ఒక రాజకీయ కథ

తమిళ మూలం : ఉమా వరదరాజన్
ఇంగ్లిష్ అనువాదం : ఎస్. రాజ సింగం, ప్రతీక్ కంజిలల్
తెలుగు : కాత్యాయని

ఎంతో కాలంగా ఎవరికీ పట్టని ఆ నగరం హటాత్తుగా ఉలిక్కిపడి నిద్రలోంచి లేచింది. యుద్ధకాలంలో విధ్వంసానికి గురైన పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాజుగారు నగరానికి వస్తున్నారని ప్రకటన వెలువడింది.

ఆ నగరాన్ని ఆనుకుని ఒక నది ప్రవహిస్తున్నది. దాని జలాలు రుధిర వర్ణం లో ఉంటాయి. గట్ల వెంబడి విస్తరించిన వెదురు వనాలు చిన్న నిప్పురవ్వ పడినా జ్వలించటానికి సిద్ధంగా ఉంటాయి. యుద్ధం ముగిసి మూడేళ్ళయినా ఏనుగుల ఘీంకారాలూ, అశ్వాల సకిలింపులూ, ఆయుధాల లోహ ధ్వనులూ, మనుషుల ఆర్తనాదాలూ, నగర వీధులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మానవ కళేబరాలు తగలబడుతున్న కమురు వాసన గాలిలో ఇప్పటికీ తేలుతూనే ఉన్నది. చెట్లపై తిష్ట వేసిన రాబందుల గుంపులు మళ్లీ యుద్ధం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాయి. నగరపు గతవైభవానికి గుర్తులుగా నల్లబడిన గోడలు, విరిగిన పైకప్పుల నగిషీలు మిగిలి పోయాయి. తీతువు పిట్టల కూతలూ, వీధి కుక్కల మొరుగుడూ రాత్రుల నిశ్శబ్దంలో భయపెడుతూ ఉంటాయి.

ఆ నగరపు ఆకాశంలో ఉదయించటానికి సూర్యచంద్రులు సంకోచిస్తారు. పాలివ్వమని తల్లులను అడిగేందుకు పిల్లలు భయపడతారు. సైనికుల కరకు గద్దింపులూ, వికటాట్టహాసాలూ, రాత్రులను వణికిస్తుంటాయి. నగరంలోని ఒక ఇంట్లో, చూపులను పైకప్పుకు అంటించి మత్తుమందు తిన్నవాడిలా ఎప్పుడూ అలా పడుంటాడు ఊమాయన్. అతని పేరుకు అర్థం, మూగవాడు. అతడు ఎన్నడూ నోరు తెరిచి మాట్లాడక పోవటంతో అలా పిలుస్తుంటారు. అతడికి సొంత పేరంటూ ఒకటి ఉండేదని జనం మర్చే పోయారు. అతడికి మాట పడి పోవటానికి కారణం ఏమిటో వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసు.

మూడేళ్లకిందట నగరంలో తలెత్తిన తిరుగుబాటును అణచి వెయ్యటానికి రాజు సైన్యాన్ని పంపాడు. సైనికులతో పాటే గూండాలు, కరడుగట్టిన హంతకులు కూడా వచ్చి చేరారు. వాళ్ళు నగరంలో స్వైరవిహారం చేశారు. భవనాలను కూల్చారు, శిల్పాలను ధ్వంసం చేశారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు, పసిపిల్లలను హింసించారు. ఇదంతా ముగించుకుని వాళ్ళు వెళ్లేనాటికి ,అడవి ఏనుగుల మంద తొక్కిన వెదురు వనం వలె మిగిలింది నగరం.

ఆ రోజుల్లోనే, ఊమాయన్ దగ్గర ఒక సేఫ్టీ రేజర్ దొరికిందనే నెపంతో అతన్ని బంధించారు. చేతులు వెనక్కి విరిచికట్టి, ఎండకు కాలిపోతున్న ఇసుక దారులగుండా వుత్తి పాదాలతో నడిపించారు. నిప్పుల గుండం లాంటి తారు రోడ్డు పై మోకాళ్ళపై కూర్చుని సూర్యనమస్కారాలు చేయించారు. నోట్లో కంకర రాళ్లను కుక్కి కడుపులో పిడి గుద్దులు గుద్దారు. “అ. . . మ్. . . మా!” అంటూ ఆక్రోశించిన అతడి గొంతు నుండి శబ్దం బయటికి రాలేదు- మరెప్పటికి కూడా!

ఆ సాయంత్రానికి ఊమాయన్, మరి కొందరు సొమ్మసిల్లి వీధిలో పడి ఉన్నారు. నగరం నిర్మానుష్యంగా ఉంది. కనబడిన దారి వెంట వాళ్ళు ముందుకు నడిచారు. వాళ్ల నీడలే వాళ్లకు తోడు. వీధి మలుపు తిరిగే సరికి కొందరు స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ కుటుంబాల మగవాళ్ళు వున్నారేమోనని పరికించి చూసి, నిరాశ పడ్డారు. జుట్టు పీక్కుంటూ గుండెలు బాదుకుంటూ రోదించారు. అమ్మ చంకలో ఉన్న ఒక పసిపాప, నాన్న మరణించాడని తెలియక నోట్లో వేలేసుకుని బోసినవ్వు నవ్వింది. ఆ అనాథ స్త్రీల రోదనను సరుగుడు చెట్ల నుండి వీచే గాలి ఈనాటికీ వినిపిస్తూనే ఉంది.

జీవితమంతా హాయిగా, సురక్షితంగా సాగిపోతుందనే భరోసాతో ఉండేవాడు, ఒకప్పుడు ఊమాయన్. ఆనాటి తన అమాయకత్వానికి ఇప్పుడు నవ్వొస్తుంది. ఇక జీవితం అత్యంత కఠినమనీ, మెడపై కత్తిలా చావు వెంటాడుతూనే ఉంటుందనీ అర్థమైంది. బతుకుపై ఆశలు కోల్పోయిన అతడు, ఇంటినుండి బయటికి రావడమే మానేశాడు. తలుపులు మూసిన గదిలో, అలముకున్న నిశ్శబ్దంలో తనను తాను సమాధి చేసుకున్న అతడి ముఖం రక్తహీనతతో పాలి పోయింది. ఉచ్చులో చిక్కిన జంతువు వలె అతడి చూపుల్లో ఆందోళన స్థిరపడి పోయింది.

ఊమాయన్ కు నిద్ర పూర్తిగా దూరమైంది. రాత్రింబవళ్ళు కళ్లముందు ఏవేవో భ్రాంతులు దృశ్యాలుగా కదలాడుతాయి. కనుగుడ్లు వెళ్లుకొచ్చిన మనుషులు న్యాయం చేయాలని అడుగుతూ మీది మీదికి వస్తుంటారు. సగం కాలిన శవాలు చితుల్లోంచి లేచి, “మేమేం నేరం చేశాం?” అని గద్దిస్తాయి. తల తెగిన కోడిపెట్ట గిలగిలా కొట్టుకుంటుంది. చూడి మేకను వెంట తరుముతూ ఒక శకటం మీదికి వస్తుంది. బాటసారులను వెంటబడి కరిచే పిచ్చి కుక్కలు. ఈ దృశ్యాలతో బాటు అతడి కలల్లో రాజుగారు కూడా ప్రత్యక్షమవుతాడు. బుద్ధుడిని పోలిన ముఖంతో దివ్యమైన చిరునవ్వుతో మూర్తీభవించిన కరుణ వలె ఉంటాడాయన. అయితే ఇదంతా ఉత్తి నటన మాత్రమేనని, అతడి నిజ స్వరూపం అతి మోసపూరితమని జాలీ దయా మచ్చుకైనా లేని పైశాచిక ప్రవృత్తి అనీ మనసుకు ఎలాగో తెలిసి పోతున్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది.

నిజంగానే రాజుగారిని గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనకు తెల్లని పావురాలను పెంచటమంటే ప్రీతి అనీ, మనుషుల పుర్రెలను దండ గుచ్చి మెడలో ధరించటం మహా ఇష్టం అనీ కూడా చెప్పుకుంటారు. ఎక్కడో భూగర్భంలో ఉండిన తన పూర్వీకుల కిరీటాన్ని తవ్వి తీయించి తలపై ధరిస్తున్నాడని, ఆయన ఎక్కడికి వెళ్ళినా తన సింహాసనాన్ని వెంటబెట్టుకుని వెళతాడని కథలుగా చెప్పుకుంటారు.

రాజుగారి ఆశ్రితవర్గం కీర్తించే విధంగా దయామయుడి రూపంలో ఆయనొకసారి ఊమాయన్ కలలో కన్పించాడు-

అది తొలిసంధ్య వేళ. మంచుతెరలు ఇంకా కరిగిపోలేదు. పక్షుల కలకూజితాలతో పాటు గుడి గంటల సవ్వడి, వేదమంత్ర ఘోష వినబడుతున్నాయి. ధవళ వస్త్ర ధారియైన రాజుగారు తన చేతుల్లోని తెల్ల పావురాన్ని ప్రేమగా నిమురుతూ నది గట్టున నడిచి వెళ్తూ ఉన్నారు. ఊమాయన్ కూడా ఆయన వెనకాలే నడుస్తున్నాడు. రాజుగారి ప్రకాశం ఎదుట వెలవెల పోతున్నసూర్యుడు ఆకాశంలో పైకి రావటానికి సందేహిస్తున్నాడు.

రాజుగారు ఆకాశం వైపు చూస్తూ “కాసేపట్లో తెల్లవారుతుంది”, అన్నారు.

రాజుగారి ప్రసన్నవదనాన్ని చూసి ఊమాయన్ కు నోరు విప్పే ధైర్యం వచ్చింది. “తెల్లవారే లోగానే మేమందరం మరణించబోతామని మీరెరుగరా మహారాజా! ఇప్పటికే మేము జీవచ్ఛవాలుగా మారామయ్యా!” అన్నాడు గొంతు పెగుల్చుకుని.

రాజుగారి నడక ఆగింది. తలతిప్పి అతడికేసి చూసి, “యుద్ధానికి దిగినప్పుడు యుద్ధం లాగే ఉంటుంది మరి! మీరు శాంతిని కోరుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది” అన్నాడు మెత్తని చిరునవ్వుతో.

ఆయన మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ సంకోచంగానే ఇలా అన్నాడు ఊమాయన్, “యుధ్ధ నీతి అనేదయితే ఒకటి ఉంటుంది కదా మహాప్రభూ! ఈ ప్రజలు చేసిన నేరమేమిటి? వృద్ధులూ, స్త్రీలూ, పసి పాపలూ ,అనే జాలి సైతం లేకుండా హతమార్చడం న్యాయమేనా?”

మరోసారి చిరునవ్వు నవ్వాడు రాజు. “రథం సాగిపోతూ ఉన్నప్పుడు గడ్డీ గాదమూ, పురుగూ పుట్రా నలిగి పోవటం సహజం. ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? ఐనా ఈ విషయాలన్నీ నీకెందుకు? అదంతా నేను చూసుకుంటా. నాకు అన్ని విషయాలూ తెలుసు…”

“ఔను, మీకు ఏదైనా సాధ్యమే…”

“ఔను. నేను తలచుకుంటే ఏదైనా సాధ్యమే! తెలుసుగా, జాగ్రత్తగా మసలుకో” అన్నాడు గంభీరంగా.

చూస్తుండగానే, అంతసేపూ ఆయన చేతుల్లో ఉన్న తెల్ల పావురం మాయమై, తలతెగి నెత్తురోడుతున్న కుందేలు ప్రత్యక్షమైంది.

***

రాజుగారి పర్యటన దగ్గర పడేకొద్ది హడావిడి పెరిగింది నగరంలో. వాన కురిస్తే పుట్టుకొచ్చిన పుట్ట గొడుగుల లాగా నగరం నిండా తనిఖీ కేంద్రాలు వచ్చి చేరాయి. నగరాన్ని అలంకరించటానికి పనివాళ్ళు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. సమాధుల చుట్టూ పూలతీగలను చుట్టి పైన చక్కటి పూల మొక్కల కుండీలను అమర్చారు. పెద్ద పెద్ద వృక్షాలను వేర్లతో సహా పెకలించుకు వచ్చి నగర ద్వారానికి ఇరువైపులా నాటారు. ఎక్కడ చూసినా రాజుగారి చిత్రపటాలు ఎదురవుతున్నాయి.

తనిఖీ కేంద్రాల దగ్గర ఎడ్లబండ్లు పెద్దఎత్తున నిలిచిపోయాయి. తలలపై బరువైన మూటలతో వర్షంలో తడిసిపోయి అలాగే నిలబడ్డారు జనం. వాళ్ళదగ్గర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన సామాగ్రి ఏమైనా ఉందేమోనని సైనికులు తనిఖీలు చేస్తున్నారు. దారితప్పి నగరంలోకి రాబోయిన ఒక ఆవును పట్టుకుని, ఆయుధాలు ఏమైనా ఉండ వచ్చేమోనన్న అనుమానంతో దాని పొట్ట చీల్చి చూశారు. పీకలదాకా కల్లు తాగిన కొన్ని గుంపులు
“రాజుగారు వస్తారు – మనకు ఆలయాన్ని ఇస్తారు
ఇంకా ఇంకా ఇస్తారు – మనం అడిగిందల్లా ఇస్తారు”
అని పాడుతూ గంతులేస్తున్నారు.

ఊమాయన్ వాళ్ళ తాత, వసారాలో కూచుని పోకలు పగలగొడుతూ ఉన్నాడు. ఈ బాజాలూ పాటలూ వినబడుతున్న వైపు తలతిప్పాడు. ఆయనకు కళ్ళు కనబడవు, కానీ చెవులు మహా చురుకు. “ఆయన కట్టించే ఆ గుడిని పగలగొట్టటానికి ఎంతసేపు పడుతుందట? ఒక్క మనిషి చాలు!” అన్నాడు ఎగతాళిగా. ఆ తర్వాత, మెత్తగా దంచిన ఆకూ వక్కా నోట్లో వేసుకుని నములుతూ కూచున్నాడు.

ఆ మరునాడు-

నిద్రలో ఉన్న ఆ ముసలాయన గుర్రాల గిట్టల చప్పుడు వినబడి ఉలిక్కి పడి లేచి కూచున్నాడు. వీధిలోకి తొంగిచూసిన ఆడవాళ్ళు చటుక్కున లోపలికి దూరి తలుపులు మూసుకున్నారు. ఊమాయన్ వాళ్ల అమ్మ భయంతో వణికి పోతూ ఆకాశం వైపు చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తున్నది. సైనికులు ప్రతి ఇంట్లోకి దూరి తనిఖీలు చేశారు. వాళ్ళు ఊమాయన్ ను లాక్కుపోతుంటే, ఆమె ఏడుస్తూ బతిమాలినా లాభం లేకపోయింది. అలాగే చాలా ఇళ్ల లోంచి మగవాళ్ళను లాక్కుని పోతుంటే నిస్సహాయంగా విలపించారు స్త్రీలు. ముసలాయన వాళ్ళను ఓదార్చి ధైర్యం చెప్పాడు.

అలా తెచ్చిన మగవాళ్ళనందరినీ నగరం లోని కొన్ని భవనాల్లో కుక్కి తాళాలు వేశారు. నేలపై పడి రోదిస్తూ తలరాతను తిట్టుకోవడం తప్ప జనానికి మరో దారి లేదు. వాళ్ళను చూసి వికటంగా నవ్వారు సైనికులు.
చల్లగా, తడిగా ఉన్న ఒక గోడకు ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు ఊమాయన్. అతడి కళ్లముందు మళ్లీ దృశ్యాలు కదలసాగాయి – వధ్య శిలపై వేలాడుతున్న విచ్చుకత్తులూ, గాలిలో కదలాడుతున్న ఉరితాడు కనబడ్డాయి. తనను గొంతుదాకా నేలలో పూడ్చిపెట్టి, ఒక ఏనుగును మీదికి పంపినట్టు, నగ్నంగా ఉన్న తన శరీరంపై పెద్ద పెద్ద కదుములు కట్టినట్టు ఊహలు. తన ఇల్లు కూడా కనబడింది. అదంతా మురికిగా, రాలిపడిన ఎండుటాకులతో చిందవందరగా ఉంది. తన పెంపుడు కుక్క, గుమ్మంలో అడ్డంగా పడి ఉంది. ఆరిపోయిన పొయ్యిలో పిల్లి ముడుచుకుని పడుకుంది. శుష్కించిన శరీరంతో తల్లి ఏడుస్తూ ఉంది. తాతయ్య ఎండిపోయిన వక్కపలుకులా పడి పోయాడు ఓ మూల.

***

తెల్లవారింది.

ఒక సైన్యాధికారి వచ్చి తలుపులు తెరిపించి అందరినీ బయటికి రమ్మని ఆదేశించాడు. ఆకలిదప్పులతో అల్లాడుతున్న జనాన్ని బండ్లలోకి ఎక్కించి నగర శివారు లోకి తోలుకుపోయారు. మురికి జంతువులాగా ఉన్న తనను వీధుల్లో అందరూ చూస్తుంటే సిగ్గుతో చచ్చి పొతున్నట్టు అయింది ఊమాయన్ కు. చెరువు గట్టున ఉన్న ఒక పాడుబడిన ఆలయం ఎదుట అందరినీ కూచో బెట్టారు. ఆకాశం దట్టంగా మబ్బు పట్టి ఉంది.

“రాజుగారు వర్ధిల్లాలి” అంటూ ఒక గొంతు నినాదం ఇవ్వగానే, ఒక్కపెట్టున సంగీత వాద్యాలు మోగాయి. పిల్లల నృత్యాలు మొదలయ్యాయి. రాజుగారు ప్రాంగణంలో అడుగు పెట్టారు. హుందాగా ఒక్కొక్క అడుగే వేస్తూ ముందుకు నడిచారు. జనం పూల వర్షం కురిపించారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. సుందరంగా అలంకరించిన వేదిక వద్దకు రాజుగారిని తోడ్కొని వెళ్లారు. భారీగా పోగైన జనాన్ని తృప్తిగా పరికించి, చెయ్యెత్తి అభివాదం చేశాడు రాజు. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, మర్యాద సూచకంగా వింజామరలు వీస్తున్నారు. ఆయనకు వీపు దురద పెడితే గోకటానికి కూడా సిద్ధంగా భృత్యులు ఆయన వెనకాల నిలబడ్డారు.

కారు మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తల పైకెత్తి చూశాడు ఊమాయన్. చిన్న పక్షి రెట్టంత చినుకు ముఖంపై రాలింది. ఆ వెంటనే జలజలా జల్లు మొదలైంది. స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. తుపాను విరుచుకు పడింది. మెరుపులు కత్తుల్లా మబ్బులను చీల్చుతున్నాయి. రాజుపై ఆగ్రహంతో దేవతలు పళ్ళు నూరుతున్నట్టుగా ఉరుములు పెళ పెళలాడాయి.

లేచి నిలబడి ప్రసంగం మొదలు పెట్టాడు రాజు – “నా ప్రియమైన ప్రజలారా! ఈ ఆలయాన్ని పునరుద్ధరించి మీకు కానుకగా అందించటానికి ఈరోజు ఇక్కడికి వచ్చానని మీకు తెలుసు. మీకు ఇంకా ఏ కోరికలున్నా అడగండి. సందేహం అక్కర్లేదు, అడగండి!”

వాన హోరూ, గాలి విసురూ తప్ప, అందరూ నిశ్శబ్దం. సైనికుల పహారా నడుమ వణికిపోతూ కూచున్నారు జనం.

“ఇంత వర్షాన్ని లెక్కచేయకుండా వేలాదిగా తరలి వచ్చి స్వాగతం పలికినందుకు సంతోషం. మీకొరకు ఏమి చెయ్యటానికైనా సిధ్ధంగా ఉన్నాను. చెప్పండి ఏం కావాలో!”

వర్షం ఆగిపోయింది. ఆకాశం వైపు చూశాడు ఊమాయన్. మెరుపులు, ఉరుములు వస్తూనే ఉన్నాయి.

“మీకొరకు బ్రహ్మాండమైన భవనాలను నిర్మిస్తా. రహదారులను, చెరువులనూ మరమ్మత్తు చేయిస్తా. ఇంకా. . . ప్రదర్శనశాలలు కావాలా, ధాన్యమా, పట్టు వస్త్రాలా? అడగండి! ఏమడిగినా ఇవ్వటానికి అభ్యంతరం లేదు, కానీ…”

రాజుగారి మాట పూర్తికానేలేదు, భూమ్యాకాశాలను ఏకం చేస్తూ కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపూ, దాని వెంటనే చెవులు చిల్లులు పడే వురుమూ వచ్చి, పరిసరాలు దద్దరిల్లాయి. భయంతో కళ్ళు మూసుకున్నాడు ఊమాయన్.

కాసేపటికి అతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదుటనున్న వేదిక, దానిమీది రాజుగారూ కూడా మాయం! ఎవరికీ అంతుబట్టని రీతిలో అదృశ్యమై పోయారు మహారాజు గారు.

(శ్రీలంకలో స్థిరపడిన తమిళ రచయిత ఉమా వరదరాజన్. తమిళుల జాతి విముక్తి పోరాటంపై రచనలు చేశారు. రణసింగే ప్రేమదాస అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తమిళులపై సాగిన హింసను, దాని ప్రతిచర్యనూ ఈ కథలో ప్రతీకాత్మకంగా చిత్రించారు.)

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

2 thoughts on “ఒక రాజకీయ కథ

  1. Very good. Would you please let us know the period of original write up?

  2. థాంక్సండీ .ఈ కథ 1993 లో ‘ ద లిటిల్ మాగజీన్ ‘ లో ప్రచురితమైంది.

Leave a Reply