ఏం పిల్లడో! మళ్లీ వస్తవా…?

‘ఈ తుపాకి రాజ్యంలరన్నో
నువు తుఫానువై లేవరన్నా…’ అంటూ దోపిడీపై జంగు సైరనూదిన సాంస్కృతిక సైనికుడతడు. జనం పాటల ప్రభంజనమైన రగల్ జెండా నినాదమతడు. పల్లె పల్లెనూ, గుండె గుండెనూ రగిలించిన నిప్పుల కొలిమి అతడు. గళ గర్జనల జడివానై విప్లవోద్యమాన్నిప్రచారం చేసిండు. నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో ప్రభావితమైండు. శ్రీకాకుళ గిరిజన పోరాట వెల్లువలో విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమంల చేరిండు. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలగన్నడు. కత్తుల వంతెనపై నెత్తుటి జెండాలెత్తిండు. ఉత్తరాంధ్ర జానపద బాణీలతో ప్రజా పోరు పాటలల్లిండు. అతడు పల్లె పల్లెనా తిరుగుతూ విప్లవాన్ని ప్రచారం చేసిన సాంస్కృతిక సైనికుడు. పాటను వెన్నెలపై నడిపించిన వాగ్గేయకారుడు. ఇప్ప వనాల్లో నిప్పుల పాటలు రాజేసిన తుడుం మోత. అతడు విప్లవ కవి. జన నాట్యమండలి కళాకారుడు వంగపండు ప్రసాదరావు. మూడు దశాబ్దాల పాటు ప్రజల కోసం పాడిన ఆ గుండె ఇవాళ ఆగిపోయింది. అతని గతం ఉజ్వల గీతిక.

వంగపండుది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం, పెదబొండపల్లి. 1943 (జూన్) లో పుట్టిండు. తల్లిదండ్రులు చినతల్లి, జగన్నాథం. రైతు కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు. పేదరికం. బుక్కెడు బువ్వకోసం కూలినాలీ పనులే దిక్కు. చిన్నతనంలనే వ్యవసాయ కూలీలతోటి సోపతైండు. నాగలి దున్నిండు. నాట్లేసిండు. కోతలు కోసిండు. కుప్పలు కొట్టిండు. ఒకవైపు బడి. మరో వైపు పని. అట్లా పనుల్లో పడి చదువు సాగలేదు. ఎస్ ఎస్ ఎల్సీతో చదువు ఆగింది. కొంత కాలానికే బొబ్బిలిలో ఐటీఐ చదివిండు. ఉన్న రెండెకరాల భూమి సాగులో తండ్రికి సాయంగున్నడు. అడివంచు ఊరు. చుట్టూ గిరిజన గూడేలు. అట్లా పల్లె జనంతో మమేకమైండు. వాళ్ల పాటలిన్నడు. కోలాటమాడిండు. జడకొప్పుల జాజిరాడిండు. కోలాట మోతల్లో మెరుపులైండు. ఆ మెరుపుల్లో పాటల మాలలల్లిండు. పల్లె పదాలతో పాటలు కైగట్టిండు. జనం బతుకుల్ని అల్లిండు. నాటకాలు రాసిండు.

శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం వంగపండు బాటను మార్చింది. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు తను నడవాల్సిన తొవ్వను చూపినయ్. చిన్నప్పట్నించీ చూస్తున్న ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆలోచింపజేసినయ్. ఒకవైపు ఉద్యమం. మరో వైపు బతుకు పోరాటం. పాటతో పయనమైండు. ఉద్యమబాట పట్టిండు. ఐదారు వందల పాటలు రాసిండు. కొద్దిరోజుల్లోనే విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ ఉద్యోగం వచ్చింది. అక్కడి కార్మికుల బతుకుల్ని పాటలుగా రాసిండు. పది రోజులు ఉద్యోగం, ఇరవై రోజులు పల్లెల్లో తిరగడం. ఉద్యోగం వల్ల ఉద్యమానికి దూరమవుతున్నాననే ఆలోచనతో ఆ ఉద్యోగం వదిలేసిండు. పూర్తికాలపు కార్యకర్తయిండు. అప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఆర్ట్ లవర్స్ ఉన్నది. విప్లవోద్యమ ప్రచారం కోసం 1972లో జన నాట్యమండలిగా రూపొందింది. రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల్ని పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి కదిలించే చోదక శక్తిగా మారింది జననాట్యమండలి. తెలంగాణ నుంచి గద్దర్, ఉత్తరాంధ్ర నుంచి వంగపండు లక్షలాది మందిలో చైతన్యం నింపిన్రు. జననాట్యమండలి పాటలు పల్లె పల్లెనూ తాకినయ్.

వంగపండు ఉత్తరాంధ్ర జీవ భాషను, కళా రూపాలను సాంస్కృతికోద్యమంలోకి తీసుకువచ్చిండు. భూమి బాగోతం, ఏరువాక నాటకాలు వందలాది చోట్ల ప్రదర్శించిన్రు. దళితుల్ని, అట్టడుగు జనాన్ని విప్లవీకరించేందుకు జననాట్యమండలి ఊరూరా తిరిగింది. ప్రజల బాణీలను పట్టుకొన్నది.
ఉత్తరాంధ్ర బాణీలో వంగపండు ఎన్నెన్నో పాటలు రాసిండు.

‘ఏం పిల్డో ఎల్దుమొస్తవా?’ అంటూ జనాన్ని నల్లగొండ నట్టడవిలోకీ, తెలంగాణ కొమరయ్య కొండల్లోకి ఆహ్వానించిండు. కూడు గుడ్డా లేని కూలీ నాలోళ్లను కొడవళ్లకు కక్కులు కొట్టమన్నడు. ‘పండిన పంటలన్ని మన సెమట సుక్కలే’ అంటూ పోరాటాల్లోకి నడిపించిండు. ‘జజ్జనకరి జనారే..’ అంటూ జనాల్ని ఉర్రూతలూగించిన కంచు కంఠం వంగపండుది.

‘వచ్చిందొచ్చిందమ్మ నక్సల్బరీ
మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ…
పల్లె పల్లె తిరుగుకుంటు నక్సల్బరీ
మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ
ఊరు ఊరు తిరుగుకుంటు నక్సల్బరీ
మా ఊరుకొచ్చినాదమ్మ నక్సల్బరీ…’ అంటూ జనం గుండెల ప్రభంజనమైండు. పోరు తప్ప దారిలేదని గొంతెత్తి పాడిండు. మూడు దశాబ్దాల పాటు వందలాది పాటలల్లి, ఆడి, పాడి విప్లవ సాంస్కృతికోద్యమ సైనికుడిగా పనిచేసిండు. లక్షలాది మందిని కదిలించే మార్చింగ్ సాంగైండు.

అతడు రాసిన భూమి బాగోతం(నాటిక) వేలాది చోట్ల ప్రదర్శితమైంది. సిక్కోలు యుద్ధం (ఒగ్గు కథ), ఏరువాక(పాటలు) పుస్తకాలను విరసం ప్రచురించింది. జననాట్యమండలి ఆధ్వర్యంలో వంగపండు ఉరుములు, వంగపండు ఉప్పెన పాటల క్యాసెట్లొచ్చినయ్. ఆ పాటల ప్రభంజనం ఒక ఉజ్వల చరిత్ర. 2005 తర్వాత క్రమంగా విప్లవ రాజకీయాలకు దూరమైండు. పార్లమెంటరీ బాటపట్టిండు. దీంతో ఒకనాడు ఉజ్వలంగా వెలిగిన వంగపండు జీవితం మసకబారింది. విప్లవ సాహిత్య సాంస్కతికోద్యమంలో ఉన్నపుడు అతడు రాసిన పాటలు, నాటకాలు, కళా రూపాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ప్రజా ఉద్యమాల్లో ఉన్నంతకాలం రాజీలేకుండా గళమెత్తిండు. విప్లవోద్యమం, జననాట్యమండలి చరిత్రలో ‘వంగపండు’ కంట్రిబ్యూషన్ మరువలేనిది. అతడిప్పుడు భౌతికంగా లేకపోయినా అతని పాట దోపిడీ, పీడనలున్నంత కాలం ప్రజల గొంతుల్లో మార్మోగుతనే వుంటది. వంగపండు అస్తమించలేదు. పాటల తొలిపొద్దై మనం నడిచే తొవ్వల్ల ఎదురొస్తడు.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

4 thoughts on “ఏం పిల్లడో! మళ్లీ వస్తవా…?

  1. Yes. చివర్లో పాలక వర్గాల తో వేదిక పంచుకున్ననూ తన పాట మాట ఆట శాశ్వతం

  2. బాగుందన్న… వంగపండు కు జోహార్లు😟✊🏼

  3. బాగుంది సుధాకర్…నివాళి.. వంగపండు కవిత్వంలోనూ, గొంతులో ను కరెంట్ ప్రవహిస్తుంది కదా

  4. బగుందండి మీ వ్యాసం. వంగపందు గారి గురించి వివరంగా రాసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply