ఇదీ తల్లి ప్రేమే…

రణధీర్ నేను స్కూలు నుండి కలిసి చదువుకున్నాం. ఇరవై ఆరేళ్ల స్నేహం మాది. ఆ తరువాత ఎంత మంది స్నేహితులు కలిసినా రణధీర్ స్థానంలోకి మరెవ్వరూ రాలేకపోయారు. వేరు వేరు ఉద్యోగాలు, వేరు జీవితాలు అయినా జీవితంలో చికాకు పరిచే ఆలోచనలను పంచుకోవడం నాకు రణధీర్ దగ్గరే సాధ్యమవుతుంది. అన్నీ ఒకరితో ఒకరం చెప్పుకుంటాం అని కాదు. కానీ మరో మనిషితో కలిసి ఆలోచించాల్సిన సమస్య ఎదురయినప్పుడు రణధీర్ సాంగత్యమే నాకు ఊరట నిచ్చేది. ఇంట్లో రఘు, పిల్లలు అదో ప్రపంచం. రఘుకి నాకు ఇల్లు నడపడంలో కుదిరే సఖ్యత ఇతర విషయలలో ఉండదు. మంచి పుస్తకాలు చదవడం, వాటి గురించి చర్చించుకోవడం నాకు చాలా ఇష్టం.

రఘు ప్రపంచం చాలా చిన్నది. ఇంటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అన్నీ తానై పూనుకుని ఆ సమస్యకు జవాబు వెతికే రఘుకి ఇంకే విషయలపై ఆసక్తి ఉండదు. దేన్ని పెద్దగా పట్టించుకోడు. నా పై ఎంతో ప్రేమ నమ్మకమూ. కానీ కాలనీలో చెట్లను నరకడం, ఇంటి ముందు బిడ్డలు తరిమేస్తే బిచ్చం అడుక్కునే ముసలామె, ఇలాంటివి చూసినప్పుడు నాలో కలిగే ఆవేశం, కోపం రఘుకి అర్ధం కాదు. అలాంటప్పుడు రణధీర్ తో మాట్లాడి ఏదో ఒకటి చేసే దాకా నాకు నిద్ర పట్టదు. అప్పుడు రఘు మా ఇద్దరిని వదలి తన ప్రపంచంలోకి జారుకుంటాడు. రణధీర్, రఘుల మధ్య కూడా మంచి స్నేహమే ఉంది. రణధీర్ సహాయంతో నా చుట్టూ కనిపించే కొన్ని సమస్యలను నేను పరిష్కరించినప్పుడు చిరునవ్వుతో మా సంతోషంలో రఘు పాలు పంచుకునేవాడు. కానీ తన పరిధి దాటి ఎందులోకీ దూరను అనే నియమాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సడలించని మొండి ఘటం.

అలాంటిది ఇవాళ రఘు పొద్దున్నే రణధీర్ ప్రసక్తి తేవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. రణధీర్ కి రఘుకి మధ్య రెండు రోజులకొకసారి ఏదో సందర్భంలో ఫోన్ సంభాషణ నడుస్తూనే ఉంటుంది. నగరంలో వారం రోజుల క్రితం జరిగిన ఓ సైంటిస్ట్ కొడుకు కిడ్నాప్ కేసును ప్రస్తుతం రణధీరే డీల్ చేస్తున్నాడని మాకు తెలుసు. ఆ పిల్లవాడి శవం రాత్రి దొరికిందని, హంతకుల వివరాలు ఏమన్నా తెలిసాయేమోనని తాను నిన్న రణధీర్ కి కాల్ చేసానని కాని అతను ఫోన్ ఎత్తలేదని రఘు నాకు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మొదటి సారి బైటి విషయాల పై ఆసక్తి చూపుతున్న రఘు నాకు కొత్తగా కనిపించాడు.

కీడ్నాప్ అయిన అబ్బాయి శవం మా పిల్లలు చదువుతున్న స్కూలు పక్కన డ్రైనేజీలో దొరికింది అని రఘు చెబుతున్నప్పుడు అతని కళ్ళలో లీలగా భయం కనిపించింది. పిల్లల భద్రత పట్ల ఓ తండ్రిగా అతనిలో కనపడిన భయం నాలోనూ పాకింది. పిల్లలను స్కూలుకు పంపడానికి టిపిన్ బాక్సులు కడుతున్న నేను రోజులా త్వరగా పని చేయలేకపోయాను. ఆటో వచ్చినా తిప్పి పంపించి తానే కారులో పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లి తన ఆఫీసుకు వెళ్లిపోయాడు రఘు. సాయంత్రం తనే వాళ్లను స్కూలు నుండి తీసుకువస్తానని చెప్పి మరీ వెళ్ళాడు.

విషయం కనుక్కుందామని ఆఫీసుకు వచ్చిన వెంటనే రణధీర్ కు ఫోన్ చేశాను. జవాబు లేదు. ఓ గంట తర్వాత తిరిగి ఫోన్ చేసి బిజీగా ఉన్నానని సంగతేంటని అడిగాడు. కేసు సంగతి కదపబోతే, ఇప్పుడు దాని గురించేమీ మాట్లాడలేనని ఫోన్ పెట్టేసాడు. అతని గొంతు కొత్తగా వినిపించింది. కాని ఎంత బిజీలో కూడా నా ఫోన్ కు తప్పకుండా జవాబిచ్చే నా మిత్రుడంటే కొంత గర్వంగా కూడా అనిపించింది.

ఆ తరువాతి రెండు రోజులూ రణధీర్ నుండి ఫోన్ లేదు. పేపర్ లో ఆ పిల్లవాడి తల్లి తండ్రుల రోదన, పోస్ట్ మార్టంలో ఆ బిడ్డ ఊపిరి ఆడక చనిపోయాడని, చనిపోయిన తరువాత శవాన్ని హంతకులు డ్రైనేజీ లో పడేసారని కొన్ని సంగతులు తెలిసాయి. గోనె సంచిలో కట్టిపడేసి శవాన్ని డ్రైనేజీలో పడేస్తున్న వాళ్లను అక్కడే పడుకున్న ఓ బిచ్చగాడు చూడడం వలన ఈ శవం సంగతి బైటకు వచ్చింది. ఆ నాలాలో క్రిందకి ప్రవహించే నీళ్ళకు అడ్డుగా నిల్చిన బ్రిడ్జి స్థంభం ఆ గోనెసంచి నీళ్లలోకి కొట్టుకుపోకుండా ఆపింది. లేకపోతే శవం ఆనవాలు లేకుండా పోయేవి. ఆ పని చేసింది ఓ స్త్రీ పురుషుల జంట అన్నది పోలీసులు తెలుసుకున్నారు. వారెవరన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఆ బిచ్చగాడు వాళ్లని ఆ రాత్రి చీకట్లో చూసాడు. అతనొక్కడే ఈ సంఘటనకు సాక్షి. అతని వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారన్న సమాచారం టీవీ పత్రికల ద్వారా బైటికి వచ్చింది.

మా పిల్లల స్కూలుకు ఓ అరకిలోమీటర్ దూరంలోని నాలాలోనే శవం దొరికినా, ఆ పిల్లవాడు ఆ స్కూల్ విద్యార్ధి కాదు. అబ్బాయి పేరు రోహిత్. ఎనిమిదేళ్ళ వయసు. అతని తండ్రి పెద్ద సైంటిస్ట్. రోహిత్ కనపడకుండా పోయిన మరుసటి రోజు కోటి రూపాయలు అడుగుతూ కిడ్నాపర్లు రోహిత్ తండ్రికి ఫోన్ చేసారు. పోలీసులకు చెబితే పర్యవసానం దారుణంగా ఉంటుందని బెదిరించారు. రోహిత్ తండ్రి సైంటిస్ట్ కాబట్టి డిపార్ట్మెంట్ వెంటనే అలర్ట్ అయి పోలీసులను రంగంలోకి దింపింది. ఆ తండ్రి బిడ్డ కోసం డబ్బు సిద్దం చేసుకున్నాడు కూడా. ఆయనకు ఉద్యోగంలోనూ ఆ చుట్టూ పక్కల చాలా మంచి పేరు ఉంది. పైగా అందరూ ఆ కుటుంబాన్ని ఇష్టపడతారట. నాకెవరూ శతృవులు లేరని అతను పదే పదే చెబుతుంటే అతను చేస్తున్న రీసెర్చ్ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. డబ్బు అందించవలసిన ఓ రోజు ముందే బిడ్డ శవం నాలాలో దొరికింది. పోలీసులు రంగంలోకి రాకపోతే తమ బిడ్డను తాము తెచ్చుకునేవాళ్లం అని రోహిత్ తల్లి బంధువులు కుళ్లి కుళ్ళి ఏడుస్తున్నారు. ఇవన్నీ టీవీలో స్క్రోల్ అవుతూనే ఉన్నాయి.

రాత్రి రఘు పిల్లల పక్కన పడుకున్నాడు. రణధీర్ కు ఫోన్ చేసి మూడు రోజులు. ఇప్పటికి ఏ కబురూ లేదు. న్యూస్ లో ఆ పిల్లవాని తల్లిని తండ్రిని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటే గుండే తరుక్కుపోతుంది. నిద్ర పట్టట్లేదు. పుస్తకం చదువుదామని హాలు లో సోఫాలోకి చేరాను. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. రాత్రి 11.30. ఈ సమయంలో ఎవరా అని లేవబోయేంతలో రఘు హడావిడిగా హాలులోకి రావడం కనిపించింది. మూడు రోజుల నుండి ఆయనలో మునుపటి ఉత్సాహం లేదు. తనే వెళ్లి తలుపు తీసాడు. అవతల రణధీర్. మూడు రోజుల నుండి లంఖనాలు చేసిన వాడిలా ఉన్నాడు. రఘు అతన్ని లోపలికి తీసుకు వచ్చాడు. మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్లాను. నీళ్ళు తాగి అలసటగా కూర్చుండిపోయాడు రణధీర్.

“హంతకులు దొరికారు” అలసిపోయిన స్వరంతో చెప్పాడు రణధీర్.
“ఎవరు? ఎవరు ఆ పని చేసింది” రఘులో ఆతృత,
“వాళ్ల ఇంటి పక్కన ఉండే యువ జంట” నిర్లిప్తంగా వచ్చింది రణధీర్ గొంతు నుండి జవాబు
“అదేంటి ఎదో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయి ఉంటారని చెప్పుకుంటున్నారు కదా” రఘు ప్రశ్న.
“వీళ్ళే ఆ క్రిమినల్స్. పూర్తి సాక్షాధారాలతో పట్టుకున్నాం, వాళ్లూ ఒప్పుకున్నారు. రేపు ప్రొద్దున్న ప్రెస్ కి రిలీజ్ చేయాలి. అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాను. ఇంటికి వెళ్లాలని లేదు. నేనున్న స్థితిలో సబిత డిస్ట్రబ్ అవుతుంది” అన్నాడు రణధీర్.

రణధీర్ భార్య సబిత నిండు నెలల మనిషి. ఊర్లో వైద్య సదుపాయాలు అంత సరిగ్గా ఉండవని ఆమె తల్లిని ఇక్కడికే పిలిపించాడు రణధీర్. రణధీర్ వారిది ఉమ్మడి కుటుంబం. అతని అన్న, వదిన వారి పాప, తల్లి తండ్రులు అందరూ కలిసి ఒకే ఇంట్లో మూడు పోర్షన్లలో ఉంటారు. వంట వేరే అయినా అందరూ ఒకే చోట ఉంటారు. అందుకే సబిత ఒంటరిగా ఉంటుందన్న భయం ఏమీ లేదు.

నాకు తెలిసి ఎన్నో కేసులను డీల్ చేసాడు రణధీర్. క్రైం సీన్లు అతనికి కొత్త కాదు. కాని ఎప్పుడూ ఇంతగా చలించడం నేను చూడలేదు. కుటుంబానికి సంబంధం లేని విషయానికి రఘు ఇంతగా కలవరపడడం కూడా నేను చూడలేదు. పిల్లల స్కూల్ పక్కన రోహిత్ శవం దొరికింది కాబట్టి, రఘు డిస్ట్రబ్ అయ్యాడు అనుకున్నా రణధీర్ లో కనిపిస్తున్న ఈ అలజడి నాకు కొత్త. పైగా ఎంత స్నేహం ఆత్మీయత ఉన్నా, ముందుగా ఫోన్ చేయకుండా, సమయం కాని సమయంలో హఠాత్తుగా ఇలా ఉడిపడే నైజం అతనిది కాదు. ఏం జరిగి ఉంటుంది అన్న కుతూహాలం తో పాటు, తెలియని భయం నాలో…

ఇలాంటి సమయాలలో తొందరగా అలర్ట్ అయ్యేది రఘునే. వెంటనే రణధీర్ పై చేయి వేసి. “చాలా అలసిపోయావు. ముందు స్నానం చేసి రా రణధీర్. భోంచేసి మాట్లాడుకుందాం. నాకూ ఆకలిగా ఉంది. నీతో కూర్చుని భోంచేస్తాను’’ అంటూ అతన్ని గదిలోకి తీసుకెళ్లాడు.

రెండు గంటల క్రితమే మా భోజనం అయింది. కానీ రఘు అలా అనడం నాకు నచ్చింది. మనసు అతని పట్ల కృతజ్ఞత తోనూ ప్రేమతోనూ నిండిపోయింది. కొన్ని సార్లు రఘులోని నిబ్బరం నెమ్మది చాలా ధైర్యాన్నిస్తాయి కూడా…

వెంటనే ఫ్రిజ్ తెరిచి సర్ధి పెట్టిన కూరలు తీసి వేడి చేయడం మొదలెట్టాను. అన్నం కొంచెమే ఉంది. రణధీర్ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చపాతి తినడం అలవాటు. అన్నం అతను పెద్దగా ఇష్టపడడు. అందుకని పిండి కలపడం మొదలెటాను. లోపల రఘు గొంతు వినిపిస్తుంది. మామూలుగా వారిద్దరూ మాట్లాడుతుంటే రణధీర్ గొంతే గట్టిగా వినిపించేది. రఘుకు చాలా వరకు శ్రోతగా ఉండడం ఇష్టం. ఇవాళ రణధీర్ మౌనంగా ఉన్నాడు. ఎప్పుడూ దేనికి భయపడని అతను ఎందుకు ఇంత డల్ గా మారాడో మరి.

ఇరవై నిముషాల తరువాత రఘు బట్టలలో రణధీర్ గది బైటికి వచ్చాడు. మౌనంగా డైనింగ్ టేబుల్ పై ప్లేట్లు పెట్టాను. రణధీర్ తో పాటు రఘు కూడా కూర్చున్నాడు. చపాతీలు చూసి తన ప్లేటులో ఒకటి వడ్డించుకుని రణధీర్ కు తానే వడ్డించడం మొదలు పెట్టాడు రఘు. రణధీర్ ని మాట్లాడనివ్వలేదు. మౌనంగా రణధీర్ భోజనం ముగించాడు. అతని పక్కన కూర్చునందుకు తాను ఓ చపాతి తిని లేచాడు రఘు. నేను గిన్నెలు సర్ధి వచ్చేసరికి హాలులో ఇద్దరూ కూర్చుని ఉన్నారు.
కొంత సేపు మౌనం తరువాత రణధీర్ మాట్లాడడం మొదలెట్టాడు.

“ఈ కిడ్నాప్ వెనుక ఎదో ఇంటర్నేషనల్ ముఠా ఉంటుందనే మేమూ ఊహించాం. జయరాం ఓ పెద్ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ డీల్ చేస్తున్నారు. అది రాకెట్ల ప్రయోగానికి సంబంధించినది. అది సఫలమయితే మన దేశం ఆ రంగంలో ఓ అడుగు ముందుకు వెళుతుంది. దీనికి అడ్డుపడడానికి ఎవరో అతనిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని మేమూ భావించాం. రోహిత్ ఆయన పెద్ద కొడుకు. తరువాత మూడేళ్ల పాప ఉంది. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే కోటి రూపాయల డిమాండ్ తో ఫోన్ వచ్చినప్పుడు కూడా దీనిలో పెద్ద తలకాయల ప్రమేయం ఉందనే అనుకున్నం. అంత డబ్బు ఇవ్వలేం అంటే మరో షరతు ఏదో వాళ్లు ప్రస్తావిస్తారని అనిపించింది. జయరాం తల్లితండ్రులు ధనవంతులే. అతని అన్నలూ బాగా స్థిరపడ్దారు. అందరూ కలిసి ఆ డబ్బు సేకరించారు. కొందరు స్నేహితులు జయరాంకు అప్పుగా కూడా కొంత డబ్బు ఇచ్చారు. ఇంటి దగ్గర పొలాలున్నాయి. అవి అమ్మి అతను తిరిగి డబ్బు ఇచ్చేస్తాడని అందరికీ తెలుసు. ఆ సమయంలో బిడ్డను కాపాడుకోవాలని అందరూ జయరాం పక్షాణ నిలబడ్డారు. ఆయన్ని ప్రేమించేవారందరినీ చూసాక ఇది ఆయనపై వృత్తిపరమైన ఒత్తిడికి తేవడానికి జరిగిన కిడ్నాప్ గానే అందరం భావించాం.

జయరాం ఇంటికి అతనితో అతని కుటుంబీకులతో మాట్లాడడానికి చాలా సార్లు వెళ్లాం. అతని కుటుంబానికి కావలసినవన్నీ చూస్తూ అన్నా అంటూ అతనితో పాటే కలిసి ఉన్నాడు శేఖర్. మాకు నీళ్ళూ, టీ అందించడం, జయరాం గారి అవసరాలు చూడడం అతనెంతో శ్రద్దగా చేసేవాడు. అతను ఆ ఇంటి సభ్యుడనే అనుకున్నాం. కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేసారని అతని కుటుంబీకులంతా కొంత కొంతగా డబ్బు తెచ్చి ఇస్తుంటే దాని లెక్కలు చూసింది ఈ శేఖరే. అతను ఆ ఇంటి పక్కన ఓ సంవత్సరం క్రితం వచ్చి చేరాడని, మంచి క్రికెట్ ఆటగాడని, రోహిత్ అంటే అతనికి ఎంతో ఇష్టం అని ఇద్దరూ కలిసి ఆ వీధిలో క్రికెట్ ఆడేవారని చెప్పి శేఖర్ మా వద్ద బోరుమన్నాడు. అతని భార్య మాధవి గర్భిణి. ఆమెకు ఎనిమిదో నెల నడుస్తోంది. అయినా ఆ స్థితిలో కూడా ఇంట్లో వారికి సేవలు చేస్తూ జయరాం భార్య రమకు తోడుగా అక్కడే కనిపించేది.

రోహిత్ శవం చూపించిన వ్యక్తి, ఇద్దరు మనుషులు రాత్రి పూట వచ్చి సంచిని ఆ నాలాలో పడేసి వెళ్లిపోయారని చెప్పాడు. అతను అక్కడ రోజూ రాత్రి పడుకోవడానికి వస్తాడు. అయితే ఆ నాలాలో క్రిందికి పోయే నీళ్ళ స్థంబం దగ్గర ఆ సంచి ఆగిపోయింది. దాన్ని రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాడు అతను. తరువాత అతనికే అనుమానం వచ్చి పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఓ రోజు దాన్ని చూపించాడు. అది శవం అని పోలీసులూ అనుకోలేదు. కాని ఎంటో చూద్దాం అని పైకి తీయించారు. అందులో రోహిత్ ను చూసి అందరం ఆశ్చర్యపోయాం. జయరాం గారు కుప్పకూలిపోయారు. పోస్ట్ మార్టంలో ఊపిరి ఆగి ఆ బిడ్డ చనిపోయాడని వచ్చింది. ఇది తెలిసి ఎవరో తెలిసిన వారు చేసిన పని అని ఆ వైపున ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం”

రఘు, జయరాం గారి బంధువులు,ఆ ఇంటికి వచ్చీ పోయే ప్రతి ఒక్కరిని ఆ బిచ్చగానికి చూపించాం. కానీ మాధవిని చూసిన అతను షాక్ తినడం గమనించాక కాని మేం చేస్తున్న తప్పేమిటో మాకు అర్ధం కాలేదు. ఆ బిచ్చగాడు ఈ సంచి మోసుకొచ్చిన స్త్రీ పురుషులలో స్త్రీ చాలా లావుగా ఉందని చెప్పాడు. కానీ మాధవిని అతను చూసిన చూపులో అతను ఏం చెప్పలేకపోయాడో మాకు అర్ధం అయింది. ఆ సంచిని నాలాలో పడేసింది శేఖర్, అతని భార్య మాధవి. మాధవిని దూరం నుంచి సంచి పడేస్తున్నప్పుడు గమనించిన బిచ్చగాడు ఆమె లావుగా ఉందనుకున్నాడు. కానీ, ఆమెను మరో సారి ప్రత్యక్షంగా చూసేదాకా తాను చూసిన స్త్రీ గర్భవతి అని నిర్దారించుకోలేకపోయాడు. నిండు నెలలతో ఉన్న స్త్రీ ప్రధాన హంతకురాలవుతుందని మేం ఎవరమూ ఊహించలేదు.

ఒక్కొక్కరుగా ఆ ఇంటి మనుష్యులను ఆ బిచ్చగాడికి చూపిస్తున్నమేం మాధవిని మర్చిపోయాం. శేఖర్ ను చూసి కూడా ఆ బిచ్చగాడు పోల్చుకోలేకపోయాడు. ముసుగులతో ఉన్నారిద్దరు అని మాత్రమే చెప్పగలిగాడు. మాతో ఉన్న మరో ఆఫీసర్ సుందర్, మాధవి అంతకు ముందు రోజు అందరికీ మంచినీళ్ళు అందించడం చూసాడు. అతను ఆమెను పిలిపించమని చెప్పినప్పుడు జయరాం గారే ఆమె ఆరోగ్యం బాలేక రెస్టు తీసుకుంటుందని చెప్పారు. మాధవి ప్రస్తకి వచ్చినప్పుడు, శేఖర్ మొహంలో మారిన రంగులు చూసాక సుందర్ ఆమెను పిలిపించవలసిందే అని బలవంతం చేసాడు. ఆమె లోపలికి వస్తునప్పుడే ఆ బిచ్చగాడు ఆమెను శేఖర్ ను ఆ సంచి లాక్కుంటూ తెచ్చి నాలాలో పడేసిన వారిగా గుర్తించాడు. ఇది తెలిసాక జయరాం గారు ఆయన భార్య చేసిన ఆక్రందన ఇంకా నా చెవుల్లో వినిపిస్తుంది.
మా పద్దతిలో ఇంటరాగేషన్ మొదలెట్టగానె ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు. ఆ ఇంటి మనుషులుగా వారితో కలిసిపోయి సంవత్సరం నుంచి ఆ ఇంట్లో తిరిగుతున్న ఆ భార్యా భర్తలే రోహిత్ ను హత్య చేసారు.

రఘు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. “ఈ హత్యకు మోటివ్ ఏమిటి రణధీర్’
“తల్లి ప్రేమ” ఠక్కున జవాబిచ్చాడు రణధీర్
అంతా వింటున్న నాకు ఈ ఆఖరి మాట అర్ధం కాలేదు.
“ఏం అంటున్నావ్ రణధీర్.. జరిగిన దానికి తల్లిప్రేమకు సంబంధం ఏంటీ? ఆవేశంగా అడిగాను.
“నేనూ మొదట ఇలాగే ఆవేశపడ్డాను సుధా. ఎస్ ఈ హత్యకు మోటివ్ తల్లి ప్రేమ”
“మాధవి శేఖర్లు వేరు వేరు కులాలకు చెందిన వారు. వారిది రాజమండ్రి. మాధవి గొప్పింటి బిడ్డ. కాలేజీలో చదువుతున్నప్పుడు శేఖర్ ను ప్రేమించింది. శేఖర్ వాళ్లది మామూలు కుటుంబం. అతనికి చదువు పై కన్నా స్పోర్ట్స్ పై ఆసక్తి. మంచి క్రికెటర్. కాని అది కెరీర్ గా మార్చుకోగల స్థోమతు, ఓపిక అతనికి లేవు. మాధవి తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. శేఖర్ తల్లి తండ్రులకు ఉద్యోగం సద్యోగంలేని కోడుకు అప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. వారిపై మరో ఇద్దరు పిల్లల భాద్యత ఉంది. శేఖర్ వారిపెద్ద కొడుకు. తల్లి తండ్రులు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని పెళ్ళి చేసుకుందాం అని శేఖర్ పై ఒత్తిడి తీసుకొచ్చింది మాధవి. హైదరాబాద్ పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు. శేఖర్ ఓ చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. జయరాం గారి ఇంటి పక్కన ఓ పెద్దింటి యజమాని తన ఇల్లు చిన్న పోర్షన్లుగా మార్చి అద్దెకు ఇవ్వడంతో దాంట్లో అద్దెకు దిగారు.

మాధవికి జయరాం బార్యతో పరిచయం అయింది. ఆమె ఊరు వైజాగ్. ఈ ప్రేమ జంట ఆమెకు ముచ్చటగా కనిపించారు. పెద్దవారందరికీ దూరంగా ఉన్నారని, వారికి తన ఇంట్లో చనువు ఇచ్చింది. శేఖర్ క్రికెట్ పిచ్చి అతనికి రోహిత్ ను దగ్గర చేసింది. క్రికెట్ లో మెళుకువలు నేర్పుతానంటూ రోహిత కు దగ్గరయ్యాడు శేఖర్. రోహిత్ శేఖర్ ను మామా అని పిలిచేవాడట.

గొప్పింట్లో పెరిగిన మాధవి తన జీవితాన్ని రమ జీవితంతో పోల్చుకోవడం మొదలుపెట్టింది. శేఖర్ ఉద్యోగం మంచిదే కాని దానితో విలాసంగా జీవించడం కుదరదు. రమలా పెద్ద కారు, మేడ సంపాదించాలంటే ఆ ఉద్యోగం సరిపోదు.పైగ్గా అన్ని సౌకర్యాలతో పెరిగిన ఆమె శేఖర్ తో సామాన్య జీవితానికి అలవాటు పడలేకపోయింది. ఆ సమయంలోనే మాధవి గర్బవతి అయింది.

తమ ఇద్దరి పిల్లల కోసం రమ జయరాం గారిద్దరూ ఎంత తపన పడతారో ప్రతి క్షణం దగ్గరగా ఉండి చూసేది మాధవి. కారులో స్కూలుకు వెళ్తున్న వాళిద్దరిలా తన బిడ్డ కూడా పెరగాలని ఆమె కోరిక. రమ తన కూతురి కోసం బంగారం కొనడం, అది మాధవికి చూపించడం, పిల్లల ఫీజులు వారి బట్టల గురించి జరిగే చర్చలు, రోహిత్ స్పోర్ట్శ్ కోచింగ్ కోసం జయరాం గారు ప్లాన్ చేయడం అతని క్లాసుల కోసం రెండో కార్ కొని డ్రైవర్ ను ఈ మధ్యనే పెట్టుకోవడం, ఇవన్నీ చూశాక, తన బిడ్డకూ తాను ఇవన్నీ అందివ్వాలనే కోరిక ఆమెలో పెరిగిపోయింది. శేఖర్ పై ఒత్తిడి మొదలయింది. తన ఒక్కడి జీతంతో కుటుంబం అండ లేకుండా ఇవన్నీ సాధ్యం కావని శేఖర్ తేల్చి చెప్పడంతో రోహిత్ ని కిడ్నాప్ చేసి జయరాం గారి వద్ద డబ్బు గుంజి దానితో తమ బిడ్డ భవిష్యత్తు స్తుస్థిరం చేద్దాం అని సలహా ఇచ్చింది మాధవి, మొదట భయపడినా శేఖర్ దానికి ఒప్పుకున్నాడు.

అనుకున్నట్లుగానే ఓ సాయంత్రం రోహిత్ కు క్లాస్ లేవి లేవని తెలుసుకుని క్రికెట్ ఆడదాం రమ్మని ఇంటి బైటకు తీసుకువచ్చాడు శేఖర్. కాసేపు ఆడుకున్నాక, తానో కొత్త బాట్ కొని తెచ్చానని, ఓ గంటాగి ఇంటికి వెళ్లి దానిని తెచ్చుకోమని రోహిత్ కు చెప్పాడు. ట్యూషన్ సార్ వస్తాడని రోహిత్ అంటే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చప్పున వెళ్లి ఆ బాట్ తెచ్చుకొమ్మని, తాను పని మీద బైటికి వెళుతున్నానని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు. అమ్మ ఆ సమయంలో బైటికి వెళ్తానంటే ఒప్పుకోదని ఇంట్లో రమకు చెప్పకుండా పక్కింటికి వెళ్ళాడు రోహిత్. అక్కడ మాధవి అతనికి కూల్ డ్రింక్ లో టాబ్లెట్లు కలిపి ఇచ్చింది. ఓ పది నిమిషాలు బాట్ చూస్తూ నిలబడ్డ రోహిత్ మత్తులోకి జారిపోయాడు. ఆ ఇంట్లోని పూజ గదిలో నోట్లో గుడ్డలు కుక్కి రోహిత్ ను ఉంచి ఆమె జయరాం ఇంటికి వెళ్ళి రమ పక్కన కూర్చుంది. రోహిత్ కనిపించట్లేదని గొడవ మొదలయేటప్పుడు ఆమె అక్కడే ఉండి హడావిడిగా ఇల్లిల్లూ తిరిగింది. పైగా శేఖర్ కు ఆ ఇంటి నుండే ఫోన్ చేసి ఇంటికి రమ్మని హడావిడిగా పిలిచింది.

రోహిత్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తూనే ఓ నాలుగు గంటల తరువాత శేఖర్, జయరాం గారికి ఓ ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ఫోన్ చేసి డబ్బు అడిగాడు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తరవాతే రోహిత్ కిడ్నాప్ అయ్యాడని మాకు కబురు అందింది. జయరాం గారి రీసెర్చ్ గురించి తెలిసాక, ఇదేదో అంతర్జాతీయ సంస్థల పని అని మేం కూడా అనుకున్నాం. రోహిత్ కోసం అతని అమ్మమ్మ నాన్నమ్మ తాతలు, పెదనాన్నలు జయరాం స్నేహితులు డబ్బు తెచ్చి ఇస్తుంటే మాధవి ఆక్కడే ఉంది. ఇంట్లో రోహిత్ ఎప్పుడూ మత్తులోనే ఉండేలా ఆమె ఆ రెండు రోజులూ జాగ్రత్త పడింది. రాత్రి రమ దగ్గరే పడుకునేది. తమ చేతిలోకి ఇక డబ్బు వచ్చేస్తుందని ఇద్దరూ అనుకున్నారు. ఆ డబ్బు ఎక్కడ తెచ్చివ్వమని అడగాలో మాట్లాడుకున్నారు. కాని జయారం గారి ఉద్యోగం వలన ఇది మామూలు కిడ్నాప్ కాదని, దేశ భద్రత్తుకి సంబంధించిన విషయం అనే దిశగా పోలీసులు తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇది వారు ఊహించని మలుపు.

జయరాం కి డబ్బు గురించి మళ్ళి ఫోన్ చేయడం వారికీ కష్టంగా మారింది. అయినా ఓ అర్ధరాత్రి జయరాం కు ఊరవతల నుండి ఫోన్ చేయగలిగాడు శేఖర్. దాన్ని ట్రాక్ చేసే పనిలో ఉన్న పోలీసులకు ఆ సెల్ ఫోన్ నంబర్ ఆ ఫోన్ వచ్చిన తరువాత నుంచి పని చెయట్లేదని తెలిసింది. గోల్కొండ ప్రాంతం నుండి కాల్ చేసినట్లు సమాచారం అందింది. డబ్బుని అక్కడికే తెచ్చి అందివ్వమని చెప్పడంతో పాటు పోలీసులకీ సంగతి తెలియకుడదనే బెదిరింపూ ఉండడంతో జయరాం గారు మాతో సంప్రదించకుండా రోహిత్ ను ముందు ఇంటిని తెచ్చుకుందాం అని నిశ్చయించుకున్నారు.

మా అనుమానం ఆ ఇంట్లో కొత్తగా చేరిన డ్రైవర్ మీదకు కూడా పోయంది. అతను కాకుండా ఆ ఇంట్లోని పనివారితో సహా అందరూ రమ పుట్టింటి నుండి వచ్చినవారే. ఆమెతో చిన్నతనం నుండీ అనుబంధం ఉన్నవారే. డ్రైవర్ కూడా మాకు పూర్తిగా సహకరించడం, అతనిపై అనుమానాలు తీరడంతో ఇది జయరాం గారి వృత్తికి సంబంధించిన విషయం గానే తీసుకున్నాం అందరం.

మాధవి ఇంట్లో రోహిత్ కు స్పృహ వచ్చి పోతూ ఉండేది. భార్యా భర్తలిద్దరూ ఎక్కువగా జయరాం గారి ఇంట్లోనే పడుకునేవారు. ఓ రెండు రోజులు మాధవి రోహిత్ తనను గుర్తు పట్టకుండా ముసుగుతోనే మేనేజ్ చేసింది. కాని రోహిత్ ఆమెను గుర్తు పట్టాడు. ఓ సారి పూర్తిగా స్పృహలోకి వచ్చి మాధవి ఇచ్చే డ్రింక్ తాగకుండా పెనుగులాడాడు. ఈ కిడ్నాప్ విషయంలో ఇంత ఆలస్యం జరుగుతుందని, రోహిత్ ను ఇన్ని రోజులు బంధించవలసి వస్తుందని మాధవి ఊహించలేదు. పోలీసులు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుని కాపలా కాస్తారని ఆమె అనుకోలేదు. చుట్టూ ఉన్న కాపలా ఆమెను కంగారు పుట్టించింది. పెనుగులాడుతున్న రోహిత్ గొంతెత్తి అరవబోతుంటే అతని నోటిని బలంగా చేత్తో మూసేసింది మాధవి. అప్పుడు జరిగిన పెనుగులాటలో రోహిత్ ఊపిరి అందక మరణించాడు. శేఖర్ జరిగినది తెలుసుకుని భయపడ్డాడు. అతన్ని మాధవి సముదాయించి శవాన్ని ఎలా మాయం చేయాలో చెప్పింది. రెండు గోనె సంచుల్ని తెచ్చి అందులో శవాన్ని మూట గట్టుకుని బాగా రాత్రి అయ్యాక ఇద్దరూ స్కూటర్ పై ఆ నాలా దగ్గరకు చేరి చెత్త పారేస్తున్నట్లుగా ఆ మూటను నాలాలో విసిరేసారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరన్నది నిజమే. కానీ, అనుకోకుండా దూరంగా నిద్రపోతున్న ఆ బిచ్చగాడు వీళ్ళను చూసాడు. ఆ సంచి కూడా కొట్టుకుపోకుండా కాలువలో ఓ మూల ఇరుక్కుని ఉండిపోయింది.

ఇంటరాగేషన్ లో మాధవి “నాకు పుట్టబోయే బిడ్డను నేను గొప్పగా పెంచుకోవాలి, పెద్దవాడిని చేయాలి అందుకే ఈ పని చేసాను’’ అని ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పడంతో పాటు, బిడ్డ కోసం తల్లి ఏమైనా చేస్తుందని తానూ అదే చేసానని సమర్ధించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శేఖర్ మొహంలోనైనా భీతి చూసానేమో కాని మాధవిలో అలాంటిదేమీ లేదు. రోహిత్ చనిపోవడం ఓ ప్రమాదమని, చంపే ఉద్దేశం తమకు లేదని చెప్పింది. జయరాం ధనవంతుడు ఆ డబ్బు మాకు తెచ్చివగలడు. దాంతో మా బిడ్డను గొప్పగా పెంచుకోవాలనుకున్నాం అంది. ఒక తల్లిగా నా బిడ్డకు గొప్ప జీవితం ఇవ్వడానికి ఇలా చేసానని వాదించింది. శేఖర్ అంటే తనకెంతో ప్రేమ అని, అతను తమ కోసం కష్టపడడం చూడలేకపోతున్నానని, ఈ డబ్బు వస్తే తాము అని సౌకర్యాలతో బతకవచ్చని తనకు అనిపించింది అని చెప్పింది. ఈ ఆలోచన తనదే అని శేఖర్ కేవలం తనకు సహకరించాడని కూడా అంది. ఆమెను చూస్తుంటే నాకు విపరీతమైన కోపం కలిగింది. ఇదేం ఉన్మాదం” అంటూ రణధీర్ నా వైపు చూసాడు.

“మతి చలించిన దుర్మార్గం అది. ఇంకా పుట్టని తన బిడ్డపై ఆమెకు ఉన్నది ప్రేమే అయితే తోటి తల్లికి అంత అన్యాయం ఎలా చేయగలుగుతుంది రణధీర్, ఇది ప్రేమ కాదు ఉన్మాదం”కోపంతో అన్నాను నేను.

రఘు మౌనంగా ఇదంతా వింటున్నాడు. ఎదో ఆలోచిస్తూ… “ఇలాంటి ఉన్మాదాన్నే తల్లి ప్రేమ అంటూ చాలా సందర్భాలలో మనమే సమర్ధిస్తాం, ఒప్పుకుంటాం. ఇక్కడొక ప్రాణం పోయింది కాబట్టి అందులో క్రూరత్వం కనిపిస్తుంది కాని ఇలాంటి క్రూరత్వాన్ని మనం తక్కువ పాళ్లల్లో రోజూ చూస్తూనే ఉంటాం సుధా” అన్నాడు.
నాలో కోపం పోంగిపోయింది. “ఏంటి రఘు ఇలాంటి ఉన్మాదం ఎంత తక్కువ పాళ్లలో ఉన్నా అది తప్పే. దాన్ని ఎవరు మాత్రం సమర్ధిస్తారు ? ఒప్పుకుంటారు? అన్యాయంగా మాట్లాడుతున్నావ్ నువ్వు అన్నాను.

తనకు పుట్టిన బిడ్డను, మరొక తల్లి సంతానాన్ని స్త్రీ ఒకే విధంగా చూడటం ఎక్కడన్నా జరుగుతుందా సుధా? తన బిడ్డపై మమకారం ఉండడం తప్పు కాదు. కాని తన బిడ్డ కోసం ఇతరుల బిడ్డలపట్ల క్రురత్వం ప్రదర్శించే తల్లులు మన చూట్టూ లేరంటావా?
సవతి తల్లి ఆరళ్ళ వెనుక ఉన్నది ఇలాంటి ఉన్మాదమే కదా.., మరో తల్లి కన్న బిడ్డ తనింటికి కోడలిగా వస్తే ఆమెను రాచి రంపాన పెట్టే అత్తరికం లో కూడా ఉన్నది ఇలాంటి ఉన్మాదం తో కూడిన ప్రేమే.

పిల్లల కోసం ఆస్తులు కూడబెడుతున్నాం అనే వాళ్ళు, దాని కోసం తమ కుటుంబంలో ఎత్తుకు పై ఎత్తులు వేసే వాళ్లల్లో ఇలాంటి అమ్మలు లేరంటావా?. తమ పిల్లల కోసం అంటూ సొంత తల్లి తండ్రులని, అత్తమామలను ఇంటికి దూరం చేసే వాళ్లదీ ఈ రకం ప్రేమే… కాదంటావా? తన బిడ్డకే రాజ్యం రావాలి అంటూ యుద్దాలు చేసిన, చేయించిన స్త్రీలు, వనవాసాలకు బిడ్డలను పంపించిన కైకేయీ, గాంధరిలు వీరందరి చర్యలకు కారణం ఆ తల్లి ప్రేమే.

“నువు దేనినించో మరో దానికి వెళుతున్నావ్ రఘు. మనం మాట్లాడుతుంది ఓ హత్య గురించి” అన్నా.
ఇది కనిపించే హత్య సుధ. తమ బిడ్డల పై గుడ్డి ప్రేమతో ఎందరో తల్లులు ఇలాంటి కనిపించని హత్యలు నిత్యం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క తల్లి ఇలాంటి ఉన్మాదావస్థలో ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాని ప్రతి తల్లి ప్రేమలోనూ ఇలాంటి ఉన్మాద చాయలు కనిపిస్తాయి. నాది, నా బిడ్డ అనే స్వార్ధం చూట్టూ తిరిగే తల్లి ప్రేమ ఇతర బిడ్డలకు ఎక్కువ నష్టమే చేస్తుంది. దాన్ని మనం చాలా సహజంగా తీసుకుంటాం. కొన్ని సార్లు గొప్పగా చెప్పుకుంటాం.

“సృష్టిలో ప్రతి జీవి తల్లిగా బిడ్డల కోసం పోరాడుతుంది” అవేశంగా అన్నాను నేను”
“బిడ్డల ప్రాణంపైకి వస్తే ఏ జంతువయినా ఎంత వరకయినా పోరాడుతుంది. అది తల్లి ప్రేమే. కాని మనిషి విషయంలో ప్రాణం కోసం జరిగే యుద్దాలు ఎన్ని చెప్పు. నాగరిక సమాజంలో బిడ్డ ప్రాణాలను రక్షించుకోవడానికి తల్లులు చేసే యుద్దం ఎంతని? చాలా మంది తల్లులు ఫక్తు గాంధారి ప్రేమను ప్రదర్శిస్తూ అదే మాతృత్వం అంటూ ఉంటారు. పిల్లల కోసం అంటూ వారు చేసే చాలా పనులు వారి పిల్లలకు ఎంత మంచి చేస్తాయో కాని ఇతరుల బిడ్డల మనసులను నలిపేసేవే. రోహిత్ విషయంలో ఆమెలోని ఆ తల్లి పేమ ఆమెను ఉన్మాద స్థితిలోకి నెట్టేసింది. ఆమె చేసింది అతి ఘోరమైన పని కాదనను. కాని సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ సమస్య మూలాలలోకి చూడమంటున్నాను.

మనింట్లో పని పిల్ల రాణి పని చేసిన రోజులను గుర్తు తెచ్చుకో. జాను కంటే కేవలం ఆరు సంవత్సరాలు పెద్దది. కానీ, జ్వరం వచ్చిన రోజుల్లో కూడా ఆ పిల్లతో మీ అమ్మ ఎంత పని చేయించుకునేది? ఎవరో సమస్యల పరిష్కారానికి పరుగెత్తుకుంటూ వెళ్ళే నీవు కూడా ఆ బిడ్డ కళ్లలోకి ఒక్కసారి చూడలేకపోయావు. మీ అమ్మకి మనవరాలిపై గుడ్డి ప్రేమ. అందుకని ఆమె ఎందరిని బాధపెట్టింది? భర్త చనిపోయిన మీ పెద్దమ్మ కూతురు జానును ఎత్తుకుందని ఆమె ముందే బిడ్డను లాక్కుని దిష్టి తీసింది. కన్నీళ్ళతో ఈ ఇల్లు దాటిన ఆమె దీనవదనం నాకు గుర్తుంది. ఏడుస్తున్న ఆమెతో మీ పెద్దమ్మ, నీకు అర్ధం కాదులేవే అది బిడ్డపై దానికున్న ప్రేమ అంటూ మీ అమ్మనే సమర్ధించింది. ఇంట్లో రెండు రోజులకు మా అన్న వదిన లేకుండా వారి పిల్లలు వస్తే వారికి కనపడకుండా తాను ఉరు నుండి తెచ్చిన నెయ్యి దాచిపెట్టి జానుకి వడ్డించేది మీ అమ్మ. అన్నయ్య పిల్లల వయసు అప్పుడు ఎంత ? ఆరేళ్ళు అంతేగా? మీ అమ్మ దొంగతనంగా ఆ పసిదానికి తిండి పెట్టడం ఆ బిడ్డలకు అర్ధం కాలేదనుకున్నారా? వాళ్లకు అర్దం అయింది కాని వదిన వాళ్లతో ఇక్కడికి రాలేదు కాబట్టి ఆ విషయం బైటికి రాలేదు. అలాంటి మీ అమ్మే జానుకు జ్వరం వస్తే రోజుల తరబడీ మేల్కొని సేవ చేసింది. అంత ప్రేమ అందరిపై ఉండాలని లేదు. కానీ, ఆ ప్రేమ మాటున ఇతరులను ఆమె ఎంత బాధపెట్టిందో ఒక్క సారి గుర్తు తెచ్చుకో.

నువ్వు చదువుకున్నదానివి కొన్ని విషయాలలో ఉదారత నీలో ఉంది కాని అది ఎంతవరకు? మన బిడ్డ కు అన్నీ టైమ్ కు జరగాలని, రాణిని ఎన్ని గంటలకు నిద్ర లేపేదానివి? జాను కాస్త ముక్కు చీదితేనే అల్లాడిపోయే నువ్వు నూట ఒకటి జ్వరంతో ఉన్న రాణితో జాను బట్టలు ఇస్త్రీ చేయించలేదు. ఎందుకు? మరుసటి రోజు నీ కూతురు స్కూలు ఫంక్షణ్ లో అందంగా కనపడాలని, నీ కూతురిపై ఉన్న ఆ శ్రద్ద జ్వరంతో కళ్ళ నిండా నీరు కారుతుండగా పని చేస్తూ ప్రాక్ కాల్చిన ఆ బిడ్డ మీద చూపలేకపోయావు. ఆ బిడ్డను లాగి పెట్టి ఒకటిచ్చి అది ఏడుస్తుంటే మార్కెట్ కెల్లి మరో ఫ్రాక్ తెచ్చుకున్నావు. పైగా రాణి వాళ్లమ్మతో నా బిడ్డ కోసం మోజు పడి వెతికి తెచ్చుకున్న ఫ్రాక్ కాల్చింది. నా చీర కాల్చినా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కాని పాప కోసం ముచ్చట పడి తెచ్చిన ప్రాక్ అంటూ కన్నీళ్లు కార్చావు. ఆ పేద తల్లి నీ కన్నీళ్ళను చూసి కరిగిపోయి “జాగ్రత్తగా పని చేయవచ్చు కదే” అంటూ రాణీనే తిట్టి వెళ్లిపోయింది. ఆ చిన్న మనసు నీ తల్లి ప్రేమకు ఎంత నలిగిపోయిందో గమనించే పరిస్థితిలో నీవు ఎప్పుడూ లేవు.

పిల్లల విషయంలో ఆడవాళ్లలో ఉండే ఈ ప్రేమ చాలా గొప్పదనుకుంటారు మీరంతా. తాగి వచ్చిన కొడుకుకు మజ్జిగ ఇచ్చి బుజ్జగించి పడుకోబెట్టే తల్లి ప్రేమ గురించి ఎంతగా వర్ణిస్తారో. ప్రతి ఒక్కరికీ ఇలాంటి తల్లే కావాలి. ఇంత ప్రేమ కావాలి. తప్పు చేస్తే చెంప చెళ్ళు మనిపించే తల్లికి ఆ గౌరవం మీరు ఇవ్వరు. అలాంటి ఓ స్త్రీ ఉంటే ఆమే మీకు మాతృత్వానికి అర్ధం తెలియని స్త్రీగానే కనిపిస్తుంది. బిడ్డల తప్పులను కడుపులో పెట్టుకోవాలి, బిడ్డల కోసం చేయకూడని పనులు చేయాలి, అత్యంత స్వార్ధాన్ని ప్రదర్శించాలి. ఇదే మీ దృష్టిలో ప్రేమ.

కొన్ని సందర్భాలలో ఈ అంతులేని మాతృ ప్రేమ ఇటువంటి ఉన్మాద స్థితికి దారి తీస్తుంది. నిజానికి ఆ అంతులేని ప్రేమ చుట్టూ తల్లుల అభద్రతాభావం ఉంటుంది. మాతృత్వం మాటున ఈ అభద్రతా భావాన్ని కప్పు పుచ్చుకుంటూ క్రూరంగా ప్రవర్తిస్తారు తల్లులు. మీలోని ఆ అభద్రత వలనే బిడ్డలే మీకు కేంద్ర బిందువులు అవుతారు. ఆ బిడ్డలను మీకు కట్టి పడేసుకోవడానికి ఇతరులకు ఎంత కష్టాన్నిఅయినా కలిగించే స్థితికి మీ తల్లులు చేరతారు. ఆ గుడ్డి ప్రేమ మీలోని మనిషిని మెల్లిమెల్లిగా ఎలా తినేస్తుందో మీరు గమనించరు. కొందరు కొంచెం కొంచెంగా దీన్ని బయటపెట్టుకుంటారు. కాస్త ఎక్కువ దూకుడు ప్రదర్శించే స్త్రీలు ఈ మాధవి లాంటి ఉన్మాద స్థితికి చేరుకుంటారు.

తల తిరిగిపోయింది నాకు ఆయన మాటలకి. రాణి పని చేయలేకపోతుందని ఈయన పట్టుబట్టి ఆ పిల్లను తిట్టి పంపించేయడం నాకు గుర్తుకొచ్చింది. దానికి బదులుగా ఎప్పుడూ వంట గదిలోకి వెళ్ళని రఘు నాకు సహాయానికి రావడం, పిల్లల పని చాలా వరకు తనే చేయడం అతని కుచించుకుపోతున్న ప్రపంచానికి చిహ్నం అనుకున్నాను. కానీ, రాణిని నా తల్లి ప్రేమ నుండి రక్షించడానికి అతను చేసిన పని అది అని ఇప్పుడు అర్ధం అవుతుంది. ఆ తరువాత మా ఇంట్లో చిన్న పిల్లలెవరూ పనికి కుదరలేదు.

ఇంటికి చుట్టాలెవరొచ్చినా అందరూ కలిసి భోంచేయవలసిందే అన్న నియమం మా ఇంట్లో ఎందుకు వచ్చిందో, తినే వస్తువులు ఎవరివయినా సరే వంటగదిలో ఒకే చోట ఉండడానికి ఆయన ఎందుకు పట్టుబడేవారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. పిల్లలందరూ ఉన్నప్పుడు జానుకిష్టం అయిన పూత రేకులను అందరికీ అక్కడే సమానంగా పంచిపెట్టే రఘుని పిల్ల ఇష్టాలు పట్టించుకోని వాడిలా నేను ఎందుకు చూసేదాన్నోనాకు కొంచెం కొంచెంగా అర్ధం అవుతుంది. ఎన్ని సార్లు జాను కోసం దాచిపెట్టి చాటుగా తను వద్దంటున్నా తినిపించేదాన్నొ గుర్తుకు వచ్చి సిగ్గనిపించింది. చికెన్ వండినప్పుడు బావగారి పిల్లలకు లేకుండా అందులోని లివర్ ముక్కల్ని, ఒండిన కూర నుండి చాటుగా తీసి అర్ధరాత్రి లేపి బబ్లూ కి తినిపించడం గుర్తు కొచ్చింది. పిల్లలు నేను పెట్టిన ఈ దొంగ తిళ్ళను తిని మూతి తుడుచుకుని వెళ్లిపోతుంటే చూసి ఎంత మురిసిపోయేదాన్నో, ఎంత తృప్తి పడేడాన్నో. నిజానికి వాళ్ళకు నేను అలా తినిపించినవి మళ్ళి వాళ్ళ కోసం కొనలేని పరిస్థితిలో మేం లేము. కానీ, పక్కవారి పిల్లల కన్నా నా పిల్లలే మంచిగా తినాలనే నా అత్యాశే నా చేత ఆ పనులు చేయించింది. చికెన్ లో మంచి ముక్కలు లేవని బావగారి పిల్లలు కంచాలలో కెలుకుతూ ఉంటే నా వైపు రఘు చూస్తూ ఉంటే వండేటప్పుడు కరిగిపోయి ఉంటాయి అని చెప్పి నా లౌక్యానికి అప్పుడు ఎంత మురిసిపోయేదాన్నో.
రణధీర్ కూడా ఆశ్చర్యంగా రఘుని చూస్తూ ఉండిపోయాడు. తన ఉమ్మడి కుటుంబంలో విషయాలు అతనికీ కొన్ని గుర్తుకు వచ్చి ఉంటాయి. “కానీ మాధవి చేసిన పని… అంటూ ఇంకేదో చెప్పబోయాడు.

“అతి ఘోరమైన, హేయమైన చర్య. ఆ దంపతులకు కఠిన శిక్ష పడవలసిందే.” బాధతో కోపంతోనూ అన్నాడు రఘు. కానీ, ఆమె తన తల్లిప్రేమను ఈ హత్యకు మోటివ్ గా చూపడం వెనుక వాస్తవికతను కొందరయినా చూడాలని నా కోరిక… తల విదిలిస్తూ మౌనంగా పిల్లల మధ్యలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు రఘు, తన ప్రపంచంలోకి విశాలమైన హృదయంతో. నేను, రణధీర్ బైట మా విశాల ప్రపంచంలో కుచించుకుపోయిన మనసులతో మాలోకి మేము తోంగి చూసుకుంటూ మిగిలిపోయాం.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply