‘ఎర్రపావురం’ అలిశెట్టి ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల. తండ్రి ,అలిశెట్టి చిన్న రాజం.తల్లి, లక్ష్మి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వంతో ప్రఖ్యాతి గాంచినవాడు. తన కళ్ళ ముందున్న ప్రపంచం నుంచి వస్తువును నిక్కచ్చిగా ఏరుకొని భావాన్ని గుండెల్లో గుచ్చుకునేలా, చెంప చెల్లుమనిపించేలా, సూటిగా పేల్చడమే అలిశెట్టి కవితా గుణం. “పరిష్కారం” అనే కవిత ఈయన రాసిన కవితల్లో మొదట అచ్చయింది. ఈయన కవిత్వం చదువుతుంటే ఆ కవితల్లోని భావం సూటిగా వెళ్లి గుండెల్లో పేలుతుంది. ఈయనవన్నీ చాలా పవర్ఫుల్ పోయెమ్స్. ఈయన కవితలు వినోదంగా ఉన్నా, ప్రజలకు ఓ ఆలోచన దృక్పథాన్ని ఇస్తాయి. అలిశెట్టి ప్రభాకర్ పెయింటింగ్ అని ఓ కవిత రాస్తాడు.. “నీ లైఫ్ నీ బ్యూటిఫుల్ పెయింటింగ్ గా మార్చుకోవడానికి అట్రాక్టివ్ కలర్ “రెడ్” కొరకు రక్తం మాత్రం ఎవరిది ఉపయోగించకు” అంటాడు. అంటే ఇప్పుడున్న మనుషులందరూ కూడా తమ భవిష్యత్తు బాగుండాలని ఇంకొకరికి హాని కలిగిస్తున్నారు. అంటే తమ అభివృద్ధికోసం ఇంకొకరి ప్రాణాలను కూడా బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. బ్యూటిఫుల్ కలర్ రెడ్ అంటే తన జీవితాన్ని మెరిపించుకోవడానికి ఇతరుల ప్రాణాలను తీసుకోవద్దు అని…

ఓటు గూర్చి చెప్తూ…
“ఓటు నీ పచ్చి నెత్తురు మాంసం ముద్ద
చూస్తూ చూస్తూ వేయకు
ఓ గద్దకి…” అంటూ నిర్మొహమాటంగా చెప్తాడు. అంటే ఇప్పుడు సమాజంలో ఎన్నికలు, ఓట్లు, అనేవి అవినీతిమయంగా ఉన్నాయి. ఓట్లు అనేవి డబ్బులకు ఇతరేతర వాటికి అమ్ముడుపోతున్నాయి. ఓటు అనేది కాగితం మీద గుర్తు మాత్రమే కాదని ,అది మన జీవిత అభివృద్ధికి ,సమాజ అభివృద్ధికి గుర్తు అని, మన జీవిత వెలుతుర్లకు కారణం అని తెలిసిందే కదా. ఇప్పటి ఎన్నికలకు, ఓట్లకు కూడా ఈ కవిత వర్తిస్తుంది. నాయకుడు ఇచ్చే వాగ్దానాలకు, ప్రతిజ్ఞలకు, కొదవేలేదు. ఆ వాగ్దానాలకు ప్రతిజ్ఞలకు, ప్రజలు బలికావద్దు అని ఈయన రాసిన ఈ కవిత నాకు చాలా నచ్చింది. మరోచోట గుడి గురించి కవిత రాశాడు అలిశెట్టి ప్రభాకర్.

“గుడి
శనివారం
అదొక షో రూమ్” అంటాడు. అంటే శనివారం రాగానే చాలామంది కూడా గుళ్లోకి వస్తారు. ఆరోజు గుడిలో భక్తుల రద్దీ ఎక్కువైపోతుంది .అంటే ఒక ప్రాణం లేని శిలకు ఎంత సొమ్ము ఖర్చు చేసి, ఆ గుడి అభివృద్ధికి పాటుపడతారో, అదే జనం ఒక ప్రాణం ఉన్న మనిషిని పోషించడంలో, పట్టించుకోవడంలో, ముందుకు రారు. ప్రాణం ఉన్న వారి కోసం ఆవగింజంతైనా ఖర్చు చేయని ప్రజలు, ప్రాణం లేని ఆ శిల(గుడి) కోసం కొండంత ఖర్చు చేస్తారు. ఎందుకింత గుడ్డి నమ్మకమో తెలియదు. ఇప్పుడు ప్రజలు నమ్మకాల కంటే మూఢనమ్మకాలను ఎక్కువగా పట్టించుకుంటారు. వీళ్లను మార్చే బాధ్యత మనలాంటి చదువుకున్న వాళ్లకే ఉంటుంది.

“సూది మొన మీద ఆవగింజని మోపటం వృధాశ్రమ
నియంతృత్వపు
తుపాకీ గొట్టం పైన
భూగోళాన్ని ఆపడం భ్రమ” అంటాడు ఓ కవితలో.
సూది మొన మీద ఆవగింజని ఎలాగో మోపలేము. అలాగే నియంతృత్వపు తుపాకి గొట్టం పైన, అంటే ఒక నియంతృత్వ పాలనలో, నిరంకుశ పాలనలో, క్రూరమైన పాలనలో, ఎన్ని రోజులని జనాలని బందీగా ఉంచగలరు? ఆ నియంత చెప్పినట్టుగా ప్రజలు ఎంతకాలమని వింటారు? ఏదో ఒక రోజు ప్రజలు అగ్నిజ్వాలల్లా, విప్లవంలా, ఎగిసిపడే అలల్లా,అన్నిటిని బద్దలు కొట్టుకుని దూసుకుని వస్తారు. విప్లవకారులుగా, ఉద్యమకారులుగా, పిడికిలి బిగించి బయటకు వస్తారు. ఆ నియంతృత్వ పాలనను అంతమొందిస్తారు. నిజమే నియంతృత్వపు తుపాకీ గొట్టం పైన భూగోళాన్ని ఆపడం ఒక భ్రమ…

పిల్లల గురించి రాస్తూ…
“పిల్లలు
నేటి సీమటపాకాయలే
రేపటి ఆటం బాంబులు” అంటాడు. నేటి పిల్లలను మనం మార్చాలి. రేపటి భవిష్యత్తును మార్చాలంటే ముందు నేటి పిల్లలకు సమాజ స్థితిని అర్థం చేయించాలి. ఈ సమాజంలో ఉన్న, అంటే ప్రస్తుతం ఉన్న ఆకలి మంటలను అర్థం చేయించాలి. నేటి సమాజంలోని అవినీతిని అర్థం చేయించాలి. రేపటి సమాజ భవిష్యత్తుని మార్చే ఆలోచనలను వారికి అందించాలి. ఆకలి దప్పికలను, నియంతృత్వాన్ని, అర్థం చేయించి పోరాడేందుకు సిద్ధంగా ఉంచాలి పిల్లలని. రేపటి భవిష్యత్తును మార్చాలంటే నేటి పిల్లలను మార్చి తీర్చిదిద్దాలి. రాజకీయం గురించి ఆయన రాసిన కవిత చాలా ముఖ్యమైంది.

రాజకీయం
“ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవరిని మోసగించనని
ఒక పులి పశ్చాతాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథలిని
గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి” అంటాడు. రాజకీయమనేది నీతి నిజాయితీగా లేదు. నాయకులు చాలా ప్రమాణాలు చేస్తారు. అది చేస్తా, ఇది చేస్తా , అని ప్రజలను అభివృద్ధి పరుస్తా అని. కానీ ఆ వాగ్దానాలన్నీ పదవి కోసం. అధికారం కోసం మాత్రమే. ఇంకో రకం నాయకులు కూడా ఉంటారు. ప్రమాణ స్వీకారం చేసి తన మాటను నిలబెట్టుకోలేకపోయి తర్వాత ఎన్నికలకు ఓట్లు అడుక్కోవడానికి వస్తారు. అప్పుడు, చేసిన తప్పుడు వాగ్దానాలకు పశ్చాతాపం ప్రకటిస్తూ నటిస్తుంటారు. వాళ్ల కట్టు కథలు విని, వాళ్ల వాగ్దానాలకు బలి అయిపోయి, మన జీవితాలను నాశనం చేసుకుంటాం. వాళ్ళు చెప్పినట్టు వింటూ ప్రజలు ఇంకా గొర్రెల్లా తలలు ఊపుతూనే ఉంటారు అమాయకులు అని…

మళ్లీ ఆయనే..
“గొంతు కోస్తే పాట ఆగిపోదు అది ముక్తకంఠం
గొలుసులేస్తే పోరాటం నిలిచిపోదు ఇది ప్రజా యుద్ధం” అని రాస్తాడు.
గొంతు కోస్తే అంటే అర్థం ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు న్యాయం కోసం, అన్యాయాన్ని పాట రూపంలోకి ఎక్కించి, పాట పాడుతారు. ఆ పాటని నొక్కేసి ఆ గొంతు కోసినంత మాత్రాన అది ఆగిపోదు. ఎందుకంటే న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి రూపం పాట. ఆ పాట చస్తుందంటే దానికి కోరస్ పలికే వాళ్ళు కూడా ఉంటారు కదా. గొలుసులేస్తే పోరు నిలిచిపోదు అంటే, ఆ పోరాడే ప్రజలను జైల్లో పెట్టి గొలుసులేస్తే పోరాటం నిలవదు. జనం పిడికిలి బిగించి ప్రజాయుద్ధం మొదలుపెడతారు అని అర్థం.

మరోచోట..
“ప్రభుత్వాసుపత్రి పనికిరాదు ప్రైవేటు భరించరాదు
మరి రోగం కుదిరేదెట్లా’ అంటాడు.
ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వాసుపత్రులను కట్టించింది. కానీ అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. పేదలకు సరైన వైద్యం అందించలేకపోతున్నాయి. పోనీ, ప్రజలు ప్రైవేటుకు వెళదామంటే డబ్బులు ఉండవు. తినడానికి తిండే సరీగా దొరకదు ప్రజలకు, మరి రోగం కుదరాలంటే ఎలా? ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రులు సరైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తలేవు. వైద్యం మాత్రమే కాదు, ప్రభుత్వ బడులు విద్యను కూడా సరిగా అందించడం లేదు విద్యార్థులకు. ఇలా అన్నిటిలోనూ కొరతనే ఉంటుంది. ఎంతైనా ప్రభుత్వ ఆసుపత్రులు మారాలి. బడులు కూడా మారాలి. ఇది నిజం..

“గరీబోడి చేతికందని
తందూరి రోటీ
నగరాకాశంలో
రాత్రంతా చందమామ బ్యూటీ” అనే మరో కవిత రాశాడు అలిశెట్టి ప్రభాకర్. అంటే గరీబోడికి తినడానికి కనీసం బియ్యం గింజలు కూడా అందడం లేదు. ఇంకా తందూరి రోటి ఎక్కడ దొరుకుతుంది? నగరాకాశంలో రాత్రంతా చందమామ బ్యూటీ. అంటే ఆకాశం వైపు చూస్తే అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామ మనల్ని ఆకర్షిస్తుంది. దానికి అట్రాక్ట్ అవుతాం. గరీబోడి అంటే పేదవాడికి సరిగ్గా అన్నం అందడం లేదు. దేశంలో ఇంకా పేద ప్రజలు ఎందుకు ఉన్నారు? మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. అయినా దేశంలో ఇంకా ఆకలి పేదరికం ఎందుకున్నాయి? అని ఇక్కడ ప్రశ్నించాడు కవి. కవుల గురించి ఒక కవిత రాశాడు ప్రభాకర్.

“అర్భకుడైన కవి ఒకడు అవార్డులూ సన్మానాల కోసం దేబిరించడం తప్ప
నగరంలో నేడు అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు” అని. అంటే, ఎవరైనా సరే కవులు అవార్డుల కోసం, సన్మానాల కోసం, ఎప్పుడూ ఆశపడకూడదు. నిజానికి కవి తనను తాను గుర్తుంచుకోవడం కాదు. సమాజం అతన్ని గుర్తించాలి. కవి సమాజం మార్పు కోసం కవిత్వం రాయాలి. రచనలు చేయాలి. కానీ సన్మానాల కోసం, అవార్డుల కోసం, కవిగా రాణించాలని అనుకోకూడదు. అలా సన్మానాల కోసం, అవార్డుల కోసం, కవి వేచి చూస్తే అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదు.

అలిశెట్టి ప్రభాకర్ చాలా అద్భుతమైన కవిత్వం రాశాడు. ఆయన పేదరికం నుంచి వచ్చినవాడు. ఆకలి అన్యాయం గుర్తెరిగినవాడు. ఆయన కేవలం చాలా తక్కువ కాలం మాత్రమే బతికాడు. కేవలం 39 సంవత్సరాలే జీవించి ఉన్నాడు. అలిశెట్టి ప్రభాకర్ సహచరి పేరు భాగ్యలక్ష్మి. జీవితాంతం ఆయన పక్కనుండి చేయూతను అందించింది.”ప్రభాకర్ తన స్వీయ జీవితాన్ని మండించి సమాజానికి వెలుగులు అందించిన వాడు”. సమాజ చైతన్యం కోసం కవిత్వం రాసినవాడు. సమాజం మార్పు కోసం, మార్పుని కోరుకుంటూ, పేదరికానికి బలి అయిన కవి అలిశెట్టి ప్రభాకర్. ఆయన అప్పటి కాలంలో రాసిన కవిత్వం ఇప్పటి కాలానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఇప్పటి సమాజమంతా అమీబా లాగా ఉంది. ఎప్పటికప్పుడు తన అవసరాల కోసం తన ఆలోచనలకు అనుగుణంగా, ఆహారం కోసం రూపాన్ని మార్చుకుంటుంది. అంటే దానికి నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉండదు. ఇప్పటి మనుషులు కూడా అంతే. అమీబా లాగా తమ అభివృద్ధి కోసం అవసరాల కోసం మారిపోతున్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలు నమ్మి తన భవిష్యత్తును తమ జీవితాన్ని కోల్పోతున్నారు. “కర్మ” అంటూ బతుకును గడుపుతున్నారు. అలా కాకుండా తనను తానే శాసించుకునే ఆత్మవిశ్వాసం కలిగి ఉండేలా వాళ్లను మార్చాల్సింది మనమే. అది మన బాధ్యత కూడా. ఇలా సమాజాన్ని మార్చాలని కలలుగంటూ కవిత్వాన్ని రాసి ప్రజలను చైతన్యవంతం చేసిన కవి అలిశెట్టి ప్రభాకర్. ఆయన చెప్పినట్టు “మరణం తన చివరి చరణం కాదు…” కవి మరణించవచ్చు, కానీ ఆయన కవిత్వం ఎల్లప్పుడూ అతన్ని బతికిస్తుంది.

విద్యార్థిని. నారాయణపేట జిల్లా, మాగనూరు మండలంలోని వడ్వాల్ గ్రామం. తండ్రి అంజప్ప. పుస్తకాలు చదవడం, వాటిని కొత్తచూపుతో అర్థం చేసుకోవడం ఇష్టం. వడ్వట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

Leave a Reply