ఇనాక్ నాటక ప్రయోగాలు

కొలకలూరి ఇనాక్ ప్రయత్నించి ప్రతిభ కనబరచిన ప్రక్రియలలో నాటకం కూడా ఉంది. అవి కూడా ఏ ఒకటో రెండో వ్రాసి ఊరుకోలేదు. సాహిత్య కృషి ప్రారంభ దినాలనుండే నాటకాల పై దృష్టి పెట్టారు. ఆయన వ్రాసిన నాటకాలు అయితేనేమి, నాటికలు అయితేనేమి పాతికవరకు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో బిఎ ఆనర్స్ చదువుతున్న1957-59 కాలంలోనే పోటీలకు నాటకాలు వ్రాసారు. బహు మతులు పొందారు . త్యాగి, దృష్టి అట్లా బహుమతి పొందిన నాటకాలే. దృష్టి తో పాటు జ్యోతి వంటి నాటకాలు ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. జైహింద్, మనలాంటి మనిషి, జ్యోతి మొదలైన నాటకాలు స్త్రీల హృదయ స్వచ్ఛత, లైంగిక నైతకత, స్వయం వ్యక్తిత్వం, సేవానిరతి మొదలైన అంశాలను కేంద్రంగా చేసుకొన్నాయి. కీ, అమ్మ, ఈ తరం భార్యాభర్తలు, భార్యావిధేయులు మొదలైన నాటకాలు ఉన్నట్లు తెలుస్తున్నది. (కొలకలూరి మధుజ్యోతి – ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్య సృష్టి – దృష్టి 2019, పు; 181)

ఓట్లాట (2012) నాటకం ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజాప్రతినిధులను, ఉద్యోగవ్యవస్థను, పత్రికా ప్రసారమాధ్యమాల వ్యవస్థను, పోలీసు న్యాయవ్యవస్థలను అధికార వర్గం స్వప్రయోజనాలకు ఎలా వాడుకొంటుందో, స్నేహం, నమ్మకం మొదలైన విలువలు బొత్తిగా అభావమై ఎత్తులకు పై ఎత్తులతో డబ్బును,అధికారాన్ని చేజిక్కించుకొనటానికి కుట్రలు ఎలా నిరంతరం సాగుతుంటాయో ఆ భీభత్స వర్తమానాన్ని ప్రదర్శించింది. ముఖ్యమంత్రి, ప్రత్యేకవిధుల మీద అతనిని అంటిపెట్టుకొని ఉండే ఐఏఎస్ అధికారి, బడీ గార్డులు, ఆర్ధిక పారిశ్రామిక రెవిన్యూ ఎక్సయిజ్ మంత్రులు, సెక్రటరీలు, పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు, పత్రికాధిపతులు, పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు ఇలా 23 పాత్రలతో ముఖ్యమంత్రి కాంప్ ఆఫీస్ భూమికగా నడిచే నాటకం ఓట్లాట. 18 దృశ్యాలుగా ఇతివృత్తం నిర్మించబడింది. ఈ నాటకంలో అందరికీ హోదా సంబంధిత వాచకాలే కానీ ప్రత్యేకమైన పేర్లు లేవు. పేరులో ఏముంది ? ఏ ముఖ్యమంత్రి స్వభావమైనా ఎప్పుడూ అదే అయినప్పుడు పేర్లతో వాళ్ళను వేరుచేసి చెప్పవలసిన అవసరం లేదన్నది రచయిత ఉద్దేశం అయివుండాలి. అధికారాన్ని పొందటం, కాపాడుకొనటం, పొందిన వాడిని పడగొట్టి తాను అధికారం పొందటం- ఈ చక్రనేమి క్రమంలో ఎవరికీ ఏ ప్రత్యేకతా ఉండదు.

ఓటు చాలా పవిత్రమైనదని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి పౌరుడు దానిని సద్వినియోగం చెయ్యాలని హితబోధలు జరిగే సమాజంలో అధికారంలోకి రావటానికి సాధనంగా తప్ప దానికి మరే విలువ ఉండదని, ఆ ఓట్లను దక్కించుకొనటానికి ఆడే ఆట ఆత్మవంచన పరవంచనల వికృత క్రీడ అని ఈ నాటకం నిరూపించింది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు, అమ్మకాల ఆలోచనస్థాయిలోనే చుట్టుపక్కల భూముల విలువ పెంచటానికి జరిగే లోపాయికారీ వ్యవహారాలు, భూసేకరణ పద్ధతులు, ప్రజలకు మేలు చేసేవిగా పైకి కనబడేట్లు చేసే మాయలు, ఆశలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనటం ఇలాంటివి అన్నీ ఏ నాటక ఇతివృత్తంలో ఏవి భాగమై కనిపిస్తాయో అవి అన్నీ వాస్తవ పార్లమెంటరీ ప్రజాస్వామ్య అధికార రాజకీయాలలో భాగమే. ఈ పరిస్థితికి కారణాలు కానీ, పరిష్కారం కానీ ఏమై ఉంటాయి, ఎలాగుంటుంది అనే ప్రశ్నకు ఇతివృత్త నిర్వహణలో పాత్ర ఏమీ లేదు. వాస్తవం చూపిస్తే ఊహ తెలియగల పాఠకోత్తములే కారణాలు ఊహిస్తారు, నిర్ధారించుకొనే ప్రయోగాలు, ప్రయత్నం చేస్తారు, పరిష్కారమార్గం ఎంచుకొంటారు అన్నది రచయిత ఉద్దేశం. సూత్రం అనే శీర్షికతో వ్రాసిన ముందు మాట సారం అదే.

కొలకలూరి ఇనాక్ నాటకాలను ప్రధానంగా క్రైస్తవ మత సంబంధమైనవి,దళిత సమస్య ప్రధానమైనవి అని రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు. క్రైస్తవ మిషనరీల సహాయసహకారాలతో సామాజిక గౌరవం కోసం దళితులు క్రైస్తవం స్వీకరించటం 20 వ శతాబ్ది ప్రారంభానికే ఉంది. అట్లా క్రైస్తవ మత సంబంధంలోకి వెళ్లిన దళితులు విద్యావంతులై సాహిత్య రచనకు పూనుకొన్నప్పుడు హిందూ పౌరాణిక గాధల వలెనే క్రైస్తవ మత సంబంధ గాధలకు సాహిత్య వస్తు గౌరవం సంపాదించి పెట్టె దిశగా కృషి మొదలైంది. 1922లో జాషువా చిదానంద ప్రభాతం నాటకం ఆ రకంగా వచ్చిందే. ఆ మార్గంలో ఇనాక్ కూడా 1954 క్రెస్తవ గాధలను, విశ్వాసాలను, సమాజ జీవితాన్ని తన సాహిత్య ఇతివృత్తాలలో భగం చేస్తూనే ఉన్నారు. ఆక్రమంలో నాటకాలు కూడావ్రాశారు . ఆశాజ్యోతి, మేరీమాత క్రీస్తు జననం వస్తువుగా వచ్చిన నాటికలు. క్రీస్తు పునరుద్ధానం అహింసాజ్యోతి నాటికకు వస్తువు. ఈ మూడూ శ్రవ్య నాటికలు. (మధుజ్యోతి, పు; 390) ఈ మార్గంలో వ్రాసిన నాటకాలు రెండు. ఇడుగో ఏసుక్రీస్తు, సాక్షి .. రెండూ 2012 లో వచ్చాయి.

క్రీస్తు జననం అద్భుతం… ఆశ్చర్యకరం కనుక నాటకానికి అనువైన వస్తువు అని ఇనాక్ అభిప్రాయం. ‘ముందుగా ఒక ముచ్చట’ శీర్షికతో నాటకానికి వ్రాసిన ముందుమాటలో ఆయన బైబిల్ కొత్తనిబంధనలోని ఈ కథ క్రైస్తవ భక్తులకు భక్తి పారవశ్యాన్ని, క్రైస్తవేతరులకు కళా పారవశ్యాన్ని కలిగిస్తుందని సూచించారు. ఈ సమాజంలో భాగమైన క్రైస్తవాన్ని, క్రైస్తవుల్ని క్రైస్తవేతరులు అర్ధం చేసుకొనటానికి దోహదం చేయటం ఈ నాటక రచన ద్వారా రచయిత సాధించదలచుకొన్న ప్రయోజనం.

ఇడుగో ఏసు క్రీస్తు నాటకంలో 21 దృశ్యాలు ఉన్నాయి. ఆద్యంత దృశ్యాలలో వచ్చే జ్యోతి ఆమె తల్లిదండ్రులు, జ్యోతి దగ్గరకు తీసిన దాసు, ఫాదరీ కల్పిత పాత్రలు. రచయిత వీళ్ళను నేటి పాత్రలు అన్నారు. యెహోవా, గాబ్రియేలు, మేరీ, జోసఫ్, ఎలిజిబెత్, జెకర్యా వంటి బైబిల్ పాత్రలు 14మంది ఉన్నారు. వీళ్ళను నాటి పాత్రలు అన్నారు రచయిత. ఒక క్రిస్మస్ పండుగ నాడు చర్చి ప్రాంగణంలో క్రీస్తుపట్ల విశ్వాసం గల జ్యోతి పాత్రను ప్రవేశ పెట్టటం ద్వారా నాటకం ప్రారంభం అవుతుంది. ఇరవైయ్యవ దృశ్యంలో అదే రోజు చర్చిలో ఫాదర్ సందేశం ఇయ్యటం. ఇరవై ఒకటవ దృశ్యంలో జ్యోతి తమ్ముడుగా స్వీకరించి తన ఇంటికి తీసుకువెళదామనుకొన్న దాసు అదృశ్యానికి అల్లాడిపోవటం, తల్లిదండ్రులు ఆమెకు నచ్చచెప్పి ఇంటికి తీసుకుపోవటం జరిగింది. నాటకం ఇక్కడ ముగుస్తుంది. ధర్మం చేయమంటూ జ్యోతి వెంట పడిన దాసు క్రీస్తే నన్న సూచన ఇందులో ఉంది. వర్తమానంలో కూడా అద్భుత ఘటన ను కూర్చారు రచయిత. ఇక రెండు నుండి పందొమ్మిది వరకు ఉన్న 18 దృశ్యాలలో క్రీస్తు జనన కథ విస్తరించింది.

యెహోవా గాబ్రియేలును పిలిచి క్రీసు రాకను అతని కి బాప్తిజం ఇచ్చే జాన్ రాకను గురించి వాళ్ల జన్మకు కర్తృత్వం వహించవలసిన స్త్రీపురుషులను సంసిద్ధంచేయవలసిందిగా చెప్పి పంపటం దగ్గర మొదలుపెట్టి, తన అధికారాన్ని అంతంచేయటానికి బెత్లహాం లో క్రీస్తు పుట్టాడన్న విషయం తెలుసుకొని అతనిని చంపించటానికి సిద్ధపడిన రాజు హేరోదు నుండి పిల్లవాడిని కాపాడుకొనటానికి ఆ గాబ్రియేలు మాటగానే ఈజిప్టు కు వెళ్లిపొమ్మని చెప్పి పంపటం వరకు ఈ పద్దెనిమిది దృశ్యాల కథ. ఇది చర్చిలో పురాణప్రవచనం మాదిరి చెప్పబడుతున్నదని మధ్యమధ్య క్రీస్తు జనన కథను గురించిన జ్యోతి దాసుల వ్యాఖ్యాన భాషణలను బట్టి ఊహించుకోవాలి. 5, 18, దృశ్యాలు జ్యోతి దాసుల సంవాద సంబంధులే. జ్యోతి దాసుల పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా రచయిత వర్తమానాన్ని వ్యాఖ్యానించటానికి, వర్తమాన అసమానతల పరిష్కారానికి క్రైస్తవానికి అన్వయ సంబద్ధత ఉందని సూచించటానికి అవకాశాన్ని కల్పించుకొన్నారు.

నాటకంలో సందర్భాలను కల్పించుకొని మరీ పాత్రలకు పద్యాలను పెట్టె సంప్రదాయం తెలుగునాటక రచనలో ఉంది. సంభాషణాప్రధానమైన నాటకంలో పద్యాలు అసహజం అన్న విమర్శ ఉన్నప్పటికీ పద్యం మీద మోహమో, పద్యపఠనంలోని ప్రవాహాగుణమో నాటకానికి పద్యం వన్నె తెస్తుందన్న నమ్మకం కదిలించరానిది అయింది. సమకాలీన సామాజిక అంశాలు వస్తువుగా వచ్చిన అభ్యుదయ నాటకంలో పద్యాల స్థానంలోకి పాటలు వచ్చి చేరాయి. ఇనాక్ ఈ నాటకంలో పద్యాలనూ, పాటలను కూడా సమంగా భాగం చేశారు. క్రీస్తు జననకథ వింటూ జ్యోతి దాసు వేసే ప్రశ్నలకు సమాధానంగా అన్నట్లు దీనులయెడ, బీదలయెడ, ఆకలిగొన్నవారి యెడల బాధితులయెడ చూపవలసిన మానవధర్మం గురించి, దయ గురించి, ప్రేమ గురించి చెప్తూ వచ్చిన దృశ్యాలు రెండూ ( 5&18) తెర వెనుక నుండి వినవచ్చే పద్యం తో ముగుస్తాయి. అవి ప్రత్యేకం పరిశీలించవలసినవి.

‘మూసుకొనిన పేగు మూతితెరిచి గంజి తరక వేయు మనిషె ధర్మమూర్తి’ అని ప్రారంభమయ్యే సీస పద్యంలో ఎండ వానలకు నిలయమైన గుడిసెలు కప్పటం, కట్టటానికి వస్త్రం ఇయ్యటం, అనారోగ్యం తో ఉన్నవాడికి వైద్య సేవలు చేయటం మనిషి లక్షణమని చెప్పి పేదవాళ్ల సమస్యలు తీర్చలేని జాతి అల్ప జాతి అంటారు రచయిత. “మనుజ ప్రేమ లేక మన ప్రభుత్వము రాక / సృష్టి భస్మరాశి స్రష్ట యగును” అన్న ముగింపు కథాసందర్భాన్ని బట్టి ఏసు ప్రేమ భావనను, ఏసు రాజ్యాన్ని ఆకాంక్షించేది అయినా అందరికీ కనీసావసరాలైన కూడు, గుడ్డ, గుడిసె సమకూర్చగల ప్రభుత్వం గురించిన ఆశ అందులో గర్భితం. ధర్మం చేయండి అంటూ భిక్షా పాత్రతో ముందు నిలుచున్న యాచకులను జ్యోతి వంటి సంపన్నులు ప్రభువు నందలి విశ్వాసంతో దగ్గరకు తీసి ఆదరించటం ఏసు కోరే ప్రేమరాజ్య స్థాపనకు రహదారి అవుతుంది అదే సమయంలో అది సమధర్మ రాజ్యం కూడా అవుతుందని రచయిత ఆంతర్యం.

18 వదృశ్యం లోని పద్యంలో క్రైస్తవ సమాజం దళితులను ఆదరించి ఆత్మగౌరవ చైతన్యం పెంచిందన్న కృతజ్ఞత కనబడుతుంది. దళితులకు హిందూ సమాజం చేసిన ద్రోహం, క్రైస్తవ సమాజం చేసిన మేలు పక్కపక్కనే ప్రస్తావించబడతాయి. హిందూ సమాజం దళితుల గొంతులో అక్షరాలను పెకలించి పారేస్తే క్రైస్తవ మత గురువులు వచ్చి ఇసుకలో వెతికి మళ్ళీ వాళ్ళకిచ్చారట. ఇసుకలో వెతికి ఇయ్యటం అంటే ఇసుకలో అక్షరాలు దిద్దించటం. మొదటి పంక్తి ఇది.రెండవ పంక్తిలో వాళ్ళు అందించిన వైద్య సేవల ప్రస్తావన ఉంది. దళితులను అన్నదమ్ములైన సవర్ణ హిందువులు అంటరానివాళ్ళని దూరం పెడితే తెల్లవారు వాళ్ళను ముట్టుకొని దగ్గరకు తీశారని మూడవ పంక్తిలో చెప్పిన రచయిత గుడి గోపురాలలోకి రానీయక ‘నెట్టి పడవేసి పాతేసిన’ దళితులకు సీమ దొరలు సిలువతో బతుకిచ్చారని నాలుగవ పంక్తిలో చెప్పారు. “క్రీస్తుమతము వచ్చి కీడు గోడలు కూల్చి / రక్షణము నిచ్చి రాజ్యమేలె /ఊరి బైటి వాడు ఊరి లోపలివాడు / చేయిచేయి పట్టు స్నేహమిచ్చె” అని క్రైస్తవం దళితులకు కల్పించిన సామాజిక గౌరవం గురించి నిర్దిష్టంగా పేర్కొన్నారు.

నాటక నిర్మాణంలో ముగింపులో భరత వాక్యం అనే సంప్రదాయం ఉంటుంది. ‘ఇడుగో ఏసుక్రీస్తు’ నాటకం రచనలో నాందీ ప్రస్తావనలు వంటి సాంప్రదాయ నాటక లక్షణాలను రచయిత ఏవీ పాటించక పోయినప్పటికీ భరతవాక్యం సంప్రదాయాన్ని ఆ పేరు చెప్పకుండా నాటకం ముగింపులో ప్రయోగించారు. నాయకుడికి, ప్రజలకు అందరికీ అభ్యుదయాన్ని ఆకాంక్షించటం భరత వాక్యం లక్షణం. అది ఈ నాటకంలో తెరవెనుక నుండి వినబడే స్వరం రూపంలో భాగమైంది. యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఒకే కుదురు నుండి వచ్చినవాళ్ళని అన్ని మతాలు దేవుడు మానవ అవతరమెత్తి ప్రజలను ఉద్ధరించాయి అని నమ్ముతాయని అటువంటప్పుడు మతం పేరిట మారణకాండ అర్ధరహితమనీ ‘స్వమత స్తుతి ఆంతరంగికంగా ఉచితమే!అన్యమత నిరాసనం ఆంతరంగికంగా కానీ బాహాటంగా కానీ అనుచితం’ అని చెప్తూ అసహనం అభిలషణీయం కాదని ప్రబోధిస్తూ సాగిన అశరీరవాణి ప్రబోధం సారంలో భారతవాక్యమే. ముందుమాటలో రచయిత ఈ నాటకానికి మత పార్శ్వమే కాదు, సామాజిక పార్శ్వం కూడా ఉందని చెప్పటం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

సాక్షి సంప్రదాయ నాటకం అని రచయితే పేర్కొన్నారు. సంప్రదాయం వస్తువుకు సంబంధించినది. బైబిల్ పురుషుడు అయిన పాల్ జీవితం నాటక వస్తువు. క్రైస్తవం అంతకుముందున్న మతవిధానం మీద తిరుగుబాటుగా భావించబడి రాజ్యం చేత అణచివేతకు గురవుతున్నప్పుడు దానిని అమలుచేసిన వారిలో ఒకడైన పాల్ ఏసు సాక్షత్కారం వల్ల కలిగిన వెలుగులో చూపు పోగొట్టుకొని ఆతని దయవల్లనే తిరిగి పొంది క్రీస్తు మత ప్రచారకుడుగా మారి మతరాజ్యాధికార హింసకు తాను కూడా గురి అయి చివరకు విముక్తుడైన కథ ఇది. క్రీస్తు రక్షకుడు కాదు అని హింసకు పాల్పడిన వాడు ఏసుప్రభువు రక్షకుడు అని అర్ధం చేసుకొనే పర్యంతం మాత్రమే కాదు, ఆ తరువాత అర్ధం చేసుకొన్నదానికి నిబద్ధుడై, ప్రచారంలో నిమగ్నుడై జీవించటం వరకు పరిణామం చెందిన పాల్ చరిత్ర వివరణ ఈ నాటకం. ఇందులో అంకాలు అయిదు. కథ మొదటి అంకంలో నాలుగు రంగాలలో, రెండవ అంకంలో ఆరు రంగాలలో, మూడవ అంకంలో నాలుగు రంగాలలో, నాలుగవ అంకంలో నాలుగు రంగాలలో, అయిదవఅంకంలో మూడు రంగాలలో విస్తరించింది. కథ జెరూసలేంలో ప్రారంభమై డెమస్కస్, ఏథెన్స్, మాల్టా ద్వీపం, మొదలైన ప్రాంతాలను చుట్టుకొని రోం లో ముగుస్తుంది.

నాటక నిర్మాణం కూడా సంప్రదాయ పద్ధతిలోనే ఉంది . నాందీ ప్రస్తావనలతో నాటకం మొదలు అవుతుంది. నాందీ భగవత్ప్రార్దనతో ఉంటుంది. ఆ ప్రార్ధనలో ఆశీస్సు కూడా భాగమై ఉంటుంది. క్రైస్తవమత విషయకమైన ఈ నాటకంలో నాందీ సృష్టి స్థితి లయావశిష్టుడైన శివుడిని ప్రార్ధించటంగా, ఆయన దీవెన ప్రేక్షకులకు లభించాలని కోరటంగా ఉండటం విశేషం. సూత్రధారుడు, నటి ప్రవేశించి రుతుగానం చేసి నాటకం గురించి రచయిత గురించి చెప్పి ప్రదర్శన చూడటానికి సభికులను సిద్ధం చేసి నాటకం లోని ప్రధాన పాత్ర రంగప్రవేశాన్ని సూచిస్తూ ముగియటం స్థాపన అన్న సంప్రదాయ నాటక ప్రారంభ పద్ధతి. ఈ నాటకంలో స్థాపన నిర్వాహకులు నటి సూత్రధారులే. రుతుగానం కూడా ఉంది. కానీ ప్రదర్శించే నాటకం ఏది, ఎవరు వ్రాసారు అనే భాగం ఇందులో లేదు. అంటే రచయిత తనగురించి తాను ఇందులో చెప్పుకోదలచలేదు. ఆ పద్ధతి మరే ప్రచార మాధ్యమాలు లేని కాలపు నాటక మర్యాద అని భావించి ఉండవచ్చు. రచయితల కాలంలోనే నాటకాలు ప్రచురణ పొందుతున్నప్పుడు, వాటికి ముందుమాటల రూపంలో నాటక రచన ఉద్దేశాలు, ప్రయోజనాలు వివరించగలిగిన అవకాశం ఉన్నప్పుడు స్థాపన లేదా ప్రస్తావన లో రచన, రచయితల ప్రస్తావన అవసరం లేదనుకొని ఉండవచ్చు. సాక్షి నాటకంలో స్థాపన “శాంతి సందేశం కాంతి ప్రశంస మూర్తి/ పట్టు వస్త్రాలు తలదాల్చు పాలు రీతి” అనే పద్య పంక్తులతో పాల్ పాత్ర ప్రవేశ సూచనతో నిర్వహించబడింది.

నాటకంలో అంకానికి అంకానికి మధ్య రంగస్థలం మీద ప్రదర్శించటానికి వీలుకాని కథాంశాలను సూచించటానికి ప్రవేశకం, విష్కంభకం వంటి సాంకేతిక పేర్లతో దృశ్యాలు ఉంటాయి. సంప్రదాయ భారతీయ నాటక పద్ధతిలో పాత్రలను ఉత్తమ మధ్యమ నీచపాత్రలుగా వర్గీకరించటం, ఆ స్థాయిలకు తగ్గట్టు వాళ్ళ భాషలో కూడా తరతమ భేదాలు చూపే పద్ధతి ఉంది . విష్కంభకం మధ్యమ పాత్రలచేత, ప్రవేశకం నీచపాత్రల చేత ప్రయోగించబడాలనే నియమం కూడా ఉంది. “నీచ మధ్యమ పాత్రలుగా ప్రజలను విభజించి పాలించే నీతి రోత కావటం వల్ల” ప్రవేశకం, విష్కంభం వంటి వాటికి ఈ నాటకంలో చోటు ఇయ్యలేదని ఇనాక్ ఈ నాటకం ముందుమాటలో చెప్పుకొన్నారు. దళిత అస్తిత్వ స్పృహ ఆయనను అంత జాగరూకుడైన రచయితగా చేసింది. ఒక ఆపాదిత అల్పత్వ, నీచత్వ గుర్తింపులనుండి జాతి బయటపడాలని తపన పడేవాళ్ళు ఎవరయినా సాహిత్య సాంస్కృతిక రంగాలలో కూడా సూత్రీకరణలతో స్తిరీ కరించబడుతున్న ఆ అల్పత్వ నీచత్వ భావజాలంపై తిరగబడవలసినదే. మనుధర్మసూత్రాల మీద పెడుతున్నంత విమర్శ సాహిత్య సూత్రాల మీద కూడా పెట్టవలసినదే . ఇనాక్ ఆ పని ఇలా చేశారు.

సాక్షి నాటకం ముగింపులో భరత వాక్యం ఉంది. నాటకంలోని పాత్ర కాక సూత్రధారుడు దీనిని పలకటం ఇందులో విశేషం. అది కూడా తెరవెనుక నుండే. సమిష్టి చేతనను, అభ్యుదయాన్ని ఆకాంక్షించటం భరతవాక్య లక్షణం కనుక ఇనాక్ ఆ నాటక సంప్రదాయాన్ని స్వీకరించారు.
“పాలు వినయమున్ విజయమున్ పలుకునాడు
ప్రభువు కరుణించి దీవించి పంచెనాత్మ
సకల సౌభాగ్య సంపదల్ సంతరించి
ప్రజల ప్రేమించు ప్రతినిధులు ప్రబలుగాక” పాల్ జీవిత పరిణామ గాథ పలకటం యేసుకు కరుణకు పాత్రమైన విషయం. ఈ కరుణకు ఫలితం ఎలావుండాలి? దేశ సంపదలు పెరగాలి. ప్రజలను ప్రేమించే ప్రతినిధులు – ప్రజాప్రతినిధులు – తమ ఓట్లతో ప్రజలు శాసనసభకు పంపిన ప్రతినిధులు ప్రజల ప్రేమించు లక్షణం నిత్యం, నిరంతరం సజీవం చేసుకొంటూ విస్తరించాలి అన్నది నాటక రచయిత కోరే అభ్యుదయం. ప్రతినిధులు అలాఉంటేనే సంపద పంపిణీ సమన్యాయం తో సాగుతుంది.

2.

ఇనాక్ నాటకాలలో దిక్కులేనోడు(1978), మునివాహనుడు (1984)నీడ (2012) దళిత సమస్య ప్రధానమైనవి. నిజానికి ఆలోచనాలోచనాలు విప్పుకొంటున్న విశ్వవిద్యాలయ విద్యార్థి దశలోనే ( 50వ దశకపు రెండవభాగం ) ఇనాక్ లో దళిత జీవితం గురించి, దళితులపట్ల సమాజ వైఖరి గురించి, సవర్ణుల నీతి గురించి ఇవి ఇలా ఎందుకు ఉన్నాయి అన్న మథన మొదలైంది. అందుకు నిదర్శనం ఆయన నాటికలు. త్యాగి నాటిక 1957-58 నాటిది . మిగిలిన అయిదు -కూలీ, నిర్భయం, న్యాయం, దర్శనం, సమానత్వం- నాటికల రచనా కాలం తెలియటంలేదు. (మధుజ్యోతి )

దళితులవి రెండు రకాల సమస్యలు ఒకటి ఆర్ధికం . మరొకటి సామాజికం. కూలీ నాటకంలో భూస్వాముల పనులకు కూలికి వెళ్లే దళితులు ఏ రోజు కూలీ ఆ రోజు పొందటం అనేది కూడా ఎంత అరుదైన విషయమో చెప్తుంది. న్యాయంగా చేసిన పనికి రావలసిన కూలీని పొందటం కోసం భూస్వాముల ఇళ్లముందు పడిగాపులు పడటం, వాళ్ళు చెప్పిన పనల్లా చేసిపెట్టటం, ఒక రోజు పని పోగొట్టుకొంటే కానీ క్రితం రోజు చేసిన పని ప్రతిఫలం పొందలేకపోవటం వాళ్ళను ఎంత వేదనకు గురిచేస్తున్నాయో చూపిన రచయిత దానికి పరిష్కారం అన్నీ మౌనంగా భరించటం కాక తమ సమస్యను బాధ్యులకు వినిపించటం అని సూచిస్తారు ఈ నాటకంలో . న్యాయం నాటికలో దళితుల చాకిరీ భూస్వాముల సంపదగా రోజురోజుకీ పెరిగిపోతుంటే ఆరుగాలం చాకిరీ చేసిన వాళ్ళు అప్పుపడ్డవాళ్లుగా మిగిలిపోవటంలోని శ్రమదోపిడీ మాయను గుర్తించటం కనిపిస్తుంది.

కులం ఒక సామాజిక అసమానత అయి కులం వల్ల తక్కువగా చూడబడేవాళ్ళ స్థితి ఏమిటి? వివక్షకు గురిఅవుతున్నామన్న దుఃఖంలో కూరుకు పోవటమేనా అంటే కాదంటారు ఇనాక్ . క్రీస్తు మార్గంలో ద్వేషించే వాళ్ళను ప్రేమతో మార్చటం అవసరం అంటారు. నిర్భయం నాటికలో అదే సూచితం. ఆయన తొలినాటిక త్యాగి ఒక వ్యూహాత్మక రచన. కులం తెలిసి మనుషులు ఇది ఎక్కువకులం, ఇది తక్కువ కులం అని కొందరు అధికులుగా, మరికొందరు అల్పులుగా విడదీయ బడుతున్న సమాజంలో కులం తెలియకుండా ఉంటె మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది తరచి చూడాలన్న చిలిపి వూహ నుండి రూపొందిన నాటిక ఇది. హేమలతను ప్రేమించి పెళ్లాడి కొడుకు పదేళ్లవాడు అయ్యేటప్పటికి హేమ లత తండ్రి మాదిగ అని తెలుసుకొని ఘర్షణకు లోనుకావడం ఇందులో విషయం. తక్కువకులం స్త్రీ తో ఇన్నాళ్లు కాపురం చేసానా అని తెగ వేదన పడతాడు. నిజానికి ఆమె కులం ఏదో తెలియకపోయినా ఆమెను పెళ్లాడిన నాడు లేని ఘర్షణ అతనిలో ఈ రోజు ఎందుకు కలిగింది? అగ్రవర్ణ అహంకారం రక్తగతం, భావగతం అయిపోయి సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు ప్రవర్తనలో అసహనంగా, ద్వేషంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. వేళ్లూనుకొని పోయిన కుల సంస్కృతి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించటానికి ద్వారాలు మూసేస్తున్నది అన్నవిషయం అర్ధం అవుతున్నప్పుడు మూసుకుపోతున్న ద్వారాలను తెరిచి స్వఛ్చము, మానవీయము అయిన ప్రాణవాయువును పీల్చుకొనటానికి మనుషులు ఎంత ప్రయత్నపరులు కావలసి ఉంటుందో ఈ కథ సూచించింది.

ఈ నాటికలో అంతర్నాటకం ఉంది. తండ్రి ఎవరో తెలియని హేమకు తండ్రి ని అనివచ్చిన రాఘవయ్య దళితుడు అని తెలియటం. తల్లిదండ్రులు లేని అగ్రవర్ణుడైన విశ్వనాథం పోషణ భారం, విద్యాబుద్ధులు చెప్పించే పని తన ఉనికి తెలియకుండా అతనే చేస్తూ వచ్చాడని తెలియటం. తన కూతురిని తన కులపు నీడ లేకుండా పెంచే ఏర్పాటు చేసాడని తెలియటం. ఇదంతా కులం ఉనికి ఎంత అనవసరమైన బరువో నిరూపించటానికి చేసిన ప్రయోగం. రాఘవయ్య సహాయంతో ఎదిగినవాడు విశ్వనాథం. అతనికి దూరంగా పెరిగిన కూతురు హేమ. వాళ్లిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు పదేళ్ల పై నుంచి కాపురం చేస్తున్నారు. కొడుకుతో హాయిగా ఉన్నారు. హేమ తండ్రిని అని రాఘవయ్య రంగ ప్రవేశం చెయ్యటంతో తనప్రమేయం ఏమీ లేని పుట్టుకతో వచ్చిందిగా అప్పుడే తెలిసి వచ్చిన తన కుల సామాజిక స్థాయిని బట్టి హేమ విశ్వనాధాన్ని క్షమించమని అడగవలసిన దీనతకు నెట్టబడింది. విశ్వనాధం శరీరం, బుద్ధి, జ్ఞానం,అభివృద్ధి అన్నీ దళిత శ్రమ సంపదలనుండి సమకూడినవే అయినా దళిత హేమతో కాపురం దుస్సహం అనిపించింది. సంస్కారం వల్ల ఆ తుఫాన్ నుండి అతను బయటపడటం అది వేరేసంగతి. రాఘవయ్య దాదాపు జీవితకాల ప్రయత్నం కులం తెలిసినందువల్లే మనుషుల మధ్య ద్వేషాలు, అదిలేకపోతే పరస్పరప్రేమతో జీవించగల మహోన్నత మానవులు అని నిరూపించటం. అది నిరూపించబడింది. ఈ కథ చదువుతుంటే ఇదే సమస్య మీద అంతకు ముందెప్పుడో – దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం – కాళోజి వ్రాసిన ‘తెలియక ప్రేమ – తెలిసి ద్వేషము’ కథ గుర్తుకు రాక మానదు.

సమానత్వం కథలో దళితులు సవర్ణులతో సమానులుగా గుర్తించబడాలంటే లోపలి నుండి జరగవలసిన సంస్కరణల ప్రస్తావన ఉంది. వంటి శుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రత, చదువు, సంపాదన, రాజకీయఅధికారం ఇవన్నీ సంపాదించుకోవలసినవి అన్న సూచన ఇందులో ఉంది. అంతే కాదు తాము యజమానులుగా మారే పరిస్థితి ఏర్పడిన తరువాత తనజాతిని హీనంగా చూసే బుద్ధి ఏర్పడకుండా జాగ్రత్త వహించాలని కూడా సూచిస్తుంది . దేవాలయ ప్రవేశ తహ తహ దర్శనం నాటిక విషయం. ఇంతవరకు ఇనాక్ దళిత సమస్యను భావజాలానికి, ఆర్ధికానికి, సామాజికానికి సంబంధించినదిగా సంస్కరణ దృష్టి నుండి చూసి నాటికలు వ్రాసారు.

చారిత్రక ఘటనలతో అన్వయించి నిర్దిష్టత దిశగా దళిత సమస్యను అర్ధం చేసుకొనటానికి ఇనాక్ ప్రయత్నం ‘దిక్కులేనోడు’ నాటికతో మొదలైంది. ఈ నాటిక రచనాకాలం 1977. పదేళ్ల పూర్వం కృష్ణా జిల్లా కంచికచర్లలో దళితుడైన కోటేశు ను అగ్రవర్ణులు ఇంటికి పిలిచి గుంజకు కట్టి కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన( కలేకూరి ప్రసాద్ ఇంటర్వ్యూ వీడియో ) దీనికి వస్తువు. 1978 లో భారతి పత్రికలో ప్రచురించబడింది. 1985 లో పుస్తకంగా వచ్చింది. 1992 లో తిరిగి ముద్రించబడింది . చేర్పులతో 2018 లో మరొక ముద్రణ వచ్చింది . దళితుల పై సాంఘిక దౌర్జన్యం చారిత్రిక వాస్తవం. అది అంటరానితనం, అవమానాలు, అన్ని అవకాశాలకు పరాయీకరించటం, శ్రమ దోపిడీ, శారీరకంగా హింస అవి దళితులకు తరతరాలుగా అనుభవమే. అది పరాకాష్ఠ దశలో ప్రాణాలు తీయటం. కంచికచర్ల లో మాదిగ కోటేశు 1968 ఫిబ్రవరి 24 న అలా చంపబడ్డవాడే. ఇత్తడి చెంబు దొంగతనం చేసాడన్నది ఆరోపణ. దాని వెనక అగ్రవర్ణ స్త్రీతో రహస్య సంబంధంలోకి వచ్చాడన్న అక్కసు ఉన్నదనేది వార్త . సకారణమో, ఆకారణమో అగ్రవర్ణులు ఏకకాలంలో దళితులపట్ల నేరారోపకులు, నేరవిచారణ చేసే పోలీసులు, నేరాన్ని నిర్ధారించే న్యాయవాదులు , శిక్ష విధించే జడ్జీలు, అమలుచేసే కార్యనిర్వాహక శాఖ అవుతున్నారు అన్నది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సాక్షిగా నిజం. కంచికచర్ల లో కోటేశు సజీవదహనం అందులో భాగమే.

దీనిని వస్తువుగా చేసుకొని ఇనాక్ వ్రాసిన నాటిక ‘దిక్కులేనోడు’ ఈ నాటికలో రంగం ఒకటే. దృశ్యం ఒకటే. కోటేశు సజీవదహనం స్థలం నాలుగు వీధుల కూడలి. పక్కనే ఉన్న గాంధీ బొమ్మ సాక్షిగా ఏకోనారాయణ సూచనల ప్రకారం సాంబడు, బెమ్మం కలిసి కోటేశు ను వేపచెట్టుకు కట్టివేసి ఈ కార్యక్రమం అమలు చేసారు. ఆ దారెంట పోయే కోటేశు మేనమామ పుల్లయ్య కూడా ఈ దారుణాన్ని ఆపలేని స్థితి. ఆపి బతకలేని స్థితి. అందుకే ఏకోనారాయణ కాళ్ళ మీద పడి కనికరించమని వేడుకొనటం. ఏకోనారాయణ భూస్వామ్య వర్గం మనిషి కాదు. భూస్వామ్య వర్గం పనులు చేసిపెట్టే కిరాయి హంతకుడు. సాంబడు, బెమ్మం అతనికి సహాయకులు. నిజానికి కంచికచర్ల లోనైనా, ఆ తరువాత కారంచేడు, చుండూరు లలోనైనా దళితులపై దౌర్జన్య కాండలో గ్రామీణ భూస్వామ్య వర్గం – తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో ప్రాబల్యం వహించిన అగ్రవర్ణ సంపన్న వర్గం – ప్రత్యక్షంగానే పాల్గొన్నది. కానీ రచయిత వాళ్ళను తెరవెనుక ఉంచి కిరాయి హంతకులను రంగం మీదికి ప్రవేశపెట్టారు.

కోటేశు పై ఆరోపింపబడిన నేరం కోడిపెట్ట దొంగతనం. ఆచారి కూతురితో అతని సంబంధం గురించిన ప్రస్తావన సంభాషణలో వస్తుంటుంది . అతని చదువు, అతని ధిక్కారస్వరం, ఆచారి కూతురితో తిరగటం అన్నిటినీ హేళన చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ కొట్టిస్తూ ఏకోనారాయణ కోడిపెట్ట రేటు ఏడువేలు అని చెప్పి దానికింద కోటేశు తన ఇల్లు పొలం రాసిచ్చినట్లు సిద్ధం చేసి పెట్టిన కాయితం మీద బలవంతాన అతనిచేత సంతకం చేయించుకొని ఆ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. కూతురు కోటేశు తో తిరిగినందువల్ల పోయిన ఆచారి పరువు వెల కోటేశు ప్రాణం.

కంచికచెర్ల కోటేశు హత్య తో దళితులపై దౌర్జన్యాలు ఆగలేదు. కారంచేడు, చుండూరు ఇలా అలాంటి హత్యాకాండ పెద్దఎత్తున పునరావృతం అవుతూనే ఉంది. తన కులస్థులు, కుటుంబంవారు నిస్సహాయులై చూస్తుండగా ఒంటరి చేయబడి పీడనకు, దోపిడీకి గురిఅవుతున్న దళితుడిని కారంచేడు ఘటన సామూహక శక్తిగా మార్చింది. దళితుల సమీకరణకు, ఆత్మగౌరవ పోరాటాలకు దారితీసింది. నూతన సాహిత్య సంస్కృతుల నిర్మాణం ప్రారంభం అయింది. కంచికచర్ల నుండి కారంచేడు, చుండూరుల మీదుగా ప్రయాణిస్తూ పరిణమించిన ఆ దళిత సామూహిక శక్తి ప్రవాహంలో ఇనాక్ కూడా ఉన్నారు. అందువల్లే ఆయన కోటేశు హత్యను సాహిత్యంగా చేసి ఆగలేదు. ఆ నాటి ఆ హత్య ను ఆపగలిగిన ఈనాటి దళిత యువశక్తి ఆగ్రహాన్ని, చైతన్యాన్ని ఆవాహన చేసి ఆ నాటకం ముగింపునే విప్లవాత్మకంగా మార్చి 2018 లో తిరిగి రాశారు. ఇదొక ప్రయోగం.

కంచికచర్ల కోటేశు హత్య1968 లో ఒక వాస్తవ ఘటన. 2018 నాటికి దాదాపు అర్ధ శతాబ్ది క్రితపు చరిత్ర. వర్తమాన చైతన్యం ఆ చరిత్ర నుండి అభివృద్ధి కరంగా ఎదుగుతూ వచ్చింది. వర్తమానంలో కోటేశుల హత్యలు కొనసాగరాదు అన్న కృత నిశ్చయం నుండి అదే నాటికను మరొక నాలుగు పాత్రలను ప్రవేశపెట్టి కొద్దీ మార్పులతో కొత్త వ్యాఖ్యానం ఇచ్చారు. ఈ కొత్తపాత్రలు వాస్తవ వ్యక్తులు. దళిత అస్తిత్వ చైతన్య ఉద్యమం నుండి వికసించిన వాళ్ళు. మేధావులుగా, రచయితలు, కళాకారులుగా ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన, చేస్తున్న ఆరూరి సుధాకర్, జిలకర శ్రీనివాస్, పసునూరి రవీందర్, అందె భాస్కర్. ఆరూరి సుధాకర్ సూత్రధారుడుగా, అందె భాస్కర్ కోటేశు హత్యను దండోరా వేసే వాడుగా ఈ నాటికలో పాత్రలవుతారు. పసునూరి రవీందర్, జిలకర శ్రీనివాస్ ఒకళ్ళ తరువాత ఒకళ్ళుగా ప్రేక్షకులలో నుండి వచ్చి కోటేశు మీద పెట్రోలు పోసి తగలబెట్టటానికి సిద్ధంగా ఉన్న ఏకోనారాయణను ఎదుర్కొనటంగా ఘటనల క్రమాన్ని మార్చారు. అంతవరకు ఏకోనారాయణ ఆజ్ఞలను పాటిస్తున్న అందె భాస్కర్ లోను, అతనికి భయపడి మేనల్లుడి కట్లు విప్పటానికి జంకుతున్న పుల్లయ్య లోనూ దళిత సంఘీభావాన్ని కూడగట్టి కోటేశు కట్లు విప్పించి బంధవిముక్తుడిని చేయటమే కాదు, అదే చెట్టుకు ఏకోనారాయణ ను కట్టేసి కోటేశు వంటి మీదపెట్రోలుతో తడిసిన చొక్కాను అతని మీద వేసి తగలబెట్టటం అనే కొత్త ముగింపును నాటకానికి ఇచ్చారు.

“ఇది ప్రతినిత్యం భర్తదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యలకు ప్రతీకాక్షర రూపం” అని నాటిక ప్రారంభంలో సూత్రధారుని చేత చెప్పించిన రచయిత దళితులలో ప్రతీకారవాంఛ ప్రబలకుండా చూడవలసిన బాధ్యత భారతీయులది అన్న హెచ్చరికను కూడా సూత్రధారుని నోట పలికించటం గమనించవచ్చు. ఓటు ద్వారా రాజకీయ సమానత్వం సమకూరినా సాంఘిక ఆర్ధిక సమానత్వం లేకపోవటం వల్ల సంభవించబోయే సంక్షోభాలను గురించి అంబేద్కర్ రాజ్యాంగ రచన, అమలు సందర్భంగా ఆ నాడు చేసిన హెచ్చరిక యొక్క ప్రతిధ్వని ఇది.

3.

మునివాహనుడు 1984 లో ప్రచురించబడిన నాటకం అయినా 1976 లోనే ఇది రచించబడింది. దీని తొలి రూపం సంగీతరూపకం . ఆకాశవాణి నాటక సప్తాహంలో భాగంగా 1978 లో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అయింది. అయిదు అంకాల సమగ్ర నాటకంగా ఇది ఇంటెర్మీడియేట్ విద్యార్థులకు పాఠం అయింది. 1988 లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాన్ని పొందింది. ( ఇనాక్ మరోమాట 1992 ప్రతి .. చూడు 2017 ప్రతి ) ఈ నాటకంలో వస్తువు వైష్ణవ భక్తి ప్రపత్తికి సంబంధించినది. దక్షిణదేశంలో శ్రీవైష్ణవ భక్తి ప్రబోధకులలో పన్నెండు మంది ఆళ్వారులు ప్రసిద్ధులు. ఆళ్వారులు అంటేనే భక్తిలో మునిగిపోయినవాళ్ళని అర్ధం. ఆ పన్నెండు మందిలో తిరుప్పణాళ్వార్ ఒకడు . 8 వ శతాబ్దిలో పానార్ అనే అంటరాని కులంలో పుట్టి పెరిగి శ్రీరంగం లో రంగనాథుడుగా వెలసి ఉన్న శ్రీ మహావిష్ణువును సేవించి ముక్తి నొందాడని ప్రసిద్ధి. భగవంతుడిని కీర్తించే కవిత్వం అల్లటం, పాడటం అతని జీవితం. ఆళ్వారులు పాడిన పాశురాలు నాలాయిరం అనే పేరుతో సంకలనం అయ్యాయి. దీనినే ద్రవిడ వేదం లేదా దివ్య ప్రబంధం అంటారు. ఇందులో తిరుప్పణాళ్వార్ రచించిన పది శ్లోకాలు ఉన్నాయి.

ఇందులో నాటకం వ్రాయటానికి ఇనాక్ ను ఆకర్షించిందేమిటి? తిరుప్పణాళ్వార్ కవి, గాయకుడు కావటం. మిగిలిన ఆళ్వార్లు కూడా కవి గాయకులే. వాళ్లలో మరి ఎవరి జీవితమైనా నాటకానికి వస్తువు చేసుకోవచ్చు . కానీ తిరుప్పణాళ్వార్ అంతకన్నా ఆ నాడు అంటరాని కులానికి చెందినవాడు కావటం, శ్రీరంగ నాథ దేవాలయ ప్రవేశానికి నిరాకరించబడటం ఆయనను ఎక్కువగా ఆకర్షించి ఉంటుంది. దానికి తోడు తిరుప్పణాళ్వార్ జీవితంలోని నాటకీయత మరీ ఆకర్షించి ఉంటుంది. అంటరానివాడని దేవాలయానికి అతనిని బహిష్కరించటం శ్రీరంగనాధస్వామికి ఇష్టం కాలేదు. భక్తుడిని చూడాలని ఆయనకే ఉంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు అన్న సామెత ఉంది కాదా! ఈ పరిస్థితు లలో దేవుడే తనభక్తుడిని తనకు తెచ్చి చూపమని పూజారిని బ్రతిమిలాడుకొనవలసివచ్చింది . అతను అడుగు పెట్టటం గుడి పవిత్రతకు భంగం అన్న అర్చకుడి మాటను మన్నిస్తూ అయితే అతను అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా నీ భుజాల మీద ఎక్కించుకొనిరా అని తరుణోపాయం చెప్పాడు. ఇక పూజారికి తప్పలేదు. తిరుప్పణాళ్వార్ ను భుజాల మీద మోసుకొని ఆలయ ప్రవేశం చేయించాడు. ఇదొక నాటకీయ పరిణామం. అర్చకుని పేరు లోక సారంగముని. ముని వాహనంగా కలవాడు కనుక తిరుప్పణాళ్వార్ మునివాహనుడు అయినాడు. అంటరాని వాని ఆధిక్యతను స్థాపించిన ఈ ఐతిహ్యం ఇనాక్ హృదయానికి గిలిగింతలు పెట్టిఉంటుంది. అందువల్లనే తిరుప్పణాళ్వార్ కథ మాత్రమే ఆయన చేతిలో నాటకం కాగలిగింది.

వైదిక మతం మీద ఒక తిరుగుబాటు భక్తి ఉద్యమం. వేదం విజ్ఞానం కొందరిదిగానే చేయబడిన చరిత్రను,సంస్కృతిని భక్తి ఉద్యమాలు నిరాకరించాయి. అది శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు .. నిచ్చెనమెట్ల వర్ణ సంస్కృతిని త్రోసి వేసి భగవంతుడి ముందర భక్తులుగా అందరూ సమానులేనని స్థాపించాయి. భక్తి నిబద్ధత అన్ని లౌకిక నియమాల నుండి భక్తులకు మినహాయింపును, నిబంధనల నుండి విముక్తిని, స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. లౌకికం గా శూద్రులు, అతి శూద్రులు తక్కువ స్థాయి వాళ్ళు కావచ్చు కానీ శివ భక్తులుగానో,విష్ణుభక్తులుగానో వాళ్ళు అట్లా భక్తులు కానీ అగ్రవర్ణులకంటే, అధికారుల కంటే ఉన్నతులు, వాళ్ళను ధిక్కరించి ప్రవర్తించగల స్వతంత్రులు. భర్తకు లోబడి ఉండవలసిన స్త్రీలు కూడా భక్తి మార్గ ప్రయాణంలో భర్తలను, కుటుంబాలను తిరస్కరించ గల హక్కును, అవకాశాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో తిరుప్పణాళ్వార్ అంటరానివాడైనా పరమ భాగవతుడు కనుక కులంవల్ల, తాను చేస్తున్న ఆలయ అర్చకత్వం వల్ల అధికుడైన వాని భుజాలకెక్కగలిగిన ఆధిక్యతను పొందగలిగాడు. ఆ ఆధిక్యత దళితులకు గర్వకారణమైంది. కనుకనే నాటక వస్తువు కాగలిగింది.

అయిదు అంకాల ఈ నాటకం కథాస్థలి ప్రధానంగా శ్రీరంగనాథ దేవాలయం ముఖద్వారం, కావేరీ తీరం. ఒకేఒక దృశ్యం లోకసారంగముని శయన మందిరంలో ప్రవర్తిస్తుంది. భగవంతుడైన శ్రీరంగనాథుడు, అర్చకుడు లోక సారంగముని, భక్తుడు తిరుప్పణాళ్వార్ ఈ ముగ్గురిమధ్య సంభాషణ, సంఘర్షణగా నాటక కథ వికసిస్తుంది. ఆ ముగ్గురి వ్యక్తిత్వాలను, సంబంధాలను, సంభాషణలను గమనిస్తూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా వేదవేద్యుడు, దేవదత్తుడు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సంవాదం నాటకం పొడుగునా నడుస్తుంటుంది. వేదవేద్యుడు భక్తి మార్గానికి , దేవదత్తుడు సం ప్రదాయ వైదిక మార్గానికి ప్రతినిధులుగా విషయాన్ని తర్కిస్తున్నట్లు ఉంటుంది. తిరుప్పణాళ్వార్ ధ్యాన నిష్ఠను, గాన మాధుర్యాన్ని, ఆత్మ ఆర్తిని దేవదత్తుడు తక్కువ చేసి మాట్లాడటం, హేళనగా మాట్లాడటం అతని పంచమ కులాన్ని బట్టే. వేదవేద్యుడు తిరుప్పణాళ్వార్ గాన ధ్యాన నిష్ఠను ప్రశంసించటంలో వ్యక్తిగా అతని తత్వాన్ని గుర్తించి గౌరవించటమే ఉంది కానీ కుల ప్రమేయం లేదు. కులంతో మనిషిని దైవానికి దూరం చేయ సమకట్టిన వైదిక సంప్రదాయం అంటరాని పంచముడిని సమాధి భగ్నం చేసి తోవకు అడ్డు తొలగమని చెప్పటానికి రాయి విసిరి గాయపరచటానికైనా సందేహించదు. దానిని దేవదత్తుడు తగినశాస్తి జరిగిందని మెచ్చుకొంటే వేదవేద్యుడు అది అన్యా యం అన్నాడు. అక్కున చేర్చుకొని గాయానికి కట్టుకట్టాడు. ఇదంతా విలువల సంఘర్షణ. ఇది వైదిక సంప్రదాయం మీద , భక్తి మతం సాధించబోయే విజయాన్ని సూచిస్తూ అభివృద్ధి చేయ బడింది.

రోజు సన్నిధిలో ఉండి అభిషేకార్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించే లోకసారంగముని కన్నా భగవంతుడికి పంచముడైన తిరుప్పణాళ్వార్ ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు ? అతనిని సగౌరవంగా అర్చకుడి భుజాల మీద ఊరేగింపుగా గుడిలో తన సన్నిధికి రప్పించుకొని తనలో లీనం ఎందుకు చేసుకొన్నాడు? భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే అనటం ఒక మాట. అంతకన్నా ప్రత్యేకం చెప్పుకోవలసినది లోకసారంగమునికి, తిరుప్పణాళ్వార్ కు మధ్య వున్న భేదం. అదేమిటంటే లౌకిక నీతి బద్ధుడైన లోకసారంగముని నియమ నిబంధన లకు భక్తుడైనట్లుగా,సంప్రదాయానికి భక్తుడైనంతగా తనకు భక్తుడు కాకపోవటం. భగవంతుడి పై తన అధికారాన్ని స్థాపించుకొని ఇతరులను దరి చేరనీయక పోవటం. తిరుప్పణాళ్వార్ తన పట్ల నిబద్ధుడై మిగిలిన లౌకిక తిరస్కారాలను, బాధలను పట్టించుకోకపోవటం ఈ తేడా వల్ల భగవంతుడికి అగ్రవర్ణుడి కన్నా పంచముడు సన్నిహితుడు కాగలిగాడు. పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకడుగా గౌరవం పొందాడు. ఆ ఘనమైన చరిత్ర ఆత్మ గౌరవ ఉద్యమాల నేపథ్యంలో దళితులకు ఒక నైతిక బలాన్ని ఇస్తుందని ఇనాక్ ఈ నాటకం వ్రాసారు.

ఇక 1912 లో వచ్చిన ‘నీడ’ నాటకం దళిత ఇతిహాసం. 16 దృశ్యాల నాటకం ఇది. అయిదు పాత్రలు ప్రధానం. ఆ పాత్రలకు పేర్లు లేవు. ఒకటవ వాడు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగవ వాడు, అయిదవ వాడు అని వాళ్ళు చెప్పబడుతుంటారు. వరుసగా వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దళిత వర్ణాలకు ప్రతినిధులు. మొదటివాడు దేవరా, రెండవవాడు మారాజా, మూడవ వాడు సామీ, నాలుగవ వాడు దొరా అని సంబోధింప బడుతుండగా అయిదవ వాడు రేయ్, మొద్దూ, దున్నపోతూ, గాడిదా అని ఇటువంటి న్యూన నిందార్ధక వాచకాలతో సంబోధించబడుతుంటాడు. నాటకం ప్రారంభంలోనే ఈ విషయాన్ని నిరూపించి ఇక అసలు నాటకం చూడండి అంటూ విషయంలోకి మనలను ప్రవేశ పెడతారు రచయిత. పై నలుగురూ చెట్టుమీద తరతమ భేదాలతో ఆసనాలమీద నిచ్చెన మెట్ల నిర్మాణంగా కూర్చొనటం చెట్టు ఇచ్చే పండ్ల మీద సర్వాధికారాలు కలిగి ఉండటం, అయిదవ వాడు చెట్టుకింద నివాసం. చెట్టుకింద ఊడ్చి శుభ్రం చేయటం, చెట్టుకు నీళ్లు పోయటం, ఫలాలకు కాపలా ఉండటం, పై నలుగురూ దయతలచి ఇచ్చింది తినటం ఇదీ అతని జీవితం. ఆ నలుగురి కూటమి వాళ్ళతో పాటు సమానత్వం, కూర్చొనటానికి కుర్చీ ఇస్తామని ఆశపెడుతూనే ఎప్పటికప్పుడు ఐదోవాడి శ్రమను తమయెదుగుదలకు వీలుగా ఉపయోగించుకొంటూ దోపిడీ పీడనలు యథాతథంగా కొనసాగిస్తూ నిషేధాలమధ్య బందీ చేసిన క్రమాన్ని అంచలంచెలుగా నాటకేతివృత్తంలో నిరూపిస్తూ వచ్చారు రచయిత.

ఈ నాటకంలో చెట్టును ఆధిపత్య శక్తిగా రూపింప చేశారు ఇనాక్ . ఆధిపత్య స్థానాన్ని కైవసం చేసుకొన్న శక్తుల గురించి వాళ్ళలోనూ ఉన్న తరతమ అంతరాల గురించిన సూచన చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య స్థానాలను కైవసం చేసుకొనే క్రమంలో శ్రమనుఇయ్యటానికి తప్ప సంపదలో, సుఖంలో వాటా పొందటానికి వీలులేకుండా పరాయీకరించ బడిన దళితుడి రూపాన్నినిలువెత్తు చిత్రపటంలా ఆవిష్కరించారు. ఈ స్థితిలో పురాణకాలాల నాటి సృష్టి కర్త మొదలు,చారిత్రక కాలాల బుద్ధుడు, ముస్లిం మత ప్రతినిధి ఫకీరు,మిషనరీలు, గాంధీ, రాజ్యాంగ రచయిత అంబేద్కర్, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలు అందరూ అన్నీ ఆ ఐదోవాడికి ఇచ్చిన ఊరట, చైతన్యం ఎలాంటివో నిరూపించటంగా నాటకాన్ని నడిపించారు రచయిత.

ఈ చైతన్యం నుండి దళితుడు ఆధిపత్య అవశేషాలన్నీ కూలదోసి భూమి మీద అందరూ కలిసి సమాన విలువల సమాజాన్ని శ్రమ ప్రాతిపదికగా నిర్మించుకొని స్వేఛ్చ గా, స్వతంత్రగా సంతోషంగా జీవించటం గురించి కల కంటాడు. ఆ రకమైన కొత్త జీవిత నిర్మాణానికి అతనిదే నాయకత్వం అన్న సూచనతో నాటకం ముగుస్తుంది. రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా దళిత ఉద్యమం నడుస్తున్న కాలంలో ఇనాక్ దళితుడి దృష్టి ఓటు రాజకీయాలమీద కంటే బాధించినవారిని కూడా సానుభూతితో చూసి కోల్పోయిన మానవత్వాన్ని వాళ్లలో తిరిగి పాదుకొల్పే బాధ్యతపై ఉండాలని సూచిస్తూ ,ఉంటుందని నిర్ధారిస్తూ నాటకాన్ని ముగించటం విశేషం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply