ఎర్రపిట్ట పాట (2) : కథలూ గాథలు

వేసవి రోజుల్లో అమ్మ మా గుడిసె నీడలో పొయ్యి వెలిగించేది.

పొద్దున్నే గుడిసెకు పడమటివైపు గడ్డిలో మా సాధారణమైన భోజనాన్ని పరుచుకునేవాళ్లం. నీడ చివర మంట దగ్గర అమ్మ పొయ్యి పక్కనే కూర్చుని ఎండబెట్టిన మాంసం ముక్కల్ని వేయించేది. నేను ఆమె పక్కనే, నా పాదాలమీద కూర్చుని వట్టి రొట్టెతోపాటు మాంసం ముక్కలు తింటూ చిక్కటి బ్ల్యాక్ కాఫీ తాగేదాన్ని.

పొద్దుటి పూట భోజన సమయంలో మేమిద్దరమే ఏకాతంగా ఉండి, కాలం నిమ్మళంగా గడిచేది. మధ్యాహ్నం అటువైపు వచ్చినవాళ్లు మా గుడిసె దగ్గర విశ్రాంతి కోసం ఆగి మాతో కలిసి భోజనం చేసేవాళ్లు. మా ఇంటికి వచ్చినవాళ్లను సాదరంగా అహ్వానిస్తామని వాళ్లకు తెలుసు.

చనిపోయిన మా మామయ్య కోసం అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. మా తెగలోని వీరుల్లోకెల్లా సాహసి అని అమ్మ ఆయన గురించి చెప్పేది. శౌర్యపరాక్రమాల గురించి మాట్లాడే మగవాళ్ల పెదవుల మీద ఆయన పేరు ఎప్పుడూ ఉండేది. యువకులు కూడా ఆయన చేసిన సాహసాల గురించి చెప్పుకునేవాళ్లు. ఆడవాళ్లైతే ఆయన తమ పట్ల ఎంత దయతో ప్రవర్తించేవాడో అని గుర్తు చేసుకునేవాళ్లు. యువతులైతే తమను ప్రేమిస్తున్న మగవాళ్లు ఆయనంత మంచివాళ్లో కాదో అని పోల్చుకునేవాళ్లు. ఆయనను అందరూ ప్రేమించేవాళ్లు. అమ్మ అయితే ఆయన గ్నాపకాలను ఎంతగా ఆరాధించేదంటే ఆయన పేరు చెప్పి ఏదైనా సహాయం అడిగితే మా చిన్ని గుడిసెలోకి సాదరంగా అహ్వానం లభిస్తుందని అపరిచితులకు కూడా తెలుసు.

అపరిచితులైన బాటసారులగురించి ఎన్నెన్నో విచిత్రమైన అనుభవాలను గురించి వినివున్నా, సాయంకాలం భోజనం అంటే నాకు చాల చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే, ఆ సమయంలోనే పూర్వకాలం నాటి కథలు ఎన్నో బయటపడతాయి. పడమటి ఆకాశం వంపులో వేలాడుతున్న సూర్యుడిని చూస్తే నాకు భలే సంతోషంగా ఉండేది. ఎందుకంటే, అప్పుడే అమ్మ నన్ను మా గుడిసె చుట్టుపక్కల ఉండే ముసలి ఆడవాళ్లనూ, మగవాళ్లనూ మాతో కలిసి భోజనం చెయ్యడానికి పిలవమని పంపేది. వాళ్ల గుడిసెల వైపు పరిగెత్తుకుని వెళ్లి, ముఖ ద్వారాల దగ్గరే ఆగిపొయ్యేదాన్ని. ఒక్కోసారి ఏమీ మాట్లాడకుండా చాలాసేపు అక్కడే నిలబడేదాన్ని. అంత సంతోషకరమైన పనిమీద వెళ్లినా, అలా నిలబడిపోవడానికి కారణం భయం కాదు. అమ్మ పంపిన అహ్వానాన్ని వాళ్లకు చేరవేయకూడదనీ కాదు. ఆ నిశబ్దానికి కారణం ఆ ఇంటి వాతావరణాన్నీ, ఇంటివాళ్లు వేరే ఏదైనా పనిలో ఉంటే వాళ్ల పనికి అడ్డు వస్తానేమో అని అంచనా వెయ్యడానికే. వాళ్ల గుడిసెల వైపు గెంతులేసుకుంటూ పరిగెడుతూ ఉండగానే, “ఎవర్నైనా అహ్వానించేముందు కాసేపు ఆగు. వాళ్లు వేరే పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్లకు అడ్డం వెళ్లకుండా వేరే వాళ్లను పిలువు.” అని చెప్పేది అమ్మ.

నేనట్లా వాళ్ల ఇళ్లముందు ఎందుకు ఆగిపోతానో ఆ పెద్దవాళ్లకు తెలుసు; చాలాసార్లు నాకు భరోసానిస్తూ వాళ్లే, “ఏం కావాలి, చిన్ని మనవరాలా?” అని అడిగేవాళ్లు.

“ఈ సాయంకాలం మీరు మా గుడిసెకు రావాలని అమ్మ చెప్పింది.” అని గబగబా చెప్పేసి, అప్పుడు ఊపిరి పీల్చుకునేదాన్ని.

“తప్పకుండా, తప్పకుండా వస్తాను!” అని ఒక్కొక్కరు సమాధానం చెప్పేవాళ్లు. వాళ్ల దుప్పట్లను భుజాల మీద వేసుకుని, వాళ్ల గుడిసెల నుంచి మా గుడిసెవైపు నిదానంగా, గుంపులుగా బయల్దేరేవారు.

నా లక్ష్యం సాధించాక, ఉత్సాహంగా దుంకుకుంటూ గెంతుకుంటూ, ఇంటికి పరిగెత్తేదాన్ని. ఊపిరి ఎగబీలుస్తూ, మా అహ్వానానికి ఒక్కొక్కళ్లు ఎలా సమాధానం చెప్పారో పూసగుచ్చినట్లు అమ్మకు వప్పచెప్పేదాన్ని. “వాళ్ల గుడిసెలోకి నువ్వు వెళ్లినప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు?” అని అమ్మ తరచుగా అడిగేది. ఒక్క చూపుతోనే చుట్టూ ఏం జరగుతుందో గమనించి, గుర్తుపెట్టుకోవడం ఈ ప్రశ్న నాకు నేర్పింది. చాలాసార్లు, అమ్మ అడగకముందే నాకు కలిగిన అభిప్రాయాన్ని ఆమెకు చెప్పేసేదాన్ని.

మా చుట్టుపక్కల గుడిసెలవైపు వెళ్లినప్పుడు, “మీ అమ్మ ఏం చేస్తోంది?” అని ఒక్కోసారి ఎవరైనా ఓ పెద్దామె అడేగేది. అమ్మ చెప్పొద్దని ముందే హెచ్చరించి ఉంటే తప్ప, ఏ తటపటాయింపులేకుండా ఆ పెద్దామెకు జవాబిచ్చేదాన్ని.

మా అతిథులు మా గుడిసెకు రాగానే, నేను అమ్మ పక్కనే కూర్చునేదాన్ని. ముందు ఆమె అనుమతి తీసుకునిగాని ఆమె పక్కనుంచి కదిలేదాన్ని కాదు. ఏం మాట్లాడకుండా, పెద్దవాళ్ల మాటలు సహనంగా వింటూ, ఎప్పుడెప్పుడు నాకు ఇష్టమైన కథలు చెప్పడం మొదలుపెడతారా అనుకుంటూ నా భోజనం పూర్తి చేసేదాన్ని. ఇక చివరికి ఆగలేక అమ్మ చెవిలో గుసగుసలాడేదాన్ని, “ఇక్తొమి కథ చెప్పమని వాళ్లకు చెప్పమ్మా.”

నా అసహనాన్ని శాంతింపజేస్తూ, అమ్మ వాళ్లతో చెప్పేది, “మీ కథలు వినాలని నా చిట్టితల్లి అడుగుతోంది.” అప్పటికి అందరి భోజనం అయిపోయి ఉండేది. సంజెచీకట్లు ముసురుకుంటూ ఉండేవి.

ఒక్కొక్కరు వంతులవారిగా కథలు చెప్పడం మొదలుపెట్టగానే నేను అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని, వెల్లకిలా పడుకుని ఆకాశంలో నుంచి నా వైపు తొంగిచూస్తున్న చుక్కల్ని చూసేదాన్ని. కథలో కొంచెం కొంచెం ఆసక్తి పెరుగుతూ ఉంటే లేచి కూర్చుని ఒక్కొక్క పదాన్ని పట్టి పట్టి వినేదాన్ని. ముసలి ఆడవాళ్లు ఒక్కోసారి ఏవో హాస్యాలాడేవాళ్లు. అందరూ ఎంత గట్టిగా నవ్వేవాళ్లంటే నేను వాళ్లతో జతకలవకుండా ఉండలేకపొయ్యేదాన్ని.

దూరంగా ఎక్కడినుంచో తోడేళ్ల ఊళలో, లేదా నది అంచునుంచి తేలి వస్తున్న గుడ్లగూబల కూతలో వినిపించినప్పుడు భయమేసి అమ్మ వళ్లో ఒదిగిపోయి కూర్చునేదాన్ని. అమ్మ నెగడిలోకి కొన్ని ఎండు పుల్లలు వేయగానే, మంటలు పెరిగి చుట్టూ కూర్చుని ఉన్న ముసలివాళ్ల ముఖాలమీద ప్రజ్వలించేవి.

ఇలాంటి ఒక సాయంకాలం, కథ చెబుతున్న ఓ ముసలి వీరుడి కనుబొమ మీద మంటల వెలుగులో ప్రకాశిస్తున్న పచ్చబొట్టు నాకు కనిపించింది. కథ చెబుతూ అనాలోచితంగా చేతులు తిప్పుతున్న ఆయనను కుతూహలంతో గమనించాను. కంచు రంగులో ఉన్న ఆయన నుదుటిమీది నీలం రంగులోని ఆ నక్షత్రం నన్ను ఆశ్చర్యపరిచింది.

మిగతా వాళ్లను గమనిస్తే ఒక ముసలి అవ్వ చుబుకం మీద రెండు సమాంతర రేఖలు కనిపించాయి. మిగతా వాళ్లకు అలాంటి మచ్చలేవీ లేవు. నేను అమ్మ ముఖాన్ని పరిశీలించాను. ఆమె ముఖంలో కూడా ఆ మచ్చల చిహ్నాలేవీ కనిపించలేదు.

ఆ వీరుడు కథ చెప్పడం పూర్తయ్యాక, తన చుబుకం మీదున్న రెండు నీలం రేఖలకు అర్థం ఏమిటని ఆ అవ్వను అడిగాను. అలా అడుగుతున్నప్పుడు ఆ ముసలివీరుడి నుదుటిమీదున్న నక్షత్రాన్ని క్రీగంట గమనించాను కానీ దాని గురించి ఆయనను అడిగితే నా తెగువకు చివాట్లు పెడతాడేమో అని భయపడ్డాను.

అప్పుడు ఆ అవ్వ, “నా మనవరాలా, అవన్నీ చిహ్నాలు – నీకు చెప్పలేని రహస్య చిహ్నాలు. కానీ, రెండు బుగ్గలమీద క్రాస్ గుర్తులున్న ఒకామె గురించిన అద్భుతమైన కథ ఒకటి నీకు చెప్తాను.” అంటూ ఒక కథ మొదలు పెట్టింది.

ముఖంమీదున్న పచ్చబొట్లలో మంత్ర శక్తులు దాచుకున్న ఒకామె గురించిన పేద్ద కథ అది. ఆ కథ పూర్తవకముందే నిద్రలోకి జారుకున్నాను.

ఆ రాత్రి తరువాత పచ్చబొట్లు ఉన్నవాళ్లంటే నాకు అనుమానంగా ఉంటుంది. అట్లాంటి వాళ్లెవరైనా ఎదురైతే ఆ పచ్చబొట్లను క్రీగంట గమనిస్తూ, దాని చుట్టుపక్కల చూస్తూ దానికి వెనక ఎట్లాంటి భయంకరమైన మంత్రశక్తులు దాగి ఉన్నాయో అని అనుకునేదాన్ని.

నెగడి ముందు చెప్పేకథల్లో ఇలా భయపెట్టే కథలు చాలా అరుదుగా వినవస్తాయి. ఆ కథ నాలో ఎంత నాటుకుపోయిందంటే ఇప్పటికీ దాని తాలూకు గ్నాపకాలు చాలా స్పష్టంగా, దృఢంగా నాలో మిగిలిపోయాయి.

3. పూసలపని

పొద్దుటి పలహారం పూర్తవగానే అమ్మ పూసలపని మొదలెట్టేది. ఓ ఎండపొద్దున అమ్మ మా గుడిసె ముఖద్వారానికి ఉన్న కాన్వస్ ను ఎత్తి కట్టేసిది. చల్లని ఉదయపు గాలి గుడిసె అంతా స్వేచ్ఛగా పరుచుకునేది, కొత్తగా కాలబెట్టిన ప్రెయిరీ నుంచి తేలివచ్చిన గడ్డి సువాసనలు అప్పడప్పుడు గుడిసె అంతా అలుముకునేవి.

బొమ్మ వేసేముందు చిత్రకారుడు రంగులు కలుపుకునే పళ్లెంలో రంగులను అమర్చుకున్నట్లు, దుప్పిచర్మంతో చేసిన సంచీకి ఉన్న పొడవాటి దారాలు ముడి విప్పి, చిన్ని రంగు పూసల రాశులను తన చుట్టూ సర్దుకునేది అమ్మ. వళ్లో పెట్టుకునే పూసల ఫలక మీద మృదువైన తెల్లని దుప్పి చర్మాన్ని విప్పి, సాపు చేసేది. నడుముకు పక్కన కట్టుకునే బెల్టు నుంచి సన్న కత్తిని తీసి చర్మాన్ని ఒక ఆకారంలోకి కోసేది. ఆమె చాలావరకు తన చిన్ని కూతురికోసం చిన్ని పాదరక్షలు తయారు చేసేది. ఆమె తయారు చేసిన డిజైన్లను అసక్తితో పరిశీలించేదాన్ని. గర్వంతో వెలిగిపోతున్న మొఖంతో ఆమె పనితనాన్ని గమనించేదాన్ని. నా పాదాలకు మెత్తగా హత్తుకునేట్లున్న పాదరక్షలను వేసుకుని నడుస్తున్నట్లు కలలు కనేదాన్ని. నా పాదాలను అలంకరిస్తున్నట్లున్న ఎర్రని పూసలను చూసి నా స్నేహితులు అసూయపడుతూ ఉండడాన్ని ఊహించుకునేదాన్ని.

ఒక చేతిలో దుప్పిచర్మం ముక్కనూ, మరో చేతిలో ఒక ఆరెను పట్టుకుని, అమ్మకు దగ్గర్లో ఒక రగ్గు మీద కూర్చునేదాన్ని. పూసలపని లోని కళను గమనించే నా మొదటి పాఠాలు అవే. కండెకు చుట్టి ఉన్న దారలనుంచి ఒక్క దారంపోగును నైపుణ్యంతో లాగేది అమ్మ. ఒక ఆరెతో దుప్పిచర్మంలోకి పొడిచి దారాన్ని అందులోకి దూర్చేది. చిన్ని చిన్ని పూసలను ఒక్కొక్కదాన్ని తీసుకుని ఆ దారంలోకి దూర్చి చర్మానికి కుట్టేసేది.

దారం చివర వేలితో ఎట్లా ముడివేయాలో అమ్మ నుంచే నేర్చుకున్నాను. అట్లా మొదటి ముడివేసాక తరువత కష్టమైన పని, దారాన్ని మెలికలతో పట్టుకోవడం. అప్పుడే దారంలోకి పూసలు ఎక్కించడం సులువవుతుంది. పూసలపని నేర్చుకోవాలంటే నా డిజైన్లు నేనే తయారు చెయ్యాలన్నది అమ్మ పెట్టిన షరతు. మొదట్లో పొడవాటి డిజైన్ అనుకుని, పొద్దుటిపూట కొన్ని గంటల సమయాన్ని పోగొట్టుకున్నాను. నాకు నేను విధించుకున్న శిక్ష వల్ల నాకు అర్థమయిందేంటంటే మరీ జటిలమైన డిజైన్లను తయారు చేసుకోకుడదని. ఎందుకంటే ఏదైనా పని మొదలుపెడితే దాన్ని పూర్తి చెయ్యాలన్నది అమ్మ పెట్టిన నిబంధన.

కొంత అనుభవం వచ్చాక, సులభంగా ఉండే చతురస్రాలూ, క్రాసులూ ఉండే డిజైన్లు తయారు చెయ్యడం మొదలుపెట్టాను. నేను మొదట చేసిన డిజైన్లు సమంగానూ, ప్రత్యేకంగానూ ఉండేవి కాదు. ఆ రెండు లక్షణాలలో తప్పులు జరిగితే అమ్మ సహించేది కాదు. నా పనితనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నిశబ్దంగా పని చేసుకుంటుపోతూవుండే ఆమె మనస్తత్వం నాలో నా పనితనం పట్ల నాకు దృఢమైన బాధ్యతనూ, నాకు నేను స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని అలవర్చింది. నా నడవడిక మంచిగా ఉన్నంత వరకు నన్నొక స్వాభిమానం గల చిన్ని వ్యక్తిగానే ఆమె గుర్తించేది. మొండితనంతో ఏదైనా చేసినప్పుడు అమ్మ నాకు చివాట్లు పెట్టినప్పుడు నాకు ఎంత అవమానంగా అనిపించేదో!

అమ్మ నాకు నచ్చిన రంగులను నన్ను ఏరుకోనిచ్చేది. ఒక డిజైన్ ప్రకారం ముదురు నీలంమీద పసుపు పచ్చని చుట్టుగీతలూ, ఇంకో డిజైన్ ప్రకారం ఆకుపచ్చనీ, ఎర్ర పూసలూ కలిపి ఉండేది. ఇంకో డిజైన్ ప్రకారం నీలి బూడిదరంగూ, ఎరుపూ కలిసిన పూసలు ఉపయోగించాను. డిజైన్లు తయారు చెయ్యడం, రంగులు ఎన్నుకోవడమూ అలవాటయ్యాక, మరో కష్టమైన పాఠం నాకు నేర్పింది అమ్మ. అదే పూసల బదులు ముళ్లపంది ఈనెలను ఉపయోగించడం. ముళ్లపంది ఈనెలు వాడాలంటే ముందు వాటిని తడిచేసి, చూపుడువేలూ, బొటనవేలూ ఉపయోగించి సమం చెయ్యాలి. దానికంటే ముందు అమ్మ ఆ ఈనలకు ఉండే వాడి ముళ్లును కత్తిరించి కాల్చేసేది. ఆ ముళ్లులో విషం ఉంటుంది. అందుకని మా మమయ్య కూతురు వార్క-జ్విన్ అంత పెద్దయేంతవరకు నాకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఈనెలతో పనిచెయ్యకూడదని అమ్మ చెప్పేది.

కట్టిపడేసినట్లుండే ఆ పాఠాల తరువాత నాలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉండేది. ఆరుబయలులో పరిగెత్తడంలో సంతోషకరమైన ఉపశమనం కలిగేది. ఎన్నో వేసవి మధ్యాహ్నాల్లో నలుగురో ఐదుగురో స్నేహితులు గుట్టల మీద నాతో కలిసి తిరిగేవాళ్లు. ఓ చివర కొద్దిగ పదునుపెట్టిన నాలుగైదు అడుగులున్న కర్రలను మాతో తీసుకెళ్లి భూమిలో ఉండే తియ్య దుంపలను తవ్వేవాళ్లం. కావలసినన్ని దుంపలు తిని, ఆ కర్రలను భుజాలమీద పెట్టుకుని ఓ పసుపు పచ్చ పువ్వుల చెట్టు కింద చేరేవాళ్లం. ఆ పువ్వుల తొడిమెల కింద ఉండే చిన్ని బంక బిందువులను సేకరించి ఓ చిన్ని పిచ్చుక గుడ్డంత ముద్ద చేసి, ఎవరి ముద్ద పెద్దగా ఉందో లెక్కలేసుకుంటూ, విసుగొచ్చేంతవరకు దాన్ని నాక్కుంటూ తిని చివరికి దాన్ని పడేసి మళ్లీ తియ్యదుంపలను పెరుక్కుని తినడానికి వెళ్లేవాళ్లం.

మా దగ్గరున్న పూసల దండలనూ, బెల్టులనూ, ఒక్కోసారి చెప్పులనూ మారకాలు చేసుకోవడం నాకు ఇంకా గుర్తుంది. వాటిని ఒకరికొకరికి కానుకలుగా ఇచ్చుకుంటున్నట్లు నటించేవాళ్లం. మా తల్లులను అనుకరించండం మాకు భలే వేడుకగా ఉండేది. వాళ్ల సంభాషణల్లో దొర్లే మాటలు గుర్తు తెచ్చుకుని, ఆ మాటలనే మా ఆటల్లో వాడేవాళ్లం. వాళ్ల హావభావాలనూ, చివరికి వారి స్వరాల్లోన్ని తేడాలనూ అనుకరించేవాళ్లం. ప్రెయిరీ వొడిలో పాదాల మీద కూర్చుని, అరచేతుల్లో బుగ్గలు పెట్టుకుని, మోచేతులను మోకాళ్లమీద ఆనించి ముసలి ఆడవాళ్లు కూర్చున్నట్లు ముందుకు వంగి కూర్చునేవాళ్లం.

ఎవరైన వాళ్ల దగ్గరి బంధువుల్లో ఒకరు చేసిన సాహసకృత్యాల గురించి చెబుతున్నప్పుడు మిగతా అందరం నిశబ్దంగా వినేవాళ్లం. మాట్లాడుతున్నవాళ్లు, ఉప్పిరిపీల్చుకోవడానికో, మా నుంచి సానుభూతి కోసమో ఆగినప్పుడల్లా, మెల్లగా ‘హాన్! హాన్!'(అవును!, అవును!) అని అనేవాళ్ళం. ఆ చెప్పే విషయంలో ఉద్వేగం పెరిగితే అందుకు తగ్గట్లు మా స్వరాలూ పెరిగేవి. ఇట్లాంటి అనుకరణల్లో మా తల్లిదండ్రులు అందరికీ సమ్మతమైన విషయాలే మాట్లాడేవాళ్లు.

ఎంత ఉత్తేజం కలిగించే కథలను అభ్యసిస్తున్నా సరే, మా చుట్టూ ఉన్న ప్రకృతిలో ఓ మబ్బుతునక పరచిన నీడ చేసిన మార్పు కూడా మా ఆటలను మార్చేసేది. అంతలోనే గుట్టల మధ్య ఆడుకుంటున్న నీడలను తరిమెయ్యడానికి పరిగెట్టేవాళ్లం. గట్టిగా కేకలువేస్తూ, అరుస్తూ పరిగెట్టేవాళ్లం. ఒకరినొకరం పిలుచుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ డకోట భూభాగంలో దొర్లిపోతున్న ఆకుపచ్చని సముద్రంలో ఆడుకునే చిన్ని వనదేవతల్లా ఉండేవాళ్లం.

ఒకసారి ఏమైందంటే, నా నీడను నేనే పట్టుకునే ఉద్దేశంతో మబ్బు నీడను గురించి మరచిపోయాను. నిటారుగా, నిశ్చలంగా నిలబడి, మెల్లగా నా నీడ వెనకాల పాకుతున్నట్టు నడిచాను. చాలా జాగ్రత్తగా ఒక కాలు ముందుపెట్టి, దాని తరువాత ఇంకొక కాలును మరింత జాగ్రత్తతో ముందుకు పెట్టి నీడను వదిలుంచుకుని నడవాలని ప్రయత్నించాను. కానీ నా నీడ నానుంచి మళ్లీ తప్పించుకుంది. నేనిక పరిగెట్టడం మొదలెట్టాను. ఒక్క అడుగు వెనక, నాతోపాటే నా నీడ కూడా పరిగెట్టింది. పళ్లు బిగబట్టి, పిడికిలి బిగించి, దాన్ని విదిలించుకోవాలని కృతనిశ్చయంతో వేగంగా, వేగంగా పరిగెత్తాను. కానీ, అంతే వేగంగా అది నా పక్కనే పరిగెత్తింది. ఊపిరి అందక, శరీరం వేడెక్కి నా వేగం తగ్గిపోతుంటే నా నీడ కూడా నెమ్మదించడం నాకు విసుగు కలిగించింది. ఇప్పుడేం చేస్తావు అని దానితో అంటూ అలసిపోయి గుట్టపక్కన ఒక రాయిమీద కూర్చున్నాను.

అబ్బా! నా నీడ ఎంత మొండిదంటే, అది నాపక్కనే కూర్చుంది.

నా కామ్రేడ్లు నన్ను చేరుకుని, ఎందుకంత వేగంగా పరిగెట్టావని నన్ను అడిగారు.

“ఓహ్! నేను నా నీడను తరుముకుంటూ పరిగెట్టాను. మీరెవరూ ఎప్పుడూ అట్లా చెయ్యలేదా?” నేను అడిగాను. నేను ఎందుకలా పరిగెత్తానో వాళ్లకు అర్థం కాకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

వాళ్లు పాదరక్షలున్న కాళ్లతో నా నీడను భూమిలోకి నొక్కిపట్టారు. నేను మెల్లగా లేచాను. నా నీడ మళ్లీ వాళ్ల కాళ్ల కింద నుంచి జారిపొయి నేను ఎట్లా కదిలితే అట్లా కదలింది. ఇక చివరికి నా నీడను పట్టుకోవాలన్న ప్రయత్నాన్ని ఆపేసాం.

ఈ సంఘటనకు ముందు, నాకూ నా నీడకూ మధ్య ఉన్న సజీవ సంబంధాన్ని గుర్తుపట్టిన అనుభవం లేదు నాకు. దాని గురించి ఇంతకుముందు ఎప్పుడూ ఆలోచించలేదు.

కానుకలుగా ఇచ్చుకున్న వస్తువులను ఎవరిది వాళ్లం తిరిగి తీసేసుకున్న తరువాత, మేం మా గుడిసెలవైపు బయలుదేరాం. ఆ రాత్రి, మిగతా రాత్రుల్లలాగే కథలూ గాథల్లో మునిగితేలుతూ నిద్రలోకి జారుకున్నాను.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply