ఉరి వేద్దాం కానీ ఎవరికి…?

అరాచక మూకలు
మానవత్వం ముసుగులో పాలన
ఆక్రందనలు ఆవేదనలు
వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయ్!

మానవ మద మృగాలు
రాబందుల మూకలు
ఒక్క నగరంలోనే కాదు
గ్రామాల్లోనూ విహరిస్తున్నాయి!!

మహిళలపై
హింసల వారసత్వ
నిరంతర ప్రక్రియ
ఎన్ని గుండెలు
ఎన్నెన్ని పసి హృదయాలు
వ్యధతో బద్దలవుతున్నాయి?

ఎన్ని చూపుడు వేళ్ళు
ప్రశ్నిస్తున్నా…
మనిషిగా మెదలండని
రోడ్డెక్కి ఆర్థిస్థున్నా…
గర్జిస్తున్నా…

నిరంతరం రక్తాన్ని స్రవిస్తూ
రక్త స్రావపు చరిత్ర మాత్రమే
మిగిల్చింది!

అయినా!
రాజ్యం స్పందన కోరుకోవటం
పడమటి దిక్కున పొద్దును
ఆశించటమే కదా!

ఇంకా నిద్ర నటిస్తారేం
చావు బ్రతుకుల విలువేంటో
ఇన్ని చూసినా గాని
తెలియదా …!

కీలుబొమ్మ పాలకులని
నిలదీద్దాం!!
వ్యక్తులు కాదు
వ్యవస్థలోని మూలాలకు
అసమానతలకు ఉరేద్దాం!!

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply