మొదటి కవితయేదో చెప్పలేను!
గాలి చూరుకు వేలాడే నీటిచుక్క
ఏడు రంగుల గొడుగై ఎప్పుడు విచ్చుకుందో
నీలిబుగ్గల ఆకాశానికి మాత్రం ఏం తెలుస్తుంది?
చీకటి వాకిలిలోంచి నడిచొచ్చే జాబిలి
వెన్నెల రెక్కలెప్పుడు తొడుక్కుందోనని
కాటుకకళ్ల అంతరిక్షాన్నడిగితే ఏం చెబుతుంది?
మొదటి వాక్యమేదో గుర్తులేదు!
ఏ ఏకాంత ప్రేయసి
నన్నో వాక్యపుష్పాన్ని చేసి జడలో తురుముకుందో
ఏ పూడుకుపోయిన పేదగొంతుక
నన్నో ఆర్తగీతంగా అనువదించుకుందో
ఏ జ్వలిత నయని
తన ఆక్రోశపు కొలిమిలో
నన్నో ఈటెను చేసి
నిశి గుండెల్లోకి గురిచూసి విసిరేసిందో!
నేను పరిణామమే తప్ప
పాలపుంత కడుపున పడ్డ క్షణాలేవో తెలియని
అక్షర నక్షత్రాన్ని
నా పసితనం నాకు గుర్తులేదు
నా మనసు కొండను తవ్వీ తవ్వీ
ఇప్పుడున్న ఈ వంతెన నిర్మించుకున్నాను
ఎప్పుడో మొదటిసారి గుండె పగిలి
తొలి రాయిని కదిలించిన ప్రకంపనల చిరునామా
కాలపు నది అడుగునెక్కడో వెతుక్కోవాలి
మనవన్నీ
కార్పొరేట్ కట్లపాముల లోయల నడుమ
తీగలపైన సాగే సర్కస్ నడకలు కదా
తొలి అడుగుల అనుభూతి పాటలు
పాడుకునే సమయం ఎక్కడిది?
నేను శిఖరాల్ని కలగనే
పగటి స్వాప్నికుడిని కాదు
ఓ చేతిలో కన్నీటిఖడ్గాన్ని
మరో చేతిలో రుధిరఖడ్గాన్నీ పట్టుకుని
యుద్ధభూమిలో నిల్చున్నాను
నా చుట్టూ శత్రువులే కనబడుతున్నారు
ఇప్పుడు
మొదటి శంఖారావమేదో గుర్తుచేసుకోలేను!
( నా తొలి కవిత గురించి ఓ పెద్దాయన నన్నడిగినప్పుడు… )