ఒకానొక అయోమయం లో…

మొదలయిందేదైనా ముగిసిపోక తప్పదు గదా
అయినా
ముగింపు ఆరంభమంత సున్నితంగా ఉండకపోవచ్చు
అసలొక్కోసారి ముగింపు ముగింపు లాగే ఉండకపోవచ్చు –
కానీ..
తెరలు దిగుతున్న చప్పుళ్ళు వినబడుతూనే ఉంటాయి
మొలుస్తున్న ముళ్ళచెట్లు కనబడుతూనే ఉంటాయి
ఊరుతున్న నూతినీళ్ళకు ఎండాకాలం ముంచుకొస్తుంది
తిరుగుతున్న కప్పీ లో కందెన తరిగిపోతుంది
ఎంతైనా చేదు..చేదుతూనే ఉండు
ఉహూ…బుంగలోకి చెంబెడు నీళ్ళొస్తే ఒట్టు
జల ఎండిపోతున్న వైనం తెలిసిపోతూనే ఉంటుంది
*** ***
ఏది ఎందుకు ఎలా?
ఏమో ఏమో ఏమో
పంటను ఎండబెడుతున్నదెవరు?
ఎవరికి తెలుసు..
ఎక్కడా చెమ్మ కనబడ్డం లేదేం?
ఎవరికి తెలుసయ్యా
అసలు కన్నీళ్ళే రావట్లేదేంట్రా?
ఎవడికి తెలుసురా బాబూ… అసలేంటి నీ గోల…
** **
మతి ఎంత వాస్తవమో మతిభ్రమణమూ అంతే వాస్తవం
మాట ఎంత వాస్తవమో మౌనమూ అంతే వాస్తవం
ఉంటావా పోతావా…
అసలా మాటకొస్తే
ఉండటం ఎంత వాస్తవమో పోవడమూ అంతే వాస్తవం
ఉంటే ఉండు, పోతే పో…
** **
మరీ చలెక్కువైపోతే ఏం చేద్దాం
పోగేసుకున్న కలలు ఎన్ని లేవు… రోజూ కాసిని మంటేసుకుందాం
కలలైపోయాక…?
కలలెప్పటికీ అయిపోవని తెలీనోడి కథ
కొనసాగితే ఏంటీ ముగిసిపోతే ఏంటీ
పోరా నాయ్నా పో!

One thought on “ఒకానొక అయోమయం లో…

Leave a Reply