ఎప్పటి శిప్ప ఎనుగుల్నే

నడిజాము రాత్తిర్ల ఏదో కలవడ్డట్టు అనిపిచ్చి
దిగ్గున లేసికూసుంటే
కలల ఇనవడ్డ మాటలే
శెవుల్ల గిల్లుమనవట్టే

ఆడజన్మ అపురూపం
మహిళలు మహారాణులు
అనుకుంట జై కొడుతాండ్రెవలో

జర్రంత సోంచాయించి
నిజమే గదాని సుతరాయించుకున్న గనీ
మనసెందుకో నిమ్మలం గాకపాయె

పేపర్ల సదివినయ్
దోస్తులు జెప్పినయ్
నేను సూశినయ్
నాకు జరిగినయ్
ఒక్కొక్కటే యాదికస్తాంటె
మనసంత కలికలయితాండె

అమ్మ కడుపుల సంది ఆపతులేనాయె
ఈ లోకాన్ని సూశేది సుత
నమ్మకం తక్వాయె
అట్లనో ఇట్లనో భూమ్మీద పడితే
పాలుతాగే పసిగుడ్డుకు సుత రక్షణ లేదాయె

చేనుకు కావలి వెట్టిన కంచే
చేనంత మేసినట్టు
పసిమొగ్గల్ని నలిపేసే గాడిదికొడుకులు అడుగడుగున ఉంటరాయె

సదువు జెప్పే గురువని
గురుదేవోభవ అంటే
ఆ జెట్ట మొకపోడు ఆడీడ చేతులేస్తడాయె
అటో ఇటో ఇస్కూల్ దాటి కాలేజీ దాన్క వోతే
యాసిడ్ కీ కత్తులకీ భయపడాల్నాయె

గుండెలమీద కుంపటని
నెత్తి మీద ఇత్తులేశి
అత్తగారింటికి అవ్వయ్య తోలిస్తే
ఆడ అడుగు తీసి అడుగెయ్యాల్నంటె అరవైతొమ్మిది ఆంక్షలాయె

ఇగ సదివిన సదువును సార్థకం జేద్దామని కొలువు జెయ్యవోతె
ఆఫీసర్ కాన్నుంచి అటెండర్ దాన్క
ఆకలి సూపులు, అడ్డగోలు మాటలు
అక్కర లేకున్నా అడ్డమచ్చి తాకిచ్చే చేతులు

ఇగ ముసలితనానికచ్చినంక
నా కొడుకన్న మారాణి లెక్క సూసుకుంటడనుకుంటే
సర్కారోల్లిచ్చిన ఫించన్ పైసలు ఓరకువెట్టవ్వా
సావుకర్సుకు పనికస్తయనే

గానాడెవ్వలో పోరాటం జేస్తే
గీ మహిళా దినోత్సవం జరుపుకుంటానమట
దినదిన గండం నూరేళ్ళాయుషు లెక్క
బతుకెల్లదీసుకుంట ఎన్నొద్దులింకా ?
గీ పండుగ తోని స్ఫూర్తి పొందనంత కాలం
ఎన్ని వేడుకలు జరిపినా
ఎప్పటి శిప్ప ఎనుగుల్నే

పుట్టింది కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా). కవయిత్రి, అధ్యాపకురాలు.  ఎం.ఏ, ఎం.ఎడ్ చదివారు. పాలకుర్తి (జనగామ జిల్లా) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పి.జి.టిగా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply