ఉంగుటం

గోవిందా! అని భుజానికెత్తుకున్న గంగావు
సచ్చినా బతికినా గోసపోసుకొనే మాతా
ఏత్మల బతుకుల్ని ఎంబడిస్తున్న దేశభక్తి దూత
ఏం చెర! ఏం నస!
ఏడికాడికి కోసుకోని పెయ్యికి అగ్గి తగులవెట్టుకున్న
కులం రడమండల రక్తగాయాల మంట
ఎడగడ్డి కంచెల సుర్ర సుర్రన దూరె కొర్రాయి బాట

అవును! కొంగవాలు కత్తితోని యిడిపిచ్చిన డొల్క
లందల మాగి నీటకంగా కడ్గిన సీరుక
మొగులను మలిసి కవుసు ఎవుసు కడ్గి గాలిచ్చి
ఎండ తాపాన్ని సున్నంగా పొతంజేసి
సకల అతారెలు సాంచెపోసిన తోలు తిత్తి ఊపిరివి

బరిబాతల లోకానికి బట్టలు తొడ్గి
నంగ పాదాలకు చెప్పులు జేసి నాగరికత నేర్పిన
పట్టాభిషిక్తమైన ప్రతిభను వొచ్చరకు వొర్గవెట్టిన
మనువు ఎంత మాయదారి పంచమ ముద్రేసె పాపకారి

ఏమాయెనే తాత! ఏమాయెనే!!
అందాల పనిముట్లు అలుకల చెప్పులు
ఎవ్వని పాలైపాయే? ఎవ్వని పేటెంట్ హక్కైపాయే?

పనిరాయి పట్టన పల్గి
గూటం గుండెలు బాదుకొని సచ్చిపాయే
‘లంద’ బొందల కల్సిపాయే
ఉంగుటం తెగిన చెప్పు ఉరిపోసుకొని
బహుళజాతి కంపెనీల బందైపాయే

కులమైతే గగనమంత కసితో
గడ్కి గడికి సావును అల్మకొనే విషం సంస్కృతి
పరోపకార పునరుత్పత్తి పురామానవా జాంభవా
నీ జ్ఞానం నీ త్యాగం ఎచ్చిరికల వలపోత
గయికి గయి గర్వంగా నిలవడ్డ ఈ దేశ
శిరస్సు మీది అంటరాని శిలాశాసనం తాతా!

జననం: ఆరెపల్లి, కోహెడ మండలం, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు(హిందీ పండిట్ గ్రేడ్- 2). కవితా సంపుటాలు: ఎగిలివారంగ(2008), పో ఇగ పొత్తు కల్వదు(2010), దండెడ(2011), మిగ్గు(2016). నవల: లంద(2019). 'ఎగిలివారంగ' కవిత్వం తెలంగాణ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. 'తెలుగు, హిందీ దళిత కవిత్వంలో వ్యక్తీకరణ-శిల్పం' అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు.

Leave a Reply