జీతగాడు

ఏడుసుకుంట అచ్చి నుల్క మంచంల పన్నడు సుంగు.
పుట్టి బుద్దెరిగినప్పటిసందీ సిన్న మాట గూడా అనలే ఒక్కలు సుత. ఇయ్యల్ల గూడెం పంచాయితీల కాపు పటేలు శెప్పుతోని కొట్టిండు. నా ఇంటిదాన్ని అన్నమాటకు జివుణం ఆన్నే పేయింది, తోలు తిత్తి ఒక్కటే ఉన్నట్టుంది మనుస్కు.

“నేను అన్న దాంట్ల తప్పేంది..? నేనేమన్నా పసురాన్న.. ఎట్లన్నా.. తన్నిన పడుటానికి..???” అని కోపం తోని బుస్స బుస్స అయితండు. గుండెల ఐరతికి గుడ్లల్ల నీళ్ళు ఆగుతలేవు.

** **

అసలైతే అర్కగుడెం సుంగుది. ఇంట్ల ఐదుగురు తోడవుట్టినోళ్ళు ఉండుడు, గుంట భూమి జాగ లేకుండుట్ల… దేవునిగుడెంకు ఇల్లరికం అచ్చిండు. సుంగు మామ మల్కుకు ఇద్దరే ఆడివిల్లలు. ఇంత భూమి జాగ ఉంది. సిన్నామె జంగుబాయిని చేసుకున్నడు. ఇర్గ పని చేసేది రికమ్ లేకుంట. గాశారం మంచిగ లేక రెండేండ్లు పంట వండిచ్చినా రూపాయి రాలే. ఇంకొన్ని అప్పులు అయినై. ఇట్ల కాదని ఎవలికన్న జీతం ఉండి ఆ అప్పు తీర్పాలెనని మామకు జెప్పిండు. ఎక్కనన్న జీతానికి సూడు అని. పక్కూల్లే ఓ కాపు పటేల్ ఇంట్ల జీతానికి మాట్లాడిండు వారం లోపట్నే. పటేలుకు ఇరువై ఎకురాల పొలం, ఇంకో పదెకురాల శేనుంది.

జీతంల శెరినప్పటికెల్లి సెయ్యి ఆగకుంట కాలు నిలవకుంట పని జేసిండు. పక్కపోలాలోల్లు.. సుట్టు పక్కల ఇండ్లోళ్లు సుంగు పనిని నిలవడి సూసేతోల్లు. పటేలుకు వట్టిన అద్రుట్టానికి కండ్లు మండినోళ్ళు గూడ ఉన్నరు. ఇగ ఆయేడు పంట గూడా ఇర్గ వండింది. పైసలు నాయి గాకున్నా… ఆ పంటంత నేనే వండిచ్చిన అనుకొని ఉబ్బి పోయిండు సుంగు. ఇగ మల్ల ఏడాది గూడా పటేలుకే జీతం ఉన్నడు. ఈ తాప గూడా శెన్లు..శెలకలు..పొలాలు అన్నీ మీదేసుకొని సేసిండు. బంగారం వండింది పటేలు ఎవుసంల.

మల్ల ఏడాదికి సుంగుకు ఓ బిడ్డ వుట్టింది. యిల్ల పొలాలు ఆ పక్కన ఉన్నోల్లకు ఇన్ని అడ్లకు కౌలుకు ఇచ్చిండు. అవి తిండి మందం అత్తన్నయి. ఇంకో దండారి పండుగ దాకా సూసి జంగుబాయి జీతం అద్దు ఇగ అని ఇంట్ల లొల్లి సురువు జేసింది.

“నువ్వు పొలానికి జేసిన అప్పు ముట్టింది, ఇంకెందుకు జీతం ఉండుడు.. మనన్ల మనమే జేసుకుందం, మనది మందికిచ్చి ఏరేటల్లకు రెక్కల కట్టమ్ దారవోసుడు ఎందుకయ్యా” అని ఆరునెల్లు నిత్తెం అద్దుమ రాత్తిరి దాక లొల్లి. లొల్లికి ఇప్పసార తాగుడు శురువు జేశిండు సుంగు.

ఎంతతాగి పన్నా… మబ్బుల లేసి పటేలు ఇంటికి వోయేది. జెప్పన పెండకాల్లు తీసి, దొడ్డి, కొట్టాలు ఊడ్సి, ఎడ్లకు తౌడు వెట్టి నీళ్ళు వెట్టి, పది దాకా ఉన్న బర్ల గొడ్లను మందల తోలి, మొకం గడుక్కొని ఇంటిగలామే చాయ్ వోస్తే తాగి పటేల్ ఎమ్ జెప్తె అది జేసుడే. పొలాలు, కందులు, మక్క, జొన్లు, పెసర్లు, జనుము, నువ్వు… పండియ్యని పంటలేదు ఈ ఐదేండ్లల్ల. ఎండకాలం ఎఱ్ఱని ఎండల గూడా దుక్కులు దున్నిండు. ఏం పనిలేని నాడు ఊరు ఎనుక ఉండే జెంగల్లకు బండి కట్టుకొని కట్టెలకు, కంక పొరుకలకు వొయేది.

ఎంత జేసినా పాలేరు గాడిని అని సుంగు అనుకోలేదు గానీ, పటేలు అనుకుండు. ఒగ దినాన సన్నగ సలి జేరం అందుకొని పదిహేను రోజులు ఇడువలేదు. ముందుగాల ఆ పసరు ఈ పసరు తాగిపిచ్చినా.. ఇది ఎట్లనో ఉంది కథ అనుకొని అక్క బావలను బతిమిలాడి ఎడ్లబండి మీద సర్కార్ దావుకాండ్లకు ఎస్కపెయింది జంగుబాయి. నాలుగు రోజులు అక్కన్నే ఉండి జెర మంచిగైనంక.. ఇంటికి తోలుకచ్చి.., రోజూ పజ్జొన్న రొట్టెలు..ఎల్లిపాయ కారం తినవెట్టి పానం బడగొట్టింది గుండిగలకు. ఇన్ని రోజుల్ల ఒక్కనాడన్న పటేలు ఇటు తొంగి సూల్లేదు.

మిదికెళ్ళి “జెరమత్తె నీ పని ఎవడు జెత్తడు ఇడిసివెట్టి పోతే, నీ పెండ్లాన్ని తొలకపోయినవ పనికి, అరిగిపోతద కరిగిపోతదా” అన్నడు.
పటేలు మాటకు గుండెల కలుక్కుమంది.

“నా సొంత పొలం కంటె ఎక్కువ జేసిన ఇంటికి పెద్ద కొడుకు లెక్క. అవేం గురుతం లెవు పటెలుకు, దావుకాన్ పాలై రానందుకు గింత మాటనే” అని అప్పటిసంది సాలిచ్చుకున్నడు ఇగ.

పటేలు పొలాల పనులకు ఉరుకులాడుడు బందు వెట్టిండు. శేసే మందమే చేసేది. ఈ ఐదెండ్లల్ల పది రోజులు గూడా పడవాట్లు లేకుంట జేసినా.., పానం మంచిగ లేక రానియి అన్నీ పడవాట్ల కింద లెక్కేసిండు పటేలు. ఇగ ఉగాది గడిసినంక.. పటేలింట్ల జీతం బంజేసిండు. నాలుగు రోజులు అందరు ఇదే చెప్పుకున్నరు. కొంతమంది మాకు జీతం ఉంటడేమో అని ఇచారణ జేసిర్రూ. రాములవారి కళ్యాణం అయినంక పటేలు గూడెం అచ్చిండు. గూడెం పెద్ద దర్ము సుంగును పిలిపిచ్చిండు. ఈ పిలుపులను సూసి గుడెపోల్లు కుప్పైర్రు దర్ము ఆకిట్ల.

“పడవాట్లు ఉన్నయ్ మరి అవి జేత్తడా… ఆటికి పైసలు కడ్తడా, మల్ల జీతం ఉంటడా.. ఉండడా” అని అడిగిపిచ్చిండు.

“ఐదేండ్లు ఎన్నడు రికాం లేకుంట సెప్పిన పని సెప్పని పని శేశ్న. నెలకు ఒక్క తాతీలు ఇచ్చినా… ఐదెండ్లకు ఎన్ని తాతీల్లు ఐతయే దర్మన్న..?” ” రెన్నెళ్ళకు ఒకటిచ్చిన ఇంక నాకే పైసలు తెల్తయి గానే..” అన్నడు సుంగు.

“జీతం రాసుకొంగ గియన్ని అనుకోలేదుగారా” అన్నడు పటేలు.

“అవు పటేలా.. మరి జీతం రాసుకోంగ నేను రాని దినం నా పెండ్లాం అస్తదని గిట్ల రాసుకున్నమ ” మొకం మీద కొట్టినట్టు అడిగిండు సుంగు. దెబ్బకు పటేలు మొకం మాడిపెయింది.

” ఇగో గవన్ని గాదు.. జీతం ఉంటవ ఉండవా… గది జెప్పు” అడిగిండు పటేలు.

” ఉంట గానీ… ఐతారం అయితారం నాకు తాతీలు ఉండాలే. జీతం పైసలన్ని ముందుగలనే ఇయ్యాలే. గట్లైతెనే జీతం ఉంట”. ఖరాకడింగ జెప్పిండు సుంగు.

” గసొంటిది ఎక్కన్నన్న ఉన్నదా మునుపు ఈ వూల్లే ” అన్నడు పటేలు.

“ఇప్పట్నుంచే సురువు జెత్తాడి పటెలా” అని అందుకున్నడు సుంగు.

“అవురా… నువ్వు జేసేది ఏవన్న గవుర్ణమెంట్ నౌకరి అనుకున్నవ…? తాతిలు అని లావు మాటలు మాట్లాడుతున్నవ్”

“గవుర్మెంట్ నౌకర్ కన్న ఎక్కోనే పని జేసిన నీ ఇంట్ల. ఈ ఐదేండ్లు నా భూమి జాగ, పెండ్లాం బిడ్డను ఇడిసి దండి సాకిరి జేసిన. ఏ నౌకరోడు సుత గంత జెయ్యడు. మిదికెళ్లి నా పెండ్లాన్నే గంత మాటన్నవ్.. నువ్ పొలానికి రాని నాడు నీ ఇంటిగల ఆమెను తోలినవ ఎన్నడన్న గట్లనే.. శేన్లల్లకు, శెల్కల్లకు…” అని అన్నడో లేదో..

“లంజగొడుక… ఎవలితోని ఏం మాట్లాడుతున్నవో సోయి లేదా… నీ బలుపు నోట్లె మొ… నీ బతుకెంత. నువ్వెంత” అని కాలి సెప్పు దీసి పట్ట పట్ట సుంగుని ఏడ వడ్తే ఆడ కొడ్తనే ఉన్నడు.

గూడెపోల్లు సూత్తర్రు గాని ఎవ్వలూ దగ్గరికి గూడా అత్తలేరు.

” పటేల.. నీ కాల్మొక్త.. బాంచెన్. కొట్టకుర్రి.. అయ్యో.. ఎవలన్న అచ్చి ఆపుర్రి.. కొట్టి సంపేటట్టు ఉన్నడు.. పటేల.. తప్పైంది.. బాంచెన్… కొట్టకుర్రీ..” అని సుంగు పెండ్లం సంకల బిడ్డనేసుకొని అడ్డమడ్డం తిరుగుతంది. సిన్నపొల్ల ఏం అర్థం గాక.. లొల్లికి ఉపిరివట్టి ఏడుత్తంది. భోంభోం అని గట్టిగనే మాటలు ఇనత్తన్నయని గప్పుడే సుంగు మామ పన్నోడు లేసి దర్ము ఇంటిదిక్కు రాంగనే… మొత్తుకునుడు ఇనవడి ఉరికచ్చిండు ఆడికి. పటేలు సేతులకెల్లి శెప్పు గుంజుకొని ఆడవారేసి… సుంగును పటేలు కాన్నుంచి గుంజుకపోయిండు బజాట్లకు.

“థూ.. లంజగొడుకా.. మూడు పూటల తిండి వెట్టిందీ గుర్తం లేకపాయే.. నీకు..” అని గసవొయ్యంగ మల్ల తిడ్తండు పటేలు.

” పని జేత్తన్న అని వెట్టిర్రు గానీ ఉత్తగ వెట్టిర్రా నాకు.. అని ఏడుపు కోపం కల్పి అన్నడు” సుంగు.

“బాడ్కవు… మల్ల నోరు లెత్తంది నీకు.. అని”.. బజాట్లకి ఉరికచ్చి మల్ల గుద్దుతండు యిపుల. గప్పుడు గూడేపోల్లు.. పటెలు సేతులకెళ్ళి సుంగును ఆళ్ళ ఇంట్లదాక గుంజుక పోయిర్రు.

గూడెం అంత ఆగం ఆగం.. లొల్లి లొల్లి అయితంది. ఏందో పెద్దగనే ఉందని.. సుట్టుపక్కల సెన్లల్ల పని జేసే గూడెం జనాలు.. కైకిల్ అచ్చినోల్లు.. సేసే పని ఆన్నె ఇడిసి… ఉరికచ్చిర్రు.

“ఒగపుట దింటే ఒగపూట దిక్కుండది… మీరార ఇయ్యల్ల నామిధ్కి శిగాయిది తయారు జేసిర్రు. కొడుకులాల..మిమ్ముల్ని ఒక్కొక్కలని టౌన్లేసి తొక్కిత్త ఉండుర్రి, ఆ లంజాకొడుకని పీనుగు దిపిత్త తెలారేసర్కి, ఆని పెండ్లాన్నీ.. మీ గూడేపు ముండల్ను బజార్ల వండవెడ్త ఆగర్రీ…” అని గుడ్లన్ని ఎర్రగ జేసుకుంట.. పెయ్యి అనుకంగ.. తిట్టుకుంట బండేసుకొని పోయిండు పటేలు.

** **

ఏడ్సిండు.. ఏడ్సిండు.. బగ్గ ఆలోచన జేశిండు.., నూతికాడ బొక్కెడన్ని నీళ్ళు శేదుకొని మొకం కాళ్లు సేతులు కడుక్కొని, మల్లిన్ని శేదుకోని తాగి… దర్మన్న ఇంటికి అచ్చిండు. మల్లేమన్న లొల్లి గానిక్క అని పొల్లను సంకలేసుకొని ఏడ్సెదల్ల కండ్లు తూడుసుకొని సుంగు ఎంటవడచ్చింది. ఆడ అందరు అటో మూలకు ఇటో మూలకు కూసోని ఉన్నరు ఇంకా అక్కన్నే.

“ఆనే.. అన్నా… నేను ఎప్పుడు గూడా ఒక్క మాటన్లేదు ఈ ఏడెండ్లల్ల. అసొంటిది నన్ను ఇయ్యల్లా శెప్పుతొని కొట్టిండు, నేను అడిగిందాంట్ల తప్పేంది..? పానం మంచిగ లేకనే పోలే పనికి, తెల్సి గూడా మా ఇంటిదాన్ని అనుడు ఎవలి తప్పే..? తాతీల్లు అడుగుడు తప్పానే..?” ఇట్ల లైనుగ అడుగుతండు.. గుండెల నిండ బాధ.. ఏడుపు కల్సిన గొంతుతోని.

“అరేయ్.. తమ్మ…మనది ఒప్పే ఉండని తప్పే ఉండని..మందిలకచ్చె వరకు మనదే తప్పు అయితదిర. ఎందుకంటే మనం లేనోల్లం..పొద్దుగాల లెత్తే కైకిలీ గంబడి జేసుకునేటల్లం పటెల్ల కాడ. మనం ఎమన్నా అడుగాల్నాన్న అంత తెలివి గూడ లేదు. సదువుకొలేదు సుత.

సదువులు.. పైసలు.. భూములు.. జాగలు.. మనసులు అన్నీ ఆల్లకే ఉన్నయ్. ఎనుకటిసంది మనల్ని ఆళ్ళూ ఇట్లనె ఉంచుతర్రు కాళ్ళ శెప్పుల్లెక్క. ఇప్పుడు మనం ఎమ్ జెప్పినా నడువదిరా..” అన్నడు దర్ము.

గుడెంల ఒక్కలు గూడా నోరు ఎత్తుత లేరు… ఇగ ఒకలిద్దరు “లేనోనికి గంత పోకట ఎందుకు..? పటేలు ఇంట్ల తిండి తిననిత్తలేడు దేవుడు.., మేం జేత్తలేమా పనులు, యిడొక్కడే పీకి పారెత్తండా..? యిని రుబాబు కాలిపోను..” అని అంటర్రు. ఇగ ఇట్ల గాదని ఇంటికచ్చి పన్నడు మల్ల గదే నుల్క మంచంల.

జంగుభాయి ఏడిసింది ఏడిసిందీ… శేదబొక్కేడు నీళ్లతోని మొకం కాళ్లు చేతులు కడుక్కొని.. నాలుగు బుక్కలన్ని తాగి.. ఇంట్లకచ్చి.. దండెం మీద ఆరేసిన తువాలతోని మొకం తుడుసుకొని.. పొయ్యి అంటవెట్టి గిన్ని నీళ్ళ ఎసరు వెట్టి.. జొన్న రొట్టెలకు తయారు జెత్తంది. ఆకిలి బయట మొద్దు మీద మల్కు ఇంత మోదుగాకు సుట్ట ముట్టిచ్చుకొని ఏం గానుందో అని ఆలోచన జేత్తండు. గివన్నేం దెల్వని సుంగు బిడ్డ మంచం పక్కపొంటి మట్లే ఆడుకుంటంది. ఎదో గుర్తచ్చినోని లెక్క లేసి కుసోని.. అటిటు బగ్గ సూసి, ఉడుకుడుకు రెండు రొట్టెలు తిని, జెరంత సీకటి వడేదాక జూసి జంగుభాయిని బిర్రబిర్ర అర్కగుడెమ్ తోలిండు మామ తోటి. ఎందుకు ఏందీ అంటె గూడ ఏం జెప్పలేదు. మీరైతే వోర్రి నేనత్త గానీ అన్నడు.

కాలు కదుల్తలేదు పెనిమిట్ని ఇడిసి, కానీ ఎదో గండం అచ్చేటట్టే ఉందని.. అది దాటుటానికి పోవాలె అనుకొని, ముందుగాల ఇంటెనుక పెరట్లకెల్లి, ఔతల ఉన్న కాటుకురి లచ్చన్న మక్క శేను దాటి., దాని అవుతల దయ్యాల తిప్పకు శేరి.. ఎవలన్న అత్తర్ర అని సూసి.. ఆ తిప్ప ఆవలున్న నాగుల మల్లేసు పెసరి సేను దాటి రోడ్ మీదికి అచ్చిర్రూ జంగుబాయి.. మల్కు.. పసివిల్లను సంకలేసుకోని. అంతట్లకు అచ్చిన ఓ తాక్టర్ ఆపి దయ దండం.. పానం మంచిగ లేదట మావోల్లకు జెర ముంగట దించుర్రి అని బతిమిలాడితే..సంకల సిన్న పొల్లను సూసి ఎక్కుర్రి డబ్బల అన్నడు డ్రైవరు.

ఆళ్లు అటు వొంగనే కొప్పర్ల నీళ్లు నింపి పొయి కింద రెండు మంచి దుడ్లు వెట్టిండు.. ఇంట్ల గాంచు నూనె దీపం బైట మట్టి గద్దె మీద వెట్టి, తలుపులు దగ్గరేసి.. ఓ లోటల నీళ్లు వట్టుకొని శెంబట్క వోయినట్టు కుంట దాక మెల్లగ నడుసుకుంట వోయి, కుంట దాటంగనే ఏసికి పొలాలు జెప్పజెప్ప దాటి.. బీట్లకు జేరి.. అడివి తొవ్వలు వట్టిండు సుంగు.

** **

పెద్ద ఎలచ్చన్ నడుత్తంది. అచ్చేటి పొయ్యేటి జీపులు.. బుగ్గ కార్ల.. తెల్ల బట్టల సార్లతోని వూర్లల్ల గూడ బాగనే ఊపు ఉంది. గయన్ని వట్టని సుంగు ఆరోజు కంక బొంగులకు వోయిండు జెంగలికి పటేలు జెప్తే. సిన్నయి గాకుంట, జెర దొడ్డు.. పొడుగు ఉన్నయి కొట్టుక రమ్మని మల్ల మల్ల జెప్పిండు. సరే అని గుర్రాల బాట మిదికెల్లి తీగలిప్ప… మైసమ్మ బండ… గాడిది డొంక… పుస్కలయ్య గుట్ట దాటిండు. ఆ గుట్ట కింద జోడు గుండ్ల బండలు దాటి పోయినంక మంచి మంచి కంక పెనాలున్నయి. ఆడ బండాపి ఎడ్లను తునికి సెట్టు కింద కట్టేసి బండ్లేసుకచ్చిన అరిగడ్డి ఆటికేసిండు.

ఆడ కుప్పలు కుప్పలు రాలిన తుణికి పండల్ల ఓ పదిగల తిన్నడు. ఓ నాలుగైదు దోసిల్లన్ని ఏరి తువాలల మూట గట్టి, గొడ్డలి వట్టి ఓ కంక పెనాన్ని కొట్టిండు. అంతట్లకే ఎక్కన్నో మాటలు ఇనవడ్డయి. ఇంకొంత శెవులు రిక్కిచ్చి ఇన్నడు. ఔ.. ఎవలో ఉన్నరు.. ఇటే అత్తర్రు అని గొడ్డలి పక్కకేసిండు. ఆకుపచ్చటి బట్టలేసుకొని ఇద్దరు ఇటే అచ్చుడుతొనీ.. పానం గజ్జుమన్నది.

“పోలీసులు… గీల్లు గిక్కడెం జేత్తర్రో.. జైలుకు వట్టిత్తరు గావచ్చూ కట్టెలు కొట్టిననని” అని బెదిరి బెదిరి సూత్తండు.

అంతకంతకూ దగ్గరైర్రు.. సుంగు దగ్గరికే రప్పరప్ప అత్తర్రు. ఇంక గొంత దగ్గరికి రాంగనే.. సుంగు..ఆళ్ళకు బోర్ల బొక్కల వడి..” ఓ సార్లూ మీ కాళ్లు మొక్కుత.. బంచెన్.. తప్పైందీ.. ఇంకొసారి కట్టెలు గొట్ట.. ఈసారికి ఇడిసివెట్టుర్రి.. మీ కాళ్లు మొక్కుతన్న సారూ.. నన్నేం జెయ్యకుర్రి..” అని ఏడుత్తండు.

అచ్చెతోల్లు ఆన్నే ఆగిర్రు.. ఏమైతందో తెల్వక.. సుంగు అన్నది మొత్తం ఇని.. ఒకలి మొకాలు ఒకలు సూసుకుంట నవ్వుకుర్రు.

“ఓ అన్నా.. లెవ్వే.. మేం సార్లం గాదు, నీ అసొంటోల్లమే.. ఏడ్వకు లే” అని ఇద్దట్ల ఒకాయన ముందటికి పోయి లేపిండు. కానీ, సుంగుకు దడ దడ వోతలేదు. ముగ్గురు వొయ్యి ఎడ్లు గట్టేసిన తునికి సెట్టు కింద కూసున్నరు.

“అట్ల గాదు సారూ..ఆకుపచ్చటి బట్టలేసుకుర్రు.. పోలీసులే అనుకున్న..”

“ఔనా.. నీ పేరేందే అన్నా..?”
“సుంగు”

“సూడే సుంగన్న.. ఇసొంటి బట్టలు పోలీసులే గాదు. మేం గూడా ఏసుకుంటం..” అన్నడు ఒకాయన.

“మీరు గాళ్ళా.. అయితె” అని మెల్లగ గుసగుస అన్నడు సుంగు.

ఈసారి మల్లా నవ్విర్రు ఇద్దరూ.

“అట్లనే అనుకో ఇగ” అన్నరు.

“ఔ గానీ సుంగన్నా.. గింత లోపలికి కట్టలకచ్చినవ్ ఏందీ.. గదిగుడా ఒక్కనివే..”

“మా పటేలు జెర పెద్ద పెద్ద బొంగులు తెమ్మన్నడు సారూ.. గట్ల పెద్దయి పుస్కలయ్య గుట్ట దాటితెనే ఉండే.. మరి” అని బదులు జెప్పిండు ఉషారుగ.
మల్ల సుంగే అందుకొని..” గింతలోపల మీరేం జేత్తర్రు సారూ.. ఇద్దరే వోతర్రు మీరు సుత” అన్నడు.

” మాదెం ఉందే.. ఏడ అన్నేయం ఉంటె గాడ” అని జెప్పిండు ముందుగల మాట్లాడినాయన.
” ఔ గానీ… నువ్వు పటేలు ఇంట్ల పని జెత్తవ అయితె ?”

” హ్మ్మ్ అవు సారూ “

“మరి మీ పటెలు మంచిగ జుత్తడ? పైసలు ఎన్నిత్తడు నీకు..?”

“మంచిగనే జూత్తడు..మంచోడు” అన్నడు ఆడ రాలిన తునికి పండు తినుకుంటా.

“మంచోడా.., సరే ఎన్నడన్న నిన్ను ఆల్ల ఇంట్ల కూసొవెట్టి తిండి వెట్టిండ..”

“లేదు సారూ.. గానీ.. పాలేర్లకు ఇంట్ల ఎందుకు తిండి వెడ్తరు ?”

“సరే.. పోనీ.. పటేలుకు నువ్వెంత పని జేత్తన్నవ్..? పంటల ఎన్ని ధాన్యం కొలిసి నీ ఇంట్లకు ఇచ్చిండు..?

“శేత్తన్న… ఎక్కొనే. గీ ధాన్యం ఇచ్చేది ఏం లేదు, ఏడాదికి ఇన్ని పైసలు ఇచ్చుడు కరారు..”

“పది లచ్చల పంటెల్తే.. నీకు పదివేలు ఇస్తండ..?”

“పదివేలా.. ఏ ఎక్కడిది ఆరువేలు ఇత్తండు. అయిన సారూ.. మా ఊళ్లే ఉన్న పాలేర్లందట్ల నాకే ఎక్కువ జీతం ఎర్కేన..” కుషిగ జెప్పిండు లాస్టు మాట.

“పిచ్చి సుంగన్న… నీకిప్పుడు అర్థం గాదు”

“లేదు సారూ.. మా పటేలు మంచిగనే అర్సుకుంటడు నన్ను. ఇంట్ల మనిషి లెక్కనే ఉంట నేను గూడా” అని సుంగు అనుకునేది చెప్పిండు.

“అవునా.. మరి ఇయ్యాల్ల ఐతారమ్ గానే.. బిడ్డల తోని పటేలు హాయిగ ఇంట్ల వుంటే, ఇంట్ల మనిషిని అనుకుంటున్న నువ్వెందుకు జెంగళ్ల వడ్డవే.., నువ్వు గూడా అయితే ఆళ్ళ ఇంటికాన్నో.. లేకుంటే మీ ఇంట్లనో ఉండాలే గా..”

“అయ్యో… పాలెర్లకు ఇంటికాడ ఉండుడు అనేదే ఉండదు. పండుగ గానీ పబ్బం గానీ పనికి వోవుడే..”

అక్కణ్ణుంచి లేశిర్రు ఇద్దరూ..

“అయితే తాతీలు అడిగి సూడు మీ మంచి పటేలును. అడిగచ్చి నాకు జెప్పూ..” అనుకుంట.. చెయ్యి ఊపి పోయిర్రు.

ఆ మాటల అర్థం తెలుసుకునే రోజు ఒకటి అస్తదని ఆ రోజు సుంగుకి తెల్వదు.

** **

రాత్రికి సుంగు ఇంటికి నలుగురు పోలీసు పటేళ్లు అచ్చేవరకు.. తలుపుకు తాళం లేదు. కొప్పెర కింద మంట ఉంది. బైట దీపం ఉంది. మనసులు అయితె ఎవ్వలు లేరు. సూసిర్రు సూసిర్రూ.. ఆ పక్కోల్లను ఈ పక్కోల్లని బెదిరిచ్చి పొయిర్రు. అప్పటికెల్లి ఆ గూడెంల సుంగు జాడ లేదు. పెండ్లాం బిడ్డ అత్తగారింటికాడ ఉన్నరని గూడేపోల్లకు తెలిసింది గానీ… చేసేది ఏముంది..?

ఇది జరిగిన ఆరునెల్లకు ఇప్పల కాడి శేన్లకు పొయ్యి రాంగ బండిమీదికెళ్ళి వడి మోకాలు ఇరగ్గొట్టుకున్నడు పటేలు. ఇగ పటేలు బామ్మర్ది జేపిత్తండు పొలాలు శేన్లు. అయినా.. అట్టిగ బండిమీదికెళ్ళి పడితే మోకాలు నుజ్జు నుజ్జు ఎందుకైందో ఎవ్వలికి తెల్వదు.

** **

తాళ్లపేట గ్రామం, మంచిర్యాల జిల్లా. గ్రామీణ నేపథ్యం, గిరిజనుల సాంగత్యం. ఎమ్మెస్సీ (జువాలజీ) చదివారు. ఏడేండ్ల పాటు లెక్చరర్ గా పనిచేశారు. గిరిజనుల జీవితం, వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు. తెలంగాణ జీవభాషలో రాయడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్నారు.

Leave a Reply