ఇన్ని చీమలెక్కడివీ

మూలం: మనీశ్ ఆజాద్

రాజుగారు… దైవాంశ సంభూతుడు
ఆయన్నెవరూ చంపలేరు

కానీ, ఒక్క షరతు…
రాజుగారికి మాత్రం
ఒక్క గాయమూకాకుండా చూస్కోవాలి

ఒక్కసారి
చీమలు గాయాన్ని పసిగట్టి
దాడిని మొదలెడితే
రాజుగారినెవరూ కాపాడలేరు

అప్పట్నుండి రాజుగారు
ప్రేమతోనో, కోపంతోనో
చీమల్ని తన కాళ్ళ కింద
నలిపేయడం మొదలెట్టాడు.

*

చీమల్లో
అలజడి మొదలయ్యింది

నాగుబాము గాయం కోసం
ఎర్ర చీమలెదురు జూసినట్లు
రాజుగారి గాయం కోసం
ఎదురు చూడ్డం మొదలెట్టాయి

ఉన్నట్టుండీ
ఓ రోజున రాజుగారు
తనకు ఒకే ఒక్క రంగు ఇష్టమనీ
తక్కిన రంగులన్నీ
తమ రంగుల్ని మార్చుకోవడమో
రాజ్యాన్ని విడిచి పెట్టడమో చేయాలని
” మన్ కీ బాత్ ” ప్రకటించేశాడు.

*

రాజ్యంలో
మరింత అలజడి పెరిగింది

కొన్ని చీమలు రంగులు మార్చుకొని
రాజుగారి పాదాలు వద్ద వాలిపోయాయి
మరికొన్ని చీమలు
రంగులు మార్చేదే లేదని తేల్చి చెప్పాయి

లొంగిరాని చీమలు
జైలుకెళ్ళాయి

ప్రశ్నించిన చీమల పుట్టల్ని
బుల్ డోజర్ల తో ధ్వంసం జేశారు

మరికొన్నింటిని రాజుగారే
తన కాళ్ళ కింద నలిపేశాడు

కొన్ని చీమలు మాత్రం
అజ్నాతం లోకి వెళ్ళి
రాజుగారి మీద
తిరుగుబాటు ను ప్రకటించాయి…

యుద్ధం మొదలైంది…

తన సమస్త బలగంతో
రాజుగారు
చీమల మీద విరుచుకు పడ్డారు.

అయితేనేం
దుర్భర నిర్భంధం లోనూ
తిరుగుబాటు చీమలు
రాజుగార్ని గాయపర్చాయి

చీమల నిరీక్షణ ఫలించింది…

రెట్టించిన సమరోత్సాహంతో
చీమల దాడి మొదలయ్యింది

అవి లైను గట్టి
గాయం మీద
దాడిని మొదలెట్టాయి…

రాజుగారు, సైనికులు
ఊహించని మారణకాండ కు తెర దీశారు

పగిలిన పుట్ట ల్తో
పెరిగిన సమాధుల్తో
ఊళ్ళు శవాలదిబ్బలయ్యాయి

అదేమి విచిత్రమో గాని
చీమలు దండు క్రమంగా పెరగ సాగింది

కిటికీలు,దర్వాజలు ఎన్ని మూసినా
టక్కు టమారాది విద్య లెన్ని జేసినా
అవి సందుల్లోంచి,నెర్రెల్లోంచి దూరి
మెరుపు దాడులు మొదలెట్టాయ్

భీషణ యుద్ధం…

మడమ తిప్పని ధైర్యంతో
చీమలు
కదన రంగంలో, కవాతు దేశాయి…
“సాహో. .”

*

ముందు వరుసలో చీమలు
చచ్చిపోతున్నపుడు
వెనుక వరుసలోని చీమలు
శవాల్ని దాటుకు
ముందుకు పోతున్నాయి.

నిరంతర దాడుల కింద
రాజుగారి గాయం పెద్దదైంది
జ్వర తీవ్రత హెచ్చింది…

మెల్లమెల్లగా
రాజుగారి శరీరం ఉబ్బి,నల్లబడి
గాలి బుడగలా పేలిపోయింది…

అదిసరే.
రాజ్యంలో
ఇన్ని చీమలెక్కడివీ.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply