ఏముంది బాబయ్యా

ఏముందబ్బా
మీ అత్తరు చుక్కలకు కొదవేముంది
పడకటింటి సుఖాలకు కొరతేముంది
శీతల గదుల తీరాల్లో
సాంత్వన పొందే
మీ ఉబుసుపోని సమయాలకు
తక్కువేముంది

మీ లోలోపలకి తొంగి చూసుకోవటాలు
మీదయిన పిచ్చాపాటితో
ఖరీదయిన గోడలనిండా
ప్లాస్టిక్ సీతాకోక చిలుకల్ని
అంటించుకుని మురిసిపోవటానికి
మీవయిన గదుల నిండా
పరిమళాల రంగునీళ్లు చల్లుకుంటూ
మత్తిల్లి మాయలో పడటానికి
మీకు వెలితేముందు

ఎప్పుడూ
మీ కాస్మటిక్ చర్మాల
తిమ్మిరుల గురించే కాదు బాబయ్యా
మా శ్రమ సౌందర్యాల మీద కూడా
పాటలు రాయమనీ
ఛిద్రమవుతున్న మా జీవితాలను కూడా
ఈ సమాజానికి పరిచయం చేయమని

మా కన్నీళ్లనూ
చెమట చుక్కలను
మా గాయాల చరిత్రలనూ
కాసిన్ని గేయాలు గానయినా
పరిచయం చేసి మద్ధతు తెలుపమనే
మా మనవి బాబయ్యా

మేమూ మీ‌మధ్యలోనే వున్న
మనుషులం కదా
కష్టాల దెబ్బలు తగిలి
కమిలిపోతున్న బతుకులు మావి
మీ సుఖాల పరుపుల కింద
నలిగిపోతున్న శ్రమలు మావి

మమ్మల్ని మీ జాబితాలో
చేర్చుకోండమ్మా
శ్రమలతో బిరుసెక్కిన
మా శరీరాల గురించి కూడా
కాసిన్ని సాంత్వన పద్యాలు రాయండి
మీ ఫ్లోరసెంట్ వెలుగుల్లోంచి
ఒక్కసారి
మా చీకటి ముసిరిన
బతుకుల్లోకి కూడా
తొంగి చూడండి

ఏముందబ్బా
ఎప్పుడూ రాసుకునేవే కదా
మీ‌సుఖ గేయాలు
ఎక్కడయినా
పాడుకునేవే కదా
మీ‌ అనుభూతుల చొంగ పాటలు

అప్పుడప్పుడయినా
కాస్తంత అభ్యుదయంగా
ప్రగతి శీలంగా
ప్రజల పక్షపాతంగా
ఒక కొత్త పద్యమై ఊరేగండి బాబయ్యా!

పూర్వపు నల్లగొండ జిల్లా. కవి, కథకుడు, విమర్శకుడు. అధ్యాపకుడు. రచనలు: మా నాయిన (2006), నల్ల చామంతి (2017), వెలుతురు మొలకలు(2019) కవితా సంకలనాలు ప్రచురించారు.

One thought on “ఏముంది బాబయ్యా

  1. అన్నగారు మీ శైలి అద్భుతం.మీ పుస్తకాలు నాకు పంపగలరా…..అవకాశం ఉంటే పంపండి అన్నా.

Leave a Reply