ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు

అనువాదం: సుధా కిరణ్

(హే మార్కెట్ బాంబు పేలుడు ఘటనలో విచారణని ఎదుర్కొని, మరణ శిక్ష పొందిన కార్మికులు చివరిదాకా తమ ధిక్కారాన్ని కొనసాగించారు. వారిలో కొందరి మాటలని మేడే సందర్భంగా గుర్తు చేసుకుందాం.)

లూయీ లింగ్ – మీ వ్యవస్థనీ, మీ చట్టాలనీ, మీ అధికారాన్నీ ద్వేషిస్తున్నాను

న్యాయస్థానమా! ఈ ‘స్వేచ్ఛా భూమి’ అని పిలిచే అమెరికా దేశంలో మనుషులుగా జీవించగలిగే పరిస్థితుల కోసం పోరాడిన నా ప్రయత్నాల్ని మీరు తృణీకరించారు. నాకు మరణ శిక్ష విధించిన మీరే నా చివరి మాటలు పేర్కొనే అవకాశాన్ని నాకు కల్పించడం ఒక వింత.

నేను మీరు కల్పించిన ఈ అవకాశాన్ని స్వీకరిస్తున్నాను. నాపట్ల జరిగిన అన్యాయాన్నీ, నాపై మోపిన అన్యాయపు నిందలనీ, అవమానాలనీ బహిర్గతం చేయడం కోసం మాత్రమే ఈ అవకాశాన్ని నేను స్వీకరిస్తున్నాను.

నాపై మీరు హత్యా నేరం మోపారు, శిక్ష విధించారు. అయితే, నా విషయంలో మీరు చూపిన సాక్ష్యాలు ఏమిటి?

మొదటగా, మీరు సేలిగర్ అనే వాడిని నాకు వ్యతిరేకమైన సాక్షిగా తీసుకొచ్చారు. బాంబులు తయారీలో అతనికి నేను సహాయపడ్డాను. ఆ తర్వాత ఇంకొకరి సహాయంతో ఆ బాంబులని నేను క్లైబోర్న్ ఎవెన్యూలో 58 వ నంబరు ఇంటికి తీసుకువెళ్ళానని రుజువు చేశారు. అయితే, ఆ బాంబులని హే మార్కెట్ కి తరలించినట్లు మాత్రం మీరు రుజువు చేయలేక పోయారు. ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించి ‘ద్రోహిగా’ అమ్ముడుపోయిన సేలిగర్ ఇప్పుడు మీకు వత్తాసుగా వున్నప్పటికీ మీరు ఆ విషయాన్ని రుజువు చేయలేకపోయారు.

కొంతమంది రసాయన శాస్త్రజ్ఞులని నిపుణుల రూపంలో తీసుకు వచ్చారు. హే మార్కెట్ దగ్గర బాంబులకీ, నేను తయారు చేసిన బాంబులలో వాడిన లోహానికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని మాత్రమే వాళ్ళు చెప్పారు. ఈ బాంబుల మధ్య తేడా ఉందనే విషయాన్ని ఖండించడానికి మిస్టర్ ఇంగ్ హామ్ వృధా ప్రయత్నం చేశాడు. ఈ రెండు బాంబుల వ్యాసాల మధ్య అర అంగుళం తేడా ఉందనే వాస్తవాన్ని అతను ఒప్పుకోవాల్సి వచ్చింది. వాటి మందంలో కూడా పావు అంగుళం తేడా ఉందనే విషయాన్ని అతను కప్పిపెట్టాడు. నాకు శిక్ష విధించడానికి మీరు ఆధారపడిన సాక్ష్యాలు ఇటువంటివి.

అయితే, మీరు విధించిన శిక్ష హత్యానేరానికి కాదు. న్యాయమూర్తి ఇవాళ ఉదయం విచారణలో ఈ ముక్క మాత్రమే చెప్పాడు. హత్యా నేరం మీద గాక, అరాజకవాద నేరారోపణపై మా మీద విచారణ జరుపుతున్నామని గ్రినెల్ పదేపదే వక్కాణించాడు. అందుకని, నేను అరాజకవాదిని అయినందువల్లనే నాకీ శిక్ష విధించారు.

అరాజకం అంటే ఏమిటి? మా కామ్రేడ్లు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అందుకని నేను మళ్ళీ ఆ విషయాన్ని వివరించనవసరం లేదు. మా లక్ష్యాలు ఏమిటో వాళ్ళు స్పష్టంగా వివరించారు. ప్రభుత్వ న్యాయవాది మీకు ఈ సమాచారాన్ని తెలియజేయలేదు. అతను కేవలం మమ్మల్ని విమర్శించాడు, నిందించాడు. మా సిద్ధాంతాలనిగాక, వాటిని అమలు లోకి తెచ్చే పద్ధతులని విమర్శించాడు. ఇందులోనూ, పోలీసుల నిరంకుశ క్రూరత్వమే మమ్మల్ని ఆ పద్ధతులవైపు నెట్టిందనే వాస్తవం గురించి మాట్లాడనేలేదు. ఎన్నికల బ్యాలెట్, కార్మిక సంఘాల ఐక్యత వీటిలోని మా ఫిర్యాదులకి పరిష్కారం ఉందని గ్రినెల్ అంటాడు. ఆరు గంట పని ఉద్యమం కూడా ఉండవచ్చునని ఇంగ్ హాం అంటాడు. అయితే, వాస్తవం ఏమిటంటే, బ్యాలెట్ ని స్వీకరించాలని ఏ ప్రయత్నం చేసినా, కార్మికుల్ని ఐక్యం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేసినా పోలీసు లాఠీ దెబ్బల క్రూరహింసనే మాకు చూపించారు. పోలీసు క్రూరత్వాన్ని ఎదిరించే మొరటు బలప్రయోగాన్ని అందుకే నేను సిఫార్సు చేశాను.

‘శాంతి, భద్రత’లను నేను ద్వేషిస్తున్నానని మీరు నాపై నేరారోపణ చేస్తున్నారు. ఏమిటి మీ ‘శాంతి, భద్రతలు’? మీ శాంతి భద్రతాలకి ప్రతినిధులు పోలీసులు. ఆ పోలీసులలో దొంగలు ఉన్నారు. అదుగో, అక్కడ కెప్టెన్ శాక్ కూర్చుని ఉన్నాడు. నా టోపీ, పుస్తకాలను తన సొంత ఆఫీసులో, తన మనుషులే దొంగిలించారని శాక్ నాముందు స్వయంగా అంగీకరించాడు. నన్ను అరెస్టు చేసిన డిటెక్టివ్ లు నా గదిలోకి దొంగలలాగా వచ్చారు. తప్పుడు సాకుతో, బర్లింగ్టన్ వీధిలోని వడ్రంగి లోరెంజ్ పేరు చెప్పి బలవంతంగా నా గదిలోకి వచ్చారు. నా గదిలో నేను ఒక్కడినే వున్నానని తప్పదు ప్రమాణమిచ్చారు. దీనిని కళ్లారా చూసి, ఈ డిటెక్టివ్ లు తప్పుడు సాకుతో నా గదిలోకి దొంగతనంగా ప్రవేశించారనీ, వాళ్ళు ఇచ్చిన ప్రమాణ పత్రం అబద్ధమనీ సాక్ష్యం చెప్పగలిగే మిసెస్ క్లీన్ ని మీరు కోర్టులో సాక్ష్యానికి పిలవనేలేదు.

తర్వాత జరిగిందాన్ని చూద్దాం. శాక్ ఒక పోలీసు కెప్టెన్ గా పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ప్రమాణపత్రమూ అబద్ధం. సోమవారం రాత్రి సభకి నేను హాజరయినట్లు తనతో చెప్పానని శాక్ ప్రమాణం చేస్తున్నాడు. నేను జెఫ్ హాల్ లో జరిగిన వడ్రంగుల సమావేశంలో పాల్గొన్నానని తనకి స్పష్టంగా చెప్పాను. హెర్ మోస్ట్ రాసిన పుస్తకం నుంచి నేను బాంబులు తయారు చేయడం నేర్చుకున్నానని కూడా శాక్ ప్రమాణం చేస్తున్నాడు. అది కూడా పచ్చి అబద్ధమే.

ఇంకొంచెం ముందుకు పోయి ఈ శాంతి భద్రతల ప్రతినిధుల గురించి తరచిచూద్దాం. గ్రినెల్ అతని మిత్రులు తప్పుడు ప్రమాణాలు చేయిస్తున్నారు. అబద్దమని తెలిసీ ఆ తప్పుడు ప్రమాణపత్రాలు అందిస్తున్నారు. మా తరపు వాదించిన న్యాయవాది వాటికి రుజువులు చూపించారు. నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. గిల్మర్ బోనులో సాక్ష్యం చెప్పడానికి ఎనిమిది రోజుల ముందే తాను ఎవరెవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలో వాళ్ళని గ్రినెల్ చూపించడాన్ని నేను స్వయంగా చూశాను.

నేనూ, నాతోటి మనుషులూ మనుషులుగా మనగలిగే జీవికని సాధించడం కోసం బలప్రయోగాన్ని నమ్ముతానని నేను ముందే చెప్పాను. అయితే, ఏడుగురు వ్యక్తులని చంపడం కోసం తన పోలీసులు, దొంగ వెధవలతో కుమ్మక్కై తప్పుడు సాక్ష్యపు లంచగొండి ప్రమాణాలు చెప్పడానికి గ్రినెల్ పూనుకున్నాడు. చనిపోబోతున్న ఏడుగురిలో నేను ఒకడిని. నన్ను నేను కాచుకోలేని ఈ కోర్టు గదిలో పిరికిపందయని నన్ను దూషించే మహా సాహసి గ్రినెల్! నీచుడు! నన్ను ఉరికంబమెక్కించడానికి అమ్ముడుపోయిన అధమాధములతో, నీచులతో చేతులుకలిపిన హీనుడు. పైపైకి ఎగబ్రాకి, డబ్బు సంపాదించాలనే తహతహలాడే అసహ్యకరమైన స్వార్ధం తప్ప దీనికి మరొక కారణం లేదు.

ఈ నీచుడు, ఇతర నీచులతో కలిసి తప్పుడు ప్రమాణాలు ఇప్పించడం ద్వారా ఏడుగురిని హత్య చేయబోతున్న ఈ నీచుడు, వీడు నన్ను పిరికిపంద అని దూషిస్తున్నాడు. మాటలలో వర్ణించనలవికానంతటి నీచులైన ఇలాంటి ‘శాంతి భద్రతల సంరక్షకులని ద్వేషిస్తున్నానని ఇంకా మీరు నిందిస్తున్నారు.

అరాజకం అంటే, ఒక మనిషి మీద మరొక మనిషి పెత్తనాన్ని, అధికారాన్ని లేకుండా చేయడం. దీన్నే మీరు ‘అరాచకం, అవ్యవస్థ’ అంటూంటారు.

బాంబులు విసరడంతో నాకు సంబంధం ఉందనే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది చూపించలేకపోయాడని న్యాయమూర్తి స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ సమస్యని అధిగమించడం ఎలాగో ప్రభుత్వ న్యాయవాదికి తెలుసు. ఒక కుట్రదారునితో నేను కలిసి వున్నానని అతను ఆరోపిస్తున్నాడు. దీన్ని అతను ఎలా రుజువు చేస్తున్నాడు? కేవలం, అంతర్జాతీయ శ్రామిక జన సంఘం ఒక కుట్ర పూరిత సంస్థ అని ముద్రవేసి అదే రుజువు అంటున్నాడు. నేను ఆ సంస్థ సభ్యుడిని కావడంతో అదే ముద్ర నాకు పడుతుంది. భలే! ప్రభుత్వ న్యాయవాది అద్భుత మేధాశక్తికి ఎదురే లేదు!

ఈ దురదృష్టంలో నా సహచరులతో నాకు ఉన్న సంబంధాలని గురించికూడా నేను చెప్పక తప్పదు. నా తోటి ఖైదీల కంటే కెప్టెన్ శాక్ టోన్ నాకు ఎక్కువ పరిచయముందని నేను నిజంగా, నిజాయితీగా చెప్పగలను.

సార్వత్రిక దైన్యమూ, పెట్టుబడిదారీ హైనాలు సాగిస్తున్న దాడి – ఇవే మమ్మల్ని మా ఆందోళనలో ఒక్కటి చేశాయి. వ్యక్తులుగా కాదు, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న కార్మికులుగా మమ్మల్ని కలిపిన పరిస్థితులు అవే. ఇలాంటి ‘కుట్ర’ ఆరోపణల మీద ఆధారపడి నన్ను మీరు శిక్షిస్తున్నారు.

ఈ శిక్షని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ కోర్టు నిర్ణయాన్ని నేను నిరసిస్తున్నాను. దొర్లిపోయిన శతాబ్దాల శాసనాలని కలగాపులగం చేసి రూపొందించిన మీ చట్టాలని నేను గుర్తించడం లేదు. మీ కోర్టు నిర్ణయాన్ని నేను గుర్తించడంలేదు. ఉన్నత న్యాయస్థానాల నిర్ణయాల ప్రకారం మా విషయంలో మళ్ళీ కొత్తగా విచారణ జరిపించాలని మా తరపు న్యాయవాది నిరూపణలతో వాదించాడు. ఇంకా వున్నత న్యాయస్థానాల నిర్ణయాలని అంతకు మూడింతలుగా ఉటంకిస్తూ మాకు వ్యతిరేకంగా వాదిస్తాడు ప్రభుత్వ న్యాయవాది. నాకు ఒక విషయం తేలిపోయింది. మళ్ళీ ఇంకొక విచారణ జరిపించి, ఈ నిర్ణయాలని సమర్ధించడానికి ఇరవై ఒక్క సంపుటాలని చూపిస్తే, అరాజక వాదులని విచారించేందుకు అందుకు వ్యతిరేకంగా ఇంకో వంద సంపుటాలని తీసుకురాగలరు మీరు. అలాంటి చట్టాల ప్రకారం, బడి పిల్లలు సైతం అర్ధం చేసుకుని, అసహ్యించుకునే ఈ చట్టాల ప్రకారం కూడా మమ్మల్ని ‘చట్ట బద్ధంగా’ శిక్షించలేరు.

మీ న్యాయం అడుగడుగునా తప్పుడు, అబద్ధాల కోరు ప్రమాణ పత్రాలతో నిండివుంది.

నేను సూటిగా, దాపరికం లేకుండా చెబుతున్నాను. నేను బల ప్రయోగాన్ని సమర్ధిస్తాను. కెప్టెన్ శాక్ కు నేను మునుపే చెప్పాను. ‘మీరు మాపై ఫిరంగులు ప్రయోగిస్తే, మేము వాటికి ప్రతిగా డైనమైట్లు దట్టిస్తాము’. ప్రస్తుత వ్యవస్థకి నేను శత్రువునని మళ్ళీ, మళ్ళీ చెబుతున్నాను. నాలో ఊపిరి ఉన్నంతవరకూ, నా శక్తినంతటినీ ఒడ్డి ఈ వ్యవస్థని ప్రతిఘటిస్తూనే ఉంటానని చెబుతున్నాను. నేను మళ్ళీ సూటిగా, దాపరికం లేకుండా చెబుతున్నాను. నేను బల ప్రయోగాన్ని సమర్ధిస్తాను. కెప్టెన్ శాక్ కు నేను మునుపే చెప్పాను. ఆ మాటకి నేను ఇప్పటికీ కట్టుబడే వున్నాను. ‘మీరు మాపై ఫిరంగులు ప్రయోగిస్తే, మేము వాటికి ప్రతిగా డైనమైట్లు దట్టిస్తాము.’ మీరు నవ్వుతారు. ‘వీడు ఇక బాంబులు వేయలేడ’ని మీరు అనుకుంటూ వుంటారు. కానీ మీకు నేను ఒక మాట చెబుతున్నాను, నేను సంతోషంగా ఉరికంబమెక్కుతాను. నేను మాట్లాడిన వందలు, వేలాదిమంది నా మాటలను గుర్తుంచుకుంటారనే పూర్తి విశ్వాసం నాకుంది. నా మాటలు గుర్తు పెట్టుకోండి. మీరు మమ్మల్ని ఉరి తీశాక, వాళ్ళు బాంబులు విసురుతారు. ఇదే ఆశ్వాసంతో నేనీ మాటలు చెబుతున్నాను. నేను మీ వ్యవస్థనీ, మీ చట్టాలనీ, బలప్రయోగం మీద ఆధారపడిన మీ అధికారాన్నీ ద్వేషిస్తున్నాను. అందుకు నన్ను ఉరి తీయండి.’

ఆల్బర్ట్ పార్సన్స్ చివరి లేఖ..
కుక్ కౌంటీ, బాస్టిల్, సెల్ నంబర్ 29
చికాగో, ఆగస్టు 20, 1886

ప్రియ సతీ,

ఈ రోజు ఉదయం మాపై ఇచ్చిన తీర్పు ప్రపంచ వ్యాపితంగా పీడకుల హృదయాల్ని ఆనందడోలికలలో ఓలలాడిస్తుంది. చికాగో నగరం నుండి సెయింట్ పీటర్స్ బర్గ్ నగరం దాకా పెట్టుబడి రారాజు నిర్వహించే ఉల్లాస వేడుకలలో ద్రాక్ష సారాయి ప్రవహిస్తూ ఉంటుంది. మా చావు ఖాయంగా నిర్ణయమైంది. అది మనిషిపై మనిషి పెత్తనం, పీడనలకి అంతం పలుకుతుంది. చట్టబద్ధమైన హత్యలకీ, నయవంచనకీ ముగింపు పలికి , ద్వేషాన్నీ, దుష్టత్వాన్నీ కూల్చివేస్తుంది. భూగోళంపై పీడితులు సంకెళ్ళలో నలిగిపోతున్నారు. శ్రామిక మహోద్యమం మేల్కొంటున్నది. అచేతనత్వం నుండి మేల్కొంటున్న జన ప్రభంజనం సంకెళ్లని తునాతునకలుగా తెంచివేస్తుంది.

మనం పరిస్థితులకి లోబడిన మనుషులం. మనల్ని మన పరిస్థితులు నిర్దేశిస్తాయి. ఈ నిజం రోజురోజుకీ తేటతెల్లంగా తెలుస్తున్నది.

హే మార్కెట్ విషాద ఘటనలో ఎనిమిది మందిమి మరణ శిక్షని ఎదుర్కొంటున్నాం. ఆ ఘటనలో మా ప్రమేయం గురించి ఏ ఒక్కరి విషయంలోనూ ఎలాంటి సాక్ష్యమూ లేదు. ఆ విషయం ఎవరికి పట్టిందని? సంపన్న వర్గాలు బలి కోరుకున్నాయి. ఆగ్రహంతో, నరబలి ఆకలితో ఊగిపోతూ పెడబొబ్బలు పెడుతు న్న కోటీశ్వరుల మూకని సంతృప్తి పరచడం కోసం మమ్మల్ని బలి తీసుకుంటున్నారు. మా మరణంతో తప్ప వాళ్లకి ఆకలి తీరదు. గుత్తాధిపత్యం విజయం సాధించింది! స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం గొంతెత్తే సాహసం చేసిన నేరానికి శ్రామికులు సంకెళ్లతో వధ్యశిలపై నిలుచున్నారు.

ప్రియసఖీ, నీ గురించీ, చిన్నారి పసికందులైన మన పిల్లల గురించీ నేను బాధపడుతూ ఉన్నాను.

నేను నిన్ను ప్రజలకే అప్పగిస్తున్నాను. నువ్వు ప్రజల మనిషివి. నాది ఒకే ఒక విజ్ఞప్తి. నేను చనిపోయాక, నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయమూ తీసుకోవద్దు. సోషలిజం మహత్తర లక్ష్యాన్ని నువ్వు స్వీకరించాలి. మరణంతో నేను ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తున్నది.

నా పిల్లలు – ఈ సమాజం పదింట తొమ్మిది మంది పిల్లలని వేతన బానిసత్వం, పేదరికం నిండిన జీవితంలోకి నెట్టివేస్తుంది. వాళ్ళ తండ్రి ఈ దుర్భర పరిస్థితులతో సంతృప్తి పడి సరిపెట్టుకోకుండా స్వేచ్ఛ, సంతోషాలని ఆకాంక్షిస్తూ చనిపోవడమే మేలు. నా పిల్లలని దీవించండి. నిస్సహాయంగా మిగిలిపోతున్న నా చిన్నారి పిల్లలపై నా ప్రేమని నేను మాటలలో వివరించలేను.

ప్రియ సఖీ, మనం జీవితంలోనూ, మరణంలోనూ ఒక్కటే. నీ మీద నా ప్రేమ శాశ్వతమైనది. జనం కోసం నేను కోరేది మానవత్వం. మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీగా నా గదినుంచి నేను గొంతెత్తి నినదిస్తున్నాను – స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం!

ఆస్కార్ నీబె – మరణ శిక్షకి గురికానందుకు నన్ను మన్నించండి!

1875 నుంచీ నేను కార్మిక ఉద్యమంలో ఉన్నాను. పోలీసులు ఈ దేశ రాజ్యాంగాన్ని ఎలా కాలరాస్తున్నారో నేను చూశాను. కార్మిక సంఘాలని ఎలా అణచివేస్తున్నారో నేను చూశాను. కార్మికుల్ని ఎలా అణగదొక్కి, కాల్చి చంపారో నేను చూశాను. కలుగులోకి ఎలుకలని తరిమినట్లు కార్మికుల్ని ఎలా తరిమివేశారో న్యాయమూర్తులకు గ్రినెల్ వివరించాడు. కానీ, వాళ్ళు బయటికి వచ్చి తీరుతారు! ఫ్రెంచి విప్లవానికి ముందు మూడేళ్ళ కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. చట్టాలని రబ్బరు లాగా సాగదీశారు. అది సాగి, సాగి చివరికి తెగిపోయింది. అది చాలా మంది ప్రభుత్వ న్యాయవాదుల తలలు తెగిపడేలా చేసింది. ఇంకా పెద్దమనుషుల తలలు తెగిపడేలా చేసింది.

సోషలిస్టులమైన మేము అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని అనుకుంటాము. పని గంటలు తగ్గించి, వేతనాలని పెంచడం ద్వారా అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని మేము శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. మీ పెట్టుబడిదారులు ఈ ప్రయత్నాలని అనుమతించరు. వేతన కార్మికుల్ని పేదవాళ్లుగా మిగిల్చి, మీ లాభాలని పెంచుకునే వ్యవస్థని కొనసాగించేందుకు మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులు అజ్ఞానంలో, దరిద్రంలో మగ్గిపోయేలా చేస్తున్నారు, ఇందుకు బాధ్యత మీదే. కార్మికులకు మీరు మంచి జీవితం అన్నదే లేకుండా చేస్తున్నారు.

నేను చేసిన నేరాలు ఇవీ. వాళ్లకు నా ఇంట్లో ఒక రివాల్వర్ దొరికింది. ఒక ఎర్ర జెండా దొరికింది. నేను కార్మిక సంఘాలను ఆర్గనైజు చేశాను . పని గంటలు తగ్గించాలనీ, కార్మికులకు చదువు ఉండాలనీ నేను కోరాను. కార్మికులకు ఒక పత్రిక ఉండాలని, ఆర్బైటర్ జైటుంగ్ పత్రికని పునః ప్రారంభించాలనీ నేను కోరాను. బాంబులు విసిరినా సంఘటనకీ, నాకు సంబంధం ఉన్నట్లు గానీ, ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నట్లు గానీ ఎలాంటి సాక్ష్యము లేదు. క్షమించండి న్యాయమూర్తీ – ఎం చేయాలో మీ చేతుల్లోనే ఉంది. నన్ను కూడా ఉరి తీయమని నేను కోరుతున్నాను. క్షణ క్షణం చావడం కంటే ఒకే సారి చనిపోవడమే గౌరవప్రదమని నేను అనుకుంటున్నాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిస్తే వాళ్ళు తనని ఖననం చేస్తారు. తన సమాధి దగ్గరకు వెళ్లి మోకరిలుతారు. చేయని నేరానికి శిక్ష పడి ఖైదీగా వున్న తండ్రిని కలవడానికి కారాగారానికి వెళ్లాలని అనుకోరు. నేను చెప్పేది ఒక్కటే. మిగతా వారితో పాటు ఉరి శిక్ష పడనందుకు నేను బాధపడుతున్నాను.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

2 thoughts on “ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు

  1. ఉత్తేజకరమైన ఆఖరి మాటలు. చికాగో కార్మికులు చిందించిన రక్తం వృధా కాదు ఎన్నడూ. దోపిడీ, పీడన ఉన్నంత వరకూ ఆ అమరుల స్ఫూర్తి పీడితుల్ని పోరాటాలకు సన్నద్దం చేస్తూనే ఉంటుంది.
    అనువాదం బాగుంది

Leave a Reply