ఎన్ని సార్లు మరకలు పడినా…

ఆ రాత్రి
నాకెన్నో రహస్యాల్ని విప్పి చెప్పింది
చీకటి కాన్వాసు మీద
చిత్రించబడిన
దేశపు నగ్నత్వాన్ని చూపెట్టింది
అమ్మకానికి పెట్టబడ్డ మానాల్ని
గంటకింతని తూకం వేసుకొని
సుఖాల్ని కొనుక్కుంటున్న పౌరుల్ని
చీకటి పొదలమాటున
సగం కాలిన స్త్రీల నగ్మ శవాల్ని చూపించి
గుండెలు బాదుకుంది


లారీల్లో తరలించబడుతున్న
అభాగ్య భారతాన్ని
అర్థరాత్రి వరకూ
కైపెక్కి తైతక్కలాడుతున్న నగరాన్నీ
చిరుగుల చేతి సంచి మీద
చీకటిని కప్పుకొని పడుకున్న వృద్ధుల్ని
దూరం నుండి చూపించి
భారంగా నిట్టూర్చింది


ఆ రాత్రి
దృశ్యమానమైన నా దేశపు నీడ
ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది
తెల్లారితే
ఇంకుచుక్క కోసం
బారులుతీరి నిల్చున్న జనం
ఎన్ని సార్లు మరకలు పడినా
మార్పేముందని వెక్కిరించింది చూపుడువేలు!

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

One thought on “ఎన్ని సార్లు మరకలు పడినా…

  1. చక్కని కవిత.pyasa సినిమా లోని పాట గుర్తుకు వచ్చింది

Leave a Reply