ఆ ముగ్గురూ ఇరవై సంవత్సరాలూ

ఆ ముగ్గురూ, కాదు నలుగురనాలి, ఒరిగిపోయి, కాదు కాదు దుర్మార్గపు హత్యకు గురై, ఇరవై సంవత్సరాలు.

అందులో ముగ్గురిని చంపడమే వాళ్ల ఉద్దేశం. ఆ ముగ్గురి రాజకీయాలే, ఆలోచనలే, ఆచరణలే వాళ్లకు కంటగింపు. నాలుగో వ్యక్తికి అసలు ఆ రాజకీయాలతో సంబంధమే లేదు. లేదా, ఆ దశాబ్దపు ఆ ప్రాంతపు యువకులందరిలాగే సుదూర ప్రభావం మాత్రమే ఉంది. వాళ్లు ఆ ముగ్గురి మృతదేహాలనో, స్పృహతప్పిన అర్ధమృతదేహాలనో, చిత్రహింసల క్షతగాత్ర దేహాలనో అక్కడికి తీసుకొస్తూ దారిలో ఆ పసులగాసే పిల్లగాణ్నీ పట్టుకొచ్చారు. వాళ్లకు అందుబాటులో ఉండడమే అతని నేరం. జరగనున్న ఘోరానికి సాక్షిగా మిగులుతాడేమోననో, ఆ ఘోరం అక్కడే జరిగిందన్న అబద్ధానికి సాక్ష్యంగా నిలుస్తాడనో, ఆ ముగ్గురినీ మరెక్కడి నుంచో పట్టుకురాలేదని, అక్కడే ఎదురుకాల్పుల్లో చనిపోయామని స్థానిక సాక్ష్యం సృష్టించడానికో అతణ్ని కూడ చంపేశారు.

ఆ ముగ్గురికి ముగ్గురూ దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాలలో రగిలి పదునెక్కిన ఉక్కుముక్కలు. పుటం పెట్టిన బంగారాలు. విద్యార్థి, యువజన, రైతాంగ ఉద్యమాల నుంచి విప్లవోద్యమ నిర్మాణ నాయకత్వంలోకి సహజంగా, అసాధారణంగా ఎదిగివచ్చిన మట్టిబిడ్డలు, మహానాయకులు. అత్యద్భుతమైన, కాల్పనిక నవలా నాయకుల వంటి జీవితాలు గడిపినవాళ్లు. వారిలో ఒకరు అప్పటికింకా యాబయో ఏటికి చేరలేదు గాని ప్రజాఉద్యమ జీవితం వయసు ముప్పై సంవత్సరాలపైనే. మిగిలిన ఇద్దరు అప్పటికి నలబై నిండని వాళ్లు కాని ఇరవై సంవత్సరాల ప్రజా ఉద్యమ జీవితానుభవాన్ని సంతరించుకున్నవారు.

వారు నల్లా ఆది రెడ్డి.

ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి.

శీలం నరేష్.

వారితో పాటు హత్యకు గురైన అమాయక పశుల కాపరి సింగం లక్ష్మీ రాజం.

అది 1999 డిసెంబర్ 1. మధ్యాహ్నం రెండు గంటలు. బెంగళూరు నగరంలో బనశంకరి సారక్కి గేటు బస్ స్టాప్ సమీపంలో ఒక ఇంటి మీద ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక విభాగం స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ముఠా దాడి చేసింది. ఆ ఆవరణలో ఉన్న నాలుగు కుటుంబాలనూ ఒక గదిలో బంధించారు. ఆ ఇంట్లో నుంచి ఆ ముగ్గురినీ ఎత్తుకుపోయారు. వచ్చినవారెవరో, తమ పొరుగింట్లోంచి ఎత్తుకుపోతున్నదెవరినో ఆ ఇరుగుపొరుగువారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఆ ఇంట్లో ఒక నడివయసు దాటిన భార్యాభర్తలు ఉంటారని మాత్రమే. ఈ ఆగంతకులు వచ్చినప్పుడు ఆ భార్యాభర్తలు ఉన్నారో లేరో కూడ వారికి తెలియదు. ఆ ఇంటికి అప్పుడప్పుడు వస్తుండే ఈ ముగ్గురు వ్యక్తులను మాత్రం ఆగంతకులు ఎత్తుకుపోయారు.

ఆ మర్నాడు, 1999 డిసెంబర్ 2 ఉదయం కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామ సమీపంలోని కొయ్యూరు అడవుల్లో తమకూ నక్సలైట్లకూ మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని, కాల్పులు ఆగిపోయినాక చూస్తే పీపుల్స్ వార్ అగ్రనాయకులు, కేంద్రకమిటీ సభ్యులు నల్లా ఆది రెడ్డి (శ్యాం), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేష్), శీలం నరేష్ (మురళి)ల మృతదేహాలతో పాటు మరొక అజ్ఞాత నక్సలైటు మృతదేహం దొరికిందని పోలీసులు ప్రకటించారు.

పోలీసుల అబద్ధపు ప్రకటన దాచిన కఠోరమైన వాస్తవాలు ఒక్కొక్కటిగా క్రమక్రమంగా బైటపడ్డాయి. బెంగళూరులో ఆ ఇల్లు సిపిఐ ఎం ఎల్ పీపుల్స్ వార్ రహస్య స్థావరం. దాన్ని నడుపుతున్న వ్యక్తులు గోవిందరెడ్డి, ఆయన భార్య. నల్లగొండ జిల్లా తుంగతుర్తి సమీప గ్రామం నుంచి 1970ల తొలిరోజుల నుంచీ పార్టీలో ఉన్న వ్యక్తిగా గోవిందరెడ్డి అప్పటికి ఇరవై సంవత్సరాలుగా అజ్ఞాతవాసంలో ఉన్నాడు. కీలక నాయకుల రహస్య స్థావరం నిర్వహించే బాధ్యతల్లో ఉన్నాడు. ఏ ప్రలోభాలకూ, ఒత్తిళ్లకూ లొంగిపోయాడో గాని పోలీసుల ఉచ్చులోకి చేరాడు. అంతకు ఆరునెలల ముందు తన ఇంట్లో ఆ ముగ్గురూ సమావేశమయ్యారనీ, వాళ్ల తదుపరి సమావేశం ఈ డిసెంబర్ 1న ఇక్కడే ఉందని తనకు తెలిసిన సమాచారాన్ని అప్పటికే పోలీసులకు అందించి ఉన్నాడు.

అలా తమ ఇరవై ఏళ్ల సహచరుడే, విశ్వసనీయమైన స్థావర నిర్వాహకుడే ద్రోహిగా మారిన విషయం తెలియని ముగ్గురు అగ్రనాయకులూ ఒకరొకరుగా డిసెంబర్ 1న ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఆ ఇంట్లో అప్పటికే ఉన్నారో, ముగ్గురూ చేరాక ఒక్కుమ్మడిగా దాడి చేశారో గాని ఆ ముగ్గురినీ పట్టుకున్నారనీ, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకువచ్చారనీ, అక్కడి నుంచి కొయ్యూరు అడవికి తీసుకువెళ్లి చంపేశారనీ అప్పుడు వార్తలు వచ్చాయి. గోవిందరెడ్డికీ, భార్యకూ ప్రతిఫలంగా లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపారనీ, ఇక్కడే రహస్యంగా ఉంచారనీ, వారిని కూడ చంపేశారనీ అనేక ఊహాగానాలు కూడ వచ్చాయి. మొత్తానికి ముగ్గురు విప్లవోద్యమ అగ్రనాయకులనూ కొయ్యూరు అడవికి తీసుకువెళ్లి ఆ హత్యాకాండకు స్థానికత కల్పించడానికి అప్పటికే ఏ కారణం వల్లనో పోలీసుల అదుపులో ఉన్న గర్జనపల్లి గ్రామస్తుడు, పశుల కాపరి సింగం లక్ష్మీరాజంను కూడ వారితో కలిపి చంపేశారు.

ఈ మొత్తం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ, హోం మంత్రి మాధవరెడ్డికీ, డిజిపి ఎచ్ జె దొర కూ తెలిసే జరిగిందనీ, రాష్ట్ర స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఈ వ్యవహారాన్ని నిర్వహించిందనీ, ఇదంతా రెండు కోట్ల రూపాయల పథకమనీ అప్పుడు పత్రికలే రాశాయి. గోవిందరెడ్డిని లోబరచుకోవడం, బెంగళూరు వెళ్లి ముగ్గురు నాయకులనూ పట్టుకోవడం, వారిని హెలికాప్టర్ లో హైదరాబాదు తీసుకురావడం, వారిని చిత్రహింసలు పెట్టడం, చంపివేసి మృతదేహాలను కొయ్యూరు అడవిలో పడేయడం దాకా ఎస్ ఐ బి పని. కొయ్యూరు కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది గనుక, ఎస్ ఐ బి ఎక్కడా బహిరంగంగా కనబడని రహస్య ముఠా గనుక ‘ఎన్ కౌంటర్’ కథ కల్పించడమూ, ఆ ‘ఎన్ కౌంటర్’ లో తమ పోలీసులే పాల్గొన్నారని కథనాలు సృష్టించడమూ, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడమూ అప్పటి కరీంనగర్ పోలీసు సూపరింటెండెంట్ నళిన్ ప్రభాత్ పని. ఎన్ కౌంటర్ జరిగిందని చెపుతున్న రోజున వాస్తవంగా నళిన్ ప్రభాత్ తన పెళ్లి శుభలేఖలు పంచుతూ హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ పని ఆపి హుటాహుటిన కరీంనగర్ చేరి జరగని ఎన్ కౌంటర్ ను తానే జరిపినట్టు ప్రకటించమని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. నళిన్ ప్రభాత్ విధేయంగా ఆ ఆదేశాలను పాటించాడు.

ఈ అవకతవక మాత్రమే కాదు, ఈ “ఎన్ కౌంటర్ లో పాల్గొన్నందుకు నళిన్ ప్రభాత్ కు, అప్పటి ఇంటిలిజెన్స్ ఐజి ఎ శివశంకర్ కు, అప్పటి ఎస్ ఐ బి డిఐజి శ్రీరామ్ తివారీకి రాష్ట్రపతి శౌర్య పతకం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఆ ముగ్గురికీ 2003లో రాష్ట్రపతి శౌర్య పతకం అందింది. కాని ఆ ముగ్గురికీ, కనీసం నళిన్ ప్రభాత్ కు అందులో సంబంధం లేదని, ఊరికే గౌరవ ప్రతిఫలం దక్కిందని పోలీసు అధికారులలోనే ఒక వర్గంలో ఈర్ష్యాసూయల గుసగుసలు రేగి, పత్రికలకు కూడ ఎక్కాయి. ఒక న్యాయవాది ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఈ సిఫారసు చేసిందని, కేంద్రం పరిశీలన జరపకుండానే ధ్రువీకరించుకోకుండానే ఆమోదించిందని, ఈ పతకాలను వెనక్కి తీసుకోవాలని ఆ న్యాయవాది హైకోర్టును కోరాడు. హైకోర్టు ఈ వాదనను అంగీకరించింది. ఈ ముగ్గురు అధికారుల పాత్ర గురించి సరైన ధ్రువీకరణ జరగలేదని, అందువల్ల, పతకాల గురించి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత తమ సిఫారసును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాని అటువంటి పని జరిగితే రాష్ట్ర ఐపిఎస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బ తింటుందని చెపుతూ ఈ మొత్తం వ్యవహారాన్ని మూసి పెట్టమని మాజీ డిజిపి కె అరవిందరావు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ చక్రం తిప్పాడని కూడ అప్పటి పత్రికలు రాశాయి.

నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ అలా పాలకవర్గాలు పన్నిన దుర్మార్గ పథకంలో, బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యకు గురై ఈ డిసెంబర్ 2కు సరిగ్గా ఇరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాల తర్వాత కూడ మరపుకు రాని అద్భుత వ్యక్తిత్వాలు వాళ్లవి. ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం చెరిపెయ్యలేకపోయిన అసాధారణ ఆలోచనా ఆచరణా వాళ్లవి. ఇరవై సంవత్సరాల తర్వాత కూడ నిత్యం నిరంతరం స్మరణకు వచ్చే స్నేహపరిమళాలు వాళ్లు.

నల్లా ఆదిరెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని కొత్తగట్టులో పుట్టి జమ్మికుంట ఆదర్శ కాలేజిలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ విద్యార్థిగా విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి 1970 జూలై 3 హైదరాబాద్ అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించమని పిలుపునిస్తూ కరపత్రాలు వేసుకొచ్చి పంచిన యువకుల్లో ఉన్నాడు. కాలుకు గజ్జె కట్టి, డప్పు చేతబట్టి, డప్పు నృత్యం చేస్తూ 1972-73 నాటి పోదామురో జనసేనలో కలిసి, ప్రజాసేనలో కలిసి అని పాడిన తొలితరం గాయకుడుగా గుర్తు చేసుకునేవాళ్లున్నారు. తొలితరం రాడికల్ విద్యార్థి సంఘం కార్యకర్త గా జమ్మికుంటలో తన గదినే విప్లవ విద్యార్థులందరికీ కేంద్రంగా మార్చాడు. 1974లో శ్రీశ్రీ హుజూరాబాద్ వచ్చి, భూమయ్య కిష్టాగౌడ్ ల మీద అజరామరమైన ‘భూమ్యాకాశాలు’ కవిత రాసి వినిపించిన సభలో ఆదిరెడ్డి వాలంటీర్, కళాకారుడు. ఎమర్జెన్సీ అరెస్టులను తప్పించుకుని గ్రామాలకు తరలిన తొలితరం రాడికల్ విద్యార్థి. తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు జగిత్యాల జైత్రయాత్రగా, జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాట వెల్లువగా సుప్రసిద్ధమైన పరిణామాలకు పునాది సమీకరణ, నిర్మాణ కార్యకలాపాలు నిర్వహించిన వాడు ఆదిరెడ్డి.

తొలిరోజుల్లో జగిత్యాల గ్రామసీమల్లో ఉపాధ్యాయుడుగా, ఒక కల్లుగీత కార్మికుడి చుట్టంగా ఆదిరెడ్డి అక్కడి ప్రజల తలలో నాలుకగా ఎలా మమేకమయ్యాడో ఇటీవల తన కథల నేపథ్యాలలో అల్లం రాజయ్య వివరిస్తూనే ఉన్నారు. అలా 1979 నాటికి దేశంలోనే గొప్ప విప్లవ రైతాంగ ఉద్యమ ఆశాజ్యోతిగా ఎగసిన ప్రాంతంలో మౌలిక కృషి సాగించిన ఆది రెడ్డి ఆ తర్వాత ఇరవై ఏళ్లలో అధిరోహించిన శిఖరాలు, చేసిన విప్లవాత్మక ఆలోచనలు, భాగస్వామ్యం వహించిన మహత్తర ఆచరణలు ఎన్నెన్నో. ఎన్నో వందల మందికి, వేల మందికి ప్రేరణనిచ్చి విప్లవోద్యమం వైపు ఆకర్షించిన వాడాయన. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో విప్లవోద్యమ బాధ్యుడిగా, ఆ తర్వాత రాష్ట్ర బాధ్యులలో ఒకరిగా, సింగరేణి కార్మికోద్యమ బాధ్యుడిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించాడు. 1986లో రాంనగర్ లో అరెస్టయి, చిత్రహింసలకు గురై, ఆరోగ్యం దెబ్బతిని, రాంనగర్ కుట్రకేసు నిందితుడిగా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఆదిలాబాద్ కోర్టు విచారణ సందర్భంగా 1988లో కోర్టు నుంచి తప్పించుకుని మళ్లీ విప్లవోద్యమంలో చేరి, కేంద్ర బాధ్యతలలోకి కూడ వెళ్లి దేశవ్యాప్తంగా ఉద్యమ ప్రాంతాలన్నీ పర్యటించాడు. దండకారణ్య ఉద్యమ తొలి దశ రూపకల్పనలో పాలు పంచుకున్నాడు. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని ప్రతిపాదించిన ఉదారవాద మేధావుల బృందంతో 1998లో సంభాషణ జరిపిన అగ్రనాయకత్వంలో ఉన్నాడు. 1975 నుంచి హత్యకు గురయ్యే 1999 దాకా నిత్యమూ ప్రజల మధ్య కృషి, క్షేత్ర పరిశోధన, వాస్తవాల మీద ఆధారపడిన విశ్లేషణ ఎంత అవసరమో మిత్రులకు చెప్పడమూ, తాను ఆచరించి చూపడమూ ఆదిరెడ్డి విప్లవోద్యమానికి అందించిన విలువైన కానుకలు.

నిజాం నిరంకుశ భూస్వామ్యం పై పోరాటం ప్రారంభించిన దొడ్డి కొమరయ్యనూ, మరెందరో వీరయోధులనూ కన్న కడివెండి గ్రామమే ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పుట్టిన ఊరు. చిన్ననాటి నుంచే గ్రామంలో వర్గ సామరస్య రాజకీయాలకూ వర్గపోరాట రాజకీయాలకూ ఘర్షణను చూస్తూ పెరిగిన సంతోష్ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజికి బి ఎస్ సి చదువు కోసం వచ్చేసరికే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చాడు. సంతోష్ ఉస్మానియాలో 1979లో ఎం ఎస్ సి కెమిస్ట్రీలో చేరే సమయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటికి ఏడు సంవత్సరాల కింద జార్జిరెడ్డి హత్యతో సంఘ్ పరివార్ శక్తులు కల్పించిన స్తబ్దత అప్పుడప్పుడే విడిపోతున్నది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన సందర్భంగా వెల్లువెత్తుతున్న ప్రజాస్వామిక వాతావరణం, రమీజాబీపై అత్యాచార ఘటన తర్వాత సెప్టెంబర్ 1978లో అట్టుడికిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ప్రతిఘటన ఆ స్తబ్దతను చీలుస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఉస్మానియా క్యాంపస్ లో ప్రవేశించిన సంతోష్ అప్పటికే గ్రామాలకు తరలండి కార్యక్రమంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రాడికల్ విద్యార్థి సంఘాన్ని ఉస్మానియాలో బలంగా నెలకొల్పాడు. ఎం ఎస్ సి అయిపోయిన తర్వాత రాడికల్ విద్యార్థి కార్యకలాపాల కోసమే ఎంఎ ఫిలాసఫీలో చేరి మరి రెండు సంవత్సరాలు కూడ క్యాంపస్ లో ఉండి ఇటు ఉస్మానియా విద్యార్థి లోకంలో మాత్రమే కాక, పాలిటెక్నిక్ లలో, డిగ్రీ కాలేజిలలో మొత్తంగా హైదారాబాద్ విద్యార్థి లోకమంతటిలోనూ రాడికల్ భావాలను వ్యాపింపజేశాడు. జంటనగరాల రాడికల్ యువజన ఉద్యమంలో, మహిళా ఉద్యమంలో, కార్మికోద్యమంలో, పార్టీ నిర్మాణంలో కూడ అపారమైన కృషి చేశాడు. 1984 జనవరిలో కొండపల్లి సీతారామయ్యను ఉస్మానియా ఆసుపత్రి నుంచి తప్పించడంలో ముఖ్యపాత్ర వహించాడు. ఆ ఘటన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్లి ఖమ్మం జిల్లాలో ఉద్యమ నిర్మాణానికి తరలి వెళ్లాడు. ఖమ్మంలో 1986లో విద్రోహం వల్ల అరెస్టయి 1991 వరకు ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఆ ఐదు సంవత్సరాలలో విస్తృతంగా అధ్యయనం చేసి తత్వశాస్త్రంలో, రాజకీయార్థిక శాస్త్రంలో, విప్లవ సిద్ధాంతంలో అపారమైన పట్టు సాధించాడు. విడుదలైన వెంటనే మళ్లీ అజ్ఞాతవాసానికి వెళ్లి మొదట మళ్లీ ఖమ్మంలో, ఉత్తర తెలంగాణలో, తర్వాత దక్షిణ తెలంగాణలో ఉద్యమ నిర్మాణ, విస్తరణ బాధ్యతలు స్వీకరించాడు. అప్పటికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పులి అంజయ్య బూటకపు ఎన్ కౌంటర్ తర్వాత సంతోష్ రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తూ, 1995లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. గ్రామీణ, రైతాంగ, విద్యార్థి, యువజన, పట్టణ, పట్టణాల్లో వివిధ వర్గాల, ప్రజాస్వామిక, కార్మిక ఉద్యమాలన్నిటి లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న, నాయకత్వం వహించిన, మార్గదర్శకత్వం వహించిన సంతోష్ భారత విప్లవోద్యమం అట్టడుగు నుంచి సృష్టించి, సానపెట్టిన మహత్తర వీరయోధుడు, మేధావి.

శీలం నరేష్ పాలిటెక్నిక్ చదువుకోసం సిరిసిల్ల చేరే సమయానికి సిరిసిల్ల వాతావరణం చుట్టూరా రైతాంగ పోరాటాలతోను, పట్టణంలో విద్యార్థి యువజన ఉద్యమాలతోను ఉరకలెత్తుతున్నది. సహజంగానే ఆ వాతావరణానికి ఆకర్షితుడైన నరేష్ ఆర్ ఎస్ యు లో చేరి, సిరిసిల్లలో మాత్రమే కాక పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాకు కూడ తన కార్యకలాపాలను విస్తరించాడు. 1980-81లో గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ లో సిరిసిల్ల – నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాలతో సంబంధంలోకి వచ్చిన నరేష్ ఇరవయో ఏట, 1982 లో ఆ ప్రాంతపు ఆర్గనైజర్ గా పూర్తికాలం విప్లవకారుడుగా మారాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ, తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకుంటూ పదిహేడేళ్ల రహస్య జీవితంలో ఎక్కడా తన ఆనవాలు కూడ పోలీసులకు దొరకకుండా చాకచక్యమైన గెరిల్లా జీవితం గడిపినవాడు నరేష్. తునికాకు కూలీరేట్ల పోరాటం, పాలేర్ల జీతాల పెంపు పోరాటం, కూలీరేట్ల పెంపు పోరాటం, రైతుల గిట్టుబాటు ధరల పోరాటాలు, సారా, కల్లు ధరల తగ్గింపు పోరాటాలు, అటవీ భూముల ఆక్రమణ పోరాటాలు, భూస్వాముల దౌర్జన్యాలను ప్రతిఘటించే పోరాటాలు, కులసమస్యపై, ముఖ్యంగా దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు…. ఒక్కమాటలో చెప్పాలంటే 1980లలో నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క ప్రజా కదలికలోనూ నరేష్ నాయకత్వ, మార్గదర్శక పాత్ర ఉంది. నిజామాబాద్ కరీంనగర్ రెండు జిల్లాల విప్లవోద్యమ నిర్మాణంలో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. క్రమంగా ఉత్తర తెలంగాణ నాయకుడిగా ఎదిగి, 1990 వరంగల్ రైతు కూలీ సంఘం మహాసభలకు లక్షలాది మందిని కదిలించిన శక్తిగా నిలిచాడు.

సామాజిక స్థాయిలో విప్లవోద్యమ నాయకులుగా మాత్రమే కాదు, వ్యక్తిగత స్థాయిలోనూ ఈ ముగ్గురూ ఉదాత్త నూతన మానవులుగా తమను తాము రుజువు చేసుకున్నారు. మరణించి ఇరవై సంవత్సరాలు గడిచినా, అంతకు ముందరి అజ్ఞాత, రహస్య జీవితాల వల్ల ఎప్పుడో ఒకసారి మాత్రమే కలిసే అవకాశం ఉండినా, వారిని ఒక్కసారి కలిసినవారు కూడ వారిని ఇప్పటికీ మరచిపోరు. వారి ప్రవర్తనలోని స్నేహశీలతను, ప్రజల పట్ల అపారమైన ప్రేమను, మానవసంబంధాలలో వారు చూపిన ఉదాత్తతను, సైద్ధాంతిక, ఆచరణ రంగంలో వారి పటిష్టతను ఇవాళ్టికీ తలచుకుంటారు. ఆ మరణంలేని మహత్తర మానవులు అసంపూర్తిగా వదిలివెళ్లిన కర్తవ్యం ఇంకా పూర్తి కావలసే ఉన్నది.

Leave a Reply