ఒకప్పుడు శబ్దమే ఆయన శక్తిమంతమైన ఆయుధం
ఇప్పుడతని చేతిలోకి ఎకె 47 వచ్చింది

ఉక్రెయిన్‌ పై రష్యా ఆక్రమణ యుద్ధం ఒక ఫిల్మ్‌ క్రిటిక్‌ (సినిమా వ్యాఖ్యాత)ను అయిష్టంగానే ఆయుధం పట్టేలా చేసింది. యుద్ధం తన తలుపు తట్టే దాక తాను చేతిలోకి తీసుకున్న బలమైన ఆయుధం ఫోర్కు మాత్రమేనంటాడు ఉక్రెయిన్‌ ఫిల్మ్‌క్రిటిక్‌ ఆంటాన్ ఫిలటవ్‌. ‘నేనెన్నడూ ఏ ఆయుధాన్ని తాకనుకూడ లేదు. నేను యుద్ధ వ్యతిరేకిని. దాని నుంచి ఎంత వీలయితే అంత దూరం పరుగెత్తేవాణ్ని’ అంటాడు. కాని ఎందరో యుక్రెయిన్ల వలెనే ఆయననీ యుద్ధం తనలోకి లాక్కున్నది. ఇప్పుడు ఆయన నిజజీవితమే ఒక యుద్ధ మూవీ (చిత్రం) అయింది. ఇప్పుడాయన రష్యా సరిహద్దుల్లో ఆక్రమణతో తలపడుతున్న సైనికుల్లో ఒకడు. ఆ ప్రాంతం ఎంతో ఉద్రిక్తంగా ఇరువైపులా ప్రాణనష్టంతో రక్తసిక్తమైన చిత్తడినేల. ఈ యుద్ధ రంగస్థలం మీదికి తాను ఒక పాత్రగా ఇట్లా వస్తానని అతడు పీడకలలో కూడ ఊహించలేదు.

యుద్ధంతో ఛిద్రమైన రోజ్‌డొల్వికా ప్రాంతంలోని ఒక గ్రామంలో ఆగస్టునెల ఆఖరురోజుల్లో ఆయనను ఒక వదిలేయబడిన ఇంట్లో ఉంచారు. ఒకప్పుడు ఈ గ్రామమంతా సిమెంటు లేదా కర్రగుంజలకు పాకిన ద్రాక్షతోటలతో ద్రాక్ష తీగెలల్లుకున్న ఇళ్లతో ఆకుపచ్చగా కళకళలాడుతుండేది. అంతే – ఇపుడన్నీ తూటాలవర్షంలో ధ్వంసమైనవి.

ఇటువంటి ఒక దాడి సందర్భంగా 34 ఏళ్ల ఫిలటోవ్‌ ఒక బాంబుషెల్టర్‌లోకి నెట్టబడ్డాడు. ఆయన మైనస్‌ ఏడు డిగ్రీల చూపుతో ఏ దగ్గరి వస్తువును కూడ చూడలేడు. అందుకే కళ్లద్దాల ఫ్రేమ్‌ నుంచి ఆయన చూపులు గుడ్లగూబలను తలపించేవి. ఆయనను యుద్ధంలోకి రిక్రూట్‌ చేసుకోవడానికి ఈ చూపులే ఒక కారణమని ఆయన భార్యకు గట్టినమ్మకం.

అయితే ఇంత భీభత్సం చూస్తూ కూడ ఆయన లోచూపు కోల్పోలేదు. సైనికుడుగా రిక్రూట్‌ అయినా రోజూ రాయడం మానలేదు. యుద్ధం – తాను పాల్గొంటున్న తనకిష్టంలేని చర్యగా ఇపుడాయనకు ఒక సృజనప్రక్రియ అయింది. భయం, విషాదం, ఆగ్రహం, ఉద్విగ్నత వంటి అనుభవాల్లో ఇపుడాయన కొత్త అర్ధాలు వెతుక్కుంటున్నాడు. తాను నిద్రిస్తున్నపుడు తనమీంచి పాకిపోయే ఎలుక కూడ ఓహో ఇంతచిన్న జీవి కూడ ఇంకా జీవనవ్యాపారంలో ఉందికదా అనిపిస్తున్నది.

ఇటీవల ఒక సందేశంలో ఆయన ఇట్లా రాసాడు. “ఒకసారి పెద్దఎత్తున మామీద దాడి జరుగుతుంటే నేను ఒక కందకంలో ఉన్నాను. భూమి కంపిస్తున్నది. మేం ఆశ్రయం తీసుకుంటున్న కందకం ఒక పార్శ్వం పైన పైన్‌చెట్లు కూలుతూ ఒరుగుతున్నాయి. ఆ చెట్లబెరడు లోంచి ఒక ద్రవం కారుతున్నది. అది నాకు పాదరసం వలె మెరుస్తున్న కన్నీరు అనిపించింది. కొన్నినెలల తర్వాత ఆ సాయంత్రం అక్కడ ఎన్ని పేలుళ్లు జరిగాయో, ఎటువంటి ఆయుధాలతో కాల్చారో నాకేమీ జ్ఞాపకంలేదు. కాని నేను స్పష్టంగా గుర్తుపెట్టుకున్నది – ఆ నేల ఆ సాయంత్రం విహ్వలదుఃఖంతో వెచ్చని కన్నీళ్లు కార్చింది”.

పాశ్చాత్యదేశాల్లో యుద్ధం పేర్కొనదగిన సాహిత్య సృష్టికి కారణం అయింది. ఇలియడ్‌ కాలం నుంచి రెండవ ప్రపంచయుద్ధం కాలం దాకా, ఆ తర్వాతకూడ ఇందుకు ఎన్నో ఉదాహరణల ఇవ్వవచ్చు. సామ్రాజ్యవాద కాలపు యుద్ధాలు ప్రపంచమార్కెట్‌ను పంచుకోవడం కోసం జరిగాయి. ఎంతో జననష్టం జరిగింది. ప్రకృతి సంపద, మానవసారం ధ్వంసం అయ్యాయి. అయితే మొదటి ప్రపంచయుద్ధ కాలంలో సామ్రాజ్యవాదానికి బలహీనమైన ఆలంబనగా ఉన్న రష్యాలో లెనిన్‌ నాయకత్వంలో బోల్షివిక్‌పార్టీ కార్మికవర్గం యుద్ధాన్ని – అంతర్యుద్ధంగా మార్చి కార్మికవర్గ విప్లవాన్ని విజయవంతం చేయగలిగారు. బోల్షివిక్‌ విప్లవ విజయాన్ని చిత్రించే టెన్‌డేస్‌ దట్‌ షూక్‌ ది వర్‌ల్డ్‌ వంటి అద్భుతమైన గ్రంథాలు, అక్టోబర్‌ (ఐసెన్‌ స్టీయిన్‌) వంటి సినిమాలు వచ్చాయి. ఇంక రెండవప్రపంచ యుద్ధమైతే సామ్రాజ్యవాద దేశాలమధ్యనే ప్రారంభమైనా హిట్లర్‌, ముసోలినీ నాయకత్వంలో పాశ్చాత్యదేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడ సహించజాలని ఫాసిజం, నాజీజంగా దాడి చేసినపుడు ప్రజాస్వామ్యశక్తుల ఆకాంక్షపై సోషలిస్టురష్యా ఆ యుద్ధంలో దిగాక ఆ యుద్ధం సోషలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఫాసిజాన్ని మట్టికరిపించిన ప్రజాయుద్ధంగా మారింది. అందుకే 1936లో స్పెయిన్‌ యుద్ధకాలం నుంచి 1945 బెర్లిన్‌ హస్తగతం వరకు ప్రపంచవ్యాప్తంగా రచయితలు, కళాకారులు, మేధావులందరూ స్వయంగా యుద్ధంలో పాల్గొన్నవాళ్లో, ముక్తకంఠంతో సమర్థించినవాళ్లో అయ్యారు.

ఇవ్వాళ ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ ప్రభుత్వం తన ప్రజాబలంతో కాకుండా నాటో బలంతో యుద్ధంలోకి దిగింది. రెండువైపులా పాలకులు ఒకరు (రష్యా) ఆక్రమణ, విస్తరణ కాంక్షతో, మరొకరు (ఉక్రెయిన్‌ ప్రభుత్వం) నాటో బలంతో రెండుదేశాల ప్రజలను, సైన్యాలను బలిపెడుతున్నారు. ప్రపంచాన్ని చమురు సంక్షోభానికి , ఆర్థిక మాంద్యానికి నెట్టుతున్నారు. ఇది వియత్నామ్‌ పై అమెరికా దాడిని ప్రతిఘటించే వియత్నామ్‌ ప్రజల యుద్ధం వంటిది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యుద్ధం విప్లవాన్ని త్వరితం చేసే యుద్ధం వలె లేదు. ఇరుదేశాల ప్రజలు, ప్రపంచ ప్రజలు శాంతి కోరుతున్న యుద్ధం ఇది. వియత్నామ్‌ యుద్ధంలో వియత్నామ్‌ ఏకీకరణను , జాతివిముక్తిని కోరుకునే స్థితి లేదు కనుకనే ఆ యుద్ధాల్లో న్యాయం కోసం పోరాడిన సైనికుల భావాలను, రచయితల కళాకారుల భావాలను కాకుండా సైనికుడయిన ఈ ఫిల్ముక్రిటిక్‌ నుంచి మనం శాంతికోరే భావాలను మాత్రమే ఆశించగలం. ఇటీవల ఆయన పంపించిన ఒక మౌఖిక సందేశం ఇలా ఉంది – “ఇటీవల ఒక ఉదయం నేను నా కుటుంబం నాకు పార్శిల్‌లో పంపించిన ఉన్నిదుస్తులు తీసుకోవడానికి పోస్టాఫీసుకు పోయాను. అవి ఒక పెద్ద ప్లాస్టిక్‌బ్యాగ్‌లో వచ్చాయి. ఆరోజంతా నేను తీరికలేకుండా ఉన్నాను గనుక వెళ్లినచోటికల్లా ఈ బ్యాగు మోసుకునే తిరిగాను. సాయంకాలం అక్కడ ఉన్న వైద్యసిబ్బంది మా బెటాలియన్‌లో కాల్పుల్లో మరణించిన ఒక సైనికుని శవాన్ని తీసుకపోవడానికి నా దగ్గర ఉన్న ప్లాస్టిక్‌బ్యాగ్‌ ఖాళీచేసి ఇవ్వమన్నారు. ఈ యాదృచ్ఛిక ఘటనతో నేను చాల భావోద్వేగానికి గురయ్యాను. నేను ఉదయంనుంచీ ప్లాస్టిక్‌బ్యాగ్‌ మోస్తున్నానా? లేదా నేనే అందులో ఉండి, నన్ను నేను మోస్తున్నానా?”

Leave a Reply