సమానత్వాలను అర్ధం చేసుకోలేని ఉన్మాద హత్యలు

బిల్లపురం నాగరాజు, ఆశ్రిన్ సుల్తాన్ లు ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవడం ఎన్నడూ తప్పుగా భావించలేదు. అర్థం చేసుకోలేని వాళ్ళకు దూరంగా ఉండాలని, పారిపోయి వుండాలని, పోలీసులు ఇచ్చిన సలహా మేరకే దూరంగా కనపడకుండా బ్రతకడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎలాగైతే ఫోన్ నెంబర్ ఆధారంగా వెంబడించి పట్టుకుంటారో, ఆ పద్ధతి ద్వారా నాగరాజు కదలికలను కనిపెట్టడం వారికి కష్టం కాలేకపోయింది. ముఖ్యంగా ఆశ్రిన్ సుల్తానా మాటల్లో వాళ్ళన్నయ్య, మనుషులను అర్థం చేసుకునే మానవత్వం కలవాడు కాదు. నాలుగేళ్ళ క్రితమే వాళ్ళ నాన్న వ్యవసాయంతో చేసిన అప్పులను తీర్చడం కోసం మిగతా స్థిరాస్తులను విక్రయించినందుకు కోపంగా నాన్నను ఛాతి పై బలంగా కొడితే ఆ దాడిలో గుండెనొప్పితో మరణించాడు. ఆశ్రిన్ సుల్తానా కాని, సుల్తానా తమ్ముడుకాని అన్నయ్య మొబిన్ దెబ్బలకు నిత్యం బలవుతున్నారు. ఇప్పటికే సుల్తాన తమ్ముడు అన్నయ్య దెబ్బల మూలంగానే అనారోగ్యవంతుడుగా మారిపోయాడు.

ఆశ్రిన్ మాటల్లో మొయిన్ పేట పోలీసులు ఆమె అన్నయ్యను కౌన్సిలింగ్ కు పిలిచినప్పుడు ఆశ్రిన్ ను పక్కకు పిలిచి “మా పరువుపోతుంది, ఉరేసుకొని చచ్చిపో” అని బెదిరించాడు. “మా పరువు తీస్తున్నావు, నిన్ను, నాగరాజును చంపేస్తాను” అని బహిరంగంగానే బెదిరించాడని తెలియజేసింది. పోలీసుల మధ్య ఒప్పందంలో ఏమీ చేయనని సంతకాలు చేసాడే తప్ప, హత్య చేయకుండా ఉండలేకపోయాడు. ఇటువంటి సంఘటనలో పోలీసులు, ఆ ప్రేమ జంటను పారిపోయి రహస్యంగా బ్రతకమని చెప్పారే తప్ప, హంతకుడిని నియంత్రిస్తాం, మీరు ధైర్యంగా ఎక్కడైనా బతకండి అని ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. ఆర్టికల్ 14 రాజ్యాంగం ముందు అందరం సమానమని చెప్తుంది. కానీ అసమాన సమాజంలో సమానమనేది లేనందున ఇటువంటి ఉన్మాద హత్యలు జరుగుతున్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన పూర్తిగా నానుకుపోయి ఉన్న పునాదిలోంచి ఈ దాడులు సాగుతున్నాయి. పోలీసులు ఆ జంటతో మొబిన్ కు దొరకకుండా పారిపోండని చెప్పారు తప్పా, అతను వీరిని చంపకుండా ఆ మనస్తత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. పథకం ప్రకారం వచ్చేవారు చేసే దాడి ఎప్పుడూ పై చేయే ఉంటుందన్నటుగా ఆశ్రిన్ ఎంత ప్రయత్నం చేసినా, నాగరాజును కాపాడుకోలేక పోయింది. బాధ్యత మరచిన సమాజాన్ని తెలివి తెచ్చుకోవాలని చెబుతున్నది. సమాజంలో మనుషులు, మానవత్వాలు ఉన్నాయా? ఉన్నా గాని తను విశ్వాసం కోల్పోయినట్లుగా మాట్లాడుతుంది. ఆపద కాలంలో సమాజంలో అటువంటి విశ్వాసం కల్పించలేకపోవడం, సమాజ నేరంగా మనందరం అంగీకరించాల్సిందే. ఖురాన్ లో గాని, ఏ మత గ్రంథంలో కాని మనుషులను చంపాలని చెప్పలేదు. ఎందుకు మరి మా అన్నయ్య ఇలా చంపాడు అని ప్రశ్నించింది. పరువు కోసమే నాగరాజుని చంపితే, తాను పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా ఇప్పుడు. కులాల మధ్య సమానత్వాలను, మతాల మధ్య సమానత్వాలను అర్థం చేపించలేని లోపం ప్రభుత్వాలది కాకుండా పోతుందా? యువత అర్థం చేసుకున్నా, సామాజిక, సాంఘిక అంశాలను ఎందుకు కుల పెద్దలు, మత పెద్దలు అంగీకరించలేపోతున్నారు. ఇటువంటి సంఘటన జరిగినపుడైనా సమాజంలో పెద్దలుగా గుర్తించబడ్డవాళ్ళు, కులాల మధ్య వ్యత్యాసాలు లేవని, మతాల మధ్య వ్యత్యాసాలు లేవని, సమాజానికి అర్థం చేపించాల్సిన బాధ్యత వారిపై ఖచ్చితంగా ఉంది. వారి మౌనం నేరాన్ని సమర్థించడంగానే మనం భావించాల్సి వస్తుంది. ఇలా సమర్ధిస్తే ఒకప్పుడు బాధిత కులం, లేదా బాధిత మతం మరొకప్పుడు బాధించేవాళ్ళుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సమాజ మద్దతును, శాస్త్రీయ అవగాహనను పొందలేని వాళ్ళుగా సమాజం ముందు దోషులుగా నిలబడతారు. నేడు ముందకు వస్తున్న తరం సమాజంలోని విలోమ భావాలను ఎదిరించి నిలబడుతున్నారు. నిలబడ్డవారిని దురహంకారపూరితంగా హత్యలు చేస్తున్న వైఖరి తాను నమ్ముతున్న మతానికి, దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాచరణ తప్ప మరొకటి కాదు. చిత్తశుద్ధితో దేవున్ని నమ్మడం కన్నా, సమాజంలో కొనసాగుతున్న అస్థిత్వాల మధ్య అసమానతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సామాజిక చైతన్యాన్ని పొందడానికి నిరాకరించి, సమాజంలో అంతరాలనే చెరిపేస్తున్న తరాన్నే తొలగిస్తున్న ఘటనలను మనం నిలువరించలేకపోతే, సెక్యులర్ భావన పూర్తిగా దూరం కాబడి అగ్రకుల ఆధిపత్యం, మెజారిటీ మతాల దాడులు జరిగి నిమ్న వర్గాలు బలికావాల్సి ఉంటుంది.

ఆశ్రిన్ మాటల్లో “నేను కదా తప్పు చేసింది, నన్ను కదా చంపాల్సింది, నాగరాజును ఎందుకు చంపారు. నేను ఒప్పుకోకపోతే తాను వివాహం చేసుకునేవాడు కాదు కదా?” అమృత విషయంలో కాని, ఆశ్రిన్ విషయంలో కాని వారిద్దరు ఇష్టపడే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. జీవితాలను పంచుకున్నారు కూడా. కానీ సమాజం భావిస్తున్న పరువు వేరే కులం అతన్ని, వేర మతం అతన్ని వివాహం చేసుకోవడం ద్వారా పోదు, అది సమాజం కల్పించిన ఒక అశాస్త్రీయ భావన. స్వంత కులంలోనే, స్వంత మతంలోనే సాంప్రదాయకంగా వివాహాలు చేసుకున్నా, చివరికి అమ్మాయిలను ఏ విధంగా హత్య చేస్తున్నారో, మనందరం స్పష్టంగా చూడగలుగుతున్నాం. దానికి వరకట్నపు హత్యలు అని పేరు పెట్టేసి, మరొక వివాహాన్ని వెంటనే జరిపించేస్తున్న స్థితిని ఏమందాం? ఇష్టపడి చేసుకుంటే దాన్ని పరువుకు ముడిపెట్టడమనేది ఎదుగుతున్న సమాజానికి, మెరుగైన సమాజానికి సరిపోని అంశాలు. అంతేకాకుండా అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబంలో ఒకరిని హత్య చేసి, తమ పరువును కాపాడుకుంటున్నామనే భావన ఎంత నేరమయమైందో, ప్రణయ్ ని హత్య చేపించిన మామ మారుతీరావు ఆత్మహత్యలోనే అర్థమవుతుంది.

సమాజంలో ఏ కులమైనా, మతమైనా అందరూ సమానమనే భావనను ఆర్టికల్ 14 మనకు చెబుతుంది. అందరం రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నవాళ్ళమే. కానీ ఈ సమానత్వ భావనను ఎందుకు అంగీకరించలేకపోతున్నాము, ఆచరించలేకపోతున్నాము? రాజ్యాంగ విలువ కన్నా అశాస్త్రీయ అమానవీయ విలువలకే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇచ్చేలా మనల్ని ఎవ్వరు మలుపు తిప్పుతున్నారు. ఆ మూలాల్లోకి మనందరం వెళ్ళగలిగినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

2014 కన్నా ముందు తెలంగాణలో కూడా బలమైన ప్రజాపోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. అంతరాల మధ్య విభేదాలు తగ్గిపోయిన స్థితిని ఆ కాలంలో మనం చూసాం. గతంలో ఇలాంటి పరువు హత్యలు పూర్తిగా జరగలేదు అని అనలేం కాని 2014 తరువాత జరుగుతున్నంత జరగలేదు. ముఖ్యంగా కుల సమీకరణకు, మత సమీకరణకు బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కులాంతరాలకు, మతాంతరాలకు బలమైన విభజన రేఖలను గీస్తున్నాయి. దాని మూలంగా ప్రజల్లో సమానత్వం అనే భావన తగ్గిపోతూ వస్తుంది. ప్రభుత్వం అసమ సమాజాన్నే కోరుకుంటుంది. సమాజం సమానంగా ఉంటే పోరాటాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే ప్రజల మధ్య విబేధాలకు, పోరాటాలకు ఆజ్యం పోస్తున్నాయి ప్రభుత్వాలు. అధికారం కోసం కూర్చున్న మతపరమైన శక్తులు, దాన్ని వాడుకొని సమాజ ఉన్నతి వ్యతిరేక అంశాలను బలపరుస్తున్నాయి. దానికే సమానత్వభావన వెనక్కి పోయి దాన్నే పరువుకు సంబంధించిన అంశంగా ముందుకు తెస్తున్నాయి. యువతరంలో వస్తున్న సమానత్వ భావనను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాయి. సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్న ప్రభుత్వ విధానాన్ని మనం తప్పు పట్టాల్సిందే. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న నేరం. సమానత్వం కోసం ప్రభుత్వాలు ఏ ప్రయత్నాలు చేయకపోగా, అసమ సమాజంగా మార్చడానికి బలమైన కుట్రలు చేస్తున్నాయి. ప్రభుత్వాలే రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నాయి. అందులోంచి వచ్చిన వ్యక్తీకరణలే ప్రణయ్, నాగరాజుల హత్యలు. కుల దురహంకార చర్యగా గాని, మత దురహంకార చర్యగా గాని గుర్తిస్తూ ప్రకటనలు చేయడం కన్నా కులాల మతాల మధ్య సమానత్వాన్ని అంగీకరించని వాళ్ళు చేస్తున్న హత్యలుగా మనం గుర్తించాలి. కులానికో, మతానికో వీటిని దగ్గర చేస్తామంటే మరో రకంగా సమూహలకు సమానత్వ భావన కన్నా అసమ భావననే తెలియజెప్పిన వాళ్లమౌతాము. ఇటువంటి ఘటనల్లో ఇతర కులాల మీద, మతాల మీద ఉన్న ద్వేషం వారిని హంతకులుగా మారుస్తున్నది. హంతకుడు మొబిన్ విద్యాభ్యాసం ఎక్కువగా పొందలేని స్థితి నుంచి, పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోంచి కుటుంబాన్ని చూసిన వాడు. కుటుంబం తన నియంత్రణలో ఉండాలని కాంక్షించాడు. సమాజంలో ఉన్నటువంటి పితృస్వామిక ఆధిపత్య భావజాలం బలంగా ఉన్నవాడు కాబట్టి ఈ కుటుంబం సమాజంలో భాగమైనా ఇది నా ఆధీనంలో ఉండాలనే భావనతో తన మాట దాటిన చెల్లెను హింసించడం కోసమే నాగరాజును హత్య చేశాడు.

పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి

Leave a Reply