మా వర్తమానాన్ని
మా భవిష్యత్తును
బందూకులతో భయపెడతూ
మా బతుకులకే ఎసరుపెట్టే
నీ ఎదురుకాల్పుల కథల్నెప్పుడూ నమ్మలేదు మేం
నిజామాబాద్ పై నిఘావేసిన
నీ గెద్దచూపుల తుపాకి
మోటుపనుల్లో రాటుదేలుతూ
బండబారిపోతున్న మా బతుకుల్ని బాగుచేయడానికి
బందూకు భుజానేసుకొని ప్రజాయుద్ధ సైనికుడై
యుద్ధ రంగంలోకొచ్చిన
మా శంకరుడ్ని
మాకు కాకుండా చేసి
బాధలతో నిండిన
మా జీవితాలకు ‘శోభ’ తేవడానికి
ఆయుధాన్ని ఆసరా చేసుకొని
అవసరంగా మలచుకొని
కదనరంగంలో కాలుమోపిన
మా శోభక్కను మాకు కాకుండా చేసి
ఎప్పుడూ విన్పించే నీ
ఎదురు కాల్పుల కథల్ని
నీ తుపాకి బయొనెట్ ద్వారా విన్నప్పుడే
మేమంతా తూర్పారబట్టాం
తుడిచేసినా పోని రీతిలో
తుపుక్కునుమ్మేసినం నీ
బూటకపు ఎన్ కౌంటర్ రాజ్యంమ్మీద
అయినా
‘హింస’నే హిస్టరీగా కలిగిఉన్న నీవు
‘అణచివేత’నే అక్షరంగా నేర్చుకున్న నీ రాజ్యం
భూస్వాముల భూముల్లో
కల్లోల సముద్రాలను పారిస్తు
మీ ‘రక్షణకవచం’ వైపు ట్రిగ్గర్ నొక్కిపట్టిన
మా ‘సాగరున్ని’ మాకు కాని లోకానికి పంపి
ఎదురుకాల్పులంటూ నీవు
ఎరుపుదే తప్పంటూ నీ రాజ్యం
చెప్పిన కథల్ని
ప్రజా చైతన్యపు మంటల్లో పోసి మసి చేసినాం
అయినా
కుక్కతోకకు గుండుకడితే
సక్కగొస్తదాన్నట్టుగా
తూర్పువాకిట తలుపు తెరుచుకొని
జనం గుండె గదుల్లో ఉదయించాలని
పడుతూ లేస్తూ పరుగు తీస్తున్న సూర్యుడ్ని
నీ ఇంటలిజెన్సు తుపాకి
రెండు ముక్కలుగా ఇరగ్గొట్టి
పీడితుల మనసుల్లో
పోరాట పరిమళాన్ని పారించాలనుకున్న ‘పద్మం’ను
వికృతంగా హత్యచేసి
వికారంగా వొకారమొచ్చెటట్టూ
ఎదురుకాల్పుల కథలల్లుతున్న
నిన్ను ఏమనాలి
ఎన్ కౌంటర్ రాజ్యమనకా
గన్ కౌంటర్ రాజ్యమనకా