ఇదొక యుద్ధభూమి

యుద్ధం ఎంత వద్దనుకున్నా
యుద్ధాలు గాయాలై స్రవించడం
సహజాతి సహజమవుతోంది
యుద్ధాలు భుజస్కంధాలపై
శవాలగుట్టలను ఈడ్చుకుపోవడం
జరుగుతోంది

ప్రతి దినం
ఎంత శాంతిమంత్రం జపిస్తున్నా
కళ్ళనిండా ఎవరో కసిగా
కారం కూరుతుంటే
పేగులు బయటకు లాగి
కటువైన స్వరాన్ని మీటుతుంటే
యుద్ధం తప్పక మొదలవుతుంది

మరోవైపు మనసులో జరిగే
అంతర్యుద్ధం మాటేమిటి
అనే తలపు విసిగిస్తుంది
దాన్ని మనం కనీసం శాసించలేము
నదిని మహాసముద్రం మింగేస్తోంది
చిట్టిపిట్టను కొండచిలువ భోంచేస్తోంది

బలహీనుడి మెడపైకి
బలమైన కత్తి దూసుకొచ్చి
ముక్కలు ముక్కలుగా విడగొడుతోంది
చీమ కట్టుకున్న పుట్టలోకి
పామెళ్ళి కూర్చుంటోంది

సమాజచిత్రంపై
అసమానతలతో
వంకరవంకరగా గీసిన
ఎన్నో గీతల నడుమ
పెద్దగీతలన్నీ చిన్నగీతల
నెత్తి మీద నాట్యం చేస్తుంటే
లోపల యుద్ధభేరీ మోగుతోంది

మూలిగే నక్క మీద
తాటిపండు పడుతుంది
జైలుగోడల నడుమ
ఎనభై ఏళ్ళ కాయం
వేడిసెగలలో మగ్గుతుంటే
అంతరంతరాలు
అతలాకుతలమవుతున్నాయి

ఈ మాయదారి ప్రపంచంలో
గుండెల నిండా
స్వచ్ఛమైన ఊపిరి తీయడమే
పెద్ద యుద్ధమైనపుడు
దినదినగండపు నడకలో
బతికిబట్టకట్టడమే
భయంకర యుద్ధమైనపుడు
ఎలా అడుగు కదపాలి?

అదిగో మొలకను ప్రసవించడానికి
ఆ చిన్న విత్తనం సైతం
ఎంత చక్కగా యుద్ధం చేస్తోందో
యుద్ధం నేడు అనివార్యమవుతోంది

పెద్దదా చిన్నదా
అన్న ఆలోచనలకి
లేదు ఇప్పుడు
ఏ విధమైన కొలమానం

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

Leave a Reply