ఇవాళ్టి సందర్భానికి ఆనాటి అజరామర గీతాలు

అజరామర అనే సంస్కృత విశేషణం చాలా సందర్భాల్లో అనవసరంగా కూడా వాడి వాడి అరిగిపోయి, అర్థంలేనిదిగా మారిపోయింది. కాని అది నిజంగా వర్తించే, అన్వయించే సందర్భాలూ, వ్యక్తులూ, కళా సాహిత్య సృజనలూ ఉంటాయి, ఉన్నాయి. అది అజర – వృద్ధాప్యం లేనిది, నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో, ఉజ్వలంగా ఉండేది. అది అమర – మరణం లేనిది, నిరంతర సజీవత్వంతో, అనంత ప్రాసంగికతతో, ఉత్సాహం, ఉత్తేజం చిప్పిల్లుతూ ఉండేది.

చరిత్రలో బానిసల తిరుగుబాటు, బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం, నక్సల్బరీ ప్రజ్వలన వంటి అటువంటి అజరామరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్పార్టకస్, లెనిన్, భగత్ సింగ్, మావో, చారు మజుందార్ వంటి ఎందరో అజరామర వ్యక్తులున్నారు. మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక, గోర్కీ అమ్మ, మయకోవస్కీ లెనిన్ వంటి అజరామరమైన రచనలున్నాయి.

ఈసారి హైదరాబాద్ బుక్ ఫేర్ లో పుస్తకావిష్కరణల సందర్భంగా సంధ్యక్క పాడిన రెండు పాటలు (శివసాగర్ రాసిన ‘తోటారాముని తొడకు కాటా తగిలిందాని’, అజ్ఞాతకవి రాసిన ‘ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే’) వింటుంటే తెలుగు సాహిత్యంలో కూడా అటువంటి అజరామర రచనలెన్నో ఉన్నాయని, ఈ పాటలు రెండూ అక్షరాలా ఆ విశేషణానికి తగినవని అనిపించింది. అటువంటి అజరామర రచనలను కొత్త తరానికి నిరంతరం పరిచయం చేస్తుండాలని అనిపించింది. అవి రాసిన సందర్భానికి ఎంత అనివార్యమైనవో, అవసరమైనవో, ఐదు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా అంతే అనివార్యంగా, అవసరంగా ఉన్నాయి. అవి మొదటిసారి విన్న 1973, 74ల్లో ఎట్లా కన్నీరు పెట్టించాయో, ఎంత ఉద్వేగాన్నీ, ఉత్తేజాన్నీ, ఆశనూ ఇచ్చాయో యాబై రెండు సంవత్సరాల తర్వాత కూడా అంతే గాఢమైన అనుభవంగా ఉన్నాయి.

**

‘తోటారాముని తొడకు కాటా తగిలిందానీ’ అనే మొదటి పాదంతో సుప్రసిద్ధమైన గీతం శీర్షిక ‘ఓ! విలుకాడా!’, కవి రెంజిమ్. శ్రీకాకుళంలో 1969 జనవరిలో పోలీసులతో సాయుధ ఘర్షణలో చనిపోయిన తొలి అమరవీరుడు ఆరిక రెంజిమ్. విప్లవోద్యమ నాయకుడు, కవి శివసాగర్ (కె జి సత్యమూర్తి) 1971 నుంచే తన కలంపేర్లలో ఒకటిగా రెంజిమ్ పేరు పెట్టుకున్నారు. ఆయన జైలు నుంచి పంపిన ఈ పాట ఆ పేరుతోనే సృజన అక్టోబర్ 1973 సంచికలో అచ్చయింది. అక్టోబర్ 4-7 తేదీల్లో హనుమకొండలో జరిగిన విప్లవ రచయితల సంఘం మొదటి సాహిత్య పాఠశాల నాటికి ఆ సంచిక విడుదల అయింది. అప్పటికి శివసాగర్ రాసిన అన్ని పాటలకూ బాణీ కట్టి, పాడిన, అప్పటికే ‘చెల్లీ చెంద్రమ్మా’ (అది కూడా రెంజిమ్ పేరుతోనే సృజన జూన్-జూలై 1971 సంచికలో అచ్చయింది) పాటతో సుప్రసిద్ధుడైన ఎన్ కె ఆ నాలుగు రోజుల సభల్లోనూ, ఆ తర్వాతా ఈ పాట ఎన్నోసార్లు పాడాడు. 1980ల తర్వాత ఎన్నెన్నో జననాట్యమండలి పాటల వెల్లువలో ఈ పాట తక్కువగానే వినిపించినా, సంధ్యక్క వంటి కొందరు గాయకులు ఈ పాటను ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు.
1979 జనవరిలో విరసం మూడో సాహిత్య పాఠశాల మళ్లీ వరంగల్ లోనే జరిగినప్పుడు అప్పటికి బెయిల్ మీద విడుదలై ఉన్న సత్యమూర్తి ఆ సభల్లో పాల్గొని జనవరి 14న ‘తోటారాముని పాట ఎలా పుట్టి పెరిగింది’ అని అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఆ వివరణ అరుణతార 1979 ఫిబ్రవరి – మే సంచికలోనూ, ఆ తర్వాత వెలువడిన శివసాగర్ సంపుటాలలోనూ అచ్చయింది.

శ్రీకాకుళ విప్లవోద్యమ నాయకుడు వెంపటాపు సత్యనారాయణను పోలీసులు కాల్చిచంపినప్పుడు తాను బాధ పడుతుంటే, ‘తుపాకి గుండు గుండెకు తగల్లేదు, తొడకు తగిలింది’ అని ఒక రైతు అన్నాడట. గుండెకు తగిలిందంటే చనిపోవడమే, అంతమే. తొడకు తగిలిందంటే అంటే మళ్లీ కోలుకుంటారు అని అర్థం. అంటే ఆ రైతు మాటల్లో ఉద్యమం మళ్లీ కోలుకుంటుంది అని అర్థం వినిపించిందట. సత్యం హత్య 1970 జూలై 10న జరిగితే కొన్ని నెలల తర్వాత ఈ మాట విన్న శివసాగర్ అక్టోబర్ లో ‘సత్యం చావడు(దు)’ అని ఒక కవిత రాశారు గాని పాట కూడా రాయాలని అనిపించిందట. “కాని, ఆ భావం రాగానే రాయలేం. దానికి సరిపడే రూపం దొరకాలి” అనీ, “అది రెండేళ్ల తర్వాత దొరికింద”నీ శివసాగర్ ఆ ఉపన్యాసంలో అన్నారు.

తాను ఆదిలాబాద్ కొండల్లోకి వెళ్లినప్పుడు, మామూలు మాటలు కూడా చాలా కవితాత్మకంగా మాట్లాడే పరధాను తెగకు చెందిన ఒక వ్యక్తి, ‘చిలక చీటీ తెచ్చిందే, నువ్వొస్తావని’ అన్నాడట. ఇక అక్కడ మొదలు పెట్టి చిలుక చీటీ తెచ్చింది, మైనా మతలబు చేసింది, కంజు కన్నీరు పెట్టింది అని అల్లుకుంటూ పోయాను అని ఆయన అన్నారు. మరి అలా కొనసాగడానికి చాలా చెట్ల పేర్లు, పిట్టల పేర్లు కావాలనుకున్నానని, కాని అడవిలో అలా అడగడం కుదరక చాలా కాలం ఆ గీతం అలాగే ఉండిపోయిందని అన్నారు. తాను 1972 నవంబర్ లో అరెస్టయి, ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు, అప్పటికి ఉరిశిక్ష పడి అదే జైల్లో ఉన్న భూమయ్య, కిష్టాగౌడ్ లతో కలిసి ఉన్నాననీ, ఆదిలాబాద్ అడవుల్లో ఉండే ముప్పై నలబై పిట్టల పేర్లు కిష్టాగౌడ్ చెప్పారని అన్నారు. అలా ఈ గీతం రాయడానికి అవసరమైన సరుకులు, పనిముట్లు, కవితాసామగ్రి దొరికిందనీ, ‘వెంపటాపు సత్యం చనిపోయినా ఉద్యమం ఆగదు, చనిపోదు, ఒకవేపు భూస్వాములు, మరొకవేపు అశేష జనసామాన్యం ఉన్నంతవరకూ ఈ పోరాటం ఆగదు’ అనే రాజకీయభావం జోడించానని శివసాగర్ అన్నారు.
అప్పటికీ ఆ గీతం పూర్తి కాలేదని, తర్వాత విశాఖపట్నం జైలుకు మార్చిన తర్వాత, అప్పటికే ఉద్యమం నుంచి వెళ్లిపోయిన, పోదలచుకున్న కొందరు రాజకీయ ఖైదీలు గెరిల్లాలను విమర్శిస్తూ ‘వాళ్లు హంతకులు, వ్యక్తిగత హింసావాదులు, దౌర్జన్యవాదులు’ అని కోర్టు ప్రకటనలు ఇస్తున్నప్పుడు, విప్లవకారులు ఎట్లా ప్రజల్లో అవిభాజ్య భాగమో చెప్పాలనిపించిందని శివసాగర్ అన్నారు. వెంపటాపు సత్యం హత్య తర్వాత రాయాలనుకున్న ఈ గీతం రెండున్నర సంవత్సరాల తర్వాత కొల్లిపర రామనరసింహరావు హత్యతో, ఆయన గురించి ఒక చరణం కూడా కలిపి పూర్తి చేశానని అన్నారు.

ఈ గీతం ఎలా పుట్టి పెరిగిందో కవి స్వయంగా చెప్పిన వివరణ అది తయారైన పద్ధతిని చెపుతుంది. ఆ గీతపు అర్థమూ, కొనసాగింపూ, తదనంతర కాలపు ప్రాసంగికతా కూడా తెలుసుకోవాలి.

ఒక వ్యక్తి తొడకు గాయమైంది. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, విప్లవకారుడు. అందువల్ల ఆ విషాదవార్తకు ప్రకృతి విచారించడం, విలపించడం మొదలయింది. ఇంతకూ మొదట ఆ విషాద ఘటన ఎట్లా జరిగిందో తెలుసుకోవాలి. ప్రశాంతమైన పూలదారుల్లో సాగుతున్న ఆ వ్యక్తి మీదికి సాయంకాలపు చీకట్లో పులి దాడి చేసింది. ఆ దాడి ఎలా జరిగిందో చెప్పాక, మళ్లీ ప్రకృతి విషాద ప్రకటన పునరుక్తమవుతుంది. ప్రకృతి నుంచి సహజంగా సమాజంలోకి విస్తరించి, పల్లె తల్లడిల్లిందని, అడవి హడలిపోయిందనీ, వాగు జలజల, వలవల ఏడ్చిందని, ఆ గాయం పట్ల, ఆ నష్టం పట్ల స్పందనలో ప్రకృతికీ మనిషికీ సమాజానికీ అభేదం చూపుతారు. పడిపోయిన విప్లవకారుడికి ఆ పల్లె జనం, ఆ అడవి జనం సపర్యలు చేశారు. తిండి తెచ్చారు, మందు ఇచ్చారు, గాయానికి కట్టు కట్టారు.

విప్లవకారుడు తేరుకుని కళ్లు తెరిచి నవ్వాడు. మళ్లీ ప్రకృతి కూడా పులకించింది. కథ చెపుతున్న గాయకుడి కళ్ల నీరు నిండింది. అప్పుడే తేరుకున్న విప్లవకారుడికి ఇంకా శక్తి ఇవ్వడానికి మళ్లీ ప్రకృతి ఎన్నెన్నో సహకారాలు అందించింది. విప్లవకారుడు నవ్వి లేచి నిలిచాడు. అడవి అలలుగా లేచింది. పల్లె తానే విల్లంబు అయింది. కథకుడి గుండె రవరవలాడింది. ఆ విప్లవకారుడు ఎటువంటివాడు? మిత్రులకు ప్రాణం, శత్రువుపై బాణం, సమాజం చేతుల్లో ఖడ్గం, బల్లెం, అడవి గుండెల్లో గీతం. కల్లాకపటం లేని మనిషి. మరి ఏం నేరం చేశాడని దాడి జరిగింది అనే ప్రశ్న వేసి కథకుడు జవాబును శ్రోతలకే వదిలేస్తాడు. ఆ దాడి చేసిన పులి గురిమెళ్ల అడవిలో గుర్రు పెడుతున్నది, మనిషి నెత్తురు మరిగి మత్తెక్కి ఉంది, దాని గుండెల్లో గురిచూసి దెబ్బకొడితే, దానివల్ల తొడకు గాయమై పడిపోయి, ప్రజల మద్దతువల్ల లేచినిలిచిన విప్లవకారుడి పేరు అడవిలో నిలపగలం. అందుకోసం కథకుడు తన చెలికాళ్లనూ, విలుకాళ్లనూ విల్లంబు సారించమనీ, బల్లెం చేపట్టమనీ, అలా చేస్తేనే తమ మధ్య చెలిమిని నిలబెట్టినట్టు అనీ చెపుతున్నాడు.

శత్రువు చేసే గాయాల వల్ల విప్లవాచరణకు తాత్కాలిక విరామం రావడమూ, ప్రజల సహకారంతోనే ఆ విప్లవాచరణ తేరుకుని కొనసాగడమూ ఈ గీతపు మౌలిక సారాంశం. ఈ గీతం రాసిననాడు గానీ, ఇవాళ గానీ తోటారాముడు ఒక వ్యక్తి కాదు, ఒక నామవాచకం కాదు, అనేకానేకమంది వ్యక్తుల, సర్వనామాల సముదాయానికి ప్రతీక. ఇవాళ ఆ సముదాయానికే, సమాజానికే కాటా తగిలింది, తగులుతున్నది. ఇప్పుడు ప్రకృతీ సమాజమూ మనిషీ ఏమి చేయవలసి ఉంటుందో చెపుతున్న గీతం ఇది. నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమాలు వెనుకంజ వేసిన 1971-74 కాలంలో రాసిన ఈ గీతం అప్పుడు ఎంత సమకాలికమైనదో, అవసరమైనదో ఐదు దశాబ్దాల తర్వాత మనం అనుభవిస్తున్న మరొక గడ్డుకాలంలోనూ అంతే సమకాలికమైనది, అవసరమైనది.

**

‘విప్లవాగ్నులు’ అనే గీతం మొదటిసారి ‘శంఖారావం’ అనే కవితల, పాటల సంకలనంలో అచ్చయింది. సోషలిస్టు పబ్లికేషన్స్, పెనుమాక ప్రచురణగా 1972 జూన్-జూలైల్లో వెలువడిన ‘శంఖారావం’లో పార్వతీపురం కుట్రకేసులో నిందితులుగా విశాఖపట్నం జైలులో ఖైదీలుగా ఉండిన నిరక్షరాస్య ఆదివాసులు, ఎంతో కొంత చదువుకున్న విప్లవోద్యమ కార్యకర్తలు రాసిన పాటలు, సీస పద్యాలు, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి కవితలు, పాటలు కూడా ఉన్నాయి. విప్లవోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి రచనల తొలి సంకలనం ఇది. శంఖారావం తర్వాత ‘విప్లవాగ్నులు’ పాట అనేక చోట్ల పునర్ముద్రణ అయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దాదాపు 1972-73 నుంచీ చలసాని ప్రసాద్ గొంతులో వందలాది సందర్భాల్లో వేలాది మంది విన్నారు. ఎందరో జననాట్యమండలి, ప్రజాకళామండలి గాయకులు కూడా ఈ పాట పాడారు.

‘శంఖారావం’ కవులు తమ ఆశావహమైన కవితలు, పాటలు రాసిన సందర్భం నిజానికి భయంకరమైన నిరాశామయమైనది. శ్రీకాకుళ విప్లవోద్యమ నాయకత్వమంతా తుడిచిపెట్టుకుపోయింది. గ్రామాల మీద దాడులతో శ్రీకాకుళ విప్లవోద్యమ ప్రాంతమంతా భయ భీతావహంలో మునిగిపోయింది. వందలాది మంది ఆదివాసులు, హత్య కాకుండా మిగిలిపోయిన విప్లవోద్యమ కార్యకర్తలు పార్వతీపురం కుట్రకేసు ఖైదీలుగా జైలులో మగ్గుతున్నారు. ఈ పాట రాసిన కవి కూడా ఎప్పుడు విడుదలవుతానో తెలియని స్థితిలో జైలులో ఉన్నారు. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలను 1970 జూలై 10న కాల్చేశారు గనుక ఈ పాట 1970 ఆగస్ట్ తర్వాత, పుస్తక ప్రచురణ అయిన 1972 జూన్ కు ముందు రాసి ఉంటారు.

అటువంటి దుర్భర పరిస్థితులలో ఆశను ప్రకటించిన, ఉత్తేజాన్ని నింపిన గీతం ఇది. ‘ఎంకెవ్వరని లోకమెపుడైన అడిగితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు’ అని నండూరి సుబ్బారావు అప్పటికే రాశారు గాని దానికి కూడా జానపద మూలం ఏదో ఉండవచ్చు. ‘విప్లవాగ్నులు’ కవి ఎంకి పాటల ప్రేరణతోనో, లేదా ఆ జానపద గీతం ప్రేరణతోనో ఇది రాసి ఉండవచ్చు.

సత్యం అనే మాటను విప్లవోద్యమ నాయకుడైన వ్యక్తి పరంగానూ, విప్లవలక్ష్యం పరంగానూ చెపుతూ, సత్యం, గిరిజనులు వేరు వేరు కాదని, సత్యమే గిరిజనులు, గిరిజనులే సత్యమని, సత్యమే నిత్యమని ఈ గీతం చెప్పింది. మూడు దశాబ్దాల తర్వాత విప్లవాన్ని వ్యతిరేకించే మేధావులు చేయబోయే ‘ప్రజలు – విప్లవకారులు’ విభజనను ముందే పటాపంచలు చేసిన గీతం అది. ఆనాటికి ఉద్యమానికి వర్గ శత్రు నిర్మూలనా సిద్ధాంతం, ఖతం కార్యక్రమం ఉన్నాయి గనుక ఆ నిర్దిష్ట చారిత్రక స్థితికి అద్దం పడుతూ, ‘శత్రువుల ఖతములో తృప్తి’ గురించి కూడా చెప్పిన గీతం ఇది. (ఎమర్జెన్సీ తర్వాత 1979 జనవరిలో విరసం ప్రచురించిన ‘పోరాట పాటలు’ పుస్తకంలో ఆ పాదాన్ని ‘శత్రు నాశనములో తృప్తి’ అని వేశారు గాని, ఆ తర్వాత అచ్చయినప్పుడు, పాడినప్పుడు ఆ మార్పు కొనసాగినట్టు లేదు.) శ్రీకాకుళ విప్లవోద్యమ తాత్కాలిక వెనుకంజ తర్వాత వ్యాపించిన నిరాశను చెదరగొట్టడానికి, ఆశను నిలిపి ఉంచడానికి, మళ్లీ ఆశను నింపడానికి, విప్లవావసరాన్ని, విప్లవ అనివార్యతను చెప్పడానికి అప్పటికి రెండు సంవత్సరాలుగా విప్లవ రచయితల సంఘం చేస్తున్న కృషిని కూడా అక్షరాలకెక్కించిన రచన ఇది. సత్యానికీ గిరిజనులకూ అభేదం మాత్రమే కాదు, సత్యానికీ విప్లవానికీ కూడా అభేదం చెప్పిన గీతం ఇది. తద్వారా గిరిజనులకూ (మొత్తంగా ప్రజలకూ) విప్లవానికీ కూడా అభేదం చెప్పిన గీతం ఇది. ‘ఎర్రజెండా ఇంత ఎరుపేమిటని యడుగ, సత్యం రక్తంతో తడిసెనని చెప్పాలి’ అని నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమాల మౌలికాంశమైన త్యాగ సంప్రదాయాన్ని అక్షరీకరించిన గీతం ఇది.

ప్రజలు వేరు, విప్లవకారులు వేరు అని ఒకప్పటి విప్లవకారులే అంటున్న ఈ వేళ, త్యాగ సంప్రదాయం విమర్శకూ నిందకూ అపహాస్యానికీ గురవుతున్న ఈ వేళ, త్యాగం అవసరం లేకుండానే సామాజిక పరివర్తన జరుగుతుందనే అబద్ధానికి అనేక మంది కొత్త ప్రచారకర్తలు దొరుకుతున్న ఈ వేళ ఈ ‘విప్లవాగ్నులు’ గీతం ఒక అవసరమైన, అనివార్యమైన పాఠం.

**
ఇవాళ్టి సందర్భంలో ఈ రెండు పాటలతో సమానంగా గుర్తు తెచ్చుకోవలసిన మరొక పాట శివసాగర్ రాసిన ‘ఏటికి ఎదురీదు వాళ్లమురా!’. ఈ పాట కూడా శివసాగర్ జైలు నుంచే పంపించారు గనుక రెంజిమ్ అనే కలం పేరుతోనే సృజన జూన్ 1974 సంచికలో అచ్చయింది. అప్పటి నుంచీ ఎమర్జెన్సీ వరకూ జరిగిన అనేక సభల్లో ఎన్ కె పాడేవాడు. ఎమర్జెన్సీ తర్వాత మూడు నాలుగేళ్లు కూడా ఈ పాట ప్రాచుర్యంలోనే ఉండింది.

ఈ పాట శ్రీకాకుళ విప్లవోద్యమ తాత్కాలిక వెనుకంజనూ, దాన్ని అధిగమించి విప్లవోద్యమం ముందుకు సాగవలసిన అవసరాన్నీ, సాగుతుందనే ఆశాభావాన్నీ, ముందుకు నడిపించాలనే సందేశాన్నీ ప్రతీకాత్మకంగా, కళాత్మకంగా సమ్మిళితం చేసింది. ‘తోటారాముని పాట ఎలా పుట్టింది’ వ్యాసంలో శివసాగర్ ప్రస్తావించిన “కోర్టు ప్రకటన” బహుశా చారు మజుందార్ రాజకీయాలతో తమ విభేదాన్ని ప్రకటిస్తూ విశాఖపట్నం జైలులో ఉన్న ఆరుగురు నాయకులు (కొల్లా వెంకయ్య, చౌదరి తేజేశ్వరరావు, కానూ సన్యాల్, సౌరేన్ బోస్, భువనమోహన్ పట్నాయక్, నాగభూషణ్ పట్నాయక్) రాసిన లేఖ అయి ఉంటుంది. నక్సల్బరీ ప్రజ్వలన నుంచి చారు మజుందార్ మరణానికి కొద్ది ముందు వరకూ సాగిన విప్లవోద్యమ గమనాన్ని తప్పు పట్టిన ఆ లేఖ మీద విప్లవోద్యమంలో చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగానే స్వయంగా కె జి సత్యమూర్తి హైదరాబాద్ కోర్టులో 1974 ఫిబ్రవరి 21న ‘సాయుధ పోరాట ఎర్రజెండా చిరకాలం వర్ధిల్లుగాక’ అని ఒక ప్రకటన చదివారు. (ఆ ప్రకటన సృజన మార్చ్ 1974 సంచికలో అచ్చయింది).

ఆ రాజకీయ ప్రకటనకు కొనసాగింపుగా, ఆ ప్రకటననే అద్భుతంగా కవిత్వీకరిస్తూ శివసాగర్ ‘ఏటికి ఎదురీదు వాళ్లమురా!’ రాశారు. అందులో మేరిమి, ఉద్ధమాల, కురుపము, సంగమొలస అని శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాల, ప్రాంతాల పేర్లు రాసి అక్కడ మెరుపు, ఉరుము, వర్షం కురవడం అనే ప్రతీకలతో ఉద్యమ ప్రారంభాన్ని, విస్తరణను చెప్పారు. ఉద్యమాన్ని ఏరుతో పోలుస్తూ, అది ఎట్లా ప్రవహించిందో మొదటి చరణంలో చెప్పారు. ఆ చరణం చివరిలో ఆ వర్షం తర్వాత మెండు చీకటి కమ్మిందని, ఉద్యమం మీద సాగిన భయంకర నిర్బంధాన్ని సూచించారు.

రెండో చరణంలో ఆ మెండు చీకటి వల్ల తెరకొయ్య విరిగిందని, తెరచాప చిరిగిందని ఉద్యమానికి జరిగిన నష్టాల్ని ప్రతీకాత్మకంగా సూచించారు. ఆ నిర్బంధానికి స్పందనగా పడవ కడుపులో కలకలం రేగింది. ఉద్యమం మెరికల్లాంటి యోధులను కోల్పోయింది. గుండె జారిన దండు మానవాచరణ మీద విశ్వాసం కోల్పోయి మానవాతీత శక్తులకు మొక్కడం మొదలుపెట్టింది. తమ చేతిలో ఉండి పడవ నడిపించవలసిన తెడ్లను ఏటిలో విసిరేసింది. ఈ విషయం చెపుతున్న కవి ఉద్యమ నాయకత్వాన్నీ, ప్రజలనూ జాలరన్నగా పోలుస్తూ జాలరన్న కన్నా తాను చిన్నవాడినని, నీతి తప్పని వాడినని, జాలరన్నతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. (జాలరన్న అంటే ఉద్యమ నాయకత్వం అనీ, మొనగాడు తమ్ముణ్ణి అన్నప్పుడు వెంపటాపు సత్యంను, ఎదిగిన అమ్మణ్ణి అన్నప్పుడు పంచాది నిర్మలను, ప్రత్యేకించి నీకంటే చిన్నవాళ్లం అన్నప్పుడు కొండపల్లి సీతారామయ్యను ఉద్దేశించాననీ, శివసాగర్ తన సమగ్ర సంకలనం నోట్స్ లో రాశారు).

మూడో చరణంలో, ధైర్యం తెచ్చుకున్న ఆ వ్యక్తే, పాత నష్టాలన్నిటినీ మళ్లీ వరుసగా చెప్పి, అవన్నీ జరిగినా సరే, గుండెలో ఆశ ఎర్రజెండాగా ఎగరాలి అని ఆశ్వాసం ప్రకటిస్తాడు. చీకట్లో కూడా కళ్లలోని కాంతే బాటను వెలిగించాలని, ఎంత చీకటి కమ్మినా మిణుగురులా వెలుగు ఉంటుందని, దాన్ని చూడడం తెలియాలని, పట్టుదలే ప్రాణంగా నావ నడిపించాలని ధైర్యం చెపుతాడు. చుక్కాని చేపట్టమనీ, నావను ముందుకే నడిపి, దారి చేర్చాలనీ జాలరన్నను అభ్యర్థిస్తాడు. ఏటికి ఎదురీదడమే తమ స్వభావం అనీ, నూటికి ఒకడున్నా చాలునని, కోట్ల జనులను కూడగట్టగలమనీ భవిష్యదాశను ప్రకటిస్తాడు. నావను తూర్పు దిశగా నడిపించమని జాలరన్నను కోరుతాడు.

నాలుగో చరణం ఇప్పటిదాకా పాట నడిచిన పద్ధతిని గుణాత్మకంగా మారుస్తుంది. ఇది కేవలం కవితా శిల్పం మాత్రమే కాదు. మొదటి చరణంలో ఉద్యమ పురోగమనం, నష్టాలు, రెండో చరణంలో నష్టాలను చూపి బైటపడుతున్న తిరోగమన ఆలోచనలు, మూడో చరణంలో ఆ తిరోగమన ఆలోచనలను తిప్పికొట్టి ఆశ్వాసం ఆశావహ దృష్టి కల్పించడం చేసిన తర్వాత, మొత్తం పాటే ఒక ఆహ్లాదకరమైన, సాహసికమైన, వేగవంతమైన వాతావరణంలోకి, తూగులోకి మారాలి. అందుకే అది గుణాత్మకంగా మారి సముద్రం మీద పడవ సాగుతున్నప్పుడు, ఆ ఆటు పోటుల మధ్య జాలరుల, పల్లెకారుల సామూహిక ఉత్సాహ ధ్వనిలోకి మారుతుంది. సముద్రపు అలల మీద పడవ నడకలో ఉండే తూగుతో, ఆరోహణ, అవరోహణలతో, జాలరుల ఊతపదాలతో సాగే ఈ చరణంలో ‘ఎంతకాలం చీకటి కొంతకాలమే నయ్ న, చందమామ లాటి అందమైన దీవి’ అనే రెండు పాదాలు, ఆ నాటి ఉద్యమ స్థితికీ, తెచ్చుకోవలసిన ఆశకూ, ఉద్యమం చేరనున్న, చేరవలసిన గమ్యానికీ సూచికలు.

ఈ గీతం రాసిన 1974 విప్లవోద్యమ చరిత్రలో అత్యంత గడ్డు కాలం. అప్పటికి ‘ఆరుగురి లేఖ’ మాత్రమే కాదు, చారు మజుందార్ మరణానంతరం మరెందరో నాయకులు పంథాను తప్పు పట్టడం, విప్లవ రాజకీయాలను వదిలేయడం, చీలికలు ప్రారంభమయ్యాయి. నాయకత్వమూ, శ్రేణులూ అత్యధికభాగం తుడిచిపెట్టుకుపోయాయి. దేశంలో యువత అసంతృప్తి ఇతర మార్గాల్లో విస్ఫోటనం చెందుతున్నా, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని మార్గనిర్దేశనం చేసే చొరవ విప్లవోద్యమానికి లేకుండా పోయింది. నిజంగానే ఎందరో పాత అగ్రనాయకులు చేతిలో తెడ్లను ఏటిలో విసిరిన స్థితీ వచ్చింది. (గుండె జారిన దండు అనే మాటను “చౌదరి తేజేశ్వరరావు ముఠా”ను ఉద్దేశించి రాశానని శివసాగర్ తన సమగ్ర సంకలనంలో నోట్స్ లో రాశారు.) విప్లవకారులు నూటికి ఒకరుగా మిగిలిన స్థితీ వచ్చింది. అక్కడి నుంచి కోట్ల జనులను కూడగట్టగలం అనే గొప్ప ఆశను ప్రకటించడం ఈ గీతపు ప్రాధాన్యత. ఆ తర్వాతి దశాబ్దాలలో ఆ మాట వాస్తవరూపం ధరించింది కూడా.

యాబై సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పాట ఆనాటి సందర్భానిది మాత్రమే కాదనీ, ఇవాళ్టి సందర్భానిది కూడాననీ అనిపించడం ఈ గీతపు ప్రాసంగికత.
**
మూడు పాటల పూర్తి పాఠాలు:
**
ఓ! విలుకాడ!
రెంజిమ్

తోటారాముని తొడకు కాటా తగిలిందానీ
చిలుక చీటీ తెచ్చేరా! ఓ! విలుకాడా!
మైనా మతలబు చేసెరా! ఓ! చెలికాడా!
మైనా మతలబు చేసెరా!
ఒద్దీపూదారిలో సద్దు మణిగిందంట
సండ్రాపూదారిలో గాండ్రించి దూకిందంట
సంజ మాటున దాగి పంజా విసిరిందంట
తోటారాముని తొడకు కాటా తగిలిందంట
కంజూ కన్నీరెట్టెరా! ఓ! విలుకాడా!
నెమలీ నాట్యము మానెరా! ఓ! చెలికాడా!
నెమలీ నాట్యము మానెరా!
జింకా, లేడీ కుమిలి కుమిలీ ఏడ్చాయంట
కాడు బర్రె వచ్చి బావురన్నదంట
అడవీ గోరింటాకు వొడిలీ పోయిందంట
మోదుగూ పూలన్నీ వాడిపోయాయంట
పల్లె తల్లడిల్లి గొల్లుమన్నదంట
అడవీ హడిలిపోయెరా! ఓ! విలుకాడా!
వాగు జల జల ఏడ్చెరా! ఓ! చెలికాడా!
వాగు వలవల ఏడ్చెరా!

గోల్లోళ్ల సిన్నమ్మ పాలు తాపిందంట
కురుమోడు గోండోడు గటక తెచ్చారంట
పరధాను పరమేసు పసరు పోసిండంట
మన్నెపూ మామయ్య కట్టు కట్టిండంట
తోటారాముడు కళ్లు తెరిచి నవ్విండంట
అడవి అడవీ నవ్వెరా! ఓ! విలుకాడా!
పల్లె మల్లెలు పూచెరా! ఓ! చెలికాడా!
నా కళ్ల నీరూ నిండేరా!
నల్లపిట్టలు కల్లి పళ్లూ తెచ్చాయంట
అల్లుపిట్టలు చల్లగాలీ విసిరాయంట
గోగురిచ్చ వచ్చి గోము చేసిందంట
పైడికంఠి వచ్చి పదము పాడిందంట
తోటారాముడు నవ్వి లేచి నిలిచాడంట
అడవీ అలలుగా లేచెరా! ఓ! విలుకాడా!
పల్లె విల్లంబాయెరా! ఓ! చెలికాడా!
నా గుండె రవరవలాడేరా!

తోట రాముడంటే మిత్రులకు ప్రాణము
తోట రాముడంటే శత్రువుపై బాణము
తోటా రాముడు మంది ఒరలోని ఖడ్గము
తోటా రాముడు పల్లె చేతిలో బల్లెము
తోట రాముడు అడవి గుండెల్లో గీతము
కల్లా కపటము లేదురా! ఓ! విలుకాడా!
అతనివల్ల నేరామేమిరా! ఓ! చెలికాడా!
అతని వల్ల నేరామేమిరా?
గరిమెళ్ల అడవిలో గుర్రూ పెడతందంట
మనిసి నెత్తురు మరిగి మత్తెక్కి ఉందంట
గుండెల్లో గురిచూసి దెబ్బ కొట్టాలంట
తోటరాముని పేరు అడవీ నిలపాలంట
విల్లంబు సారించరా! ఓ! చెలికాడా!
బల్లెమ్ము చేపట్టరా! ఓ విలుకాడా!
మన చెలిమి నిలబెట్టరా!
ఓ! విలుకాడా! నా చెలికాడా!
మన చెలిమి నిలబెట్టరా!

(ఉరిశిక్షకు గురికాబడి మృత్యువునెదుర్కొంటోన్న ఆదిలాబాద్ జిల్లా రైతాంగ గెరిల్లా వీరులు కామ్రేడ్స్ కిష్టాగౌడ్, భూమయ్యలకు ఈ నా పాట వినమ్రతతో అంకితం)
**

విప్లవాగ్నులు

ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే
శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి
వెంపటాపు సత్యమెవ్వరని అడిగినా
గిరిజనులే సత్యమని గొప్పగా చెప్పాలి
సత్యములో శక్తికి సాధనము అడిగితే
మావో మహాశయుని మార్గమని చెప్పాలి
సత్యమూ మాస్టారు స్థానమెచటని యడుగ
గిరిజనుల హృదయాలు గురుతుగా చూపాలి
సత్యమూ గిరిజనుల సంఘమేదని యడుగ
పాణిగ్రాహి కవిత పాటలే పాడాలి
మాస్టారు బోధనల మాటేమిటని యడుగ
గిరిజనుల కనులలో కాంతులే చూపాలి
గిరిజనుల నవ్వులో భావమేమని యడుగ
శత్రువుల ఖతములో తృప్తి యని చెప్పాలి
తూర్పు దిక్కున నేటి వెలుగేమిటని యడుగ
గిరిజనుల త్యాగాల జ్వాలలని చెప్పాలి
సత్యమే గిరిజనులు గిరిజనులే సత్యమని
సత్యమే నిత్యమని చరిత్రలో చాటాలి
సత్యమెవరని లోకమెపుడైన అడిగితే
విప్లవాగ్నుల వైపు వేలు చూపించాలి
ఈ మహోజ్వల వీర శ్రీకాకుళము పేర
లిఖియించు చరితకు నిర్మాత ఎవరన్న
నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి
సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి
సత్యమే విప్లవము విప్లవమే సత్యమని
విప్లవము సత్యమూ ఒకటనే చెప్పాలి
ఎర్రజెండా ఇంత ఎరుపేమిటని యడుగ
సత్యం రక్తంలో తడిసెనని చెప్పాలి
**
ఏటికి ఎదురీదు వాళ్లమురా!
రెంజిమ్

మేరిమి కొండల్లో మెరిసింది మేఘము
ఉద్దమాల కొండల్లో ఉరిమింది మేఘము
కురుపము కొండల్లో కురిసింది వర్షము
సంగమొలస కొండల్లో సాగింది వర్షము
ఏరు మీద ఏరొచ్చేరా! ఓ! జాలరన్నా!
ఏరు ఎచ్చుగా పారేరా! ఓ! జాలరన్నా!
మెండు చీకటి కమ్మెరా!

తెరకొయ్య విరిగింది, తెరచాప చిరిగింది
పడవ కడుపులోన కలకలము రేగింది
మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసింది
గుండెజారిన దండు గంగాకు మొక్కింది
చేతిలో తెడ్లను ఏటిలో విసిరింది
నీ కంటే సినవాళ్లమురా! ఓ! జాలరన్నా!
నీతి తప్పని వాళ్లమురా! ఓ! జాలరన్నా!
నీతోనే ఉంటామురా!

తెరకొయ్య విరిగినా, తెరచాప చిరిగినా
కోటి పడగలు విప్పి ఏరు బుసకొట్టినా
మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసినా
ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసినా
గుండె జారిన దండు గంగాకు మొక్కినా
పల్లెకారుల్లోనా కల్లోలం పుట్టినా
గుండెలోని ఆశ ఎర్ర జెండాగా ఎగరాలి!
కళ్లలోని కాంతి బాట వెలిగించాలి!
చీకటిలో మిణుగురులు చూడటం తెలవాలి!
పట్టుదల ప్రాణంగా నావ నడిపించాలి!
చుక్కాని చేపట్టరా! ఓ! జాలరన్నా!
నిక్కముగా దరి జేర్చరా! ఓ! జాలరన్నా!
ఏటికి ఎదురీదు వాళ్లమురా! ఓ! జాలరన్నా!
నూటికి ఒకడున్న చాలునురా! ఓ! జాలరన్నా!
కోట్ల జనులను కూడగడుదుమురా!
చుక్కాని చేపట్టరా! ఓ! జాలరన్నా!
నిక్కముగా దరిజేర్చరా! ఓ! జాలరన్నా!
తూరుపు దిక్కుగా నడిపించరా!

ఏలేసా ఏలేసా
హైలేసా హైలేసా
జోర్ సెయ్ బార్ సెయ్
బార్ సెయ్ జోర్ సెయ్
ఇంతే ఇంతే నాయనా
ఇంతే ఇంతే నయ్ నా
ఎంతకాలం చీకటి
కొంత కాలమే నయ్ నా
చందమామ లాటి
అందమైన దీవి
జోర్ సెయ్ బార్ సెయ్
బార్ సెయ్ జోర్ సెయ్
హైలేసా హైలేసా
ఏలేసా ఏలేసా …

(శ్రీకాకుళం జిల్లాలో వినిపించే జాలరన్న పాటకు కృతజ్ఞత)

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply