ఎర్ర పిట్ట పాట (6): ఉడుత పిల్ల

పని ఒత్తిడి ఉండే ఆకురాలు కాలంలో మా అత్త మా ఇంటికి వచ్చి శీతాకాలం కోసమని కొన్ని ఆహార పదార్థాలను ఎండబెట్టడానికి అమ్మకు సహాయం చేసేది. ఆమె నాకు చాలా ఇష్టం. ఆమె అమ్మలా మితభాషి కాదు. అమ్మ కంటే పెద్దదైనా అమ్మలా గంభీరంగా ఉండకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఆమె సన్నగా, నిటారుగా ఉండేది. అమ్మ జుత్తు నల్లగా ఒత్తుగా ఉంటే ఆమె జుత్తు అసాధారణంగా సన్నగా ఉండేది.

ఆమె నాకు తెలిసినప్పట్నుంచీ ఆమె మెడలో నీలిరంగు పూసల నెక్లెస్ ఒకటి ఉండేది. అది ఆమెకు చాలా అమూల్యమైన వస్తువు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ నెక్లెస్ ను మా మామయ్య ఆమెకు ఇచ్చాడట. టి మనిషి కావడంవల్లనేమో పెద్ద పెద్ద అంగలతో ఆమె నడుస్తున్నప్పుడు ఆమె నడకలో ఒకలాంటి ఊపు ఉండేది. ఆత్త మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ స్వభావ సిద్ధమైన బిడియాన్ని మర్చిపోయేది. అత్త చేసే పరిహాసాలకు ఒక్కోసారి పగలబడి నవ్వేది.

అత్త అంటే నాకు మూడింతలు ప్రేమ. కపటం లేని ఆమె నవ్వు, అమ్మను ఉల్లాసపరిచే ఆమె స్వభావం, అన్నింటికంటే ముఖ్యం – అమ్మ నన్ను కోప్పడినప్పుడు ఆమె నన్ను ఒళ్లోకి తీసుకుని నా కన్నీళ్లు తుడిచి లాలించేది.

చల్లని ఉదయాల్లో, సూర్యబింబం పసుపుపచ్చని అంచులు, గుట్టలమీద నుంచి లేచి వస్తున్నప్పుడే, మేం నిద్ర లేచి ఉదయపు భోజనం తింటూ ఉండేవాళ్లం. ఎంత పెందలకడనే నిద్ర లేచేవాళ్లమంటే, మా ఇంటి దగ్గరున్న చిత్తడినేల మధ్యలోని గుంట మీద పొగమంచు తేలియాడుతున్న పవిత్ర సమయాన్ని మేం చూశాం. ఆ వింత పొగమంచు ప్రతి ఉదయం – శీతాకాలంలోనూ, ఎండాకాలంలోనూ కనిపించేది. కానీ శీతాకాలం మధ్యలో మాత్రం సరిగ్గా ఆ గుంట మీద తేలుతూ కనిపించేది. తూర్పు దిగ్మండలంలో సూర్యుడి ముఖం పూర్తిగా కనిపించే సమయానికి ఆ పొగమంచు మాయమైపోయేది. ఈ ప్రదేశం ఏన్నో ఏళ్లనుంచి తెలిసివున్న ముసలివాళ్లు ఆ పొగమంచు క్రమం తప్పకుండ ప్రతిరోజూ ఆ చిత్తడినేల మీద నుంచి ఆకాశంలోకి లేస్తుందని అంటారు.

మా ఇంటి చుట్టు ఆడుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ హఠాత్తుగా ఆగిపొయ్యేదాన్ని. భయంతో కూడిన ఆశ్చర్యంతో కనిపించని మంటల నుంచి వెలువడే ఆ పొగని గమనించేదాన్ని. ఆ ఆవిరి కనిపిస్తున్నంతసేపు, అమ్మ పక్కన ఉంటే తప్ప మా ఇంటికి దూరంగా వెళ్లేదాన్ని కాదు.

నదికి దిగువనున్న సారవంతమైన ఒక పొలం నుంచి అమ్మ, అత్త, కావలసినన్ని మొక్కజొన్న పొత్తులను తెచ్చేవాళ్లు. మా ఇంటి ముందు గడ్డి మీద పెద్ద కాన్వాసు పరిచి ఆ తియ్యని మొక్కజొన్న పొత్తులను ఎండబెట్టేవాళ్లు. వాటికి నేను కాపలా. అక్కడే కూర్చుని వాటి కండెలతో చేసిన బొమ్మలతో ఆడుకునేదాన్ని. వాటి పట్టును జడల్లా అల్లేదాన్ని. అమ్మ కుట్టు సంచీలో దొరికే ఎన్నో రకాల గుడ్డ పేలికలతో ఆ బొమ్మలకు రగ్గులు తయారు చేసేదాన్ని.

నలుపు-పసుపు పచ్చని చారల కోటు వేసుకుని ఓ చిన్ని అపరిచిత ప్రాణి ఎండబెడుతున్న మొక్కజొన్నల దగ్గరికి వచ్చేది. అది ఒక ఉడుత. నన్ను చూసి అస్సలు భయపడేది కాదు. కాన్వాసు ఒక మూల నుంచి ఎన్ని మొక్కజొన్న విత్తనాలను మోసుకెళ్లగలదో అన్ని ఎత్తుకెళ్లేది. ఆ ఉడుతను పట్టుకోవాలనీ, పట్టుకుచ్చులాంటి తన కోటును దువ్వాలని అనిపించేది. కానీ అది భయపడిపోయి నా వేళ్లను కొరికేస్తుందని అమ్మ చెప్పింది. ఇక చేసేదేంలేక మా మధ్యనున్న మొక్కజొన్న గింజల సంబంధంతోనే సరిపెట్టుకున్నాను. అది ప్రతి ఉదయం మరిన్ని గింజల కోసం వచ్చేది. కొన్ని సాయంత్రాలు మా ఇంటి దగ్గర పాకులాడుతుండడం చూశాను. తనను గుర్తుపట్టానని చెప్పడానికన్నట్లు హఠాత్తుగా ఓ కూత పెట్టేదాన్ని. తనేమో అక్కడ్నుంచి పారిపోయేది.

కావలసినంత మొక్కజొన్న ఎండబెట్టిన తరువాత, అమ్మ గుమ్మడి కాయలను ఎండబెట్టేది. గుమ్మడి కాయలను సన్నని చక్రాలుగా కోసి, కొన్ని చక్రాలను ఒకదానికొకటి లంకె వేసి పొడవాటి గొలుసుల్లా చేసేది. రెండు కొయ్యలను పాతి, వీటి మీద ఇంకో కొయ్యను ఇరువైపులా ఆనించి, దానికి ఆ గుమ్మడికాయ గొలుసులను వేళ్లాడదీసేది. ఎండా, గాలీ కలిసి ఆ గొలుసులను బాగా ఎండబెట్టేవి. ఇక అమ్మ వాటిని మందంగా, బిరుసుగా ఉండే జింకచర్మంలో ముడిచి దాచిపెట్టేసేది.

అట్లా గాలిలో, ఎండలో ఎన్నోరకాల పళ్లను కూడా ఎండబెట్టేది అమ్మ. కానీ ఆకురాలు కాలం గురించిన నా తొలి జ్ణాపకాల్లో నాకు బాగా గుర్తుండిపోయింది, మొక్కజొన్న పొత్తులను ఎండబెట్టినప్పుడు చూసిన ఉడుతనే.

ఆనాటి రోజుల గురించి వేసవి కాలాల్లో జరిగిన ఎన్నో విషయాలు గుర్తున్నాయి కానీ, శీతాకాలంలో జరిగిన విషయాలు చాలాకొన్నే గుర్తున్నాయి. ఇప్పుడైతే ఒక్కటే గుర్తొస్తోంది.

ఎవరో మిషనరీలు గోలీలున్న ఒక చిన్నసంచీ ఇచ్చారు నాకు. అవి ఎన్నో రంగుల్లో సైజుల్లో ఉండేవి. వాటిల్లో కొన్ని రంగు గాజుతో చేసినవి ఉండేవి. ఒక శీతాకాలంలో అమ్మతో కలిసి నది దగ్గరికి వెళ్లాను. నది ఒడ్డున పెద్ద పెద్ద మంచు గడ్డలు పోగుపడి ఉన్నాయి. నది మీద ఇంకా పెద్ద మంచు గడ్డలు తేలుతున్నాయి. ఒక పెద్ద మంచు గడ్డ దగ్గర నిలబడ్డప్పుడు మొట్టమొదటిసారి ఇంద్రధనస్సులోని రంగులు మంచు స్ఫటికాల్లో మెరవడం చూశాను. నాకు వెంటనే ఇంట్లో ఉన్న గాజు గోలీలు గుర్తొచ్చాయి. పైభాగంలోనే ఉన్నట్లున్న ఆ రంగులను కొన్నింటిని నా ఉత్తవేళ్లతో పెళ్లగించాలని చూశాను. కానీ విపరీతమైన చల్లదనానికి నా వేళ్లు చురుక్కుమన్నాయి. ఏడుపు ఆపుకోడానికి నా పళ్లతో మంట పెడుతున్న వేళ్లను గట్టిగా కరిచి పట్టుకోవాలసివచ్చింది.

ఆ రోజు తరువాత, ఎన్నో ఏళ్ల పాటు, గాజు గోలీల్లో నదిలోని మంచు ఉంటుందని అనుకునేదాన్ని.

Vii. ఎర్రెర్రని పెద్ద ఆపిల్ పళ్ళు

సునాయసంగా, అతి సహజంగా సాగిపోతున్న నా జీవితంలో మొట్టమొదటి మలుపు ఒకానొక వసంతకాలపు మొదటిరోజుల్లో వచ్చింది. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. అది మార్చి నెల అని నాకు తరువాత తెలిసింది. ఆ వయసుకు నాకు తెలిసిందల్లా ఒకే ఒక్క భాష – అమ్మ మాట్లాడే భాష.

మా ఊర్లోకి ఇద్దరు తెల్ల మిషనరీలు వచ్చారని నా దోస్తుల అనుకుంటుంటే విన్నాను. వాళ్లు, పెద్ద టోపీలు పెట్టుకుంటారనీ, వాళ్ల హృదయం విశాలమైనదనీ చెప్పారు. అదంతా వినగానే నేను అమ్మ దగ్గరకు పరిగెట్టాను. ఆ ఇద్దరు ఆగంతకులు ఎందుకు వచ్చారని అమ్మను అడిగాను. ఆమెను బాగా విసిగించాక, ఇండియన్ అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ తూర్పుదేశానికి తీసుకెళ్ళేందుకు వచ్చారని చెప్పింది. వాళ్ల గురించి నేను మాట్లాడడం ఆమెకు ఇష్టం లేదని నాకు అనిపించింది. కానీ మరో రెండు రోజుల్లో ఆ ఆగంతకుల గురించి నా స్నేహితుల దగ్గర అద్భుతమైన విషయాలు విన్నాను.

“అమ్మా, నా స్నేహితురాలు జుడేవిన్ మిషనరీల ఇంటికి వెళ్తోంది. మన దేశంకంటే అందమైన దేశానికి వెళ్లబోతోందని తెల్లవాళ్లు చెప్పారట.” వాళ్లతో వెళ్లాలని నా హృదయాంతరాలలో బలంగా కోరుకున్నాను.

అమ్మ ఒక కుర్చీలో కూర్చొని ఉంటే నేను ఆమె మోకాళ్లమీద వేళ్లాడాను. ఓ రెండు రుతువుల క్రితం మా పెద్దన్న డావీ తూర్పుదేశంలో మూడేళ్ల చదువు ముగించుకుని వచ్చాడు. అన్న వెనక్కి వచ్చాక అమ్మ తన పాతకాలం పద్దతుల నుంచి ఇంకొంచెం దూరం జరిగింది. మొదట మా ఇంటిని బర్రెచర్మంతో కాక తెల్లవాడి కాన్వాసుతో కప్పుకోవడంతో ఆ మార్పు మొదలయ్యింది. ఇప్పుడేమో నాజూకైన కొయ్యలతో కట్టిన గుడిసెను వదిలేసి మోటుగా ఉన్న దుంగలతో కట్టిన ఇంట్లో ఉంటోంది.

“అవును, చిట్టితల్లీ, జుడేవిన్ తో పాటు చాలామంది పిల్లలు ఆ తెల్లవాళ్లతో వెళ్తున్నారు. మీ అన్న డావీని తన చిట్టి చెల్లెలి గురించి అడిగారట.” నా ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అన్నది.

నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందంటే ఆ శబ్దం అమ్మకు వినిపిస్తుందేమోనని అనుకున్నాను.

“నన్ను తీసుకెళ్లమని వాళ్లతో చెప్పాడా, అమ్మా?” నా జోలికి రావొద్దని డావీ ఆ తెల్లవాళ్లకు చెప్పి ఉంటాడనీ, నా అద్భుత ప్రపంచం నాది కాకుండా పోతుందని భయపడుతూ అడిగాను.

అమ్మ మొఖంలో ఓ విచారమైన నవ్వు మెల్లగా అలుముకుంది, “చూడు!! నీకు వాళ్లతో వెళ్లాలని ఉందని నాకు తెలుసు. జుడేవిన్, తెల్లవాడి అబద్ధాలను నీ చెవుల్లో నింపేసింది. వాళ్లు చెప్పే మాటలు ఒక్కటి కూడా నమ్మకు! వాళ్ల మాటలు తియ్యగా ఉంటాయి, చిట్టితల్లీ. కానీ వాళ్ల చేతలు కఠినమైనవి. నువ్వు నాకోసం ఏడుస్తావు, కానీ వాళ్లు నిన్ను ఓదార్చను కూడా ఓదార్చరు. నాతోనే ఉండిపో, నా చిట్టితల్లీ! అమ్మను వదిలి, ఎక్కడో దూరాన ఉన్న తూర్పు దేశానికి వెళ్లడం తన చిన్ని చెల్లెలికి చాలా కష్టమైన అనుభవం అవుతుందని డావీ అంటున్నాడు.”

తూర్పు దిగ్మండలం ఆవల ఉన్న దేశాల గురించిన నా ఆసక్తిని అమ్మ అలా నిరాశ పరిచింది. కానీ మరుసటి రోజున తెల్ల మిషనరీలు మా ఇంటికే వచ్చారు. మా ఇంటికి దారితీస్తున్న కాలిబాటలో వాళ్లు నడిచిరావడం గమనించాను. వాళ్లతో మూడో వ్యక్తి ఉన్నారు కానీ, అతను మా అన్న డావీ కాదు. అతనొక యువ దుబాసి. తెల్లవాడు. మా భాషను నట్టుతూ మాట్లాడుతాడు. బయటకు పరిగెత్తి వాళ్లను మా ఇంటికి ఆహ్వానించాలని అనిపించింది కానీ, అమ్మకు కోపం వస్తుందని భయపడ్డాను. కానీ, ఎంతో ఉల్లాసంతో మా ఇంటి మట్టినేల మీద గంతులేశాను. వాళ్లు మా ఇంటికి తప్పకుండా వస్తారని, తలుపులు తియ్యమని అమ్మను బతిమాలాను. అయ్యో! వాళ్లు వచ్చారూ, చూశారూ, జయించారు!

ఎర్రెర్రని ఆపిల్ పళ్లు విరగగాసే ఓ గొప్ప చెట్టు గురించి జుడేవిన్ నాకు చెప్పింది. తినగలిగినన్ని ఆపిల్ పళ్లను చేతులతోనే తెంపుకుని తినొచ్చని చెప్పింది. నేను ఆపిల్ పళ్ల చెట్లను ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో ఓ డజను ఆపిల్ పళ్లను రుచి చూసి ఉంటానేమో. తూర్పుదేశంలోని ఆపిల్ తోటల గురించి వినగానే ఆ చెట్ల మధ్య తిరగాడాలని ఆత్రుత పడ్డాను. మిషనరీలు నా కళ్లల్లోకి చూసి నవ్వారు. నా తలను తట్టారు. అమ్మ వాళ్ల గురించి అంత కఠినంగా ఎలా మాట్లాడిందో అని ఆశ్చర్యపడ్డాను.

“అమ్మా, తూర్పు దేశం వెళ్తే చిన్న పిల్లలకు కావల్సినన్ని ఆపిల్ పళ్లు ఇస్తారా అని అడుగు,” నా ఉత్సాహంలో, అమ్మ చెవిలో కొంచెం బిగ్గరగానే అడిగాను.

దుబాసీ నేను అడిగింది విన్నాడు. “అవును, పాపా. మంచి ఎర్ర ఆపిల్ పళ్లు చెట్టు నుంచి ఎవరు తెంపుకుంటే వాళ్లవే. ఈ మంచి మనుషులతో వెళ్తే నువ్వు ఇనుప గుర్రమెక్కి వెళ్లొచ్చు.” అని నాకు జవాబిచ్చాడు.

అప్పటిదాక నేను రైలును చూసి ఉండలేదు. ఆ విషయం అతనికి తెలుసు.

“అమ్మా, నేను తూర్పు దేశం వెళ్తున్నాను! నాకు ఎర్రని ఆపిల్ పళ్లు తినాలనుంది, ఇనుప గుర్రం ఎక్కాలని ఉంది. సరేనని అనమ్మా!” నేను బతిమిలాడాను.

అమ్మ ఏం మాట్లాడలేదు. మిషనరీలు కూడా నిశ్శబ్దంగా వేచి చూస్తున్నారు. నా కళ్లు కన్నీళ్లతో మసకబారాయి, వాటిని దిగమింగుకోవడానికి కష్టపడ్డాను. నా పెదవి చివర్లు మెలి తిరిగిపోయాయి. అమ్మ నన్ను గమనించింది.

“మీకు జవాబివ్వడానికి నేను సిద్ధంగా లేను.”, అమ్మ వాళ్లతో అంది, “నా నిర్ణయాన్ని రేపు మా అబ్బాయితో చెప్పి పంపిస్తాను.”

ఆ తెల్లవాళ్లు వెళ్లిపోయాక నేను నా కన్నీళ్లకు లొంగిపోయాను. అమ్మ చెప్పే మాటలు వినిపించకుండా తల అటూ ఇటూ ఊపుతూ బిగ్గరగా ఏడ్చాను. నేను కోరుకున్నదాని కోసం, అమ్మ చెబుతున్న మాటలను చెవికెక్కించుకోకుండా అంత మొండి చెయ్యడం నా జీవితంలో అదే మొదటిసారి.

ఆరోజు రాత్రి మా ఇంట్లో వింత నిశ్శబ్దం అలుముకుంది. నిద్రపోయేముందు మిషనరీలతో నన్ను పంపించడానికి అమ్మను ఒప్పించమని పరమాత్మను వేడుకున్నాను.

మరుసటి రోజు పొద్దుపొద్దున్నే అమ్మ నన్ను తన పక్కకి పిలుచుకుంది. “చిట్టితల్లీ, అమ్మను వదిలి దూరదేశానికి వెళ్లాలని ఇంకా పట్టుదలగా ఉన్నావా?” అని అడిగింది.

“కాదమ్మా! నిన్ను వదిలివెళ్లాలని కాదు. కానీ నాకు అద్భుతమైన తూర్పు దేశాన్ని చూడాలని ఉంది.” నేను జవాబిచ్చాను.

మా ప్రియమైన అత్త ఆరోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చింది, “ఒక ప్రయత్నం చెయ్యనిద్దాం.” ఆమె అమ్మతో అన్నది.

అత్త మరోసారి నా తరపున వాదిస్తోందని అర్థమైంది. మా అన్న డావీ అమ్మ నిర్ణయం తెలుసుకుందామని వచ్చాడు. నేను నా ఆటలు ఆపేసి, అత్తకు దగ్గరిగా జరిగాను.

“సరే, డావీ. నా చిట్టితల్లి ఇదంతా పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ వెళ్లాలని బాగా కోరుకుంటోంది. ఆమె పెద్దయ్యేసరికి ఈ దేశంలో మన డకోట జనానికంటే ఎంతో ఎక్కువమంది తెల్లవాళ్లు ఉంటారు. ఆమె చదువుకుంటేనే మంచిది. ఆమె చదువుకోవలంటే ఇంత చిన్నప్పుడే తల్లి నుంచి తనను వేరు చేయ్యాల్సిన అవసరం ఉన్నట్లుంది. తెల్లవాడు మన పిల్లలకు చదువు చెప్పించడం ద్వారా మన భూముల్ని దొంగలించినందుకు ఏదో ఒకలా పరిహారం చెల్లిస్తున్నట్లుంది. కానీ ఈ ప్రయోగంలో నా కూతురు చాలా కష్టపడుతుందని నాకు తెలుసు. ఆమెను గురించిన గుబులుతో నా నిర్ణయాన్ని చెప్పాలంటే భయమేస్తోంది. సరే, నా చిట్టితల్లిని తీసుకెళ్లమని వాళ్లకు చెప్పు. వాళ్ల హృదయాల్లోని అంతరాలను బట్టి పరమాత్మ వాళ్లకు ప్రతిఫలాన్నిస్తాడని వాళ్లకు చెప్పు.”

బరువైన దుప్పటినొకదాన్ని కప్పుకుని, ఇనుప గుర్రం దగ్గరికి మమ్మల్ని తీసుకుపోబోయే బండి దగ్గరికి అమ్మతో కలిసి నడిచాను. నాకు చాలా సంతోషంగా ఉండింది. నాలాగే వాళ్ళ దగ్గరున్న దుప్పట్లనింటిలోకి మంచివాటిని కప్పుకుని వచ్చిన నా స్నేహితులను కలుసుకున్నాను. పూసలతో కుట్టిన కొత్త మొకాసిన్లనూ (పాదరక్షలు), కొత్త బట్టలకు చుట్టుకున్న పొడవాటి బెల్టుల వెడల్పునూ ఒకరికొకరం చూపించుకున్నాం. అంతలోనే తెల్లవాడి గుర్రాలు మమ్మల్ని వేగంగా దూరంగా తీసుకెళ్లిపోసాగాయి. అమ్మ ఒంటరి ఆకారం దూరంగా కనుమరుగవుతుంటే ఒకలాంటి పశ్చాత్తాపం నన్ను ఆవహించింది. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతానేమో అన్నంత నీరసంగా అనిపించింది. అమ్మ పూర్తిగా నమ్మని అపరిచితుల చేతుల్లో ఉన్నానిప్పుడు. ఇకపై నా ఇష్టమొచ్చినట్లు ఉండేందుకు గానీ, నా బాధను పంచుకునేంత స్వేచ్చ గానీ నాకు ఉండదనిపించింది. నా చెంపల మీద కన్నీళ్లు జారిపోయాయి. దుప్పటి మడతల్లో నా ముఖం దాచేసుకున్నాను. నన్ను అమ్మనుంచి విడదీసిన మొదటి అంకం పూర్తయ్యింది. ఆలస్యంగా వచ్చిన నా కన్నీళ్లు ఏమీ సాధించలేవు.

ఓ ముప్పై మైళ్లు రైలులో ప్రయాణించిన తరువాత ఓ పడవ ఎక్కి సాయంత్రానికల్లా మిస్సోరి నదిని దాటేశాం. తరువాత తూర్పువైపు మరిన్ని మైల్లు ప్రయాణించాక ఓ పెద్ద ఇటుకల బిల్డింగ్ ముందు ఆగాం. అలాంటి ఇంటిని మా ఊర్లో ఎప్పుడూ చూడలేదు. అబ్బురపడుతూనే ఒకలాంటి సంశయంతో కూడిన భయంతో ఆ ఇంటిని చూశాను. పళ్లుకొరికే చలిలో ప్రయాణం చేసి వచ్చినందుకూ, అక్కడున్న తెల్లవాళ్లను చూసి భయంతో, అపనమ్మకంతోనూ వణికిపోతూ, మెత్తని పాదరక్షలు చప్పుడు చెయ్యకుండా, గోడలకు ఆనుకుని ఇరుకైన హాలు గుండా బిల్డింగ్ లోకి నడిచాను. వేటగాడికి చిక్కిన చిన్ని అడవి జంతువులా భయంతో కలవరపడ్డాను.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply