ఒక ముఖం మూడు కన్నీటి చారికలు

అలాగే చూస్తూ ఉండిపోతే
పొగిలి పొగిలి ఏడుపే వస్తుంది
రెండు వేరుపడ్డ ముఖాల బేల చూపు
ఊదు పొగలా దేహాంతరాళలో చొరబడుతుంది
మాట కూడా నీళ్ల వరదలో కొట్టుకుపోయిన
కాగితం పడవలా అనాథ అవుతుంది

బాధ కూడా కొన్నిసార్లు మౌన సంకేతాలతో
మనిషిని తట్టి లేపి,
తప్పిపోయిన తనవాళ్ళ జాడ చెప్పుమని
నిలదీస్తుంది
గోడ రాళ్ళ దెబ్బలు తిని గాయపడాల్సిన చోట
చిగురు స్వప్నాల చెదిరిన నవ్వు కనబడుతుంది

ఉట్టిగా ఉండనివ్వని నేల దుఃఖాన్ని ఎవరైనా
ఒంటెలా మోసారా
ఏకధారగా స్రవిస్తున్న ఆర్తనాదాలని
దోసిట్లోకి తీసుకొని సంభాషించారా ఎప్పుడైనా
రహస్యంగా బతుకుతున్న బాల్యం నీడలవెనక
వెలుతురు ఆకారమై నిలబడగలిగామా

సరిహద్దులు దాటి పాదాలు ప్రయాణించకపోవచ్చు
విశ్వమంతా గిరికీలు కొట్టే మనసుకేమైంది
అరుపులకు సముద్రం అలలు భయపడుతున్నాయి
ఖర్జూర సారాయి తగిన గాలి ఒడలిపోతున్నది

ఇంతకన్నా ఏ సాక్షాలు కావాలి
పసిఊపిరి ఉండచుట్టుకొని
రాడార్ పసిగట్టని గుడారంలో పిట్టలా ముడుచుకుపోతుంటే
మూటచుట్టిన తరాల కొలి ప్రాణం
ఎడారి ఇసుకలో సగందిగిన పక్షిఈకలా ఉన్నది

కవి,  రచయిత.

One thought on “ఒక ముఖం మూడు కన్నీటి చారికలు

Leave a Reply