ఎనభయొక్క ఏళ్ల జలపాతం గురించి

ఆ‌ జలపాతంలోంచి
ఎన్నెన్ని చెట్లు వీస్తున్నాయో
ఆ రాగాలన్నీ అతడే!

ఆ జలపాతం హోరులోంచి
ఎన్నెన్ని పక్షులు ఎగుర్తున్నాయో
ఆ పాటలన్నీ అతడే!

పచ్చదనమై
ఈ నేల విస్తరించాడు
నడిచే విపినమతడు

పురావాసనల
మట్టిపూల స్వరమై
ఆకాశపు ఆరుద్ర పురుగుల్ని
గానం చేసి
బీజభూమి పుక్కిట పట్టిన
పరిమళమతడు
అతడో ఆదివాసి!

కట్టెలపొయ్యి మీద
నాలుగ్గింజలు మాడ్తున్న
కమురు గుడిసె వాసనతడు

ఆకలివేలాడ్తున్న దండ్యాల గుండెచప్పుళ్ల
డి ఎన్ ఏ దుఃఖమతడు
అతడో అంటరాని బతుకు!

ఒల్చుకు పోతున్న
చెమటచుక్కల జాతి
భూమి పొరల్లోని
విస్పోటనా సముద్ర సమూహమతడు!

ఇనప గద్దల చెలగాటల
ఒయాసిస్సు గాయాలు ముద్దాడిన
నెలవంకతడు!

రాళ్ళురప్పల ముద్దాడిన
పగిల్న మట్టిపాదాల ఆకుపచ్చకలల
సాలతడు!

మేఘాల మనస్సు కదుల్తున్న
చిగుళ్ళ ఊసుల కాలాన్ని
అక్షరమై చుట్టుకొని
కన్నీళ్ళకు
ఆయుధమిచ్చిన కర్మాగారమతడు

ఋణపడి చుట్టుముట్టిన
పీష్వా ఆత్మల రాతిగోడ ఊచల పెదాలకు
వయస్సు కానుక చేసిన
శత్రు యుద్ధం చేస్తూనే
చిరునవ్వులు పూయించిన
ఖడ్గస్వప్నమతడు!

కుట్రకేసుల మబ్బుల్నుంచి
వసంతమేఘ గర్జనమెరుపుల
ప్రపంచ విప్లవ గానమతడు!

వస్తాడు
అతడొస్తాడు
ప్రజల ఆశల ఆయువు పోసుకొని
చేతుల్నిండావెలుగులు పట్టుకొని
ప్రజాస్వామ్య జైలుఊచల ఆవలిదిక్కున
చీకటిదారులు వెలిగిస్తాడు

జ‌న‌నం: వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి.పెరిగింది నెక్కొండ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విర‌సం స‌భ్యుడు. తెలుగు సాహిత్యంలో తనదైన తెలంగాణ భాష ముద్రతో కవిత్వం, కథలు రాస్తున్న కవి. 'ముఖచిత్రం', 'పడావు', 'జంగ్-ఏ-కాశ్మీర్', 'హిమాలయాలే వడ్ల తాలయిన అమరత్వం', 'వీరవనం', 'హైదరాబాద్ నా అబ్బ సొమ్మె', 'ర్యామాండం' తదితర దీర్ఘ కవితలు, 'పోస్ట్ మార్టం రిపోర్ట్', 'దుఃఖభాష', 'చెమట చుక్కల కళ్లు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'పబేటు వల', 'ఆమె తలాఖంది' తదితర 20 కథలు రాశారు.

Leave a Reply