ఎర్రపిట్ట పాట

145 ఏళ్ల క్రితం.

ఆదివాసుల భూములను మెల్లమెల్లగా ఆక్రమించేస్తూ ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అనే దేశం దినదిన ప్రవర్థమానమవుతోంది.

యురోపియన్లు తెచ్చిన రోగాలతో, ఆ తెల్లవాడితో యుద్ధాలలో ఎన్నో తెగలు సమసిపోయాయి. మిగిలిన 600 తెగల ఆదివాసులను తెల్ల సంస్కృతిలో విలీనం చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనీకరణంలో భాగంగా పెద్దవాళ్లను మద్యంమత్తులో, మతంమత్తులో ముంచేసి, ఆదివాసీ పద్ధతులు అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లలను నయానోభయానో, బలవంతంగానో ఎత్తుకెళ్లి బోర్డింగ్ స్కూల్లలోకి తోసేశారు. ‘ఇండియన్ను చంపి వాడిలోని మనిషిని రక్షించు’ (Kill the Indian and Save the Man) అన్నది ఆ బోర్డింగ్ స్కూళ్ల నినాదం. ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లలోకి నెట్టబడి, తమ పూర్వీకులు నడయాడిన నేలలోనే పరదేశీయులైపోయిన ఆదివాసులకు అదొక తీవ్ర సందిగ్ధ కాలం.

ఇలాంటి లోకంలోకి, డకోట ఉపతెగ యాంక్తన్ సూ కు చెందిన తల్లికీ, యురోపియన్-అమెరికన్ తండ్రికి పుట్టింది గెట్రూడ్ సిమ్మన్స్. ఎనిమిదేళ్లు తల్లి దగ్గరే, తమ తెగ లోనే పెరిగింది. బోర్డింగ్ స్కూళ్లల్లోకి పిల్లల్ని చేరవేసే మిషనరీలు ఎరచూపిన తాజా ఎర్ర ఆపిల్ పళ్లకోసమూ, ఇనుప గుర్రం (రైలు) ఎక్కాలన్న కుతూహలంతోనూ, తల్లిని ఒప్పించి తనకు తానే బోర్డింగ్ స్కూల్లో చేరింది. ఆత్మను చంపేసి మనిషిని డొల్లగా మార్చే తెల్ల మిషనరీల కౄరత్వాన్ని అతి త్వరలోనే చవిచూసింది. కొన్నేళ్ల తరువాత తల్లి దగ్గరికి వెళ్లిపోయే అవకాశం వచ్చినా, మారిపోయిన తన స్వభావంతో ఆ వాతావరణంలో ఇమడలేక పైచదువులకోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కానీ, మిషనరీలు తనలోని డకోటా తనాన్ని తరిమెయ్యలేకపోయారని తెలుసుకుంది. తన పేరు జిత్కల-స అని మార్చుకుంది. అంటే డకోట తెగ భాషలో ఎర్రపిట్ట.

Painting by Ananya

జిత్కల-స టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి, ‘న్యూ ఇంగ్లండ్ కన్జర్వేటరీ ఆఫ్ మ్యూజిక్’ లో వయొలిన్ అభ్యసించింది. ఆదివాసీ తెగల సంస్కృతి గురించి వ్యాసాలూ, కథలూ, కవితలూ రాసి అమెరికాలోని ప్రసిద్ధమైన ‘హార్పర్ బజార్’ వంటి పత్రికల్లో ప్రచురించింది.

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ‘కర్లైల్ ఇండియన్ స్కూలు’లో టీచరుగా చేరింది. తను చదివిన బోర్డింగ్ స్కూలులాంటి స్కూలే అది కూడా. తను ఎదుర్కున్న హింసను కొత్తతరం పిల్లలూ ఎదుర్కోవటం చూసింది. చదువుకోవడం కోసం వచ్చిన పిల్లలు తమ సంస్కృతిని వదులుకోవలసిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించింది. రిజర్వేషన్ నుంచి రాబట్టిన ఒక్కొక్క ఆదివాసీ పిల్ల/పిల్లవాడి మీద ప్రభుత్వం స్కూలుకు డబ్బు ఇస్తుందని తెలుసుకుంది. ఆదివాసీ సంస్కృతిని పూర్తిగా నాశనం చేసేందుకే బోర్డింగ్ స్కూళ్లు నెలకొల్పబడ్డాయని తెలుసుకుంది. ఆ స్కూలుకు రాజీనామా చేసి, ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్’ (BIA) అనే సంస్థలో చేరింది. ఆ సంస్థలోనే పని చేస్తున్న రేమండ్ టలిస్ఫాసె బొన్నిన్ ను పెళ్లి చేసుకుంది. ఆదివాసుల అవసరాలను పట్టించుకోవడం కోసం స్థాపించబడ్డ BIA, నిజానికి ఆదివాసుల హక్కులనూ, సంస్కృతినీ కాలరాసే పాలసీలతో పనిచేస్తోందని త్వరలోనే తెలుసుకున్నారు ఆ దంపతులు. ఒక బాబు పుట్టాక, BIAకు రాజీనామా చేసి యుటె రిజర్వేషన్ కు మకాం మార్చారు. జిత్కల-స అదే రిజర్వేషన్ లోని స్కూలులో టీచరుగా చేరింది. ఇది బోర్డింగ్ స్కూలు కాదు. అక్కడ ఉన్నప్పుడే విలియం హాన్సెన్ అనే మ్యూజిక్ ప్రొఫెసరుతో కలిసి ‘ది సన్ డ్యాన్స్ ‘ అనే ఆదివాసుల గురించిన మొట్టమొదటి ఒపెరా నాటకాన్ని రచించింది. సన్ డ్యాన్స్ (సూర్య నృత్యం) అనేది అమెరికన్ ఆదివాసుల ఆచారాల్లోని ఒక ముఖ్యమైన, పవిత్రమైన క్రతువు. ఎన్నో ఆదివాసీ తెగల్లో ప్రసిద్ధమైన ఇక్తొమీ గురించిన గాథల్ని సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించింది. ఇక్తొమీ అంటే మనిషి రూపంలో ఉన్న సాలీడు. తనను తానే వేళాకోళం చేసుకుంటూనో, ఇతర్లనూ హేళన చేస్తూనో జీవిత పాఠాలు నేర్పించే టక్కరి. వెరసి, ఇక్తొమీ ఆదివాసుల లెజండరీ హీరో.

ఇంత పని చేస్తున్నా ఆదివాసీ ప్రజల హక్కులకోసం పని చెయ్యాలని వాషింగ్టన్ డి.సి. కి మకాం మార్చారు ఆమె, ఆమె భర్తా. జిత్కల-స ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ అఫైర్స్’ లోనూ, ‘అమెరికన్ ఇండియన్ మ్యాగజైన్ లో’ నూ పనిచేసింది. భర్తతో కలిసి ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇండియన్స్’ అనే సంస్థను స్థాపించింది. ఆదివాసీ ప్రజలకు సంబంధించిన ఆర్థిక, విద్య, ఆరోగ్యం, వృత్తి వంటి ఆంశాలను ప్రజల ముందుకు తెచ్చింది. ఆమె ఆచరణతత్వం ఆదివాసీలకు సంబంధించిన ప్రభుత్వ పాలసీలను ఎంతగా ప్రభావితం చేసిందంటే, 1924 లో ఆదివాసులకు అమెరికా ప్రభుత్వం ఇస్తున్న సంరక్షణ కాకుండా అమెరికా పౌరసత్వాన్ని సాధించడంలోనూ ఆమెది అతి ముఖ్యమైన పాత్ర.

జిత్కల-స జీవితాంతం ఆదివాసీ సంస్కృతిని కాపాడడం కోసం, ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పనిచేసింది. ఆమె అద్భుతమైన రచయిత కూడా.

ఇదిగో, ఆమె కథ! ‘ఓ ఇండియన్ బాల్యం ముద్రలు’ (Impressions of an Indian Childhood) అనే ఆటోబయోగ్రఫీలోని ఆమె మాటల్లోనే:

I. అమ్మ

గాలి తాకిడికి మాసిపోయిన కాన్వాసు గుడ్డపరచి ఉన్న విగ్‌వాం (గుడిసె) ఒకటి ఎగుడుదిగుడగా మొలుచుకొచ్చిన గుట్టల కింద ఉంది. ఏటవాలుగా ఉన్న నేలను చుట్టుకుని కిందకు దిగుతున్న కాలిబాట ఒకటి విశాలమైన నదిని చేరుకుంటోంది; ఇరువైపులా పెరిగి తలలువాల్చిన పొడవాటి రెల్లుగడ్డి మధ్య పాకుతూ వెళ్లి మిస్సోరి నది అంచును కలుస్తోంది.

ఇంటికి కావలసిన నీళ్లను తెచ్చుకోవడానికి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడికే వస్తుంది అమ్మ. అమ్మ నదికి బయలుదేరగానే, నేను ఆటలు పక్కనపెట్టేసి ఆమె పక్కన పరిగెట్టేదాన్ని. ఆమె ఎత్తరి కాదు. ఆమె చాలామటుకు దిగులుతోనూ, నిశబ్దంగానూ ఉండేది. అలాంటి సమయాల్లో వంపులు తిరిగిన ఆమె పెదవులు బాధతో కూడిన ఒకేఒక్క అడ్డగీతలా మారిపోయేవి. ఆమె కళ్ల కింద నీడలు పరుచుకుని ఉండేవి. అలాంటప్పడు నేను ఆమె చేతికి వేళ్లాడుతూ, ఆమె కన్నీళ్లకు కారణమేమిటని అడిగేదాన్ని.

“ష్, నా చిన్నారీ. నా కన్నీళ్ల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదు.” నీళ్లు నిండిన కళ్లతోనే నావైపు చిర్నవ్వుతో చూసేది. నా తలమీద మెల్లగా తడుతూ, “ఈరోజు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో చూద్దాం.” అని అనేది. వెంటనే నేను, చేతనైనదానికంటే వేగంగా పరిగెట్టేదాన్ని. పొడవాటి నల్లని నా జుత్తు గాలికి ఎగిరేది.

నేను అప్పుడు ఏడేళ్ల అడవి పిల్లని. తోలుతో చేసిన వదులు బట్టలతో, జింక చర్మంతో చేసిన మెత్తని చెప్పులతో తిరగాడే నేను, నా జుత్తును ఎగరేసే గాలి అంత స్వేచ్ఛగా, కుప్పిగంతులేసే జింక అంత ఉల్లాసంగా ఉండేదాన్ని. నా అడవి స్వేచ్ఛ, పొంగిపొరలుతున్న నాలోని ఉల్లాసం – ఇవే అమ్మకు గర్వకారణం. ఇతర్ల విషయాల్లోకి చొరబడకూడదన్నది తప్ప మరే భయాన్నీ ఆమె నాకు నేర్పలేదు.

కొంతదూరం పరిగెట్టాక ఆగి ఆయాసపడుతూ, సంబరంతో నవ్వేదాన్ని. అమ్మ నా ప్రతి కదలికనూ గమనించేది. అప్పటికి నాగురించి నాకు పూర్తిగా తెలీదు కానీ, నా లోలోపల రాజుకుంటున్న నిప్పుకు ప్రతీకగా హుషారుగా తొణికిసలాడేదాన్ని. నేనే చైతన్యమనీ, నా కాళ్లూ చేతులు నాలోని ఉత్సాహపు ప్రయోగాలనీ అనిపించేది.

నదినుంచి ఇంటికి వెళ్లేప్పుడు, అమ్మ పక్కనే నడుస్తూ, బకెట్ మీద చెయ్యిపెట్టి నేను కూడా నీళ్లు మోస్తున్నాని అనుకునేదాన్ని. నదికి వెళ్లి వస్తున్న ఒకరోజు మా మధ్య సంభాషణ కొంచెం గుర్తుంది నాకు. నాకు అక్క వరసైన బంధువు, పదిహేడేళ్ల వార్క-జ్విన్ (పొద్దుతిరుగుడు పువ్వు) నదికి ఒక్కతే వెళ్లి వాళ్ల అమ్మకోసం నీళ్లు తెచ్చేది. వాళ్ల గుడిసె మా గుడిసె దగ్గర్లోనే ఉండేది. ఆమె రోజూ నదికి వెళ్లడం చూసేదాన్ని. ఆ అక్క అంటే నాకు చాల ఇష్టం. అందుకని అమ్మతో అన్నాను, “అమ్మా నేను వార్క-జ్విన్ అంత ఎత్తయినప్పుడు నువ్వు నీళ్లకోసం నదికి రానక్కరలేదు. నేనే తెస్తాను.”

“అప్పటికి మనం తాగే నదిని మననుంచి తెల్లవాడు తీసుకోకపోతే.” అని జవాబిచ్చింది అమ్మ. అప్పటికి నాకు అర్థం కాని వణుకు ఆమె గొంతులో.

“అమ్మా, ఆ చెడ్డ తెల్లవాడు ఎవరు?”

“నా చిన్నారీ, వాడొక బూటకం – ఓ రోగిష్టి బూటకం! ఎర్ర డకోట మనిషే అసలు మనిషి.”

ఆమె మాట్లాడుతుండగా తలెత్తి ఆమె ముఖంలోకి చూశాను. ఆమె పెదవి కొరుక్కోవడం చూసి, ఏదో బాధ పడుతోందని నాకు అర్థమయింది. ఆమెను అలా చూడగానే నా చిన్ని హృదయంలో ఒక ప్రతీకారవాంఛ తలెత్తింది. నేలను కాలితో గట్టిగా తంతూ అరిచాను, “అమ్మను ఏడిపిస్తున్న తెల్లవాడంటే నాకు అసహ్యం!”

నీళ్ల బకెటును పక్కనపెట్టి, నా పక్కన వంగి ఒక చెత్తో నన్ను దగ్గరికి తీసుకుని మరో చేత్తో మా ముందు ఉన్న గుట్టను చూపించింది. “ఆ గుట్ట మీదనే మా మమయ్యా, నా ఒక్కగానొక్క తోబుట్టువు సమాధుల్లో పడుకుని ఉన్నారు. అదిగో అదే తెల్లవాడు చేసింది! మీ నాన్న కూడా మరో గుట్ట దగ్గర సమాధిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్లం. కానీ తెల్లవాడు మనల్ని మన భూమినుంచి తరిమేసి ఇక్కడికి వెళ్లగొట్టాడు. మోసంతో మన భూముల్ని లాక్కుని మనల్ని తరిమేసాడు.

శిబిరాల్ని ఎత్తేసి వేరేచోటికి బయల్దేరిన రోజే మీ మామయ్య, అక్క జబ్బు పడ్డారు. చాలమందిది అదే పరిస్థితి. కానీ ఎక్కడినుంచి సహాయం రాలేదు. ఎన్నో రోజులు, రాత్రుల్లు ప్రయాణం చేశాం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు సంబరంతో, ఉత్సాహంతో శిబిరాల్ని ఎత్తేసి వేరే చోటికి వెళ్లిపోయినట్లాంటి ప్రయాణం కాదు అది. మనల్ని వెళ్లగొట్టారు, నా చిన్నారీ, ఏదో పశువులమందను తలించినట్లు మనల్ని తరలించారు. అప్పుడు మీ అక్క నీ అంత ఎత్తు ఉండేది. ప్రయాణంలో ఆడుగడుక్కి బాధతో అరిచేది. గొంతు రాసుకుపోయేంతగా ఏడ్చేది. మెల్లమెల్లగా జ్వరం ఎక్కువైంది. తన చిట్టి పెదాలు ఎండిపోయాయి కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగేది కాదు. ఆమె గొంతు వాచి, ఎర్రబడిందని తరువాత అర్థమైంది. పాపం నా చిట్టి తల్లి. ఆమెతో కలిసి ఏడ్చాను. పవిత్ర ఆత్మ మమ్మల్ని మరచిపోయాడు!

తరువాత ఎప్పటికో పశ్చిమాన ఉన్న ఈ ప్రాంతానికి వచ్చిన మొదటి రాత్రే మీ అక్క చనిపోయింది. త్వరలోనే మీ మామయ్య కూడా, మీ అక్క వార్క -జ్విన్ నూ, ఆమె తల్లిని అనాధలను చేసి చనిపోయాడు. కిరాతకుడైన తెల్లవాడే లేకపోయుంటే మీ అక్కా, మీ మామయ్య ఇప్పటికీ మనతోనే సంతోషంగా ఉండేవాళ్లు.”

మా గుడిసె చేరుకునేదాక అమ్మ ఇక ఏమీ మాట్లడలేదు. ఆమె కళ్లల్లో నీళ్లు కనిపించలేదు కానీ, అందుకు కారణం నేను ఆమె పక్కనే ఉండడమని నాకు తెలుసు. నా ముందు ఎప్పుడోగాని ఏడ్చేది కాదు.

(మిగతా వచ్చే సంచికలో …)

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply