ఆధునిక యువత జీవితాలను చిత్రించిన ఇనాక్ నవలలు

కథకుడిగా తెలుగు సృజన సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని సంపాదించుకొన్న కొలకలూరి ఇనాక్ నవలా రచయిత కూడా. 1961 నుండే ఆయన నవలలు పత్రికలలో సీరియల్స్ గా ప్రచురించబడుతూ వచ్చినా అంతగా ప్రసిధ్ధిలోకి రాకపోవటానికి ప్రధానంగా అది మహిళా రచయితల నవలలు పత్రికలను ఆక్రమించిన కాలం కావటం కారణం అయివుండవచ్చు. మీరు నవలలురాశారా? అనేవాళ్లకు, రాస్తారా అనిఅడిగేవాళ్లకు సమాధానం చెప్పటానికి అన్నట్లుగా 2010లో ఇనాక్ తన నవలలను ఎనిమిదింటిని మూడు సంపుటాలుగా జ్యోతీగ్రంథమాల పక్షాన ప్రచురించారు. ఈసంపుటాలకు ఆయన ‘సింహావలోకనం’ శీర్షికతో వ్రాసుకొన్న ముందుమాట వల్ల ఈ రచనల తొలి ప్రచురణ వివరాలు తెలుస్తున్నాయి.ప్రతులు లభిస్తుండటం వల్ల ఈసంపుటాలలో చేర్చని అనంతజీవనం నవలను గురించి కూడా తెలుస్తున్నది.. 1961 నుండి 72 లోపల పన్నెండేళ్ల కాలంలో ఇనాక్ వ్రాసిన నవలలు ఏడు. మళ్ళీ పద్నాలుగేళ్ళకు 2006 లోసర్కారుగడ్డి, 2007 లో అనంత జీవనం నవలలు ప్రచురించారు. మళ్ళీపదకొండేళ్లకు( 2018) రంధి నవల వచ్చింది.2020 లో ఏకంగా మూడునవలలు ప్రచురించారు.వాటిలో ఒకటి కరోనా కాలపు వలసలు వస్తువుగా రావటం మరీ విశేషం. వీటికి తోడు ఆయన పులులబోను- నేను అని మరొక నవల వ్రాసినట్లు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి వ్రాసిన “ఆచార్య కొలకలూరిఇనాక్ సాహిత్య సృష్టి- దృష్టి” అనే విమర్శాగ్రంధం వల్ల తెలుస్తున్నది. అన్నీ కలిసి మొత్తం పధ్నాలుగు నవలలు. వీటిని అధ్యయన సౌలభ్యం కోసం అరువయ్యవ దశకపు నవలలు, డెబ్భయ్యవ దశకపునవలలు, నూతన సహస్రాబ్ది నవలలు అని వర్గీకరించి పరిశీలించవచ్చు.

అరవైయ్యవదశకపు నవలలు అయిదు.అవి 1. పులుల బోను- నేను(1959) 2.సమత(1960) 3.అనాథ(1961 ) 4.సౌభాగ్యవతి(1965) 5.రెండు కళ్ళు- మూడు కాళ్ళు( 1969). తొలి నవల వ్రాసేనాటికి అప్పుడే తాజాగా ఆనర్స్ డిగ్రీ పూర్తిచేసి వున్నారు. నాటక రచయితగా మంచిగుర్తింపును పొంది ఉన్నారు. దళిత వర్గం నుండి ఉన్నత విద్యకు వచ్చి సాహిత్య కళాసాంస్కృతిక అప్పటికి ఆయన ఇరవై రెండేళ్ల నవ యువకుడు. అప్పుడే ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు ఆనర్స్ డిగ్రీ పూర్తిచేసుకొని వచ్చారు. చదువుల కాలంలో దళిత కులం నుండి వచ్చినవాడుగా ఎందరి అసహనానికో, అనవసర ద్వేషానికో గురవుతూ పొందిన అవమానాలు, భంగపాట్లు, చేసిన తిరుగుబాట్లు వస్తువుగా వెంటనే ‘పులుల బోను- నేను’ అనే నవల వ్రాసారు. మధుజ్యోతి దీనిని స్వీయకథాత్మక నవల అన్నారు. కుల వ్యవస్థ కనిపించని పులుల బోను. ఆ బోనులో చిక్కి మానని గాయాలెన్నిఅయినా పులుల వాతపడకుండా తనను తాను నిలబెట్టుకొన్న వ్యక్తిత్వం గల యువకుడు ఈ నవలకు నాయకుడు. విద్యార్థిగా తెలుగు శాఖ పక్షాన హైదరాబాదు యువజనోత్సవాలకు వెళ్లిన అనుభవం వంటివి ఈ నవలలోనే కాదు స్సమత నవల ఇతివృత్తంలోనూ భాగం అయ్యాయి.

సమత నవలలో కథ రాజారావు అనే దళిత యువకుడు ఇంటర్మీడియట్ చదువుకు గుంటూరు వెళ్ళటం దగ్గర ప్రారంభమై ఆనర్స్ పూర్తయి ఉద్యోగం సంపాదించి ఇష్టపడిన అమ్మాయిని పెళ్లాడటం వరకు ఐదారేళ్ళ కాలం మీద నడుస్తుంది.ఆ యవ్వన కాలపు కళాశాల అనుభవాలు, స్నేహాలు, స్త్రీపురుష ఆకర్షణలు, ప్రేమలు, ఉద్వేగాలు, సంఘర్షణలు ఈ నవలకు వస్తువును ఇచ్చాయి.

నవల ప్రారంభంలో రాజారావు నిద్ర మేల్కొని కిటికీలోంచి మైలు దూరంగా కనిపిస్తున్న వూరు ను చూస్తూ కలవరానికి లోను కావటం చెప్పబడింది . “ఊరు దూరంగా ఉంది. కాదు . వూరికి దూరంగా తను ఉన్నాడు. ఆ సంఘం సంఘంలో మరొక భాగాన్ని వూరికి దూరంగా ఉంచింది” ఇవి వున్న వూళ్ళో హైస్కూల్ విద్య పూర్తి చేసుకొని ఆ రోజు ఇంటర్మీడియట్ లో చేరటానికి గుంటూరు బయలుదేరుతున్న యువకుడిలో మెదిలిన ఆలోచనలు. అతని సంతోషపు పొంగు మీద నీళ్లు చిలకరించిన ఆలోచనలు. కులం వల్ల సమాజంలో అనుభవానికి వస్తున్న హెచ్చుతగ్గుల గురించిన నిరసనను వినిపించే ఆలోచనలు. ఈ పరిస్థితులు మారాలి అన్న చేతన మేల్కొన్న దశలో ఉన్నతవిద్యకు అతని ప్రయాణం ప్రారంభం అయిన్దనుకోవచ్చు. కొడుకును గుంటూరు పంపుతూ తండ్రి చెప్పిన మాటలు దానికి బలంచేకూర్చేవి. ఆ తండ్రి ఏమి చెప్పాడు? మన వంశంలో చదువుకొన్న మొదటివాడివి నువ్వు . బాగా చదువుకో పేరు తెచ్చుకో . మాకు పేరు తీసుకురా అని. అంతమాత్రమే అయితే అది ఏ తండ్రి అయినా చెప్పేమాటే. అంతకంటే అదనంగా ఆయన చెప్పిన మాట “కులం కారణంగా ఒకడి గొప్పతనం గానీ, మరొకడి తక్కువదనం గానీ లేదు. సమాజంలోని అందరూ సమానులే అని చెప్పే ప్రయత్నం నీ తండ్రి కోర్కెగా నువ్వు తీర్చాలి. అది ఏ రూపంలో నువ్వు సాధించినా నేను సంతోషిస్తాను.” అని. ఆయనకు ఈ చైతన్యం ఎక్కడనుండి ఏ సామాజిక శక్తి మూలం అన్న ప్రశ్నను అలా వుంచితే 1960 వదశకానికి పల్లెలలో దళిత ఆత్మగౌరవ చైతన్య బీజాలు మొలకెత్తుతున్న విషయాన్ని గురించిన ఒక స్థూల అవగాహనను ఆ తండ్రి మాటలు మనకు అందిస్తాయి.

కులం కారణంగా ఒకడి గొప్పతనం గానీ , మరొకడి తక్కువదనం గానీలేదు, సమాజంలోని అందరూ సమానులే అని రాజారావు ఎలా నిరూపించాడో చూపటంగా నవల ఇతివృత్త వికాసం జరిగింది. కాలేజీ వ్యాసరచన, వక్తృత్వపోటీలల్లో ప్రతిభ కనబరచడం ద్వారా, నాటక రచనలో ప్రావీణ్యం చూపి బహుమతులు పొందటంద్వారా, నాటకాలలో నటించి మెప్పుపొందటం ద్వారా చివరకు ఎంత సంఘర్షణాత్మక మనఃస్థితిలో నైనా సంయమనం కోల్పోకుండా చదువు మీద దృష్టి కేంద్రీకరించి ఉత్తీర్ణత సాధించటం ద్వారా రాజారావు కులం వల్ల తాను ఎందులోనూ తక్కువ కాదని సంఘంలో మిగిలిన వాళ్ళతో, తనను అంటరానివాడని దూరం పెట్టిన వాళ్ళతో పోటీపడి నెగ్గగలవాడినని నిరూపించుకున్నాడు. ఉద్యోగం పొందగలిగాడు. ఆవిషయం తెలిపే ఆర్డర్ వచ్చినప్పుడు రాజారావు ‘ నాతండ్రి కోరిక ఒకటి తీరింది’ అనుకున్నాడు. మరొక కోరిక ఏమిటని రాజారావు అనుకుంటున్నాడు అంటే అది పెళ్ళికి సంబంధించినదే అయివుండాలి.

రాజారావు ఇంటర్మీడియట్ చదువుకు వెళ్ళేటప్పుడు తల్లి మేనమామ కూతురి ప్రస్తావన తెచ్చి పెళ్లి గురించి అడుగుతుంది. బిఎ అయ్యేవరకు పెళ్లిమాటవద్దన్నాడు నాన్నఅనిచెప్పి తనకుకూడా ఇప్పుడు పెళ్లి ఉద్దేశం లేదన్నాడు. లేదన్నా ఆఆలోచన మెదడులోకి వచ్చాక తర్కం తప్పలేదు.ఏదో సమన్వయం కూడా అతని మనసులో లీలగా పొడగట్టింది అంటాడు కథకుడు. కులంకారణంగా హెచ్చుతగ్గులులేవు, అందరూ సమానులే అని చెప్పే ప్రయత్నం గురించి తండ్రి చేసిన హెచ్చరిక తో అనుసంధానించుకొని ఆలోచించటం వల్ల తోచిన సమన్వయం కావచ్చు అది. అది కులాంతర వివాహానికి సంబంధించిన ఆలోచనా బీజం.అది తరువాతి నవలెతివృత్తంలో రెమ్మలు, కొమ్మలు వెయ్యటం చూస్తాం.

యవ్వన సహజమైన ఆకర్షణలు రాజారావు జీవిత గమనంలో చాలా ప్రాధాన్యత వహించాయి. లీల, సంధ్య, కుసుమ్ బేగం, మరదలు స్వర్ణ అతని దృష్టిని ఆకర్షించారు. అతనిని ఇష్టపడ్డారు . వాళ్ళతో అతనిస్నేహాలు, సరదాలు, సంభాషణలు విస్తృతంగానే వర్ణించబడ్డాయి. అతనికి లీలకు మధ్య ఆకర్షణ ప్రేమగా వికసించి పెళ్లి ప్రస్తావనల వరకు రావటం ఇంటర్మీడియట్ నాటికే జరిగింది. ఆమెను పెళ్లాడటం తనకు ఆశయసిద్ధి అనుకొన్నాడు. ఆమె స్నేహంతో తాను ఉన్నత దశకు వస్తాననుకొన్నాడు. ఇవి లీలకు రాసిన ఉత్తరంలో రాజారావు అన్న మాటలే . సవర్ణ స్త్రీని పరస్పర ఇష్టంతో పెళ్లాడటం అతని ఆశయం అన్నది ఇక్కడ సూచితం. అది వాచ్యం అయింది స్వర్ణ దగ్గర.

మేనమామ తో మాట్లాడుతూ రాజారావు ఒక సారి భేదాలు లేని సమతామయ సమాజం గురించి తాను ఊహిస్తున్నట్లు చెప్పాడు. ఆదిమానవుడి నుండి అనంతమైన మానవసమాజం రూపొందే క్రమంలో శ్రమ విభజన అవసరమై అదే వర్ణ సమాజంగా మారి ఎక్కువ తక్కువ భేదాలు స్థిరమై మానవులు పతనం అయ్యారని, మతాలుగా, కులాలుగా, ఉపకులాలుగా వేరుపడిన మనుషుల మనస్సులు మంట గలుస్తున్నాయని ఈ విభేదాలు పోవటానికి రక్తంలో మార్పురావాలని రక్తంలో మార్పు రావటం వర్ణాంతర, కులాంతర, మతాంతర వివాహాల వల్లనే సాధ్యం అవుతుందని ఒక సిద్దాంతం కూడా చెప్పాడు. ఆ సందర్భంలో తాను కులాంతర వివాహం చేసుకొంటానని చెప్పాడు. బావను పెళ్లాడాలనుకొన్న స్వర్ణ ఆ మాట విని ముందు భోరున విలపించినా తరువాత అతని ఆశయాన్ని అభినందించింది.

సామాజిక సంబంధాల గురించి, కులాంతర వివాహాల గురించి ఈ రకమైన రాజారావు అవగాహనకు కారణమైన సామాజిక చైతన్య వాతావరణం ఈ నవల ఇతివృత్తంలో భాగం కాలేదు. తనచదువు, నాటకాలు, సాంస్కృతిక ఉత్సవాలు, మిత్రులతో ముఖ్యంగా స్త్రీలతో తిరగటం, వాళ్ళ కోసం అంతరంగం లో ఆవేదన పడటం తప్ప అతను ఎక్కడా సమాజంలోని ఇతరేతర సామూహిక శక్తుల సంబంధంలోకి వెళ్లినట్లుగానీ, కులమత వర్గ వైరుధ్యాల అనుభవతీవ్రతలో సంఘర్షణకు లోనుకావడం కానీ, ఏ సామాజిక ఆర్ధిక రాజకీయ ఉద్యమాలకు సన్నిహితమైనట్లుగానీ కనబడదు. అలాంటప్పుడు పతనోన్ముఖమైన మానవ సమాజ ఉద్ధరణకు ఏకైక పరిష్కారంగా కులాంతర వివాహాన్ని ఎలా నిర్ధారించగలిగాడన్నది ప్రశ్న. కుల అసమానతలు రద్దు కావటం ఒక్కటే అతని ఆకాంక్ష. దానికి మార్గం కులాంతర వివాహాలు అన్నది అతను అభివృద్ధి చేసుకొన్న భావన. వ్యక్తిగత స్థాయిలో దానికి అతను నిబద్ధుడు. అంతే అనుకోవాలి.

అతను పెళ్లాడాలనుకొన్న లీల కానీ, చివరకు పెళ్లాడిన సంధ్య కానీ ఫలానా కులం వాళ్లన్న సూచన నవలలో లేదు. నిర్దిష్ట కులాలకు సంబంధించిన మనుషులుగా వాళ్ళెక్కడా రాజారావు కులం గురించి ఆలోచించినట్లుగానో, సంఘర్షణకు లోనయినట్లుగానో కనిపించదు. వాళ్ళిద్దరి మొహాన వున్న బొట్లు గురించి రాజారావు అనుకొనటం, మేన మరదలు స్వర్ణ నుదుటన ఎర్రసిరాతో బొట్టు పెట్టటం చూస్తే హిందూ సవర్ణ స్త్రీల పట్ల అతని లోలోపల ఆసక్తి , ఆకర్షణ, ఆరాధన ఏవో పెనవేసుకొని ఉన్నట్లు అర్ధం చేసుకోవచ్చు. సంధ్యను సహచరిగా చేసుకొనటానికి నిర్ణయించుకొన్న తరుణంలో తన తండ్రి ఆశయానికి తనకు తెలిసిన విధంగా రూపంఇచ్చానని సంతృప్తి పడతాడు. తండ్రి అతని పనికి ఆనందిస్తాడు. సంధ్యతో జీవితాన్నినిర్మించుకొనటానికి సిద్ధపడినప్పుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత వాక్యాలు సంకేతాలు ఏకకాలంలో అతని ఊహలో కదిలినట్లు సూచిస్తూ నవలను ముగించారు ఇనాక్. నవల పూర్తయ్యేటప్పటికి కులమత వ్యవస్థపట్ల పెద్దగా అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు కానీ ఆ కుల మతాలలో ఎక్కువ తక్కువ భేదాల పరికల్పన, ఆ పేరుమీద మనుషులను కొందరిని నిరాకరించటం మాత్రం కూడనిది అని రచయిత భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది.

తన పట్ల ఈర్ష్యను, అకారణ ద్వేషాన్ని పెంచుకొని హాని చేయ ప్రయత్నించిన రత్నరాజు, మధు మొదలైన వాళ్లందరినీ క్షమించి వాళ్ళు కోరుకొన్న స్త్రీలతో పెళ్లిళ్లకు ఏర్పాటు చేసాడు. మనిషిలో కొన్ని లోపాలు ఉంటే సవరించుకోవచ్చు. కానీ మనుషులను వదులుకోకూడదు అన్న అతున్నత మానవతను ప్రదర్శించాడు. ఆపాకరం తలపెట్టినవాళ్ల పట్ల ఇంత సహనం, దయ ఎవరికైనా సాధ్యమా అంటే దళితులకు అది సాధ్యం అని రాజారావు పాత్ర ప్రవర్తన ద్వారా నిరూపించదలచుకొన్నారు ఇనాక్. మిత్రుడు వేదాంతానికి మధ్యప్రదేశ్ లో ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా మధ్యప్రదేశ్ లో ఉన్న తన బంధువు సుందరం గురించి, అతని పెండ్లి గురించి చెప్తూ సమాజంలో తక్కువ కులంగా చూడబడుతున్న వాళ్ళ జీవితంలో ఎంత ఉన్నత భావ సమ్మేళనం ఉందో గమనించు అని రాజారావు చేసిన వ్యాఖ్యానం వెలుగులో చూసినప్పుడు ఇది అర్ధం అవుతుంది.

సుందరం పెళ్లి కథ ఏమిటి? సుందరానికి భార్య కావలసిన అతని అక్క కూతురు అతని అన్నకు భార్య అయింది. అన్న మీద ఉన్న ప్రేమతో , గౌరవంతో సుందరం తాను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పలేకపోయాడు. చిన్నప్పటి నుండి సుందరమే తన భర్త అని ఊహలు అల్లుకున్న ఆ అమ్మాయి పెద్దలను కాదనలేక, తన అభిప్రాయం చెప్పలేక తలవంచి తాళి కట్టించుకొన్నది. భర్త కావలసినవాడు మరిది అయి ఇంట్లో తిరుగుతుంటే అన్నతో కాపురం సహించరానిదై ఆత్మహత్యకు తలపడింది. సుందరం రక్షించాడు. అప్పుడు గానీ అందరికీ విషయం అర్ధం కాలేదు.దానితో సుందరానికి ఆమెకు పెళ్లి చేశారు. అన్న మరొక పెళ్లి చేసుకొన్నాడు. అందరూ కలిసి ఒకింటనే కాపురం. సుందరం చదువుకు ఊరువదిలి వెళ్లాల్సి వచ్చినా భార్యను అన్నా వదినలతో పాటే ఉంచాడు అని ఆ కథను ముగిస్తూ రాజారావు చేసిన వ్యాఖ్యానం అది. దళితులు పరిస్థితులను, మనుషులను అర్ధంచేసుకొంటూ సహజ మానవతతో ప్రవర్తిస్తారు. కృత్రిమ కౌటుంబిక లైంగిక విధి నిషేధాలకు ప్రాధాన్యమిచ్చి జీవితాలను ధ్వంసం చేసుకోరు. జీవితాలను నిర్మించుకొనటం ఆశయంగా కాక అవసరంగా అతిసహజంగా చేస్తున్న దళితజాతి సంస్కారం పట్ల రాజారావుకు ఉన్నఆ అభినివేశమే అతని ప్రవృత్తిలో, ప్రవర్తనలో వ్యక్తమయింది అనుకోవచ్చు.

అనాథ నవల 1961 లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక బహుమతిని పొంది ధారావాహికగా ప్రచురించబడింది. ఈ నవలలో కథ 1932లో మొదలై 1959 వరకు కొనసాగుతుంది. సమత నవలలోని రాజారావుకు ఈ నవలలోని రవికి చాలా పోలికలు ఉన్నాయి. రవి కూడా దళితుడే. కానీ ఇతనికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కష్టం మీద స్కూల్ ఫైనల్ పూర్తిచేసాడు. ఏడాదిపాటు చిన్నచిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బుతో హరిజన హాస్టల్ లో ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆనర్స్ చదవటానికి పోలితల్లి సహాయం చేసింది. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న అతని ఉద్యోగ జీవితానికి ఈ నవలేతి వృత్తంతో పనిలేదు. ప్రధానంగా అతని జీవితంలోకి వచ్చిన స్త్రీల ప్రవృత్తులలోని వైవిధ్యం, వైచిత్రీ చిత్రణం ఈనవల. వర్తమానం నుండి గతానికి , గతం నుండి వర్తమానానికి కథను నడిపించే కథన శిల్పంతో సాగుతుంది ఈ నవల.

సంవత్సరాలు, సందర్భాలు ప్రస్తావిస్తూ ఇతివృత్తానికి ఒక సామాజిక వాతావరణం కల్పించటం ఈ నవల లోప్రత్యేకత.1932 మే నెల మొదటివారంలో ఒకరోజు అమావాస్య రాత్రి ఒకవైపు పోలేరమ్మ జాతర లో బలులు జరుగుతుండగా జాతర అధిపతి పోలేరయ్య బలిపశువును నరకబోయి తానే దానికి బలి అయిన సమయంలోనే పూరిపాకలో అతని భార్య పోలి ఒకవికృత శిశువుకు జన్మ నిచ్చిందని చెప్పి రచయిత ఒక భీభత్స మాంత్రిక వాతావరణంలో నవల లో కథను ప్రారంభించారు. జాతరలో బలి కార్యక్రమం నిర్వహించే వస్తాదు, అతను తన విధిని సరిగా నిర్వహించలేని స్థితిలో రంగంలోకి దిగిన పోలేరయ్య ఇద్దరూ తలలు తెగి పడిన సమయంలో చిన్నకళ్ళు లోపలిపోయిన ముక్కు, మొహం మీదవెంట్రుకలు, గూని తో పుట్టిన ఆశిశువును అపశకునంగా భావించారు ఊరిజనం. వాళ్ళ నుండి ఆపిల్లను కాపాడుకొనటానికి పోలి పడరానిపాట్లు పడి ఆక్రమంలో ఊరు వదిలి పోవాల్సి వచ్చింది. చివరకు బిడ్డను తల్లితండ్రులు లేని అనాథ బాలికల శరణాలయంలో చేర్చవలసి వచ్చింది. దయ్యపుపిల్లగా ఊరివాళ్ల ఏహ్యతకు, నిరాదరణకు గురయిన పోలితల్లి చదువుకొని కాన్వెంటులో ఉపాధ్యాయురాలై అధిరోహించిన శిఖరాలను చూపటం ఈనవలలో ఒకకథ. ఆద్యంతాలు ఆమెదే కథ.

మధ్యలో వచ్చే వసంత కథ మరొకటి. అనాథ శరణాలయంలో పోలితల్లి చెల్లిగా ఆదరించిన అమ్మాయి. శరణాలయం నియమాలకు వ్యతిరేకమైన మగవాళ్ళతోటి స్నేహాలు, సంభాషణలు ఆమెను హాస్టల్ బయటకు నడిపించటమే కాదు, మార్గం తప్పివేదన పడేట్లు చేసింది. అవివాహిత మాతను చేసింది. శిశువును వదిలి వెళ్లేట్లు చేసింది. ఆశిశువు పోలితల్లి దగ్గర పెరుగుతున్న్నాడని తెలిసి పెళ్లి అయ్యాక భర్త అంగీకారం పొంది ఆమెదగ్గరకు వెళ్లి తన బిడ్డను తెచ్చుకొనటం ఆమెకథ.

పోలితల్లి, వసంత చేరదీసి లాలించిన చిన్నచెల్లి హేమలత కథ ఇంకొకటి.రవిని పెళ్ళాడి పోలితల్లి దగ్గరకు వచ్చి చేరి ఒకబిడ్డ తల్లి అయి బిడ్డతో పాటు మరణించటం ఆమె కథ. ఆమె పుట్టుకకు, వారసత్వానికి సంబంధించిన కథను రవి శోధించి తెలుసుకొనటం గొలుసు కథ.

అనాధ శరణాలయంలో కలిసి పెరిగిన ఈ ముగ్గురు స్త్రీలకు సాధారణ కేంద్రం రవి. పోలితల్లి దాహంతో దరిద్రంలో ఉన్న అతనిని ఆదుకొని చదువుకు సాయపడింది. కాలేజీలో వసంతతో ప్రేమ వ్యవహారం పెళ్లివరకు వచ్చి ఆగిపోయింది. హేమలతకు ఆకర్షితుడై పెళ్ళాడి తీసుకువచ్చాడు. అన్యోన్య దాంపత్యం ఎక్కువకాలం సాగలేదు. ఆమె మరణించింది. అప్పటికే పోలితల్లి తనతో సహజీవనం కోరుకొంటున్నది అనిగ్రహించిన రవి ఆమెను తన సోల్ మేట్ గా గుర్తించాడు. పెళ్లిచేసుకొన్నాడు. ఈ ముగ్గురు స్త్రీలకన్నా ముందు అతని జీవితంలోకి వచ్చిన స్త్రీ రాణి , వైద్యవిద్యార్థి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. తరచు అసాధారణమైన ప్రవర్తనతో పిచిఆసుపత్రిలో చేరుతూ ,తిరిగివస్తుండే ఆమె పట్ల ఆసక్తి పెరిగింది. భౌతిక విపరీత చేష్టలకు మానసిక కారణాలు వెతకటం స్వభావమైన రవి ప్రేమ కోసమైన ఆకాంక్షా పరితృప్తి లేకపోవటమే ఆమె అసాధారణ ప్రవర్తనకు కారణంగా గుర్తించి, ఆమెకు ప్రేమను ఇచ్చి తాను సంతృప్తి పడ్డాడు. ఆమెను కాపాడుకొనటంకోసం పెళ్లాడాడు. తనది అంటూ వేరే జీవితం లేకుండా ఆమె కోసం బతికాడు. కానీ ఆమె అతని నుండి వేర్పాటును కోరింది. ఎంత ప్రయత్నించినా ఆ బంధం ముడిపడలేదు.అది గతానికి సంబంధించిన ఒక జ్ఞాపకం.

విద్యా వివాహ విషయాలలో దళితులు ఎదుర్కొనే వివక్షను చర్చించటానికి ఇనాక్ ఈ నవలలో ప్రయత్నించారు.సవర్ణులలో ఒక వైపు దళితులకు స్నేహ హస్తం అందించే గోపీ వంటి వ్యక్తులు ఉన్నా, చదువు వల్ల, సంస్కారం వల్ల దళితులు ఆత్మగౌరవ చైతన్యాన్ని పొందుతున్నా ప్రేమ, పెళ్లి విషయంలో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకొనటానికి కులం అవరోధం కావటం వాస్తవం. మొదటి చూపులోనే రాణి ఆకర్షణలో పడ్డాడు రవి. గోపీ చిన్నాన్న కూతురు కనుక అతనితో పాటు అప్పుడప్పుడు ఆమెను కలిసే అవకాశం కలిగేది. ఆమెను ప్రేమించటం మొదలు పెట్టాడు. పెళ్లి గురించి కలలు కూడా కన్నాడు. ఆ సమయంలో ‘నిజానికి నేను రాణిని ప్రేమించటానికే అర్హత లేనివాడిని’ అన్న ఎరుక అతనిని బాధిస్తూనే ఉంది. మనిషిగా, యువకుడిగా, బాహువుకుడుగా ప్రేమించటానికి, ప్రేమించబడటానికి అతను అర్హుడే. కులం రీత్యా సమాజం దృష్టిలో అతను అగ్రవర్ణ మహిళను ప్రేమించటానికి పెళ్లాడటానికి అనర్హుడు అవుతున్నాడు. అది ముల్లులా రవిని వేధిస్తూనే ఉంటుంది. ప్రేమలు వైఫల్యాల మధ్య, తనకు కావలసినదేదో దక్కటంలేదన్న ఉక్రోషంవల్ల తరచు మనసు చెదిరి ఆసుపత్రి పాలవుతున్న రాణికి సహనంతో స్నేహాన్ని పంచగల రవి సమక్షంలో ఊరట కలుగుతున్నదని గుర్తించాక తల్లిదండ్రులకు రాణి కోరినట్లు అతనితో పెళ్లి జరిపించాక తప్పలేదు.

కానీ రవిని గురించి తక్కువకులం వాడని అనుకున్నారు, అని అవమానపరిచారు కూడా. పెళ్లి నాటికి రవికి ఇంటర్మీడియేట్ పూర్తయింది. రాణి మెడిసిన్ రెండవ సంవత్సరంలో ఉంది. రాణి తల్లిదండ్రులే వాళ్ళను పోషించవలసిన పరిస్థితి. ఈ పెళ్లి పట్ల అయిష్టం, రవిపట్ల తిరస్కారం ప్రకటించటానికి వాళ్లకు ఉన్న మార్గం డబ్బు కావలసినంత పంపకుండా వేధించటమే. ఆ పరిస్థితులలో రవి పట్ల రాణి ప్రవర్తనలో ఒక అధికార లక్షణం ప్రబలటం , విడిపోవటం కూడా జరిగాయి. కులాంతర వివాహాలలో దళితులు మగవాళ్ళైనా మోసపోయే స్థానంలోనే ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక్కడ.

ఇక ఆనర్స్ చదువు కాలంలో కులం కారణంగా అతను ఎదుర్కొన్న వివక్ష , హింస గురించిన సూచనలు రవికి , యోగారావు కు మధ్య జరిగిన సంభాషణలో ఉన్నాయి. తనకు రవికి మధ్య గతంలో జరిగిన ఏదో తీవ్ర ఘర్షణను ప్రస్తావిస్తూ యోగారావు మాట్లాడిన మాటలు దళిత విద్యార్థులను చదువుల్లో గానీ, ప్రేమలో గాన్నీ పోటీలో లేకుండా చేయటానికి పరీక్ష పేపర్లు దిద్దే ఆచార్యులలో వారి కులం, అవిధేయత మొదలైన వాటిపట్ల ద్వేషాన్ని కలిగించి పరీక్ష లలో మార్కులు తక్కువ వేసేట్లు ప్రభావితం చేయటం ఒక పద్ధతిగా అమలవుతున్నదన్నఅనుమానాన్ని కలిగిస్తాయి. రవి 55 శాతం మార్కులతో సెకండ్ క్లాసులో ఆనర్స్ పూర్తి చేయటం ఆ అనుమానం నిజమేననటానికి రుజువు. 55 శాతం మార్కులు రావటం అంటే పరిశోధనకు అవకాశం లేకపోవటం. దళితులు ఉన్నత విద్యలో మును ముందుకుపోవటానికి ‘ఎక్కడివాళ్ళు అక్కడే ఉండాలి’ అనే భూస్వామ్య మనువాద ఆధిపత్య వర్గపు అప్రకటిత శాసనమే అవరోధం అవుతున్నది. నా బోటి సెకండ్ క్లాస్ వాడికి రీసెర్చికి సీటు ఎలా వస్తుంది? అని రవి నిస్పృహతో వేసిన ప్రశ్న ఉన్నత విద్యావ్యవస్థలలో అభివృద్ధికి అవరోధంగా ఉన్న కుల ఆధిపత్య రాజకీయాల గురించి దళిత విద్యార్థులలో పెరుగుతున్న స్పృహను సంకేతించేదే . అయితే అప్పుడన్నీ వ్యక్తి అనుభవాలు, సమస్యలు. దీనిని ప్రశ్నించే సామూహిక విద్యార్థి ఉద్యమాలు మరొక పాతికేళ్ల తరువాత 1990 లనాటికి గానీ పదునెక్కలేదు.

దళితుడైనంత మాత్రాన అగ్రవర్ణ స్త్రీ పై మనసు పడరాదనటం దళిత పురుషుడికి ఎంత హింసానో శారీరక వైకల్యం కల స్త్రీలకు అందమైన పురుషుడిపై మనసుపడరాదనటం అంతే హింస. కులం , రూపం అడిగి తెచ్చుకొనేవి కావు. స్వయంగా వరించినవి కావు. పుట్టుకతో యాదృచ్చికంగా వచ్చేవి. అయినప్పటికీ పోలితల్లి రవి పట్ల తనకు కలిగిన ప్రేమను బయటకు చెప్పలేకపోవటానికి తన కురూపమే అవరోధం అయింది. ఆమెకు తనపట్ల ఇష్టం ఏదో ఉందన్న సంగతి గ్రహింపుకు వస్తున్నా రవి మౌనంగా ఉండిపోవటానికి, హేమలతను పెళ్ళాడి ఆమె ఇంటికే తీసుకురావటానికి అందం పట్ల స్థిరపడిన చూపు , మొగ్గే మనసు కారణం అయినాయి. రాణి పట్ల తొలి ప్రేమకు, వసంతపట్ల మలి ప్రేమకు, హేమలతతో పెళ్ళికి అందం పట్ల ఆకర్షణే ప్రబల హేతువు. హేమలత మరణం తరువాత ఆ యవ్వన భ్రమలు తొలగి రవిలో ఆమెను కురూపి అన్న ఒక అవహేళన దృష్టితో కాక, సహజ వాంఛలు గల సాధారణ మానవ వ్యక్తిగా చూడగల కొత్త చూపు ఏర్పడింది. ఆ పరిణితి నుండే పోలితల్లిని పెళ్లాడాడు. ఆత్యాచారం జరిగిందన్న అవమానంతో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసి స్పృహ కోల్పోతే బావురుమని ఏడిచేంత మెత్తని వాడయ్యాడు. నాడి ఆడుతున్నదని ఆసుపత్రికి ఆమెను తరలించటంతో ఈ నవల ముగిసినా అతనిక ఆమెతో సహజీవనానికే సిద్ధమవుతాడని ఊహించవచ్చు. దళిత జాతిలోని మానవీయ సంస్పందనా చైతన్యం ఏదైతే ఒక విలువగా రచయిత సమత నవలలో రాజారావు పాత్రలో నిరూపించారో అదే ఈ నవలలో రవి పాత్రలోనూ చూపించారు. అందువల్ల ఈ రెండూ కవల పిల్లలవంటివి.

సౌభాగ్యవతి నవలలోనూ ఇతివృత్తం చదువుకొనే యువతీ యువకుల ప్రేమలను చుట్టుకునే అల్లబడింది. బావా మరదళ్ల మధ్య కలిసి పెరగటంవల్ల కలిగిన స్నేహ సోదరభావం, కుటుంబాలు నిర్ణయించిన దాంపత్య భావంతో ఘర్షిస్తూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఒకరికోసం ఒకరు తపించే జీవ బంధంగా స్థిరపడటం అనేక నాటకీయ పరిణామాల మధ్య నిరూపితమైంది ఈ నవలలో.

ఈ నవలలు అన్నీ ప్రధానంగా 1950వ దశకంలో పల్లెలు వదిలి చదువులకు పట్టణాలకు వచ్చిన ఆధునిక యువతీ యువకుల జీవితాలను చిత్రించాయి. స్వేచ్ఛా ప్రియత్వం, సంప్రదాయ ధిక్కారం, స్వతంత్రంగా జీవితాలను నిర్మించుకొనే ప్రయత్నాలు, అందులో ఎదురయ్యే ఒడిదుడుకులు, స్వీయ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు తామే బాధ్యులుగా నిలబడటం వంటి అంశాలచుట్టూ ఇతివృత్తాలను అల్లుతూ నవలలు వ్రాసిన ఇనాక్ అరవయ్యవ దశకపు చివరికి వచ్చేసరికి వీధి బిచ్చగాళ్ల జీవితాలను, వాటిని శాసిస్తున్న వ్యాపార ప్రపంచాన్ని వస్తువుగా చేసి “రెండు కళ్ళు – మూడు కాళ్ళు” నవల వ్రాసారు. దీనిని మినహాయించి అరవయ్యవ దశకపు తొలి నవలలు పరిశీలిస్తే అవి స్వీయ జీవితానుభవ ముద్రలతో ఉండటం చూస్తాం.

( ఇంకావుంది )

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply