ఎర్ర పిట్ట పాట (10): మంచులో ఒక సంఘటన

ఎర్ర ఆపిళ్ల దేశానికి వచ్చిన మొదటి రోజుల్లో ఒకరోజు మేం ముగ్గురు డకోటా పిల్లలం మంచులో ఆడుకుంటున్నాం. అప్పటికి జుడేవిన్ తప్ప, మిగతా అందరం ఇంగ్లీషు భాషకు చెవిటివాళ్లమే. ఇంగ్లీషు కొంచెం అర్థమయ్యే జుడేవిన్ కు విచిత్రాతి విచిత్రమైన విషయాలు వినిపించేవి. మంచులో వెళ్లకిలా పడకూడదనే నియమాన్ని ఒక నాటి ఉదయం ఆమె చెవులద్వారానే మేం విన్నాం. అప్పటిదాకా మంచులో ఆడుకున్నప్పుడల్లా వెళ్లకిలా పడి మా శరీర ముద్రల్ని చూసుకునేవాళ్లం. కానీ ఆ రోజు, మంచులో కొన్ని గంటలపాటు ఆడుకుంటూ లోకాన్ని మర్చిపోయి, వెళ్లకిలా పడకూడదన్న నియమాన్ని కూడా మర్చిపోయాం. ఒళ్లు మరిచి ఆడుకుంటుండగా ఒక గట్టి అరుపు మమ్మల్ని పిలిచింది. తలెత్తి చూస్తే, వెంటనే ఇంట్లోకి రమ్మంటూ పిలుస్తున్న ఒక తెల్లామె చెయ్యి ఊపుతూ కనిపించింది. మంచును దులిపేసుకుంటూ, ఎంత మెల్లగా వెళ్లడానికి ధైర్యం చెయ్యగలమో అంత మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లాం.

జుడేవిన్ అన్నది: “ఆ తెల్లామెకు కోపం వచ్చింది. మంచులో పడ్డందుకు మనల్ని శిక్షిస్తుంది. ఆమె మీ కళ్లల్లోకి చూస్తూ గట్టిగా మాట్లాడితే, ఆమె పూర్తిగా మాట్లాడేదాక ఆగండి. తరువాత, ఒక్క క్షణం ఆగి, ‘లేదు ‘ అని ఇంగ్లీషులో చెప్పండి.” ఆ తెల్లామె దగ్గరికి చేరేలోపల ‘లేదు ‘ అన్న మాటను సాధన చేశాం.

ఆమె అందరికంటే ముందు తోవిన్ ను ఒక గదిలోకి పరీక్షకు పిలిచింది. తోవిన్ వెనకాలే చిన్న చప్పుడుతో తలుపు మూసుకుంది.

నేనూ, జుడేవిన్ తలుపుకున్న కంతలోంచి లోపల జరుగుతున్న సంభాషణ వినడానికి నిశ్శబ్దంగా తలుపు పక్కనే నిల్చున్నాం. ఆ తెల్లామె గొంతు చాలా కరుకుగా ఉంది. ఆమె పెదవులనుంచి పదాలు నిప్పు కణికల్లా పడుతున్నాయి. ఆమె అంటున్న మాటలకన్నా ఆమె గొంతే నాకు ఎక్కువగా అర్థమయింది. మేం ఆమెకు బాగా కోపం తెప్పించామని అర్థమయింది. ఆమె మాటలు కొన్ని విన్న తరువాత తను మాకు తప్పు జవాబు నేర్పించిందని జుడేవిన్ కు అర్థమయింది.

“అయ్యో, పాపం తోవిన్!” ఆరాటంతో, ఆ మాటలు ఇక వినలేక రెండు చెవులను మూసేసుకుంది.

అప్పుడే ‘లేదు’ అని తోవిన్ వణుకుతున్న గొంతు వినిపించింది.

కోపంతో కూడిన ఆశ్చర్యంతో కేకపెట్టి తెల్లామె తోవిన్ ను కొట్టింది. తరువాత ఆగి, ఏదో అన్నది. ఆమె ఇలా అన్నదని జుడేవిన్ చెప్పింది: “ఇకపై నేను చెప్పిన మాట వింటావా?”

ఆమె ఆజ్ఞకు తోవిన్ మళ్లీ ఒకే ఒక్క పదంతో జవాబిచ్చింది: ‘లేదు.’

ఆ తెల్లామె ఈ సారి కొట్టిన దెబ్బలు చురకల్లా తగలాలని అనుకున్నట్లుంది, పాపం బయపడిపోయిన ఆ చిన్న పిల్ల గొంతెత్తి గట్టిగా అరిచింది. కాసేపటికి ఒక్కసారిగా కొట్టడం ఆపి, ఆ తెల్లామె మరో ప్రశ్న అడిగింది: “మంచులో మళ్లీ పడతావా?”

తోవిన్ తన దగ్గరున్న తప్పు జవాబును మరోసారి ప్రయత్నించింది. మాకు ఆమె గొంతు సన్నగా వినిపించింది, “లేదు! లేదు!”

అంతటితో ఆ తెల్లామె తన సగం అరిగిన చెప్పును దాచేసి, ఆ పిల్ల పొట్టి జుట్టును నిమురుతూ బయటకు తీసుకొచ్చింది. ఈ సమస్యకు పాశవిక శిక్షలతో పరిష్కారం దొరకదని ఆమె గ్రహించిందేమో. ఆమె నన్ను గానీ, జుడేవిన్ ను గానీ ఏమీ అనలేదు. బాధపడుతున్న మా స్నేహితురాలిని మాత్రం మాకు అప్పగించి మమ్మల్ని ఒంటరిగా ఆ గదిలో వదిలేసి వెళ్లిపోయింది.

మొదటి రెండు మూడు రుతువుల్లో, మంచు సంఘటనకు దారి తీసినట్లాంటి అపార్థాలు చాలా సార్లే జరిగాయి. అవి ఎన్నో అన్యాయమైన శిక్షలతో, భయాలతో మా చిన్ని జీవితాలను నింపేసాయి.

ఒక సంవత్సరంలోపల ముక్కలు ముక్కలుగా ఇంగ్లీషు మాట్లాడడం నేర్చుకున్నాను. మమ్మల్ని అంటున్న మాటలూ, మాకు జరుగుతున్న విషయాలూ కొంచెం కొంచెం అర్థమవడం మొదలవగానే, పగ తీర్చుకోవలన్న అల్లరి ఉత్సాహం నన్ను ఆవహించింది. ఒకరోజు ఆటల్లో ఉన్నప్పుడు ఏదో తప్పు చేశానని నన్ను లోపలికి పిలిపించారు. అనవసరంగా కట్టుదిట్టం చేస్తున్న ఒక నియమాన్ని ఉల్లంఘించాను.

మధ్యాహ్నం భోజనానికోసమని ఉడకబెట్టిన టర్నిప్ దుంపల్ని కలపడం కోసం వంటగదిలోకి నన్ను పంపించారు. అప్పటికి మధ్యాహ్నమయింది. సెగలుకక్కుతున్న భోజనం గిన్నెలను డైనింగ్ రూములోకి గబగబా తీసుకెళ్తున్నారు. నాకు టర్నిప్ దుంపలు అస్సలు ఇష్టం లేదు. గోధుమరంగులో ఉన్న జాడిలోంచి వచ్చే వాటి వాసన నాకు వికారంగా అనిపిస్తుంది. ఒక తెల్లామె ఇచ్చిన చెక్క గరిటెను గుండెలో మంటలతో అందుకున్నాను. ఒక స్టూలు మీద నిలబడి, ఆ పొడవాటి గరిటెను రెండు చేతులతో పట్టుకుని పరమ కోపంతో టర్నిప్ దుంపల మీదకు వంగాను. నా కోపాన్నంతటినీ ఆ దుంపలమీద చూపించాను. ఎవరి పనిలో వాళ్లుండి నన్ను ఎవరూ గమనించలేదు. టర్నిప్ దుంపలు మెత్తని గుజ్జుగా తయారయ్యాయి, ఇక ఎంత నలగ్గొట్టినా అంతకంటే మెత్తగా అవవు. “ఆ టర్నిప్ దుంపలను గుజ్జు చెయ్యి,” అని నన్ను పురమాయించారు. వాటిని గుజ్జు చేస్తూనే ఉంటాను! కొత్త శక్తితో గుజ్జు చేస్తూ గరిటెను జాడీ అడుగుకి తగిలేట్టు చేశాను. నా శరీరం బరువు మొత్తం ఆ పనిలో పెట్టానని నాకు తృప్తిగా అనిపించింది.

అప్పుడే ఒక తెల్లామె నా టేబిలు దగ్గరకు వచ్చింది. జాడీలోకి ఒకసారి చూసి, నా చేతులను దురుసుగా పక్కకు తోసింది. భయం లేకుండా, కోపంతో పక్కకు జరిగి నిలబడ్డాను. ఆమె తన ఎర్ర చేతులతో జాడీ అంచులను పట్టుకుంది. ఒక్క ఊపుతో జాడీని ఎత్తి టేబిలు దగ్గర్నుంచి గబగబా నడిచింది. కానీ పగిలిపోయిన అడుగునుంచి జారి టర్నిప్ గుజ్జంతా నేలమీద పడిపోయింది! ఆమె నన్ను అనాల్సిన మాటలన్నీ అన్నది. కానీ అవేవీ నా చెవికెక్కలేదు. జాడీ పగలగొట్టానని ఏదో మూల కొంచెం బాధ పడ్డా, ప్రతీకారం తీర్చుకున్నానని విజయోత్సాహంతో నిలబడ్డాను.

భోజనం చెయ్యడానికి కూర్చున్నప్పుడు టర్నిప్ గుజ్జు వడ్డించకపోవడం గమనించి, ఒక్కసారైన విజయవంతంగా తిరగబడినందుకు నాలో నేనే ఉప్పొంగిపోయాను.

** **

Xi: దయ్యం

మా తెగలోని పెద్దవాళ్లు నాకు చెప్పిన గాథల్లో క్రూరమైన దయ్యాల కథలెన్నో ఉండేవి. కానీ ఆ అత్మలు, మనిషి రూపంలో భౌతికంగా మన చుట్టూ తిరగాడే వాటికంటే భయంకరమైనవి కాదని నాకు నేర్పారు. కానీ, చెడ్డ ఆత్మలకు పొగరుబోతు నాయకుడొకడు ఉంటాడనీ, పరమాత్మ మీద తిరగబడడానికి శక్తులను సమీకరించే ధైర్యం చేస్తాడనీ ఇక్కడికి వచ్చాక ఒక తెల్లామె చెప్పేదాక నాకు తెలీదు.

ఒక పెద్ద పుస్తకంలో తెల్లవాడి దయ్యాన్ని ఆమె నాకు చూపించింది. దట్టమైన బొచ్చుతో ఉన్న వేళ్లనుంచి పొడుచుకొచ్చిన వాడిగోర్లను భయంతో చూశాను. అతని కాళ్లు కూడా అతని చేతుల్లానే ఉన్నాయి. పొలుసులతో కూడిన తోక ఒకటి అతని కాలి మడమల పక్కన వేళ్లాడుతోంది. ఆ తోక చివర తెరిచిన దవడల సర్పం ఒకటి ఉంది. అతని ముఖం అతుకులు వేసినట్లుంది. కొంతమంది తెల్లవాళ్లకు లాగే అతని చెంపలమీద గడ్డం పెరిగి ఉంది. అతని ముక్కు గద్ద ముక్కుల ఉంది. మోసపూరితమైన నక్కకు ఉన్నట్లు, అతని చెవుల చివర కొనదేరి ఉన్నాయి. ఆ చెవులమీద ఆవుల కొమ్ములు, పైకి వంపు తిరిగి ఉన్నాయి. క్రూరాత్మల రాజును చూసి విస్మయంతో వణికిపోయాను. నా గుండె గొంతులో కొట్టుకుంది. భయకరమైన ఆ ప్రాణి ప్రపంచమంతా విచ్చలవిడిగా తిరుగుతుందనీ, బడి నియమాలను పాటించని చిన్న అమ్మాయిలను ఆ ప్రాణి చిత్రహింసలు పెడుతుందని ఆ తెల్లామె నాకు చెప్పింది.

ఆ దుష్ట దైవత్వం గురించి ఆ రాత్రి కలగన్నాను. ఆ కలలో నేను అమ్మ గుడిసెలో ఉన్నాను. ఒక ఇండియన్ యువతి అమ్మను కలవడానికి వచ్చింది. వాళ్లు ఇంటి మధ్యలో ఉన్న పొయ్యికి అటూ ఇటూ ఎదురెదురుగ్గా కుర్చీల్లో నిటారుగా కూర్చున్నారు. నేనేమో దారంలేని నూలు పుడకలతో ఆడుకుంటున్నాను. అది రాత్రిపూట. కొవ్వొత్తి బలహీనంగా వెలుగుతోంది. హఠాత్తుగా బయటనుంచి ఎవరో తలుపు పిడిని తిప్పడం విన్నాను.

అమ్మా, ఆమె స్నేహితురాలూ తలుపువైపు చూస్తూ గుసగుసగా మాట్లాడడం మొదలుపెట్టారు. తలుపు మెల్లగా తెరుచుకుంది. నేను వెళ్లి పొయ్యి వెనకాల దాక్కున్నాను. తలుపు కిర్రుమంటూ, మెల్లగా, అతి మెల్లగా తెరుచుకుంది.

అప్పుడే దయ్యం వేగంగా లోపలికి వచ్చేశాడు. అతను చాలా ఎత్తుగా ఉన్నాడు! అచ్చం తెల్లవాడి పేపర్లో చూసినట్లే ఉన్నాడు. అతనికి ఇండియన్ భాష రానందుకు అతను అమ్మతో మాట్లాడలేదు. కానీ వెలుగుతున్న అతని పసుపుపచ్చ కళ్లు నన్ను అంటుకుపోయాయి. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ, అమ్మ స్నేహితురాలి కుర్చీ వనకనుంచి నడిచొచ్చి పొయ్యి వెనక్కి వచ్చాడు. నేను నూలుపుడకలను కింద పడేసి అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మను చూసి అతను భయపడలేదు. నా వెనకే వచ్చాడు. అతన్నుంచి నన్ను కాపాడమని గట్టిగా అరుస్తూ పొయ్యి చుట్టూ పరిగెట్టాను. కానీ నేను ఎట్లాంటి ఆపాయంలో లేనట్లు అమ్మా, ఆమె స్నేహితురాలు దయ్యం నన్ను తరమడాన్ని చూస్తూ తాపీగా కూర్చున్నారు. ఆఖరికి నాకు తలతిరుగున్నట్లయి, మోకాళ్లు చచ్చుబడినట్లు అనిపించింది. అమ్మ కుర్చీ పక్కన కుప్పకూలిపోయాను. దయ్యం చాచిన చేతులతో నన్ను అందుకోబోతూ నా మీదకు వంగుతున్నప్పుడు అమ్మ తన ఉదాసీనత నుంచి బయటపడి నన్ను తన వళ్లోకి తీసుకుంది. అప్పుడు దెయ్యం మాయమైపోయింది. నేను నిద్రలోంచి మేల్కొన్నాను.

మర్నాటి ఉదయం నేను ఆ దయ్యం మీద పగ తీర్చుకున్నాను. అరలనిండా పుస్తకాలు ఉన్న గదిలోకి చొరబడి బైబిల్ కథల పుస్తకాన్ని బయటకు తీశాను. నా ఏప్రన్ జేబులోంచి బలపాన్ని తీసి క్రూరమైన ఆ దయ్యం కళ్లను గీకేశాను. కొంచెంసేపటి తరువాత, ఆ గదిలోంచి బయటపడేలోగా ఒకప్పుడు దయ్యం బొమ్మ ఉండాల్సిన చోట పూర్తిగా రంద్రాలు పడిన పేపరు మిగిలింది.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply