ఆ వేమన చెప్పని కథలు

ఇంటిపేరులో వేమన పెట్టుకున్నందుకేమో వేమన వసంతలక్ష్మి సమాజానికి, మనిషికి సంబంధించిన వైరుధ్యపూరిత సత్యాల్ని చెప్పటానికి చిన్ని కథల్ని ఎంచుకున్నారు. ఆ వేమన ఒకో పద్యంలో ఒకో సత్యం చెబితే ఈ వేమన ఒక్కో గల్పికలో ఒకో సత్యం చెప్పింది. అది పద్యం. ఇది గద్యం. ఆ వేమన తాటాకు మీద రాస్తే ఈ వేమన కాగితం మీద రాసింది. మిగతాదంతా సేం టూ సేం.

వసంతలక్ష్మి 39 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పని చేసారు. అందులో ఆవిడ సుదీర్ఘకాలం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంకి బాధ్యులుగా వున్నారు. ఆ సమయంలో ఆమె 2002 నుండి 2016 వరకు నిరంతరాయంగా ఆ అనుబంధ పుస్తకంలో “సండే కామెంట్స్” అన్న పేరుతో ఒక శీర్షిక రాసేవారు. ప్రతి వారం ఆమె రాసేది గల్పిక కావొచ్చు, కథ కావొచ్చు, వ్యాఖ్య కావొచ్చు, వ్యాఖ్యానం కావొచ్చు, పరిశీలన కావొచ్చు. రూపం ఏదైతేనేం పాఠకుడికి తాను రాసే విషయం మీద ఒక కొత్త కోణాన్ని పరిచయ చేయటం రచయిత్రి ఉద్దేశ్యం. మనం అలవాటు పడిన దృష్టికోణం నుండి మనం చూడని మరో వైపుకి మన తలని పట్టుకొని తిప్పి చూపే ప్రయత్నం కనబడుతుంది. అలా సుమారు 15 ఏళ్ళ పాటు దాదాపు ప్రతి వారం రాసిన తొమ్మిది వందల “కామెంట్స్” నుండి 104ని ఎన్నుకొని ఇప్పుడు “పర్స్పెక్టివ్స్” వారు తమ 58వ ప్రచురణగా అదే “సండే కామెంట్స్” అనే పేరుతో పుస్తకం ప్రచురించారు.

సామాన్యంగా చిన్ని కథలంటే మనం చిన్న పిల్లల కోసం అనుకుంటాం. కానీ మనసు అంతగా వికసించని వయసు మీద పడ్డ పెద్ద చిన్న పిల్లల కోసం కూడా చిన్న కథలు రాయొచ్చని వసంతలక్ష్మి భావించి వుంటారు. అయితే సాంకేతికంగా ఇవన్నీ కథలా లేక గల్పికలా అంటే ఏదైనా కావొచ్చు. “అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు” అంటూ మొదలెడితే పిల్లల కోసం అని, “పడక్కుర్చీలో పడుకున్న పరంథామయ్య గారు “పోస్ట్” అన్న కేకతో ఈ లోకంలోకి వచ్చారు” అంటే పెద్దల కోసమనీ మనం అనేసుకుంటాం. చిన్న పిల్లల కోసం నీతి కథలు, పెద్ద వాళ్ళ కోసం సమస్యల పరిష్కారం కోసం అని కూడా అనేసుకుంటుంటాం. వెంకటేశ్వర్లు, కుమార్, జగదాంబ, పద్మావతి వంటి మనకి తెలిసిన సామాన్య పాత్రలుంటే కథలని, అలా కాకుండా పేర్లతో నిమిత్తం లేకుండా, కొంత అధివాస్తవికంగా, మేధో పరంగా కథనముంటే గల్పికలని అనుకుంటాం. విలోమంగా, అపసవ్యంగా వున్న సత్యాల్ని వాస్తవికంగానూ, హృద్యంగానూ చిరు హాస్యంతో, పద లాస్యంతో చిన్న రచనలో ఒక గల్పికగా చెప్పాలంటే చిన్న విషయం కాదు. ఆదివారం అనుబంధం పుస్తకం ఆమె ఫేస్బుక్ గోడ కాదు. ఇష్టం వచ్చినట్లు విరుచుకు పడే అవకాశం లేదు. పత్రికల్లో పనిచేసేవాళ్ళకి మంచి చెడుల స్పృహ పత్రికల పాలసీకి లోబడి వుండాలి. ఏం చెప్పినా సున్నితంగా చెప్పాలి. హక్కుల కార్యకర్త ఐన వసంతలక్ష్మి దృష్టి కోణం పదునుగా వుండకుండా వుండదు. కానీ పత్రిక పరిమితులు తక్కువేం కాదు. చదివే పాఠకులు అతి మామూలు ప్రజలు. వారి మనోస్థాయిని దాటకుండా వారికి ఓ కొత్త విషయం చెప్పాలి. ఓ కొత్త విలువని పరిచయం చేయాలి. అందుకే ఆమె ఏం చెప్పినా ఈ కథ వినరా అబ్బాయ్, ఈ విషయం తెలుసుకోరా బాబూ, ఒకసారి ఇటు చూడరా నాయనా, అన్నట్లు ఈ సంగతి తెలుసా అమ్మాయ్ అన్నట్లు చెప్పారు. విషయాలు సున్నితంగా అయితే చెప్పారు కానీ చెప్పిన ఏ విషయమూ చెప్పినంత సున్నితమైంది కాదు. నెత్తురోడే వాస్తవాల్ని చాక్లెట్ రేపర్లో చుట్టి మన కళ్ళకి అప్పచెప్పినట్లుంటుంది. అది చమత్కారం అద్దిన రేపర్. ఉన్నతీకరించబడిన హాస్యం ఎప్పుడూ నవ్వించి ఊరుకోదు. అది నీ పెదవుల మీద దరహాసాన్ని పూయించొచ్చు కానీ డొక్కల్లో పొడిచినట్లుగా కూడా వుంటుంది. మీ అబ్బా భడవల్లారా కళ్ళెట్టుకు చూడండ్రా అంటూ ఆపేక్షతో తిట్టినట్లుంటుంది. దాన్నే తెలుగులో వ్యంగ్యం అంటారు. ఆ వ్యంగ్యానికి అడ్డాగా ‘సండే కామెంట్స్’ వుండేది. ఆ శీర్షికని నేనూ శ్రద్ధగా చద్సివేవాడిని. కానీ ఎవరు రాసారో తెలియదు. అవి చదివినప్పుడు అనుకునేవాడిని రాసిందెవరో కానీ అనామకులు అయితే కారు, కేవలం అజ్ఞాతులు అని. అంతటి స్థాయి కనిపించేది.

గల్పికల కోసం వసంతలక్ష్మి ఎంచుకున్న అంశాలు, రాజకీయాలు, సంస్కృతి, మానవసంబంధాలు, పౌర హక్కులు, ఆదివాసీ హక్కులు, రాజ్య హింస, పర్యావరణం, అభివృద్ధి, విస్థాపన, విద్య, మీడియా, టెక్నాలజీ తెచ్చే మార్పులతో పాటు సృష్టించే గందరగోళం, కుటుంబం, పిల్లలు, సినిమాలు, వలస వినిమయ సంస్కృతి, పరిగెత్తుతున్న కాలంలో వచ్చే మార్పులు, మనిషి భిన్న ప్రవృత్తులు, వ్యక్తిత్వ వికాసం, మానవీయతని తట్టి లేపే అంశాలు. అందుకోసం ఆమె మాట్లాడే పులుల్ని, తల్లి చేపని పట్టుకొని ఏడిచే పిల్ల చేపల్ని, పిల్లి అరుపుల క్యాసెట్ కోసం వెతికే అమ్మాయిని, తప్పిపోయిన అంకెల్ని, అడవిలో మహాసభని పెట్టుకున్న మహావృక్షాల్ని, తెలుగు సభలకెళ్ళొచ్చిన కాకిని…ఇటువంటి అధివాస్తవిక పాత్రల్ని, సన్నివేశాల్ని సృష్టించారు.

అడవులంటే ఆదివాసీల ఆవాసం కోసమనీ, పర్యావరణ పరిరక్షణ కోసమనీ, లక్షలాది వృక్ష, జీవ జాతుల వైవిధ్యపూరిత సహజీవనం కోసమనీ కాకుండా అడవులంటే టూరిజం కోసమని, పట్టణ ప్రజల తీరిక, ఉల్లాస కార్యకలాపాల కోసమని నమ్మించే ప్రయత్నాల్ని, వాదనల్ని ఎత్తిపొడిచేది “అడవి కల”.

మనకి లేనిదేదో ఇతరులకు వుందని మనల్ని చూసి మనమే జాలిగా నిట్టూర్చే తత్వంలోని తక్కువతనాన్ని వేలెత్తి చూపేది “మీమాంస”.

అభివృద్ధి సహజమైనదని, అభివృద్ధి పేరుతో వాపు హానికరని చెప్పేది “ఎలుక-ఏనుగు”. ఎలుకలు ఏనుగులైతే ఎలుకలకే నష్టం కదా.

తెలుగుకి ప్రాచీన హోదా కావాలని డిమాండు చేస్తూన్న భాషాభిమానుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇలా ప్రశ్నిస్తారు. “ప్రాచీన గౌరవాలు భాషకేనా లేక జాతులకు కూడా వుంటాయా? జాతులను గౌరవించలేని వాళ్ళు భాషల్ని గౌరవిస్తారా? కళింగనగర్ కాల్పుల్లో మరణించిన పన్నెండుమంది ఆదివాసులు మనకంటే ప్రాచ్చీనమైన జాతులకు చెందిన వాళ్ళని ప్రభుత్వాలకి తెలియదా?” “తారుమారు” అనే రచనలో ఎంత పదునైన చూపు? కత్తి కొసన అక్షరాల్ని నిలపటమంటే ఇదే కదా! అతి మామూలు పాఠకులకి ఇంతకంటే పదునైన దృష్టికోణాన్ని చేర్చే పద్ధతి మరేదైనా వుందా?

“తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి” అనే సామెతని తిరగరాస్తూ “మా తాతలు నెత్తురు తాగారు. మేం తలలు వంచి క్షమాపణ చెబుతున్నాం” అంటూ చరిత్రలో తప్పు చేసిన దేశాలు తాము పీడించిన దేశాలకు, జాతులకు నిరర్ధక క్షమాపణలు చెప్పిన వైనం గురించి “తాత ముత్తాతల తరపున” తెలియచేస్తుంది. ఐతే గుణపాఠాల నుండి నేర్చుకున్నదే క్షమాపణ అని విశదీకరిస్తుంది.

జీవితంలో బతికినందుకే షష్టి పూర్తి ఉత్సవాలు చేసుకోవటం కాదు, చేసిన తప్పుల్ని లెక్కపెట్టుకుంటూ కాలమానాన్ని అబ్జర్వ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని “తప్పోత్సవాలు”లో ప్రతిపాదిస్తారు. “వీధి నాశన విధ్వంస శత దినోత్సవం”, “పచ్చదన విధ్వంసనికి పదహారేళ్ళు” వంటి దినోత్సవాల్ని సూచిస్తారు.

చిన్న పిల్లలకి కథలు చెప్పి వారిని ఆదర్శవంతంగా తయారు చేసే రోజులు లేవు కనుక ఊరకే కథలు చెప్పి కంగారు పెట్టొద్దనే సెటైర్ “కథలు చెప్పొద్దే అమ్మా” లో అంటారు.

స్వాతంత్య్రం వచ్చిన యాభై ఏళ్ళకి అయిన ఈ దేశానికి తొలి దళిత రాష్ట్రపతి ఎవరు అని అడుగుతారు (ఇంకా తొలి ప్రధానమంత్రి కాలేదు 72 ఏళ్ళ తరువాత కూడా) కానీ తొలి బ్రాహ్మణ రాష్ట్రపతి ఎవరు అని ఎందుకడగరు అంటూ మనం గుటకలు మింగాల్సిన ప్రశ్నలేస్తారు “చెప్తేనేం”లో.

ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పుకోవాల్సిన గల్పికలే. ఒక భిన్నమైన ఎత్తుగడతో, అంతకంటే భిన్నమైన ముగింపుతో ఈ గల్పికలు మనిషి వాసన కొడుతుంటాయి. మనిషి ఏం మిస్ అయ్యాడో, అవుతున్నాడో ఘోషిస్తాయి. చక్కటి తెలుగు భాషా చమత్కార రజనుతో అలరారిన ఈ గల్పికలు మేధో రజితంగా మెరుస్తుంటాయి. ఎంతో కొంత సంభ్రమాశ్చార్యాలకు గురి చేస్తూ మనకి తెలిసిన విషయాన్నే మరో కోణంలో చెప్పటం జరిగింది. మాటల పొదుపుతో కూడిన చక్కటి వర్ణనలతో ప్రజానుకూలమైన, ప్రభుత్వ, పాలక వ్యతిరేకమైన ఈ గల్పికలు ధగధగమంటుంటాయి.

“సండే కామెంట్స్” అనటం అబద్ధం. ఇవి “ఎవిరీ డే” పనికొచ్చే కామెంట్స్. చదవండి ఈ ఆధునిక పంచతంత్రం. ఇందులో నీతుల్లేవు. నీతి బాహ్యమైన విలువలు, పాలకులు, ప్రభుత్వాల్ని ఎత్తి చూపించటమే వుంటుంది. ఏటి నీటి లోకి విసిరిన రాయి చేసిన అలజడి మీ హృదయంలో కలుగుతుంది. అది ఆహ్వానించదగ్గ అలజడే.

(“సండే కామెంట్స్” రచన – వేమన వసంత లక్ష్మి. పర్స్పెక్టివ్స్ వారి 58వ ప్రచురణ (8332934548). ధర రూ.150/-. సోల్ డిస్ట్రిబ్యూటర్స్ – నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్.)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply