(తమిళ మూలం – అంబై
తెలుగు – కాత్యాయని)
ఆ రాత్రులను మరిచిపోవటం కష్టం – ఆ గాథలను మాకు వినిపించిన రాత్రులను. తంగం అత్తయ్య చెప్పింది వాటిని మాకు. అవేమీ నక్కా- కాకీ కథలూ, కుందేలూ – తాబేలూ కథలూ వంటివి కాదు. ఆమె సొంతంగా అల్లిన కథలవి. వాటిలో కొన్ని కవితా ఖండికల్లా ఉండేవి. మరికొన్ని ఎంతకూ ముగియని పాటల్లా ఉండేవి. ఒక మొదలూ, నడుమా, చివరా అనేది లేకుండా రకరకాలుగా సాగేవి ఆ కథలు. ఆ రాత్రుల్లో ఒక్కోసారి ఆమె మా మనసుల్లో ఎన్నెన్నో భావచిత్రాలను రూపుకట్టించేది. ఆ కథల్లో దేవతలూ, రాక్షసులూ కొత్త రూపాల్లోకి మారిపోయే వారు. మందర, శూర్ఫనక, తాటకి వంటి ఆడ రాక్షసులు సాధారణ భావోద్వేగాలు, ప్రేమాభిమానాలు కలిగిన మనుషుల్లా ప్రవర్తించే వారు.
పురాణ గాథల లో ఏ ప్రత్యేకతా లేని పాత్రలకు ఆమె తన కథల్లో ఒక వ్యక్తిత్వాన్ని కల్పించేది. రెక్కలు తెగిన పక్షికి మృదువైన స్పర్శతో ఓదార్పునిచ్చినంత సున్నితంగా తన మెత్తటి మాటలతో ఆ పాత్రలకు ప్రాణం పోసేదామె.
ఆ రాత్రి వేళల వాతావరణమూ, మేము పడుకునే ఆ పురాతన గృహం లోని విశాలమైన హాలూ, పిల్లలందరి నడుమ ఆ సాన్నిహిత్యమూ – వీటిలో ఏ కారణం వల్లనో కానీ, ఆ కథలు ఈనాటికీ నా మనసులో ఎక్కడో తేనెటీగల చప్పుడు వలె రొద పెడుతూ తిరుగుతూనే ఉన్నాయి.
పాత కాలపు స్తంభాలతో, విశాలమైన హాలుతో ఉండే ఆ ఇంట్లో తంగం అత్తయ్యను రకరకాల భంగిమల్లో చూశాను. భారీ చెక్క తలుపుకు ఆనుకుని కూర్చునో, పమిట కొంగు చాటున చిన్న ప్రమిద దీపం పట్టుకుని వచ్చి, గూటిలో అమర్చుతూనో, ఆమె భర్త ఏకాంబరానికి భోజనం వడ్డిస్తూనో, బావి గట్టున ఒక పాదాన్ని అదిమిపెట్టి చాంతాడుతో నీళ్ళు చేదుతూనో, మొక్కలకు ఎరువు వేస్తూనో ఆమె కనబడేది.
తంగం అత్తయ్యది నల్లని అందమైన రూపం. చక్కగా ఇస్త్రీ చేసిన బట్ట లాగా ఎక్కడా ఒక్క ముడత కూడా ఉండేది కాదు ఆమె ముఖం మీద. జుట్టులో చాలా తెల్ల వెంట్రుకలు ఉండేవి. కాలుతో తొక్కుతూ వాయించే పాత కాలపు హార్మోనియం ఉండేది అత్తయ్యా వాళ్ల ఇంట్లో. ఆమె వాయించేది దాన్ని. “వందనమే చంద్రబింబో” అనే తేవరం నుండి, “వన్నాన్ వందాన” అనే ప్రసిద్ధ గీతం దాకా ఎన్నో రాగాల సంగీతాన్ని నెమ్మదిగా పాడుతూ హార్మోనియం వాయించేది. నల్లని పక్షి ముక్కుల్లా ఉండే ఆమె పొడవాటి వేళ్ళు హార్మోనియం మెట్లపై కదులుతూ ఉంటే నల్లని సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉన్నట్టు తోచేది.
తంగం అత్తయ్య చుట్టూ ఏదో మార్మికత గూడు కట్టినట్టుగా ఉండేది. ఇతరులు ఆమె వైపు చూసే చూపుల్లో, మృదువుగా ఆమె తల నిమరటంలో ఏదో జాలి వంటి భావన జాలువారుతూ ఉండేది. ఏకాంబరం మామకు ఇంకో భార్య కూడా ఉంది. ఆయన అత్తయ్యను ఒక పువ్వును చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకునే వాడు. ఆమెనెప్పుడూ “ తంగమ్మా “ అని పిలిచేవాడే తప్ప, ” ఏమే “ అనేమాట ఆయన నోట వచ్చేదే కాదు.
ఎందుకోగానీ, అత్తయ్య కూడా ఆయనకు దూరంగా ఒక తెర మాటున నిలబడినట్టుగా ప్రవర్తించేది. ముత్తు మామ కూతురు వల్లి, ఆ రహస్యం ఏమిటో కనిపెట్టింది. అత్తయ్య ఇప్పటికీ “ పుష్పవతి “ కానేలేదని వల్లితో వాళ్లమ్మ చెప్పిందట. అంటే ఏమిటో మాకు సరిగ్గా అర్థం కాలేదు.
“అంటే ఏమిటీ?” అని వల్లినే అడిగేశాం.
వల్లి అప్పటికే ఓణీలు వేసుకునే వయసులో ఉంది.
“అంటే… ఆమెకు ఇప్పటికీ వయసు రానేలేదు!” అని జవాబిచ్చింది.
“మరి, ఆమె జుట్టు తెల్లగా అయిపోయింది కదా?”
“అది వేరే విషయం.”
అప్పటి నుంచి మేము అత్తయ్య శరీరాన్ని పరిశీలనగా గమనించడం మొదలెట్టాం. “పుష్పవతి” కాని వాళ్ల శరీరాన్ని ఎలా గుర్తు పట్టాలోననే విషయాన్ని గురించి చర్చించుకునే వాళ్ళం. ఆమె ఒంట్లో వున్న లోపం ఏమిటో మాకు అంతు పట్టటం లేదు. స్నానం చేస్తూ తడి చీర చుట్టుకున్నప్పుడు చూసినా, ఆమె శరీరం అందరు ఆడవాళ్ళకు మల్లేనే ఉండేది. స్నానం చేసి వచ్చాక ఆకుపచ్చ చీర కట్టుకుని, ఎర్రటి రవిక తొడుక్కుని ఉన్నప్పుడూ మామూలుగానే కనబడేది. “అది ఉత్తి ఖాళీ శరీరం,“ అని వల్లితో వాళ్లమ్మ అన్నదట. ఆ ఖాళీతనాన్ని ఎలా కనిపెట్టాలో మాకైతే అర్థం కాలేదు.
ఒక సాయంత్రం, తోటలోని ఎండిపోయిన చెట్టునొకదాన్ని కొట్టేశారు. చిట్టచివరి గొడ్డలి వేటుతో అది పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది. విరిగిపోయిన దాని కాండం లోపల ఖాళీ రంధ్రం కనబడుతోంది. దాన్ని చూపిస్తూ “అదుగో, చూశారా! అదీ ఖాళీ అంటే!” అన్నది వల్లి.
కానీ, లోపలంతా రంధ్రంతో వెల్లకిలా పడిపోయిన ఆ చెట్టుతో, నల్లగా నిగనిగలాడే అత్తయ్య ఒంటిని పోల్చటం అర్థం లేనిదని మాకు అనిపించింది.
అత్తయ్య శరీరంలో రహస్యం ఏమిటి? ఏం తేడా ఉంది ఆమెలో? ఉక్కబోతగా ఉండే ఎండాకాలపు మధ్యాహ్నం వేళల్లో, బిగుతుగా ఉండే రవికను విప్పేసి సామాన్ల గదిలో అలా పడుకునేది అత్తయ్య. రవిక లేని ఆమె రొమ్ముల్ని పరీక్షగా చూసే మమ్మల్ని దగ్గరకు లాక్కొని కావిలించుకునేది ఆమె. ఆమె ఛాతీ, నడుము, చేతులు ఇచ్చే ఆ రక్షణలో ఎలాంటి ఖాళీ తనమూ కనబడదు మరి! అన్ని భావోద్వేగాలతో నిండిన వెచ్చటి ఆ శరీరం, రసంతో తొణికిసలాడే పండులాగా ఉండేది. ఆ శరీరంలో వసంతం వెల్లి విరిసేది. ఆ జీవన మధుబిందువులు ఒక్కోసారి మామీద కూడా చిందుతూ ఉండేవి. ఆమె స్పర్శలో, లాలనలో, నూనెతో మా ఒంటిని బలంగా మర్దన చెయ్యటంలో- గట్లు తెంచుకుని ఉరికే నదిలోని ఉధృతి వంటి జీవశక్తి ఏదో మాలోకి ప్రవహించినట్టు తోచేది.ఆమె చేయి తగిలితే ఆవులు చేపుకు వచ్చి, పాలు ఇచ్చేవి. ఆమె నాటిన విత్తనాలు తప్పకుండా మొలకెత్తేవి. ఆమె హస్తవాసి మంచిదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేది.
మా చిన్న చెల్లాయ్ పుట్టినప్పుడు అత్తయ్యే దగ్గరుంది.
“నువ్వు నా దగ్గరే ఉండు అక్కా! ఒదిలి వెళ్ళకు. నువ్వు నా పక్కనుంటేనే భరించగలను ఈ నొప్పిని!” అని అమ్మ అనటం, గుమ్మం పక్కన దాక్కుని విన్నాం మేము. తలుపు సందులోంచి తొంగి చూస్తే, ఎత్తుగా ఉన్న అమ్మ పొట్టపై వేళ్ళతో మెల్లిగా రాస్తోంది తంగం అత్తయ్య.
“నీకేం కాదు, భయపడకు,“ అని మెత్తని గొంతుతో ధైర్యం చెబుతోంది.
“అయ్యో, అక్కా! నీక్కూడా…” వెక్కిళ్ల నడుమ మాట పూర్తి చెయ్యలేక పోతోంది అమ్మ.
“నాకేం, మహారాణి ని! నా ఇంటినిండా పిల్లలున్నారు. ఇంకేం కావాలి ఇంతకంటే!”, అంది అత్తయ్య. ఏకాంబరం మామ రెండో భార్యకు ఏడుగురు పిల్లలు.
“నీ కడుపు పండకనే పాయే…” బిగ్గరగా ఏడ్చింది అమ్మ.
“ఏం, ఇప్పుడేమయ్యింది నా ఒంటికి? నాకేమన్నా వేళకు ఆకలి వెయ్యటం లేదా, కంటినిండా నిద్ర పట్టటం లేదా? అందరికీ ఉన్నట్టే నాకూ అన్నీ ఉన్నాయి కదమ్మా! దెబ్బ తగిలితే నాకూ నొప్పి పుడుతుంది, నెత్తురు కదుములు కడుతుంది. గాయమైతే చీము పడుతుంది. తిన్నవన్నీ హాయిగా అరిగి పోతున్నాయి. ఇంకేం కావాలి చెప్పు?”
అత్తయ్య చేతిని గట్టిగా పట్టుకుని గుండెలమీద పెట్టుకుంది అమ్మ. “నీ ఒళ్ళంతా నెత్తుటి ముద్ద చేశారు కదా!”, అంటూ అత్తయ్య చేతిని మరింత గట్టిగా అదుముకుంది అమ్మ. అత్తయ్య శరీరంమీద ప్రయోగించని మందులంటూ లేవని వల్లి తో వాళ్లమ్మ చెప్పిందట ఊళ్ళోకి ఏ డాక్టర్ వచ్చినా అత్తయ్యకు మందులు ఇప్పించేవారట. ఎన్నో రకాల ఇంగ్లీషు మందులు వాడటంతో ఆమె ఒళ్లు తెలియని నిద్ర పోయేదట. డప్పులు కొడుతూ వేపాకులతో నెలల తరబడి ఏవో పూజలు చేయించారట. ఆమెను హఠాత్తుగా భయపెడితే యేమైనా ప్రయోజనం ఉంటుందని ఎవరో చెప్పారట. అందుకని ఒకసారి ఆమె పెరట్లో ఏదో పనిలో ఉండగా నల్లటి గుడ్డను ఒళ్ళంతా కప్పుకున్న ఒక మనిషి ఒక్కసారిగా ఆమె మీదికి దూకేట్టుగా ఏర్పాటు చేశారు. అత్తయ్య భయంతో స్పృహ తప్పి పడిపోయింది. బట్టలు ఉతుక్కునే బండకు తగిలి తలకు గాయమైంది. ఆ మచ్చ ఇప్పటికీ నుదుటిపై అలాగే ఉండి పోయింది.
ఆ తర్వాత మరొక డాక్టర్ రాగానే, ”ఒద్దు, నన్ను వదిలి పెట్టండి. నన్నిట్లా ఉండనివ్వండి,” అని కేకలు పెడుతూ పరిగెత్తిందట అత్తయ్య. మామ రెండో పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన రోజున గన్నేరు గింజలు తిన్నది అత్తయ్య. ఎట్లాగో ఆ విషాన్ని కక్కించి ఆమె ప్రాణం నిలబెట్టారు. ఏకాంబరం మామ కన్నీళ్లు పెట్టుకుని, “నీకు బాధ కలిగించే పని ఇంకెప్పుడూ చెయ్యను.” అని మాటిచ్చాడట.
ఆ తర్వాత అత్తయ్య కూడా ఆయనకు రెండో భార్యను చూడటం మొదలెట్టింది. సెన్ కమలం ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఈ సంగతులన్నీ వల్లి ద్వారా మాకందరికీ తెలిసాయి.
అమ్మ తలపై చేత్తో మెల్లిగా రాస్తూ, ”పోనీ, పోనీలే! అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వు బిడ్డను కనే సమయంలో నా కథ సంగతి ఎందుకు?” అని వారిస్తోంది అత్తయ్య. ఆ రాత్రికే మా చిన్న చెల్లి పుట్టింది. కొంత కాలం తర్వాత అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మాకొక కథ చెప్పింది – అది వర్షాకాలం. ముందు గదిలో తుంగ చాప పరిచి, దిండ్లు వేసి ఉన్నాయి. వాటిమీద తలనూనె అంటిన మరకలున్నాయి. కొన్నిటికి కవర్లు వెయ్యనే లేదు. వాటిలో కుక్కిన దూది అక్కడక్కడా ఉండలు కట్టి కనబడుతోంది. అవి రోజూ వాడుకునే దిండ్లు కాదు – అప్పుడప్పుడూ వచ్చే పిల్లల కోసం తీసి పెట్టినవి. రోజంతా ఆటలాడి, కడుపు నిండా అన్నం తిన్నాక ఆ దిండ్లలో ఎన్ని కుట్లూ, ఉండలు ఉంటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు?
వంటగది కడుగుతున్న చప్పుడు వినబడుతోంది. ఇత్తడి గిన్నెలు సర్దటమూ, ఆ పైన గది తలుపు గొళ్ళెం పెట్టటమూ కూడా వినబడింది. ఇక అత్తయ్య మా గదిలోకి వస్తుంది. మేమందరం మేలుకుని ఎదురు చూస్తున్నాం.
ఆమె గదిలోకి రాగానే సోమూ అడిగాడు, “అత్తయ్యా, ఓ కథ చెప్పవూ?”
“మీరింకా నిద్ర పోనే లేదా?” అంటూ మా దగ్గరకు వచ్చి కూచుంది. వెంటనే కామాక్షీ, సోమూ ఆమె ఒళ్ళో తలలు పెట్టుకుని, కథ కోసం ఆమె ముఖం లోకి చూడసాగారు. మిగతా వాళ్ళం దిండ్లకు ఆనుకుని కూర్చున్నాం.
అత్తయ్య బాగా అలసి పోయినట్టుంది. నుదుటిపై చెమట పట్టింది. ఓ క్షణం ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.
“అదొక పెద్ద అడవి…” అంటూ కథ మొదలెట్టింది. “ఆ అడవిలో జంతువులన్నీ హాయిగా కలిసి మెలిసి ఉండేవి. అక్కడ బోలెడన్ని పండ్ల చెట్లు ఉండేవి. ఒక వైపున చిన్న సెలయేరు పారుతూ ఉండేది. ఆ జంతువులకు దాహం వేసినప్పుడు అందులోనే నీళ్ళు తాగేవి. అక్కడ వాటికి వేటగాళ్ల భయం లేక పోవడంతో స్వేచ్చగా తిరుగుతూ ఉండేవి. ఎక్కడినుంచి ఏ బాణం వచ్చి ప్రాణాలు తీస్తుందో అనే భయం లేదు. మిగతా అడవుల్లో వలె అడవులు అంటుకోవడమూ, పిట్టలనూ అడవి పందులనూ వేటగాళ్లు చంపడమూ, చెట్లు నరికి వెయ్యటమూ వంటి ప్రమాదాలు అక్కడ ఉండవు. ఆ అడవిలో ఎక్కడ ఏముందో ఆ ప్రాణులు అన్నిటికీ కొట్టిన పిండి. రాత్రుళ్ళు అడవంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏ చెట్టుపై గుడ్ల గూబ కూచుని కూస్తుందో, ఏ రాతిపై నుంచి కప్ప హఠాత్తుగా నీళ్ళ లోకి దూకుతుందో, ఏ చోటులో నెమలి నాట్యం చేస్తుందో – అన్నీ అన్నిటికీ చక్కగా తెలుసు.
ఒక రోజు ఒక లేళ్ల మంద ఆ అడవిలో నీళ్ళు తాగటానికి వచ్చిన దాకా, అంతా సజావుగా జరిగిపోతూ ఉంది. ఆ మంద నీళ్ళు తాగుతూ ఉండగా ఒక లేడి మాత్రం గుంపు నుండి తప్పి పోయింది. అలా కొంతదూరం వెళ్ళాక తను వేరే అడవిలోకి వచ్చేశానని దానికి అర్థమైంది. అక్కడ ఎటు వెళ్ళడానికీ దారీ తెన్నూ కనబడటం లేదు. ఏ చెట్టును చూసినా బాణాలు గుచ్చుకున్న గుర్తులున్నాయి. ఒక పెద్ద జలపాతం హోరు పెడుతోంది. ఎక్కడా మరొక ప్రాణి ఉన్న జాడే లేదు. ఆ లేడి భయంతో వణికిపోయింది. గట్టిగా అరుచుకుంటూ అడవంతా తిరిగింది. బాగా చీకటి కమ్ముకుంది. లేడి మరింత భయపడి పోయింది. జలపాతపు హోరు భయానకంగా వినబడుతోంది. అల్లంత దూరాన ఒక వేటగాడు మంట వేసుకుని ఏదో జంతువు మాంసాన్ని కాల్చి తింటూ ఉన్నాడు. దిక్కు తోచని ఆ లేడి అడవిలో ఒంటరిగా తిరుగుతూనే ఉంది.
అలా కొన్ని రోజులపాటు తిరుగుతూనే ఉండి పోయింది. ఆ రోజు నిండు పున్నమి. అడవంతా వెన్నెలతో నిండిపోయింది. వెన్నెల వెలుగులో జలపాతం కొత్తగా కనబడింది. ఇప్పుడది భయానకంగా కనబడటం లేదు. వెన్నెల అన్నిటినీ మృదువుగా, సుందరంగా మార్చేసింది. ఏదో మంత్రం వేసినట్టుగా లేడి మనసులోని భయమంతా అదృశ్యమైంది. అది ఆ అడవిని ఇష్టపడ సాగింది. ఆ అడవిలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడం మొదలు పెట్టింది. ఈ అడవి తనకు అపరిచిత ప్రదేశమే అయినప్పటికీ తన జీవితానికి అవసరమైనవి ఇక్కడ కూడా ఉన్నాయని అనిపించింది. ఇక్కడా ఒక జలపాతం ఉంది. బోలెడన్ని చెట్లు కూడా ఉన్నాయి. నెమ్మదిగా అక్కడి పక్షులనూ, జంతువులను కూడా అది గమనించ గలిగింది. అక్కడి గడ్డి పచ్చగా నవనవలాడుతోంది. ఈ కొత్త అడవిలోని రహస్యాలన్నీ దానికి అర్థమయ్యాయి. ఇక నిర్భయంగా అడవంతా తిరగ సాగింది. దాని భయం మాయమై మనసంతా శాంతితో నిండి పోయింది.”
అత్తయ్య చెబుతున్న కథ పూర్తయింది. మేమున్న చోట సన్నటి దీపపు వెలుగు పడుతోంది. గదిలో మిగతా భాగమంతా చీకటిలో మునిగిపోయింది. ఆ చీకటిని కథలోని అడవిగా ఊహించుకుంటున్నాం పిల్లలమంతా. ఆ లేడి మాకు స్నేహితురాలైంది. ఇప్పుడు మా మనసులు కూడా ప్రశాంతంగా ఉన్నాయ్.
దిండ్లను గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాం.
ముదురు నీలం, పసుపు, నలుపు రంగుల్లో గరుగ్గా ఉన్న దిండుకు ఆనుకున్న నేను, నిద్ర మత్తులోనే ఒక కన్ను తెరిచి పైకి చూశా. తంగం అత్తయ్య మోకాళ్ళపై తల వాల్చుకుని మా మధ్యన కూర్చుని ఉంది. ఛాతీ మీదుగా చుట్టుకున్న ఆమె చేతులు, అరచేతులతో భుజాలను గట్టిగా పట్టుకుని ఉన్నాయి.
Chaduvutunnatha sepu Mandu vesavi lo vennela ki challani gaali thodaina feeling kaligindi.