ఇడుపు కాయిదం

“ఏం సంగతి బావా బిడ్డ పెండ్లి ఎప్పుడు జేస్తున్నవ్” ఓ పెండ్లి కార్యం బంతిభోజనం జేసుకుంట మల్లయ్యను అడిగిండు వీరయ్య. మాగ జేయ్యాలే బావా పోయ్న యేడే చేద్దామంటే ఈ వచ్చిరాని కాలానికి పంటలు సరిగ పండక చేశ్నా అప్పులు అట్నే ఉండే మల్ల లగ్గం ముందరెసుకుంటే ఎలుకంతున్నప్పు ఏనుగంత అయిద్దని కొద్దోగొప్ప అవి తీర్నాక చేద్దామనుకున్న బావా. బంతిలో శాన మంది ఉన్నరు వడ్డించేటోళ్లతోని చుట్టాల పక్కాల మాటలతోని కొంత హడవుడి ఉంది అటు బైటికి పోయి మాట్లాడుకుందాం బావా…!.
“అందరూ తిన్నారుళ్ల ” బంతిలో కూర్చున్న ఓ పెద్దమన్శి అడిగే సర్కి అందరూ ఒక్కపాలిగా ఐయిపోయింది అనుడుతోనే మోదుగాకు ఇస్తార్లు మలిచి భుజానున్న తువ్వాల సద్రుకోని గీలాసా పట్టుకోని పైకి లేచిండ్రు మల్లయ్య, వీరయ్యలు.
“ఆ.. బావా బువ్వతినేటప్పడు ఓ మాట ఎల్లబెడ్తివి ఏందే..!
అదే మా దూరపు చుట్టం దేవమ్మ నాకు అక్క వరుస అయితది. ఒక్కడే కొడుకు పిలగానికి పాతికేళ్లపైనే ఉంటయి. రెండెకురాల శిల్లర శెల్క, ఊళ్లో ఓ పెంకుటిళ్లు ఉంది. అయ్య ఆ పిలగాడు శిన్నగున్నప్పుడే సనిపోయిండు. పట్నంలో ఉంటడు .ఏదో పని అని శెప్పింది.. మా అక్క..ఆలోచన చేసి …ఆ కారు మెకానికల్ పని అంటా బాగానే సంపాయిస్తుండంట. ఆ ఊల్లే ఓ కార్యానికి పోతే ఎడనన్న ఓ పిల్లుంటే జాడచూడమని చెప్పింది. అప్పుడు నువ్వు యాదికొచ్చినవ్” చెప్పిండు వీరయ్య.
మల్లయ్య ఆలోచనలో పడ్డడు…”సుద్దాం బావా ఇంటిపోయ్నకా కొమ్రమ్మను అడిగి మాతలాబు పంపుతాలే…పెండ్లి కాన్నుంచి ఎవలింటికి వారు బయలుదేరిండ్రు.”
“కొమ్రమ్మ ఇయ్యాల పెండ్లికి పోయ్నకాడ మన పిల్లకు ఓ సంబంధం వచ్చింది. మా మల్లయ్య బావా జాడ చెప్పిండు, పిలగాడు పట్నంలో ఏదో మెకానికల్ జేత్తడంటా. ఓ రెండేకురాల దాక భూమి ఉందంటా, కానీ అయ్య లేడట” నెతిరి బువ్వ తినకుండ కొమ్రమ్మకు చెప్తండు మల్లయ్య.
“పట్నంలో ఉంటడు మల్ల ఏదో మెకానికల్ అంటున్నవ్ మంచిగానే ఉంది పటు. మన బుజ్జికూడ అంతో ఇంతో సదివే ఏదైన ఓ పనిజేత్తది పటు. గొప్పింటోళ్లకు ఇద్దానికి మానకు అంతతాకతు లేదాయే..!.
“ఓ పాలి పిల్లను అడ్గుతే మంచిగుంటదిగా..” “ఏం గాదులే అది ఒప్పుకుంటది, అది నాబిడ్డే” మల్లయ్య అన్నడు.
“అంత మంచిగానే ఉందిగని కట్నం ఏంతడుగుతారో మరి.. ఓ పాలి మన బుజ్జికి చెప్పి అప్పుడు మతలాబు పంపుదాం లే…” పల్లెంలో చెయ్యి కడుక్కుంట అన్నడు మలయ్య.
“బుజ్జి నీకు ఓ సంబంధం వచ్చిందే …” గీలాసల చాయ్ తాగుకుంట బిడ్డ రజితను అడ్గిండు తండ్రి.
“నీకు ఇట్టమేనా ?” అని మల్లోపాలి అన్నడు.
“నన్ను శిన్నప్పటి నుంచి సాది సవరిచ్చి ఇంత దాన్ని చేసిండ్రు మీ మాటకు అడ్డు చెప్పుతానా నాయ్నా” ప్రేమగా ఏం ఆలోచన జేయకుండ తండ్రికి చెప్పింది.
“మా బిడ్డే.. మా అవ్వే..” అన్కుకుంట చాయ్ గిలసపక్కన బెట్టి బిడ్డను గుండెకు హత్తుకున్నడు మల్లయ్య. అవ్వ గూడ ఈ ముచ్చటింనంగా ఒక్కసారే సంతోషాన్ని అంతా మొఖంలోని తెచ్చుకోని మస్తు సంబుర పడ్డది. అప్పుడే నిద్రలేశి ఆవలిస్తూ వస్తున్న కొడుక్కు కూడా ఈ ముచ్చట చెప్పగానే ఎగిరి గంతేశిండు.
“ఇగ ఆల్శం శేయకయ్య…! ఈ ముచ్చట మీ బావాకు చెప్పు” ఫోన్ చేద్దానికి కోటోల్లింటికి తొలింది కొమ్రమ్మ.
“హలో… బావా నేనే మల్లయ్యను గుర్తుపట్టినావా..!” . “హలో..హలో.. ఎవలో మీరు మా నాయినకు ఇత్తున్న ఆగు” వీరయ్య కొడుకు.
“ఆ బావా మంచిగున్నావే…!” అన్నడు వీరయ్య.
“ఏంది బావా మనం కల్శి వారం రోజులు సూత కాట్లేదు నీ అడుగుడు గమ్మత్తుగా ఉంది” అన్నడు మల్లయ్య.
“హ.. హ…. ” నవ్విండు ఫోన్ మాట్లాడుతున్న వీరయ్య.
“అదే బావా పెండ్లి అన్నవ్ కదా! దాని గురించి మా ఇంటిల్లి పాది ఒప్పుకున్నరు. మంచి రోజు చూసుకోని పిల్ల పిగాడు చూసుకోని ఒగలికి ఒగలు ఇష్టం అయితే… తర్వాత తతిమ్మ ముచ్చట్లు మాట్లాడుకుందాం”.
నేనే మంచి రోజు ఎప్పుడో తెల్సుకోని మాతలాబు పంపుతా బావా…” ఫోన్ కట్ చేసిండు మల్లయ్య.
ఆ రోజు రానే వచ్చింది మల్లయ్య దంపతులు కొందరు పెద్దమన్సులతో పిలగాన్ని సుద్దానికి దేవమ్మ ఇంటికి పోయిండ్రు. పిలగాడు ఎర్రగా ఎత్తు పొడుగు బాగానే ఉన్నడు. ఉల్లేకి పోంగనే పిలగాడు ఎసంటోడు ఏంది అన్న ఇవరాలు అడిగిర్రు. వాళ్లు కూడ పిల్లగాడు అయితే బుద్ది మంతుడే పట్నంలో ఏదో పని జేత్తడంటా చెప్పిండ్రు.
“మాకు పిలగాడు నచ్చిండు మీరు గూడ మంచి రోజు చూసుకోని వచ్చి పిల్లను జూస్తే తతిమ్మ ముచ్చట్లు మాట్లాడుకుందాం” అక్కడున్న దేవమ్మ, వీరయ్యలతోపాటు పెద్దమన్సులకు జేప్పి ఇంటి బాట పట్టిండ్రు.
ఓ రోజు దేవమ్మ తరపోల్లు పిలగాడు కోటేష్తో పాటు వీరయ్య, ఓ ఐదారుగురు వచ్చిరు. ఆడోళ్లకు చాపలు, మొగోళ్లకు నుల్క మంచాలు వేసిండ్రు. వచ్చినోళ్లుకు ఇంతా చాయ్ పోసిండ్రు.
కశే నిమ్మలపడ్డంకా “పిల్లను తీస్కారండ్రి మంచి గడియా దాటిపోయే యాళ్ల అవుతంది” దేవమ్మ తరపోల్ల ఓ పెద్దమన్శి అన్నడు.
“ఆ కొమ్రమ్మ పిల్లను తీస్కోని రా… ” బైటి నుంచి కూతేసిండు పెన్మిటి. చందమామే భూమి మీదకు వచ్చినట్టు ఉంది రజిత”. అమ్మలక్కలు రజిత దోస్తులు చీరకట్టిచ్చి ముద్దుగా తయారుజేసిండ్రు. నిమ్మలంగా తోటోళ్లు రజితను తీస్కాచ్చి అప్పటికే పరిచి ఉన్న చాపల కూసోపెట్టిండ్రు. దేవమ్మ తరపోల్లు గుచ్చి గుచ్చి చూస్తాండ్రు ఏమైన నలతుందా అని రజితను.
“ఓ పిలగా పిల్లను చూశ్నావార్రా.. ” అందులో ఓ పెద్ద మన్శి నవ్వుకుంట అన్నడు.
“వచ్చిందే పిల్లను సూద్దానికేనాయొ పిల్లను చూడకుంట మిమ్మల్ని చూస్తాడ ఏంది?” ఆ మాటకు అక్కడున్నోలంతా నవ్విండ్రు.
రజిత ఒక కంటితో చూసి చూడనట్టుగా కొటేష్ను చూసింది. అప్పుడే రజితను చూస్తున్న కొటేష్ ఇద్దరు ఒక్కపాలిగా ఒక్కరి కళ్లలోకి ఒకరు చుసుకున్నారు. రజిత తన కిందికొంచి ముసిముసిగా నవ్వింది. ఆ దృశ్యాన్ని చూసి అందరు ఇక వాళ్లు ఇష్టపడ్డడే తీయ్. అని నిమ్మలపడ్డరు. హమ్మయ్య వాళ్లు అనుకున్నట్టుగానే పిల్లపిలగాన్నోల్లు నచ్చిండ్రు.
“ఇద్దరు ఇష్టపడ్డటే కానీ తతిమ్మ మాట ముచ్చట గూడ మాట్లాడుకుంటే ఓ పని ఓడ్సిపోతుంది కదా” పిలగాని తరపున పెద్దమన్శి అన్నడు.
“ఇదంతా అయినంకా అది అగుతుందా..! అంతా ఆత్రం ఎందుకే” పెద్దయ్య పిల్లతరపు మన్సి అన్నడు.
“ఇంక ముసుకుల గుద్దులాట ఏంది గనీ పిలగాన్కి ఓ చైను, బటువు లచ్చరూపాల డబ్బులు …!” ఓ మాట ఇడ్సిండు ఆటు తరపున మనిశి, ఒక్కపాలె నారజైంర్రు రజిత తల్లిదండ్రులు.
“ఉన్న ఆస్తి మొత్తం అమ్మిన అంతా రాదు…!” ఇంకో మాట శెప్పుర్రి పిల్లతరపున పెద్దమన్శి…!.
“పిలగాడు పట్నంలో ఉంటుండు నాలుగు రూపాలు సంపాయిస్తుండు. మా ఇంట్లేకు అడుగుతున్నమా? వాళ్ల పిల్లకే కదా ఇచ్చేది” పిలగాని తరపున పెద్దమన్శి అన్నడు.
అది కాదు “ఓ బటువు పెట్టి యాబై వేలు ఇస్తారు వాళ్ల తాకత్కు మించి అడిగితే ఎట్ల, పిల్ల మద్దుగుంది ఆలోచన చేయిండ్రి” అన్నడు పిల్లతర్పు మన్శి.
అటు తిరిగి వీరయ్య వాళ్ల పెద్దమన్సులు శిన్నగా మాట్లాడుకోని.. “ఎట్లగు ఒక వస్తువు తక్వ చేస్తున్నరు కావట్టి పురగా ఆ లచ్చరూపాయలు నికరం చేసుకోండి ఖరాకండిగా చెప్పిండు పిలగాని తర్పాయ్నా.
ఇంట్లోకి పోయిండ్రు పిల్ల తర్పోళ్లు. “ఏం గాదయ్యా.. మంచి సంబంధం మన పిల్ల నీడపట్టున ఉంటది. ఒక్కడే కొడుకంట పిల్ల పిలగాడు మంచిగా బతుకుతే అదే సాలయ్యా..!. మనం ఇన్ని రోజులు కట్టపడ్డది దాని కోసమేకదా మొగన్ని ఒప్పిత్తుంది కొమ్రమ్మ.. అట్నే కానీయ్యి కాకుంటే ఇంత భూమి అమ్ముదం అన్నీటికి ఆదేవుడే ఉన్నడు పటు ధైర్నం చేసిండ్రు మల్లయ్య దంపతులు”. ఈ ముచ్చట్నే వాళ్లకు చెప్పిండ్రు. సంబంధం ఖాయం కావడం వల్ల అంతా సంబురవడ్డరు. ఎమ్మటే షాలోల్లింటికి పోయి కొత్త తువ్వాల దెచ్చి పిలగాన్కి కప్పి మావోడు అన్పిచ్చుకున్నరు. వచ్చినోళ్లకు మంచి మర్యాద చేసిండ్రు.
** **
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!” అయ్యగారు మంత్రాలు చదువుంటే కోటేష్ రజిత మెడల తాళి కట్టిండు. పెండ్లికి వచ్చినోళ్లంతా లేచి నిలబడి సల్లంగా బతకాలని దివీస్తూ అక్షింతాలు వేసిండ్రు. బిడ్డ మెడల తాళి పడటంతోని మస్తు కుషి అయిండ్రు మల్లయ్య దంపతులు.
ఆళ్లకు ఒక పెద్ద బరువుతీర్నట్టు అయ్యింది. గంజులల్లో యాట కూర, తలకాయ శోర్వ, బగార బువ్వల వాసనలుసుట్టాల కడుపుల్లో ఆకలి రెట్టింపు చేస్తున్నాయి. పిల్లపిలగానికి అక్షింతలు వేసినోళ్లు పోయి ఈత చాపల్లలో కూసోని తిని బ్రేవ్… మంటు ..బయటికి వచ్చి కట్నకానుకలు పెట్టి పేరు రాపిచ్చికుంటున్నరు.
అప్పగింతల యాల్లయింది. రజిత చేతులు తీసి దేవమ్మ చేతిల, పిలగాని చేతిల పెట్టి ఏడుస్తున్నారు. రజిత కుడ బోరున విలించింది. అమ్మలక్కలు దైర్నం చెప్పంగా ఆటు బాధ ఇటు సంతోషంతోని అత్తగారింటికి సాగనంపిండ్రు రజితను.
** **
రోజులు, వారాలు , నెలలు గడిచిపోతున్నయి. సంవత్సరాలు గడిచాయి.. ప్రశాంతంగా బిడ్డ పెండ్లి చేశ్నాం అన్న దైర్నంతో ఇన్నాళ్లూ కష్టం నష్టం అయిన భరిస్తూ కంటినిండ నిద్రపోయిండ్రు మల్లయ్య దంపతులు. ప్రశాంతంగా ఎగుతున్న గాలి పటాన్ని సుడిగాలి వచ్చి ఆగం చేసినట్టు ఒక్క సారిగా వారి జీవితంలో అలజడి రేగింది.
ఓ రోజు రజిత ఆటో దిగి దీనంగా… ఆగం ఆగంగా… బిడ్డను సంకలలేసుకోని, చెదిరిపోయిన జుట్టుతో, వాడిపోయిన మొఖంతో కట్టేసంచి పట్టుకోని బిడ్డ ఏడుస్తుంటే ఉకో… ఉకో… అనుకుంటా బిర బిర సడుసుకుంట తన అవ్వగారింటీకి తొవ్వ పట్టుకోని పోతుంది.
“ఏంది…అట్ట పొయ్యేది మన మల్లిగాని బిడ్డకాదు.. ఏందిరో ఓ పండగ కాదు పబ్బంకాదు యాల్లకాని యాల్ల అవ్వగారి ఇంటికోత్తాంది” మొద్దుమీద కూసున్న ఇద్దరు పెద్ద మన్శులు మాట్లాడుకుంటున్నారు.
“అయిన గీయాల్లప్పుడు వాళ్ల ఇంటికాడేంటరు. శెల్కాడ్కిపోయ్నాలే… ఏమో ఆ పిల్లకు ఏం కట్టం వచ్చిందో ఏందో పటు..” వాళ్లకు వాళ్లు మాట్లాడుకుంటున్నరు.
పొద్దుగూకింది.. కొమ్రమ్మ కూలికిపోయి అప్పుడే బజారు గల్మలకు అడుగుబేడుతుంది. అమ్మమ్మను చూడగానే పిలగాడు కియ్..కియ్ అనుకుంట కొమ్రమ్మ కాళ్ల సందులో జోర్రిండు. మా అయ్యె అని పిలగాన్ని ఎత్తుకోని ముద్దులు పెడ్తూ మురిసిపోతుంది. పిలగాని సంకల చెయ్యిపెట్టి పైకి లేపగానే కొమ్రమ్మ మొఖం మూతి మీద తన బుడ్డి బుడ్డి కాళ్లతో తనుకుంటా మస్తు మురుస్తుంటే, ఆ లేత పాదాలను ముద్దాడుతుంది అమ్మమ్మ.
యాల్ల కాని యాల్ల చెప్ప జేయకుండ బిడ్డ వచ్చినందుకు చిన్న అనుమానం ఉన్న నిమ్మలంగా అడుగుదాం అనుకుంట మనుమడ్నితో ఆడుకుంటుంది. ఇంతల్కే బాయికాంచి మల్లయ్య వచ్చుడుతోని అగ్గో తాత అని మల్లయ్యకు ఇచ్చి గోళెం కాడ్కి పోయింది కొమ్రమ్మ కాల్రేక్కలు కడుకుందాన్కి.
“అవ్వ రజితా అల్లుడుగట్ల మంచిగుండ. అల్లున్ని కూడ తోల్కరాపోయినవ్ నాల్రోజులు ఉండి పోదురు. నాత్రి బువ్వకు కూసున్నరు. ఇంత అయినంక ఇంక దాసుడేంది అనుకున్న రజిత వచ్చిన సంగతంతా అవ్వయ్యలకు చెప్పింది. వారిలో తెలియని భయం జోరవడ్డది. దేవుడ బగమంతా ఏంది ఈ కష్టాలు. ఎంత పనాయొ కంటనీరు దీసింది కొమ్రమ్మ. ఆరు నెలల కిందే ఏదో యాపారం జేస్తా నంటే ఎడ్లు అమ్మికట్నం ఇచ్చిన ఇంతా మోసం చేస్తాడా…!. రేపు ఓ పెద్దమన్సితోని అడిగిపిద్దాం పటు…” దీనంగా అన్నడు మల్లయ్య. ఆ బాధతో బువ్వ సరిగ్గా తిననే లేదు మల్లయ్య. ఈత సాపల పిలగాడు ఆదమర్శి నిద్రపోతాండు.
“ఏంది మల్లయ్య కోడి కూయతల్గనే వచ్చి లేపినావ్..!. అంతా తొందరెమోచ్చింది”. మంచంల కూసుంట అన్నడు పెద్దమన్సి చంద్రయ్య.
“అది కాదు బాబాయ్. మా అల్లుడు పిల్లను మోసం చేసిండు. మా బిడ్డను ఇయ్యతల్గనే అప్పట్కే ఓ పెండ్లం ఉందంటా..!. దానికి ఒక బిడ్డ నట. ఈ ఇసయం మూడో కంటికి తెల్యకుంట మల్లపెండ్లి చేసుకోని పట్నలో ఉంటుండు. మంచిగా బత్కుతదని ఇత్తే బలె మోసం అయ్యింది.” కంటనీరు తువ్వాలతోని తుడ్చుకున్నాడు మల్లయ్య.
ఏడ్వకు మల్లి. నేనే మాట్లడుతా…!. కట్నం గాక ఇంక ఇరువై వేలు ఎక్కువనే ముట్టినాయి. అప్పుడు పెండ్లప్పుడే కట్నం కట్నమంటే రెండు పాలిచ్చే బర్లనమ్మి ఇచ్చిన. ఇంక పెండ్లకి తీసుకున్న అప్పు సేటు దగ్గర ఇంక తీరనేలేదాయొ.. మీరే నా బిడ్డకు నాయం జేయ్యాలే… నా బిడ్డను ఎన్ని తిప్పలు పెట్టిండో ఏందో మెమేడ బాధపడ్తామో నని అది ఏది చెప్పలేదు” చంద్రయ్య చేతులు వట్టుకున్నడు మల్లయ్య.
“ఏం కాదులే.. నేను మాట్లాడుతా తీయ్,.. దైర్నం చెప్పిండు చంద్రయ్య. ఓ రోజు పోయి వాళ్ల ఊరు పెద్ద మన్సులకు చెప్పు పంచాతి చేద్దాం” ఇంటికి పోయిండు చంద్రయ్య.
“పోలీస్ టెషన్ల పెట్టాలే… ఆల్లు నాలుగు తంతే ఈసొంటి గాడ్ది కొడ్కులకు సిగ్గొత్తది” అందులో ఓ ఆడ మనిషి.
“నెత్తికొరిగిచ్చి గాడ్ధమీద ఉరేగియ్యాలే” ఇంకోకలి మాట.
“వీడు పాడుగాడు నిస్కార్నంగా ఇద్దరి బతుకలు ఆగం జేసే. ఆ కొటేష్ను తిట్టరాని తిట్టుతిడ్రున్నారు ఆడోళ్లు”. అక్కడున్నోళ్లు అన్నన్ని మాటలు అంటంటే తల్లి దేవమ్మ తలదించుకుంది. ఏం జేయ్యాల్నో అర్థం అయితలేదు దేవమ్మకు. నాన్న అని కొటేష్ దగ్గర్కి పోతాంటే “ఆ గుంజి గాని కాడ్కి పోయి ఎం జేద్దావ్” కొడుకు నోరు మూసింది రజిత.
“ఎంత నటిచినవ్రా దున్నపోతా… నీ అవ్వ నీఅయ్యపోయిన కాంచి కాయ కట్టం చేసి నిన్ను అంతో ఇంతో సదివిస్తే నువ్వు చేసే పని ఇదేనానారా? వచ్చినదానికన్న సిగ్గుండోద్దా?. ఏం మాయం జేసింనావ్రా దాన్ని నీ బొంద మురగా” మస్తుగా తిడుతున్నారు. నేను గొప్పపనే చేసినన్నట్టు గంబీరంగా చూస్తండు కోటేష్.
పెద్ద మన్సులు వచ్చిండ్రు.. ఇద్దరి సాలు అడిగిండ్రు. “కొత్తల బానే ఉన్నడు… ఎప్పుడైతే పిలగాడు పుట్టిండో అప్పట్నుంచి కొట్టుడు షురూ జేసిండు. నువ్వు ఉండే ఉండు పోతే..పో… అనుకుంట తాగచ్చి ఊకుకకే కొడ్తండే. ఒక రోజు జుట్ట పట్టుకోని కొడితే ఆ రోజంతా పిలగాన్కి పాలియ్యలేదు. అంత ఒళ్లు నొప్పులుండే. ఒక రోజు ఏకంగా దాన్ని ఇంటికే తీస్కొచ్చిండు. అప్పుడు అర్దం అయింది నా జీవితంలో మన్ను పోసిండని. ఇందుకనే నాతోని పతిరోజు పంచాదికి దిగ్తుండే. కట్నం ముట్టినంకా ఈ కొట్టుకు ఎక్కువనే అయ్యింది. ఇది వరకే పెండ్లి చేసుకున్నడని తెల్సినంక ఆడుంటే ఎట్లన్న సంపుతడనే గుబులు పుట్టి తెల్లారే ఇట్ల పడి వచ్చిన. ఇన్ని రోజులు కొడ్తుంటే నా బిడ్డ కోసం భరించిన గనీ ఈ పని చేసినంక నేనేట్ల ఊకుంటా” ఎక్కిల్లుపడంగా ఏడుస్తూ చెప్తుంది రజిత.
“మీకు దండం పెడ్తా. ఇంగ వీనితోని అస్సలే ఉండను. మీరే నాయం జేయండ”ని వంగి పెద్దమన్సులకు మొక్కవోతుంటే ఆక్కడున్న ఆడ మనిషి లేపింది.
“నీ వల్ల ఇద్దరి జీవితాలు ఆగం అయ్యెకదరా మోదనాష్టపోడా..! ” అల్లుడని చూడకుండా కొమ్రమ్మ తిట్ల దండకం ఎత్తుకుంది”.
“ఇప్పడు ఎట్ల నాయం జేయ్యాలే…” తలలు పట్టుకున్నరు పెద్దమన్సలు.
“ఇద్దర్ని సాత్తా నాకు ఏం కాదు కోటేష్ అనంగనే ఇంకా మా జీవితం నాశ్నం చేసింది సాలదారా..!. థూ.. నీ బతుకు చెడ. ” మొగని మొఖం మీద ఉంచింది రజిత.
“ఆగమ్మ బుజ్జి. మేం మాట్లాడుతున్నం కదా” రజితను సముదాయించిండ్రు పెద్దమన్సులు. కోటేష్ పెద్దమన్సులకు ఏం మాట్లాడాల్నో అర్థమైతలేదు.
“నేను వీనితోని సచ్చినా ఉండను..!. ఎప్పుడో నేత్రి చంపిన సంపుతడు” భయపడుతుంది రజిత.
“గిట్ల ఎన్ని సార్లు భయపెట్టిండో బాడుకావ్. అందుకే పిల్ల ఇంత గనం బుగులు పడుతుంది” అంటున్నరు అక్కడున్నోళ్లు”.
“మీరు ఏం జేప్పిన సరే. వీనితోని అస్సలు ఉండా…!, నాకు వీనితోని తెగదెంపులు జేయ్యుర్రి. కూలో నాలో చేసుకోని నా పిలగాన్ని నేను సాదుకుంట” కండ్లనీరు చెంపలమీద్కి సారలు గట్టినయ్. కొంగుతోని తుడ్చుకుంది రజిత.
ఇద్దరి తరపున పెద్ద మన్సులు సాటుకు పోయీ మాట్లాడుకున్నారు.
“నీకు పెట్టిన సొమ్ములు, డబ్బులు అన్ని కలిపి బంగాంతోపాటు, రెండు లక్షల రూపాయాలు పిల్ల అవ్వయ్యలకు ఇయ్యాలే…!. రెండు ఎకురాలు భూమి ఉంది అన్నవ్. ఒక ఎకురం ఆ పిలగాని పేరు మీద రాసియ్యాలే” ఇదే ఖరాకండి అన్నట్టు చెప్పిండ్రు పెద్ద మన్సులు.
“ఇంకో లచ్చ రూపాలు నీ మొదటి పెండ్ల పేరు మీద, ఉన్నొక ఎకురం దాని బిడ్డ మీద. నువ్వు రజితను చేసినట్టే దాన్ని జేయ్యవని నమ్మిక మాకు లేదు. నువ్వు సాదిన సాదకున్న ఆ భూమి ఆ డబ్బులతో వాళ్లకింతా ఆసర అయితది” అని కాయితం రాసిండ్రు పెద్దమన్సులు
“మల్ల ఈ పొద్దటి రోజు మీ ఇద్దరికి ఇడాకులు” లేచిండ్రు పెద్దమన్సులు.
ఆ రోజు రానే వచ్చింది. వాళ్ల తరపోల్లు, వీల్లతరపోల్లు వచ్చింర్రు. “మనసు ఏమైనా మారిందా? కలసి ఉండుర్రి కష్టమో నష్టమో ఇద్దరు జేస్కా బత్కుర్రి” రజితను అడిగిండు పిలగాని తరపున పెద్దమన్సి.
“నేను వానితోని ఉండనంటే ఉండను. వాన్కి నాకు అస్సలు శిడం పడదు. ఒక్కసారి నమ్మకం పోయ్నక మల్లి నిలవదు. ఇప్పుడు మల్ల పోయిన కూడ ఎప్పుడు ఎట్లుటండో తెల్వదు. ఇంత మంది సుట్టాలకు పక్కాలకు, సొంత అవ్వకు కూడ ఎర్కలేకుండా ఈ పని జేసిండు అంటే రేపు నన్ను సంపి కూడా ఎటో దెంకపోయింది అన్న అంటడు. కట్టమైన నిష్టురమైనా నేను ఇట్లున్న ప్రశాంతంగా బత్తా.. మల్లవానితోని కలపకుర్రి” ఏడ్సుకుంట పెద్ద మన్సులకు దండం పెట్టింది రజిత.
నాకేం తెల్వదన్నట్టే దిమ్మరపోయి చూస్తుండు కోటేష్.
“నీకు ఇట్టమేనారా! రజితేమో అట్లంటంది” పెద్దమన్శి. “దానికి ఇష్టం లేనప్పుడు బలంతంగా మాత్రం ఉంటదా..!. మీ ఇష్టమచ్చినట్టే కానీయ్యుర్రి” తల దించుకుండు కోటేష్.
కోటేష్ కేలి ఒరగా జూసి “అట్నే… సరే తీయ్…” అన్నరు పెద్ద మన్సులు…
ఇద్దరు పెద్ద మస్సులు పోయి ఊల్లో ఉన్న హన్మంతున్కి మొక్కి ఇడుపుకాయిదం రాస్తున్నందుకు క్షమించమని ఓ ఆరుగు మీద కూసోని రాసుకోని వచ్చి అందరి ముందర సదివిచ్చిండ్రు వాళ్ల ఇంటోల్లు సరే అన్నంక.
“మొన్న రాసిన భూమి కాయితాలు రజితకు ఇచ్చిర్రు. కోటేష్ సంతకం చేసిండు. రజిత వంతు వచ్చింది. ఏడుస్తూ తన బిడ్డను గుండెలకు హత్తుకోని, ఇక నా బారం నీదే దేవుడని నమస్కరించి ఇడుపు కాయితం మీద సంతకం చేసింది. అప్పట్కే కంటినుండి కారుతున్న కన్నీరు రెండు చుక్కలు ఆ కాయితం మీద పడ్డయ్.
“వాయిదా ప్రకారం కట్నం తిరిగి ఇయ్యాలె. వాయిదా దాట్తే జురుమానా ఏస్తం” అని కొటేష్ను హెచ్చరించారు పెద్ద మన్సులు.
అక్కడున్న పెద్దలకు, చిన్నలకు ఆడోళ్లకు చేతులెత్తి దన్నం పెడ్తూ కన్నీటి కడలి పొంగి వస్తుండగా గుండెకు పిల్లను హత్తుకోని ఇంటికి నడిచింది రజిత.
బిడ్డను అనుసరిస్తూ “మన కష్టాలు అసలు ఇప్పుడు మొదలయినై బిడ్డ” అని కొడుకుని దగ్గరికి తీసుకోని ఇంటి తొవ్వ పట్టిండ్రు మల్లయ్య దంపతులు.
** **

Leave a Reply