ఎర్రపిట్ట పాట (14) : తృప్తినివ్వని గెలుపు

రెండో సారి బయల్దేరాను, తూర్పు దేశానికి. బయల్దేరే ముందే తీసుకోవలసిన జాగర్తలు తీసుకున్నాను. మా ఊరి వైద్యుడి ఇంటికి వెళ్లి ఆయనతో రహస్యంగా మాట్లాడాను. ఆయన ఇచ్చిన మంత్ర మూలికల కట్టను చిన్న తోలు సంచిలో పెట్టి నా దండకు కట్టుకున్నాను. దాని మహిమ ఎలాంటిదంటే, మనం ఎక్కడికి వెళ్లినా ఇక స్నేహితులకు కొదువ ఉండదన్న మాట. ఆ తాయెత్తు మీద నాకు ఎంత గురి ఉండిందంటే, ఏడాదికి పైన, స్కూలులో ఉన్నప్పుడంతా దాన్ని నా దండకు కట్టుకునే తిరిగాను. ఆ ఎండు వేర్ల మీద నాకు నమ్మకం పోక ముందే, నా అదృష్టదేవతను, ఆ చిన్ని తోలుసంచిని ఎక్కడో పోగొట్టుకున్నాను.

మూడేండ్ల మొదటి టర్మ్ పూర్తయ్యే సరికి నా మొదటి డిప్లొమా చేతికి వచ్చింది. డిప్లొమా చూసుకుని మురిసిపోయాను. ఆ తరువాత ఆకురాలుకాలం, అమ్మ అయిష్టాన్ని పక్కన పెట్టి, కాలేజీలో చేరాను.

అమ్మ అనుమతి కోసం తనకు ఉత్తరం రాశాను. ఆమె జవాబు నాకు ప్రోత్సాహకరంగా లేదు. మా పొరుగు ఇళ్ళ పిల్లలు మూడేళ్ళతో విద్యావ్యాసంగం ఎలా ముగించారో ఆమె గుర్తు చేసింది. మూడేళ్ళ తరువాత వాళ్లు ఇళ్ళకు వచ్చేశారు, అక్కడి ఇంగ్లీషు వాళ్ళతో ఎంచక్కా ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నారు. తెల్లవాళ్ళ సంస్కృతిని అందిపుచ్చుకోడంలో నేను మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అమ్మ మాటల సారాంశం. నా సోమరి ప్రయత్నం ఇక మానేసి, ఇంటికి వెళ్లి, మా గడ్డిభూముల్లో తిరుగుతూ, అడవి మూలికల సేకరణ వంటి పనులు చేసుకోడం మేలని ఆమె సూచన.

ఆ విధంగా, అమ్మ మాట కాదన్నందుకు, ఇంటికి దూరమైనందుకు బరువెక్కిన హృదయంతో కాలేజీలో కొత్త కొత్త వాళ్ళతో జీవితం మొదలెట్టాను.

అదోరకంగా, అదే సమయంలో ఆసక్తిగా చూసే సహ విద్యార్టుల కళ్లబడకుండా, నా కాలేజీ చిన్ని డోర్మెటరీలో నేను దాగుండిపోయాను. సానుభూతి కోసం అంగలార్చాను. తరచు రహస్యంగా ఏడ్చాను. మా పడమటి దేశానికి వెళ్లి, అమ్మ ఒడిలో సేదదీరాలని కోరుకున్నాను. బూజుపట్టిన భావాలతో కరడుగట్టిన శీతల హృదయాలకు దూరంగా మా ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాను.

ఆకురాలుకాలం, శీతకాలం మొత్తంగా నాకు నా స్నేహితులంటూ ఎవరూ లేరు. నా క్లాస్ మేట్లలో చాలామంది తగినంత దూరం నుంచే నాతో మర్యాదగా ప్రవర్తించే వారంతే.

మా అమ్మ నా మొండితనాన్ని ఇంకా క్షమించలేదు. ఉత్తరాలు రాసేది కాదు. పగటి వెలుగులో, దీపం వెలుగులో రెల్లు రెబ్బలతో, అడవి ముళ్ళతో రకరకాలు డిజైన్లు అల్లుతూ… అల్లిక పనిలో నా చేతులు నొప్పేట్టేదాక గడిపేదాన్ని, ఆ డిజైను తెల్లవాళ్ళ నుంచి నాకు స్నేహాభిమానాలు సంపాదించి పెడుతుందని నా ఆశ.

చిట్టచివరికి, వసంతకాలపు టర్మ్ లో, వివిధ క్లాసుల వాళ్లు పాల్గొనే ఉపన్యాస పోటీలో నేను పేరు నమోదు చేసుకున్నాను. పోటీ దగ్గరపడేకొద్ది… పోటీ రోజు ఇప్పుడిప్పుడే కాదులే అన్నట్లుండే దాన్ని. కాని ఆ రోజు రానే వచ్చింది. చర్చిలో అన్ని క్లాసుల పోటీ దారులు, వాళ్లు ఆహ్వానించిన ఇతర్లు కూర్చన్నారు. ఎత్తైన వేదిక. తివాచీ పరిచి, కాలేజీ పతాకాలు వేలాడదీసి వేదికను అలంకరించారు. బాగా కాంతివంతమైన వెలుగు గది నిండా పరుచుకుంది. పైన చర్చి పైకప్పు కింద ఆర్చ్ ల మాదిరి అమర్చిన దెంతెలు ఆ కాంతికి మెరుస్తున్నాయి. కూర్చున్న గుంపుల గుసగుసలు గదిలో మెల్లని అలల్లా వినిపిస్తున్నాయి. ఉపన్యాసాల సమయం కాగానే అందరూ నిశ్శబ్దమయ్యారు. పరీక్షా సమయాన్ని సూచించే పాత గోడ గడియారం ఒక్కటి టిక్కుటిక్కుమంటోంది.

నేను ఒక్కొక్కరి ఉపన్యాసం విన్నాను. వాళ్ళందరూ నాలాగే నిర్ణేతల నిర్ణయం తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారని నాకు అప్పుడు తట్టలేదు. ప్రతి ఉపన్యాసానికి గట్టిగా చప్పట్లు వినిపించాయి. కొందరు ఉపన్యాసకులను మరింత గట్టిగా హర్షించారు. తొందరగానే నా వంతు వచ్చింది. వేదిక ఎక్కే ముందు కాసేపు తెరల వెనుక నుంచుని గుండెల నిండా ఊపిరి తీసుకున్నాను. నా ఉపన్యాసం ముగింపు పలుకుల తరువాత, ఇతర్లకు వినిపించినట్లే చప్పట్లు వినిపించాయి.

వేదిక దిగి వస్తుంటే, నా సహవిద్యార్థులు… రంగుల రిబ్బన్లు కట్టిన పెద్ద పూల గుత్తి అందించి, నన్ను సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు. అన్నాళ్లు వాళ్లకు వ్యతిరేకంగా నాలో పేరుకున్న అనుమానాలను వాళ్ళ ఆదరణ పటాపంచలు చేసింది.

నిర్ణేతలు నాకు మొదటి స్థానం ప్రకటించారు. ప్రకటనకు హాలు హాలంతా కరతాళధ్వనులతో మార్మోగింది. నా క్లాస్ మేట్లు నా పేరు పెట్టి గట్టిగా నినాదాలు చేశారు, పాటలు పాడారు. పోటీలో వెనుకబడిన విద్యార్థులు అల్లరిగా ఊళలు వేశారు, వికృతంగా అరిచారు. టిన్ తప్పెట్ల మీద వికృత శబ్దాలు చేశారు. ఆ గందరగోళం మధ్యనే నా విజయానికి సంతోషించిన విద్యార్థులు ముందుకొచ్చి నాకు అభినందనలు చెప్పారు. వాళ్లు నన్నొక ఊరేగింపుగా తీసుకెళ్తామంటే, సంతోషం పట్టలేకపోయాను. అయినా, వాళ్ల ప్రతిపాదనకు కృతజ్ణతలు చెప్పి, ఆ రాత్రి ఒక్కదాన్నే నా చిన్ని గదికి నడిచి వెళ్ళాను.

మరికొన్ని వారాలకు, నేను మరో పోటీలో, ఈసారి మా కాలేజ్ మొత్తం ప్రతినిధిగా పాల్గొన్నాను. అక్కడ ఆ జన సముద్రం మధ్య కొందరు రౌడీ విద్యార్థులు, ఒక పెద్ద తెల్ల బ్యానర్ ఎగరేశారు. దాని మీద చాల దిగులు కళ్లతో ఒక నేటివ్ అమెరికన్ అమ్మాయి బొమ్మ. ఆ బొమ్మ కింద, ఒక ‘స్క్వా’ (తెల్లవాళ్లు నేటివ్ అమెరికన్ స్త్రీలను ఇలా పిలుస్తారు. ఇది అవమానకరమైన పదం.) ప్రాతినిధ్యం వహించే కాలేజ్ అంటూ మా కాలేజ్ ని హేళన చేసే మాటలు రాశారు. ఆ ఆటవిక ప్రవర్తన నన్ను చాలా బాధ పెట్టింది. న్యాయ నిర్ణేతల తీర్పు కోసం ఎదురు చూస్తూ, ఆ పాలిపోయిన ముఖాల వైపు ఓరకంటితో చూశాను. నా దవడ ఎముకలు బిగుసుకున్నాయి. తెల్ల బ్యానర్ మాత్రం అలా మొండిగా ఎగురుతూనే ఉంది.

అంతిమ నిర్ణయం రాసి ఉన్న కవరు పట్టుకుని వేదిక ఎక్కుతున్న మనిషిని ఆందోళనగా చూశాను.

ఆ రాత్రి పోటీలో రెండు బహుమతులు ఇచ్చారు. అందులో ఒకటి నాది.

తెల్ల బ్యానర్ ఉన్నట్టుండి అదృశ్యమైంది, అప్పటివరకు బ్యానర్ పట్టుకున్న చేతులు ఓటమితో వేలాడుతున్నాయి. అది చూసి నాలోని చెడ్డ దయ్యం తనలో తాను నవ్వుకుంది.

వీలయినంత వేగంగా ఆ గుంపు నుంచి బయటపడి నా గదికి వెళ్లిపోయాను. ఇక ఆ రాత్రంతా ఆర్మ్ ఛేర్ లో కూర్చుని ‘ఫైర్ ప్లేస్’ లో నిప్పుల చిటపటలు వింటూ ఉండిపోయాను. అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు, నా విజయం చూసుకుని గర్వంగా నవ్వుకోవాలనిపించలేదు. ఆ చిన్న విజయం నా మనస్సులోని తృష్ణను తృప్తి పర్చలేదు. సుదూరంగా పడమటి మైదానాల్లో మా అమ్మ కనిపించింది, ఆమె ముఖంలో నా మీద ఫిర్యాదు స్పష్టంగా కనిపిస్తోంది.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply