ఎన్నెలపిట్ట రొద

అంటరాని వసంతం అనే నవల రచించింది జి.కళ్యాణరావు. ఈ పుస్తకంలో మొదటగా రూబేన్ ను, రూతును పరిచయం చేస్తాడు. వారిద్దరి జ్ఞాపకాలు ఈ పుస్తకం. రూబేను బోలెడు వసంతాన్ని రూతు బతుకంతా వర్షించి వెళ్ళాడు. రూబేన్ జీవితంలో మలుపు మలుపుకు జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలను ఓ వెన్నెల రాత్రి రూతుకు చెప్తున్నాడు. అప్పుడే పెళ్లయిన జంట, చెరువు గట్టున నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మొదలెట్టాడు వలవలా కురిసే వెన్నెల వానని, జలజలా పారే సెలయేటి కదలికని. అంటరానివసంతాన్ని. మన కళ్ళను వర్షింపచేస్తుంది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో దళితుల కష్టాలు, వారి అంటరానితనం దళితులను అవమానపరచడం, దళితులు తిరుగుబాటు చేయడం, అనే విషయాలు మన కళ్ళకు కట్టినట్లుగా మన గుండెకు హత్తుకునేటట్లుగా ఈ పుస్తకాన్ని ఎంత అద్భుతంగా రచించాడు ఈ కళ్యాణ్ రావ్. దళితులకు జరిగిన ద్రోహానికి ఈ పుస్తకం ఒక నిరసన.

“ఎల్లన్న” రూబెన్ తాత. ఎల్లన్న బోలెడు పాటలు అల్లాడు గొప్ప కళాకారుడు. ఎల్లన్న పాటల్లో ఆకలి అంటరానితనం ఉంటుంది. ఎల్లన్న ఊరు ఎన్నెలదిన్ని. ఎల్లన్న మేనత్త చాటుబిడ్డ. ఆమె పేరు భూదేవి భూదేవి ఒడిలోకి పెరిగి పెద్దవాడయ్యాడు ఎల్లన్న…

సముద్రపు హోరు…

ఎన్నెలదిన్నికి ఎర్రగొల్లలు వచ్చారు. వీరు వచ్చారంటే ఊరంతా సందడి ఎర్రగొల్లలు ఊరిబయట నాటకాలు వేసే వారు. నాటకం వేశారు చూడడానికి అన్ని కులాల వాళ్ళు వచ్చారు. అలాగే మాల మాదిగలు కూడా వచ్చారు. ఊరికి చాలా దూరంలో మాల-మాదిగల నివసిస్తారు. మాలలుండేది మాలపల్లి మాదిగలుండేది “మాదిగపల్లి”. సహజంగానే మాల మాదిగలు ఆట ఆడే స్థలానికి చాలా దూరంలో కూర్చుంటారు. ఒకరోజు భూదేవి ఎల్లన్నని నాటకం దగ్గరికి తీసుకెళ్లింది. చాలా దూరంగా కూర్చున్నారు. “కనిపిస్తలేదు అత్త” అని అన్నాడు ఎల్లన్న. అత్త లేచి నిలబడింది. నాటకంతో పాటు ఎల్లన్నా నిద్రకాశాడు…

రాత్రి నాటకం చూసిన ఎల్లన్నకు ఎర్రగొల్లలు ఉండే దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. ఈ మాటనే అత్తతో అంటే వద్దు అన్నది. అయినా ఎల్లన్న వెళ్లాడు ఎర్రగొల్లల గుడారాల దగ్గర తనలాగే చాలామంది ఉన్నారు. ఎర్రగొల్లలు బాగు చేసుకునే కిరీటాలను వింతగా చూస్తున్నారు ఎవరో గమనించారు. ఊరికనే ఉండలేదు. ఎల్లన్నని చూస్తూ “నువ్వు మాలాడివి” కదరా అన్నాడు. “నేను ఎర్రెంకడి కొడుకుని” అని ఎల్లన్న బదులిచ్చాడు. అక్కడ ఉన్న వాళ్లంతా ఎల్లన్న వైపు చూసి అడిగిన వాళ్ళు అడిగినట్టు ఎల్లన్న వీపు మీద తాటి మట్టతో బాదటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి పరుగు తీశాడు ఎల్లన్న. తరిమికొట్టారు. ఎల్లన్న అనాలోచితంగా పరుగు తీస్తూనే ఉన్నాడు ఏరు అడ్డం వచ్చింది. ఎల్లన్న అదే పరుగుతో ఏరులోకి దూకాడు. ఆయన ఆ నీళ్లలో దూకినప్పుడు ఆయన చుట్టూ ఒక రక్తపు వలయం ఏర్పడ్డది. ఎల్లన్న శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అసలు ఈ సమాజం అంత దుర్మార్గంగా ఎందుకు కొట్టింది ఎల్లన్నని? దళితులను ఎంత దుర్మార్గంగా ఈ సమాజం చూసిందో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా రచించాడు కవి. ఈ సమాజం చాలా దుర్మార్గమైంది.

లింగాలు ఎర్రెంకడు ఈ దంపతుల కొడుకే ఎల్లన్న. ఆయన ఆటెల్లడు, పాటెల్లడు.

సుభద్ర పరిణయం…

లింగాలు వాళ్ళ ఇంటికి ఎదురుగా పిట్టోడి ఇల్లు ఉండేది. పిట్టోడికి ఓ కూతురు ఉండేది పేరు సుభద్ర. గారాబాల పట్టి సుభద్ర. ఆ పిల్ల వాళ్ళ ఇంటిముందు తొక్కుడుబిల్ల ఆడేటప్పుడు లింగాలు ఆ పిల్లకేసి అట్టాగే చూసేది .అప్పుడు లింగాలు “ఆ గెంతు మా గడపలోకి గెంతితే బాగుండు” అని అనుకునేది. కానీ ఎర్రెంకడికి సుభద్రను ఎల్లన్నకు ఇచ్చి పెళ్లి చేస్తారనే నమ్మకం లేదు. ఎల్లన్న ఆటలాడుతూ పాటలు పాడుతూ ఊళ్ళు పట్టుకుని తిరుగుతాడు కనుక.

ఎల్లన్న ఒక పాట కట్టాడు ఓ సిన్నీ చుక్కల ముగ్గు కర్ర అని. ఈ పాటను సుభద్రకు వినబడేటట్టు ఓ రోజు గట్టిగా పాడాడు. ఆ పిల్ల భయపడి ఇంట్లోకి వెళ్లింది. ఓ రోజు భూదేవి, చిన్నమ్మి( సుభద్ర వాళ్ళ అమ్మ) కలిసి సుభద్ర పెళ్లి గురించి మాట్లాడారు. అప్పుడు చిన్నమ్మి “ఎల్లన్నకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇది సుఖపడుతుంది” అన్నది. కానీ పిట్టోడు వినలేదు. “కోళ్లదిన్నె”లో సంబంధం చూశాడు. ఆరోజే సుభద్ర తన మనసులో మాట చెప్పింది కుండబద్దలు కొట్టినట్టు. నేను ఎల్లన్నను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని. దీని ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే మన భవిష్యత్తుకు సంబంధించిన అంశాలలో, మన సమాధానం కుండబద్దలు కొట్టినట్టు, మన మనసులో ఏముంటే అదే చెప్పాలని. ఎంతో గొప్పగా సుభద్రకు ఎల్లన్నకు పెళ్లిచేశారు. ఎల్లన్న పాడిన ప్రతి పాటలో సుభద్ర గానమైంది. ఎల్లన్న పాటకు పల్లవి సుభద్ర.

అమ్మోరుతల్లి సుభద్ర…

అప్పుడు పంట పొలాలకు కాలువ నీరు తిప్పేవారు. ఈ కాలువ నీరు ముందుగా రెడ్లవి, కరణాలవి, ఆ తర్వాత పెద్ద కులాల వారివి ఈ కులాలకు నీరు పారిన తర్వాత మాల మాదిగ పొలాలకు నీళ్లు పారేవి. అలా అయితే అంటరాని వాళ్ళ మాల మాదిగల కులాల పొలాలు తడవాలంటే ఆలస్యం అయ్యేది. ఒకరోజు మాల మాదిగలు నలుగురు కలిసి నీళ్లు దొంగతనం చేద్దామని కాలువ మడవ దగ్గరకు పారలు తీసుకొని వచ్చారు. కాపలవాడు అప్పుడే ఇంటికి వెళ్లాడు. కాలువ నీళ్లు తవ్వుతున్నారు. మాల మాదిగల పొలాల దగ్గరకు నీరు వస్తుంది. అప్పుడే ఆ మడవ దగ్గరకు ఆ కారణం పెట్టిన కాపలా వాడు వచ్చాడు. వాళ్ళు నలుగురిని కొట్టాడు. ఈ విషయం తెల్లార్లు ఊరంతా పాకిపోయింది. తెల్లారింది సుభద్ర చాలా ఆవేశంతో, కోపంతో, పంట పొలాల వైపుకు నడవ సాగింది. “ఆగు సుభద్ర” అనుకుంటూ సుభద్రను వెంబడిస్తున్న మాల, మాదిగల తల్లులు. బిడ్డలు. కసితో నిండిన పరుగుతో పంట దగ్గరకు వచ్చింది. కొంగు నడుము చుట్టి పార చేతబట్టి ఆ నీటి మడవ దగ్గరకు వెళ్లి నీళ్లు తెంపిoది. అందరూ అంటే ఎన్నెలదిన్ని రెడ్లు, కరణం, పెద్ద కులం వాళ్లు ఇలా అందరూ వచ్చి ఈ పిల్లకు అమ్మోరు వచ్చింది అన్నారు.

చాకలి ఐలమ్మ తన భూమికోసం ఆ ఊరి రెడ్డితో ఎలా తిరుగుబాటు చేసిందో నీళ్ల కోసం సుభద్ర అంతే ధైర్యంతో తిరుగుబాటు చేసింది.

ఆడపిల్ల అయిన తర్వాత ఈ మాత్రం సాహసం ఉండకూడదా? ఉండాలి. అసలు ఎల్లన్న ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాడు, ఊరు విడిచి చాలా రోజులు అయింది. అయినా సరే సుభద్ర ఎన్నో కష్టాలు పడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నది. అసలు ఇంత ఘర్షణ ఉన్న సమాజంలో తన కుటుంబాన్ని తన భుజాల పైకి ఎత్తుకుంది. ఎప్పుడూ కూడా బరువైంది అని అనుకోలేదు. అలా బరువు అయింది అనుకుంటే ఆ కుటుంబం ఉండేది కాదు.

ఎల్లన్న రాగం…

ఎల్లన్న ఒక పాట గాడు. వెన్నెలకు ఎన్ని పేర్లు పెట్టాడో తెలియదు. లేత ఎన్నెల పండెన్నల పిండెన్నెల. ఇలా ఎన్ని పేర్లో వెన్నెలకు. ఆ వెన్నెల్లో తనకిష్టమైన సుభద్ర బొమ్మను ఇష్టం వచ్చినట్లు గీశాడు. ఆయన పాడిన ప్రతి పాటలో సుభద్రను ఉంచాడు. సుభద్ర కోసం చాలా పాటలు పాడాడు.

“మిన్నూ పానుపు మీద
దూది దుప్పటి పైన
సుక్కాల పూలగుత్తి సుభద్రా
నువ్వు పచ్చి పగడానివే సుభద్రా” అసలు ఎంత ప్రేమ ఉంటే, ఎంత మంచి గాయకుడైతే ఇంత బాగా పాటను అల్లగలడు ఎల్లన్న. అసలు నాకనిపించింది ఈ “మిన్నూ పానుపు మీద” అనే పాట లేకపోతే సుభద్ర పాత్ర బాగుండేది కాదేమో అని. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట.

ఎల్లన్న ఊరురూ తిరిగేవాడు. నువ్వు ఎవరని ఎవరైనా అడిగితే నేను మాల బైరాగిని అని సమాధానం ఇచ్చేవాడు. ప్రతి ఊరిలోనూ ఒకరికి ఆయన పాటలను నేర్పి వెళ్లేవాడు. ఒక ఊరిలో శశిరేఖ అనే అమ్మాయికి చాలా పాటలు నేర్పాడు. ఎల్లన్న ఊళ్ళు తిరిగేవాడు. తన కోసం వాళ్ళ అత్త భూదేవి, భార్య సుభద్ర, లింగాలు వెతికే వాళ్ళు. ఓ రోజు “శశిరేఖ” పరిచయం అవుతుంది వాళ్లకు. అక్కడ ఎల్లన్న జాడ తెలుసుకుంటారు. సుభద్ర, ఎల్లన్నల కొడుకే శివయ్య. ఎల్లన్న లేకుండానే పెళ్లికూతురుని వెతికి శివయ్యకు పెళ్లి చేసింది సుభద్ర. ఆ పెళ్ళికూతురు శశిరేఖ.

బతుకుపోరు…

వెన్నెలదిన్నెలో కరువు వచ్చింది. చాలామంది చస్తున్నారు. ఎల్లన్న సుభద్రలు కూడా చనిపోయారు. మిగిలింది శివయ్య, శశిరేఖ. వాళ్ళిద్దరు కూడా వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎక్కడో దూరంలో బంకింగ్ హం కాల్వ పని జరుగుతుంది అని అక్కడికి వలస వెళ్తున్నారు. చాలామంది ఈ వలస వెళ్ళే దారిలోనే పరిచయమయ్యారు. కొంత మంది చనిపోయారు. అలాగే నడుస్తూనే ఉన్నారు. ఆ నడకలో ఏదో తెలియని అయోమయం. బతుకుపోరాటం. అక్కడికి వెళ్తున్నన్ని రోజులూ ఏవో పండ్లు తినుకుంటూ వెళ్లారు. చివరకు చేరుకున్నారు. అక్కడ చాలామంది వలస కూలీలు ఉన్నారు. అక్కడ ఓ పెద్దమనిషి ఉన్నాడు. ఆయనే పని ఇస్తాడు. శివయ్య శశిరేఖ వెళ్లారు. పని అడిగారు. పేర్లు రాయమన్నాడు రాశాడు. ఆ పెద్దమనిషి “నువ్వూ మాలాడివి కదా” అన్నాడు. నేను అంటరాని వాళ్లకు పని ఇవ్వను అని తిట్టి పంపించారు.

ఆశ, బతుకంతా ఓ ఆశ. కాకపోతే వీళ్ళ జీవితం ఎలా సాగేది? బంకింగ్ హామ్ కాలువలో పని దొరుకుతుందని ఆశతో అంత దూరం వెళ్లారు. అప్పుడు అనుకున్నాడు శివయ్య. బంకింగ్ కాలువ ఇంకా దూరం ఉంటే బాగుండు ఆశతో బతుకుతామని. ఆశ అనేది మనిషిని బతికించేటట్టు చేస్తుంది. ఆశ లేకపోతే శివయ్య శశిరేఖలు ఇన్ని రోజులు బతికే వాళ్ళు కాదు. బతుకు అనేది ఒక ఆశ. ఆక్రందన. పోరాటం. వీళ్ళ జీవితం నిండా ఆకలి. అంటరానితనం. దోపిడి. దౌర్జన్యం. ఎంత దుర్మార్గంగా చూసారు వీళ్ళను. బతుకంతా ఓ జ్ఞాపకం. ఈ పుస్తకాన్ని మాత్రం చాలా అద్భుతంగా రాశాడు రచయిత. పేరు “అంటరాని వసంతం”.

విద్యార్థిని. నారాయణపేట జిల్లా, మాగనూరు మండలంలోని వడ్వాల్ గ్రామం. తండ్రి అంజప్ప. పుస్తకాలు చదవడం, వాటిని కొత్తచూపుతో అర్థం చేసుకోవడం ఇష్టం. వడ్వట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

One thought on “ఎన్నెలపిట్ట రొద

  1. అంటరాని వసంతం పై పదోతరగతి విద్యార్థిని మైత్రి రాసిన సమీక్ష చాలా బావుంది…శుభాకాంక్షలు💐

Leave a Reply