సంఘటనలు కేంద్రమైన ఇనాక్ నవలలు

కొలకలూరి ఇనాక్ విరామమెరుగని రచయిత అనిపిస్తుంది. రంధి నవల వ్రాసి రెండేళ్లు తిరగకుండానే 2020లో ఏకంగా ఆయనవి మూడు నవలలు ప్రచురించబడ్డాయి. అవి కన్నతల్లి, పైమెట్టు, వలస. మొదటి రెండు వ్యక్తి జీవిత కేంద్రాలు అయితే మూడవది సమష్టి అనుభవానికి, ఆవేదనకు సంబంధించినది.

తండ్రి ఎవరో తెలియకుండా బతకటం అందువల్ల సామాజికంగా అగౌరవాన్ని మోయాల్సి రావటం అదొక విషాదం. ఈ నవలలో నాయకుడికి తల్లి ఎవరో తెలియదు. అందువల్ల ఆయనకు కలిగిన న్యూనత ఏమీ లేదు. చిత్తరంజన్ దొర అతనిని చేరదీసి తన కొడుకుగా ప్రకటించాడు. ఆస్తి వారసత్వాన్ని, హోదా గౌరవాలను ఇచ్చాడు. అయినా అతనికి తనతల్లి ఎవరో కనుక్కోవాలని, తన తల్లి ఎవరో తెలిసేదాకా పెళ్లి చేసుకోనని దొర ఆస్తి వారసత్వాన్ని కూడా స్వీకరించనని పంతం పట్టటం, అన్వేషించటం, చివరకు తల్లి ఎవరో తెలుసుకొనటం కన్నతల్లి నవలలో ఇతివృత్తం. ఆ క్రమంలో వర్తమానం నుండి కథ, కథనం తరచు గతంలోకి ప్రయాణిస్తాయి. తల్లి ఎవరో తెలుసుకోవాలన్న గాఢమైన కోరికతో కొడుకుచేసే ప్రయత్నంలో భాగమైన ప్రయాణంలో పాఠకులు కూడా అతనిని అనుసరించేట్లు ఆసక్తికరంగానే కథనం సాగింది. కానీ అంతిమంగా నవల సాధించిన ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న.

ఈ నవలలో చిత్తరంజన్ దొర సదాశివం పుత్రసమానుడని ఆస్తిపాస్తులకు వారసుడు అతనేనని ప్రకటించింది సదాశివం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్న సమయంలో స్థూలంగా కంప్యూటర్ సైన్స్ ప్రాచుర్యంలోకి వచ్చింది 1990 లలో. అప్పటికి చిత్తరంజన్ 70 ఏళ్ళు దాటినవాడు. కొద్ది కాలానికే మరణించాడు కూడా. అంటే స్థూలంగా అతను 1920 కి కాస్త ముందో వెనుకో పుట్టిఉంటాడు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం చేయబడ్డప్పుడు కోటను వదిలి ఆస్తులు భద్రంచేసుకొని హైదరాబాద్ చేరాడని రచయితే చెప్పటం జరిగింది. హైదరాబాద్ లో అతని జీవితం తాగటం, అనేకమంది స్త్రీలతో సుఖించటం. అరవై ఏళ్ల వయసులో పద్నాలుగేళ్ల అమ్మాయితో లైంగిక సంబంధాలు, ఇవన్నీ ఏమాత్రం ఫిర్యాదు లేని స్వరంతో వర్ణించబడటం, చిత్తరంజన్ దొరకు అవన్నీసాంప్రదాయ హక్కులుగా వచ్చిన అలవాట్లు కావచ్చు. కానీ రజస్వల కూడా కాని అమ్మాయితో అతని సంబంధాలు ఆ అమ్మాయికి కూడా ఎక్కడా జుగుప్సాకరంగానో, హింసగానో అనిపించకపోవటం చిత్రం. 1990 లతరువాత కూడా రాజమాతలు, సంస్థానాధిపతులు, అధికార స్వీకరణ ఉత్సవాలు అసంగతంగా అనిపిస్తాయి.

పై మెట్టు నవలలో వస్తువు దొరబాబు పెళ్లి. పెళ్లి జరుగుతుందా? జరగదా ? అన్నసందిగ్ధ స్థితిలో కథను ప్రారంభించి సందిగ్ధానికి కారణమైన అంశాలను ఒక్కొక్కటిగా విప్పుకొస్తూ చివరకు పెళ్లి జరగటం వరకు కథను నడపటం జరిగింది. పెళ్లి అనే ఒక ఘటన కేంద్రంగా నడిచింది కనుక నిజానికి ఇది కథ కావాలి. కానీ అన్నాచెల్లెళ్ల అక్కా తమ్ముళ్ల అనుబంధాలను, మాదిగ, మాదిగ ఉపకులాల సంబంధాలను కలుపుకొంటూ ఆ కేంద్రం నుండి వలయాలు వలయాలుగా కథను కౌటుంబిక సామాజిక సంస్కృతీ పర్యావరణంలోకి విస్తరింప చేయటం ద్వారా దీనిని నవల చేయగలిగాడు రచయిత.

వూరు వేజండ్ల. ఉనికి వేజండ్ల మాదిగ గూడెం. వాటితో ముడిపడ్డ రచయిత అనుబంధం, జీవన సంస్కృతి, పురాజ్ఞాపకాల పరిమళం నుండి ఈ నవలకు ఇతివృత్తం సమకూరింది. ఒకరకంగా ఇది రచయిత మలి పలుకులో చెప్పుకొన్నట్లు డెబ్బై ఎనభై ఏళ్లకు ముందటి పల్లె జీవిత మూలం నుండి రూపొందింది. మాదిగల పెళ్లి పద్ధతి, ఇళ్ళు, వాకిళ్లు అలంకరించుకొనటం, పందిళ్లు వేయటం, వంట పొయ్యిల ఏర్పాటు, వంటలు వడ్డనలు, సహపంక్తి భోజనాలు, పెళ్లి కూతురికి పెళ్లికొడుకుకి మంగళ స్నానాలు చేయించే తీరు, వాళ్ళను పెళ్ళికి అలంకరించే తీరు, పెద్దల చతురోక్తులు, మాదిగ పురోహితుల ఆచార వ్యవహారాలు మొదలైనవన్నీ గొప్ప అభిమానంతో వర్ణించబడ్డాయి. ఆ రకంగా మాదిగల పెళ్లి సంస్కృతిని నమోదు చేసిన నవలగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది.

పెళ్లంటే ఒక వరుడు, ఒకవధువు. ఈ నవలలో వరుడు ఒకడే కానీ వధువులు ఇద్దరు. అదే ఈ నవలలో విచిత్రం. వరుడు దొరలాబు. వధువు మేనత్త కూతురు బుజ్జి. తీరా పెళ్లి పీటల వరకు వచ్చేసరికి మువ్వ నేనూ పెళ్లికూతురినే అంటూ అలంకరించుకొని వచ్చినిలుచుంది. మువ్వ మేనమామ వైపునుండి వరుసైన పిల్ల. దానితో కథలో సంఘర్షణ మొదలైంది. దానిని పరిష్కరించక తీరని స్థితిలోకి కుటుంబ పెద్దలు, మాదిగ కులపెద్దలు అందరూ నెట్టబడ్డారు.

దొరబాబు పెద్దలు కుదిర్చిన ప్రకారం ముందు మేనత్త కూతురిని పెళ్లిచేసుకోవాలి. మువ్వ చిందు భోగం మహిళ రవ్వ కూతురు కనుక ఆమెకు కన్నెరికం పెట్టవచ్చు. ఇదొక పరిష్కారం. దీనికి మువ్వా, ఆమె తల్లి రవ్వ మాత్రమే కాదు తండ్రి చిట్టోడు కూడా ఒప్పుకోలేదు. చిట్టోడి ఇంటిపేరును వారసత్వంగా పొందిన రవ్వ చిందు మాదిగ కాదు కనుక కన్నెరికం పెట్టటం అనే మాట ఆమె విషయంలో తప్పు అవుతుందని వాళ్ళ భావం. రెండు పెళ్లిళ్లు వాళ్లలో తప్పు కాదు కనుక. ఒకరితరువాత ఒకరిని పెళ్లిచేసుకోవచ్చు అన్నది మరొక అభిప్రాయం. మొదటి భార్య అన్న హోదా వదులుకొనటం వధువులు ఇద్దరికీ ఇష్టం లేదు. చివరకు ఒకే ముహూర్తంలో ఇద్దరినీ దొరబాబు పెళ్లాడేటట్లు నిర్ణయం జరగటం, ఆ ప్రకారం పెళ్లి, వాళ్ళ సంసార జీవితం మొదలు కావటం నవల ముగింపు.

ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని కోరటం, ఆ అబ్బాయికి ఇద్దరు అమ్మాయిల మీదా మమత ఉండటం ఎలా సాధ్యమైంది? దొరబాబు తండ్రి బుజ్జులు చెల్లెలు నల్లమ్మ. అన్నా చెల్లెళ్ళ మధ్య అలవిమాలిన ప్రేమాభిమానాలు. పెళ్లి అయి అత్తవారింటికి పోయినా అన్నతో సంబంధం నిలుపుకోవాలన్న కోరిక నల్లమ్మది. అన్నకు కొడుకు పుట్టేసరికి తన కొడుక్కు సంబంధం కలుపుకోలేనని బాధపడ్డా రెండవ కానుపుకు బిడ్డ పుట్టేసరికి అన్నకొడుకును అల్లుడు చేసుకోవచ్చు అని ఆశకలిగింది. అన్నదగ్గర మాటతీసుకొన్నది. పుట్టి నప్పటినుండి వరసైన పిల్లలకు ఇది నీ పెళ్ళాం, అడుగో నీ మగడు అని పేరుపెట్టి చెప్పటం ద్వారా వూహ తెలిసేటప్పటికే వాళ్లలో ఆ భావం స్థిరపడేట్లు చేసే కుటుంబ సంస్కృతిలో బుజ్జి దొరబాబు పెళ్ళాంగా, దొరబాబు బుజ్జి మొగుడుగా చెప్పబడుతూ వచ్చారు. వాళ్లూ అట్లాగే అనుకున్నారు. అందువల్ల పెళ్లి వాళ్లకు కోరదగిందే అయింది. ఇక్కడివరకు అయితే సమస్య లేదు.

బుజ్జులు భార్య మల్లికి ఒకే ఒక్క తమ్ముడు చిట్టోడు. వాళ్ళిద్దరిమధ్య అనుబంధాలకు తక్కువేమీ లేదు. అక్కను ఉన్నఊళ్ళోనే ఇయ్యటంవల్ల వాళ్లకు ఎడబాటు లేదు. దొరబాబు పుట్టినప్పటి నుండి వీడు నాఅల్లుడు అని మురిశాడు. కానీ ఆశించినట్లు ఆడపిల్లను కాక మగ పిల్లవాడిని కన్నది భార్య. కానీ అతను కన్నెరికం చేసిన మాదిగ సిందు బోగం పిల్ల రవ్వ అక్క కనక పోతే నేం నేను కన్నాను కదా ఆడపిల్లను దొరబాబు నీ అల్లుడు ఎందుకు కాకూడదు అని ఒకఆలోచనను చిట్టోడిలో ప్రవేశపెట్టింది. మువ్వ దొరబాబు కోసం పుట్టిన పిల్లగా ప్రచారమవుతూ వచ్చింది. దొరబాబు తనమొగుడని ఆ పిల్ల మనసులో పడ్డది. రవ్వ, మామ,వూళ్ళో వాళ్ళూవీళ్లూ మేనమామ కూతురని వరుస కట్టి మాట్లాడే మాటలు దొరబాబులో ఆపిల్ల పట్ల సానుకూలతను పెంచాయి. నల్లమ్మ కూతురు బుజ్జికి, దొరబాబుకు జరగటానికి వేయబడ్డ పెళ్లి పందిట్లోకి దొరబాబుతో పెళ్లి తన హక్కు అన్నట్లుగా మువ్వ ఒడిబియ్యం తో వచ్చి నిలబడటం వల్ల సమస్య ఉత్పన్నమైంది.

చదువు సంధ్యలు, సామాజిక వివక్షలు, ఆర్ధిక జీవనం వీటితో సంబంధమే లేకుండా కేవలం ఒక యువకుడు ఇద్దరు యువతుల పెళ్లికథ అలా సాగుతుంటే ఒకింత విసుగు కలిగేమాట వాస్తవం. కానీ నవల ముగింపుకు వచ్చేసరికి మాదిగ గుడెపు వృద్ధుడు మల్లయ్య తాత కందిరీగ అనే మనుమడితో చేసిన సంభాషణ ఈ నవలలో అసలు కథ పెళ్లి కాదని, ఆ పెళ్లి కోసం రవ్వ చేసిన జీవితకాల పోరాటం అని చెప్పి నవలను ఆ కోణం నుండి మళ్ళీ మొదటి నుండి చదివి అర్ధం చేసుకోమని సూచిస్తుంది.

ఆ కోణం నుండి చూసినప్పుడు ఈ నవల కుల వివక్షకు, లింగ వివక్షకు సంబంధించిన సమస్యను ఏక కాలంలో చర్చకు పెట్టిన సంగతి అర్ధం అవుతుంది. మాదిగలు సవర్ణ హిందూ సమాజం నుండి వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు. ఆ వివక్ష గురించిన అవగాహన అందరికీ వుంది. ఆ వివక్షకు వ్యతిరేకంగా నిరసనలకు, పోరాటాలకు ఆధునిక యుగంలో వందేళ్లకు పైబడ్డ చరిత్ర కూడా వుంది. మాల మాదిగ కులాలు సవర్ణ సమాజంలో లోకువగా చూడబడుతుంటే మాలమాదిగలకు లోకువగా అనేక ఉపకులాలు ఉన్నాయని అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకొన్నాక మరీ ముఖ్యంగా మాదిగ దండోరా ఉద్యమం బలపడ్డాక బయటకు వచ్చింది. ఆత్మగౌరవం, అభివృద్ధి దళితుల లక్ష్యం అయినప్పుడు మాల మాదిగ కుల వ్యవస్థలో అంతర్వివక్ష కూడా నిరసించ దగ్గదే అవుతుంది. నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థలో పై మెట్టుకు చేరాలన్న దళిత ఉద్యమాల న్యాయం దళిత ఆశ్రిత కులాలను ఆకర్షించడం సహజమే. పోరాట రూపాలు వేరుగా ఉండవచ్చు.

మాదిగ కుల వ్యవస్థలో సిందు మాదిగ బోగమోళ్ళు ఒక ఆశ్రిత ఉపకులం. భోగమోళ్ళు కనుక స్త్రీ కేంద్రకాలు. అందంతో, ఆటపాటలతో మాదిగలను అలరించి పొట్ట పోసుకొనటం వాళ్ళ వృత్తి. మాదిగ మగవాళ్లే వాళ్లకు కన్నెరికం పెడతారని, కన్నెరికం పెట్టిన వాడు తినా కుడువ వుండి పోషించగలవాడు అయితే ఆ స్త్రీ ఆటాపాటా మానేసి అతనికే కట్టుబడి ఉంటుందని, లేనివాళ్ళయినా సరే కట్టుబడి వుండటం యధాప్రకారమే కానీ ఆటాపాటా సిందూ కొనసాగిస్తారని, అవసరమైతే వాళ్ళను పోషిస్తారని, జీవితాంతం ఒక్కడికే కట్టుబడి ఉన్నా సిందు బోగం మహిళలకు ఏ హక్కులూ ఉండవని వాళ్లకు పుట్టిన మగపిల్లలు ఎటైనా పోయి పనిపాటలు చేసుకొని పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడే వీలు ఉంటుంది కానీ ఆడపిల్లలు ఆటాపాటా కొనసాగించవలసిన వాళ్లేనని నవలలో అక్కడక్కడా కథనంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కలుపుకొంటే తేలే సారాంశం.

మాదిగ పల్లెలో తూర్పు పక్కన పదిళ్లు సిందు బోగం వాళ్లవి. రవ్వ ఆ ఇండ్ల పిల్ల. చిట్టోడు ఆమె మీద మోహపడ్డాడు. ఆమెనే పెళ్లాడతానని పట్టుబట్టాడు. పెద్దలు అది సంప్రదాయం కాదన్నారు. పెళ్లి మాదిగ పిల్లనే చేసుకోవాలి. కావాలంటే కన్నెరికం పెట్టుకోవచ్చు అన్నారు. ఆ రకంగా రవ్వ చిట్టోడి ఆడది అయింది. తాను కనే పిల్లలకు చిట్టోడి ఇంటి పేరు ఇయ్యటానికి ఒప్పుకొంటే గానీ ఒంటి మీద చెయ్యి వెయ్యనియ్యను అన్నది. దానితో అది మాదిగ పల్లెకు , పెద్దలకు ఒక సమస్య అయింది. చివరకు పెద్దలు అంగీకరించడంతో అక్కడికి సమస్య తీరింది. అక్కడ నుండి ప్రారంభించి మాదిగ సమాజంలో తన పిల్లలకు ఒక గౌరవకరమైన స్థానాన్ని స్థిరం చెయ్యటానికి రవ్వ చేసిన పైకి కనబడని పోరాటం ఈ నవలకు అంతః సూత్రం. తనకు పుట్టే బిడ్డలకు తండ్రి ఇంటిపేరు వచ్చేట్లు ఊరంతటినీ ఒప్పించటం దగ్గర నుండి, ఆడబిడ్డను, మగబిడ్డను చిట్టోడి ఇంటిపేరుతో బడిలో చేర్చటం, ఆడపిల్ల మువ్వ దొరబాబుకు కాబోయే పెళ్ళాం అన్న మాటను సందర్భం కల్పించుకొని మరీ చెప్తూ అందరి మనసులలో ముద్ర పడేట్లు చేయటం, నీ అక్క కొడుకుకు ఇచ్చి చేయటానికి నీ ఇంటిపేరు కూతురు ఉందని చిట్టోడి మనసుకు ఇంపైన మాట చెప్పటం, దొరబాబు తల్లి మనసులోకి దానిని ప్రవేశ పెట్టటం అన్నీ ఒక వ్యూహం ప్రకారం నిదానంగా చేసుకొచ్చిన పనుల వలెనె కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం మువ్వకు దొరబాబు పట్ల మమత, దొరబాబుకు మువ్వ పట్ల ఆసక్తి, ఆకర్షణ కలిగేట్లు చూడటంలో చిన్న చిన్న సందర్భాలను కూడా ఆమె వాడుకున్న తీరు.

దొరబాబుకు బుజ్జికి పెళ్లి నిర్ణయమై అన్ని ఏర్పాట్లూ జరిగిపోతుంటే పీటల మీద కూర్చున్న వధూవరుల ముందుకు పెళ్లి కూతురి అలంకరణలో తన కూతురిని ప్రవేశపెట్టి రసవత్తరమైన ఒక నాటకానికి తెరతీసిన సూత్రధారి రవ్వ. రంగస్థలం మీద మువ్వ స్వతంత్రంగా సమర్ధవంతంగా చేసిన సంభాషణలకు , చర్యలకు రచన, దర్శకత్వం ఆమెవే. ఆనాడు తన పిల్లలకు చిట్టోడి ఇంటిపేరు ఇప్పించటం గూడెం సమస్యగా ఎట్లా మలచగలిగిందో ఈ నాడు దొరబాబుతో మువ్వ పెళ్లి సమస్యను అదేవిధంగా గూడెం సమస్యగా చేయగలగటంలో ఉన్నది ఆమె ప్రతిభ అంతా. మేనమామ కొడుకును పెళ్ళాడుతున్న బుజ్జికి దీటుగా మేనత్త కొడుకును పెళ్లాడే హక్కును ఆత్మగౌరవంతో స్థాపించుకొనే చొరవ, తెలివి మువ్వకు తల్లి శిక్షణలో అబ్బినవే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మొత్తం క్రమంలో స్త్రీలు అసూయతో స్పర్ధ వహించక స్త్రీలుగా తోటి స్త్రీల ఆంతర్యాన్ని అర్ధంచేసుకొని ప్రవర్తించినట్లు కథను నడపటం విశేషం.

ఇచ్చిన మాటప్రకారం చెల్లెలి కూతురుతో కొడుకు పెళ్లిజరిపించిన బుజ్జులు, తమ్ముడి కూతురిగా మువ్వను గుర్తించి మురిసిపోయి తమ్ముడికి ఇచ్చిన మాటప్రకారం కోడలిని చేసుకొన్న మల్లి, చిన్నప్పటి నుండి తనవాడనుకొన్న బావను పెళ్లాడిన బుజ్జి, మనసులోని మమత వాస్తవం కావాలంటే పోరాడక తప్పదని తెగించి నిలిచి అందరిచేతా అవుననిపించుకొని దొరబాబును పెళ్లాడిన మువ్వ, ఇద్దరి ని ఒకే లగ్నానికి పెళ్లాడిన మొనగాడిగా దొరబాబు అందరూ తమతమ పరిధులలో విజయంసాధించినట్లే. కానీ ఈ నవలలో పుల్లయ్య తాత అంటాడు ‘విజయంఎవ్వరిదీ కాదు రవ్వది’ అని. మువ్వ సామాజిక స్థాయిని సిందు బోగం పడచు నుండి మాదిగ ఇంటి కోడలిగా ఉన్నతీకరించటంలో రవ్వ సాధించిన విజయం ఉందని వివరిస్తాడు. అది అర్ధం అయ్యేకొద్దీ నవలలోని జీవిత సౌందర్యం అనుభవానికి వస్తుంది. ఆరకంగా ఈ నవలకు నాయిక రవ్వ అయింది.

ఇక చివరి నవల వలస. 2019 చివరిలో ప్రపంచంలో విస్ఫోటనం చెందిన వైరస్ కరోనా. కోవిడ్ 19 ఒక విపత్తుగా దేశాన్ని తలకిందులు చేసిన 2020 లో దానిని వ్యాపించకుండా నియంత్రించటానికి సర్వ సామాజిక ఆర్ధిక కార్యకలాపాలను స్తంభింప చేస్తూ మార్చ్ 24న లాక్ డౌన్ ప్రకటించబడిన సందర్భం నుండి ఇనాక్ వ్రాసిన నవల ఇది. ఉద్యోగాలు పోవటం, ఉపాధులు లేకపోవటం, బతుకుతెరువు మార్గాలు మూసుకుపోవడం, తిండికి లేక మనుషులు కటకటపడటం ఇదీ ఆనాటి దేశ ముఖచిత్రం. ఎక్కడెక్కడి మనుషులో బతుకుతెరువు మార్గాలను వెతుక్కొంటూ పట్టణాలకు వలస వచ్చి రకరకాల అనియత రంగాలలో పనులు చేసుకొంటున్న వాళ్ళకు అన్ని పనులు ఆగి పోయేసరికి పని లేకుండా, ఆదాయం లేకుండా, అన్నం లేకుండా అనాథల వలె పట్టణంలో చావటం ఇష్టంలేక స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. బస్సులు, రైళ్లు అన్నీ ఆగిపోవటం వల్ల ప్రయాణ సౌకర్యాలు లేక పిల్లలను చంకనేసుకొని మూటలు నెత్తికెత్తుకొని వేల మైళ్ళ నడకకు సిద్ధమయ్యారు వలస కూలీలు. దోవ పొడుగునా వాళ్ళు పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అవమానాలు, హింస ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ కోసం ప్రభుత్వాల కన్నా ఎక్కువగా స్వచ్ఛంద సంస్థలు, వితరణ సేవాతత్పరత కలిగిన వ్యక్తులు , సమూహాలు సహాయం చేయటానికి ముందుకువచ్చిన చరిత్ర సమకాలపుది. వలస కూలీల ఈ ప్రస్థానంలో మానవత్వాన్ని అపహసించే అనేక భీభత్స విషాద దృశ్యాలు ఉన్నాయి. రచయిత గా వీటికి కదిలిపోయి ఇనాక్ ఒక మానవానుభవంగా వాటిని పునః సృజిస్తూ వ్రాసిన నవల వలస.

హైద్రాబాదులో గృహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న బీహార్ కార్మికుల సమూహం ఆదిలాబాద్ మీదుగా ససారం వైపు సాగిస్తున్న ప్రయాణం ఈ నవలకు వస్తువు. ఆ సమూహంలో పదకొండు జంటలు, భర్తలేని స్త్రీలు ఇద్దరు, పెళ్లికాని యువకుడు ఒకడు, భార్యచనిపోయిన యువకుడు మరొకతను, పిల్లలు అందరూ కలిసి ముప్ఫయి మూడు మంది ఉన్నారు. హైద్రాబాదు నుండి 1400 కిలోమీటర్లు సాగిన ఆ ప్రస్థానంలో వాళ్ళు ఏమేమి చూసారు? ఏయే అనుభవాలు పంచుకొన్నారు? ఏమి పోగొట్టుకున్నారు? ఏమి సాధించారు? అన్నవి ఇతివృత్తంలో భాగమై కనిపిస్తాయి.

ప్రయాణంలో ముందు కావలసినది తిండి, నీళ్లు..వీలైనవి, మోయగలిగినవి ఎవరికి వారు సిద్ధం చేసుకొన్నారు. నిలవ ఉండటానికి వీలుగా బాగా కాల్చిన పెళుసు బారిన గోధుమ, జొన్న, సజ్జ రొట్టెలు, వాటిలోకి నంజు కు పచ్చళ్లు వాళ్ళదగ్గర ఉన్నాయి. అవి అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే తిండి. దాబాలు కనిపిస్తే ఆగి టిఫిన్లు తినటం, తోవలో ధర్మాతులు ఎవరో ఒకరు ఇచ్చే ఆహారపు పొట్లాలతో మధ్యాహ్న భోజనం. ఒక్కొక్కప్పుడు అదే రాత్రికి కూడా మిగుల్చుకుంటారు. తోవపొడుగునా వలస కార్మికుల కడుపు నింపటానికి వాళ్ళను బతికిస్తూ తాము బతకాలనుకొని లాభాల మాట లేకుండా సగం ధరకే ఆహారపదార్ధాలను వండి వడ్డించిన దాబాల వాళ్ళు, దాతలు కనబడకుండా ఆహార పొట్లాల పంపిణీ ఏర్పాట్లు చేసినవాళ్లు, ఫొటోగ్రాఫర్లను వెంటపెట్టుకొని కార్లలో దిగి ఆహరం పొట్లాలు అందిస్తూ ఫోటోలు తీయించుకొనేవాళ్ళు, విషయం తెలిసి అప్పటికప్పుడు రొట్టెలు చేయించి పంపే ఉదారులైన సమీప గ్రామాల సర్పంచ్ లు, తనకే ఏమీ లేకపోయినా ఒక బిస్కెట్, ఒక టీ ఇచ్చి మీకోసం మేము ఉన్నాం అని మానవత్వాన్నిచాటుకున్న అనాధ ముసలవ్వ … ఇలా ఎంతమందో వాళ్లకు తటస్థపడ్డారు. బాధిత సమూహాలపట్ల నిజమైన ప్రేమ, సానుభూతులతో స్పందించే సహజ మానవీయత, ఏ సందర్భాన్ని అయినా అధికార అహంకార ప్రదర్శనలకు వేదికగా మార్చుకొనే అల్పత్వం అన్నీ మనుషుల్లోనే ఉన్నాయని చూపటం రచయిత ఉద్దేశం.

ఆకలి అంత సహజమైందే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, మొహం కూడా. ఉభయులకూ ఇష్టమైనప్పుడు అది ఆనంద సంగమం. పురుషుడి వైపు నుండీ మాత్రమే కోరిక ఉండటం, ఆడదాని అభ్యంతరాన్ని లక్ష్యపెట్టకపోవటం అనాగరికం. అన్యాయం. భార్య చచ్చిపోయిన కిశోర్ భర్త చనిపోయి కొడుకుతో ఒంటరిగా ఉన్నరమను కోరుకున్నాడు. ఆమె తనకు ఇష్టంలేదన్నా వినలేదు. అర్దరాత్రి ఆమె మీద పడ్డాడు. రక్షణకోసం పక్కనపెట్టుకొన్న కర్రతో ఆమె కొట్టిందని అవమానపడి ఆమెను ఎలాగైనా లొంగదీసుకొనాలన్న పంతంతో ఉన్న కిశోర్ కూడా రమ గుంపులో ఉన్నాడు. అతని ఆలోచన సరైంది కాదని రాం చెప్పి చూసాడు. అయినా కిషోర్ ప్రయాణంలోనూ ఒక రాత్రి ఆమె పక్కన చేరబోయి తన్నులు తిన్నాడు. గుంపు అతనికి హితవు చెప్పి తమవెంట తీసుకుపోయింది. అతను ఏ రమను లొంగ దీసుకోవాలనుకొన్నాడో ఆ రమ రాత్రి తినటానికి ఏమీ లేక అవమానంతో రగిలిపోతూ వంటరిగా కూర్చున్న కిషోర్ కు రొట్టె ఇచ్చి తినమని బతిమిలాడింది. తినిపించనా అని కూడా అడిగింది. ఇవన్నీ ఈ ప్రస్థానం పూర్తయ్యేటప్పటికి కిషోర్ ని ఏ కుత్సితం లేని అచ్చమైన మానవుడిగా పరివర్తింపచేశాయి. కష్టకాలంలో కలిసి చేసే ప్రయాణం మనుషులను సున్నితమైన మానవులుగా మారుస్తుంది అని రచయిత చెప్పదలచుకొన్నాడు. చనిపోయిన భర్త పట్ల ప్రేమ, జీవితం మీద ఆశకు ఆసరాగా ఉన్న కొడుకు పట్ల బాధ్యత సున్నితంగా సుందరంగా నిర్వహించుకు వస్తున్న రమ పట్ల అప్పటికే గౌరవం, సానుభూతి ఉన్న రాం ఈ ప్రయాణంలో ఆమె కొడుకుకు ఆమెకు కూడా దగ్గరై ఆమెను పెళ్లిచేసుకొనటం కూడా నవల ముగింపులో చూస్తాం.

లాక్ డౌన్ కాలపు వలస కార్మికుల ప్రయాణంలో ప్రమాదాలు ఎన్నెన్నో. ససారం సమూహం సాగిస్తున్న ప్రయాణంలో ఒక యువకుడి శవం ఒకదగ్గర, ఇద్దరు స్త్రీల శవాలు మరొక దగ్గర తటస్థపడ్డాయి. వాళ్లెవరో, ఏ సమూహంతో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చారో, ఎందుకు హత్యలకు గురయ్యారో, హంతకులు గుంపులో వాళ్ళో, బయటివాళ్ళో ఏమీ తెలియని స్థితి. అలా అర్ధాంతరపు చావులు చచ్చి పేరు ఊరూ లేకుండా అనాధ శవాలుగా మిగిలిన వాళ్ళను చూసి ససారం సమూహం కదిలిపోయింది.

ఎండల్లో ప్రయాణం, కాలి నడక, బరువులు మోసే కష్టం, సరిగా తిండిలేకపోవటం, స్థలాంతర నీటి మార్పులు, వాతావరణ మార్పులు జ్వరాలు, విరోచనాలు మొదలైన వ్యాధులకు వాళ్ళను గురిచేశాయి. గుంపు నాయకుడు రతన్ కూతురు చనిపోయింది. ఆదుఃఖం అందరిదీ అయింది. ఒక చావు దుఃఖం వెనువెంట ఒక పుట్టుక ఆనందం కూడా ఆగుంపు అనుభవములోకి వచ్చింది. పోతున్న మార్గంలో అంతకుముందు వెళుతున్న ఒక వలస గుంపు నుండి నిండు నెలల కారణంగా నెప్పులు వస్తూ నడవలేక ఆగిపోయిన ఒక మహిళను ఆమె భర్తను కలిసింది ససారం సమూహం. మరొక ఆడదిక్కు లేకుండా ప్రసవ వేదన పడుతున్న ఆస్త్రీని, ఆమెను చూస్తూ ఎటూ తీసుకుపోలేక నిస్సహాయంగా కూర్చున్నఆమె భర్తను అలా వదిలేసి వెళ్లలేకపోయారు. గుంపు ఆగిపోయింది. ఆ గుంపులో సీత ఆమెకు ప్రసవం చేసింది. అప్పుడే ప్రసవించిన ఆస్త్రీ వెంటనే కాలినడకన ప్రయాణం సాగించలేదు. ఆమెను వదిలి ఆమె భర్త పోలేడు. అందుకనే ససారం సమూహం సమీప గ్రామంలోని హాస్పిటల్ కు వెళ్లి పరిస్థితిని వివరించి లేచి నడిచి వెళ్లగలిగేంతవరకు వాళ్లకు ఆశ్రయం ఇయ్యటానికి ఒప్పించి వాళ్ళను అక్కడ చేర్చటం వరకు అన్ని పనులు బాధ్యతగా చేశారు. ముక్కుముఖం తెలియకపోయినా ఒకేరకం బాధలను ఎదుర్కొంటున్న వాళ్ళ మధ్య కుదురుకొనే సహభావం సహకారంగా ఎట్లా రూపం తీసుకొంటుందో ఈ ఘటన చెబుతుంది. చావు పుట్టుకల తత్వం తెలిసిన వాళ్ళ నిష్కామ కర్మ అది.

ససారం గుంపుకు నాయకుడై నడిపించిన రతన్ కాలు విరిగితే ఆయనను సమీపంలోని హాస్పిటల్ కు చేతులే కుర్చీగా చేసి మోసుకువెళ్లారు రాం, కిషోర్. కాలు ఎముక విరిగిందని కట్టువేసి మూడు నెలలు కదలరాదంటే వాళ్ళు అక్కడే ఆగిపోవలసి వచ్చింది. రాం నాయకత్వంలో గుంపు ముందుకు సాగింది. రచయిత దృష్టిలో నవలకు నాయకుడు రాం. ఎమ్మె పొలిటికల్ సైన్స్ చేసినవాడు, కొంతకాలం రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ కు అంగరక్షకుడుగా ఉండి ఆ రాజకీయాలు గిట్టక తప్పించుకొని హైదరాబాద్ వచ్చానని చెప్పుకొంటాడు. ఏవేవో పనులు చేసి భవన నిర్మాణ రంగంలో సెంట్రిగ్ పనిలో స్థిరపడ్డాడు. దేశ రాజకీయాలు, వలస కార్మికులు, కులం, ఆర్ధిక అసమానత్వం మొదలైన అనేక విషయాలమీద అతని అభిప్రాయాలు రమతో చేసే సంభాషణలలో వ్యక్తం అవుతుంటాయి. లాక్ డౌన్ కాలపు అనేక విషాద మరణ వాస్తవాలు ఈ నవల తివృత్తంలో ప్రస్తావించటానికి రచయిత అతనినే వాహికగా చేసుకొన్నాడు. పెయింటర్, ఎలక్ట్రీషియన్, రైల్ ట్రాక్ మీద పడుకొన్న వలస కూలీల మరణం వంటివి అతనికి ఫోన్ లో ఎవరో చెప్పటం అతను ఆ విషయాన్ని రమకు చెప్పటం, ఆ దుఃఖాన్ని వాళ్లిద్దరూ అనుభవించటం ఇదీ వరస.

ఊళ్లను వెతుక్కొంటూ వలస వెళ్లిన వాళ్లకు గ్రామాలు స్వాగతాలు పలుకక పోవటం మరొక విషాదం. పట్టణాల నుండి వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చినవాళ్లు కరోనా వైరస్ ను గ్రామాలలోకి తెస్తారేమోనని భయంతో గ్రామ ప్రవేశ ద్వారాలను కంచె వేసి కట్టడి చేసుకొన్న ఉదంతాలెన్నో ఆనాడు వార్తలై వినిపించాయి. ఈ నవలలో రాంకు, రమకు వాళ్ళవాళ్ళ ఊళ్లలో అదే అనుభవం అయినట్లు కథ మలచబడింది. రమ పిల్లవాడితో ఏమి అవస్థ పడుతున్నదో అని రాం ఆమె గ్రామానికి వెళ్లి ఆమెను ఆమె తండ్రి, తన తల్లి అనుమతితో పెళ్లిచేసుకొనటంతో నవల ముగింపుకు వచ్చింది. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే మళ్ళీ హైదరాబాద్ కే ప్రయాణం.

లాక్ డౌన్ క్రమంగా ఎత్తేస్తూ అన్ని పనులు మళ్ళీ మొదలవుతుంటే భవన నిర్మాణ కాంట్రాక్టర్లు కూలీలను కూడగట్టి హైదరాబాద్ వచ్చెయ్యమని రాం తో జరిపిన మంతనాల ఫలితంగా రెండు వందల మంది కూలీలతో కలిసి రాం పాట్నా నుండి రైలులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతాడు. కూలీరేట్లు పెంచటం, కూలీలకు నివాస యోగ్యమయిన షెడ్లు ఏర్పాటు చేయటం, బాంక్ అకవుంట్లు తెరవటం, తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఇప్పించటం వంటి విషయాలలో రాం బిల్డర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందాలను కూలీల విజయంగా సూచించాడు రచయిత. ఇది రచయిత కల గన్న ఆదర్శం. ఏమీ లేని నిరాశ నుండి, నిస్సహాయత నుండి హైదరాబాద్ నుండి ప్రారంభమైన ప్రయాణం గృహ నిర్మాణ కార్మికులుగా ఏవో కొన్ని హక్కులను, సౌకర్యాలను పొంది ఆశతో, నమ్మకంతో మళ్ళీ హైదరాబాద్ కు చేరటంగా ముగిసిన నవలలో ఇతివృత్తం బయలుదేరినచోటికి చేరి ఒక వృత్తాన్ని పూర్తిచేసింది.

రాం, రమ కేంద్రంగా కథ నడవటం, వాళ్ళిద్దరి రాజకీయ సంభాషణలు కొంత అసహజంగా కనిపించినప్పటికీ, వలసల ఆర్ధిక మూలాల గురించి జీవితాలకు అన్వయించిన అవగాహన కనబరచ లేకపోయినప్పటికీ, మహేతిహాసం లాంటి వలస కార్మిక జీవితానుభవ శకలాలనైనా పట్టుకొనటానికి ఎనభై ఏళ్ల వయసులో కూడా ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందించదగినది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply