలడు యిందులేడు అని సందేహం వలదు… యెందెందు వెతికినా అందందే గలడు! వెతక్కపోయినా కలడు! కలడు కలండు అనెడి వాడు కలడో లేడో? అనుమానం అక్కర్లేదు! దేవుడు అన్నింటా వున్నప్పుడు అల్లంలో మాత్రం యెందుకు వుండకూడదు?’

కెమెరాలూ మైకులూ చూసిన భక్తుల్లో తమభక్తిని బయటపెట్టుకోవాలన్న వుబలాటం కలిగింది! తగ్గట్టే నోరున్న వారికల్లా మైకులు అందాయి!

‘అల్లంలో వెలసిన అపురూప వినాయకుణ్ణి మొదట చూసిందెవరు?’ యాంకర్ అడగడమే తరువాయి ఆ వొకానొక గృహిణి ‘ఆ ఆది దేవుడు నా చేతుల్లోకి వచ్చేసరికి నా చేతులు ఖాళీగా లేవు, ఆయన్నే ప్రార్ధిస్తూ వున్నాయి…’ అని చెప్పింది! ఆమె భాష మారిపోయింది! ఆమె పెనిమిటి మాత్రం ‘మేం పదిరూపాయలకు కొన్న అల్లాన్ని యిప్పుడు షాపువాడు మాకు యివ్వడం లేదు, వేలం పాట పాడుకోమంటున్నాడు… సొంతం చేసుకోమంటున్నాడు’ అంటూ వాపోతున్నాడు!

ఇంతలో వేలం పాట మొదలైపోయింది!

‘అందరూ భక్తులే! నాకు అందరూ కస్టమర్లే! భక్తులైన కస్టమర్స్ నుండి వొచ్చిన డిమాండ్ మేరకు అల్లంలో వెలసిన అపురూప వినాయకుణ్ణి సొంతం చేసుకోవడానికి అందరూ కలసి వో అంగీకారానికి వచ్చారు! వేలం పాటే శరణ్యం అనుకున్నారు!’ అంగడి వాడి మాటలు వినిపించకుండా అరుపులూ కేరింతలూ!

అంతలోనే తామేమీ తక్కువ కాదన్నట్టు యాంకర్లు బరిలోకి దూకి ‘మనం యిది వరకు వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు వేలంపాటలో సొంతం చేసుకోవడాన్ని చూశాం! ఈసారి యేకంగా వినాయకున్నే సొంతం చేసుకోవడాన్ని చూస్తున్నాం! లడ్డూ ప్రసాదాల ధర లక్షల్లో పలికింది! మరిప్పుడు అల్లం వినాయకుడి ధర యెంత పలుకుతుందో చూద్దాం!’ అని వూపిరి తీసుకోవడానికి ఆగారు!

‘అల్లం అంగడి వాడి అల్లం వినాయకుడి ధర కేవలం వొకే వొక్క రూపాయి’ అని మైకులో వినాయక యూత్ అసోసియేషన్ ప్రకటించింది!

ఆ వొక్క రూపాయి అమెరికా డాలర్లా పైపైకి యెగబాకింది! వంద కాదు, యేకంగా వెయ్యి అన్నారెవరో! వెయ్యి కాదు, పదివేలు అన్నారు మరెవరో! ఇరవై ముప్పై నలభై యాభై… వంద వేలు లక్షకు చేరింది! మూడు లక్షల దగ్గర వొక నిముషం ఆగి వేల మీద పాకి పరిగెత్తి నాలుగు దగ్గర… నాలుగు లక్షల దగ్గర ఆగింది!

వేలం వెర్రిగా వేలం పాట!

అంగడివాడికి శ్రావ్యమైన పాట అంతలోనే కర్ణ కఠోరంగా మారిపోయింది! వచ్చే వినాయక వుత్సవాలు ఆ అంగడివాడే నిర్వహిస్తున్నట్టు వాడిని అడక్కుండానే ప్రకటించేశారు!

నాలుగు లక్షలకు అల్లం వినాయకుణ్ణి దక్కించుకున్నది యెవరో కాదు, ఆ వొకానొక గృహినే! ఆమెకూ ఆమె పెనిమిటికీ పూలదండ పడింది!

‘మొదట నేనే అల్లం చూశాను! అల్లంలో ఆది దేవుణ్ణి చూశాను! అందుకే యెంత ఖర్చయినా వెనక్కి తగ్గకూడదని అనుకున్నాను! నా చేతికి వొచ్చిన దేవుణ్ణి వొదులుకో దల్చుకోలేదు! ఎంత దూరమైనా వెళ్ళి నా యింటికి నా యిలవేల్పుని తీసుకు వెళ్ళదల్చుకున్నాను!’ తృప్తిగా అల్లాన్ని చూసిందా గృహిణి!

ఆమె పెనిమిటి ‘ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టుంది’ అని, యుద్ధంలో గెలిచిన వీరునిలా అల్లాన్ని యెత్తి పట్టుకొని ట్రోఫీలా చూపించాడు!

‘కానీ మీ ముఖంలో ఆ సంతోషం కనిపించడం లేదు’ యెవరో అడిగారు! అప్పుడు అతను బిగుసుకున్న కండరాలను బలవంతాన వదులు చేసి నవ్వి ‘అదేం లేదు, వంద గ్రాముల అల్లం వంద గ్రాముల బంగారం రేటుకి కొన్నాం, కారణం అల్లంలో ఆక్షణమే మా ఆవిడ దేవుణ్ణి దర్శించింది, యింటికి వెళ్ళి దర్శించి వుంటే’ అని అంటున్నప్పుడు అతని గొంతు రుద్దమైంది! ‘ఇంతమంది వుండగా దేవుడు మాకే దర్శనమిచ్చాడు! అందుకే సొంతం చేసుకోవాలనిపించింది’ అని మరి మాట్లాడలేకపోయాడు!

ఆది దేవుడు అలా తాను అంగడి వీడి అయినింట్లో అధిష్టించాడు!

అల్లానికి పూజలు చేశారు! పట్టు వస్త్రాలు కట్టారు! ధూప దీప నైవేద్యాలు పెట్టారు! తీర్థ ప్రసాదాలు పంచారు! చుట్టాలూ బంధువులూ వచ్చారు! ఊరూ వాడా వచ్చారు! అంతా పొగడి పోయారు! ఆ దంపతులు ధన్యులని తీర్మానించారు! వచ్చీ పోయే వాళ్ళతో యిల్లు బజారయ్యింది! బేజారయ్యింది!

ఆ దంపతులు పేపర్లలో టీవీల్లో వార్తలయ్యారు! ఇంటర్వ్యూలిచ్చారు! చర్చా వేదికలెక్కారు! ఎందరికో మనోభావాలయ్యారు! మరెందరి మనోభావాల్నో నిలబెట్టారు! మనోభావాలు గాయపడకుండా మరింతమంది మద్దతు కూడా కూడగట్టుకున్నారు!

అక్కడికి రెండ్రోజులకే అల్లం వినాయకుడు వాడిపోయాడు! అంటూ ముట్టూ అనకుండా అందరూ అంటుకోవడం వల్ల దైవం కళ తప్పిందని దైవిక శాస్త్రకారులూ పెద్దలూ చెప్పారు! దాంతో అల్లం వినాయకునికి పంచామృతాలతో అభిషేకం చేశారు! అలాగే అందరూ యింట్లోకి రాకుండా కట్టుదిట్టం చేశారు! అలాగని సైన్సునీ విస్మరించలేదు! అల్లం వాడిపోకుండా యిరవైనాలుగ్గంటలూ ఏసీ పెట్టమని మనలో మన మాటగా చెప్పిన వాళ్ళ మాటని మన్నించకుండా వుండలేదు!

మర్రోజుకి అల్లం ఆకుపచ్చని మొనలు వేయబోతూ బొడిపెలు బయల్దేరాయి!

దేవుడికి అమ్మవారు పూసిందని కొందరు! వేప కొమ్మలూ రెమ్మలూ తెచ్చి పరిచారు! ధూపం పట్టారు! ధూళి దుమ్మూ తగలనివ్వకండి అన్నారు యింకొందరు! గాలి తగలనివ్వండి గాలి ఆడనివ్వండి అన్నారు మరికొందరు! అందరూ అన్నట్టల్లా చేశారు! అయినా అసంతృప్తి! అంతకు మించిన దిగులు!

‘దేవుడు రోజుకో రూపు దిద్దుకుంటాడు’ అన్నారు భవిష్యత్తుని వూహిస్తూ కొందరు పండితులు!

ఆ మాటలు అల్లం చిగుళ్ళు వేస్తుందని గుర్తు చేసింది! అలా యెప్పటికప్పుడు ‘అల్లం’ అనే మాట అన్నప్పుడల్లా అనుకున్నప్పుడల్లా ఆ దంపతులు లెంపలు వేసుకున్నారు! ‘ఆది దేవుడా.. మూషిక వాహనా.. మమ్మల్ని మన్నించు’ అని వేడుకున్నారు!

సరిగ్గా అప్పుడే మూషికమొకటి ఆ యింట్లో పరుగులు తీసింది! కొట్టబోతే వినాయకుడి వాహనం… కొడితే యేమి వుపద్రవం ముంచుకొస్తుందోనని చేతులు కట్టుకున్నారు!

అయితే యివేవీ తెలీని ఆ యింట అప్పటికే వున్న అటుక్కోడి- యెవరూ లేనప్పుడు అలవాటుగా అటుకు దిగింది! అవతలకు వెళ్ళింది! నాలుగు గింజలు మేసి యింట్లోకి వచ్చింది! ఎలుకను చూసింది! వినాయకుడి వాహనం కదా అని దయతలచలేదు! వొదిలి పెట్టలేదు! వెంటపడింది!

ఎలుక అల్లం వినాయకుడి వెనకాల దాక్కుంది! అటుక్కోడి గొటగొటలాడుతూ గబుక్కున వెళ్ళింది! దానికి యెలుక కనిపించలేదు! అల్లం వినాయకుడి లోని వినాయకుడూ కనిపించలేదు! దాని మూర్ఖపు కళ్ళకి అల్లమే కనిపించింది! అంతే- ముక్కుతో పొడిచింది అటుక్కోడి! అల్లం వినాయకుడుని నోట కరచుకొని అవతలకు వీధిలోకి తీసుకువెళ్ళి బుగ్గిలో పడేసి పొడుస్తుంటే పక్కింటి యెడ్డి ముసల్ది చూసింది! అటుక్కోడిని అదిరింది! ఎక్కడినుండి యెత్తుకి వచ్చిందో అనుకుంది! బూడిద నిండిన అల్లాన్ని తెచ్చి కడిగింది! రోట్లో వేసింది! దంచింది! పచ్చడి చేసింది!

అయితే ఆ తెల్లవారి వో వార్త గుప్పుమంది?!

అల్లం వినాయకుడు మాయమైపోయాడని!

ఎలా మాయమైపోయిందీ కథలు కథలుగా చెప్పుకోవడం మొదలైంది!

రాత్రి పట్టు పరుపుల మీద పడుకోబెట్టామని- తెల్లవారి లేచేసరికి అదృశ్యమై పోయాడని- ఆ దంపతులు తాము యెరిగిందే చెప్పుకున్నారు! మూషిక వాహనాన్ని చూశామని కూడా అన్నారు! ఆ మూషికం యెప్పుడూ అల్లం వినాయకుడి దగ్గరే తచ్చాడుతుండేదని అబ్బురపడుతూ గుర్తుచేసుకున్నారు!

అయితే ఆ మూషికం మీద యెక్కి వినాయకుడు దేవలోకం వెళ్ళిపోయాడని కొందరు బుగ్గలు నొక్కుకున్నారు!

రాత్రి అరుగు మీద పడుకున్న వొకరిద్దరయితే మేఘాలు గావల్ల తేలిపోతున్నాయని అనుకున్నామని- అది వినాయకుడు మూషిక వాహనమెక్కి కైలాసానికి సాగిపోతున్నాడని కానుకోలేకపోయామని- కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు!

మన అమ్మానాన్నలే మనతో జీవితకాలం వుండరని- అలాంటిది లోకానికంతటికీ అమ్మానాన్నలైన ఆ దేవ దేవుడు మనతోనే యెలా వుండిపోతాడని- దక్కినంత కాలమే దర్శనమని- ఆ దంపతుల్ని యింగితం తెలుసుననుకున్న పెద్దలు వూరడించారు!

ఆ దంపతులు ఆ పూట యింట్లో అగ్గి వెయ్యలేదు!

ఆకలితో వుండడం యేమీ బాగోలేదని యిరుగూ పొరుగూ అన్నమూ పులుసూ తెచ్చి యిచ్చారు! పక్కింటి యెడ్డి ముసల్ది అల్లం పచ్చడిని అలవాటుగా మనవడితో పంపింది!

తినబోతూ చెయ్యి వేళ్ళాడేసిన దంపతులతో ‘మహిమాన్వితుడైన భగవంతుడు యెక్కడ లేడు? నీలో లేడా? నాలో లేడా? పరబ్రహ్మ స్వరూపమైన యీ అన్నంలో లేడా? నీ ఆకలిలో లేడా?’ అని పంతులుగారు కుర్చీలో కూర్చొని దెబ్బలాటకు దిగినట్టే తినమని కోప్పడుతున్నారు!

అయితే అల్లం పచ్చడిలో ఆది దేవుడు వున్నాడని అక్కడ వున్న యెవ్వరూ గుర్తించలేదు?!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

One thought on “ఓయి గణాధిప నీకు మొక్కెదన్!

Leave a Reply