ఉత్తరప్రదేశ్‌లో మర్డర్‌ రాజ్‌

ఇవాళ దేశంలో ప్రజాస్వామ్య మూలస్తంభాలు బీటలు పడిపోతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతోంది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతోంది. 2014లో భారత ప్రజాస్వామ్యంపై ఫాసిస్టు కొండచరియ విరిగిపడ్డ తర్వాత, అప్పటిదాకా నామమాత్రంగానైనా నడిచిన ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. సాంఘిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, విద్వేష బీజాలను నేరుగా వ్యక్తుల మనస్సులోకి నాటుతున్నాయి. మానవ సమాజం మెరుగైన పాలనా వ్యవస్థ కోసం చరిత్ర పొడవున సాగించిన సుదీర్ఘ మేధో సంఘర్షణ ఫలితంగా ఆవిష్కరించబడిన ప్రజాస్వామ్య భావనకు, ప్రజా సమస్యలు ప్రజా సంక్షేమమే కేంద్రం కావాలి. అయితే హిందూత్వ ఫాసిస్టు శక్తులు అధికారం చేపట్టిన తరువాత మసీదులు, గుళ్ళు, ట్రిపుల్‌ తలాక్‌, గో మాంసం, హిజాబ్‌ చుట్టూ మన చర్చ కేంద్రీకృతమైపోతున్నది. పెరుగుతున్న ధరలు, ప్రైవేటుపరం అవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల పరం అవుతున్న సహజ వనరులు, జాతి ఉమ్మడి సంపద వంటి అంశాలు చర్చించవలసినవి కావన్నంతగా మన దృష్టి మరల్చబడింది.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక అనుచిత విధానాలను సహేతుకంగా విమర్శిస్తూ, ప్రజా సమస్యలకు అద్దం పట్టవలసిన ప్రజాస్వామ్య నాలుగో స్తంభం (మీడియా) అధికారంతో మిలాఖతై దృష్టి మళ్లింపు రాజకీయాలకు కావాల్సినంత దోహదపడుతున్నది. ప్రజాస్వామ్య వాదులకు గానీ, సామాన్య ప్రజానీకానికి గానీ, అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయం పొందటానికి కోర్టులు ఆలంబనగా ఉండేవి. కానీ 2014 తర్వాత, అది 2002 గుజరాత్‌ మారణకాండ తీర్పులైతేనేమి, అయోధ్య తీర్పు అయితేనేమి, ట్రిపుల్‌ తలాక్‌, హిజాబ్‌, అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ తీర్పులు అయితేనేమి, ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న తీర్పులన్నీ న్యాయ వ్యవస్థ నిస్పాక్షికతను సందేహాస్పదం చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ సౌధానికి నిలువెత్తు పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఇక ఎంత మాత్రం రాజ్యాంగ మౌలిక స్వభావ పరిరక్షకురాలు కాజాలదన్న భయం కలుగుతూ ఉన్నది.

2014 నుండి దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దర్శకత్వంలోని మోడీ పాలన మత అంద విశ్వాసాల మీద, హింసా ప్రవృత్తి మీద ఆధారపడి సాగుతున్నందున సమాజానికి, దేశానికి ఎంత హాని జరుగుతుందో తొమ్మిది సంవత్సరాలుగా తేటతెల్లమవుతున్నది. సమాజంలోని కుల, మత, లింగ, ప్రాంతాలనే వివక్ష లేకుండా విభిన్న ప్రజా సమూహాల మధ్య తటస్థత పాటించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఆధిపత్య శక్తులకు దాసోహం అంటుంటే, ఎటువంటి అన్యాయ దుర్మార్గ నిరంకుశ పాలన సాగుతుందో, కేంద్రంలో మోడీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యోగి పాలన అద్దం పడుతోంది. ఏ నేరం చేయని (బీమా కొరేగావ్‌) వాళ్లమీదనే ఉపా కేసులు బనాయిస్తున్న పాలకులు, తాము అణచివేయదలచిన కుల మతాల మీద చేసిన నేరాలు, చేయని నేరాలు కలిపి ఎంత పెద్ద జాబితా తయారు చేయగలరో సులభంగానే ఊహించవచ్చు.

ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో నిత్యం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఆ రాష్ట్రంలో చట్టబద్ద పాలన ఉందా? అనే సందేహం కలుగుతోంది. శాంతి భద్రతలు ఎంత క్షీణ స్థాయికి దిగజారాయో యోగి పాలనలో కళ్లకు కట్టినట్టు చెబుతున్నది. తన పాలనలో కరడుగట్టిన నేరస్థులు ఉంటే జైళ్లలో ఉండాలి, లేదా రాష్ట్రం వదిలి పారిపోవాలని యోగి పలుసార్లు స్పష్టం చేశారు. బెయిల్‌ మీద ఉన్నవారికి ఎన్‌కౌంటర్లు తప్పవన్న హెచ్చరిక ఆయన మాటల్లో దాగి ఉంది. శాంతి భద్రతల సాకుతో రాష్ట్రంలో నేరస్థులను అదుపు చేయడానికి ఎన్‌కౌంటర్ల (ప్రత్యక్ష హత్యలు) మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించడమే కాక వాటి గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడంతో పోలీసుసు తమ విధులు నిర్వహించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వమే చట్టానికి కట్టుబడి ఉండనప్పుడు నేరాలకు పాల్పడి డబ్బు సంపాదించాలనుకునే వారికి, రాజకీయాధికారం సాధించుకోవాలన్న ఆలోచన రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ అస్తవ్యస్త పరిస్థితికి యోగినే బాధ్యత వహించాలి.

సమాజ్‌వాదీ పార్టీ తరపున ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనా కరడుగట్టిన మాఫియా నాయకుడు అతీఖ్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌లను ఈ నెల 16వ తేది రాత్రి 10.30 గంటలకు పోలీసులు, పాత్రికేయులు, మీడియా సిబ్బంది సమక్షంలో అతి సమీపం నుండి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గుండాలు పోలీసుల సమక్షంలోనే కాల్చిచంపడం యోగి పాలనలో రాజకీయాలు, నేర ప్రవృత్తి ఎలా పెనవేసుకుపోయాయో రుజువు చేస్తున్నాయి. మారువేషంలో వచ్చిన ఆ ముగ్గురూ దుండగులు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉన్న నేరగాళ్ళను హత్య చేసి కనీసం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా లొంగిపోవడం ఊహాతీతమైంది. పైగా హత్య చేసిన లవలేశ్‌ తివారీ, సన్నీ సింగ్‌, అరుణ్‌ మౌర్య ”జై శ్రీరాం” నినాదాలు చేయడం ఈ హత్యలో హిందూత్వ రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయన్న అనుమానాలకు తావిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్లు, కస్టోడియల్‌ హత్యల సమయంలో పోలీసులు చెప్పే కథలన్నీ పూసగుచ్చినట్లు ఒకే విధంగా ఉంటాయి. యుపి ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోనూ అదే స్క్రిప్టు పునరావృతమైంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లను తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. బయటి నుంచి వ్యక్తులొచ్చి పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి కాల్చడం పోలీసుల మద్దతుతోనే సాధ్యమవుతుంది. ఇటువంటి ఘటనలు ప్రభుత్వానికి తెలియకుండా జరగవు. కచ్చితంగా ప్రభుత్వ కుట్ర ఉండి తీరుతుంది. అతీఖ్‌, అష్రాఫ్‌ల హత్యలకు రెండు రోజుల ముందు ఆగష్టు 13న ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతీఖ్‌ కుమారుడు అసద్‌, అతని సహచరుడు గులాం హతులయ్యారు. ఉమేష్‌పాల్‌ హత్య కేసులో వీరు నిందితులు. ఉమేష్‌ పాల్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 24న మర్డర్‌ అయ్యాడు. ఆ కేసులో అతీఖ్‌, అష్రాఫ్‌, అసద్‌, గులాం నిందితులు. ఆ కేసుతో సంబంధం ఉన్న నలుగురూ హతమయ్యారు. 2005లో జరిగిన బిఎస్‌పి ఎంఎల్‌ఎ రాజ్‌పాల్‌ హత్య కేసులో ఉమేష్‌పాల్‌ కీలక సాక్షి. పుండు మీద కారం చల్లినట్టు ఉత్తరప్రదేశ్‌ సీనియర్‌ మంత్రి సురేష్‌ఖన్నా ఈ పరిణామాన్ని దైవసంకల్పం అనడం ఘోరాతి ఘోరం. అంటే ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు బొత్తిగా విలువ ఇవ్వడంలేదని రుజువు అవుతోంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవి చేపట్టిన వారే ఈ హత్యాకాండను దేవుడి పేరు చెప్పి కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం సంపూర్ణంగా ఆటవిక పాలన కొనసాగించడమే.

పోలీసు నిర్బంధంలో ఉన్న వారి ప్రాణాలకే రక్షణ లేనప్పుడు సామాన్య మానవులు సురేశ్‌ ఖన్నా చెప్పినట్టు దేవుడి మీద భారం వేసి బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందే. ఎంతటి దౌర్జన్యమైనా చాటుమాటుగా, ముసుగులు వేసుకుని చేసే రోజులు పోయాయి! అంతా ‘లైవ్‌’!!(ప్రత్యక్షం) అన్నట్టు ఉంది యోగి పాలన తీరు. నేరాలను అదుపు చేయడం అంటే నేరస్తులను హతమార్చడం కాదు. నిందితులకైనా, నేరస్తులకైనా వారికి కోర్టు శిక్ష విధించే దాకా తగిన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యతకు అక్కడి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినా పోలీసులు కిమ్మనలేదు. ఇదంతా గమనిస్తే ఇందులో ఏదో నిగూఢమైన లక్ష్యం ఉందన్న అనుమానం మరింత బలపడుతోంది.

హత్యకు గురైన ఇద్దరు ముస్లింలు కావడం, హత్యకు పాల్పడ్డవారు హిందువులు కావడం అంతిమంగా బిజెపి మతతత్వ రాజకీయాలకు మరింత ఊతం ఇచ్చినా ఆశ్చర్యపడవలసింది లేదు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు మే 4, 11 తేదీలలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ హత్యలు జరగడంలో అంతర్యం ఏమై ఉండొచ్చునో అర్థం చేసుకోవడానికి అసమానమైన ప్రతిభ అక్కర్లేదు. పోలీసు నిర్బంధంలో ఉన్న వ్యక్తులను ఇతరులెవరో హతమార్చగలగడం, బహుశ: ఇదే మొదటిసారి కావచ్చు. యోగీ ఆదిత్యనాధ్‌ ఫిబ్రవరి 25వ తేదీన ”మాఫియాను మట్టిలో కలిపేస్తాం” అన్నారు. ఈ మాటే ఆ ముగ్గురు యువకులకు ప్రేరణగా పనిచేసి ఉండవచ్చు. యోగీ ఆదిత్యనాధ్‌ క్రతువులో తామూ పాత్రధారులు కావాలని భావించి ఉండవచ్చు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనకు రక్షణ కల్పించాలని అతీఖ్‌ అహ్మద్‌ మార్చి 28న కోరాడు. తాను ఎన్‌కౌండర్‌కు గురవుతానని ఆయన అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

మరీ విచిత్రం ఏమిటంటే హత్యకు పాల్పడిన ముగ్గురిని పోలీసు నిర్బంధంలో ఉంచుకోకుండా జ్యుడీషియల్‌ కస్టడీకి పంపడానికి అంగీకరించడం విచిత్రాతి విచిత్రం. ఈ ముగ్గురి గురించి తాము దర్యాప్తు చేయాలని పోలీసులు భావించడం లేదా? అతీఖ్‌ను, ఆయన సోదరుడిని రాత్రి పదిన్నరకు ఆసుపత్రికి తీసుకెళ్తారని ”హంతకులు” అనుకుంటున్న వారికి ఎలా తెలిసింది? వారికి ఎవరైనా ఈ సమాచారం అందించారేమో! అందుకే వారు తొమ్మిది బుల్లెట్లు పేల్చినా పోలీసులు మెదలకుండా ఉండిపోయారనుకోవాలా? ఈ ప్రశ్నలన్నింటికీ యోగీ ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం సమాధానం చెప్తుందనుకోవడమూ భ్రమే. అధికారంలోకి వచ్చిన తరువాత తన మీద ఉన్న కేసులను తానే రద్దు చేసుకున్న యోగీ ఆదిత్యనాధ్‌ చట్టబద్ధపాలన కొనసాగిస్తారని అనుకోవడానికి అస్కారమే లేదు. ఈ ఉదంతానికి బాధ్యులైన పోలీసు సిబ్బంది మీద చర్య తీసుకోకపోవడం యోగి ప్రభుత్వ పనితీరును మరింత అనుమానాస్పదం చేస్తోంది.

విధి నిర్వహణలో ఉన్న 17 మంది పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలు, ఫేక్‌ అని, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అదానీ ఆధీనంలోని ఎన్‌డిటివి పేర్కొన్నది. లవలేష్‌ తివారీతో తమకెలాంటి సంబంధం లేదని కుటుంబం చెప్పిందట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదని కూడా తండ్రి చెప్పాడట. తాను బ్రాహ్మణుడినని, అయినా, శాస్త్రాలను గాక ఆయుధాలు పట్టుకు తిరుగుతానని లవలేష్‌ చెప్పేవాడట. సన్నీ అనే నేరగాడు రౌడీ షీటర్‌, పద్నాలుగు కేసులున్నాయి. ఎలా నేరగాడిగా మారిందీ తెలియదని సోదరుడు చెప్పాడు. మూడోవాడు అరుణ్‌ మౌర్య చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లాడు. తాము పేరు మోసిన నేరగాళ్లం కావాలనే కోరికతో అతిఖ్‌ సోదరులను కాల్చి చంపినట్లు పోలీసులకు చెప్పారట. యోగి పాలన ఇలాంటి గూండాలను ఒక దగ్గరకు చేరుస్తోందా?

విదేశీ తుపాకులతో జర్నలిస్టుల ముసుగులో సరికొత్త మాఫియా నేరగాళ్ళు గట్టిభద్రత మధ్య మీడియా మధ్యకు ఎలా ప్రవేశించారనేదే కోటి రూకల ప్రశ్నగా మారింది. ఏప్రిల్‌ 13వ తేదీన అతీఖ్‌ అహ్మద్‌ కుమారుడి ఎన్‌కౌంటర్‌ సమయంలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉద్దేశంతోనే మాఫియా నేరస్తులకు రక్షణ ఇవ్వడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా? లేక అన్నీ తెలిసే ఉద్దేశపూర్వక నిర్లక్ష్య భావంతో వ్యవహరించారా? వంటి అనేక సందేహాలు అక్కడ కనిపిస్తున్నాయి. మానవహక్కుల సంఘాలను, ప్రశ్నించే నోళ్ళను మూయించేందుకు అదరాబాదరాగా యోగి ప్రభుత్వం ముగ్గురితో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రజల సందేహాలకు ఈ కమిటీ సమాధానాలు వెలికితీయాల్సి ఉంది.

2017లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దర్యాప్తులు, కోర్టులు ఇవేమీ లేకుండా నిందితులను లేపేయడమనే సిద్ధాంతాన్ని యోగి ప్రభుత్వం అమలు చేస్తోందని అర్థమవుతోంది. అది కూడా ఒక మతానికి సంబంధించిన వారే లక్ష్యంగా ఉండడం విశేషం. యు.పిలో యోగి ప్రభుత్వం వచ్చింది మొదలు ముస్లింల అక్రమ నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. వాటిపై దర్యాప్తులు, విచారణలు ఏమీ లేవు. రాష్ట్రంలో నేరస్తుల, అసాంఘిక శక్తుల పీచమణిచేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నాయని యోగి సర్కారు తమ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సమర్థించుకుంటోంది. ఇదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మతోన్మాద మూకలు, ప్రైవేటు సైన్యాలకు పూర్తి మద్దతిస్తోంది.

ఎన్నికల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే బిజెపి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను సామూహికంగా ప్రభావితం చేయడంకోసమే ఎన్‌కౌంటర్ల రాజకీయాలకు తెరలేపిందన్నది విమర్శకుల మాట. గడచిన యాభై రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. లోపభూయిష్టమైన ఎన్నికల వ్యవస్థ కారణంగా నేరసామ్రాజ్యానికీ, రాజకీయవ్యవస్థకూ మధ్య థాబ్ధాలుగా కొనసాగుతున్న చీకటి స్నేహం ఫలితంగానే దేశంలో ముఖ్యంగా యూపీలో యోగి పాలనలో నేరసామ్రాజ్యం వెళ్ళూనుకుంది. మాఫియాను మట్టికరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా శపథం చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏకపక్ష నిర్ణయాలతో పోలీసు వ్యవస్థను తోలుబొమ్మలా ఆడిస్తున్నారు. నిందితులకు, దోషులకు కూడా మానవహక్కులు ఉంటూయన్న నిబంధనలు ఉల్లంఘించారు.

2017లో యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు పది వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు. దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నేరాల వివరాలను చూసినప్పుడు అలాంటి దాఖలాలు లేవు. ఉత్తరప్రదేశ్‌ పోలీసు కస్టోడియల్‌ మరణాలకు పేరు మోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారం ఎందుకు జరగదు? వారంతా ఎవరు, నేరగాళ్లేనా? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జూలై 26 నాడు ప్రచురించిన వార్త చెప్పిందేమిటి? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీస్‌ కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఉత్తరప్రదేశ్‌ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 థకం నుంచి 2000 థకం వరకు ముంబై ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియా డాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా? కొత్తవారు పుట్టుకొస్తూనే ఉంటారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి అధికారానికి రాకముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 ఉంటే 2020లో అవి 6,57,925కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి. దేశంలో పెరుగుతున్నట్లు ఉత్తరప్రదేశ్‌లో కూడా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసులతో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే ఉత్తరప్రదేశ్‌ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అలాంటి స్థితిలో అక్కడి జనం ప్రశాంతంగా నిద్రపోతారా? యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాలకులకు లైసెన్సు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సర్వసంగ పరిత్యాగి, నిరంతరం భద్రతా వలయంలో ఉండే యోగి పరిస్థితి ఇది. గూండాలను అణచివేస్తే అన్ని అక్రమ ఆయుధాలు ఎలా ఉంటాయి? పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చిన యోగి జవాబుదారీతనాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు. ఏకు మేకై కూర్చుంటుంది. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడతారనడంలో సందేహం లేదు.

2017 నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేస్తే జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించి, వారి ఇళ్లు నేలమట్టం చేసే బుల్‌డోజర్‌ రాజకీయాలే గెలుపుమంత్రంగా పాటిస్తూ యోగి ప్రభుత్వం ఉన్మాదం రెచ్చగొడుతున్నది. మహిళలపై అత్యాచారాలు చేసిన దుండగులు దర్జాగా తిరుగుతుంటే, బాధిత మహిళలు, కుటుంబ సభ్యులు అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. మైనారిటీల మానవ హక్కులను కాలరాస్తున్నది. రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవంలేని కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే యోగి కూడా వినాశకర చర్యలకు పాల్పడుతున్నారు. రాజ్యాంగబద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయాన్ని అందించడానికి చట్టబద్ధమైన పాలన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే ప్రజలకు శాంతి, సౌభాగ్యాలను అందించగలదని పాలకులు గుర్తించాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వలన కలిగే దుష్పరిమాణాలు మన సమాజంపై దీర్ఘకాలం కొనసాగుతాయని, ప్రమాదకర ధోరణికి దారితీస్తాయని గుర్తించాలి. చట్టబద్ధ పాలన అందించలేమని తమ అసమర్ధతను గుర్తించని ప్రభుత్వాలే ఇటువంటి ‘ఆటవిక పద్ధతు’లకు పూనుకొంటాయి. హిందూత్వ శక్తుల ఉన్మాదానికి ఊతమిస్తూ ప్రపంచం దృష్టిలో దేశాన్ని చులకన చేస్తున్నారు.

పేరు మోసిన గూండాలను కాల్చి చంపినా తప్పు పడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో ఎన్‌కౌంటర్లు సమాజానికి పీడగా ఉండే నేరగాళ్లకే పరిమితం కావు. తమకు నచ్చనివారిని సైతం అధికారంలో ఉన్న పెద్దలు ఏదో ఒక సాకుతో ఏరిపారవేస్తారు. తమ దాకా వచ్చినప్పుడు గానీ ”తక్షణ న్యాయ” వాదులకు ఈ అంశం అర్థం కాదు. అలా కోరుకోవటం, అలాంటి ఉదంతాలకు మద్దతు ఇవ్వటం అంటే నిరంకుశ శక్తులను ప్రోత్సహించటమే అవుతుంది. కోర్టులు చేయవలసిన పనిని, ఇతర మార్గాల ద్వారా చేయడమంటే న్యాయవ్యవస్థను ధిక్కరించడమే చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమే అవుతుంది. ఇటువంటి విధానాలను అనుసరించి హీరోలుగా మారే రాజకీయ నేతలు అంతిమంగా ఫాసిస్టు పాలనకే దోహదకారులు అవుతారు. ఇది అతీఖ్‌కు సంబంధించిన విషయం కాదు. దేశ న్యాయపాలనకు సంబంధించిన సమస్య అని పౌర సమాజం గుర్తించాలి. పాలకులను ప్రశ్నించాలి, సమాజంలో నిలదీయాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply