ఈ దేవుడికి విరుగుడు కావాలి..

నిమిషాలు గడుస్తున్న కొద్దీ
నాటకాలు రక్తికడుతుంటాయి
నీకంటూ ఓ సమయమొకటి ఉంటుందని
తెలుసుకోవడం పెద్ద సమస్యే ఎప్పడైనా
నీకోసం నువ్వు చేసే యుద్ధంలో
సమిధ పాత్ర ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది
అయినా నీ పాత్రని మార్చుకునే స్వేచ్ఛ లేదు

ఆకాశం ఉరుముల్ని మెరుపుల్ని
ప్రదర్శించటం మాత్రమే కాదు
అప్పుడప్పుడూ కన్నీరుమున్నీరౌతుంటుంది
నిర్మలాకాశాన్ని కలుషితం చేసే వ్యూహాలతో నిండిన
వికృత విన్యాసాల్లో హత్య చెయ్యబడని
పొద్దు ఒక్కటీ కనిపించదు

దేశంలో బుల్డోజర్ అవతారమెత్తిన
కొత్త దేవుడు వెలిశాడు
ఇంద్ర ధనస్సుకి కాషాయాలు పులిమి
పసి గొంతుల్ని నులుముతున్నాడు
మనుషుల్ని వెదురు బద్దల్లా చీల్చి
ఖండఖండాలుగా విసిరేస్తూ
భూమధ్యరేఖపై ఆధిపత్యం గోడ
కట్టాలనుకుంటున్నాడు

రాబోయే రోజులన్నీ మంచివని నమ్మించడానికి
ఇప్పుడందరూ వీధికో నినాదమై
ఎర్రజెండాను తలకెత్తుకోవాలి
విషాద సంకేతాలు ఎక్కడ కనిపించినా
భరోసా నిండిన ఎర్రని వాక్యాన్ని రాయాలి

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

8 thoughts on “ఈ దేవుడికి విరుగుడు కావాలి..

  1. భూమధ్య రేఖ పై ఆధిపత్యపు గోడ

Leave a Reply