ఎరిత్రియా విముక్తి పోరుకు ఊపిరి – పాట !

పాట – చారిత్రక పునాది :

సంగీతం సామాన్యులకు అర్థమయ్యే భాష అది శాంతినిస్తూ జీవిత రహస్యాన్ని తెరుస్తుంది, సంఘర్షణలను రూపుమాపి మనసుకు సంతోషాన్ని చేకూరుస్తుంది. సంగీతం సరిహద్దులు లేని సామాన్యుల విశ్వ భాష. పాట శ్రమ నుండి చెమట చుక్కల నుండి పుట్టింది. శ్రమజీవులకు పాట మానసిక విశ్రాంతినిస్తూ ఉల్లాసాన్నిస్తుంది. మానవులు శ్రమిస్తున్న క్రమంలో వారి శ్రమను మరచిపోవడానికి వారు సహజంగా సమిష్టిగా సృష్టించిన కొన్ని లయబద్ద శబ్దాలే సంగీతానికి మూలాలయ్యాయి. ప్రకృతిలో వారి జంతువుల అనుకరణలే నృత్యానికి పునాదులేసాయి. దున్నుడం, విత్తడం, కలుపు తీయడం, పంటకోత, పశువుల పెంపకం, జంతువుల వేటలాంటి అన్ని మానవ జీవన కార్యకలాపాల నుండి సహజ సిద్దంగా పాట జనం పెదాలనుండి పుట్టి జానపదం అయ్యింది. మానవుడు పురుడు పోసుకున్ననాటి నుండి మరణించేవరకు అన్ని దశల్లో పాట జీవితంలో విడదీయరాని భాగమైంది. వినోదం అనేది ప్రపంచంలోని అన్ని జాతుల సమూహాల జీవితాలల్లో అంతర్భాగమై సమిష్టిగా సౌందర్యాత్మక కళాపోషణ చేయడంతో ప్రారంభించి తమకు తోచిన కళారూపాలను సృష్టించుకున్నారు. ఆదిమ మనిషి ప్రకృతిని అడవి జంతువులను అనుకరిస్తూ అద్భుతమైన కళారూపాలను సృష్టించాడు. బంధాలులేని ఆదిమ స్వేచ్ఛా సమాజంలో వివిధ సమూహాలు వారి జీవన పునాదులనుండి రకరకాల కళారూపాలను సృష్టించుకుని వాటి నుండి సేద తీర్చుకునేవారు.

సమాజంలో వర్గ భేదాలు పొడసూపిన నాటి నుండి పాటకూడా రెండు కర్తవ్యాలను నెరవేర్చుతూ వస్తుంది. దోపిడీ వర్గం ప్రజా పాటనూ జానపదాన్ని హైజాక్ చేసి వారి ఆర్థిక, ధార్మిక పెట్టుబడికి మూలాలుగా వాడుకుంటు యధేచ్ఛగా దోపిడీ కొనసాగిస్తోనేవున్నారు. దోపిడీకి గురయ్యే వర్గం నేటికి ప్రజాపాటలను పదునైన బాణాలుగా మలుచుకుని దోపిడీ సమాజం పైన ఎక్కుపెట్టుతూనేవుంది. సమాజాలు పురోగమిస్తున్న కాలంతో పాటు “పాట” కూడా దాని సాంద్రతను, గాఢతను, సారాన్ని, రూపాన్ని, దశను, దిశను ధోరణులను పెంచుకుంటూ ఉద్యమాలకు ఊపిరిపోస్తూనే వుంది.

ఎరిత్రియా పరిచయం :
ఎరిత్రియా హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఒదిగిన చిన్న దేశం, దాని రాజధాని అస్మారా. ఇది బహుజాతి, బహుభాష దేశం, దాని ఐదున్నర మిలియన్ల జనాభాలో తొమ్మిది భాషలు మాట్లాడే తొమ్మిది జాతులు వున్నాయి, అవి టిగ్రిన్యా, టిగ్రే, అఫార్, బేజా, బిలెన్, కునామా, నారా, సాహో మరియు హిదారబ్. కాని మెజారిటీ ప్రజలు టిగ్రిన్యా మాట్లాడే తిగ్రిన్యా జాతి వారు. ఎరిత్రియా జాతుల సంస్కృతులలో సారూప్యామూ, భిన్నత్వమూ ఉన్నది. ఈ జాతుల సంస్కృతుల సమ్మేళన ఫలితమే ఎరిత్రియా సంసృతి. ఎరిత్రియన్ ను స్తానికంగా “హాబెషా” అని పిలుస్తారు.

వలసవాదుల పాలన :
ఎరిత్రియా సుమారు నూరు సంవత్సరాలు పరాయి పాలనలో తీవ్ర అణచివేతకు గురైంది. ఇతియోపియాకు ఫెడేరేట్ స్టేట్ గా వున్నా ఎరిత్రియాను చక్రవర్తి హైలే సెలాసీ ఏకపక్షంగా ఎరిత్రియన్ పార్లమెంటును రద్దు చేసి 1961లో సంపూర్ణంగా ఇథియోపియాలో విలీనం చేసాడు. ఫలితంగా 1961లోనే ఎరిత్రియా తన విముక్తికై ఇథియోపియాతో గెరిల్లా యుద్ధం ప్రారంభించింది. ఎరిత్రియా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నాయకత్వాన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అనంతరం 1991 మే 24న తిరుగుబాటుదారులు ఎరిత్రియాను పరాయి పాలన నుండి విముక్తి చేసికుని స్వేచ్ఛా జెండాను ఎగరవేశారు.

ఎరిత్రియన్ పాట – నృత్యం :
పాటతో లయబద్దంగా చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో ఉమ్మడిగా బృందగానం చేస్తూ గుండ్రంగా నృత్యం చేయడం ఎరిత్రియన్ సంస్కృతి ప్రత్యేకత. ఈ అద్వితీయ నృత్యాన్ని ‘ గ్వాయిలా’ అంటారు. ఇది ప్రజలలో భావోద్వేగ సమైక్యతను పెంచుతుంది.

వారి సంప్రదాయ వాయిద్య పరికరాలైన కిరార్ (తీగ వాయుద్యం), మోసోంకో, వాతా (వయోలిన్ లాంటి వాయిద్యాలు), ఏమ్బిల్తా, శంబుకో (ఫ్లూట్ లాంటి), నేగారిత్ మరియు కేబోరో (డ్రమ్ రకాలు) మొదలైన వాటిని లయబద్దంగా వాయించుతూ పాడుతూ ఒక అలగా, కెరటంలా నృత్యం చేస్తారు. జాతీయ పండగల్లో, వివాహ వేడుకల్లో, తిమ్కెత్ (బాప్టిజం) సంబరాలల్లో, ఫాసిక (Easter), గెన్న(Christmas) తదితర ప్రతి పండుగలలో గ్వాయిలా నిర్వహిస్తారు, సాయంత్రం మొదలయి తెల్లవార్లూ బృందాలు బృందాలుగా నృత్యం చేస్తారు. ఈ అపురూప నృత్య రూపం ‘గ్వాయిలా’ విముక్తి పోరులో ప్రముఖ పాత్ర పోషించింది.

ఎరిత్రియా విముక్తి పోరాటంలో పాట పాత్ర :
ఎరిత్రియన్ విముక్తి పోరులో పాట, సంగీతం ఆయుధంతో సమానంగా తమ పాత్ర పోషించాయి. ఎరిత్రియన్లు విముక్తి పోరాటంలో వలసవాదులకు అర్థంకాకుండా, తమను తాము పాట (కోడ్ భాష) ద్వారా కమ్యూనికేట్ చేసుకోగలిగారు. సాయుధ పోరాటం ప్రారంభంతోనే ఎరిత్రియన్ యువతలో దేశభక్తి భావనను పెంపొదింస్తూ సాయుధ పోరాటంలోకి ఆకర్షించేందుకు పాట మెరుపులా కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచుతూ విముక్తి ప్రాంతాల్లో పోరాట యోధుల నైతికతను పెంచడానికి కూడా పాట చాల దోహదపడింది.

జానపదాలనుండి మొదలుకుని నేటి ఆధునిక పాట వరకు పాటలోని పదును, వాడి, వేడి అలాగేవుంది. మనిషిలో ఊపును తెప్పించే శక్తి ఆ పాటలకు వుంది. ఇక్కడ అలాంటి కొన్ని తిగ్రిన్యా పాటలను పరిచయం చేస్తాను, అవి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విజయ పతాక ఎగిరే వరకు ప్రజలను పరవళ్ళు తొక్కించాయి. ‘సెగనేయిటి’ పట్టణానికి చెందిన ‘బహతా హగోస్’ అనే వీరుడు ఇటాలియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1895 లో అమరత్వం చెందిన మొట్టమొదటి వీరుడు. ఆ వీరుని స్మరిస్తూ తరాల తరాల ప్రజలు పాడుకునే పాట చాల ప్రాచుర్యం పొందింది.

బహతా బహతా బహతా సెగనేటి – నూసు హాడే మిజాను మీతి
అంబసా దో థు’వెలిడా సబేయితి – బహతా బహతా బహతా సెగనేటి
బహతా ఓ సెగనేటి బహతా – అతను ఒక వంద సైనికులకు సరితూగు
ఏ అమ్మ యీ సింహానికి జన్మనిచ్చిందో – బహతా ఓ సెగనేటి బహతా
అంటూ ఆ సహస వీరుణ్ణి స్మరిస్తూ, వర్ణిస్తూ పాట సాగుతుంది.
తొలితరం గాయకుడు, అమరుడు ‘ఒగ్బాగబర్’ ఆసువుగా పాడిన పాటలు యువ రక్తాన్ని విముక్తి పోరాటంలోకి ప్రేరేపించడమే కాకుండా స్వతహాగా విముక్తి పోరులో పాల్గొని తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన ఎరిత్రియా దేశ ఔనత్యాన్ని చాటుతూ పాడిన పాట ప్రజలకు దిశను నిర్దేశిస్తుంది. ఆ పాట…


జిరామో హగేర్కా తామిత్ తజేబా – హబ్తం బె’థెఫేత్రో అది వహాయిజ్ రుబా

ఖేం బాఆ-లెథి అబ్బెయితి రు’రుబాతత్ అబ్బెయితి తబా – తిచాతే భిహ్రత్ తేబా-ఎయు హిజ్బా
ప్రకృతి నదీ నదాలతో సుందర మైన సంపన్నమైన మన దేశాన్ని వీక్షించండి
గిరులు లోయలు పొదిగిన ఈ దేశంలో నవ మానవ జాతులు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

అదేవిధంగా ‘బిర్హాన్ సెగిడ్’ పాటలో మాదేశం గుడిసె లాంటిది, ఆ గుడిసెలో దొంగలు (సామ్రాజ్యవాదులు) పడ్డారు, ఏదో శాపం మా గుడిసే నుండి మిమ్మల్ని తరిమేస్తుంది అంటూ పాడిన పాట…
అగుడో నెరాతిన్ని అగుడో నయి బెయినాయ్ – ఎడోం అయిసన వోసిడోమిలాలాయే
గుడిసే లాంటి మన దేశంలో దొంగలు పడ్డారు – ఆ దొంగలను ప్రజా శాపం మా గుడిసె నుండి తరిమేస్తుంది.

నాకు ఒక కాగడ ఇవ్వండి, ఆ మంటల్లో ఆక్రమణ దారులను తగలబెట్టుతా అంటూ ‘తోవేల్దే రె’డ్డా’ పాడిన పాట ఉద్యమాన్ని ప్రేరేపించింది.

షిగెయి హబున్ని షిగెయి హబున్ని / షిగెయి హబున్ని అయి’తేథలులున్ని
నాకు కాగడా ఇవ్వండి, నాకు కాగడా ఇవ్వండి
నాకు కాగడా ఇవ్వండి, నన్ను మోసగించవద్దు
‘యెమానే గేబ్రేమికేయిల్’ (బారియా) అనే లెజెండరీ గాయకుడు, తన పాటలో నల్లబజారులో అమ్మినట్టు నా భూమిని (దేశాన్ని) చవకగా వలసవాదులకు దారాదత్తం చేయను, చీకటిలో ఉన్నాము, పోరాడితే చీకటి నుండి స్వర్గం అనే వెలుతురులోకి వెళతాము అంటూ తన గళాన్ని ఎత్తి పాడిన పాట …

హగేరేయి జిబెలే తే జెకిరు యినేబార్ – న్ చెల్మాత్ సేగిరు అబ్ గేన్నేత్ యినేబిర్
కెమ్తి అబ్ హముసాతత్ జువారదాద త్సలీమ్ ఈడెగా- మెరెత్ అయిషెతాన్-ఇయు బిహిసుర్ వాగా
అయిఫెకాడున్-ఇయు కా-ఎరిత్రావి జెగా
నా స్మృతినిండా దేశమే తిరుగాడుతుంది

1950 లోని బ్లాక్ మార్కెట్ లాగా
చవకగా నా భూమిని అమ్మను కాకా అమ్మను – ఈ భూమిలోకి శత్రువుని అడుగిడనివ్వను – పోరాడి చీకటి నుండి స్వర్గంలోకి వెళదాం….


‘వెడి జాగిర్’ అనే గాయకుడు ఈరోజు ప్రజా యుద్దంలో పాల్గోననివాడు మరణించిన శవంతో సమానమని పాట ద్వారా యువకులను ఉత్తేజపరిచాడు.
లోమి జేయికయిడాడు – దొవు కంజి జోయాంత
ఈ రోజు విముక్తి పోరులోకి రానివాడు శవం తో సమానం
‘బెరెకెత్ మెంగిస్తాబ్’ మరో ప్రముఖ వెటరన్ లేజేండరి గాయకుడు తన పాటలో గాలి, చేలకకు చెబుతాడు, నా విముక్తి జెండా (ప్రేమికురాలు) కనిపిస్తే నా తరపున వందాలు తెలియజేయండి అంటూ పాడిన పాట. ఈ పాట శత్రువుకి అర్థంకాకుండా ఉండేందుకు కోడ్ భాషలో రాసిన పాట. మేలాయ్ అంటే ప్రేమికురాలు. ఇక్కడ జెండాను ప్రేమికురాలుగా పోల్చుకుంటూ పాడుతాడు.


ఆత హలేఫా మెంగడ్డి ఇంతే రకీబ్ కాయా – మేలాయ్ సేలం బెలూలేయి
థెరాయున్ని అల్లా గోబో తోకోవిలా – అథా నిఫాస్ బెరెకా ఇంతాయి రఖిబ్కాయ
మేలాయ్ సెలాం బెలూలేయి
ఓ తోవా నీకు జెండా కనిపిస్తే నా వందనాలు తెలియజేయి
నా పర్వతం వెనక రెపరెప లాడుతుంది గాలీ, చేలకా మీరు నా జెండాను (ప్రేయసిని) చూస్తే నా తరపున నా జెండాకు వందనం చేయండి
‘త్సహాయతు బెరాకి’ తొలి తరం లెజెండరీ మహిళా గాయకురాలు తన పాటలో ఆకలితో వున్న తానూ రైలుపై రెపరెప లాడుతున్న విముక్తి జెండాను చూసి కడుపు నింపుకుని వందనాలు సమర్పించింది….


అంకోల్కిలే కేవోరిడ్ నాబ్ మయిజహాజ – తా’మే నేయిరే న’గేజాయి న’కేమిసహ
ఆ మాడియే రియేకా ది’హాగుసే – సేలాం కి’బెలే కా న’డేహేరిత్ తే మెలిసే
మయి జహాజ (నీటి ఫౌంటెయిన్) దారి నుండి ఆకలితో వున్నా నేను ఇంటికి వెళ్ళుతున్నా భుజించడానికి – నిన్ను (జెండా) చూసి సంబుర పడి కడుపు నింపుకున్న నీకు వందనాలు సమర్పించుటకు తిరిగి వచ్చా…


ఒస్మాన్ అబ్దురహీమ్ పాటలో రైతులు శత్రువుతో యుద్డంచేస్తూనే వ్యవసాయం చేస్తున్నారంటూ పాడుతాడు.
హారోస్తోత్ జెల్లోకం అబ్ మెల్లా ఎరిట్రా – మహారాస్కుం తహార్సు బికిందేయి మేకెరా
ఎరిత్రియా భూముల్లో ఒదిగి బతుకుతున్న రైతులు సంఘర్శనల్లోనే సాగు చేస్తున్నారు
మాశో హలేఫా మరియు వెడ్డి తెకుల్


లేమిన్ లేమిన్ లేమినాయి అడ్దేకా తెహబానాయి
షిమ్కా త్సావియే మిస్ సెబ్ జినార్ నెర్కా సెమీఇ-యే
లేమిన్ నా కొడుకైనందుకు గర్విస్తున్నా మీరు ఎరిట్రియన్ల హీరోలలో ఒకరు
(తల్లి తన కొడుకు లెమిన్ అమరత్వం గురించి పాడిన పాట –
ఇలా అనేక మంది గాయకులు యాద్రుచ్చికంగానే విముక్తిపోరులో పుట్టుకొచ్చారు, పెన్ను, గన్ను పట్టి పోరాడారు. ముఖ్యంగా అకిలిలు ఫొటోస్, తెబెర్రే తెస్ఫాహునేస్, వెడి గేబ్రు, తెక్లె అదానం, అబ్రహత్ అంకరే, హగోస్ బెర్హానే, మొహమ్మద్ షేక్స్, అలమిన్ అబ్దుల్ లతీఫ్, ఇద్రిస్ మొహమ్మద్, ఇంజనీర్ అస్గోడోమ్స్, జాబెర్ మహేముద్, తెస్ఫమరిం కిడానే, మహామేద్ ఒస్మాన్, ఇసయాస్ అసేఫా, బెరయన్ బెతేయి, అబ్రహత్ అంకరే, దహేబ్ ఫాతింగ, ఫాత్మా ఇబ్రహీమ్, బిరిక్తి వెల్డెసిలాస్సీ, బెర్కిడ్ బెజబ్ అలీ, అబ్రహం అఫ్వేర్కి, వెడితుకాబో, అలెక్స్, దాశింమిస్గన్నా, లూల్ ఫెసేహ, ఫిత్సుం యోహన్నేస్, హెలెన్ మెలెస్, ఫహిరా, జేమాచ్, వేరోనిక లాంటి ఎందరో ఎరిత్రియా గాయకుల పాటలు ప్రజాచైతన్యాన్ని శిఖరాగ్రస్తాయికి తీసుకెల్లడమే కాకుండా ఎందరో గాయకులు సాయుధ దళాలతో చేతులు కలిపి కదనరంగంలోకి దూకారు. కొందరు అమరులయ్యారు, కొందరు ఇంకా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. స్వాతంత్ర్య ఆకాంక్షను స్పురిస్తూ వలసవాదుల దోపిడీని నిరసిస్తూ, అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ పాటలు పాడారు, పాడుతూనే వున్నారు.
ఉదాహరణకి ‘యెమనే బారియా’ అమరవీరులమీద స్వయంగా రాసి పాడిన పాట, అదే అతని చివరి పాట కూడా.

సెగానాయి నోవేహే కిస్సాడా – సేగుమి రేగోబిత్ క్విన్జో ఆ కాయిడా
తత్సావరిత్ శేగేర్ జయిఖబుడా – హబ్బెరుని హబ్బెరునిండా అబేయ ఖయిడా
నిప్పు కోడి లాంటి పొడవైన మెడ గల – లయబద్దంగా పావురాళ్ళలా అడులేస్తూ
సాగిపోయిన అమరులు ఎక్కడ వున్నారో – చెప్పండి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి.
‘వెడ్డి తెకుల్’ అనే గాయకుడు స్వీయ అనుభవాన్ని పాటలో …

సెలస్థే హివతయ్ డెక హంతి మాత్సే- అబ్తి జేకైడుకుమో తె రాఖబు దోకోన్
కాతిం బురురయ్యే అమ్బార్ నా ఈడయ్యే – కుల్లుం సేమాతాత్ సేలం బోలులే
సెలస్థే సువాత్ డెక హంతి మాత్సే
అస్కాలు ఖైడా అవెత్ మిస్తా రకేబే – త్సహాయ్ మిస్ బెరేకే మేరేత్ ఏ జేనేబే
నాత్సనత్ ఆతియా బందేరా తెకీలా- కుల్లుం సేమాతాత్ సేలం బోలులే
మూడు ప్రాణాలు ఒకే గర్బం నుండి వచ్చాయి ఎక్కడి పోయారో ఎక్కడ కలుస్తారో
మీ ఉంగరాలు, గాజులు ఇంకా మెరుస్తునే వున్నాయి మీ అమర వీరులందరికీ సలాంలు
ముగ్గురు అమరులు ఒకే గర్బం నుండి వచ్చాయి
అస్కాలు అమరత్వం అవుతున్న వేల విజయం వరించింది
సూర్యుడు చెలకలోకి దిగిండు భూమి వర్షంతో తడిసింది
విముక్తి వచ్చింది జండా రెపరెపలాడుతుంది
అమర వీరులందరికీ సలాంలు చెప్పండి.


అబెబా హైలె తన పాటలో ఒకే గుండె ఒకే ప్రజా అంటూ దేశభక్తిని ప్రేరేపిస్తూ పాడిన పాట…
మేరేత్ ఇండా గ్వహరే జేయి క్వారచ్ ఫిషక్త – హాడే లిబ్బోం జాగాను సేగిరోం బితెస్ఫా
హాడే లిబ్బి ఈ బెరీర్ తెఫెర్ సమయి వువై త్సహాయి నాబ్ దేబెనా కేఖయిరు ఏజిన్ని మాయి బకుల్లు…
పుడమి మండుతున్న వేల చిరునవ్వుతో నిలుచున్నాను
ఒక హృదయం వీరునిలా ఆశను రగిలిస్తూ…
ఒక హృదయం ఎగిరి ఎగిరి ఆకాశం లో మేఘంగా మారి వర్షమై మా ధరణిని తడిపి ముద్దచేసింది.


ఇలా వేలకొలది పాటలు ముప్పై సంవత్సరాల స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. సాహెల్ పర్వతాలలో ప్రతిధ్వనించి, నాక్ఫా కొండలనుండి పాట అఫాబెట్ మైదానాలకు సెలయేరులా పారి మాసావా లో ఆపరేషన్ ఫెంకెల్‌ను మ్రోగించింది; సెంబెల్‌లో విజయ పతాకాన్ని ఎగుర చేసింది. అఫార్ నుండి హమాసియన్ వరకు, మెండేఫెర, దేక్కేంహరే, సెగనేటిమీదుగా సనాఫే వరకు ప్రతిఘటన పాట ప్రతి గొంతులో మార్మ్రోగింది. అమరవీరుల రక్తం, త్యాగంతో ఎర్ర సముద్రం ఎర్రగా తయారై పోరాట సూర్యులను సృష్టించింది. ఈ పాట విద్యుత్తులా ప్రవహించి ప్రజలను విద్యుదీకరించింది. శత్రువు యొక్క లోహకుడ్యాలను ద్వంసం చేసి అస్మారానే ఒక లయాత్మక పాటగా ట్యూన్ చేసి త్రివర్ణ ఎరిట్రియన్ విజయ పతాకాన్ని ఆకాశమయం చేసి ప్రజావాహిని కరతాళ ధ్వనులమధ్య సమున్నతంగా ఎగుర వేసి ఎరిత్రియాను మే 24, 1991న ఎరిత్రియాను వలసవాదుల చెరనుండి విముక్తి చేయగల్గింది.


పాట పరాధీనంలోకి పోకుండా ఈ పెట్టుబడిదారి విపణి సంస్కృతిమీద యుద్ధం చేయాల్సిందే. ప్రజాపాటను బందిస్తున్న, నిషేధిస్తున్న రాజ్యాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేయల్సిందే. ప్రజా పాటను తూటాగా మలుచుకుని బూర్జువా సంస్కృతిపై ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అప్పుడే పాట ప్రజల్లో వుంటుంది, జనజీవితాల్లో ప్రేరణను నింపుతుంది. అందుకే పాట తూటా కన్న శక్తివంతమైనది. జానపదులను కాపాడుకుందాం. ప్రజకళలను నిలుపుకుందాం.

ఊరు సిరిసిల్ల. సాహితీ ప్రియుడు. ఆఫ్రికా లో రెండు దశాబ్దాలు అధ్యాపకుడు గా పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం.

Leave a Reply