ఇవాళ కావలసిన కొలిమిరవ్వల జడి

ఊరుమ్మడి కొలిమి మాయమయ్యింది. దున్నెటోడు లేడు. నాగలి చెక్కెటోడు లేడు. కర్రు కాల్చుడు పనే లేదు. కొలిమి కొట్టం పాడువడి, అండ్ల దొరవారి గాడ్దులను కట్టెయ్యడం మొదలైంది. ఊళ్ళ రాతెండి పాత్రలు కొనే శక్తి ఎవ్వరికి లేక కంచరోల్ల కొలిమి బూడిదైపోయింది. తిననీకి తిండె లేదంటె బంగారి ఎండి సొమ్ములు చేసుకునేదెవ్వరు? ఔసులోల్ల కొలిమి కూడ కూలిపోయింది. ఒక్కటి గుడ లేకుండ ఊళ్ల ఉన్న కొలుములన్ని ఆరిపోయినయి. ఊళ్ల నిప్పు బుట్టని పాడుకాలమొచ్చింది. ఊరుమ్మడి కొలుములైతే కనబడకుండ పోయినయి. దొరవారి సొంత పనులకు గడీల కొలుముల తీర్గ కనబడేవి ఉన్నయి గాని, ఇచ్చంత్రం, ఆ కొలుముల్ల మంట ఎర్రగొస్త లేదు, తెల్లగ దయ్యం లెక్క ఉన్నది. అక్కడక్కడ పేదసాదలు ఇండ్లల్ల కొలుములు బెట్టుకుంటున్నరని మాటెల్లింది గాని ఊదు గాలది, పీరి లేవది.

అగో గప్పుడు ఊరికి మళ్ల ఒక కొలిమి అవసరం వచ్చింది. ఊరుమ్మడి కొలిమి అవసరం వచ్చింది. సబ్బండ కులాల మనుషులు వచ్చి గలగలలాడే కొలిమి. కమ్మరికి దినమూ రాత్రి ఇరాం ఇయ్యని కొలిమి. ప్రతి ఒక్కరూ కట్టెపుల్లలు తెచ్చి, బొగ్గులు తెచ్చి, ఊదుడు గొట్టం ఊది, తిత్తి గొట్టి రాజబెట్టె కొలిమి. ప్రతి ఒక్కరూ ఒక ఇసిరె తెచ్చే కొలిమి. ప్రతి ఒక్కరికి ఒక ఇసిరె ఇచ్చే కొలిమి. అన్నా, అక్కా, తమ్మీ, చెల్లే, బావా, మరదలా అని మాటల రవ్వలు ఎగిసిపడే కొలిమి.

అటువంటి కొలిమి మళ్ల కావాలని ఊరు కల గన్నది. ఒక్క కొలిమి గాదు, ఇంటింటికీ ఒక ఊరుమ్మడి కొలిమి, ఊరూరికీ వందల కొద్ది అందరికీ చెందిన కొలుములు, వందలాది వేలాది కావాలని సమాజమే ఎదురుచూసింది.

అట్ల మళ్ల కొలిమి పుట్టింది. కరాల సత్తువతోటి తిత్తి నిండింది. ఊపిరి తిత్తులు మొత్తం ఊదుడు గొట్టంలకు దిగినయి. హృదయపు ముక్కలు బొగ్గు కణికలైనయి. మునివేళ్లు మంటను మళ్లేసినయి. చూపులు మంటల నాలికలను మెలితిప్పి దారి చూపినయి. కొలిమి రాజుకున్నది. కొలిమి భవిష్యత్తును వాగ్దానం చేసింది.

ఇది ఎప్పటిదో పాత కథ కాదు. ఇప్పుడు జరుగుతున్న, జరగవలసిన కథే.

నిజంగా ఎప్పుడో జరిగినదీ కాదు. అట్లని జరగనిది కూడ కాదు.

మనిషిని మనిషికి కాకుండా చేస్తున్న, మనను మనకు కాకుండా చేస్తున్న ఒక మహమ్మారి మన ఊళ్లనూ, మన సామూహిక జీవనాన్నీ, మన ఆనందాలనూ, మన సంస్కృతినీ దెబ్బ తీస్తున్నప్పుడే మన కళా సాహిత్యమూ కూడ అణగారిపోయినై. ఒక కొలిమి మూతపడ్డదంటే ఒక వృత్తి అంతరించిందని మాత్రమే కాదు, ఒక సామూహిక జీవన సౌందర్యం అస్తమించిందని. ఒక అద్భుత కళానైపుణ్యం విధ్వంసమవుతున్నదని. ఒక కళాసాహిత్య సాంస్కృతిక వారసత్వం అణగారిపోతున్నదని.

ఇవాళ తెలుగు సాహిత్య స్థితిని, దుస్థితిని నిశితంగా, ఆందోళనగా చూసినప్పుడు మాకు కలిగిన ఆలోచనలివి. తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక వర్తమాన దృశ్యం మాకు అంతరించిన, అంతరిస్తున్న కొలిమినే గుర్తుకు తెచ్చింది. కొలిమిని మళ్లీ నిలబెట్టవలసిన, కాపాడవలసిన, పెంపొందించవలసిన, రాజెయ్యవలసిన అవసరం తెలిసివచ్చింది. సమాజం మా మీద పెట్టిన బాధ్యత మమ్మల్ని కొలిమిలో నిప్పు కణికలుగా మార్చింది.

వ్యవసాయం అవసరం లేని, వ్యవసాయ పరికరాల కమ్మరి కొలిమి అవసరం లేని, కంచరి పాత్రలు అవసరం లేని, కంసాలి కళాకౌశల అలంకరణలు అవసరం లేని ఒక నిరామయ, నిస్తబ్ద, నిరాశాపూరిత వాతావరణం మన ఊళ్లను ఎట్లా కమ్మేసిందో, సరిగ్గా అట్లాగే జీవితం అవసరం లేని, సమాజం పట్టని, రాజకీయాలకు దూరం జరిగే, ఆర్థిక పరిణామాల ప్రతిఫలనాన్ని విసుగ్గా చూసే ఒక కొత్త తరం సాహిత్య కారులు పుట్టుకొస్తున్నారు. జీవితాన్ని శాసించే సకల రంగాలనూ, వ్యవస్థలనూ పక్కకు తోసి వీళ్లింకా జీవితం గురించి రాస్తున్నామనే భ్రమ పడుతున్నారు. జీవితానికి ఒక నిస్సారమైన నిర్వచనం ఇచ్చుకుని తమ సొంత ఊహాలోకాల, వయ్యక్తిక ఆవేశ కావేషాల చిత్రణనే సాహిత్యంగా ప్రకటిస్తున్నారు. వాస్తవ జీవితం నుంచి పలాయనమే సాహిత్యానికి ప్రమాణంగా మారే ప్రమాదం మెల్లమెల్లగా చాపకింద నీరులా చుట్టుకుంటున్నది. తెలుగు సాహిత్యం మీద కరవు మహమ్మారి పరచుకుంటున్నది. ఇది ఇట్లాగే కొనసాగితే పైన చెప్పినట్టు క్రమక్రమంగా ఒక్కొక్క పరిణామమూ సంభవించి ఊరు బెగ్గంపాడైనట్టే సాహిత్యమూ బెగ్గంపాడవుతుంది.

ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఊరుమ్మడి సాహిత్య సంప్రదాయం గురించి, కొలిమి దగ్గరి సామూహిక జీవనం గురించి తెలిసిన, ఆలోచించే, కలగనే, తపనపడే సాహిత్యకారులు ఇంకా ఉన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న యువసాహిత్యకారులూ ఉన్నారు. కావలసిందల్లా వారందరినీ ఒక్కదగ్గరికి తెచ్చే వేదిక. మానవ సంబంధాలను రాజేసే, అంతరాలు లేని, అసమానతలు లేని మానవ భవిష్యత్తును కలగనే, ఆ సురుచిర స్వప్నాన్ని అందరితో పంచుకునే ఒక సాహిత్య వేదిక కావాలి. ఇప్పటికే ఆ పనిలో ఉన్న వేదికల పనిని బలోపేతం చేసే మరొక వేదిక కావాలి. కొలిమి అందుకే పుడుతున్నది. జననం ముదావహం కనుక మాత్రమే కాదు, ఈ కొలిమి ఒక స్వప్నంతో జన్మిస్తున్నది గనుక కొలిమిని ఆదరించండి, కొలిమి కంటున్న కలల రవ్వల జడిని వ్యాపింపజేయండి. కొలిమిలో మీరూ భాగం కండి.

5 thoughts on “ఇవాళ కావలసిన కొలిమిరవ్వల జడి

    1. కొలిమి బాగా జ్వలించాలని కోరుతూ

  1. సామాన్యుడి జీవితం ఇప్పుడు గానుగలోనలిగిన చెరుకు పిప్పి తీరుగయ్యింది. పశ్చిమ ప్రపంచం మన నట్టింట్లో వెదజల్లిన అంతరజాలం యంత్రజాలాల మధ్య రేసులు తరిమిన కుణలోలిగా తనదిగాని అలివిగాని పరుగు పెడుతున్న పరిస్థితి. వేరుపురుగు తొలిచిన మాను తీరుగా కూలిపోతోంది జీవితం. ఆగి అలుపుతీర్చుకొనే పరిస్థితిగాని,ఆత్మీయత అనుబంధాలను యాజ్జేసుకునే , ఓపిక ఒడుపు రెండు పట్టుతప్పాయి.ఇప్పుడు మనిషి తననుతాను పుటం పెట్టుకోవాలి.నల్దిక్కులనుంచి అల్లిబిల్లిగా అల్లుకొని ఆక్రమిస్తున్న రాకాసి తీగలను పోతంబట్టాలె . అందుకు చేతులున్న ఇసిరేలను పదును బెట్టాలీ . గిందుకోసరమే కొలిమి రాజేతున్న మన సహితగాళ్లకు వందనం. నిప్పు కనికల్ని కంచుల్లాకేతి పంచుదాం నిప్పురపోకుండా కాపాడుకుందాం
    బాల్రెడ్డి
    ప్రాకృతిక రైతు

  2. కొలిమికి స్వాగతం. ప్రజాసాహిత్య సృష్టి సన్నగిల్లుతున్న నేటి పరిస్థితులలో, సృజనను అవార్డుల కోసం కీర్తి కోసం వృత్తిగా మార్చుకుంటున్న నేటి దశ లో ఏ స్వప్రయోజనాలూ ఆశించక జనబాహుళ్య ఉద్యమదివిటీగా సాహిత్య సృజన వెలుగులు విరజిమ్మవలసి ఉంది. ఆ నేపధ్యపు అవసరాన్ని కొలిమి తీరుస్తుందని ఆశిస్తూన్నాను.

  3. ఇపుడే కొలిమి పత్రికని చూసాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిశెట్టి రజిత అక్క, సుధాకర్ నాకు బాగా తెలిసిన వారు. మిగతా సంపాదకులందరూ నిబద్ధత కలిగిన వారని అర్థం అయింది. ప్రజాస్వామిక దృక్పథం కలిగిన అన్ని రచనలకి కొలిమి వేదిక కావాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం వెనుక ఉన్న వారందరికీ అభినందనలు

Leave a Reply