కష్టాల బాల్యమే నా అక్షరాలకు దారులేసింది : ఉదయమిత్ర (పార్ట్ – 3)

ఒక సంఘటనను కథగా ఎట్లా రూపొందిస్తారు?

Do not write the story. Show it. -Charles dickens.

కథ రాయడం అంటే ఒక ప్రాజెక్టు వర్క్ లాంటిది. అంత ఈజీ కాదు. ఒక సంఘటన జరిగాక లేదా తెలిశాక దానిమీద రాయాలంటే వెంటనే కుదరదు. నాళేశ్వరం శంకరం అన్నట్టు “వస్తువు మాగాలి”. కెమికల్ రియాక్షన్ జరగాలి. నడుస్తూ ఉన్నప్పుడో పడుకున్నప్పుడో, అక్కడొక దృశ్యం, ఇక్కడొక విషయం మెరుపులు మెరిపిస్తాయి. వాటిని కలిపి కుట్టాలి. సంభాషణలు సరిచేసుకోవాలి. నాకు ప్రారంభం, ముగింపు పట్ల కొంచెం శ్రద్ధ ఎక్కువ. ముగింపు లేకుండా కథను అట్లా వదిలేయాలని చేహో వ్అంటాడు గాని, నాకు అది కుదరదు. పైగా అది అరాచకం అనిపిస్తది.

చాలా సందర్భాలలో ముగింపు కుదరక, కథనునెలల తరబడి పక్కన పడేసిన సందర్భాలున్నాయి. “తేనెటీగలు” (“ఆఖరు కుందేలు” కథా సంకలనం) కథ రాస్తున్నప్పుడు ముగింపు కుదరక పక్కన పెట్టాను. ఒకసారి నేను,. మా మిత్రుడైన నర్సింలు గౌడ్ గారి తల్లి అంత్యక్రియలకు పోయినప్పుడు తేనెటీగలు మా మీద దాడి చేశాయి. అదొక భయంకరమైన దాడి… మొత్తం మీద తప్పించుకున్నాం కానీ అది నా కథకు ముగింపుగా పనికొచ్చింది. సుమారుగా ‘తేనెటీగలు’ కథ ముగింపు రాయడానికి ఆరు నెలలు పట్టింది.

అంతెందుకూ, “వాగునడ గొద్దు” (‘అలివివల’ కథా సంకలనం) కథ రాయడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. అంటే 20 సంవత్సరాలు అదే కథ రాస్తూ ఉన్నాను అని కాదు. నా సహచరి బెజ్జూర్ ఆదిలాబాద్ లో పని చేస్తున్నప్పుడు జరిగిన ఘటనను వెంటనే కథగా రాశాను. కానీ కథల వర్క్ షాప్ లో అది వినిపిస్తే నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దాన్ని పక్కన పడేశాను. తిరిగి శక్తి పుంజుకొని రాశాను. ఈ క్రమంలో ఆ కథ రూపుదిద్దుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది అంటే నమ్మబుద్ధి కాకపోవొచ్చు.
కథకు సరైన పేరు కోసం కూడా తంటాలు పడాల్సి వస్తుంది. కథ పేరు కూడా ఆలోచింపజేసేదిగా ఉండాలంటాడు కారా మాస్టరు.

సంఘటన చుట్టూ దృశ్యాలు అల్లుకుపోతుంటాం. ఆ దృశ్యాలు ఊహించుకు రాస్తే పండవు. బజారున పడవల్సిందే. నేను “చావుడేరా” కథ రాస్తున్నప్పుడు ఆ కథలో బర్నింగ్ వార్డు చాలా కీలకమైన సన్నివేశం. నేను ఆ దృశ్యాన్ని నెరేట్ చేయడం కోసం రెండుసార్లు మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలోని బర్నింగ్ వార్డుకు పోయాను. అక్కడ రెండు మూడు గంటలు మౌనంగా గడిపాను. కొంతమంది పేషంట్ల వెంబడి ఉండే మనుషులతో మాట్లాడాను. ఆ తర్వాత ఆ అనుభవాన్ని నా కథల్లో పెట్టగలిగాను.
సో… కథకుడు జర్నలిస్టుగా కూడా మారాలి. కథకుడు సైకాలజిస్ట్ గా కూడా మారాలన్నమాట.

*

కొన్ని కథలు చాలా టైం తీసుకుంటే కొన్ని వేగంగా రాసిన సంఘటనలు ఉన్నాయి. “భయం” కథ నిజానికి నాకు వచ్చిన ఒక కల. “ఒక సింహం కొట్టిన పంజా దెబ్బకు శిల మీద నుండి ఆవు జారి పడటం అనేది” నాకు వచ్చిన కల. అది ఇప్పటికీ గుర్తు ఉండడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే అది రాత్రి వచ్చిన కల అయితే… పొద్దున దాన్ని కథగా రాశాను.

అట్లాంటిదే. “కాలమెంత చిన్నదైనా” కథ. ఆ కథలోని ప్రధాన పాత్రకు మూలమైన మహిళతో మేము కలిసి అర్ధగంట (జడ్చర్ల నుండి షాద్ నగర్ కు) ప్రయాణం చేశాం. ఆమె తడబాటు, ఆవేదన, భర్త పట్ల ఉండే భయం, చిన్న చిన్న స్వేచ్ఛలకు ఇచ్చే ప్రాముఖ్యత నన్ను కలిసి వేశాయి. ప్రయాణం నుండి వచ్చిన వెంబడే కథ రాశాను.

కుటుంబరావు గారు ఒక్క సిట్టింగ్ లో కథ రాసేస్తాడంటారు. ఒక కొట్టివేత కూడా ఉండదంటే నేను ఆశ్చర్యపోయాను. నా విషయం అట్లా ఉండదు. అనేక కొట్టివేతలు మార్పులు చేర్పులు. నా కాపీలు ఎవరైనా చూస్తే ఇతను కథ తోటి పెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు అనిపిస్తది.

పురిటి నొప్పుల బాధ అన్నమాట. ఆ తర్వాత తన బిడ్డను చూసి తల్లి మురిసినట్టు తన కథను చూసి తానే మురిసిపోతాడు కథకుడు.
కథ రాయాలంటే మస్తు ఓపిక, టైం ఉండాలి. అంతకుమించి కారా మాస్టరనట్టు, “మన స్వభావం జీవితంలో మంచిచెడ్డలు తీవ్రంగా స్పందించేందుకు ఉండాలి. అనుభవాలనో, ఆదేశాలనో ఇతరులతో పంచుకునే స్వభావం కావాలి. సాహిత్యం ద్వారా ఆ పని జరుగుతుందనే నమ్మకం, శక్తి ఉండాలి.”

కథ రాయడానికి ముందు కారా మాస్టరు వ్యాసం “కథలు ఎట్లా రాయాలి” అన్నది నాకు గైడ్ లాగా పనికి వచ్చింది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి పుస్తకం కూడా పనికి వచ్చింది.

*

కథ రూపొందే క్రమంలో మీలో కల్లోలం రేపిన సంఘటన ఏదైనా ఉందా?

“ఏదైనా రచన చదువుతున్నప్పుడు అది మనలను డిస్టర్బ్ చేయాలి” అంటాడు వివి. ఒక్క చదువుతున్నప్పుడు మాత్రమే కాదు, రాస్తున్నప్పుడు కూడా మనం ఆ కల్లోలానికి, ఘర్షణకు గురి కావాలి. నా ప్రతి కథ నాలో ఘర్షణ రేపింది. తీరికగా కూర్చుని రాసింది లేదు. ఒక ఘటన, ఘర్షణ రేపుతుంటే, దానికి సరిపడా కథనం లేకపోవడం అదంతా మరొక సంఘర్షణ.

“చివరి వాక్యం” కథ రాయడానికి మూలమైన లంబాడా పిల్లను మరిచిపోగలనా… అత్యాచారానికి గురైన తొమ్మిదో తరగతి పిల్ల హృదయంలో ఎంత ఘర్షణ రేగి ఉంటదో, ఆ పిల్ల కళ్ళలో చదవగలిగాను. ఆ పిల్ల చేతిని సానునయంగా నా చేతిలోకి తీసుకున్నప్పుడు భయంతో తన చేతిని గుంజేసుకుంది. ఆ పిల్లకు మా మీదా, నమ్ముకున్నసమాజం మీదిఉన్న అపనమ్మకం అది.

ఆ పిల్ల ముఖం చూసినప్పుడు నాకు “ఆక్రోష్” సినిమాలో ఓంపురి ముఖం జ్ఞాపకం వచ్చింది. ఆ సినిమాలో ఓం పురి (ఆదివాసి)కి వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఆదివాసులకు ఈ వ్యవస్థ న్యాయం చేయదు అనే కోపంతోనే అతను లాయర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేదు. పౌర హక్కుల సంఘం తరఫున మేము ఆ కుటుంబంతో మాట్లాడినప్పుడు ఆ పిల్ల అంతసేపూ మౌనంగా ఉంది గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎంత బీభత్సానికి గురైందో, ఆమె మౌనంలోనే మనకు అర్థం అవుతుంది.

అత్యాచారానికి గురైన ఆ పిల్ల పెండ్లి ఎట్లా భవిష్యత్తు ఎట్లా… బంధువులు ఏమంటారు… చదువుతుందా.. టీచర్లు, తోటి విద్యార్థులు ఎట్లా ప్రవర్తిస్తారు. రాస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్ని కలచి వేశాయి. ఆ రాత్రి కథ రూపుదిద్దుకున్నప్పుడు ఆ పిల్ల అదృశ్య రూపంలో నా రూములోనే తిరిగి ఉంటది.

ఎప్పటికీ గుర్తుండిపోయే ఆపిల్ల ముఖం. “నడుస్తున్న చరిత్ర మీద నిరంతరం వ్యాఖ్యానం”

*

మూత్రం పోయడానికి చెట్లలోకి పోయిన బక్క చిక్కిన పేషెంట్ ని కుక్కలు పీక్కతింటే అస్థిపంజరంగా మిగిలిపోతే చలించకుండా ఉండగలమా. “అస్థిపంజరం” కథ రాస్తున్నప్పుడు అతని భార్య బాధంతా నాదయింది. ఎంత కల్లోలానికి గురయ్యానో, ఎంత కత్తి కోతకు గురయ్యానో, అనుభవిస్తే తెలుస్తుంది. ఏకబిగిన రాసిన కథలో అతని భార్య దుఃఖం నా దుఃఖమై అక్షరక్షరాన నిండిపోయింది.

*

ఒక్కొక్కసారి దుఃఖ గాధల్ని చదువుతున్నప్పుడు “ఇక చదవలేం ముందుకు సాగలేం.. వదిలేద్దాం” అని మధ్యలో ఆపేసి ఊపిరి పీల్చుకుంటుంటాను. ఆదివాసీల మీద క్రూరమైన దాడులు జరుగుతున్నప్పుడు, ఆ విషయాన్ని చదివి భరించడం చేతగాక మధ్యలో పుస్తకం మూసేస్తాను. అట్లే కథలు రాస్తున్నప్పుడు “ఈ అలజడి నావల్ల కాదు. ఈ కథ ఇక ఆపేద్దాం. ఊపిరి బిల్చుకుందాం ” అని ఆపేసి, తర్వాత కొనసాగించిన సంఘటనలు ఉన్నాయి.

అట్లాంటిదే. “కలల కోయిల” కథ. పదవ తరగతి చదువుతున్న మహేశ్వరిని, నలుగురు తోటి పోరలు కలిసి, అత్యాచారం చేసి చనిపోయినాక నిర్మానుస్యమైన చోట పడేసి, ఆకులు కప్పేసి వెళ్లిపోవడంతో వర్షంలో తడిసిన శవం వాసన పడుతుంది (ఆ నలుగురిలో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు). వర్షంలో శవాన్ని వెతకడం, పోస్ట్ మార్టం కోసం రెండు రోజులు మార్చ్యురీలో ఉంచడంతో శవం డి కాంపోజ్ అవుతుంది. ఆ శవాన్ని బొంద పెడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను.

అదంతా కథగా రాస్తున్నప్పుడు, ఒక్కసారిగా రాయడం నావల్ల కాలేదు. కొంతసేపు రాసి పక్కనపెట్టి, మరో రెండు రోజులకి రాయడం ఇట్లా జరిగి, కొన్ని రోజుల తర్వాత “కలలకోయిల” కథ పూర్తి అయింది.

కథ చివరి దృశ్యం భీభత్సంగా ఉందని అది మారిస్తే కథ వేసుకుంటామని ప్రజాసాహితి వాళ్ళు చెప్పారు. నేను మార్చడం కుదరదని కావాలంటే కథను వేయొద్దని చెప్పాను. అదే జరిగింది. భీభత్సాన్ని సున్నితంగా ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు.

*

చెప్పుకుంటూ పోతే చాలా కథల వెనుక చాలా కథలు ఉన్నాయి. వాటిని ఫీల్ కావడం తప్ప, వివరించి చెప్పడం కుదరదేమో. అంతా మోయలేని దుఃఖం.

తుమ్మెటి రఘోత్తం రెడ్డి తను రాసిన ప్రతి కథను నదిని దాటి అల్లం రాజయ్యను కలిసి కథల మంచి చెడ్డలు చర్చించి మార్పులు చేర్పులు చేశాక కథ తయారయ్యేది. కథ లేదా కవిత రాసేటప్పుడు ఘర్షణ అంతా నాదే గానీ పంచుకోవడానికి చాలాసార్లు మనుషులు దొరికే వాళ్ళు కాదు.
“మన చుట్టూ ఒక సాహితీ వాతావరణాన్ని సృష్టించుకోవడం లేదని” శివారెడ్డి సార్ అంటాడు గాని, నేనా విషయంలో ఫెయిలయ్యాను.
చలం ఒకచోట అంటాడు. “నీవు బాగానే రాయచ్చు గానీ అది నాలోకి పలకాలి కదా” అని. రచయిత బాధ, పాఠకుడి బాధ కావాలి. కదిలించాలి. నేనైతే ఘర్షణ పడ్డాను. కానీ పాఠకుడిని ఎంతగా డిస్టర్బ్ చేశానో తెలువదు.

*

మీ కథల్లో ఎందుకంత దుఃఖం? ఇట్లా దుఃఖాన్ని మోసుకు తిరగడం ఎట్లా సాధ్యమవుతున్నది?

“జీవించాలంటే
బాధల్ని భరించడమే
ఉన్నతంగా జీవించడమంటే.
ఉన్నతంగా బాధల్ని ఎదుర్కోవడమే
బాధకు పర్యాయపదం జీవితం”

“మీ కథల్లో ఎందుకంత అశ్లీలత” అని ఓ జర్నలిస్టు మంటోను అడిగాడట. దానికాయన తడుముకోకుండా “నా చుట్టూ అశ్లీలత ఉంది కాబట్టి నా కథల్లోనూ అది ప్రతిబింబిస్తది” అన్నాడట. ఇది నాకు వర్తిస్తుంది.

ఎందుకంత దుఃఖం… అంటే నా చుట్టూ దుఃఖముంది కాబట్టి. అది రాయక తప్పని స్థితి కాబట్టి.

గోవింద్ నిహలాని ఒకచోట అంటాడు “నీ చుట్టూ హింసనే తాండవిస్తోంది, అట్లా చేయి చాపితే చాలు హింస నీ చేతికి తగులుతది” అని. దుఃఖం అంతే. చేయి చాపితే చాలు దుఃఖపు తడి తగులుతుంది. పేదరికం అంటేనే దుఃఖం కదా. రాస్తున్నప్పుడు పేదరికాన్ని తడమకుండా కథలు రాయగలమా. అందుకే అంత దుఃఖం.

*

నేను పుట్టింది, పెరిగింది జడ్చర్ల (పాలమూరు)లో. నా చుట్టూ కరువు కాటకాలు, ఆకలి చావులు, అప్పుల చావులు, వలస చావులు అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, గర్భశోకంతో తల్లులు. ఇంత దుఖం నదిలా ప్రవహిస్తుంటే నా కాళ్లు, కళ్ళు తడవకుండా ఎలా ఉంటాయి.

వర్డ్స్ వర్త్ కవిత్వంలో వాస్తవికత గురించి రాస్తూ, ఆయన పాత్రలు ఎంత down to earth ఉంటాయంటే, ఆపిల్ పండ్లు రైతులు నిదురలో గూడ ఆపిల్ పండ్ల గురించే కలలు అంటారట.

దుఃఖం ఒక వాస్తవమైనప్పుడు, మనం వాస్తవం చెప్పాలనుకున్నప్పుడు కథల్లో చెప్పక తప్పదు.

మా బంధువు ఒకామె నా కథల్ని చదివి, నా మీద కోపంతో ఊగి పోయిందట “ఒక కథ చదివితే, అందులో అన్ని కష్టాలే ఉన్నాయి. ఇక అన్ని కథలు ఇట్లే ఉంటాయని, చదవడం మానేసిన” అన్నదట.

ఇలాంటి ఎందరు నా కథలు చదవడం మానేసినా, నేను రాస్తూనే ఉంటా.

*

అదేమి చిత్రమోగాని ఇంగ్లీషులో నన్ను మొదటగా ఆకర్షించింది థామస్ హర్డీ నవలలే. ఆయనవన్నీ విషాద నవలలే. వాటిని డిగ్రీ చదివే రోజుల్లో ఇష్టంగా చదివేవాడిని.
అయినా, ప్రపంచం ఒక దుఃఖ సముద్రం అనుకుంటే, నా కథల్లోకి ఒంపిన దుఃఖమెంత… బిందువంత.

నాకంటే ఎంతో అంతో రాయడం వచ్చు కాబట్టి, నా దుఃఖాన్ని ఇతరుల దుఃఖాన్ని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాను. ఏ అక్షరం తెలవని రాయని వాళ్ల దుఃఖాన్ని ఎవరు చెబుతారు. వాళ్ల దుఃఖం తెలవాలంటే ఇంటింటికి ఒక రచయిత కావాలి.

*

ఇట్లా దుఃఖాన్ని మోసుకు తిరగడం ఎట్లా సాధ్యమవుతుంది. అంటే ఏం చెప్పేది. అట్టడుగు జీవితం నుండి వచ్చాను కాబట్టి దుఃఖం అలవాటైపోయింది. It is a way of life.

మా అమ్మ కోమటోల్ల దగ్గర పనిచేస్తున్నప్పుడు, తాను తొమ్మిది నెలల గర్భవతి అట. ఆ రోజు పురిటి నొప్పులు విపరీతమవుతున్న, పంటి బిగువున పనిచేస్తూ, దుఃఖాన్ని దిగమింగుకున్నదట. ఆమె బాధను గమనించిన యజమాని “కిష్టమ్మా(మా అమ్మ పేరు) నీకు నొప్పులు వస్తున్నట్లుంది. ఇంటికి పో” అన్నాడట దయతో. మా అమ్మ ఆపసోపాలు పడుతూ ఇంటికి వచ్చి నన్నుగన్నదట . పుట్టుకే ఒక దుఃఖం.

నిటారుగా నిలబడితే, నెత్తికి తాకే రేకుల ఇంట్లో, నన్ను గన్నపుడు నేనేం చూశానో నాకు తెలువదు గాని, కళ్ళు తెరిచి ప్రపంచంలోకి చూసినప్పుడు, నాకు అంతటా దుఃఖమే కనపడ్డది.
ఇంటింటా చీకటే
ప్రతి ఇంట చీకటే
రాజ్యమెవనికి వొచ్చెనో .. రాజన్న
సుఖములెవరికి దక్కెనో రాజన్న..

కారా మాస్టరు అన్నట్లు స్పందించే గుణం ఉన్నందుకు ఈ దుఃఖాన్ని మోస్తున్నానేమో.

ఏ పురాతన దుఃఖం తొలుస్తుందో ఏమో, ఒక్కోసారి లోపల మెలి తిరిగినట్టు అయి నాకు తెలియకుండానే కళ్లు చెమరుస్తాయి. It is difficult to define the tears.

*

తొలుత తొలుత నాకే ఎందుకింత దుఃఖమనిపించేది. ఎప్పుడూ ఒక “సెల్ఫ్ పిటి” వెంటాడేది.

పట్టరాని దుఃఖంతో, రమణాశ్రమంలో ఉన్న చలం గారికి “నాకే ఎందుకు ఇంత దుఃఖం సార్” అని ప్రశ్నిస్తూ ఉత్తరం ఒకటి రాశాను. ఆయన రంగురంగుల కాగితం మీద జవాబు రాస్తూ, “యాదగిరి గారు (నా అసలు పేరు) లోకం ఉక్కు మూతి కాకి వంటిది. పొడుస్తూ ఉంటుంది. బాధపడకండి. బాగా చదవండి. బాగా రాయండి” అన్నాడు. ఎందుకో తేలిక పడ్డట్టు అనిపించింది.

నా దుఃఖాన్ని బయటి దుఃఖంతో పోల్చుకోవడంలో మరింత తేలిక పడ్డానేమో. “మనకంటే బాధపడుతున్న వాళ్ళు ఎందరోఉన్నారు కదా” అన్న ఎరుక తర్వాత చాలా ఉపశమనం ఇచ్చింది.
దుఃఖాన్ని చేతితో పట్టుకున్నాను
పంచుకోవడానికి కాదు
పోల్చుకోవడానికి…
_ వి.వి

‘దోసెడు పల్లీలు’ కథకు నేపథ్యం ఏమిటి?

“తన తన బతుకు తీపిని
తానే రుచి చూడలేక
రాలిపోయిన మామిడిపండు… ఈ ఆశల పూత”

తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంటలోంచి ఒక దోసెడు పల్లీలు కాల్చుకు తిన్నందుకు, తన ప్రాణాలు పోగొట్టుకున్న చెంచు మశయ్య కథ ఇది.

ఒక్క బీరు సీసా కోసం, ఒక్క గుర్రం కోసం నిగ్గర్ (నీగ్రో)ను అమ్మేసిన సంఘటనలు రూట్స్ నవలలో చదివి, “అది ఆ కాలం సంగతి లే” అనుకున్నాను. కానీ ఈ ఆధునిక యుగంలో, ఇంత నాగరికత పల్లవిస్తుంటే, కేవలం ఒక దోసెడు పల్లీల కోసం ఒక చెంచు వ్యక్తిని వెంటాడి వేటాడి చంపడం, బుద్ధి జీవులకు అర్థం కాని విషయం. కానీ అది జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతంలో గల “అమర గిరి” అనే చిన్న ఊరిలో జరిగిన సంఘటన ఇది.

అమర గిరి అడవికి పొలిమేరలో ఉంటుంది. ఆకలి బాధకు తట్టుకోలేక, గుట్ట లాగా కుప్పబోసిన పల్లి కుప్పల నుండి మశయ్య అనే చెంచు జీతగాడు, మరో వ్యక్తి కలిసి ఓ దోసెడు పల్లీలు కాల్చుకు తింటారు. అదే వాల్లు జేసిన ఘోరనేరం. అది చూసిన యజమానురాలు తన భర్తకు విషయం చేరవేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే అంటిస్తుంది. అది దొంగతనంగా భావించిన యజమాని వాల్లను గడెగొయ్యతో కొట్టి, మంచానికి కట్టేసి పోతాడు. వాళ్లు ఎట్లాగో కట్లు తెంపుకొని పారిపోతే, కోపంతో ఊగిపోయిన యజమాని, వాళ్లను వెంటాడి వేటాడి ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో మశయ్య చనిపోతాడు. మరొకడు అడవిలోకి పారిపోతాడు.

చాలా చిన్న విషయం అది. అది దొంగతనమే అనుకుంటే కూడాచాలా చిన్న దొంగతనం. దోసెడు పల్లీల కోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం ఒక్క పాలమూరు జిల్లాలోనే సాధ్యమేమో.

పౌర హక్కుల సంఘం బాధ్యులు, ఆ ప్రాంతం తిరిగి వచ్చి నాకు కథ రాయడానికి కావల్సినంత సరంజామా ఇచ్చారు. మిత్రులు ఆంజనేయులు గౌడ్, తిరుమల్ మా ఇంటికి వచ్చి విషయం చెప్పినప్పుడు నాకు నేను షాక్ నుండి చేరుకొని “దీన్ని కథగా రాస్తాను” అన్నాను. ఆ మాట అన్నప్పుడు నాలో ఏ సంకోచం లేదు. ఆ ఒక్క వేటాడే సంఘటన తప్ప.

వాళ్ల నమ్మకం ఏందో తెలువదు గాని, నేను అడిగిన వివరాలన్నీ ఓపిగ్గా చెప్పారు. దానితోపాటు ప్రభుత్వం చెంచులకు దఖలు పరిచే హక్కుల గురించి ఒక కరపత్రం కూడా ఇచ్చారు.

ఇక్క డ ఇంకో విశేషం ఉంది. కథా స్థలి అయిన అమర గిరి ఊరు మీద నేను ఇటువల మరో కథ “అలివి వల” రాశాను. ఈ రెండు కథలు ఒక ఊరివే కావడం యాదృచ్ఛికమే అయినా, అవి అక్కడి దారుణ పరిస్థితిని పట్టిస్తాయి. ఈ రెండు కథల పేర్లను, నా కథల సంకలనాల పేర్లుగా పెట్టుకున్నాను. ఈ రెండు కథలు చెంచులకు సంబంధించినవే కావడం మరొక విశేషం.

దీనిని “సాహిత్య ప్రస్థానం”కు పంపితే వాళ్లు వెంటనే అచ్చేసుకోవడం కాక, దీనిని ఆనెల ఉత్తమ కథగా ప్రకటించి 700 రూపాయలు బహుమతిగా ఇచ్చారు.

*

నా కథా సంకలనం “దోసెడుపల్లిలు” గురించి ఫేస్బుక్లో పెడితే ఒక మేధావి “సార్ మాకు కిలో పల్లీలు పంపించండి” అని కుళ్ళు జోకు వేశాడు. “అయ్యా దోసెడు పల్లీలకే ఓ చెంచు పానం పోయింది” అని జవాబు ఇస్తే గమ్మునుండిపోయాడు.

నిజానికి నేను ఈ సంకలనాన్నిచెంచుల ఊరైన అమర గిరిలో ఆవిష్కరిద్దాం అనుకున్నకానీ, కుదరలే.

‘బాసగూడ’ నాటకం నేపథ్య ఏమిటి? అది ఎట్లా రూపొందింది? ఆ నాటకం ద్వారా మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరిందనుకుంటున్నారా?

”రెక్కలు గట్టుకు ఎగురుతున్న గీతాల్ని
క్రూరంగా, అమానుషంగా
ముక్కలు ముక్కలుగా జేయవచ్చునేమొ గాని
గీతం, చరణాలుగా అతుక్కోవటాన్ని
ఎవరాపగలరు? ”
-Frederick Douglass (African-American poet)

*

నేను ఈ నాటకం రాస్తానని అనుకోలేదు. అప్పట్లో “సోనీ సోరీ” మీద ఏదైనా నాటకం రాస్తే బాగుంటుందని అనిపించింది. కానీ, దానికి కావాల్సినంత మ్యాటర్ దొరకక పోవడంతో కష్టమైపోయింది. అందుకని విషయం పెండింగ్ లో ఉంచేశాను.

కర్నూలు సభలలో నా నాటకం “చిరస్మరణ” ఓ మోస్తరు సక్సెస్ అయ్యాక, నాటకాలు చాలా అవసరంగా ఫీల్ అయ్యాను. ఒక విధంగా “నాటకాలు రాయాలి… రాయగలను” అనే ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెంగా పొడసూపింది.

వరంగల్లో విరసం సభలు జరపాలని నిశ్చయించుకున్నాక నాటకం గురించి చర్చిద్దామని నాకు పిలుపు వచ్చింది. నేను పోయేటప్పటికి అక్కడ మిత్రుడు సుదర్శన్ ఉన్నాడు. “సభలకు ఏదైనా నాటకం రాయాలి” అన్నాడు వివి సార్. “సార్ నాకు మ్యాటర్ దొరుకుతలేదు గాని సోనీ సోరీమీద నాటకం రాయాలనుకుంటున్నాను” వెంటనే సార్ అందుకొని “ఆమె మీద ఇప్పుడు ఏం రాస్తావు గాని ‘బాసగూడ’ మీద రాయి” అన్నాడు. ఆ విషయం చెబుతూ ఏపీ సిఎల్ సి వాళ్లు రాసిన వ్యాసం ఒకటి నాకిచ్చి చదవమన్నాడు.

అప్పటికి నేను ఆ నాటకం రాయగలనని నమ్మకం, ఏ కొంచెం కూడా లేదు. నాకు సమాచారం ఇచ్చేది ఆ చిన్న వ్యాసం మాత్రమే. మాట్లాడుతూ మాట్లాడుతూ వివి సారు పాణి రాసిన “గ్రీన్ హంట్ ఉత్పాతాలు” పుస్తకం కావలసినంత మెటీరియల్ ఇస్తుందన్నాడు. అయితే ఆ పుస్తకం అప్పటికే నా దగ్గర ఉండడం, కలిసి వచ్చిన విషయం.

సారు ఇంటి మెట్లు దిగుతుంటే నామీద నాకే నమ్మకం కుదరలేదు. నాకు బాగా గుర్తుంది. తిరుగు ప్రయాణంలో సిటీ బస్సులో కూర్చుని ఏపీ సి ఎల్ సి వాళ్లు రాసిన వ్యాసం తిరిగేసాను. అది చదువుతూ ఉన్నప్పుడే “దీన్ని నాటకంగా మల్చగలను” అనే విశ్వాసం కలిగింది. అప్పటికప్పుడే బస్సు దిగిపోయి “నేను నాటకం రాస్తున్నాను” అని గట్టిగా చెప్పాలనిపించింది.

అదే ఊపులో ఇంటికొచ్చి పాణి పుస్తకం కోసంవెతికితే దొరికింది. దాన్ని రెండు మూడు సార్లు చదివాను. నాకు కావాల్సిన భూమిక అందులో దొరికిందనిపించింది. ఆయన సూక్ష్మ రూపంలో నాటకం రాసి వ్యాస రూపంలో పెట్టాడనిపించింది. కొన్నిచోట్ల నాకు కావాల్సిన కవిత్వం ఉంది. కొన్ని చోట్ల పాటలకు కావాల్సిన “ధార” కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే పాణి పుస్తకం లేకుంటే నేను ఆ నాటకం రాయడం కష్టం అయ్యేది.

అప్పటికీ నాకు నాటకాల మీద చెప్పుకోదగ్గ పట్టులేదు. పట్టుమని పది నాటకాలు కూడా చదవలేదు. రాయలేదు. కొండంత ఉత్సాహం మాత్రం ఉంది.
గబగబా నాటకం రాసేసి అయిందనిపించుకున్నాను.

*

నాటకం రాసినంక రిలీఫ్ కోసం ఓ సినిమాకు పోయిన. ఉండలేక ఇంటర్వెల్లో మిత్రుడు రాఘవాచారికి నాటకం రాసిన సంగతి చెప్పేసిన. ఇంకేముంది “ఉదయమిత్ర నాటకం రాసిండు” అని ఆయన బహిరంగం జేశేశాడు.

రాసిన నాటకాన్ని పోస్ట్ చేసిన గాని, అవతల నుండి జవాబు లేదు “నచ్చలేదేమొ” అనుకున్నా. చివరకు తెలిసింది ఏమంటే, “నాటకంలో డైలాగులు పెద్దగా ఉన్నాయని అసలు ఆదివాసులు అట్లాంటి డైలాగులు మాట్లాడరని, పొడిపొడిగా మాట్లాడుతారని “వివి సారు సలహా ఇచ్చారు. తీరా నేను రాసిన నాటకం చూసుకుంటే ఒక్కొక్క డైలాగ్ ఒక పేరా అంత ఉంటది.

నా తప్పు నాకు అర్థం అయిపోయింది. మొదటి స్క్రిప్ట్ భాగం అంత ముతకగా ఉందన్నమాట.

తప్పుతెలుసుకొని డైలాగుల పద్ధతి పూర్తిగా మార్చేసి చిన్న చిన్న వాక్యాలుగా రాసిన. అది వెంటనే ఆమోదం పొందడం నన్ను హైదరాబాద్కు రిహార్సల్ కు రమ్మని పిలవడం వెంట వెంట జరిగిపోయాయి.

నేను సారస్వత పరిషత్ హాలుకు పోయేసరికల్లా అక్కడ పెద్ద పెద్ద వాళ్లంతా చేరి ఉన్నారు. వివిసార్ తో సహా నాటకాలకు సంబంధించిన నిపుణుడు నాగరాజు సార్ కూడా అక్కడ ఉన్నారు. ఈ నాటకాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నారని నాకు అర్థం అయిపోయింది.

*

నాకు నాటకాల రిహార్సల్ కొత్త. నేనెప్పుడూ పాల్గొనలేదు.

ముందుగా నటీనటుల మధ్యన ఉన్న బెరుకుదనం పోవడానికి చిన్న చిన్న ఆటలలాంటివి ప్రాక్టీసు చేయించారు .మంచు మెల్లమెల్లగా కరగ సాగింది

నటీనటుల ఎంపిక, పాటలు, సన్నివేశాలు ప్రారంభం, ముగింపు అన్ని కలిపి ఒక రూపానికి వచ్చాయి.

ఇక జరిగిన రిహార్సలంతా ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. నాకు కూడా నాటకంలో ఒక ఆదివాసి పాత్ర ఇచ్చారు. నేను నాటకంలో నటించడం అదే మొదలు.

అదంతా ఒక కవితలా సాగింది. ఒక పండుగలా జరిగింది.

అసలు తీరిక అంటూ లేని వివి సారు, హేమలతక్కతో కలిసి వచ్చి అక్కడ రెండు మూడు రోజులు కూర్చోవడం, రిహార్సులులో తగిన సలహాలు ఇవ్వడం, రిహార్సల్ను ఎంజాయ్ చేయడం నాకు ఆనందకరంగా అనిపించింది. రివేరా, రామ్ కీ లు తమ తమ కుటుంబాలతో కలిసి అక్కడికి రావడం చూస్తే “వీల్లు ఈ నాటకానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు” అనిపించింది.

అదంతా ఒక సమిష్టి కృషి. రిహార్సల్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు పాటల్ని డైలాగుల్ని సరిదిద్దుకోవడం బాగా అనిపించింది. ఓ పాటలో “చెరువుల తోడి చేపలు పట్టడం” అనే వివి వాక్యం నా పాటకు మరింత అర్థాన్ని చేకూర్చింది. నటీనటులు వయసు, తర తమ భేదాలు లేకుండా కేవలం తమ పాత్రల మీదనే దృష్టి పెట్టడం సమిష్టి కృషిలో భాగమైంది.

కొందరు మిత్రులు డైలాగులు రాసుకొని దూర దూరంగా తిరుగుతూ, పరీక్ష రాసే విద్యార్థుల వలె, బట్టి పట్టడం చూసి ఆశ్చర్యమేసింది. మిత్రుడు ఎక్బాల్ అయితే చిన్నచిన్న కాగితాల మీద రాసుకొని దూరంగా కూర్చుని బట్టి పట్టడం ముచ్చటేసింది. నాటకానికి ఏదో కొత్త శక్తి ఉన్నట్టనిపించింది.

ఈ క్రమంలో అందరి సలహాల మేరకు నాటకాన్ని ఐదుసార్లు మార్చాల్సి వచ్చింది.

మధ్యలో ఒక అంకం చేర్చాల్సి రావడంతో నేను ఇక్బాల్ కలిసి ఆ అంకాన్ని ఏదో ఆఫీస్ ముందు రావి చెట్టు కింద కూర్చొని రాశాము. అది నాటకంలో చక్కగా ఇమిడిపోయింది.

*

జడ్చర్లలో డిటిపి సౌకర్యం లేకపోవడంతో మాటిమాటికి మహబూబ్ నగర్ పోవాల్సి వొచ్చేది. డిటిపి చేయడంలో అక్కడి కుర్రాడు “అంజి” సహకారం మరువలేనిది. వాడికి నా మీదేదో గురి కుదిరింది. ఎన్నిసార్లు పోయినా, వాక్యాలు సవరించినా, అంత పనిలో ఉండి కూడా విసుక్కునేవాడు కాదు.

ఒక్కొక్కసారి డిటిపి సెంటర్ కాడ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇదంతా ఇష్టమైన పని కాబట్టి కష్టంగా అనిపించలేదు.

*

“విత్తనాల పండుగ మీద పోలీసు మూకలు దాడి జరపడం, ఐదుగురు మైనర్లతో సహా పదిహేడు మంది చనిపోవడం, సర్కారు ఆ హత్యల్ని సమర్థించుకోవడం, చివరకు వాల్లు ఇచ్చే సహాయ సహకారాన్ని తిరస్కరించడం”తో నాటకం ముగిస్తుంది.

నాటకంలో ఒక్కొక్క అంకం, దానికదే ఉద్విగ్న భరితమైంది. నటులు తమ పాత్రలని సొంతం చేసుకున్నారు. జీవించారు.

*

డైలాగుల విషయానికొస్తే నాకు ఇచ్చిన కొన్ని డైలాగులు నేనే మర్చిపోయే వాడిని. డైలాగులు రాసింది నేనే అయినా నా డైలాగులు నేనే మర్చిపోవడం ఒక విషాదం.

ఉండబట్టలేక అరుణక్కతో అడిగాను “ఇంతింత పెద్ద డైలాగులు ఎట్లా యాది పెట్టుకుంటారమ్మ” అని. అందుకామెనవ్వి “ఏముంది సార్ బట్టి పట్టాలి. ప్రాక్టీస్ చేస్తుంటే అవే గుర్తుండిపోతాయి” అంది. పాటలలో అక్కలు జీవించిన విధానం నేనెప్పటికీ మర్చిపోలేను.

*

సభలు దగ్గర పడుతున్న సందర్భంలో వరలక్ష్మి గారు వచ్చి రిహార్సల్ చూశారు. “బాగుంది ఒకవైపు కవితలు, కథలు, పాటలు, ఇప్పుడు నాటకాలు. ఇన్నాళ్లు ఈ టాలెంట్లని ఎక్కడ దాచుకున్నారబ్బా” అని అనడం బాగా గుర్తుంది.

రిహార్సల్ చూడడానికి కాకరాల గారు కూడా వచ్చినట్టు గుర్తుంది. ఆయన రావడం మా ప్రాక్టీస్కు నిండుతనం వచ్చినట్టుగా అనిపించింది.

రిహార్సల్ జరుగుతున్నప్పుడు, తాయమ్మ కరుణ బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకొని బయటికి వెళ్లిపోవడం గుర్తుండే విషయం. నాటకానికి తీవ్రంగా కదిలించే శక్తి ఏదో ఉందనిపించింది. పాటలన్నీ బొమ్మ కుదిరినట్టు కుదిరాయి.

“దీపాల వెలుగుల్లో పాటల్లుదామంటే
దీపాలారీపాయే, పాటేమొరాదాయే.
ఇది మేఘాలు ముసిరిన రాత్రీ
కటి క చీకట్లు గమ్మిన రాత్రి”

మధ్యలో వొచ్చే ఈ పాటకు, సహజత్వం కోసం కొన్ని ఫోటోలు బెట్టి, కొవ్వొత్తులు ముట్టించి ప్రాక్టీసు చేసినట్టు గుర్తు.

మొదటి పాటను రాసినాగాని, ట్యూన్ కుదరలేదు. సంధ్యక్కకు ఆ బాధ్యత ఇస్తే, రాత్రికి రాత్రి, మల్లీశ్వరితో కలిసి మంచి ట్యూన్ కట్టుకు వొచ్చింది.

చివర్లో పాడే పాటను రాఘవాచారికి వినిపిస్తే, ఆయన ఆ పాటకు విలువైన మార్పులు చేర్పులు చేశాడు.

*

రెండు నెలలు, రెండు రోజులలాగ గడిచిపోయాయి. ఎవరెవరికి ఏమేం పనులు ఉన్నాయో, ఏమి బాధలున్నాయో తెలువదు కానీ అన్ని తుడిచేసుకుని, అక్కడికొచ్చి సమిష్టి కృషిలో పాలు పంచుకున్నారు.

ఈ నాటకం నుండి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నేను మలుచుకోవడంలో అది చాలా తోడ్పడింది.

నాటకం సక్సెస్ కావడానికి క్రెడిట్ రచయిత ఒక్కడిదే కాదు. నటీనటులు, డైరెక్టర్, గాయకులు, సలహాదారులు… అందరూ ముఖ్యమే. ఇది సమిష్టి కృషి. బృంద గానం.

నాటకం తుది రూపు దిద్దుకుంటూ ఉండగానే ఒక క్యాసెట్ లాంటిది వచ్చినట్లు గుర్తుంది. వరంగల్ లో పోస్టర్లు వేశారట. అందులో “బాస గూడ” నాటకం పేరు వేయడం గురించి మంజుల మేడం చెప్పింది. అది విని నాకు దడ పుట్టింది. “ఏమిట్ల ఏమి గాలేదు. ఈ ప్రచారం అంతా ఏంది. రేపు నాటకం సరిగా ఆడక పోతే పరిస్థితి ఏంది” అని లోలోపల మథనపడ్డాను.

ఉద్విగ్న కెరటాల మీద సాగిన పడవ ప్రయాణమిది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క పరీక్ష లాగా అనిపించింది. వరంగల్లో సభలకు అనుమతి దొరకడం ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంగా ఈ నాటకం దర్శించడం మరొక ఎత్తు అనిపించింది. ఎవరితో నా ఉద్వేగాన్ని పంచుకోవాలో అర్థం కాలేదు.

రేపు నాటకం అనగా అంత క్రితం రోజు నాకు నిద్ర రాలేదు. ఒక్కడిని ఆ చీకట్లో కూర్చుని విపరీతంగా ఘర్షణ పడ్డాను.

అంతకుముందు వరంగల్ మిత్రుడు సుదర్శన్ తో ఒక మాట అన్నాను. “అన్నా… ఈ నాటకం నా బిడ్డ లాంటిది. నువ్వు మేనమామ లాంటివాడివి. నీ చేతిలపెడుతున్న. నీ ఇష్టం” అన్నాను. ఆయన వెంటనే “సరే సరే సాదుకున్న నీవే, చంపుకున్న నీవే అంటావ్ అంతే కదా” అని నవ్వాడు.

అందరూ నాటకాన్ని తమ బిడ్డలాగా చూసుకున్నారు. సాదుకున్నారు. సక్సెస్ అయింది. ఇప్పటికీ మిత్రులు ఆ నాటకాన్ని యాది చేస్తే నా కళ్ళు మెరుస్తాయి. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతూ బాస గూడ ప్రస్తావన తెస్తే నేను దానికి కనెక్ట్ అయిపోతాను. I am proud of it.

ఈ నాటకం హిందీలోకి అనువాదమైందని తెలిసింది. అంతదాకా సంతోషమే గాని ఒక్క హైదరాబాదులో తప్ప, మరెక్కడా ఆ నాటకాన్ని వేసినట్టు గుర్తులేదు. ఈ నాటకాన్ని మరింత ముందుకు తీసుకుపోతారు. అనుకున్నాను గాని ఒకటి రెండు ప్రదర్శనలతో ఆగిపోతుంది… అనుకోలేదు.

Anyway, సమిష్టి కృషిలో పాల్గొన్న అందరికీ నా వినమ్ర వందనాలు.

*

‘బాసగూడ’, ‘నేను గౌరిని’ జనాన్ని అత్యంతగా కదిలించిన నాటకాలు. ఆ నాటకాల ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకుల్లో కూర్చుని చూడటం, వాళ్ళ స్టాండింగ్ ఒవేషన్ లు, క్లాప్స్ ఎట్లా అనిపించింది?

చిన్నప్పుడు మా వీధిలో ‘బాలనాగమ్మ’ నాటకం వేస్తే, నేను మా అమ్మ నాన్నతో పాటు చాప మీద కూర్చుని చూసి వాడిని. నాకు నిద్ర వస్తే అక్కడే మా అమ్మ ఒడిలో పడుకొని, ఏ రాత్రో నిద్రపోయే వాడిని. మా అమ్మ నాన్నలు మాత్రం రాత్రంతా నాటకం చూసి, పొద్దున్నే యధావిధిగా పనికి పోయేవాళ్ళు.

ఇప్పుడు నా నాటకాల్ని ప్రేక్షకుల మధ్యన కూర్చుని చూడడం ఒక అనుభూతి. ఎంత thrilling experience అనేది మాటల్లో చెప్పలేనిది.

*

“బాసగూడ” నాటకాన్ని విరసం బృందం వరంగల్లో ప్రదర్శిస్తే, “నేను గౌరిని” మహబూబ్ నగర్లో PKM మిత్రులు ప్రదర్శించారు.

“నేను గౌరిని” నాటకాన్ని మొత్తం ప్రేక్షకుల మధ్యన కూర్చొని చూశాను.
అయితే నాటకాన్ని సాధారణ ప్రేక్షకుడిగా చూడడం వేరు. నాటక రచయితగా చూడడం వేరు. ఏ సీను ఎక్కడ చెడిపోతుందో, డైలాగులు సరిగా పడుతున్నాయో లేదో, సీను సరిగా పండుతుందో లేదో అనే భయాలు నిలువనీయవు.

*

“నేను గౌరిని” నాటకంలో చివరి సీను మాత్రం బాగా రక్తి గట్టింది. గౌరీ లంకేష్ హత్య జరిగిన తర్వాత, సంతాప సూచకంగా మేధావులంతా సభ పెట్టుకుంటారు. వాళ్లలోంచి ఒక ఉద్యమకారిణి ఉపన్యాసం ఇస్తూ, చివర్లో “yes… నేను గౌరిని” అంటుంది. ఆ వెంటనే వేదిక మీద ఉన్న వాళ్ళు, “నేను గౌరిని”… ” నేను గౌరిని” అని ఒకరి తర్వాత ఒకరు తమ తమ భాషలలో అందుకుంటారు.

హాలంతా ఆ మాటలతో మారుమోగిపోయినప్పుడు నేను మేఘాల మీద ఉన్నాను.
అందులో వివి సార్ లాంటివాళ్ళు గొంతు కలపడం, చిన్న పెద్ద తేడా లేకుండా నినాదాలు ఇవ్వడంతో, గాలి ఉద్వేగ భరిత మయింది. స్వయానా గౌరీ లంకేష్ బతికి సభలోకి వచ్చి నినాదాలు ఇస్తున్నదా … అన్నట్టు అనిపించింది.

ఇది “బాలనాగమ్మ” నాటకం చూడడం దగ్గర్నుంచి “గౌరీ లంకేష్” నాటకం చూడడం దాకా జరిగిన పరిణామం, ఒక మంచి ప్రయాణమే అనుకుంటాను.

*

అంతకన్నా ముందు నాటకంలో దొంగ బాబా వేషం ఒకటి ఉంది. ఆ పాత్రను రాస్తున్నప్పుడు దాన్ని పెంచాలని వరలక్ష్మి మేడం ప్రోత్సహించారు. నేను ఆ బాబా మాట్లాడే వీడియో చూశాను. అతను నెమ్మదిగా మాట్లాడుతాడు. తేనె పూసిన కత్తిలాంటి క్యారెక్టర్ అతనిది. అయితే PKM వాళ్లు ఆ పాత్ర రూపురేఖల్ని పూర్తిగా మార్చేసి ఒక కొత్త ట్రెండు సృష్టించేశారు.

ఆ పాత్ర వేసిన బండారి రమేష్ (నారాయణపేట) నాటకం కన్నా ముందే, ఒక hype సృష్టించాడు. కాషాయం దుస్తుల్లో దొంగ బాబా వేషం వేసుకొని, ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో తిరుగుతూ, పెద్ద హల్చల్ చేశాడు. హర గోపాల్, వివి గార్లతో ఫోటోలు దిగాడు. దీంతో అందరికీ అంచనాలు పెరిగాయి. కానీ రమేష్ అంచనాలకు మించి రక్తి కట్టించాడు.

దొంగ బాబా స్టేజ్ మీదకు రావడంతోనే ప్రేక్షకులు చప్పట్లతో రిసీవ్ చేసుకున్నారు. ఇంకా సినిమా స్టైల్లో అతని మీద కట్టిన పాట, పాడిన తీరూ సభను ఒక ఊపు ఊపింది. కొంతమేరకు సాధారణ నాటకంలో వలె ప్రేక్షకులు ఈలలు వేసినా, అంతిమంగా అది ఓ కుదుపు కుదిపింది.

ఆ పాట నడుస్తున్నంతసేపు, పైన స్టెప్పులు. కింద చప్పట్లు, సభ నిండా నవ్వులు.

ప్రేక్షకుల మధ్యన ఒక అనామకుడిలా కూర్చొని ఆ కాలాన్ని, ఆ వైబ్రేషన్ ను… నాలోకి తీసుకొని చాలా ఎంజాయ్ చేశాను.

కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు కొద్దిసేపు వచ్చి పోతాయి. కానీ వాటి ప్రభావం సినిమా మొత్తం మీద ఉంటుంది.”ఆక్రోష్” సినిమాలో స్మితా పాటిల్ ఒక్కసారే కనబడుతుంది. కానీ ఆమె ప్రభావం మొత్తంగా సినిమా అంతట కనబడుతుంది. గుర్తుండిపోయే విధంగా నటనలో జీవించేసింది.

*

ఇప్పటికీ రమేష్ మిత్రులు అతనిని బాబా అని పిలుస్తుంటారట. నేను అదే పేరుతో పిలుస్తూ ఆట పట్టిస్తుంటాను. ఒక నాటకంలో, ఒక పాత్ర ఆ మనిషి పేరుగా నిలిచిపోవడం అనేది ఆ నాటక రచయితకు అంతకన్నా సంతోషం ఏముంటది.

విత్తనం మరణిస్తూ
పంటను వాగ్ధానం జేసినట్టు
తాను మరణిస్తూ
లక్షలాదిమందిని జాగృతం జేసిన
గౌరీ లంకేష్ కు…
నా నాటకాల పుస్తకం “నేను గౌరిని” అంకితమిచ్చాను.

*

రెండవ నాటకం “బాసగూడ” విషయానికి వస్తే అది ఒక ట్రెండ్ సెట్టర్. అదంతా సమిష్టి కృషివల్లే జరిగింది. నాటకం వేస్తున్నప్పుడు, నేను కొంతసేపు ప్రేక్షకుల్లో కొంతసేపు స్టేజి మీద ఉన్నాను (నాకు కూడా ఒక చిన్న పాత్ర (ఆదివాసిది) ఇచ్చారు).

నాటకం చాలా సీరియస్ కాన్సెప్ట్ కలిగి ఉంది. రిహార్సల్ చేస్తున్నప్పుడు కొందరు తమ తమ పాత్రలను సీరియస్ గా తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. “ఈ మహానుభావులు ఈ నాటకాన్ని ఎక్కడ చెడగొడ్తారో… ” అని లోపల్లోపలే తిట్టుకున్నా. తీరా స్టేజి మీదకి వచ్చేసరికి పూనకం వచ్చినట్టే చేశారు. ఒక్కొక్కరికి తలవంచి నమస్కరించాలి. అంతే… వేరే మాట లేదు.

ఆ దృశ్యం నాకు బాగా గుర్తుంది. మొదటి సీనులో నాకు కొన్ని డైలాగులు ఉన్నాయి. కాబట్టి స్టేజి మీదకు వచ్చాను. ఒకసారి సభ వైపు చూస్తే క్రిక్కిరిసిన ప్రేక్షకులు. ముందు వరుసలో ఎడమవైపు చాలామంది మహిళలు ఉన్నారు.( అందులో చాలా మటుకు అమరుల కుటుంబాల వాళ్ళు ఉన్నారని తర్వాత తెలిసింది)

*

నాటకం మొదలైంది.

విత్తనాల పండుగ రోజు గుమి గూడిన నిరాయుధ ఆదివాసీలపై పోలీసులు తూటాల వర్షం కురిపిస్తారు. సుమారు 17 మంది చనిపోతారు. అందులో ఐదుగురు మైనర్లు.

పదో తరగతి చదువుకునే సరస్వతి అనే అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి అంత బాగా నటిస్తుందని నేను కూడా అనుకోలేదు. ఒక్క డైలాగ్ లేకుండా చావు సీన్లు ఎంత బాగా పండించిందో.

ఆ తర్వాత ఆదివాసీ ఇళ్లలో విషాదాలు, ప్రభుత్వాల వంచనలు, చివర్లో ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని నిరాకరించడంతో నాటకం ముగుస్తుంది.

*

అందరూ నాటకంలో మమేకమయ్యారని ఒక వైబ్రేషన్ లాంటిదేదో చేరింది. ఒక గొప్ప పాట విన్న అనుభూతి.

నాటకాల గురించి నాకు అంతగా తెలియదు. వేదిక ఎక్కితే కొత్త శక్తి వస్తుందని అప్పుడే అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కరికి టన్నులకొద్ది శక్తి వచ్చినట్టు పాత్రలలో జీవించేశారు. కొందరికి రెండు పాత్రలు ఇచ్చినా, ఆ రెండు పాత్రలకి న్యాయం చేశారు.

*

నాటకం జరుగుతున్నంత సేపూ నేను ఒక విధమైన tranceలోకి వెళ్ళిపోయాను. నర నరాన విద్యుత్తు పాకిన అనుభవం.

సర్కార్ ఇచ్చే సహాయాన్ని నిరాకరిస్తూ ఆది వాసీలు నినాదాలు ఇస్తారు. “ఈ పోలీసులు వెళ్లిపోవాలి”, “ఈ అడవి మాది”, “సర్కార్ జులుం నశించాలి”, “జల్ – జంగల్ – జమీన్ హమారా” అంటూ ప్రేక్షకుల మధ్యగుండా నినాదాలు ఇస్తూ రావడం, అందులో నేను ఒకడిని కావడం, మాటల్లో చెప్పలేనిది. Simply superb.

*

నాటకం జరుగుతున్నప్పుడు జరిగిన విశేషాలతో బాటు నాటకం తర్వాత జరిగిన విశేషాలు కూడా చరిత్రనే.

నాటకం అయిపోయాక, నేను మల్లీశ్వరి వాళ్ళతో పక్క రూమ్ లో మాట్లాడుతూ ఉంటే, వివి సారు ఒక్క ఉదుటన వచ్చి మల్లీశ్వరిని కౌగిలించుకొని, అభినందనలు చెప్పి, అంతే వేగంగా వెళ్ళిపోయాడు.

కలిసిన వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తారు. “నీవు ముప్పయి సంవత్సరాలుగా కవిత్వం రాసినా రాని పేరు, ఈ నాటకంతో వచ్చిందయ్యా” అని వడ్డెబోయిన శ్రీనివాస్ అనడం మరువలేనిది. చివరకు విరసం సభలకు టెంట్లు వేసిన మిత్రుడు సైతం “నాటకం భలే వచ్చింది సార్” అని మెచ్చుకోవడం గుర్తుండిపోతుంది.

మరుసటి రోజు పేపర్లలో నాటకం గురించి బాక్స్ గట్టి రాశారు. అందులో కళ్యాణ్ రావు సార్ కంటతడి పెట్టిన దృశ్యం అపురూపం అనిపించింది. సంధ్యక్క పాట పాడుతున్న నిలువెత్తు ఫోటోను పేపర్లలో ప్రముఖంగా వేశారు. (నాటకం చూస్తున్నంత సేపు అమరుల కుటుంబాల మహిళలు కంటతడి పెట్టారని తర్వాత తెలిసింది)

అదంతా ఒకచరిత్ర. నాటకానికి ఇంత శక్తి ఉంటదా…. అని ఆశ్చర్యపోయాను.

విరసం సభలయ్యాక రెండు రోజులకు వివి సారు ఫోన్ చేసి “హ్యాపీయా” అని అడిగాడు.
“సార్. I am on cloud nine” అని జవాబిచ్చాను.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply