ఇంటింట చీకటే…

ఇంటింట చీకటే – రచన: చెరబండరాజు, గానం: మాభూమి సంధ్య

ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరే
రాజ్యమెవరికి వచ్చేనో – రాజన్న
సుఖము లెవరికి దక్కెనో

వొల్లిరిచి కష్టించి రాజనాల్ పండించ
కరువు లెందుకు వచ్చేనో – కనకయ్య
గరిసె లెవరివి నిండెనో

పాతికేండ్లైపాయె భారతీయుని బ్రతుకు
అంగట్ల సరుకాయెనో – రంగయ్య
అట్లెందుకైపాయెనో

ఓట్లేసి గెలిపించి పట్నాని కంపితే
సీట్ల కుక్కాలయ్యిరో – జక్కయ్య
ఓటర్లు ఏమయ్యిరో

ఓ అంటే నా రాని కోట్లాది జనముంటే
చదువు లెవరికి నేర్పిరో – కోటయ్య
కొలువు లెందుకు దొరకవో

పేర్లేమొ పెద్దలవి వేసేవి గుడిసెలు
లక్షలేమైపోయెనో – అచ్చయ్య
లెక్కలెవరికి చెప్పిరో

ఉన్నోడు ఉన్నతికి లేనోడు కాటికి
దేశోన్నతిదే అందురో – మైసయ్య
పేదదేశం బందురో

ఆసేతు హిమగిరీ పోలీసు కాపలా
దేశమే జైలాయెనో – జానయ్య
నాజీల పాలాయెనో

నోరెత్తితే ప్రజలు చట్టాల జేజేలు
పిచ్చిపట్టిందెవరికో – మంకయ్య
మందు వుందని తెలియరో

కూడడిగితే జైళ్లు జైళ్లలో కాల్పులు
ఇది ప్రజాస్వామ్యమగునో – సాంబయ్య
పోలీసుస్వామ్యమగునో

గిరిజనులు హరిజనులు ఏరోజుకారోజు
బలిపశువులెట్లయ్యిరో – పాపయ్య
బందూకెందుకు పట్టిరో

పాలు తాపిన తల్లి ప్రతి మనిషికున్నట్లు
పోరాట స్థలము తల్లివంటిదో – సత్తెయ్య
శ్రీకాకుళం ప్రజల తల్లి మనకందరికిరో

  • 1972

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

One thought on “ఇంటింట చీకటే…

Leave a Reply