ఈ తరం విమర్శ

ఈ పుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర, రాప్తాడు గోపాలకృష్ణ, పునరంకితం సత్యనారాయణ కనిపిస్తారు. ఈ నలుగురూ విరసం సభ్యులు. విప్లవ కవులు. వీళ్లు విప్లవ సాహిత్య చరిత్రలోని వేర్వేరు దశలకు చెందినవారు. భిన్న జీవన నేపథ్యాలతో రచనలోకి ప్రవేశించారు. తమ చైతన్యం వల్ల వేర్వేరు మార్గాల్లో విప్లవ సాహిత్యోద్యమంలోకి చేరుకున్నారు. వీళ్ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అంతకంటే ప్రత్యేకతలు ఉన్నాయి. విప్లవ సాహిత్యంలోని వస్తు శిల్ప దృక్పథ వైవిధ్యమంతా వీళ్లలో కనిపిస్తుంది. విప్లవాచరణలో, జీవితపు ఆటుపోట్లలో, చివరికి మరణంలో కూడా ఈ నలుగురిది నాలుగు దోవలు.

అలాంటి నలుగురి గురించి శివరాత్రి సుధాకర్ రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ నలుగురిని ఎంచుకొని ఉండవచ్చు. తన సాహిత్య, ఉద్యమ అభిరుచి వల్లనే ఇంత వైవిధ్యభరితమైన రచయితల గురించి రాసి ఉండవచ్చు. వీళ్లలో అలిశెట్టి ప్రభాకర్ తప్ప మిగతా ముగ్గురు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. సందర్భాలు ఎట్లా కలిసి వచ్చాయోగాని, ఈ సలుగురి గురించి సుధాకర్ వివరమైన వ్యాసాలు రాశాడు. ఈ కవులను ఇప్పటి పాఠకులకు పరిచయం చేయాలని మాత్రమే అనుకొని ఉండవచ్చు. కానీ ఆయన ఎంచుకున్న పద్ధతి వల్ల ఈ వ్యాసాలు కేవల పరిచయ వ్యాసాలుగా మిగిలిపోలేదు. సాహిత్య విమర్శ స్థాయికి చేరుకున్నాయి.

ఈ నలుగురు కవులు విప్లవోద్యమ ఆవరణలో సృజనకారులుగా ఎట్లా రూపొందిందీ అనేక వివరాలతో సాధికారికంగా సుధాకర్ వివరించాడు. ముఖ్యంగా అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర విప్లవ కవిత్వ చరిత్రలోకి విప్లవోద్యమ చరిత్రలోంచి ఎట్లా ప్రవేశించిందీ తార్కికంగా విశ్లేషించాడు. ఈ ఇద్దరి వల్లగాని, ఇలాంటి కవుల వల్లగాని తెలుగు కవిత్వంలో వ్యక్తమైన కొత్త ధోరణులను ఎత్తి చూపించాడు. విప్లవ ప్రజా పోరాటాలు లేకుంటే తెలుగు సాహిత్యం ఇంత మౌలికంగా మారి ఉండేది కాదు. కొత్త ఇతివృత్తాలు, కొత్త భాష, కొత్త వ్యక్తీకరణలతో తెలుగు సాహిత్యం విప్లవాత్మక మార్పులకు లోను కావడానికి విప్లవోద్యమమే కారణం. ఇది విప్లవ సాహిత్యోద్యమం ఆరంభం నుంచే కనిపిస్తుంది. చాలా ప్రత్యేకంగా విప్లవ సాహిత్యోద్యమంలోని రెండో తరం కవులు, రచయితలు దీన్ని మరింత ముందుకు తీసికెళ్లారు. దేనికంటే వాళ్లు అచ్చంగా ప్రజా పోరాటాల నుంచి ఎదిగి వచ్చారు. వీళ్లలో చాలా మందికి అంతకుముందు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ‘సంప్రదాయక’ సాహిత్య వారసత్వం లేదు. అట్టడుగు, నిరుపేద సామాజిక శ్రేణుల నుంచి ప్రజా పోరాటాల ప్రేరణతో కళా సాహిత్యాల్లోకి వచ్చిన కొత్త తరహా సాహిత్యకారులు వీళ్లు. సమాజాన్ని అతలాకుతలం చేసే వర్గపోరాటంలోని సృజనాత్మకత, ధిక్కారం వీళ్లలో ప్రతిఫలించింది. కాబట్టి వాళ్ల కవిత్వాన్ని కూడా ఆ పోరాట సంచలనాల వైపు నుంచి చూడాల్సిందే.

అకడమిక్ పద్ధతిలో పరిశీలించడానికి వీల్లేదు. సమాజానికి వెలువల, పోరాటాలకు ఆవల ఈ తరహా కవుల రచనలను పరిశీలించడానికి లేదు. సామాజిక సంబంధాలను తల్లకిందులు చేస్తున్న ప్రజాపోరాటాల వెలుగులో వ్యక్తులుగా, కవులుగా వీళ్లు ఎట్టా రూపొందారో చూడాలి. ఇలాంటి రచయితలను అర్ధం చేసుకోడానికి కొత్త తరహా సంవిధానం కావాలి. ఈ తరానికి చెందిన విప్లవ సాహిత్య విమర్శకుడిగా సుధాకర్ వాళ్ల వ్యక్తిగత, రచనా, ఉద్యమ జీవితాన్ని అంచనా వేయడానికి అలాంటి పద్ధతిని అనుసరించాడు. అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర, గోపి, సత్యనారాయణ కవులుగా, రచయితలుగా ఎదిగిన సామాజిక, ఉద్యమ, వ్యక్తిగత సంబంధాల మీది నుంచి ఈ వ్యాసాలు రాశాడు.

అందుకే ఈ వ్యాసాల్లో కవిత్వ విశ్లేషణతోపాటు ఆ కవిత్వ సమయ సందర్భాల్లోని ఉద్యమ విశ్లేషణ కూడా బలంగా ఉంది. కవిత్వ వస్తువుతోపాటు విప్లవోద్యమ వికాసం కనిపిస్తుంది. కవిత్వ శిల్పంతోపాటు వేర్వేరు ప్రజా పోరాట రూపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ కవులను ముందుకు తోసుకొచ్చిన వేర్వేరు ఉద్యమ దశల గుండా వాళ్ల కవిత్వ వస్తు శిల్ప సంబంధాలను సుధాకర్ వివరించాడు. కేవలం ఆ కవిత్వానికి నేపథ్యంలో ఉద్యమ విశ్లేషణ చేసే పద్ధతికి భిన్నంగా సామాజిక చైతన్యంగా, ఆచరణ రూపంగా కవిత్వంలోకి ప్రజా సంచలనాలు వ్యక్తమయ్యాయని నిరూపించాడు. దీనితోపాటు వీలైనంతగా వాచకంలోకి వెళ్లి కూడా సుధాకర్ పరిశీలించాడు. ఈ పని అలిశెట్టి ప్రభాకర్, సలండ్ర, సత్యనారాయణ కవిత్వంలోకంటే గోపీ కథల్లో ఎక్కువ చేశాడు.

అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర 1970ల మధ్య కాలానికి చెందిన రచయితలు. రాప్తాడు గోపాలకృష్ణ, సత్యనారాయణ 1990ల దశకానికి చెందిన రచయితలు. ఈ ముగ్గురిలో సత్యనారాయణ బహిరంగ ఉద్యమాల్లో పని చేస్తూ అరెస్టయి దాదాపు మూడేళ్లు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత విడుదలై అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లాడు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోని ఈస్ట్ డివిజన్ ఉద్యమంలోకి చేరాడు. దారకొండ ఘటనలో అమరుడయ్యాడు. కవిత్వంతోపాటు మిగతా సాహిత్య ప్రక్రియల్లో కూడా కృషిచేశాడు. 1990లలో ప్రజా ఉద్యమాల్లో పని చేస్తూ విప్లవ సాహిత్యోద్యమంతో కలిసి నడుస్తూ అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లిన డజన్లకొద్ది యువ రచయితల ప్రతినిధిగా సత్యనారాయణ ఈ పుస్తకంలో కనిపిస్తాడు. తెలుగు సాహిత్య చరిత్రలో 1990ల యువ అజ్ఞాత రచయితలు ఒక కొత్త వెల్లువను సృష్టించారు. వారిలో అమరులైనవారు, కొనసాగుతున్నవారు ఎందరో ఉండవచ్చు. బహుశా ఆ కాలానికి చెందిన రచయితలు ఇవాళ దండకారణ్య కథా చరిత్రను అత్యున్నత స్థాయికి తీసికెళ్లారు. మందమర్రి సత్యనారాయణగానో, లేదా దారకొండ సత్యనారాయణగానో విప్లవోద్యమ చరిత్రలో నిలిచిపోవలసిన సత్యం తన కవిత్వం, కథలు, విమర్శ రచనల సంపుటి ‘పునరంకితం’ పేరుతో సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందువల్ల సహజంగానే శివరాత్రి సుధాకర్ తన సాహిత్య విమర్శకు ‘పునరంకితా’న్ని ఎన్నుకొని ఉండవచ్చు. సత్యనారాయణ జీవిత, రచనా, ఉద్యమ క్రమాలన్నిటినీ కలిపి ఈ వ్యాసం రాశారు, బహిరంగ, నిర్బంధ, అజ్ఞాత జీవిత ప్రవాహాలను ఒరుసుకొని సత్యనారాయణలో సృజనాత్మకత ఎట్లా వెల్లివిరిసిందో ఈ వ్యాసంలో నిరూపించాడు. అజ్ఞాత కవిని తెలుసుకోవడన్నా, అజ్ఞాత కవిత్వాన్ని చదువుకోవడమన్నా విప్లవోద్యమంతో కలిపి విశ్లేషించడమే. ఈ మౌలిక ప్రమాణాన్ని సుధాకర్ చాలా చక్కగా పాటించాడు.

ఈ పుస్తకంలోని ఒక ప్రత్యేకత ఏమంటే రాప్తాడు గోపాలకృష్ణ సాహిత్యాన్నంతా దాదాపుగా సుధాకర్ పరామర్శించాడు. మొదట ఆయన కవిత్వం మీద ఒక వ్యాసం రాశాడు. 1990లనాటి గోపి తరం విప్లవ కవిత్వ చరిత్రలోకి ఒక కొత్త కెరటంలా వచ్చింది. చాలా సంక్లిష్టమైన జీవితానుభవాలు, ఉద్వేగాలు, దృక్కోణాలు ఆ దశాబ్దం విప్లవ కవిత్వంలోకి వచ్చాయి. గోపి తనవంటి కవుల గురించి, కార్యకర్తల గురించి ‘నూతన ఆర్థిక విధానాల తరం’ అనేవాడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలుగా కూడా ప్రత్యక్షంగా బలపడుతున్న కాలపు ఇతివృత్తాలు తన కథల్లోకి వచ్చాయి. కవిత్వంలో అస్పష్టంగా ఉన్న ఆ కాలపు వ్యథనంతా అత్యంత సరళంగా, ప్రయోగాత్మకంగా కథల్లోకి తీసుకొచ్చాడు. విప్లవ కథ 1990లనాటి ఎదుగుదల వెనుక గోపి ఆరాటం, సున్నితత్వం, లోచూపు కనిపిస్తాయి. ఈ దృష్ట్యా ఆయన కవిత్వంలాగే కథలను చాలా ప్రత్యేకంగా పరిశీలించాలి. అదీ ఆనాటి అనంతపురం స్థానీయ, ఉద్యమ స్థలకాల ప్రత్యేకతల్లో, గోపి కథల్లోని మాండలిక సౌందర్యమే కాదు, కథా ఇతివృత్తాలు, ఉద్యమ ప్రేరణలు కూడా అనంతపురానివే. చివరి సంవత్సరాల్లో కర్నూలులో ఉన్నా అనంతపురం నుంచే తన ఉద్వేగాలన్నీ పలు ఇతివృత్తాల మీదికి ప్రసరించేవి.

అందువల్ల చాలా వివరంగా రాయవలసిన లోతు ఆయన కథల్లో ఉంది. ఈ పుస్తకంలో గోపీ కథల గురించిన వ్యాసాలు ఆ లోతును పట్టుకొనే ప్రయత్నం చేశాయి. సుమారు ఇరవై పాతికేళ్ల తర్వాత ఇప్పుడు సుధాకర్ ఈ కథలను చాలా తాజాగా చదివి ఈ వ్యాసాలు రాశాడని పాఠకులకు నమ్మకం కలుగుతుంది. బహుశా గోపి తన పసి వయసులో గుర్తించిన మానవ సంబంధాల సంక్లిష్టత ఇప్పటికీ తీరలేదు. ఆ సంఘర్షణ తెరపినపడలేదు. ఆ రాపిడి పరిష్కారం కాలేదు. అందుకే సుధాకర్ ఇవ్వాల్టి కథల్లాగే వాటిని పరామర్శించి విశ్లేషించాడు.

గోపి కథల మీద రాసిన వ్యాసాల వల్ల ఒక విషయం స్పష్టమైంది. సుధాకర్ కు కథలను లోతుగా చదివే చూపు ఉందని, కథ అంతరార్థాలను పట్టుకొనే సామర్థ్యం ఉందని రుజువైంది. ఎప్పటికైనా కవిత్వానికంటే కథలు, నవలలే విమర్శకులకు ఎక్కువ పని పెడతాయి. విమర్శకుల సత్తాను నిగ్గుదేలుస్తాయి. వచనాన్ని అర్థం చేసుకోవడం విమర్శకు షరతు అనే పరీక్ష పెడతాయి. గోపి కథలు పైకి చాలా సరళంగా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన, లలితమైన, దుఃఖకరమైన భావన లోపల ఉంటుంది, పదునైన చూపుకు, ఆర్ద్రమైన మనసుకు మాత్రమే ఆ జీవితానుభవం పలికే భావన అందుతుంది. అలాంటి కథలను పదుగురు ఒప్పుకొనేలా సుధాకర్ పరామర్శించాడు. సుధాకర్ వచనం బాగుంటుంది. సరళంగా, తేలిగ్గా హాయిగా చదువుకోవచ్చు. కాకపోతే ఆలంకారికత ఎక్కువ. చాలాచోట్ల అది బాగా ఉందనిపిస్తుంది. కొన్ని చోట్ల భారం అనిపిస్తుంది. ఈ రెండు రకాలుగా కూడా ప్రభావశీలంగానే సాగుతుంది. కానీ విమర్శ అంటే అంతిమంగా విశ్లేషణే. మరెవరి చూపు ప్రసరించని తావులకు వెళ్లి విప్పి చెప్పడమే. దానికి తగిన వ్యాఖ్యాన భాష అవసరం. సామాజికశాస్త్ర భావనలు అవసరం. వాటిని వీలైనంత ఒడుపుగా, సృజనాత్మకంగా వాడే మెలకువ అవసరం.

సమకాలీన సాహిత్యం విమర్శకులకు కొత్త సవాళ్లు విసురుతోంది, అనుకూలంగానూ, ప్రతికూలంగానూ, జీవితమూ, సమాజమూ, ఉద్యమ ప్రపంచమూ అనేక జటిలమైన సవాళ్ల మధ్య నుంచి విస్తరిస్తున్నాయి. వాటి ప్రతిఫలనమైన సాహిత్యమూ అంతే. విమర్శ దాన్ని అందుకోవాలి. రూపొందుతున్న భవిష్యత్ కు తగినట్లు విమర్శ తయారు కావాలి. ఈ తరం విప్లవ సాహిత్య విద్యార్థిగా శివరాత్రి సుధాకర్ లో విమర్శ దినుసు ఉంది. విమర్శ వ్యక్తిత్వం ఉంది. సమాజ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విమర్శ అవసరం పట్ల ఎరుక ఉంది. వీటన్నిటికి పదునుపెట్టు విప్లవ దృక్పథం ఉంది. ఈ పుస్తకం ఆ హామీ ఇస్తోంది. ఇక తను చేయాల్సిండల్లా విమర్శను విప్లవాచరణగా నిరంతరం కొనసాగించడమే.

(‘ఏరువాక’ పుస్తకానికి రాసిన ముందుమాట)

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

Leave a Reply