ఐదు నెలలు

సరిహద్దుకవతల
చిన్నారి పడవొకటి
నదిని కౌగిలించడానికి
ఆత్రంగా ఎదురుచూస్తోంది

మూసిన గదిలో
ఒక సీతాకోక
రెక్క విరిగిన దేహమై
కొన ఊపిరితో కొట్టుకుంటోంది

వేసవి గాడుపుల మధ్య
చుక్క చమురు కోసం
పెదవులు తడుపుకుంటూ
ఒంటరి దీపం
బలహీనంగా రెపరెపలాడుతోంది

మొన్ననే పుష్పగుచ్ఛమొకటి
విష పరిమళమేదో పీల్చి
నల్లగా కమిలిపోయింది

ఎక్కడెక్కడో రోజంతా తిరిగి
సాయంకాలం
కిందకు జారుతున్న సూర్యుడిని
అనుమానంగా చూస్తూ
ఆమడదూరం పాటిస్తున్న చంద్రుడు
రాత్రి మెట్లెక్కుతున్నాడు

అందంగా కరుగుతున్న
వెన్నెల కూడా
వెన్నులో తెలియని భయాన్ని
తవ్వుతోంది

ఆత్మీయుడు
ఏ కణపు కత్తిని
లోపల రహస్యంగా దాచాడో
అనే అనుమానం
ముల్లులా పొడుస్తోంది

కన్నీటిని తుడిచే
చేతులకు కనులకు నడుమ
ఆప్తస్నేహ బాంధవ్యం తెగిపోయింది

నల్లని వీధిపాము
తట్టిలేపే వారు లేక
గాఢనిదురలో ముడుచుకుంది

సరైన కదలికలేక
జబ్బుపడిన భూగోళం
భీతిల్లుతూ
పాలిపోయిన ఆకాశాన్ని
తనువంతా కప్పుతుంది

ఐదు నెలలుగా
కాలపు మొక్కకు
పూస్తూ రాలుతున్న పూలను
నిస్సహాయంగా గమనిస్తూ
ప్రతిదినం సహనంతో ఊపిరులన్నీ
ఆశలదండలను అల్లుతున్నాయి

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

Leave a Reply